గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85- 127-ఆంద్ర బిల్హణ-కప్ప గంతుల లక్ష్మణ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85-

127-ఆంద్ర బిల్హణ-కప్ప గంతుల లక్ష్మణ శాస్త్రి

సంస్కృతమే అన్నీ

కప్పగంతుల  లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లా  వనపర్తి లో 2-7-1911 నశ్రీనివాస శాస్త్రి ,పద్మావతి దంపతులకు జన్మించారు .తిరుపతి ,అన్నామలై ,మద్రాస్ సంస్కృత కళాశాలలో చదివి సాహిత్య శిరోమణి ,వేదాంత శిరోమణి డిగ్రీలు పొందారు

ఉద్యోగం – ఎదుగుదల

.వనపర్తి సంస్థానం లో ఆస్థాన విద్వాంసులుగా గౌరవ స్థానం అలంకరించారు .అక్కడే హైస్కూల్ లో  భాషా పండితులుగా  పని చేశారు .తర్వాత హైదరాబాద్ ప్రభుత్వ సమాచార శాఖలో అసిస్టంట్ డైరెక్టర్ గా చేరారు .పిమ్మట ఆంద్ర ప్రదేశ్ విద్యాశాఖ లో డిప్యూటీ  డైరెక్టర్ అయ్యారు .ఈ పదవిలో ఉండగానే ప్రాచ్య కళాశాలల ఉపాయాధ్యాయుల జీతాలను మిగిలిన డిగ్రీ కళాశాలల ఉపాధ్యాయుల జీతాలతో సమానం గా ఉండేట్లు చేసి భాషా పండితులకు గౌరవ ప్రదమైన జీతాలు వచ్చేట్లు చేసి అందరి అభిమానానికి పాత్రులయ్యారు .

సంస్కృత భాష స్పెషల్ ఆఫీసర్ గా కొనసాగి దేశమంతా తిరిగి సంస్కృత భాషా వ్యాప్తికి ఎన లేని కృషి చేశారు .మళ్ళీ సమాచార శాఖలో డిప్యూటీ డైరెక్టర్ అయి ,’’హైదరాబాద్ టు డే’’,’’ఆంద్ర ప్రదేశ్ ‘’మొదలైన ప్రభుత్వ పత్రికలకు సంపాదకులుగా ఉన్నారు .

లక్ష్మణ శాస్త్రీయం

మాదిరాజు విశ్వనాధ రావు అనే తోటి కవితో కలిసి ‘’బిల్హణుని విక్రమామ్క దేవ చరిత్ర కావ్యాన్నీ ‘’,కర్ణ సుందరి ‘’నాటకాలను ప్రబంధ శైలిలో ఆంధ్రీకరించారు ‘’తెలుగు –సంస్కృత కోశం ‘’,’’సంస్కృత వాచకాలు ‘’రచించారు .విజ్ఞాన సర్వస్వం సంగ్రహాంద్ర విజ్ఞాన కోశం ‘’లలోను, వివిధ పత్రికలలోనూ  లెక్కకు మించి వ్యాసాలూ రాశారు .శాస్త్రిగారు మహా వక్త .తెలుగు సంస్కృతం ,కన్నడ ,తమిళ ,మరాఠీ ,హిందీ ఉర్దూ భాషలలో ఉద్దండ పండితులు. ఆ భాషలలో అనర్గళం గా ప్రసంగించే  నేర్పున్న వారు .ఈ భాషలలోని ఎన్నో గ్రంధాలను తెలుగులోకి అనువాదం చేశారు .భారత ప్రధమ రాష్ట్ర పతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు హైదరాబాద్ సందర్శించి నప్పుడు లకష్మ శాస్త్రి గారు కావ్య ప్రబంధ ధోరణిలో స్వాగత శ్లోకాలు రాసి ఆహ్వానించారు –ఆ శోభ చూద్దాం

‘’నిష్ణాతః ప్రాచ్య విద్యా స్వనితర ధిషణే-దుర్గమే రాజ్య తంత్రే –విద్వాన్ పాశ్చాత్యతంత్రే ష్వఖిల భారత భూ –వాసినాంభాగ్య సీమా –రాజ్యానాం పాలనే చ ప్రభురతి నిపుణో-ప్యప్రద్రుష్యోభిగ్యః –జీయత్ రాజేంద్ర విద్వా నతి శత శరదం –భారతం సేవ మానః ‘’

సత్కార పురస్కార బిరుదాoకితాలు

కాశీ  సంస్కృత  విశ్వ విద్యాలయం ,ఆంధ్రా ,ఉస్మానియా విశ్వ విద్యాలయాల బోర్డ్ ఆఫ్  స్టడీ స్ లో సభ్యులై సేవలందించారు .’’సురభారతి ‘’వ్యవస్థాపక అధ్యక్షులు .ఆంద్ర సారస్వత పరిషత్ స్థాపక సభ్యులు ..తిరుపతి లో జరిగిన విద్వత్ సభలో శాస్త్రి గారి కి ‘’ఆంద్ర బిల్హణ’’బిరుద ప్రదానం చేసి గౌరవించారు .ఉత్తర ప్రదేశ్ లోని మదన మోహన మాలవ్యా విద్యా సంస్థాన్ ‘’సుధీంద్ర మౌళి ‘’తో గౌరవించి సన్మానించింది .’’బ్రహ్మ భూషణ ‘’అన్నది వీరి సాహితీ పాండితికి లభించింది .కాశీ విద్వత్ పరిషత్తు శాస్త్రి గారిని ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదం తో సన్మానించింది .తిరువాన్కూర్ ,గ్వాలియర్ జగద్గురు శంకరాచార్యుల వారి చేత  కప్పగంతుల వారు ఘనం గా సత్కరింప బడ్డారు .విద్యా మంత్రి మండలి వెంకట కృష్ణారావు గారి ఆధ్వర్యం లో ముఖ్యమంత్రి జలగం వెంగల రావు గారి నిర్వహణలో జరిగిన ప్రధమ ప్రపంచ తెలుగు మహాసభలో లక్ష్మణ శాస్త్రి గారు ప్రత్యేకం గా సన్మానం అందుకొన్నారు .దేశం లోని ప్రముఖ సాహిత్య సంస్థలన్నీ శాస్త్రి గారిని ఆహ్వానించి వారి ఉపన్యాస లహరిలో తడిసి విశేష సత్కార ,పురస్కారాలు అందజేశాయి ..

వీలైనప్పుడల్లా వివిధ ప్రదేశాలను సందర్శిస్తూ అక్కడి స్థానిక భాషలైన హిందీ మరాఠీ కన్నడం తమిళం  మొదలగు భాషలలో ప్రసంగిం ఛి వారిని ముగ్ధులను చేసేవారు .వీరి ఆధ్వర్యం లో ఏర్పడిన ‘సార్వభౌమ సంస్కృత ప్రచార కార్యాలయం ‘’కు అధ్యక్షులుగా వ్యవహరించారు .వీరి పాండిత్యాన్ని మెచ్చుకొన్న పండిత ద్వివేదీ శాస్త్రి సంస్కృతం లో వీరిని

‘’మూర్తిర్మత్త గజేంద్ర దర్ప దళినీ వాణీ వినోద ప్రియా –వ్యాఖ్యాలేఖ కవిత్వ కౌశల కళా పారంగతా ,శేముషీ

శక్తి స్సంస్కృత భాషణే ప్యనుపమా విద్వజ్జనే స్వాదరః –శ్రీ మల్లక్ష్మణ శాస్త్రిణాంగుణ గణాః కేషాంన తోషా వహాః’’అని శ్లాఘించారు .

శాస్త్రి గారు తుది శ్వాస వదిలే వరకు ‘’కాశీ సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం ‘’’’ఎమిరిటస్ ప్రొఫెసర్ ‘’గా (సమ్మాన్య  ప్రాచ్యాచార్యులు )గా ఉన్నారు .శాస్త్రిగారు అందరికి మిత్రులే .తర తమ భేదం లేనివారు. అందరూ శాస్త్రి గారికి అత్యంత ఆత్మీయులే మిత్ర బృందం లోని వారే .అదీ వారి ప్రత్యేకత .డెబ్భై సంవత్సరాలు సార్ధక జీవనం గడిపి 10-1-1981 తేదీన ఈ సంస్కృత సాహితీ  వాజ్మయ శిఖరం నేల వ్రాలింది .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-12-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -84 – 125-తర్క తీర్ధ –ఆది భట్ట రామ మూర్తి శాస్త్ర్రి

గీర్వాణకవుల కవితా గీర్వాణం -84

125-తర్క తీర్ధ –ఆది భట్ట రామ మూర్తి శాస్త్ర్రి

తర్క సముద్రాన్ని అవలీలగా ఈదిన మహానుభావులు

ఆది భట్ట సుబ్రహ్మణ్యం ,మహా లక్షమ్మ దంపతులకు రామ మూర్తి శాస్త్రి బొబ్బిలి తాలూకా మురడాం అగ్రహారం లో 1961లో జన్మించారు .ద్రావిడ శాఖ కు చెందిన వారు .సొంత ఊరిలోనే పంచకావ్యాలు నేర్చారు .శ్రీ పాద రామ శాస్త్రి గారి దగ్గర తర్క ప్రకరణాలు ,నిరుక్తి ,పక్షత ,వ్యదికరణం ,సిద్ధాంత లక్షణం ,అవచ్చేదకత్వ నిరుక్తి ,పక్షత ,సామాన్య నిరుక్తి అనే తర్క గ్రందాలనన్నిటినీ అవలోడనం చేసు కొన్నారు .కాశీ వెళ్లి కర్నాటక సీతా రామ శాస్త్రిగారి వద్ద ‘’నవ్యభిచారం ‘’,’’సత్ ప్రతి పక్షం ‘’’’,అవయవం ‘’అనే మహోద్గంద్రాలు పఠించారు .వంగ దేశీయులైన వజ్ర కుమార విద్యా రత్న భట్టాచార్యుల వారి నుండి ‘’వ్యుత్పత్తి వాదం ,శక్తి వాదం ‘’,ప్రామాణ్య వాదం ‘’,’’విధి వాదం ,’’ముక్తి వాదం ‘’అనే అపూర్వ గ్రంధాలన్నీ నేర్చుకొన్నారు .అంటే తర్క శాస్త్రాన్ని ఆమూలాగ్రం మదించి ,శోధించి అంతు చూసిన తర్క మార్తాండులన్న మాట .కలకత్తా లో ప్రభుత్వ పరీక్షలో ఉత్తీర్ణులై ‘’తర్క తీర్ధ ‘’బిరుదం తో పాటు ,అయిదు వందల రూపాయల ‘’నవ రత్న రూప ‘’బహుమతిని పొందారు .

వేదాంత ధిషణ

ఇంతటితో సంతృప్తి చెందకుండా రామ మూర్తి గారు కాశీ లో ద్రావిడ సుబ్రహ్మణ్య దీక్షితులు గారి దగ్గర వేదాంత సూత్ర ,శంకర భాష్యం లో చతుస్సూత్రి వరకు అద్యయనం చేశారు గీతా భాష్యాన్ని ,సూత్ర భాష్యాన్ని ,అద్వైత సిద్ధిని ,గౌడ బ్రహ్మానందాన్ని స్వీయ ప్రతిభ తో స్వయం గా అధ్యయనం చేసి నేర్చుకొని అసమాన  ధిషణతో అగ్రగామి అయ్యారు .

బోధనా సామర్ధ్యం

కర్నాటక దేశం లో చిత్రాపూర్ లో ఉన్న శంకర పీఠ స్వామికి వేదాంతాన్ని బోధించారు విద్యార్ధులకు తర్కాన్ని నేర్పారు .అక్కడే మూడేళ్ళు ఉండి తర్వాత దర్భంగా ,మండిమొదలైన సంస్థానాలను దర్శించి పండిత ప్రకాండులను  శాస్త్ర చర్చలో మెప్పించి విశేష గౌరవాదరణలు పొందారు .ఉర్లాం సంస్థానం లో తర్క శాస్త్ర పరీక్షాదికారిగా ఉన్నారు .మూడేళ్ళు తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ,పన్నెండేళ్ళు రాజ మండ్రి లో ,రెండేళ్ళు విజయనగర మహారాజా వారి సంస్కృత కళాశాలలో అధ్యాపకులుగా ఉంది వందలాది విద్యార్ధులకు తర్కాన్ని బోధించి తీర్చిదిద్దారు .

అక్కడి నుండి తిరుపతి చేరి సంస్కృత కళాశాలకు ప్రధానాచార్యులుగా అమూల్యమైన సేవలు కొద్దికాలమే అందజేశారు ..తర్వాత దక్షిణ దేశ సంచారం చేస్తూ పండితులతో శాస్త్రార్ధ చర్చలు చేస్తూ చివరికి ‘’లుకులాం ‘’అగ్రహారం చేరుకొన్నారు .అక్కడ వితరణ శీలురైన బ్రాహ్మణులు బూర్లె శ్రీరాములు గారు ..శాస్త్రిగారికి భూమిని, వసతి గృహాన్ని ఏర్పాటు చేసి గౌరవించారు .అక్కడే సుఖ జీవనం సాగిస్తూ విద్యార్ధులకు విద్యా బోధన చేశారు .

సన్యాసాశ్రమ స్వీకారం –ముక్తి

రామ మూర్తి శాస్త్రి గారు ‘’శక్తి వాదం ‘’పై ఒక వ్యాఖ్యాన గ్రంధం రచించారు .ఆదినుండి శ్రీ విద్యోపాసకులైన వీరు జీవితాంతం కొనసాగించారు .జీవిత చరమాంకం లో రాజ మండ్రి చేరి గోదావరీ నది తీరం లో ఆవాసం ఏర్పరచుకొని సన్యాసాశ్రమం స్వీకరించారు .యాభై తొమ్మిది సంవత్సరాలు మాత్రమె జీవించినా జీవితాన్ని అత్యంత సార్ధకం చేసుకొని ఎదురు లేని తర్క పండితునిగా రాణించి న రామ మూర్తి శాస్త్రి గారు 1920లో ముక్తి పొందారు .

 

126-రావు బహదూర్ –కిడాంబి రామానుజాచార్యులు

జిహ్వాగ్రాన సరస్వతీ తాండవం

సంస్కృతం లో ఆశు ధార గా కవిత్వం చెప్పి ,ఏక సందాగ్రాహిగా గుర్తింపు పొంది ,న్యాయ శాస్త్ర మధనం చేసి అసాధారణ ప్రజ్ఞా వంతులుగా పేరు పొందిన కిదాంబి రామ చంద్రా చార్యులవారు పశ్చిమ గోదావరి జిల్లా పెంట పాడులో 1853లో జన్మించారు .స్వగ్రామం లోనే సంస్కృతాన్ని అధ్యయనం చేశారు .కావ్య ,నాటక ,అలంకార వ్యాకరణాలలో ఇరవై ఏళ్ళ వయసుకే అపార పాండిత్యాన్ని సాధించారు .వీరి సునిశిత మేధాశక్తి అందరినీ ఆకర్షించింది .

‘’నానార్ధ రత్నమాల ,’’మేదిని ‘’వంటి నిఘంటువులు వీరికి కంఠోపాఠంగా ఉండి జిహ్వాగ్రాన తాండవ మాడుతూ ఉండేవి .వీరి ఏక సందాగ్రాహనం వల్లనే ఇది సుసాధ్యమైంది .పదహారు ,పదిహేడేళ్ళ వయసులోనే అష్టావధానాలు చేసిన చిచ్చర పిడుగు ఆచార్యుల వారు .సంస్కృతం, తెలుగులలో కవితాదారను మహా ఆశువుగా చెప్పి మెప్పించే నేర్పు వీరిది .అనేక రాజాస్థానాలు సందర్శించి ప్రభు సత్కారాలు అందుకొన్న కవీశ్వరుడు .

మహా విద్యా వేత్త

గ్రంధ రచన కంటే విద్యా వేత్తగా విశేషం గా గుర్తింపు పొందారు . వీరి రచనలో ముఖ్యమైనవి ‘’హేస్టింగ్ చరిత్ర ‘’,మత విద్య’’వంటి తెలుగు ఇంగ్లీష్ గ్రందాలున్నాయి .1873లో విజయ నగరం చేరి ఆస్థాన ప్రదానామాత్యులు పెను మత్స జగన్నాధ రాజును ,ప్రభువు ఆనంద గజపతి మహా రాజును దర్శించారు .తన అసాధారణ వైదుష్యం తో వీరిద్దరి మెప్పూ పొంది ,ఆదరణకు లోనై అక్కడే హైస్కూల్ లో చేరి 1874లో ప్రవేశ పరీక్షలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు .రాజా వారి ఉపకార వేతనం పొంది మద్రాస్ ప్రెసిడెన్సి కాలేజి లో ఏం .ఏ .చదివి ఉత్తీర్ణులైనారు .ఆ నాటి మొదటి బాచీ విద్యార్ధులలో  వీరున్నారు .న్యాయ శాస్త్రం పై మక్కువ ఎక్కువవ్వటం తో దానినీ చదివి బి ఎల్ పట్టా పొందారు .

