ఆచార్య సార్వభౌముల ‘’ఆశీతి తమ జన్మ దినోత్సవ ‘’కానుక –వ్యాస కదంబం

ఆచార్య సార్వభౌముల ‘’ఆశీతి తమ జన్మ దినోత్సవ ‘’కానుక –వ్యాస కదంబం
  ఆచార్య సార్వభౌమ బ్రహ్మశ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి 80 వ పుట్టిన రోజు సందర్భంగా సాహిత్యలోకానికి అపూర్వ కానుకగా షోడశ కళా ప్రపూర్ణ౦గా  తామువ్రాసిన 16 అమూల్య వ్యాస రత్నాలహారాన్నికూర్చి ,తమ భాషా శాస్త్ర బోధకులు ఆచార్య తూమాటి దొణప్ప గారికి అంకితమిచ్చి గురుభక్తిని ప్రదర్శింఛి ,నాకు ‘’ఆత్మీయత తో ‘’అ౦పి౦చగా ,నాలుగు రోజులక్రితం అంది, వెంటనే వాట్సాప్ మెసేజ్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశాను .
  ఇందులో మొదటి అయిదు వ్యాసాలూ సాహిత్య శిరోమణులగురింఛి పరిచయంగా రాసినవి .తర్వాత నాలుగు సంస్కృత సాహిత్యానికి ,మిగిలినవి తెలుగు సాహిత్యానికి సంబంధించినవి . 
ఆచార్య పింగళి లక్ష్మీ కా౦త౦ గారిగురించిన పరిచయంలో గురువు చెళ్ళపిళ్ళ వారిచే కవిగా గుర్తింపబడిన సందర్భంలో చెప్పిన ‘’అ౦కిలిమాంచి భాగవతమౌ పలుకున్ వెలయించి ,పల్కులో వంకలు దీర్చి దిద్ది రసవంతం గా ‘’తీర్చితనను  దిద్దారని కొనియాడారు .ఆంధ్ర విశ్వ కళాపరిషదా౦ధ్ర శాఖా ధ్యక్ష పదవి ని అలంకరించటంలో వారిప్రతిభ సర్వతోముఖ వికాసం పొందింది .వారు నిర్ణయించిన పాఠ్యప్రణాళికలోని ఆంధ్రసాహిత్య చారిత్ర ,ప్రాచ్య పాశ్చాత్య సాహిత్య విమర్శన విధానం సంస్కృత సాహిత్య వ్యాకరణ పరిజ్ఞానం తెలుగులో ఛందో వ్యాకరణ అలంకార గ్రంథాధ్యయనం అయన వైదుష్యానికి నిదర్శనం .ఆయన ఘనుడు ,అల్పుడు అనే భేదం లేని శిష్యవాత్సల్యులు .గురువులకు ,దేవుడికి కాక ఇతరులకు మొక్కని వ్యక్తిత్వం కలవారు .వారికుమారులు తండ్రిగారి సాహిత్య వరివస్యపై ప్రసిద్ధ పండితులచే పరిశోధనాత్మక వ్యాసాలు  రాయించి ‘’రసజ్ఞ’’గా ముద్రించి పిత్రూణ౦  తీర్చు కొనటం ప్రశంసార్హమన్నారు .
ఆచార్య శిరోమణి శ్రీ గంటి జోగి సోమయాజి తెలుగు సాహిత్యాన్నిఅధ్యయనం చేసేటప్పుడు ,ఆ భాష పుట్టు పూర్వోత్తరాలు, పొందిన క్రమ పరిణామ వికాసం ప్రాధాన్యం వహిస్తుందని గుర్తించిన విలక్షణ  ప్రతిభాశాలి అని శ్లాఘించారు .విషయ సమగ్రత ,బోధనాపటిమ ఆయన విశిష్ట లక్షణాలు ఆంద్ర భాషా వికాసం బోధించటం ఆయనకు మహా అభిరుచి . కరతలామలకం.ప్రతి సూక్ష్మ విషయాన్నీ పరిశోధనాత్మకంగా దర్శిస్తారు .భాషాధ్యయనం ప్రత్యేకంగా చేయమని ప్రోద్బలం కలిగించగా శిష్యులు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ,ఆచార్య దొణప్ప,ఆచార్య పి.ఎస్.సుబ్రహ్మణ్యం, ఆచార్య చేకూరి రామారావు భాషా శాస్త్రంలో విశేష పరిశ్రమ చేసి లోక ప్రసిద్దులయ్యారని జ్ఞాపకం చేశారు .యూనివర్సిటీలోఅధ్యాపకులుగా ఉన్నప్పుడే వివిధ సంస్థలలో విశిష్ట సభ్యత్వం పొందటానికి కారణం ఆయన భాషా శాస్త్ర పరిజ్ఞానమే అన్నారు .ఆయనరాసిన  ‘’ఆంధ్ర భాషా వికాసం’’వెలుగులిచ్చే గొప్పకరదీపిక .తెలుగు ఉపన్యాసకునికి ఆంగ్ల,గణిత ,భౌతికాది శాస్త్ర బోధకులతో సమాన వేతనం పొందటానిముఖ్యులు సోమయాజిగారే అన్నారు .
