రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -7
19- ప్రత్యేకాంధ్ర ఉద్యమ నాయకుడు ,ఆంధ్రమహాసభ అధ్యక్షుడు –శ్రీ దేశపాండ్య సుబ్బారావు
ప్రతేకాంధ్ర ఉద్యమ నాయకుడు, ఆంధ్రమహాసభ అధ్యక్షుడు. నంద్యాల ప్రముఖుడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య ఏర్పడిన అపోహలను, విభేదాలను తొలగించే ఉద్దేశంతో 1937లో నియమించిన సంఘంలో ఈయన సభ్యుడు. ఈ సంఘపు చర్చలే శ్రీబాగ్ ఒడంబడికకు దారితీసాయి.
ప్రత్యేక ఆంధ్రరాష్ట్రానికి దత్తమండలపు నాయకులు తొలుత సుముఖంగా లేరు. ఆంధ్ర మహాసభ నాయకులు తరచుగా పర్యటనలు జరిపి సాగించిన ప్రచారం ప్రభావమో తెలియదు కాని క్రమంగా ‘సీమ’వారి వైఖరి మారింది. 1915లో జరిగిన కర్నూలు జిల్లా రెండవ మహాసభ ఆంధ్ర ఉద్యమాన్ని, దాని ఆశయాలను పూర్తిగా బలపరిచింది. అదే సంవత్సరం విశాఖపట్నంలో జరిగిన తృతీయాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిన చిత్తూరుకు చెందిన పానుగంటి రాజా రామారాయణింగార్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు వెంటనే వద్దన్నాడే కానీ అసలే వద్దన లేదు. ఇదే సభలో పాల్గొన్న దేశపాండ్య సుబ్బారావు ఆంధ్ర రాష్ట్రాన్ని బేషరతుగా, మనస్ఫూర్తిగా సమర్థిస్తూ ఇలా అన్నారు “నేను సీడెడ్ జిల్లాలకు చెందిన వాడిని… ఆంధ్ర రాష్ట్రం సాధించాలన్న ఉత్సాహం మీకెంత ఉన్నదో మాకూ అంతే ఉన్నది. తిక్కనను చదివి, ఆనందించిన ప్రతి ఆంధ్రుడికీ ఆ కోరిక ఉండాలి. ఇంకోసారి చెబుతున్నాను – సీడెడ్ జిల్లాలు ఆంధ్ర రాష్ట్రం కావాలంటున్నాయి” సుబ్బారావు లాంటివారి మద్దతుతో సీడెడ్ జిల్లాల ప్రతికూలతపట్ల సర్కార్ జిల్లాల వారికి సందేహాలు తగ్గాయి. ఆ జిల్లాలకు వెళ్లి సభలు పెడితే అక్కడివారూ మనకు ఇంకా చేరువవుతారు, మనతో కలిసి వస్తారు అని వల్లూరి సూర్యనారాయణరావు, కె.ఆర్.వి. కృష్ణరావు తదితరులు విశాఖపట్నం మహాసభలో సూచించారు. దానితో మరుసటి సంవత్సరం ఆంధ్రమహాసభ నెల్లూరులోనూ, ఆ తర్వాత నంద్యాలలోనూ జరిగింది.
1934లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమాన్ని పట్టించుకునే దిక్కులేని నిస్తబ్ధ దురవస్థలో దేశపాండ్య సుబ్బారావు ఆంధ్రత్వం మీది అభిమానంతో ఖర్చులు తానే పెట్టుకుని లండను వెళతానని ముందుకొచ్చాడు. ఆంధ్రుల తరఫున మాట్లాడటానికి నువ్వెవరు అని ఆయనను సీమలో ఎవరైనా అడిగే పరిస్థితి రాకూడదు కదా? అందుకని ఆయన కోరిన మేరకు పెద్దలు బద్ధకంగా కదిలి అతి కష్టంమీద విశాఖపట్నంలో ఆంధ్ర మహాసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పరచి, సుబ్బారావును అధ్యక్షుడుగా ఎన్నుకుని, సభ పనుపున లండను రాయబారానికి అధికారికంగా పంపించారు. అదే పదివేలు అనుకున్న సుబ్బారావు ఎవరినీ పైసా అడక్కుండా సమస్త ఖర్చులూ తానే భరించి హుటాహుటిన ఓడ ఎక్కి లండన్ వెళ్లి బ్రిటిషు రాజకీయ ప్రముఖులను దర్శించి ఆంధ్రకు న్యాయం చెయ్యమని పరిపరి విధాల ప్రాధేయపడ్డాడు. అప్పుడు వారు “మీకు జరిగింది న్యాయమో, అన్యాయమో మాకెలా తెలుస్తుంది? తగినంత ఆందోళన జరిగినప్పుడే కదా పరిస్థితి తీవ్రత మీకు అర్థమయ్యేను. ఇక్కడ మా వ్యవహారాలు కూడా తగిన పబ్లిసిటీ, ప్రాపగాండా లేనిదే పార్లమెంటులో పాసుకావు” అన్ని తిప్పి పంపారు.
ఈయన కన్నడ కథా, నాటక రచయిత టి.పి.కైలాసంకు సన్నిహిత స్నేహితుడు. 1933లో కైలాసం పంపిన లిటిల్ లేస్ అండ్ ప్లేస్ ప్రతి సుబ్బారావుకు బాగా నచ్చి, సొంతగా పుస్తకాన్ని అచ్చువేయించి, అన్ని ప్రతులను కైలాసానికి బహూకరించాడు.