విద్యా సేవ

విద్యాభ్యాసం మద్రాస్ లో పూర్తీ చేసుకొని మళ్ళీ విజయనగరం చేరుకొన్నారు .వీరిని మహా రాజావారు తమ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా నియమించి గౌరవించారు ,కొద్దికాలానికే ఆచార్యుల వారు పదోన్నతి పొంది 1887లో ప్రధానాచార్యులు అంటే ప్రిన్సిపాల్ అయ్యారు .1920వరకు ఆ పదవిని అత్యంత సమర్ధ వంతం గా  నిర్వహించారు .తర్వాత విజయ నగర సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గా నియమిమ్పబడ్డారు .విద్యా రంగానికిరామానుజా చార్యుల వారి సేవను గుర్తించిన అ నాటి ఆంగ్ల ప్రభుత్వం 1912లో ‘’రావు బహదూర్ ‘’బిరుదు నిచ్చి గౌరవించి సత్కరించింది  .డెబ్భై ఏడేళ్ళు యశో జీవితాన్ని సార్ధకం చేసుకొని ఆచార్యుల వారు 1928లో కీర్తి శేషులయ్యారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-12-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి 74వ సమావేశం జనవరి11 న దైవ క్షేత్రాలు పుస్తకావిష్కరణ లైవ్ ద్వారా వీక్షించండి సమయం : సాయంత్రం 5 గంటలనుండి ప్రారంభం (IST)

<br /><a href=”http://www.ustream.tv/&#8221; style=”padding: 2px 0px 4px; width: 400px; background: #ffffff; display: block; color: #000000; font-weight: normal; font-size: 10px; text-decoration: underline; text-align: center;” target=”_blank”>Live streaming video by photo9india</a>

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 2 Comments

మూసి -డిసెంబర్ – మెతుకు సీమ మెదక్ ను నందన వనం చేసిన కవిరాజులు- విశ్వనాధ కల్ప వృక్షం లో రామ బాల్యం – దాశరధీ శతకం-

ds1 001ds2 001ds3 001medak1 001medak2 001ramabalyam 1 001 ramabalyam2 001 ramabalyam3 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విస్తృత బౌద్ధ సిరి -దంతపురి -బుద్ధ భూమి -డిసెంబర్

dantapuri1 001 dantapuri2 001 dantapuri3 001 dantapuri4 001 dantapuri5 001 dantapuri6 001

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బహుమతి పొందిన చలపాక ప్రకాష్ కద-

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం -83 124-కళానిధి ,విద్యా వాచస్పతి –విక్రాల రామ చంద్రా చార్యులు

గీర్వాణకవుల కవితా గీర్వాణం -83

124-కళానిధి ,విద్యా వాచస్పతి  –విక్రాల రామ చంద్రా చార్యులు

బాల మేధావి

కవి పండిత శ్రేస్టూలు సకల శాస్త్ర నిధి మహోపన్యాసకులు  విక్రాల రామ చంద్రాచార్యులు గారు 1879 జూన్ ఆరున  ప్రకాశం జిల్లా కందుకూరు తాలూకా  కలికివాయి గ్రామం లో జన్మించారు .తండ్రి కళత్తూర్ విక్రాల  రాఘవాచార్యులు తల్లి కనకమ్మ .వీరి వంశం లో’’ కవిపంతారామం ‘’గా ప్రసిద్ధులైన విక్రాల వంశ మూల పురుషులు విక్రాల నరసింహా చార్యుల వారు భగవద్ రామానుజులకు ప్రత్యక్ష శిల్యులు .వారి తర్వాత అరవైనాలుగు పురుషాంతరాలు గడిచి పోయాయి .వంశం లో జన్మించిన వారంతా ప్రసిద్ధ కవి పండితులే అవటం మరో విశేషం .

రామ చంద్రా చార్యుల వారు బాల మేధావిగా పరిగణింప బడ్డారు .బాల్యం లోనే అసాధారణ ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించారు .అయిదవ ఏట అక్షరాభ్యాసం జరిగిన ఒక్క రోజులోనే ఒత్తులు  గుణింతాలుతో సహా తెలుగు అక్షరాలన్నీ నేర్చేసి అందర్నీ ఆశ్చర్య పరచారు .ఏడవ ఏటనే ‘’లీలావతీ గణిత సార సంగ్రహం ‘’మొదలైనవి ఆపోశన పట్టేశారు .ఒకే ఒక్క రోజు రాత్రి పంచాంగ రచనకు అవసరమైన లేక్కలన్నిటినీ  గ్రహించే చే శారు  ..పదమూడవ ఏట తండ్రిగారి వద్దే షట్ శాస్త్రాలు అభ్యసించి తిరుగు లేని పండితులని పించుకొన్నారు .తర్వాత మేనమామ పర్ణ శాల రాఘవాచార్యుల వద్ద సాహిత్య ,వ్యాకరణ ,తర్క శాస్త్రాలను నేర్చుకొన్నారు .అనంతరం శ్రీ కాళహస్తి వెళ్లి అక్కడ సింగా రాజు సూర్య నారాయణ ఉపాధ్యాయుల వారి వద్ద కృష్ణ యజుర్వేదం అధ్యయనం చేశారు .రామ దత్తా నంద తీర్ధుల వద్ద సిద్ధాంత ,జాతక ,ముహూర్త ,వాస్తు ,ప్రశ్న భాగాలు నేర్చుకొన్నారు .

యవ్వన విజయం

పద్దెనిమిదేళ్ళ వయసులో ‘’శూల మేని ‘’లో జరిగిన యాగానికి సదస్య బాధ్యతా వహించి యాగాన్ని నిర్విఘ్నంగా యదా విధిగా నిర్వహించి మహా మహా వాళ్ళకే సంభ్రమం కలిగించారు .మద్రాస్ వెళ్లి మహా భారత రహస్యాలను ,జ్యోతిష్ శాస్త్రాన్ని గూర్చి మహోపన్యాసాలు  చేసి అందరిని అలరించి స్స్వర్ణ సింహ తలాటపు మురుగులు ,గడియారం బహుమతులుగా పొందారు .

పూనా లో మొదటి ఓరిఎంటల్ సమావేశం జరిపితే మద్రాస్ నుండి ఆచార్యులవారు ప్రతి నిదిగా హాజరై ,అక్కడి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలను పొందారు .తిరువనంతర పుర విద్వత్ సభలో తలపండిన విద్వాం సులనే తన ఉపన్యాస ఝరి తో తల పంకింప జేసి ‘’విద్యారణ్య పంచానన ‘’గౌరవాన్ని ,తిరువాన్కూర్ మహా రాజా వారి ఘన సన్మానాన్ని అందుకొన్నారు .

నడి వయసు సూరీడు

1922కలకత్తా ఓరియెంటల్ కాన్ఫ రెన్స్ లో సాధికార పూరిత ప్రసంగం చేసి ,గవర్నర్ నుండి విశిష్ట సత్కారం పొందారు ..నవ ద్వీపం లో విద్వన్మండలి లో ప్రసంగించి ,తన సర్వ శాస్త్ర విజ్ఞానం వక్రుత్వాలకు విశేష ఆదరాన్ని పొంది సర్ ఆశుతోష్ ముఖర్జీ నుండి ‘’విద్యా వాచస్పతి ‘’బిరుదు ను ,మహా గౌరవ ప్రదమైన సత్కారాన్ని అందుకొన్నారు .మరో సభలో ‘’కళానిధి ‘’బిరుదు వరించింది .1923లో నండూరి గ్రామం లో జరిగిన ఆంద్ర సాహిత్య పరిషత్ వార్షిక సభ ఆచార్యులవారికి ‘’మహోపాధ్యాయ ‘’గౌరవం కల్పించి కీర్తించింది .చాలా రాజాస్థానాలను సందర్శింఛి  ప్రభువులను మెప్పించి విద్వాంసులను ఆశ్చర్య పరచి  అఖండ  సన్మానాలందు కొన్నారు .

గీర్వాణ రచనాచార్యం

విక్రాల రామ చంద్రా చార్యుల వారు సంస్కృతాంధ్రాలలో మొత్తం 89 గ్రంధాలు రాసి ,సాహిత్య  రచనలో మేటి అనిపించుకొన్నారు .అందులో ముఖ్యం గా సంస్కృతం లో 16 ఉద్గ్రంధాలు రచించారు .వాటిలో  ‘’త్రేతాకాండ మంత్రం భాష్యం ‘’,’’అపస్తంభాది షట్ శాఖా నిరూపణం ‘’,’’అనువాక నిర్ణయం ‘’,ఉన్నాయి ఇవికాక గీర్వాణ భాషలో రాసిన ‘’అబ్దనామ నిర్వచనం ‘’,సంఖ్యాను శాసనం ‘’,జ్యోతిర్దశా నిర్ణయం ‘’, ‘’మానాంతర బోధం ‘’మొదలైన జ్యోతిష్ శాస్త్ర సంబంధమైన పద్నాలుగు గ్రందాలున్నాయి .మానాంతర బోధనం అనే వీరి జ్యోతిష్ శాస్త్ర ఉద్గ్రంధం ఇంగ్లీష్ లోకి ‘’దిడేట్ కాల్క్యు లేటర్’’పేరు మీద అనువాదం పొంది విశ్వ వ్యాపితం గా కీర్తి చంద్రికలను వెలయించింది .

ఆచార్య ఆంద్ర రచనోత్సవం

ఆచార్య శ్రీ తెలుగులో 40గ్రంధాలు రాశారు .అందులో ‘’కల్ప సూత్రసంగ్రహం ‘’, ‘’దివ్య దేశ మార్గ బోధిని ‘’,’’వేదాంతపు జడ్జి మెంట్ ‘’,’’వర్దిష్ణుహితోపదేశం’’,రెండుభాగాలలో’’ రామ జాతకం   ‘’,’’స్త్రీ పునర్వివాహ శాస్త్రీయతా నిరూపణం ‘’,మొదలైనవి ఉన్నాయి .

రాజకీయాచార్యకం

విక్రాల వారు రాజ కీయ ప్రవేశం చేసి ,అక్కడా తమ అవక్ర పరాక్రమం చూపి ,సాహిత్య సేవతో బాటు సంఘ సేవలోనూ పునీతులయ్యారు .1904లో ఒంగోలు తాలూక బోర్డు సభ్యులుగా నియమితులై రాజకీయ అరంగేట్రం చేశారు .పిమ్మట తొమ్మిదేళ్ళు నెల్లూరు జిల్లా బోర్డు సభ్యులుగా సేవలందించారు .1911లో  ‘’దక్షిణ భారత సంస్థ ‘’లో సభ్యులయ్యారు .1912లో మద్రాస్ పచ్చయప్ప కాలేజి ప్రెసిడెంట్ గా ఇతోధికం గా విద్యా సేవ చేసే అవకాశం పొంది సంతృప్తిగా విద్యా సేవ చేశారు .తన స్వంతగ్రామం కలికి వాయి లో  ఇంట్లోనే ‘’సరస్వతీ పుస్తక భాండా గారం ‘’సమకూర్చుకొని  వాణీ మాత నిత్య సేవలో జీవితాన్ని ధన్యం చేసుకొన్నారు .సుమారు అర్ధ శతాబ్ది కాలం మాత్రామే అంటే యాభై మూడేళ్ళు మాత్రమె జీవించిన ఈ కళానిధి  మహోపాధ్యాయ ,విద్యా వాచస్పతి శ్రీ విక్రాల రామ  చంద్రాచార్యుల వారు 7-4-1932 గీర్వాణ లోకం చేరారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-12-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా మనుమలు (అమ్మాయి పిల్లలు అమెరికా )-ఛి ఆశుతోష్ ,ఛి పీయూష్ పుట్టిన రోజు 9-12-14మంగళ వారం సందర్భం గా మా ఇలవేల్పు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి వారికీ ఉయ్యూరులో ప్రత్యెక పూజ 

మా మనుమలు (అమ్మాయి పిల్లలు అమెరికా )-ఛి ఆశుతోష్ ,ఛి పీయూష్ పుట్టిన రోజు 9-12-14మంగళ వారం సందర్భం గా మా ఇలవేల్పు శ్రీ సువర్చలాంజ నేయ  స్వామి వారికీ ఉయ్యూరులో ప్రత్యెక పూజ

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రాజమండ్రి నగరం’ ఇంకా నరకమే!

నగరం’ ఇంకా నరకమే!

  • -ఆంధ్రభూమి ప్రతినిధి బృందం, రాజమండ్రి
  • 09/12/2014
TAGS:

ఆ ఘోరకలి జరిగి అయిదు నెలలు కావస్తున్నా- అది గతించిపోయే జ్ఞాపకం కాదు.. ఆ గాయం ఇంకా రగులుతూనే ఉంది.. సాయం కోసం తల్లడిల్లుతున్న ఆ గుండెలను ఎలా ఓదార్చగలం..? ఆ అభాగ్యుల బతుకుల్లో కొత్త వెలుగులు ఎలా నింపగలం..? నిస్తేజం ఆవహించిన ఆ గ్రామానికి తిరిగి జవసత్వాలు ఎలా ఇవ్వగలం..? అత్యంత భయానకమైన ఆ ప్రమాదం నుంచి నేర్వాల్సిన పాఠాలను మన పాలకులు ఇంకా ఒంటపట్టించుకోలేదు.. కొంతమందిని విగతజీవులుగా, మరికొంత మందిని వికలాంగులుగా చేసి, జనజీవనంపై పెను ప్రభావం చూపిన ఆ ప్రమాదం అప్పటితో సమసిపోలేదు.. బాధిత కుటుంబాల వారసులు, క్షతగాత్రులు పూర్తిస్థాయిలో సహాయానికి నోచుకోక జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్నారు.. ఆర్థిక సమస్యలతో, పలురకాల వైకల్యాలతో సతమతమవుతున్న వారికి ఎలాంటి భరోసా కనిపించడం లేదు.. ఒకప్పుడు స్వర్గసీమలా విలసిల్లిన ఆ గ్రామం ఇప్పటికీ- మానని గాయమే..! గ్యాస్ పైప్‌లైన్ పేలుడు దుర్ఘటన ఆ గ్రామస్థులను నిత్యం ఓ పీడకలలా వెంటాడుతోంది.. పాలకులు ప్రకటించిన ‘పునరావాస ప్రక్రియ’ నేటికీ కొలిక్కిరాలేదు.. ఈ ఏడాది జూలై 27న తూర్పు గోదావరి జిల్లా నగరం గ్రామంలో జరిగిన దుర్ఘటన అనంతరం అక్కడి పరిస్థితులు వ్యవస్థల వైఫల్యానికి, పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి..
================
ఎటు చూసినా పచ్చదనం, ప్రశాంత వాతావరణం.. ఠీవిగా నిలబడ్డ కొబ్బరి చెట్లు.. పగలు, రాత్రి తేడా లేకుండా రోజంతా సందడిగా కనిపించే రహదారులు.. ఇవన్నీ కోనసీమలోని ‘నగరం’ గ్రామంలో ఒకప్పటి పరిస్థితులు.. ఇపుడు అక్కడ శ్మశాన నిశ్శబ్దం తాండవిస్తోంది. ఈ ఏడాది జూలై 27న తెల్లవారక ముందే జరిగిన గ్యాస్ పైప్‌లైన్ పేలుడుతో ఎన్నో బతుకులు తెల్లారిపోయాయి. పైప్‌లైన్ పేలుడుతో వ్యాపించిన అగ్నికీలల్లో 15 మంది సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన 27 మందిని ఆస్పత్రుల్లో చేర్చగా చికిత్స పొందుతూ మరో 8 మంది మరణించారు. మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) 25 లక్షల రూపాయల చొప్పున, క్షతగాత్రులకు 5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేసి చేతులు దులుపుకున్నాయి. మంటల్లో తీవ్రంగా గాయపడిన వారు ఇప్పటికీ వైద్యం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అలనాటి భీతావహ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసిన గ్రామస్థులు నేటికీ భయం నీడలో కాలం వెళ్లదీస్తున్నారు.
ఊరు బావురుమంటోంది…
గ్యాస్ పైప్‌లైన్ పేలుడు తర్వాత నగరం గ్రామం వైపు ఎవరూ కనె్నత్తి చూడడం లేదు. అత్యంత సారవంతమైన ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఎకరం భూమికి కోటి రూపాయల ధర పలకగా, ఇపుడు పదిలక్షలకే ఇస్తామన్నా కొనేవారు కానరావడం లేదు. దుర్ఘటన తర్వాత చాలా కుటుంబాలు గ్రామాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాయి. అద్దెకు ఉంటున్న వారు ఇళ్లు ఖాళీ చేశారు. ఫలితంగా గ్రామంలో చాలా ఇళ్లు బోసిపోతున్నాయి. భోజనం హోటళ్లు, కూల్‌డ్రింకు షాపులు, టీ దుకాణాలు గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. ఒకప్పుడు తాము రోజూ నాలుగు బస్తాల బియ్యం వండి వార్చేవారమని, ఇపుడు నాలుగు కుంచాల బియ్యం ఉడికించడం గగనంగా మారిందని గ్రామంలోని ఓ హోటల్ యజమాని చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవతుంది. కుటుంబం మొత్తాన్ని రాజాలా పోషించే తమ కుమారుడు ఇప్పటికీ కోలుకోలేదని, తమ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని భోజనం హోటల్ నడుపుతున్న బోణం నరసింహ మూర్తి, ఆయన భార్య పళ్లాలమ్మ కంటతడి పెడుతూ చెబుతున్నారు. నష్టపరిహారం కింద ఇచ్చిన అయిదు లక్షలు మందుల ఖర్చుకి చాలడం లేదని, ఇక తాము ఎలా బతకాలని వారు ప్రశ్నిస్తున్నారు. తక్కువ అద్దె ఇచ్చి ఇళ్లలో ఉండమన్నా ఎవరూ ఉండడం లేదని, తమ ఊరి పేరు చెబితే ఇతర ప్రాంతాల వారు హడలెత్తిపోతున్నారని నగరం గ్రామ పెద్ద వానరాశి రాంబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ఎంతోమంది నేడు జీవనోపాధి లేక ఆర్థిక సమస్యలతో అలమటిస్తున్నారు. ఇపుడు రోజూ సాయంత్రం చీకటి పడితే చాలు.. జన సంచారం లేక వీధుల్లో నిశ్శబ్దం తాండవిస్తోంది. అప్పనపల్లి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు ఒకప్పుడు నగరంలోనే విడిది చేసేవారు. పేలుడు తర్వాత ఇక్కడ బస చేసేందుకు భక్తులు జంకుతున్నారు.
‘గెయిల్’కి భారీ నష్టం..
నగరం వద్ద పేలుడు సంభవించి నెలలు గడుస్తున్నా పైప్‌లైన్‌ను పునరుద్ధరించడంలో జాప్యం కారణంగా ఓఎన్‌జిసికి రోజుకు 75 లక్షల రూపాయల మేరకు నష్టం జరుగుతోంది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో సమీపంలోని పలు పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఏర్పడింది. గత ఆరునెలల్లో సు మారు 135 కోట్ల రూపాయల విలువ చేసే గ్యాస్ వినియోగం కాకుండా పోయిందని అధికారిక గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. పైప్‌లైన్ నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జరగలేదని ఓఎన్‌జిసి ఉన్నతాధికారులు పేర్కొనడంతో పునరుద్ధరణ పనులను ‘గెయిల్’ అధికారులు చేపట్టలేదు. తాటిపాక, పాశర్లపూడి చమురు బావుల నుంచి గ్యాస్ సరఫరాను చాలావరకూ నిలిపివేశారు. చమురు బావులు మళ్లీ కళకళలాడాలంటే ‘ప్రొడక్షన్ డ్రిల్లింగ్’ పనులను చేపట్టాల్సి ఉంటుంది. అధికారుల నిర్వాకం ఫలితంగా పైప్‌లైన్ పనులకు, డ్రిల్లింగ్‌కు స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్యాస్ ఆధారిత పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకం కావడంతో మరికొంత మంది ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే పలు చోట్ల ‘గెయిల్ టెర్మినల్స్’ మూత పడడంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనాలకు అందడం లేదు. ఓఎన్‌జిసి, గెయిల్‌లకు పూర్వ వైభవం మళ్లీ సాధ్యమా? అన్న అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి.
చేతలు కాలాక..
నగరం దుర్ఘటన నేర్పిన గుణపాఠంతో భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలకు తావులేకుండా గెయల్ కొన్ని దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. కెజి బేసిన్‌లో పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్న గ్యాస్ ఒత్తిడిని కనిష్ఠ స్థాయికి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. పేలుడు నేపథ్యం లో 2015 జూన్‌కు గానీ విజయవాడ వైపు గ్యాస్‌ను సరఫరా చేసే అవకాశం లేదని గెయల్ ప్రతినిధులు చెబుతున్నారు. పైపులెన్ల పరిస్థితిని, భద్రతా చర్యలను సమీక్షించే బాధ్యతను ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (ఐఐఎల్)కు గెయిల్ అప్పగించింది. పైప్‌లైన్లను తనిఖీచేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. విశాఖ వైపు పైపులైన్లకు తనిఖీలు నిర్వహిస్తుండటంతో గ్యాస్ రవాణా దాదాపు స్తంభించింది. ఎరువుల ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లకు, వంట గ్యాస్‌కూ కొరత ఏర్పడింది. పేలుడు ఘటనకు గెయల్ అధికారులదే బాధ్యత అని విచారణ సంఘాలు తేల్చి చెప్పడంతో నగరం గ్రామాన్ని దత్తత తీసుకుంటామని ఆ సంస్థ అధికారులు కొత్త పల్లవి అందుకున్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే చర్యల్లో భాగంగా నాలెడ్జ్ యూనివర్సిటీని నెలకొల్పాలని నిర్ణయించినట్టు గె యిల్ ప్రతినిధులు చెబుతున్నారు. సామాజిక బాధ్యత కింద ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని వారు అంటున్నా, అది కార్యరూపం దాల్చేదెపుడో..? *

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బ్రాహ్మణులకు కార్పొరేషన్

బ్రాహ్మణులకు కార్పొరేషన్

బ్రాహ్మణులకు కార్పొరేషన్

  • 09/12/2014
TAGS:

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్, డిసెంబర్ 8: అగ్రవర్ణంగా కొనసాగుతున్నప్పటికీ.. చాలకాలంగా అనేక ఆర్ధిక ఇబ్బందుల్లో సతమతం అవుతున్న బ్రాహ్మణుల అభివృద్ధికి కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ లిమిటెడ్ పేరిట ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల అభివృద్ధికి కార్పొరేషన్లు పనిచేస్తుండగా, తాజాగా బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా ఏర్పాటైంది. ఈ కార్పొరేషన్ ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో పనిచేస్తుంది. తరువాత నేరుగా కార్పొరేషన్‌కు విధివిధానాలు రూపొందిస్తారు. రాష్ట్రంలో అగ్రవర్ణంగా ఉన్న బ్రాహ్మణులు చాలా ప్రాంతాల్లో ఆర్ధికంగా మాత్రం వెనుకబడి ఉన్నారు. వారిని ఆదుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, అభివృద్ధికి ఆర్ధికంగా ఆదుకోవాలని చాలాకాలంగా విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విజ్ఞప్తులకు కార్యరూపం వచ్చింది. ప్రస్తుత బడ్జెట్‌లో బ్రాహ్మణుల అభివృద్ధికి 25 కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి తెలిసిందే. అదే మూలధనంతో ఒక్కొక్కటి పది రూపాయల షేర్ విలువతో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అవసరం మేరకు అదనంగా నిధులు సమకూర్చేందుకూ నిర్ణయించారు. ఈ సంస్థకు తొలి ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా వెనుకబడిన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం దానకిషోర్‌ను నియమించారు. అలాగే తొలి మేనేజింగ్ డైరెక్టర్‌గా బీసీ సంక్షేమ కమిషనర్ వాణిప్రసాద్‌ను నియమించారు. తొలి షేర్ హోల్డర్లుగా దానకిషోర్, హేమ మునివెంకటప్ప, టి.నారాయణరెడ్డి, వాణిప్రసాద్, రాజా పుష్ప, వైవి అనురాధ, కె.శ్రీనివాసరావు ఉంటారు. ఇక డైరెక్టర్లుగా దానకిషోర్, హేమ మునివెంకటప్ప, వాణిప్రసాద్ ఉంటారు. రాష్ట్ర బీసీ సహకార ఆర్ధిక సంస్థ కార్పొరేషన్‌లోనే బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా ఉంటుంది. ఈ కార్పొరేషన్ ఏర్పాటు వెంటనే అమలులోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.

Posted in వార్తా పత్రికలో | Tagged | 2 Comments

శంకరాభరణం రాజ్య లక్ష్మి మనోగతం- శంకరాభరణం ఇంటిపేరైంది

శంకరాభరణం ఇంటిపేరైంది
రాజలక్ష్మి అంటే చాలా మంది తెలుగు ప్రేక్షకులు వెంటనే గుర్తు పట్టకపోవచ్చు. కానీ శంకరాభరణం రాజలక్ష్మి అంటే మాత్రం ప్రేక్షకులు వెంటనే గుర్తుపడతారు. సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చేసుకున్న అతి కొద్ది మంది నటీమణులలో ఒకరైన రాజలక్ష్మిని- శంకరాభరణం తమిళ అనువాదం విడుదలవుతున్న నేపథ్యంలో నవ్య పలకరించింది. ఆ విశేషాలలోకి వెళ్తే.. ‘‘మాది తెనాలి. అమ్మ సభా రంజని రంగస్థల నటి. ఒకప్పుడు తెనాలి నాటకాలకు చాలా ప్రసిద్ధి. అమ్మ కూడా ఎప్పుడూ నాటకాలలో బిజీగా ఉండేది. అమ్మను చూస్తుండటంతో నాకూ నటనపై ఆసక్తి కలిగింది. అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలు వేసేదాన్ని. స్కూల్లో చదువుకునేటప్పుడు భరతనాట్యం నేర్చుకోవటంతో నాట్యం చేసేదాన్ని. అమ్మ నటి కావటం వల్ల అనుకుంటా- స్టేజి మీద నటించటానికి నేను ఎప్పుడూ ఇబ్బంది పడేదాన్ని కాదు. పదవ తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత సెలవల్లో- మాకు తెలిసిన వారు విశ్వనాధ్‌ గారు తన సినిమాలో ఒక పాత్రకు కొత్త అమ్మాయి కోసం వెతుకుతున్నారని చెప్పారు. అమ్మ కూడా సరేనంది. దాంతో వెళ్లి విశ్వనాధ్‌ గారిని కలిసాం. నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగాను. అలాంటి డైరక్టర్‌ దగ్గర నటించాలంటే .. చాలా భయం వేసింది. తొలిసారి కలిసినప్పుడు ఆయన నన్ను ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఆ సమయంలో నేను లంగా, ఓణిలో పల్లెటూరి పిల్లలా ఉండేదాన్ని. బహుశా నన్ను చూడగానే ఆయనకు శారద గుర్తుకొచ్చి ఉండాలి. అంతే కాకుండా ఆయనకు తన సినిమాల్లో నటించే వారి నుంచి నటన ఎలా రాబట్టుకోవాలో ఆయనకి బాగా తెలుసు. అందుకే ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఆ తర్వాత ఏడిద నాగేశ్వరరావు గారు కూడా నన్ను ఓకే చేశారు. దాంతో శంకరాభరణంలో శారద పాత్ర నటించే అవకాశం వచ్చింది.
విడుదల కాకముందే అవకాశాలు!
నాపై తీసిన తొలి పాట సామజ వరగమన.. మొదట్లో బెరుగ్గా ఉన్నా నెమ్మదిగా యూనిట్‌తో కలిసిపోయా. విశ్వనాధ్‌ గారు తన ఆరిస్టుల దగ్గర నుంచి నటనను రాబట్టుకోవటంలో దిట్ట. ఒకవైపు ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుంటేనే మరో వైపు నాకు ఇతర చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. రాఘవేంద్రరావు గారు ‘నిప్పులాంటి నిజం’లో మురళీమోహన్‌కి హీరోయిన్‌గా కొత్తమ్మాయిని వెతుకుతున్నారు. నా గురించి ఎవరో చెప్పటంతో నన్ను స్ర్కీన్‌ టెస్ట్‌ చేసి ఎంపిక చేశారు. దాంట్లో నాది పూర్తి మోడ్రన్‌ క్యారెక్టర్‌. దీంట్లో ఎంపిక అయిన వెంటనే రామారావుగారు ‘రౌడీరాముడు కొంటె కృష్ణుడు’లో బాలకృష్ణకు జోడీగా ఎంపిక చేశారు. అందులో ఎన్టీఆర్‌-శ్రీదేవి ఒక జంట అయితే బాలకృష్ణ-నేను మరో జంట. ఈ రెండూ ప్రారంభమైన తరువాతనే ‘శంకరాభరణం’ విడుదలైంది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. శంకరాభరణం పూర్తయిన తర్వాత విశ్వనాధ్‌ గారు – ‘కొత్తమ్మాయివి.., ధైర్యంగా చేశావు. బాగా వచ్చింది. వెరీ గుడ్‌’ అన్నారు. నాకు అదే పెద్ద అవార్డు అనిపించింది. వెనువెంటనే మరో అవార్డు కూడా దక్కింది. అది రామారావుగారి కాంప్లిమెంట్‌. ‘శంకరాభరణం’ ప్రివ్యూ అయిన మరుసటి రోజు రామారావుగారి కాళ్లకి దణ్ణం పెట్టి, ఎలా చేశానండీ ? అనడిగాను. ‘బాగా చేశావురా. నిన్నే చూశాను’ అన్నారు. నా ఆనందానికి హద్దులు లేవు.
34 ఏళ్ల తర్వాత కూడా అదే స్పందన…!
శంకరాభరణం’ సినిమాను తమిళంలోకి అనువదించారు. దాని ప్రివవ్యూకు వెళ్లాను. ఇప్పటికీ అందరూ ఆ సినిమాను ఆస్వాదించటం చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. 34 ఏళ్ల తరువాత కూడా అదే స్పందన. సినిమా అయిపోయాక కొందరు తమిళ డైరక్టర్లు నా దగ్గరకు వచ్చి-‘చిన్నప్పుడు ఎప్పుడో చూశాం. ఈ రోజు మళ్లీ స్వయంగా మీతోపాటు చూడడం చాలా సంతోషంగా ఉందండి’ అన్నారు. ఇన్నేళ్ల తరువాత తెరపై నన్ను నేను చూస్తుంటే నిజంగా నేనేనా అనిపించింది. కొన్ని సినిమాలు చూసినప్పుడు మా పాత్రలు ఇంకా బాగా చేసుండొచ్చేమో అనిపిస్తుంది. నేను చేసిన కొన్ని పాత సినిమాలు చూస్తున్నప్పుడు ఫీలవుతుంటాను కూడా. అయితే ‘శంకరాభరణం’ చూసినప్పుడు అటువంటి భావనే లేదు. ఆ గొప్పతనం విశ్వనాథ్‌గారిదే. శారద పాత్రకి ఎంత కావాలో అంతే చేయించుకున్నారు. అందుకే ఇప్పటికీ ఆ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో సజీవంగా ఉంది. శంకరాభరణం రాజలక్ష్మి అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవిత్వపు మెరుపు తీగ -జాన్ హైడ్ -శిఖామణి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కృష్ణా పత్రిక సంపాదకులు పిరాట్ల వెంకటేశ్వర్లు గారి మరణం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సగీత కళానిధి నేడు నూరి కృష్ణ మూర్తిగారి మృతి –

అజరామర స్వరమూర్తి!