అభినవ వాగనుశాసన శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు ‘’వేలలో ఒకపండితుడు పుడతాడు ‘’అన్న ఆర్యోక్తికినిదర్శనం .తాను  రచించిన ‘’సంస్కృత వాజ్మయ చరిత్ర ‘’ను తమ గురుదేవులు నడిచే మహా విద్యాలయమైన’’కడి యెద్ద జన్మించి కాశికాపురికేగి శబ్దాది శాస్త్రాలు ‘’సంతరించిన బ్రహ్మశ్రీ చర్ల బ్రహ్మయ్య శాస్త్రిగారికి అంకితమిచ్చారు.ఆంధ్ర విశ్వ విద్యాలయం లో తెలుగు లో పండితపదవిలో రాణించారు .ఐ.పి.ఎస్.  పరీక్షాధికారిగా పని చేయటం వారి ధిషణకు తార్కాణ.సంస్కృతాంధ్రాలలో బహు గ్రంథాలు రాశారు .ఆంధ్ర భవిష్య రచనలో శ్రీనాథుని అనుకరిస్తూ తమ రచనా వ్యాసంగాన్ని పద్య నిబద్ధం చేసి –‘’తెనిగించి విదురనీతి బూర్తిగామున్ను –స్త్రీ ధర్మబోదినీ కృతి యొనర్చి ‘’—‘సురభారతిని ‘’బ్రహంసూత్రార్ధ దీపిక ‘’అంటూ తమరచనలనూ వాటితత్వాన్నీ సూత్రప్రాయంగా సూచించారని వేదులవారన్నారు .శాస్త్రిగారు పవిత్ర శీలురు స్వతంత్రులు .శిష్యవాత్సల్యం అపారం. అనేక పురస్కారాలు, రాజాస్థాన గౌరవాలు పొందారు .
చతురవచస్వి ,చారుమనస్వి ,చిరయశస్వి ఆచార్య యస్వీ జోగారావు  అనే శిష్ట్లా వేంకట జోగారావు  గారు ఆంధ్రవిశ్వ విద్యాలయ యశశ్చంద్రికలను నాల్గు దిక్కులా విస్తరింపజేశారు తండ్రిపై ‘’పంచ కల్యాణి ‘’కృతిలో పద్య ప్రశంస చేశారు .యక్షగాన వాజ్మయంపై విపుల పరిశోధన చేశారు .గురువులు కళాప్రపూర్ణ గంటి జోగి సోమయాజి గారి ని స్తుతిస్తూ –‘’బహుభాషాబహుశాస్త్ర బంధుర మహా వైదుష్య మత్యద్భుతావహ మేధావధి ‘’అన్నారు .లెక్చరర్ గా చేరి ప్రొఫెసర్ ,హెడ్ ఆఫ్ దిడిపార్ట్ మెంట్ గా 30 ఏళ్ళు  ఆంధ్రవిశ్వవిద్యాలయ౦  లో పని చేశారు .ఉత్తమ అధ్యాపక పురస్కారం పొందారు .సాహిత్యవిమర్శ బోధన మహ ఇష్టం. పద్య గేయ నృత్యనాటికలెన్నో రాశారు .’’నాది రసరాజ్యమార్గము ,ప్రాతయనిపించు సరికొత్త పదము నాది ‘అని చాటుకొన్నారు నిజంగా ఆయన ప్రతివాక్యమూ రసరమ్యమే అని నాకూ అని పించింది .ఆంధ్ర కావ్య మహాస్రష్టలలో  –నాకు నచ్చిన శిల్పులు నల్వురేను –తిక్కయజ్వ ,సూరన్న ,సుధీశ్వరుండు –విశ్వనాథ మహాకవి యస్విసుకవి ‘’అని తననుకూడా కలుపుకొని ‘’హలో భగవాన్ ‘’లో భంగ్యంతరంగా  చెప్పారు .లండన్ కెనడా మలేషియా సింగపూర్ సందర్శించారు తెలుగు అకాడెమి గవర్నర్ గా ఎన్నుకోబడ్డారు .మద్రాస్ తెలుగు అకాడెమి ,కేంద్ర సాహిత్యేకాడేమి లచే సత్కారం పొందారు .గుంటూరుజిల్లా రచయితల సహకార సంఘానికి అధ్యక్షులు రోటరీ డిస్ట్రిక్ట్ 315కి ఆస్థాన కవి .