1939లో గాడిచర్ల హరిసర్వోత్తమరావు కర్నూలు జిల్లా, కాల్వబుగ్గలో ప్రారంభించిన రాజకీయ, ఆర్థిక శాస్త్రాల వేసవి పాఠశాలలో దేశపాండ్య సుబ్బారావు అధ్యాపకునిగా పనిచేశాడు.
20-కొచ్చిన్ సంస్థాన దివాన్ ,ఇటుకల తయారీ పరిశ్రమ స్థాపకుడు స్వాతంత్ర్య సమరయోధుడు –శ్రీ నెమిలి పట్టాభిరామారావు
దీవాన్ బహుద్దూర్ నెమిలి పట్టాభి రామారావు (1862 – అక్టోబరు 15, 1937) బి.ఏ స్వాతంత్ర్య సమరయోధుడు, కొచ్చిన్ సంస్థానం యొక్క మాజీ దీవాన్.
పట్టాభి రామారావు 1862లో కడప జిల్లా, సిద్ధవటంలో ఒక దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి రామానుజరావు అప్పట్లో కడప జిల్లాలో తాసీల్దారుగా పనిచేస్తున్నాడు.[1] పట్టాభి రామారావు విద్యాభ్యాసం కడప ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసుకొని మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో చేరాడు. 1882లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ డిగ్రీతో పట్టభద్రుడై మదనపల్లెలోని సబ్‌కలెక్టరు కార్యాలయంలో గుమాస్తాగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు.
ఉద్యోగ జీవితం
చిత్తూరు జిల్లాకు చెందిన పట్టాభి రామారావు 1882 ఏప్రిల్ 15న మద్రాసు రాష్ట్ర రెవిన్యూ సెటిల్‌మెంట్ శాఖలో ఉద్యోగిగా జీవితం ప్రారంభించి, 1895లో అసిస్టెంట్ కమీషనర్ స్థాయికి చేరుకున్నాడు.[2] 1888లో దక్షిణ ఆర్కాటులో సూపర్‌వైజరుగా పనిచేశాడు. ఆ తరువాత 1892లో మలబారుకు బదిలీ అయి అక్కడ అన్‌కవెనెంటెడ్ అసిస్టెంటుగా పనిచేశాడు. మూడు సంవత్సరాల తర్వాత అసిస్టెంటు కమీషనరుగాను, తదనంతరం డిప్యుటీ కమీనషరుగానూ పదవోన్నతి పొందాడు. డిప్యూటి కమీషనరు హోదాలో గోదావరి, అనంతపురం, కృష్ణా జిల్లాలలో పనిచేశాడు.[1] కొచ్చిన్ సంస్థానంలో రెవిన్యూ సెటిల్‌మెంట్ వ్యవస్థను సంస్కరించేందుకు, ఆ విషయాలలో అనుభవమున్న పట్టాభి రామారావును ప్రభుత్వం కొచ్చిన్ సంస్థానం యొక్క దీవాన్‌గా నియమించింది. 1902 నుండి 1907 వరకు దీవాన్ గా పనిచేసిన పట్టాభి రామారావు రెవిన్యూ సెటిల్‌మెంటును పూర్తిచేసి భూమి దస్తావేజులను సక్రమంగా నిర్వహించేందుకు చర్యలను ప్రవేశపెట్టారు. 1908లో ఉద్యోగ జీవితం నుండి విరమించాడు. అప్పట్లో 350 రూపాయల ఉద్యోగవిరమణ భత్యంతో పదవీ విరమణ చేశాడు.
ప్రజాసేవలో
పదవీ విరమణానంతరం పట్టాభి రామారావు మద్రాసులోని పూనమల్లి హై రోడ్డుపై శ్రీరామ బ్రిక్ వర్క్స్ అనే ఇటుకల పరిశ్రమను స్థాపించి వందలాది కార్మికులకు పనికల్పించాడు. ఈ కర్మాగారంలో 30-40 లక్షల ఇటుకల తయారుచేయబడేవి. తన సొంత వ్యాపార నిర్వహణతో పాటు ఈయన ఆదోనిలోని వెస్ట్రన్ కాటన్ కంపెనీ, ఉన్నిదారం ఎగుమతిచేసే మద్రాసు యార్న్ కంపెనీల నిర్వహణలో పాల్పంచుకోనేవాడు. తెలుగు అకాడమీ, భారతీయ అధికారుల సంఘం, కేంద్ర వ్యవసాయ కమిటీల కార్యదర్శిగా ప్రజాసేవలో చురుకుగా పాల్గొనేవాడు. చివరకు మదనపల్లెలో స్థిరపడి సబ్ డివిజన్ సంఘానికి అధ్యక్షత వహించి, వాటి కార్యక్రమాలకు పూర్తి సమయాన్ని కేటాయించాడు. సొంత ఖర్చులతో గ్రామాలను పర్యటించి, సామాన్య ప్రజల ఉద్ధరణకు సలహాలు సూచనిలిస్తుండేవాడు.[1]
తొలుత ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు ఉత్సుకత చూపించకపోయినా, ఆ తర్వాత మనసు మార్చుకొని ప్రతేక రాష్ట్రం ఏర్పాటుకు మద్దతునిచ్చాడు. ఈయన 1918లో కడపలో జరిగిన ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించాడు.[3]
పట్టాభిరామారావు 75సంవత్సరాల వయసులో వృద్ధాప్యకారాణాలవల్ల 1937, అక్టోబరు 15 న మద్రాసులో తన స్వగృహంలో మరణించాడు.[4]
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-10-22-ఉయ్యూరు