  • 09/12/2014
TAGS:

ఆయన జీవన ప్రస్థానం శాస్ర్తియ సంగీత స్వర సుధా తరంగ భరిత ఉత్తుంగ సాంస్కృతిక ప్రవాహం…విశుద్ధ భావ గాంభీర్య రస ప్రపంచ ప్రాంగణంలో ప్రతిధ్వనించిన మధుర నాదం! అన్నమాచార్య, రామదాస, త్యాగరాజ హృదయాంబర జనిత సాహితీ ధునులు ఆయన గళంలో త్రివేణీ సంగమం వలె పొంగులెత్తాయి! అశేష జనావళి హృదయాలలో అజరామర అనుభూతులను పండించాయి! ఆయనే నేదునూరి కృష్ణమూర్తి…కర్నాటక సంగీత సామ్రాజ్యానికి చెరగని కీర్తి, సుస్వర వైభవ దీప్తి, తరతరాలకు తరగని రసస్ఫూర్తి! ఆయన విశుద్ధ విద్వాంసులలో విలక్షణుడు, ప్రసిద్ధులలో ప్రసిద్ధుడు. తెలుగునాట మాత్రమేకాదు దాక్షిణాత్య సంగీత వాటిక అంతటా పరుగులు తీసిన ఆయన మంగళ గళ వినిర్గత గాన మాధుర్య స్రోతస్విని స్వరాల తోటలను పూయించింది.. ఆ పూతోటల పరిమళం సంగీత ప్రియుల గుండెలలో గుబాళిస్తోంది, గుబాళిస్తూనే ఉంటుంది! సప్త దశాబ్ద సంగీతారాధ్య, అధ్యాపన యజ్ఞవేదిక ఆయన జీవన భూమిక! సప్తస్వర ‘సామ’గానంతో నిత్యం సరస్వతీ సమారాధన సాగించిన ప్రణవమూర్తి కృష్ణమూర్తి!! ‘ఇట్టి ముద్దులాడె బాలు డేలరాడు..? వాని పట్టితెచ్చి పొట్టనిండ పాలుపోయరే!’ అన్న అన్నమాచార్యుని గీతాన్ని స్వరపరిచినా..దాశరధిని కరుణాపయోనిధిని కొలచిన గోపన్న అక్షర ‘కదళీ, ఖర్జూరాల’ను శ్రోతలకు రుచి చూపించినా, ‘ఆరగింపవే పాలు, ఆరగింపవే..’ అంటూ త్యాగరాజ రూపమెత్తి ఇష్టదేవత ఎదుట తిష్ఠవేసినా…నేదునూరి వారు అశేష శ్రోతలకు మోదం కలిగించారు, మహావిద్వాంసుల ఆమోదం పొందాడు! మూడున్నర దశాబ్దులకు ముందు తిరుపతి త్యాగరాజ మంటపం వేదికపైన, అన్నమాచార్య కళా మందిర రంగస్థలిపైన ఆయన గొంతెత్తిన నాటి దృశ్య మాలికలు..మూడు నెలలకు ముందు దృశ్య మాధ్యమ పటంపై ప్రస్ఫుటించిన ఆయన స్వర సృజన విన్యాసాలు..ఎడతెగని నాద యోగ శ్రమకు నిదర్శనాలు…వాడని స్మృతుల సుమసరాలు! ఎనబయి ఏడేళ్ల పార్ధివ జీవన ప్రస్తావన గీతంలో కృష్ణమూర్తి సోమవారం చివరి చరణాన్ని ఆలపించి ఉండవచ్చు గాక…ఆయన ఆవిష్కరించిన సంగీత మకరంద ధుని మాత్రం అజరామరంగా పరుగులు తీస్తునే ఉంటుంది! ఆయన ‘శ్రుతి’కి మృతి లేదు. ఆయన స్మృతికి చ్యుతి లేదు! వాగ్గేయ వసుంధర చరిత్రలో నేదునూరి కృష్ణమూర్తి సనాతనుడు, శాశ్వతుడు..మహనీయుడు, ‘్భరతి’ వరాల బిడ్డడు!
నేదునూరి విజయలక్ష్మీ రామమూర్తి దంపతుల పుణ్యఫలం కృష్ణమూర్తి. తెలంగాణలోని కొత్తపల్లిలో క్రీస్తుశకం 1927 అక్టోబర్ 10వ తేదీన పుట్టిన కృష్ణమూర్తి పూర్వాంధ్రలోని పిఠాపురంలో పెరిగాడు, ఉత్తరాంథ్రలోని విజయనగరంలో విద్య నేర్చుకున్నాడు! రాయలసీమలోని తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత కళాశాల ప్రధాన ఆచార్యునిగా ప్రసిద్ధికెక్కాడు! సంగీత స్వరూపంగా నడయాడి తెలుగువారి భావ సమైక్య స్వభాన్ని నిలబెట్టాడు! కర్నాటక సంగీత సాధన ద్వారా కృష్ణమూర్తి ‘తరాల‘ మధ్య వారసత్వ వారధిని నిర్మించాడు! ఆయన గురువులు ప్రసిద్ధులు, ఆయన శిష్యులు కూడ ప్రసిద్ధులు..ప్రసిద్ధిని, విశుద్ధ సంగీత సంప్రదాయాన్ని ఆయన గురువులనుండి స్వీకరించాడు, శిష్యులకు ప్రదానం చేసాడు! ఆయన తొలి గురువు ద్వారం నరసింహరావునాయుడు! ‘ద్వారం’ కుటుంబం కర్నాటక సంగీత సౌధానికి నిజంగానే ‘ద్వారం’ వంటిది! ద్వారం వెంకట స్వామి నాయుడు విజయనగరం సంగీత శిఖరానికి పతాకం వంటివాడు. ఆయన అన్న కుమారుడు ద్వారం నరసింహారావు…నరసింగరావు సంతానమైన దుర్గాప్రసాద్, మనోరమ, సత్యనారాయణరావు వంటివారు కూడ సంగీత సరస్వతీ సమారాధకులు! ఈ ‘ద్వారం’ కుటుంబంలో ప్రసిద్ధుడైన నరసింగరావు 1940వ దశకంలో కృష్ణమూర్తికి స్వరాక్షరాలు నేర్పించాడు. శ్రీపాద పినాకపాణి ఆచార్యత్వంలో నేదునూరివారు మహా విద్వాంసుడుగా పరిణతి చెందారు! అనితర సాధ్యమైన విలక్షణ సంగీత శైలికి అద్వితీయ ప్రతినిధి…ఇలా ప్రసిద్ధుల వద్ద విద్య నేర్వడం గొప్పతనం కాకపోవచ్చు! ప్రసిద్ధులైన శిష్య గణాలను రూపొందించడం నేదునూరి వారి నిజమైన గొప్పతనం! ఆయన సమకాలంలోనే గరిమెళ్ల బాల కృష్ణ ప్రసాదు, శోభరాజు వంటి ఆయన విద్యార్థులు విశ్వవ్యాప్త విఖ్యాతిని గడించారు. ఇదీ కృష్ణమూర్తిగారి ఆచార్యత్వ ప్రభావం..రసమయ ప్రపంచంలో ఆయన నిలబెట్టిన సజీవ ప్రతీకలు ఆయన శిష్యులు..
పదకవితా పితామహుడైన అన్నచారార్యుని గీతాలను భాండాగార విముక్తం బ్రహ్మాండమంతా మారుమోగించిన పరిశోధక త్రయంలో కృష్ణమూర్తి చిన్నవాడు! కానీ ఈ కృషిలో అన్నలిద్దరితో సమానంగా ఎన్నదగినవాడు. వేటూరి ప్రభాకర శాస్ర్తీ, రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ ప్రారంభించిన పరిశోధక ప్రక్రియను ఆ తరువాత కొనసాగించిన స్వరాక్షర మూర్తి నేదునూరి కృష్ణమూర్తి! కృష్ణమూర్తి స్వరపరిచిన అన్నమాచార్యు కీర్తనలు అనేక దశాబ్దులుగా సామాన్య శ్రోతలను, సంగీత కోవిదులను సమానంగా అలరిస్తున్నాయి! ‘అదివో అల్లదివో హరివాసము’ అన్న అన్నమాచార్య సుప్రసిద్ధ కృతికి ‘శ్రుతి’ని కల్పించినవాడు నేదునూరి! ‘హరివాసము’ అన్న పదజాలం ‘శ్రీహరివాసము’గా మారడం తరువాతి కథ! అన్నమాచార్యుడు ‘హరివాసము’ అని మాత్రమే పద ప్రయోగం చేసాడన్నది నేదునూరి వారు చేసిన నిర్ధారణ! అంతేకాదు ‘అదివో..’ అన్న పదంలోని మొదటి అక్షరానికి ‘హరివాసము’లోని మొదటి అక్షరానికి అన్నమయ్య ‘యతి’ సామ్యం కల్పించాడు! ‘శ్రీహరి వాసము’ అని మార్చినప్పుడు ‘యతి’ గతి తప్పిపోతుంది! అందువల్ల నేదునూరి వారి నిర్ధారణకు అనుగుణంగా సంగీత ప్రస్ధానం సాగించడం వర్తమాన వాగ్గేయకారుల, సంగీత విద్వాంసుల విధి! అదే నేదునూరి వారికి మనం ఘటించగలిగిన నిజమైన శ్రద్ధాంజలి…పదునాలుగవ శతాబ్ది నాటి పురందరదాసు కర్నాటక శాస్ర్తియ సంగీత అధ్యయనానికి ‘పాఠ్యక్రమాన్ని’ నిర్ధారించిన మార్గదర్శకుడు! అన్నమాచార్య గీతాలాపనకు ‘స్వర’ మార్గాన్ని సుగమం చేసిన అభినవ పురందరదాసు నేదునూరి కృష్ణమూర్తి! ఈ ‘స్వర’ మార్గాన్ని రాళ్లపల్లి వారు ఆరంభించారు. నేదునూరి కొనసాగించారు! ‘ఏకైవ మూర్తిః బిభిదేత్రిధాసా’-ఒకే మూర్తి మూడు విభిన్న రూపాలుగా కనిపిస్తోంది-అని మహా కవి కాళిదాసు చెప్పినట్టు వేటూరి, రాళ్లపల్లి, నేదునూరి-ఈ ముగ్గురూ ఒకే సంగీత సాహిత్య స్వభావానికి మూడు విభిన్నమైన స్వరూపాలు! నేదునూరివారు ఆలపించిన అజరామర కృతుల సమాహారం ‘అన్నమయ్య అంతరంగ తరంగం’ ‘అన్నమయ్య పదకదంబం’, ‘అన్నమయ్య పదకమలం’, ‘్భద్రాచల రామదాసు కీర్తనలు’, ‘త్యాగరాజ అపురూప కృతులు’ వంటి దృశ్య మాధ్యమ సంపుటాలుగా విస్తరించి ఉంది! ఇవి అనేక సంపుటాలు! ఆయనకు దాదాపు నలబయి పురస్కారాలు, బిరుదులు లభించాయి! ఆయన నాదయోగి..కీర్తి పరాన్ముఖ విరాగి!
తన కవిత్వంలోని ‘ప్రసన్న కథాకలితార్థయుక్తి’ని కవీంద్రులు మెచ్చుకుంటారని ఆదికవి నన్నయ చెప్పుకున్నాడు. మరి కవీంద్రులు కాని ఇతరుల మాట ఏమిటి? వారు అక్షర రమ్యతను చూసి మురిసిపోతారు! నేదునూరి వారి సంగీత సరస్వతి ఇలా విద్వాంసులను సంభ్రమాశ్చర్య స్రవంతిలో ముంచెత్తింది! ‘ఆరోహణ’ ‘అవరోహణ’, ‘ఆలాపన’, ‘శ్రుతి, లయ’ ‘సంగతి’, ‘స్వరం’, ‘రాగం’ మేళకర్త వంటి సంగీత పరిభాష తెలియని సామాన్య శ్రోతలను సైతం నేదునూరి వారి గాత్రం అలరించింది. అలరిస్తునే ఉంటుంది! అతడు అజరామరుడు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -82 – 123-బహు గ్రంధ పరిష్కర్త ,బహుభాషా కోవిదులు –మాన వల్లి రామ కృష్ణ కవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -82

123-బహు గ్రంధ పరిష్కర్త ,బహుభాషా కోవిదులు –మాన వల్లి రామ కృష్ణ కవి

బాల్యం –విద్యాభ్యాసం-ఉద్యోగ జీవితం

మానవల్లి రామ కృష్ణ కవి గారు మద్రాస్ లోని నుంగంబాకం లో వైదిక బ్రాహ్మణ కుటుంబం లో 1866 లో జన్మించారు .తండ్రి రామ శాస్త్రి .తండ్రి ,తాత గారు అష్టా దశ భాషా ప్రవీణులు .తండ్రి నాట్య శాస్త్ర వ్యాఖ్యాత .కవిగారు చెన్నై లో బి ఏ .పాసై సంస్కృతం లో ఏం .ఏ .చేశారు .మద్రాస్  చింతాద్రి పేట మిడిల్ స్కూల్ ,క్రిస్టియన్ కాలేజి హైస్కూల్ లో ,పచ్చయప్ప కళాశాల ఉన్నత పాఠ శాలలో అధ్యాపకులుగా పని చేశారు .ఆరు భాషలో పాండిత్యం సాధించటం వలన వీరిని ‘’కవిగారు ‘’అని సంబోధిస్తారు మర్యాదగా .

తర్వాత కవిగారు వన పర్తి సంస్థానం లో గ్రంధ ప్రచురణ కార్య నిర్వాహకులుగా పదేళ్ళు పని చేశారు .పిమ్మట మద్రాస్ ప్రాచ్య లిఖిత భాండా గారం ప్రాచీన తాల పాత్ర గ్రంధ సంపాదన శాఖకు అధ్యక్షులుగా ఆరేళ్ళు సేవలందిం చారు .మద్రాస్ ప్రభుత్వ విద్యా శాఖలో చేరి ,రాజ మండ్రి ప్రభుత్వ కాలేజి లో అధ్యాపకులుగా కొంతకాలం ఉన్నారు .అనంతరం తిరుపతి దేవస్థాన విద్యా శాఖాదికారిగా 1935 వరకు కోన సాగారు .మద్రాస్ విశ్వ విద్యాలయ చరిత్ర శాఖలో మెకంజీ రికార్డుల పరిశోధనాలయం లో   ఆరు సంవత్సరాలుఉన్నారు . దశాబ్ద కాలం  తిరుపతి  పరిశోధనాలయ సంస్కృత శాఖలో రీడర్ గా ,ఉండి  కొంతకాలం డైరెక్టర్ పదవినీ చేబట్టారు .

ప్రాచీన  గ్రంధ సేకరణ –పరిశీలన –ముద్రణ

ద్రావిడ ,కన్నడ ,ప్రాచ్య మళయాళాది భాషలలో గొప్ప పాండిత్యం పొందారు .ప్రాచీన సంస్కృత ,ఆంద్ర సాహిత్య మన్నా ,ఆ భాషా చరిత్ర విమర్శా పరిశీలనం అన్నా కవి గారికి పరమ ప్రీతి .ప్రాచీన గ్రంధ సంపాదనకోసం  పరిశీలనకోసం ఏంతో స్వంత ధనాన్ని వెచ్చించిన సాహితీ ప్రియులు .ప్రాచీన గ్రంధ పరిశీలన ,సంస్కరణ లలో శబ్దార్ధ స్వరూప నిర్ణయం లో వీరి ప్రజ్ఞ సునిశితమై అనితర సాధ్యమైనది .సంస్కృతాంధ్రాలలో సరస సహజ సుందరం గా కవిత్వం చెప్పే నేర్పు కవి గారిది .బహు శాస్త్రాలలో వీరి  ప్రవేశం,పాండిత్యం  మహా విశేషమైనవి .సౌజన్యం ,సహృదయత కవిగారికి సహజాతాలు .వన పర్తి  లో  ఉండగా ‘’విస్మ్రుతికవులు ‘’శీర్షిక తో అనేక ప్రాచీన గ్రంధాలను సంస్కరించి ప్రచురించారు .వీటిలో నన్నే చోడుని కుమార సంభవం ,వల్లభ రాయని క్రీడాభిరామం ,మడికి సింగన సకల నీతి సారం ,బద్దె భూపాలుని నీతి శాస్త్ర ముక్తావళి ,భైరవి కవి రాసిన శ్రీ రంగ మహాత్మ్యం ,ప్రబంధ మణిభూషణం ,వేంకటేశ ఉదాహరణం ,ఆంద్ర తిరువాయ్ ,ఉన్నాయి . కవిగారు ‘’దక్షిణ భారత సంస్కృత గ్రంధ మాల ‘’అనే సంస్థను స్థాపించి అతి ప్రాచీన సంస్కృత గ్రంధాలను పరిశీలించి ముద్రించారు .ముద్రించిన వాటిలో దండి రచించిన ‘’అవంతి సుందరి కద‘’,’’చతురర్భాణీ అంటే శూద్రకుని పద్మ ప్రాభ్రుతకం ,ఈశ్వర దత్తుని ‘’ధూర్త విట సంవాదం ‘’,వరరుచి రాసిన ‘’ఉభయాభిసారిక ‘’,శ్యామలకుని ‘’పాద తాడితం ‘’అనే భాణ చతుస్టయం ,భోజుని ‘’శృంగార ప్రకాశం ‘’,దిజ్ఞాగుని ‘’కుందమాల నాటకం ‘’,విజ్జిక రాసిన ‘’కౌముదీ మహోత్సవ నాటకం  ‘’,’’వత్స రాజ చరితం ‘’,.ఇంత శ్రద్ధగా ప్రాచీన గ్రంధాలను సేకరించి పరిష్కరించి పరిశీలించి ముద్రించారు రామ కృష్ణ కవిగారు .సాహిత్య లోకం వారికి ఏంతో రుణ పడిఉంది .

కవిగారి రచనా పాటవం

కవిగారు కొన్ని స్వతంత్ర కావ్యాలు రచించారు .అందులో ‘’మృగవతి –రసవత్కావ్యం ‘’,వసంత విలాసం ‘-,కళా పూర్ణోదయాన్ని పోలిన తొమ్మిది ఆశ్వాసాల ఉత్తమ కావ్యం అముద్రితం .’’పాటలీపుత్రకం ‘’అనేది మరొక పద్య కావ్యం .’’కలింగ సేన ‘’,మాలతీమాధవం ‘’,అనేవి ప్రకరణాలు .భరతుని నాట్య శాస్త్రాన్ని అభినవ గుప్తాచార్యుల వ్యాఖ్యానం తో పరిష్కరించి గైక్వాడ్ ఓరిఎంటల్ గ్రంధ మాలలో మూడు భాగాలుగా ప్రచురించారు .ఇంకో భాగం అముద్రితం గానే ఉండిపోయింది .ఇది కవిగారి నాట్య శాస్త్ర జ్ఞానానికి ,సర్వం కష ప్రజ్ఞకు ఉదాహరణ .అలాగే ‘’భారత కోశం ‘’అనే మరో అపూర్వ గ్రంధం లో నాట్య శాస్త్ర సంబందాలైన పదాలన్నిటినీ అర్ధ వివరణ తో ,లక్షణ ఉదాహరణలతో అకారాదిక్రమం గా కూర్చారు .జ్ఞాన వయో వృద్ధులైన కవిగారు రాసిన  ఈ గ్రంధాన్ని  తిరుపతి దేవస్థానం ప్రాచ్య పరిశోధనాలయం ముద్రించి గౌర వించింది.