బ్రాహ్మీ భూషణ రాంభట్ల లక్ష్మీ నారాయణ శాస్త్రిగారు మహావక్త ,పౌరాణిక పండితాగ్రగణ్యులు  .మురారి అనర్ఘ రాఘవాన్ని అనువదించారు .ఆయన రచనా వ్యాసంగం బహుముఖీయం బహు శ్లాఘనీయం అన్నారు .అపూర్వ కల్పనా సనాథనంగా ‘’ప్రతీక ‘’నాటకం వారి రచనాకౌశలాన్ని వెల్లడిస్తుంది .అహోబల పండితీయం కు రాంభట్ల వారి అనువాదం విద్వజ్జన సమాదరణీయం కాని ముద్రణ భాగ్యం పొందలేదని బాధపడ్డారు .వేదాంత మంత్ర శాస్త్ర గ్రంథాలను అనువదించి వ్యాఖ్యానించి స్వతంత్రంగా రచించిన శాస్త్రిగారు చిరస్మరణీయులు అన్నారు శ్రీ వేదుల .
  ఈ వ్యాసాలలో మనకు తెలియనివి వారికి అనుభవమైనవి ఎన్నో విషయాలు ఉటంకించారు వారిపై గౌరవం ఇనుమడింపజేశారు శాస్త్రిగారు
  తర్వాత సంస్కృత సాహిత్యానికి చెందిన సంస్క్రుతభాగవతం అవతారిక ,శ్రీదేవీ భాగవతం సంక్షిప్తపరిచయం ,ఊరుభంగ నాటకం భాసుని ఉపజ్ఞ ,స్వప్న వాసవదత్తం ,అభిజ్ఞాన శాకుంతలం రచనా సంవాదాలు ,.ఆతర్వాత తెలుగు సాహిత్యానికి చెందిన సాహిత్యాభిరుచి ,కవిత్వ తత్వ మీమాంస ,రుషి వంటికవి నన్నయ్య రెండవ వాల్మీకి ,తిక్కన్న శిల్పపు దెనుగు తోట ,హరివంశం ఎర్రన కవితా వైభవం ,దూబగుంట నారాయణకవి పంచతంత్రం ,మనుచరిత్రం మన చరిత్ర వ్యాసాలున్నాయి అన్నీ అన్నే .అన్నీ ఆచార్య సార్వభౌమ వేదులవారి సర్వతోముఖ పాండిత్యానికి విమర్శనానికి విశ్లేషణకు,బహుకాల బోధనా ధిషణకు  ,అనుభవానికి ప్రతీకలే  .చదివి ఆనంది౦చాల్సినవే. విజ్ఞానం పెంచుకోవాల్సినవే .వారి కలం తాకితే ఏ వ్యాసమైనా సువర్ణం కావాల్సిందే .వారికలం పరుసవేది .వారిగళ౦ సాహితీ పుంస్కోకిలం .చక్కని ముద్రణ ,దంపత్యుక్తమై అర్ధవంతమైన ముఖ చిత్రం పుస్తకానికి మరింత వన్నె తెచ్చాయి .
  ఆచార్య సార్వభౌమ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు   శతాధిక ఆయుర్దాయం తో ,దంపత్యుక్తంగా ఆరోగ్యంగా వర్ధిల్లుతూ ఇతోధిక సాహితీ సేవ చేస్తూ వారి ‘’శారదా పీఠం’’నిరంతర విజ్ఞాన తేజో పుంజాలను వెదజల్లాలని ఆశిస్తున్నాను .
   దీపావళి శుభా కాంక్షలతో
  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-10-22-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.