దేశ భక్తుడైన నేత్ర వైద్య ప్రముఖుడు ,నాటక ,సిని నటుడు ,రచయిత,అజాద్ హింద్ ఫౌజ్ డాక్టర్ ,ఆధ్యాత్మిక వేత్త ,మెహర్ పత్రిక సంపాదకులు ,బహుముఖ ప్రజ్ఞా శాలి -కవికోకిల డా.శంకర శ్రీరామా రావు
కృష్ణా జిల్లా తిరువూరు గ్రామం లో 19-6-1908 న శ్రీ శంకర సుబ్బారావు సుబ్బమ్మ దంపతులకు శ్రీరామారావు జన్మించారు .వృత్తిరీత్యా వైద్యులైనా సంగీత సాహిత్యాలపై విశేష అభినివేశం ఉన్న వారు .వైద్యం లో LMP పట్టా పొందారు .
గాంధీజీ స్వాతంత్ర్య సమర భేరి విని విదేశీ వస్తు బహిష్కరణ లో పాల్గొని 40మండి ఉద్యమ కారులకు సూట్లను ఉచితంగా పంచిపెట్టిన త్యాగశీలి .ప్రకాశం పంతులుగారి నాయకత్వం లో మద్రాస్ లో సైమన్ కమీషన్ బహిష్కరణ ఉద్యమం లో పాల్గొన్న అకలంక దేశ భక్తులు రావుజీ .నేతాజీ సుభాస్ చంద్ర బోస్ నిర్వహించిన అజాద్ హింద్ ఫౌజ్ కు భారత ప్రభుత్వం తరఫున పంపబడిన వైద్య బృందం లో ఉంటూ మలయా వెళ్ళి యుద్ధం లో క్షత గాత్రులైన సైనికులకు వైద్య సేవలు అందించిన మహానుభావులు ..మహాత్ముని ఆదేశాలను అనుసరించి 12 ఏళ్ళు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి స్థిర నివాసం ఏర్పరచుకొని పల్లె ప్రజలకు ఉచితంగా సేవలందించిన సమాజ సేవా పరాయణులు డా శంకర రామారావు గారు .
కవి రచయిత అయిన డాక్టర్ గారు గొప్ప ఆధ్యాత్మిక వేత్త .కళాభిమాని .ఆంధ్ర ఆంగ్ల భాషలలో వివిధ ప్రక్రియలలో 18గ్రంధాలు రాశారు .పూలమాల ,కోకిల ,కృతులు -గేయాలు ,కళాయోగి ,కబీరు సూక్తి ముక్తావళి ,మహాత్ముడు ,మెహర్ లీల ,మెహర్ కదాసుధ ,గీతా హృదయం ,మీరా, మేఘ సందేశం మొదలైనవి వీరి ముఖ్య రచనలు .వీరి రచనలను రాజాజీ ,శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు ,రాజ శేఖర శతావధాని మొదలైన మహాను భావులు ప్రశంసించారు . ఏలూరులోని ‘’సాహిత్య మండలి ‘’,త్యాగరాజ గాన సభ ,కాస్మాపాలిటన్ క్లబ్ లతో కూడా వీరికి అనుబంధం ఉన్నది .వాటి సర్వతోముఖాభి వృద్ధికి తీవ్ర కృషి చేశారు .
ఎన్ని సాహిత్య వేదికలపై ప్రసంగించారు బహు కవి సమ్మేళనాలలో పాల్గొని కవితలు వినిపించారు .అష్టావదానాలలో పృచ్చకులుగా ఉన్నారు .రోటరీ లయన్స్ క్లబ్ వంటి సామాజిక సంస్థల ఆధ్వర్యం లో అనేక కంటి వైద్య శిబిరాలలో పాల్గొని వైద్య సేవలు అందించారు .సుమారు రెండు వేల వరకు సాహిత్య ,ఆధ్యాత్మిక వ్యాసాలను ఆంధ్ర ప్రభ మొదలైన పత్రికలలో రాశారు .మెహర్ బాబా ముఖ్య శిష్యులైన డాక్టర్ గారు ‘’అవతార్ మెహర్ ‘’ పత్రిక ణు సమర్ధ వంతం గా నిర్వహించారు .సహకార ఉద్యమ నాయకులు శ్రీ జవ్వాది లక్ష్మయ్య నాయుడు గారి షష్టి పూర్తి ఉత్సవానికి ‘’అభినందన కావ్య మాల ‘’పేరిట అభినందన సంచిక ను స్వీయ సంపాదకత్వం లో సర్వాంగ సుందరంగా వెలయించిన కళామూర్తి డాక్టర్ గారు ..
కళా రాధకులు మంచి నటులు అయిన డాక్టర్ గారు రోషనార నాటకం లో దావూద్ గా నటించి ,మహారాజా విక్రమ దేవ వర్మగారి అభినందనలు అందుకొన్నారు .మహానటుడు శ్రీ దివి సుబ్బారావు గారి హరిశ్చంద్ర లో హరిశ్చంద్ర పాత్ర పోషించి సెభాష్ ఆని పించారు .’’చైతన్య స్వామి ‘’సినిమాకు కదా రచన ,అమ్మ మొదలైన చిత్రాలకు మధుర గీత సంగీత రచన చేశారు .
ఆంధ్రా మెడికల్ కాన్ఫరెన్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థలకు అధ్యక్షా కార్యదర్శి ,కార్యనిర్వాహక సభ్యత్వం వివిధ హోదాలలో నిర్వహించారు .రాష్ట్రంలోని ఎన్నెన్నో సాహిత్య సంగీత నాటక సంస్థలు డాక్టర్ గారిని ఘనంగా సత్కరించాయి .శ్రీపాద విశ్వనాధ ,కాశీ కృష్ణాచార్య వంటి సాహితీ దిగ్గజాలు వీరిని ‘’కవికోకిల ‘’గా కీర్తించారు .15-12-2001న ఏలూరులో ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి ,సేవాతత్పరులు నేత్రవైద్యులు ,నటులు డాక్టర్ శంకర శ్రీరామారావు గారు 93వ ఏట ఏలూరులో నటరాజ సన్నిధి చేరారు ఆనిఏలూరు ప్రముఖులు శ్రీ బి.వి .దాశరధి ఒక వ్యాసం లో తెలియ జేశారు .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-25-ఉయ్యూరు .