కవిగారు భాస నాటకాలను కొన్నిటిని అనువదించారు .ఇవికాక ఇంకా చాలా గ్రంధాలను రాశారు .కవి గారు సేకరించి సంస్కరించిన అనేక సంస్కృత గ్రందాలెన్నో ఇంకా అముద్రితాలుగానే ఉండిపోవటం బాధాకరం .ఇంత సరస్వతీ సేవ చేసిన కవి గారికి లక్ష్మీ ప్రసన్నం మాత్రం కాలేదు .ఇది లోకం లో సహజమే కదా .జీవిత చరమాంకం లో ఈ పండిత కవి ఆర్ధిక బాధలను ఎదుర్కొన్నారు .ప్రభుత్వం అంద జేసిన ఉపకార వేతనం తో జీవించాల్సి  వచ్చింది పాపం .రామ క్రిష్ణ  కవిగారు పూనుకొని ఉండక పొతే అమూల్య ప్రాచీన గ్రంధాలు వెలుగు చూసి ఉండేవికాదు .తొంభై ఒక్క ఏళ్ళు జీవించిన ఈ సాహిత్యోప జీవి మానవల్లి రామకృష్ణ కవిగారు 21-9-1957లో మద్రాస్ లో మరణించి సరస్వతీ సాయుజ్యంపొందారు

Inline image 1      Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-12-14-ఉయ్యూరు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వణ కవుల కవితా గీర్వాణం -81 – 121-కౌముది పాఠ ప్రవచన శ్రేష్ట –శోంఠీ భద్రాద్రి రామ శాస్త్రి .

గీర్వణ కవుల కవితా గీర్వాణం -81

121-కౌముది పాఠ ప్రవచన శ్రేష్ట –శోంఠీ భద్రాద్రి రామ శాస్త్రి .

తూర్పు గోదావరిజిల్లా పిఠాపురం దగ్గర కొమరగిరి లో శోంఠి భద్రాద్రి రామశాస్త్రిగారు 1850లో జన్మించారు తలిదండ్రులు రంగరామయ్య ,కామాంబ.మాత్రు,పితృ వంశాలలో ఇరువైపులా అపూర్వ పండిత కవులే .శాస్ట్ర నిష్ణాతులే శ్రోత్రియులే నిస్టా గరిస్టూలే .సదాచార సంపన్నులే .కనుక చిన్ననాడే రామ శాస్త్రిగారిక్ ఆంద్ర గీర్వాణాలు సహజం గానే అబ్బాయి .పాండిత్య కవితా ప్రావీణ్యం అలవడ్డాయి .మనోహర కావ్యనిర్మాన నైపుణ్యం ఉభయ భాషల్లోనూ ఇరవై ఏళ్ళకే పట్టు బడింది .

శాస్త్రి గారు కౌముది పాఠ ప్రవచనం లో ఉద్దండులని దేశమంతా మార్మోగింది .తెలుగులోనూ సమానమైన పాండిత్య గరిమ ఉంది .విస్పష్టంగా బోధించే సామర్ధ్యమూ ఉన్నది .ఆంద్ర ప్రబంధాలు రూపకాలు రచించే నేర్పు వచ్చేసింది .ఉర్లాం సంస్థానం లో రాజా మంత్రి ప్రగడ భుజంగ రాయుని ఆస్థాన పండితులయ్యారు .

సంస్కృతం లో అహోబల పండితీయం కు తెలుగులో వ్యాఖ్య రాశారు .లఘుకౌముదిని ఆంధ్రీకరించారు .వసుచరిత్రకు భూమిక రాశారు .సంస్కృతం లో ముక్తావళి అనే రూపకం ,శంబరాసుర విజయం అనే చంపువు ,శ్రీరామ విజయ చంపువు ,రాశారు .స్వీయ తెలుగు కృతులు –కాళిందీపరిణయం,చిత్ర సీమ ,జగన్నాధ క్షేత్ర మహాత్యం ,మల్లికా ,శంతనూపాఖ్యానం ,శివరామ శతకం ,శ్రీ రామ స్తవం  ముక్తావళి నాటకం ,శ్రావణ మహోత్సవ తారావళి .అరవై అయిదేళ్ళు జీవించి భద్రాద్రి రామ శాస్త్రి గారు 1915లో శ్రీరామైక్యమైనారు .

 

122-పండిత ప్రవర –మల్లాది రామ కృష్ణ చయనులు

1885లో మల్లాది రామ కృష్ణ చయనులుగారు గుంటూరు జిల్లా సత్తెన పల్లి లో వెలనాటి బ్రాహ్మణ కుటుంబం లో రాఘవయ్య ,అచ్చమ్మ  దంపతులకు  జన్మించారు .వీరిని హైదరాబాద్ వాస్తవ్యులు దత్తతకు స్వీకరించగా అక్కడ పార్శీ ఉర్దూలను నేర్చుకొన్నారు .గోరంట్లకుతిరిగి వచ్చి సంస్కృత భాష నేర్చారు .కావ్యాలు చదివి అమలాపురం వెళ్లి ఏలేశ్వరపు తమ్మన్న శాస్త్రి గారి దగ్గర కావ్యం నాటకం సాహిత్యం అభ్యసించారు .పేరూరు లో మందా చెన్నయ్యగారి నుండి తర్కం నేర్చారు .పేరి నరసింహ శాస్త్రి గారి వద్ద వ్యాకరణం శ్రీపాద రామ మూర్తి శాస్త్రి గారి దగ్గర ,విజయనగరం లో భీమాచార్యుల వారి దగ్గర తర్కాన్ని మెరుగు పరచుకొన్నారు .ఇరవై రెండవ ఏటనే వాదాలు చేసి పండితులను గెలిచే సామర్ధ్యం పొందారు .అమరావతికి చెందిన గుడి మెళ్ళ వెంకట సుబ్బయ్య గారి కుమార్తె కృష్ణ వేణమ్మను పెండ్లాడారు  .

ఇరవై నాలుగో ఏట మైసూర్  వెళ్లి పజమాని సుందర రామ శాస్త్రి గారి వద్ద  బ్రహ్మ సూత్రా శంకర భాష్యాన్ని చదివివారు. అప్పయ్య దీక్షితులకు తోమ్మిదవ తరం వారైన త్యాగరాజ శాస్త్రి దగ్గర ,కల్ప తరువు ,వ్యుత్పత్తి వాద  వాచాస్పత్యాది గ్రంధాలు చదివారు .

విజయవాడలో నివాసం ఉన్నారు .ముప్ఫై ఆరవ ఏట తిరువయ్యూర్  వెళ్లి స్థల పురాణం బాల కృష్ణ శాస్త్రి గారి వద్ద ఉపనిషద్ భాష్యం  మొదలైనవి నేర్చుకొన్నారు పుష్పగిరి ,హంపి విరూపాక్ష పీఠాలకు ఆస్థాన పండితునిగా నియమింప బడ్డారు .వైదిక  కర్మాను స్టానం వీరు యదా విధి గా పాటించారు .అమరావతిలో జ్యోతి స్టోమం ,బెజవాడలో చయనం చేశారు .అప్పటి నుండి  రామ కృష్ణ చయనులు అయ్యారు

వేదాంత విషయాలను అతి సూక్ష్మగా సూటిగా తేలికగా అర్ధం అయ్యేట్లు చెప్పగల సామర్ధ్యం చయనులుగారిది .మహా వక్తగా విఖ్యాతి పొందారు .వేదాంత ప్రవచనానికి కాశీ పండితులు మెచ్చుకొని  ‘’పండిత ప్రవర ‘’బిరుదు నిచ్చి సత్కరించారు .పంజాబు రాష్ట్రం లో సంచారం చేసి అక్కడి వారిని మెప్పించి ‘’వ్యాఖ్యాన వాచస్పతి ‘’బిరుదును అందుకొన్నారు .బాల బోధిని ,భ్రమ మంజరి అనే వేదాంత గ్రంధాలను సంస్కృతం లో రచించారు .ప్రాయశ్చిత్త పశు విషయక విమర్శ గ్రంధాలనూ మహా భారత కదా తత్వ నిర్ణయం ‘’అనే గ్రంధాన్ని చయనులు గారు రచించారు .డెబ్భై ఆరేళ్ళు జీవించి రామ కృష్ణ చయనులుగారు 1941లో స్వర్గం చేరారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-12-14-ఉయ్యూరు

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -80 – 120-ఖచరమణిపేటికర్త ,సకల శాస్త్రాభిజ్న –అలుకూరు గోల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -80

120-ఖచరమణిపేటికర్త ,సకల శాస్త్రాభిజ్న –అలుకూరు గోల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రి

అలుకూరు మల్లికార్జున శాస్త్రి పాత నిజాం రాష్ట్రం రాయచూరు మండలం అలుకూరు గ్రామం లో వెంకట రామ శాస్త్రులు సుబ్బమాంబ దంపతులకు 1871లో జన్మించారు .వీరిది గోల్లాపిన్ని వంశం .భారద్వాజస గోత్రీకులు .ఆపస్థంభ సూత్రం .వీరి వంశపు వారంతా దిగ్గజాలైన సంస్కృతాంధ్ర కవి పండితులే ,శాస్త్ర నిధులే .ఏడు తరాలకు పూర్వం వీరి వంశం లో మోటప్ప ఆనే ఆయనకు ‘’పల్లెలాంబ ‘’అనే గ్రామ దేవత ప్రత్యక్షమై బంగారు ,పలకా బలపం ఇచ్చి ఆ వంశం లో ఏడు తరాల వరకు అందరూ పండితులే అవుతారని దీవించిందిట .శాస్త్రిగారి భార్య సుబ్బమాంబ .అత్తా కోడళ్ళది ఒకే పేరు అవటం విశేషం .

బాల విద్యా కిశోర

నాలుగవ ఏట వీధి బడికి పంపించారు అ రోజు సాయంత్రమే ఉపాధ్యాయ్డు ఈ బాలుడిని వెంట బెట్టుకొని ఇంటికి వచ్చి తండ్రిగారితో తనకు వచ్చిన విద్య నంతా ఒక్క రోజులోనే ఆ బాలుడు నేర్చేసేడని,ఇక తానూ బోధించటానికి ఏమీ లేదని చెప్పి అప్పగించాడు .అంతటి బాల మేధావి శాస్త్రిగారు .  తండ్రి వెంకట రామ శాస్త్రులుగారి దగ్గరే నాకాంతక సాహిత్యం ,తత్వ బోధినీ వ్యాఖ్యాన సహితం గా కౌముదిని ,న్యాయ వేదాంత శాస్త్రాలను అధ్యయనం చేశారు .తండ్రిగారి వెంట గద్వాల ,వనపర్తి ,ఆత్మకూరు సంస్థానాలను బాల్యం లోనే దర్శించి  తన విద్యా వైదుష్యాన్ని ప్రదర్శించి పండిత బృందం చే మెప్పు పొంది ‘’భారతీ బాల లీలా రూపుడు ‘’అనే బిరుదు పొందారు .

సకల శాస్త్రాభిజ్నులు

తండ్రిగారి మరణం తర్వాత గడేహోతూరు వెంకట రామ శాస్త్రులు గారి వద్ద శిష్యరికం చేసి జ్యోతిష శాస్త్రాన్ని నేర్చుకొన్నారు .కాళహస్తి చేరి విక్రాల  రాఘవాచార్యుల అంతేవాసి అయి మహా భాష్యంత వ్యాకరణం ,ముహూర్త జాతక సిద్ధాంత స్కంద త్రయ జ్యోతిష శాస్త్రాలలో సర్వ ప్రధములుగా ఉత్తీర్ణులైనారు .గురువు రాఘవాచార్యు లవారు’’కన్ను స్వామి ‘’అనే మారు పేరుతొ ‘’indian Ephimeries రాశారు .గురువు గారి అనుమతితో కలియుగం దశ సహస్ర వర్షాల(పది వేల సంవత్సరాలు )కు సరిపడా  తిది ,వార ,నక్షత్ర ,యోగ ,కరణ ,ఘటికా ,విఘటికల ప్రమాణాన్ని అతి వేగం గా అత్యంత సులభం గా బోధించే మహా గ్రంధ రాజం ‘’ఖచర మణి పేటి’’‘’అనే బృహత్తర పంచాంగం రచించి జ్యోతిషం లో కొత్త దారి చూపారు .గురు ఆశీస్సులతో కాళహస్తి దేవాలయం లో నిష్టగా కూర్చుని ‘’శని వర్గు ‘’గుణిస్తుంటే శనీశ్వరుడు ప్రత్యక్షమై నాడు . ఈ గ్రంధాన్ని గురుదేవులకు  అంకిత మిచ్చి  తన గురు భక్తిని చాటుకొన్నారు .శాస్త్రి గారి తమ్ముడు రామ శాస్త్రిగారు గొప్ప సూర్యోపసకులు .సూర్యోదయం నుండి మధ్యాహ్నం పన్నెండుగంటల వరకు సూర్యుని తదేకం గా చూస్తూ ధ్యానమగ్నులై ఉండేవారు .మన శాస్త్రిగారి లాగానే ఆయనా త్రికాలజ్ఞాని .

స్వగ్రామం ఆలూరు కు తిరిగి వచ్చి తాతగారైన సుబ్బా శాస్త్రుల వారి వద్ద సమగ్ర వేదాంత శాస్త్రం నేర్చుకొని ఇరవై వ ఏట విద్యా వ్యాసంగాన్ని ముగించారు .ఇంత పిన్న వయసులో ఇన్ని విద్యలు నేర్వటం ,అన్నిటా ప్రతిభ చూపటం శాస్త్రి గారి ప్రత్యేకత .బళ్ళారి ,కడప వగైరా సంస్థానాలు పర్యటించి  శతావదానాలతో మెప్పించి సన్మానాలు పొందారు .గద్వాల ,వనపర్తి ,ఆత్మ కూరు సంస్థానాలలో తన పాండిత్య ప్రదర్శన తో ఆకర్షించి గౌరవ సత్కారలందు కొన్నారు .

బిరుదులు –సన్మానాలు

కవి సార్వ భౌమ ,సకల శాస్త్రాభిజ్న బిరుదులూ వీరి కవితా ప్రాగాల్భ్యానికి సకల శాస్త్ర పారంగత్వానికి పొందారు .శాస్త్రి గారు ‘వాసు దేవా నంద ‘’అనే అలంకార శాస్త్ర గ్రంధం రచిం చారు .కాని ఇది ముద్రితం కాలేదు కాని ఇది చిత్ర ,విచిత్ర కవితా భాండారం .ఇందులో అమితాస్చార్యపరచేది ‘’సహస్ర దళ పద్మ బంధం ‘’1008దళ పద్మంలో అనేక శ్లోకాలు నిక్షిప్తమైన అపూర్వ సృష్టి .అయిదు వందల శ్లోకాలతో పదహారు ప్రకరణాలతో ఉన్న అపూర్వ గ్రంధం ఇది .ఇందులో ఉన్న నూరు శ్లోకాలతోనే గ్రంధం ప్రచురింప బడింది .దీనిని నలభై రోజుల్లో శాస్త్రిగారు రాశారంటే అమితాస్చర్యం వేస్తుంది ..వివిధ ఛందస్సులతో ‘’పురుషోత్తమ శతకం ‘’రాశారు .’ధర్మ శాస్త్ర రాత్నాకరమూ రాశారు .’పతంజలి భాష్యార్ధం అనే గోప్పరచనా చేశారు .

దీర్ఘ సత్ర యాగం

శాస్త్రి గారు 15-1-1906 తమ స్వగ్రామం అలుకూరు లో ఒక ఏడాది పాటు ‘’దీర్ఘ బ్రహ్మ సత్ర యాగం‘’నిర్వ హించారు .వందలాది పండితులు ,రాజులు ,మంత్రులు  ధన వంతులు ,వేలాది మంది పేదలకు కుల  మత భేదం లేకుండా  అన్న సంతర్పణ జరిగింది .అందరిని సత్కరించి పంపిన రాత్రి శ్రీ విరూపాక్ష స్వామి కలలో కన్పించి’’అవబ్రుధ స్నానం ‘’కాశీ లో చేయమని ఆజ్ఞా పించాడు .బంధు జనం తో కాశీ వెళ్లి ఆ కార్యక్రమం సంతృప్తి గా నిర్వహించి ప్రయాగ ,గయాది క్షేత్ర సందర్శనం చేసి ఇంటికి తిరిగి వచ్చారు .

జగద్గురువుల ఆశీః ప్రశంస

.జ్యోతిష శాస్త్ర సుధర్మ సారం ‘’అనే మరో గ్రందాన్నీ రాశారు .ఆది శంకరాచార్యుల వారి జన్మస్థలమైన కర్నాటక దేశం లోని ‘’కాలడి ‘’గ్రామం లో శృంగేరీ పీఠాదిపతులు శ్రీ నృసింహ భారతీ తీర్ధ స్వాములవారు శంకరా చార్యుల విగ్రహ ప్రతిష్టచేసినప్పుడు జరిగిన పండిత సభలో శాస్త్రి గారు తాను  రచించిన ‘’జ్యోతిష శాస్త్ర సుధర్మ సార’’గ్రంధాన్ని మహా స్వాములకు అంకితమిచ్చారు .ఆ సభలో  జగద్గురువులు ఆ గ్రంధం లోనుండి 2000సంవత్సరంలో స్వామివారు అడిగిన తిదికి పంచాంగ గణన చేయమని సభాసదులను కోరారు .చాలా మంది చెప్పలేమని చేతులెత్తేశారు. కొందరు కనీసం మూడు గంటల వ్యవదికావాలన్నారు .అప్పుడు మల్లికార్జున శాస్త్రి గారు ఇరవై నిమిషాలలో గణన చేసి స్వామివారితో సహా అందరినీ ఆశ్చర్య పరచారు . వీరి విద్వత్తును అభినందించి జగద్గురువులు ‘’పండిత సార్వ భౌమ ‘’బిరుద ప్రదానం చేసి సత్కరించారు .అప్పుడు జగద్గురువులు ‘’ఉపాధి భేదం చేత మీరు అక్కడ .మేము ఇక్కడ .మీరేమేము .మేమే మీరు ‘’అని ప్రశంసించారు .

శాస్త్రి గారి మహిమలు

గద్వాల రాజు రాంభూపాల్ మరణించగా  సంస్థానం పదేళ్లు ‘’కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ‘’ లో ఉంది .అప్పుడు వారసుడైన సీతా రాం మల్లి కార్జునుని శరణు వేడాడు .ఈయన ఏడాది గడువు పెట్టి ,హంపీ విరూపాక్షునికి‘’అగ్ని స్టోమ ,కోటి బిలార్చన చేయ సంకల్పించి అందరి సహకారం తో ఆ పని పూర్తీ చేశారు .గడువు లోపలే సీతా రాం కు గద్వాల రాజ్యం దక్కింది .

ఒక సారి యవ్వనం లో శాస్త్రి గారు ఎండలో నడిచి వస్తున్నాడు .ఒక పేద రైతు కనిపించి వర్షాలే లేవని కరువు తో జనం అలమటిస్తున్నారని చెప్పాడు .’’పెద్ద వర్షం వస్తుంది .ఇంటికి పో ‘’అన్నారు శాస్త్రి .అంతే కుండ పోత గా వర్షం కురిసింది .ఇంకో సారి స్వగ్రామం బయట ఏటి ఇసుక లో  ధ్యాన నిష్ఠలో ఉండగా విపరీతం గా వర్షం కురిసి ఇసుకలో శాస్త్రి గారు కూరుకు పోయారు  .కొన్ని రోజుల తర్వాత ఆ వాగు ఎండి పోయింది .మంచి నీటి కోసం చలమలు తవ్వు తుంటే శాస్త్రి గారు పద్మాసనం లో అలానే చలించ కుండా కని పించారు .ఏదైనా మహిమ చూప మని ఒక శిష్యులు  అడిగితే ‘’ఒక శివా లయం లో నాలుగు స్తంభాల మద్య శివుడికి ఎదురు గుండా కూర్చొని కనులు మూసు కొని ఒక్క సారిగా శరీరాన్ని గాలి లోకి లేపి, ఆ స్తంభాల మద్య చుట్టూ  వేగం గా గిర గిరా తిరిగి  ,మళ్ళీ కిందికి దిగి శివుని ధ్యానించారు .

 

మరో సారి మల్లేశ్వరాలయం లో బావ మరది దోనే కంటి రామయ్య భాగవతం లో ‘’పురంజనో పాఖ్యానం‘’చదువు తుంటే శాస్త్రి గారు ఆధ్యాత్మ పరం గా వ్యాఖ్యానం చేస్తున్నారు .పూర్తీ అవగానే రామయ్య‘’అంతేనా బావా?’’అన్నాడు .శాస్త్రి గారు ‘’అంతేరా’’అన్నారు .అంతే- రామయ్య వెంటనే లేచి భుజం పై ఖండువా దులిపి  మళ్ళీ బుజం మీద వేసుకొని అదే పోత పోయాడు .తల్లీ, శాస్త్రి  భార్యా మొత్తు కొన్నావెను తిరిగి చూడ లేదు ‘’’’వాడిక రాడు లే అంతే ‘’అని వారికి సమాధానం చెప్పారు  శాస్త్రి .అంటే ఆత్మ బోధ అయిందన్న మాట బావ మరది కి .

శాస్త్రి గారి లీల ఇంకోటి .గద్వాల రాజు మూడు రోజుల పండిత గోష్టి లో ఉండగా ఒక రోజు   నిజాం  ప్రభువు తాను రాయ చూరు వస్తున్నానని తనను అక్కడ కలుసు కోమనిరాజుకు  ఫర్మానా పంపాడు .ఏమి చేయాలో తోచక శాస్త్రి గారిని అడిగాడు రాజు .కంగారేమీ పడక్కర లేదని నిజాం  రాడనీ  రేపే ఆవిషయం తెలుస్తుందని చెప్పాడు ఇరకాటం లో పడ్డాడు రాజు .అనుకోన్నట్లే నవాబు వాడీ వరకు వచ్చే సరికి కడుపు నొప్పి ఎక్కువై హైదరాబాద్ తిరిగి వెళ్లి పొయ్యి నట్లు మర్నాడు వార్త వచ్చింది .అంతటి వస్య వాక్కు శాస్త్రి గారిది .

1917 లో అలుకూరు గ్రామం లో ప్లేగు వ్యాధి విపరీతం గా వ్యాపించింది .శాస్త్రి గారు మల్లికార్జున పుష్కరిణి ని  ‘’అష్ట దిగ్బంధం ‘’చేసి .ఆ నీళ్ళు తాగిన వారికి ప్లేగు రాదనీ చెప్పారు .’’మారికా దేవి‘’ప్రత్యక్షమై అంత కఠోర నియమం పనికి రాదనీ అది తనకే నష్టం అనీ చెప్పింది .అందర్నీ ధర్మవరం పంపించి ,తానొక్కడే ఆ ఊర్లో ఉండిపోయారు ..గ్రామ ప్రజలందర్నీ బయటికి పంపించే శాడు .తాను కుటుంబం తో తుంగ భద్రా నది ఒడ్డున ఉన్న రామా పురం వెళ్లారు .శాస్త్రి గారికి ప్లేగు సోకింది .కుండ పోతగా వర్షం కురుస్తోంది .ఎవరు బయటకు వచ్చే అవకాశం లేదు .శాస్త్రి గారికి సమయం లో వైద్య సాయం అంద లేదు .అంతే 5-9-1917 నాడు చని పోయారు .ధర్మ వరం లో ఉన్న అల్లుడు శ్రీని వాస శాస్త్రి  టెలిగ్రాం చూసి వచ్చాడు .అప్పటికే ఆలస్య మై పోయిందని శవ దహనం చేశారు .చితా భస్మం వర్షపు నీటిలో అంతా కొట్టుకు పోయింది .చితా భస్మం కూడా మిగుల కుండా చేసి ,నలభై ఆరేళ్ళ  వయసులో చని పోయిన మహా జ్ఞాని కవి ,పండిత సార్వ భౌములు అలుకూరు గొల్లా పిన్ని మల్లికార్జున శాస్త్రి గారు

.

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-12-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రామాయణం పాఠ్యాంశంగా ఉండాల్సిందే–డాక్టర్ చెప్పెల హరినాథ శర్మ అధ్యక్షులు, తెలంగాణ ప్రభుత్వ గెజిటెడ్ టీచర్ల సంఘం

రామాయణం పాఠ్యాంశంగా ఉండాల్సిందే

రామాయణం పాఠ్యాంశంగా ఉండాల్సిందే

  • – డాక్టర్ చెప్పెల హరినాథ శర్మ అధ్యక్షులు, తెలంగాణ ప్రభుత్వ గెజిటెడ్ టీచర్ల సంఘం
  • 08/12/2014
TAGS:

దశాబ్దాల కల నెరవేరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. వచ్చిన రాష్ట్రం బంగారు తెలంగాణ కావడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. ఇందులో భాగంగా వివిధ స్థాయిలలో పాఠ్యాంశాల పునస్సమీక్ష జరుగుతోంది. ఇంతకాలం పాటు వివక్షకు గురైన తెలంగాణ ప్రాంత చరిత్రను, తెలంగాణ ప్రాంతానికి చెందిన వీరులు, యోధుల గాధలను, కవులు, రచయితల రచనలను పాఠ్యాంశాలలో చేర్చాల్సి ఉంది. అదే సమయంలో జాతికి నీతినీ, రీతినీ బోధించిన రామాయణ, భారతాలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు పదవ తరగతి తెలుగు ఉపవాచకంగా సులభశైలిలో ఉన్న వచన రామాయణాన్ని బోధిస్తున్నారు. పునస్సమీక్షలో దీనిని ఉంచుతారో లేదో అన్న అనుమానాలు విద్యావేత్తలలోనూ, విద్యాభిమానుల్లోనూ పొడసూపుతున్నాయి. ప్రాథమిక పాఠశాల నుండి పి.జి. వరకు వివిధ స్థాయిలలో ఉపాధ్యాయుడిగా, ఉపన్యాసకుడిగా, అధ్యాపకుడిగా పనిచేసిన నా ముప్ఫయి ఏళ్ల బోధనానుభవంలో రామాయణ, భారత కథాంశాలను బోధిస్తున్నప్పుడు విద్యార్థులు అత్యంత ఆసక్తితో వినడంతోపాటు అభ్యాసన ప్రక్రియలో క్రియాశీలంగా స్పందించడం చూశాను. అందుకే ఇతిహాసాలు పాఠ్యాంశాలుగా ఉండాలన్న ధృఢమైన అభిప్రాయం అనేకమంది విద్యావేత్తలలో ఉంది. మన ముఖ్యమంత్రి కెసిఆర్ తానూ ఎనిమిదవ తరగతిలో చదివిన మహాభారత పద్యాన్ని పలు సభలలో ప్రస్తావించి, తానూ గొప్ప వక్తగా ఎదగడానికి సాహిత్యం ఎలా దోహద పడిందో చెబుతుంటారు. ఇది బాల్యంలో విద్యార్థి చిత్తక్షేత్రాలలో పడే సంస్కార బీజాలు వారి జీవితాలను ఎలా తీర్చిదిద్దుతాయో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ. వాస్తవానికి ఇతిహాసాలు పురాణాలూ కావు, మతగ్రంథాలు అంతకంటే కావు. అవి జాతికి తరతరాల వారసత్వ సంపదగా నిలుస్తున్న తరగని నిధులు, ఎన్నటికీ చెరిగిపోని మానవతా మహోదధులు, సి.జి.యూంగ్ లాంటి ప్రపంచ ఖ్యాతి చెందిన మనస్తత్వ శాస్తవ్రేత్త ఇతిదిహాసాలు ఒక తరం నుండి మరో తరానికి సహజంగా వ్యాపిస్తాయని పేర్కొనడం వాటికున్న ప్రాధాన్యతకు అద్ధం పడుతుంది. భారతీయ సాహిత్యంలో రామాయణ, భారతాలు ఇతిహాసాలుగా బహుళ ప్రజాదరణను పొందాయి. తెలుగు సాహిత్యంలో మార్గదేశీ పద్ధతులతో పాటు వౌఖిక ప్రచారంలో కూడా విస్తృతంగా రామాయణ గాధలు కనిపిస్తాయి. భాస్కర రామాయణం, మొల్ల రామాయణం, రామాయణ కల్పవృక్షం వంటి కావ్యాలు మార్గ పద్ధతిలో వస్తే రంగనాథ రామాయణం వంటి ద్విపద రచనలు దేశీ పద్ధతిలో వచ్చాయి. జనప్రియ రామాయణం, ఉషశ్రీ రామాయణం విశేష ప్రజాదరణ పొందిన విషయం అందిరకీ తెలిసిన సత్యమే. ఇవేకాక ఇంకా అక్షరబద్ధం కాని రామాయణ సంబంధ కథలు గిరిజనులలో వౌఖిక ప్రచారంలో విరివిగా కనిపిస్తాయి. జానపద బాణీలో విదువౌళి శాస్ర్తీ వెలువరించిన తందనాన రామాయణం తెలంగాణ ప్రాంతంలో విశేష ప్రజాదరణ పొందింది. సుమారు ముప్ఫయి ఏళ్ళ క్రితం రేడియోలో ప్రసారమైన ఎమ్మెస్ రామారావు సుందరకాండ ఇప్పటికీ చెవుల్లో మారుమ్రోగుతోంది. అందుకే ఈనాటికీ రామాయణం ఎంత పరిశోధించినా తరగని గనిగా నిలుస్తోంది. మాజీ కేంద్రమంత్రి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్పమొయిలీ లాంటి రాజకీయవేత్త కన్నడ సాహిత్యాన్ని అధ్యయనం చేసి రామాయణ మహానే్వషణం వంటి పరిశోధనాత్మక గ్రంథాలు వెలువరించడం పరిశోధనా రంగంలో ఈ ఇతిహాసానికున్న ప్రాధాన్యతను తెలుపుతోంది.
తెలుగు సాహిత్యంలో మొదటి జ్ఞానపీఠ పురస్కారం కవిసామ్రాట్ విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షానికి లభిస్తే, కన్నడ సాహిత్యంలో కూడా సుప్రసిద్ధ పండితులు కె.వి.పుట్టప్ప రచించిన రామాయణ దర్శానానికే లభించడం రామగాధకు ఉన్న సార్వాకాలీనతకు ఉదాహరణగా చెప్పవచ్చు.
రామాయణం సార్వకాలికమైన, సార్వజనీనమైన మానవీయ విలువలు ప్రబోధించిన విశ్వమానవ మహేతిహాసం. ఈనాటికీ భారతీయులలో అత్యధుకులు రాముడిలాంటి కొడుకు, సీతాలాంటి భార్య కావాలని కోరుకుంటారు. జాతిపిత మహాత్మాగాంధీ సైతం కలలుగన్నది రామరాజ్యం కోసమే గదా! రామాయణం మనిషి మనీషిగా ఎదిగే మార్గాన్ని చూపించింది. ఆదర్శవంతమైన జీవన విధానాన్ని నిర్దేశించింది. వ్యక్తి శ్రేయస్సు కన్నా సమాజ హితమే మిన్న అని బోధించింది. స్వర్గం కన్నా జన్మభూమినే మిన్నగా చూపించింది. బంగారు లంకను కోరుకోవడం కన్నా కన్న నేల ఋణం తీర్చుకోవడమే గొప్ప అన్న సందేశాన్ని జాతికి అందించింది. ఏక పత్నీవ్రతమే శ్రేష్టమని ఎలుగెత్తి చాటింది. మహిళలను అవమానించినా, చెర పట్టాలని చూసినా ఎంతటి వారికైనా పతనం తప్పదని హెచ్చరించింది. జాతి హితం కోసం, దేశ క్షేమం కోసం అల్పజీవులు సైతం ఎలా సహకరించి వచ్చో ఉడుత, జటాయువు, సంపాతి వంటి సజీవ పాత్రల ద్వారా కళ్ళకు కట్టినట్టు చూపించింది.
విచ్చలవిడి శృంగారం అనర్థ హేతువని వేలకోట్లు ఖర్చుచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. సమాజంలో నానాటికీ నైతిక విలువలు లోపిస్తున్నాయన్న భావన సర్వత్రా కనిపిస్తోంది. పాశ్చాత్య విష సంస్కృతీ ప్రభావం, మీడియా, అంతర్జాలాల ప్రభావం పిల్లలను చెడు దారి పట్టిస్తున్నాయన్న వార్తలు విరివిగా వస్తున్నాయి.
మహిళలకు రక్షణ కొరవడిందన్న అంశాన్ని పత్రికలలో వస్తున్న వార్తలు నిరూపిస్తున్నాయి. ఇటీవల మన ముఖ్యమంత్రి మహిళా రక్షణ కోసం హైపవర్ కమిటీ వేసి అధ్యయనం కూడా చేయించారు. ప్రత్యేక చర్యలు కూడా చేపడుతున్నట్టు ప్రకటించారు. వీటితోపాటు ఏక పత్నీవ్రతం ప్రబోదించిన రామాయణ గాధను ఉత్తర కౌమార దశలో ఉన్న విద్యార్థులకు బోధించడం ఎంతో ప్రయోజనకారి కాగలదు. పర స్ర్తిని తల్లితో సమానంగా చూడాలని సందేశమిచ్చిన రామాయణం, చెడు తలపెడితే సోదరున్ని అయినా సరే వదిలిపెట్టి ధర్మం పక్షాన నిలబడి పోరాడాలని చెప్పిన గాధను వివిధ స్థాయి విద్యార్థులకు పద్య, గేయ, వచన రూపాలలో అందించవలసిందే. తెలంగాణ కోసం పరితపించిన ప్రొఫెసర్ జయశంకర్, పేదల పక్షాన నిలిచి పోరాడిన కొమురం భీమ్, చాకలి ఐలమ్మ, శ్రీకాంతాచారి వంటి మేధావులు, యోధులు, త్యాగధనుల చరిత్రలు ఎంత ముఖ్యమో, విశ్వమానవాళి మహేతిహాసంగా ప్రపంచ వ్యాప్తంగా కీర్తింపబడిన రామకథ కూడా అంతే ముఖ్యం. అంతేకాకుండా తెలంగాణ ప్రజానీకానికి భద్రాచల రాముడితో, రామదాసు కథతో ఎంతో భావాత్మక సంబంధం ఉంది. నవాబుల కాలం నుండి భద్రాచలంలో జరిగే రామకల్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు పంపే సంప్రదాయం ఈ ప్రాంత మతసామరస్యానికి ప్రతీకగా చెప్తారు. తెలంగాణ ఉద్యమంలోనూ, రాష్ట్ర విభజన సమయంలోనూ ఇక్కడి ప్రజలు భద్రాచల రాముడిని దక్కించుకోవడానికి ఏ రకమైన భావావేశంతో పోరాడారో అందరికీ తెలుసు.
రామాయణం ఒక నీతి, రామాయణం జన జీవన రీతి. ప్రపంచీకరణ క్రమంలో వెర్రితలలు వేస్తున్న వింత పోకడల నుండి భావితరాన్ని రక్షించే రక్షణ కవచం. అందుకే రామాయణాన్ని పదవ తరగతి ఉపవాచకంగా కొనసాగించాలని ఎస్.సి.ఆర్.టి.కి ఒక విజ్ఞప్తి చేయడంతోపాటు ఆ దిశగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఈ ఏటి మేటి 100 రచనల్లో ఆరు మనవే

ఈ ఏటి మేటి 100 రచనల్లో ఆరు మనవే
ఈ ఏడాది న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఎంపికచేసిన 100 ఉత్తమ పుస్తకాల జాబితాలో ఆరుగురు భారత సంతతి రచయితల రచనలకు స్థానం దక్కింది. ఈ జాబితాలో బోస్టన్‌కు చెందిన ప్రముఖ సర్జన్‌, రచయిత అయిన అతుల్‌ గవాండే, విఖ్యాత చరిత్రకారుడు రామచంద్రగుహ రచనలకు విశేష గుర్తింపు లభించింది. ఆధునిక వైద్యంపై అతుల్‌ రాసిన ‘బీయింగ్‌ మోర్టల్‌: మెడిసిన్‌ అండ్‌ వాట్‌ మేటర్స్‌ ఇన్‌ ది ఎండ్‌’ పుస్తకం నాన్‌ ఫిక్షన్‌ విభాగంలో రెండో స్ధానం సాధించింది. ఈ పుస్తకం వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక ఈ ఏడాది ఎంపిక చేసిన అత్యుత్తమ 10 పుస్తకాలలో ఒకటిగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు ఇటీవల చేసిన షాపింగ్‌లో ఈ పుస్తకాన్ని ఇష్టపడి మరీ కొనటం విశేషం. ఇక బుధవారం విడుదల అయిన రామచంద్ర గుహ తాజా రచన ‘గాంధీ బిఫోర్‌ ఇండియా’ మరో ప్రముఖ రచనగా నిలిచింది. కవిత్వ విభాగంలో ఢిల్లీకి చెందిన అఖిల్‌ శర్మ పుస్తకం ‘ఫ్యామిలీ లైఫ్‌’ ఉత్తమ రచనల్లో ఒకటిగా నిలిచింది. కళ, సాంకేతికత మధ్య సంబంధాన్ని హృద్యంగా వర్ణించిన ‘గీక్‌ సబ్‌లైమ్‌: ద బ్యూటీ ఆఫ్‌కోడ్‌, ద కోడ్‌ ఆఫ్‌ బ్యూటీ’ పుస్తక రచయిత విక్రమ్‌ చంద్ర కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు. ఈ రచనకు ఆయన 1996లో కామన్‌వెల్త్‌ రచయితల బహుమతి పొందారు. ఈ జాబితాలో రచయిత, పాత్రికేయుడైన ఆనంద్‌ గోపాల్‌ అఫ్గానిస్థాన్‌లో అమెరికా యుద్ధంపై రాసిన పుస్తకంతో బాటు 9/11 ఘటన ఆధారంగా కాలమిస్ట్‌, పేరొందిన రచయిత ఆనంద్‌ గిరిధర్‌రాసిన పుస్తకాలకూ చోటు దక్కింది
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చెరుకు ,ఆవరణ కవితలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బోయలె తోలి తెలుగు చోళులు -భీమనాధుని శ్రీనివాస్ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వివాదాస్పదుడు యు ఏ అనంతమూర్తి -నందన రెడ్డి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

216అడుగుల రామానుజా చార్య విగ్రహం ,మరో విజయవంత క్షిపణి ప్రయోగం ,జాతీయ గ్రంధం గా భగవద్గీత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముఖ కాంతి నిచ్చేది బొట్టు

ముఖ కాంతి నిచ్చేది బొట్టు

           అడకైనా మగకైనా నిజం ఇది ఒట్టు 
            మన సంస్క్రుతికిది అవుతుందిది తొలి మెట్టు
             అందమే కాదు ఆయుస్సునీ పెంచేది బొట్టు 
             సంస్కారానికీ అవుతుంది పెట్టుకొంటే  హిట్టు . 
             గబ్బిట దుర్గా ప్రసాద్ -7-12-14-ఉయ్యూరు
Posted in కవితలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -79 -119-సంస్కృత హరికధలు రాసిన –బంకుపల్లి మల్లయ్య శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -79

119-సంస్కృత హరికధలు రాసిన –బంకుపల్లి మల్లయ్య శాస్త్రి

బాల్యం –విద్యాభ్యాసం

ఆరామ ద్రావిడ శాఖకు చెందిన బంకుపల్లి మల్లయ్యశాస్త్రి గారు 1876 లో గంగన్న ,సూరమ్మ దంపతులకు ఉర్లాం సంస్థానం వారి ఆశ్రమం లో జన్మించారు .భారద్వాజస గోత్రీకులు .బాల్యం ఉర్లాం లోనే గడిచింది .బళ్ళమూడి లక్ష్మణ శాస్త్రి గారి దగ్గర కావ్య ,నాటక అలంకార సాహిత్యాలలో ప్రజ్ఞ సాధించారు .పిమ్మట టుని సంస్థాన పండితులు ,షడ్దర్శన ప్రవీణులు మహా మహోపాధ్యాయ పరవస్తు రంగా చార్యుల వద్ద శిష్యులై వ్యాకరణ శాస్త్రం నేర్చారు .ఉర్లాం ‘’శ్రావణి’’వారి పరీక్ష రాసి  పండిత సత్కారం పొందారు .తర్వాత విజయనగర పండితులు ,తర్క వేదంత పారం ఎరిగిన కూరెళ్ళ సూర్య నారాయణ శాస్త్రి గారి  అంతేవాసియై భాష్యాంతం ,తర్కం అభ్యసించారు .భార్య చనిపోవటం తో కొంత వైరాగ్య భావన ఏర్పడింది .

సకలకళానిది

బంకుపల్లి కామ శాస్త్రి గారి వద్ద మంత్రం శాస్త్రం నేర్చుకొన్నారు .భువనేశ్వరీ మంత్రం దీక్ష గురువు గారి వద్ద తీసుకొని అనుస్టింఛి సిద్ధి సాధించారు .1897 లో శ్రీకాకుళం ఉన్నత పాఠశాల లో తెలుగు పండితులుగా ఉద్యోగించారు . విద్య నేర్పటం కన్నా విద్య నేర్వటం పైన శాస్త్రి గారికి ఆసక్తి మెండుగా ఉండేది .భల్ల మూడి దక్షిణా మూర్తి శాస్త్రి గారి దగ్గర పంచ దశ ప్రకరణం  ,గీతాభ్యాసం పూర్తీ చేశారు .తర్వాత శ్రీ కూర్మం వెళ్లి నౌడూరి వెంకట శాస్త్రి గారి నుండి మనోరమ ,పరిభాషేందుశేఖరం ,మొదలైన శాస్త్ర గ్రందాధ్యయనం చేశారు .భాష్యాంతము ,వ్యాకరణం బోధించే సామర్ధ్యాన్ని పెంపొందిం చుకొన్నారు .

పర్లాకిమిడి ఉన్నత పాఠశాల లో ఆంద్ర పండితులుగా రెండేళ్ళు పని చేసి ,రాజావారి అనుగ్రహ పాత్రులై పర్లాకిమిడి సంస్థాన పండితులుగా తర్వాత సంస్కృత ఉపన్యాసకులుగా నియమింప బడి గౌరవం పొందారు .ఇంతటితో సంతృప్తి చెందితే వారు బంకుమల్లి వారు అనిపించుకోరు .చదువుపై మంచి’’ మంకు పట్టు ‘’ఉండేది బంకుపల్లి వారికి .ఆస్థాన దైవజ్ఞులు నీల మణిపాణిగ్రాహి గారి వద్ద జ్యోతిష శాస్త్రం అభ్యసించారు .సూర్య సిద్దాంతం అను సరించి దృక్ సిద్ధాంత పంచాంగం గణించే నేర్పు సాధించి పంచాంగ రచన చేశారు .దీనితోనూ ఆగలేదు .గంటి సూర్య నారాయణ గారి దగ్గర వేదాంత ,మీమాంసా శాస్త్రాలు చదువుకొన్నారు .ఇంతటితోనూ ఆగలేదు .గిడుగు రామ మూర్తి గారి వద్ద ఆంగ్ల భాషాజ్ఞానమూ పొందారు .అయినా వీరి విజ్ఞాన తృష్ణ తీరలేదు .పోకల సింహాచలం గారి వద్ద సంగీతం నేర్చుకొన్నారు .శాస్త్రి గారి లయజ్ఞానం ఆది భట్ల నారాయణ దాసు గారినే ఆశ్చర్య పరచింది .

నిత్య నేర్వరి

నేర్వటం అనేది శాస్త్రి గారికి ఒక సద్గుణ వ్యసనం అయింది .భారత రామాయణాలను ,వసు చరిత్రాది ప్రబంధాలను ‘’పురాణ హరి కధ ‘’పేరు తో  నృత్యం ,గీతం ,తాళ,లయ బద్ధం గా పాడి ఆంద్ర దేశం లో పల్లె పట్టణం అనే తేడా లేకుండా తిరిగి పాడి ప్రదర్శించి పండిత పామర రంజనం చేశారు .పర్లాకిమిడి రాజా వారు స్థాపించిన ‘’నాటక సంఘం ‘’సభ్యులై సంస్కృతాంధ్ర నాటకాలలో పాత్ర ధారులై రసజ్ఞుల మన్ననలు అందుకొని నటనలోను తన కళా విశ్వ రూపాన్ని ప్రదర్శించారు .శాస్త్రి గారు సకల కళా వల్లభులని పించుకొన్నారు .ఇంతటి ఉపజ్న ఇన్ని విషయాలలో ప్రదర్శించిన వారు దాదాపు లేనే లేరని ఘంటా పధం గా చెప్ప వచ్చు .

ఆచరణ సంస్కర్త

సనాతన ధర్మాను రక్తులైన శాస్త్రి గారు గొప్ప సంస్కార వంతులు .ధర్మ శాస్త్రాన్ని మదించిన వీరు రజస్వలానంతర వివాహం ,హరిజనోద్యమం ,విధవా పునర్వివాహం శాస్త్ర  సమ్మతాలే నని పండిత సభలలో వాదోపవాదాలు చేసి దక్షిణ దేశమంతా ప్రచారం చేసి ఆధునిక భావాలకు అండగా నిలిచారు .పండితులతో చర్చించారు .వారిని మెప్పించారు ,ఒప్పించారు .వివాహ తత్త్వం ,అస్పృశ్యత అనే గ్రంధాలు తెలుగులో రచించి జనసామాన్యానికి ధర్మ రహస్యాలు తెలియ జేశారు .శాస్త్రి గారు అనర్గళం గా అసాదారణంగా యుక్తి యుక్తం గా చాతుర్యం గా సంస్కృతాంధ్రాలలో సంభాషించే మహా వక్త కూడా .    శాస్త్రి గారు మాటల మనిషి మాత్రమె కాదు చేతల మనిషి కూడా. అదే వారి విశిష్ట వ్యక్తిత్వం .స్త్రీ  పునర్వివాహం మొదలైన ఆదర్శాలను ప్రచారం చేయటమే కాదు తన కుమార్తెకు కూతురికి సంస్కరణ వివాహాలు జరిపించిన గొప్ప సంస్కార వంతులు .’’అధీతి బోదా చరణ ప్రచారం’’ తో జీవితాన్ని సార్ధకం చేసుకొన్న పుణ్య మూర్తి శాస్త్రి గారు .పండిత దిగ్గజం అని ప్రశంసింప బడ్డారు .

గ్రంధ రచన

కావూరి వినయాశ్రమం వారి ప్రేరణ తో విద్యారన్యుల భాష్యానికి అనుగుణం గా నాలుగు వేదాలను ఆంధ్రీకరించిన  అసాధ్య రచయిత.వీటిలో ఋగ్వేదాన్ని ఆశ్రమం వారి ముద్రించారు .వీరివి అముద్రిత గ్రందాలెన్నో ఉండిపోయాయి .వీటిలో అరవిందుని పురుషోత్తమ తత్త్వం ,ఆధారంగా భగవద్గీత పై రాసిన ‘’గీతా రహస్యం ‘’,అనేగ్రంధం ,సాహిత్య దర్పణానికి ఆంధ్రాను వాదం ఉండటం ఆంధ్రులు చేసుకొన్నా దురద్రుస్టమేమో ?.శాస్త్రిగారు ఎన్నో యక్షగానాలు రాశారు .వాటిలో పర్లాకిమిడి రాజ వారికి అంకితమిచ్చిన –చైతన్య చరిత్ర ,ముద్దాడ వెంకటప్పల నాయనకు అంకితం చేసిన రుక్మిణీ కళ్యాణం ముద్రణా భాగ్యానికి నోచుకోవటం మన  అదృష్టం .కంస వధ ,కృష్ణ జననం ,రామ కృష్ణ పరమ హంస చరిత్ర మొదలైనవి అచ్చు అవ్వాల్సినవి .

సంస్కృత హరికధలు

సంస్కృతం లో సీతా కల్యాణం ,జానకీ వహ్ని ప్రవేశం అనే హరికధలు రాసి ,చెప్పి ‘’చీకటి సంస్థానాదిపతులచే’’ ‘’పురాణ వాచస్పతి’’ బిరుదు పొంది భూరి బహుమతు లందు కొన్న పౌరాణిక విద్వాంస కవి శాస్త్రి గారు .భార్యా సమేతం గా కాశీ యాత్ర సంపూర్తి చేసి తిరిగి వస్తూ ఈ విద్వాన్మణి బంకుపల్లి మల్లన్న శాస్త్రి గారు ఖర్గ పూర్ లో అకస్మాత్తుగా డెబ్భై వ ఏట మరణించి తీరని లోటును సంస్కృతాంధ్ర సాహిత్యానికి కలిగించారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-12-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -78 – 118-భారతీయ గణిత శాస్త్రాన్ని కొత్త మలుపు త్రిప్పిన జగద్గురు –శ్రీ భారతీ కృష్ణ తీర్ధజీ మహారాజ్

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -78

118-భారతీయ గణిత శాస్త్రాన్ని కొత్త మలుపు త్రిప్పిన జగద్గురు  –శ్రీ భారతీ కృష్ణ తీర్ధజీ మహారాజ్

జననం విద్యాభ్యాసం

 

వెంకట రమణ అనే పేరు తో 1884 లో జన్మించిన భారతీ కృష్ణ స్వామీజీ  తండ్రి  నరసింహ శాస్త్రి మద్రాస్ రాష్ట్రం లోని తిన్నె వెళ్లి లో తహసీల్దార్ గా పంచేశారు .పదోన్నతి పొంది డిప్యూటీ కలెక్టర్ గా రిటైర్ అయ్యారు .తిన్నె వల్లి  తిరుచిరాపల్లి లోనే వెంకట రమణ కాలేజీ విద్యా భ్యాసం పూర్తీ చేశారు .1899 లో మద్రాస్ యూని వర్సిటీ నుండి మెట్రిక్ పరీక్ష సర్వ ప్రధములు గా  పాసైనారు .వీరి సంస్కృతా పరిజ్ఞానాన్ని వక్తృత్వ పాటవాన్ని  గుర్తించిన మద్రాస్ సంస్కృత సంస్థ ‘’సరస్వతి ‘’బిరుదును అందించి గౌరవించి సత్కరించింది .

వెంకట రమణ శ్రీ వేదం వెంకట రాయ శాస్త్రి గారి వద్ద సంస్కృతం అధ్యయనం చేశారు .తర్వాత బి ఏ .సర్వ ప్రధములుగా పాసై ,బొంబాయి లో ‘’అమెరికన్ కాలేజ్ ఆఫ్  సైన్సెస్’’నిర్వహించిన ఏం.ఏ.పరీక్ష లో  , ఉత్తీర్ణత సాధించారు .ఇరవై ఏళ్ళ వయసులో 1904 లో మరికొన్ని సబ్జెక్టులు సంస్కృతం ,తత్వ శాస్త్రం ,ఇంగ్లీష్ ,గణితం చరిత్ర లలో ఏం ఏ.పరీక్ష రాసి అన్నిటా సర్వ ప్రధములుగా ఉత్తీర్ణులయ్యారు .తత్వ శాస్త్రం ,సనాతన ధర్మం ,సామాజిక శాస్త్రం ,చరిత్ర ,రాజనీతి శాస్త్రం ,సాహిత్యం మొదలైన పలు విషయాలపై వెంకట రమణ రాసిన వ్యాసాలను చదివి అయన అవగాహనా పటిమకు అబ్బురపడి W..T.Stead పండితుడు ‘’రివ్యూ ఆఫ్ రివ్యూస్ ‘’లో 1905లో ప్రచురించాడు .

ఉద్యోగం –యోగ సాధన –

1905 లో గోపాల కృష్ణ గోఖలే మార్గ దర్శ కత్వం లో వెంకట రమణ జాతీయ విద్యా ఉద్యమం లో పాల్గొన్నారు .ఆడి నుండి ఆధ్యాత్మిక విద్య లో ఆసక్తి ఉన్న వెంకట రమణ 1908లో శృంగేరీ పీఠాదిపతి జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామిని వారిని సందర్శించారు . తర్వాత రాజ మండ్రి జాతీయ కళా శాలకు మొట్ట మొదటి ప్రిన్సిపాల్ గా నియమింప బడి 1911వరకు పని చేశారు .పదవికి రాజీనామా చేసి శృంగేరీ పీఠం చేరి  జగద్గురువుల వద్ద వేదాంత విద్యనూ అభ్యసిస్తూ అరణ్య వాసం చేస్తూ ,యోగ సాధనలో ఎనిమిదేళ్ళు గడిపారు .

పీఠాదిపతిత్వం

పూనా బొంబాయి ,అలమనేరు మొదలైన చోట్ల ‘’శంకర దర్శనం ‘’పై ధారావాహిక మహోపన్యాసాలు చేశారు .1919జులై నాలుగున వారణాసి శారదా పీఠం లో జగద్గురువులు స్వామి త్రివిక్రమ తీర్ధజీ మహా రాజా గారి వద్ద సన్యాస దీక్ష గ్రహించి ‘’స్వామిశ్రీ భారతీ కృష్ణ తీర్ధ జీ మహా రాజా’’గా ప్రసిద్ధిపొందారు .1921లో  శారదా పీఠాన్ని అధిస్టిం చారు .వెంటనే భారత దేశ యాత్ర మొదలు పెట్టి సనాతన ధర్మం పై ఉపన్యాస పరంపర నిచ్చారు .1925లో గోవర్ధన పీఠాదిపతి పదవి స్వీకరించారు .

గణిత శాస్త్రం లో గణనీయ కృషి-వేద గణిత పిత

ప్రాచీన భారతీయ విజ్ఞానం లో స్వామీజీ కృషి గణ నీయమైనది .వారి గణిత శాస్త్ర సేవ చిరస్మరణీయం .వేదాలను వేదాంగాలను శాస్త్రీయ దృక్పధం తో పరి శోధించి’’ అధర్వణ వేదానికి అను బంధం ‘’ నిర్మించారు .గణిత శాస్త్రానికి సంబంధించిన 16 సూత్రాలను పునర్నిర్మించారు .ఈ సూత్రాల సహాయం తో పెద్ద పెద్ద లెక్కలను మానసికం గానే గణన చేసి జవాబులు తెలుసుకొనే వినూత్న ప్రక్రియను స్వామీజీ ఆవిష్కరించారు .అంక గణితం బీజ గణితం ,కలన గణితం (కాల్క్యులస్)అవకలన సంకలనాల లో ఎన్నో గణిత సమస్యలకు ,,5,10,15,40  వరకు సోపానాలు చేయటానికి బదులు ఒకే పంక్తి లో చేసే పద్ధతులను సోదాహరణం గా స్వామీజీ వివరించారు .

ప్రధాన సంఖ్యలన్నిటికి పాజిటివ్ నెగటివ్ ఆస్క్రు లేటర్స్(ధన ,రుణ వేస్టనం ) తో భాజనీయతా నికష అంటే డివిజబిలిటీ టెస్ట్ ను సూచిం చారు .అంటే గణిత శాస్త్రాన్నిఅత్యంత ఆకర్షణీయం గా ,ఆసక్తి దాయకం గా అతి సులభంగా తయారు చేశారన్న మాట .దీనితో గణిత శాస్త్రాన్ని ఒక కొత్త మలుపు త్రిప్పిన ఘనత కృష్ణ తీర్ధ స్వామీజీ కే దక్కింది .ఏదో పుస్తకాలు రాసి కూర్చో కుండా వీటిని విద్యార్ధులకు,ఉపాధ్యాయులకు ,ఆచార్యులకు విద్యాలయలో కాలేజీలలో విశ్వ విద్యాలయాలలో బోధింఛి చక్కని అవగాహన కల్పించి స్పూర్తినిచ్చారు .అందుకే స్వామిని ఫాదర్ ఆఫ్ వేద గణిత అంటే వేద గణిత పిత అంటారు

గ్రంధ రచన

1958 ఫిబ్రవరి లో స్వామీజీ అమెరికా ,కెనడా దేశాలు పర్య టించి ఉపన్యాసాలిచ్చారు .స్వామీజీ రాసిన భక్తీ శ్లోకాల సంఖ్య 3,000లకు పైనే ఉన్నాయి వీటిని సంకలనం చేసి ప్రచురించారు .సనాతన ధర్మం పై స్వామి కృష్ణజీ  రాసిన గ్రంధాన్ని బొంబాయ్ భారతీయ విద్యా భవన్ ప్రచురించింది .వీరి ప్రసిద్ధ గణిత గ్రంధం ఆంగ్లం లో రాసిన ‘’వేదిక్ మేధ మాటిక్స్ ‘’.దీన్ని వీరి మరణాంతరం ధిల్లీ లోని మోతీలాల్ బనార్సి దాస్ వారు  ముద్రిం చారు .అపూర్వ భారతీయ విజ్ఞాని ,గణిత మేధావి ,సనాతన సారధి -జగద్గురు శ్రీ భారతీ కృష్ణ తీర్ధజీ మహారాజ్

డెబ్భై ఆరేళ్ళ వయసులో నిర్యాణం చెంది శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధికి చేరుకొన్నారు .

Inline image 1    Inline image 2  Inline image 3

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-12-14-ఉయ్యూరు

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -77

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -77

116-షడ్దర్శన తత్వావ గాహి –ముడుంబై నరసింహా చార్య స్వామి

1842లో పాలకొండ దగ్గర అచ్యుతాపురం లోముడుంబై నరసింహా చార్యులు జన్మించారు .తండ్రి రాఘవాచార్యులు తల్లి గంగమాంబ .చిన్నతనం లోనే తండ్రి చనిపోగా తాతగారి వద్ద కావ్యాలను దర్శన శాస్త్రాలను చదువుకొన్నారు. మరుగంటి కూర్మాచార్యుల దగ్గర ఆంధ్ర వ్యాకరణం చందోరీతులను అభ్యసించారు .తెలుగు కవిత్వం లో అసమాన ప్రతిభను చూపారు .తాతగారి మరణం తర్వాత ఇరవై ఏళ్ళ వయసులోనే తమ్మునితో కలిసి దక్షిణ దేశ యాత్ర  చేసి దివ్య క్షేత్రాలన్నిటిని దర్శించారు .ఆయా దేవస్తానాలలోని పండితులను తన కవనం పాండితీగరిమలచేత మెప్పించి సత్కరాలందు కొన్నారు .

గొట్టు ముక్కల కృష్ణం రాజు సహాయం తో విజయ నగర రాజు ఆనంద గజపతి సంస్థానం దర్శించారు .తన ఆంద్ర గీర్వాణ కవితా పాటవాన్ని రాజుగారి ముందు ప్రదర్శిం చారు . వీరి ఉభయ భాషా పాండిత్యం  అద్వితీయ కవితా వైభవం రాజుగారి మెప్పును పొందాయి ఘన సన్మానం అందుకొన్నారు .విజయనగరం లో  . నివాసం ఉన్నారు .రోజూ రాజాస్థానానికి వెళ్లి వచ్చేవారు .రాజు గారి తండ్రి విజయ రామ గజపతి సన్నిధిలోఒక రోజు ఆనంద గజపతి గారు మన కవిని సభకు పరిచయం చేశారు . ఆ రోజు  శ్రీ   కృష్ణ లీలా మహోత్సవం జరిగింది .అప్పుడు ఆచార్యుల వారు ఆశువుగా చెప్పిన పద్యానికి రాజుగారి తండ్రి విజయ రామ గజపతి   మెచ్చి ప్రతినెల భ్రుతిని ఏర్పరచి  ఆస్థా న కవిగా నియమించారు .

ఆచార్యుల వారు వేద వ్యాస మహర్షి గూర్చి నలభై రోజులు పంచాగ్ని మధ్యమం లో తపస్సు చేశారు .వ్యాస మహర్షి సాక్షాత్కరించి ఆర్ష ప్రతిభను ప్రదానం చేశాడు .అప్పటినుండి నరసింహాచార్య స్వామి అయ్యారు ..ప్రభువుకు స్వామి గారిపై అమిత గౌరవ ఆదరాలుం దేవి

వ్యాసుడు ప్రసాదించిన బుద్ధి కుశలత వలన దర్శనాలన్నిటికి విపుల విశేష వ్యాఖ్యానాలు రచిం చారు .దీనితో వీరి అసామాన్య ప్రతిభా విశేషాలను గుర్తించిన ప్రభువు  సన్నిధి లోని విద్వత్ పరి షత్తు కు అగ్రాసనాదిపతిని చేశారు .1873లో ప్రభువు ఆనంద గజ పతి రాజు కాల ధర్మ చెందారు .ఆచార్యుల వారికి ఉత్సాహం అంతా నీరుకారిపోయింది .

సదా భగవధ్యానం లో కాలం గడిపేవారు .భగవద్ వాజ్మయ సృష్టికి ఉపక్రమించారు .అమూల్య గ్రంధాలను రాసి ప్రచురించారు .అసం ప్రజ్ఞాత యోగ ఫలం గా ఆచార్య స్వామి శేష జీవితాన్ని గడిపారు .నిత్య భగవత్ సాక్షాత్కారం పొందిన మహా యోగ శ్రేస్టూలు స్వామీజీ .వేదాంత దర్శన శాస్త్రాలను శిష్యులకు నిరంతరం బోధిం చేవారు .స్వంత ముద్రణాలయాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. మూడవ కూతురు పర్య వేక్షణలో తాను రాసిన గ్రందాలన్నిటిని ముద్రించారు .సర్వ దర్శనాలకు ఆచార్య స్వామి రాసిన వ్యాఖ్యానాలు యాభై కి పైనే ఉన్నాయి .సంస్స్కృత కావ్యాలు చంపువులు ,నాటకాలు రాశారు .తెలుగులో ‘’ముగ్ధ శృంగారం ‘’,ప్రౌఢ శ్రుంగారం ‘’,’’సంకీర్ణ శ్రుంగారం ‘’కామినీ దుస్ట శ్రుంగారం ,’’అంగ శ్రుంగారం ‘’రాశారు .

నృసింహా చార్య స్వామి పదహారవ ఏట రచించిన రుక్మిణీ కృష్ణుల విప్రలంభ శృంగారాన్ని వర్ణించే ‘’రంగేశ శతకం ‘’లోని ప్రతిపద్యం అమృత రస బిందువే .మొత్తం కావ్యం అమృత  సింధువే.ఒక రస పేటికే.ఇందులోని ఒక తెలుగు పద్యానికి వీరే సంస్కృతం లో రాసిన ఒక శ్లోక వైభవం చూద్దాం –

‘’తన్వంగీ కుసుమాస్త్ర ఝాంకరణ వజ్జ్యా దూత చాతూశుగాత్ .-భీతా ‘’కిం శరణం భావే దిహ మమే ‘’త్వాలోచ్య నద్యాం జనేః

సాకం జాత మ వేత్య పద్మమ భజత్ ,తడ్బాధాతే హంత తాం –‘’జ్ఞాతిస్చేదన లేన కిం’’ వచ  ఇదం స్వార్ధాత్ కదం స్స్ఖ్రలేత్ ‘’.

తొంభై  రెండేళ్ళ నిండు జీవితాన్ని అనుభ వించి ఆచార్య శ్రీ 1924లో వ్యాస సన్నిధికే చేరుకొన్నారు .

 

117-అజాత శత్రువు- పళ్ళేపూర్ణ ప్రజ్ఞాచార్యులు

ఆంద్ర ఆస్థానకవి శ్రీ కాశీ కృష్ణాచార్యుల వారి అల్లుడుగారు పళ్ళేపూర్ణ ప్రజ్ఞాచార్యులు .ఆ పేరుకు అన్నివిధాలా సార్ధకతను సాధించిన విద్వత్కవి వరేన్యులు .15-6-1897న  నెల్లూరు  జిల్లా కోవూరు దగ్గర సంగం లో జన్మించారు .అనేక చోట్ల విద్య నభ్యసించారు .వేదుల సూర్య నారాయణ శాస్త్రి ,నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి ల వద్ద వ్యాకరణం చదివారు వేమూరి రామ బ్రహ్మం ,దెందులూరి పానకాల శాస్త్రుల దగ్గర తర్కాన్ని అభ్యసించారు .ఈ శాస్త్రాలలో గురువును మించిన శిష్యుఅలని పించుకొన్నారు.గురుకుల విద్య చాలా క్లిస్టతరంగా సాగింది .

ఆచార్యుల వారు చివరికి గుంటూరు లో స్తిరపడ్డారు .కాశీ కృష్ణా చార్యుల  వారివద్ద కావ్యాలంకార ,వేదాన్తాలను నేర్చుకొన్నారు. కాశీ వారి అల్లుడై ‘’ఆంద్ర కాదంబరి’’ కావ్యం రాసి మామ గారికి అంకిత మిచ్చి ఋణం తీర్చుకొన్నారు .1916నుండి ఇరవై ఏళ్ళు గుంటూరు టౌన్ హైస్కూల్ ,1937నుండి మరో ఇరవై ఏళ్ళు గుంటూరు హిందూ కాలేజి లోను సంస్కృత ఉపాధ్యాయ ,అధ్యాపకులుగా పని చేసి పదవీ విరమణ చేశారు .తర్వాత కే వి కే .సంస్కృత కళాశాలలో ,సంస్కృతాంధ్ర పండితులుగా సేవలందిం చారు .

భాష్యాంత వైదుష్యం తో శోభిల్లిన ఆచార్యుల వారికి ఇసుమంతైనా అసూయ కాని గర్వం కాని లేక పోవటం మహా విశేషం .జీవితం అంతా ‘’పఠన ,పాఠనాలకే ‘’అంకితం చేసిన విద్వన్మూర్తి ఆచార్యుల వారు .ఆకాలం లో కొప్పరపు కవులకు తిరుపతికవులకు కవితా స్పర్ధలు తార స్థాయిలో ఉండేవి .పూర్ణ ప్రజ్ఞా చార్యుల వారు మాత్రం ఏ ముఠాకూ చెందకుండా సమకాలీన సాహితీ లోకం లో ‘’అజాత శత్రువు ‘’గా నిలిచారు .

ఆచార్యులవారు యెంత ప్రాచీన సంప్రదాయ వాదులైనా నవీనతను కాదనలేదు .మామగారు కృష్ణా చార్యుల వారితో కలిసి అష్టావధాన శతావధానాలను జంట వదానాలుగా  నిర్వహించారు .తానూ స్వయం గా కూడా అవధానాలు చేశారు .ఎన్నో ఆశుకవితా ప్రదర్శనలిచ్చారు .’’కవి శేఖర ‘’,మహోపాధ్యాయ ‘’,విద్యాలంకార ‘’,సాహిత్య రత్న ‘’,వంటి బిరుదాలు  పొందారు .ఆచార్యుల వారు రాసిన గ్రంధాలు వందకు పైనే ఉన్నాయి .6-3-1976నశ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం నుండి డి .లిట్ .బిరుదు నందు కొన్నారు .

వంద గ్రంధాలు రాసినా ఆచార్యులవారి ముద్రిత గ్రంధాలు నలభై మాత్రమె .’’శ్రీరామ కల్యాణం ‘’అనే పద్య కావ్యం తొలి రచన .’’కైకేయీ సౌశీల్యం ‘’మరో పద్య కావ్యం .’’ఆంద్ర కాదంబరి ‘’అనువాద రచన .ద్విపద మేఘ దూతం రచించారు సంస్కృత ,ప్రతిమ,ప్రతిజ్ఞా యౌగంద రాయణం ,చారుదత్త  నాటకాలకు  తెలుగు అనువాదం చేశారు .రాఘ వేంద్ర,,జయ తీర్ధ, వాదిరాజు ,వ్యాస రాయ ,పూర్ణ బోధ విజయ ‘’కావ్యాలలో ద్వైతమత సిద్ధాంతాలను పొందుపరచారు .ఆంద్ర మహా భారతానికి విరాట పర్వం వరకు ప్రామాణికమైన లఘు టీక రాశారు .ఆచార్య శ్రీ శాస్త్ర పాండిత్యానికి గొప్ప ఉదాహరణ ‘’శత లక్షిణి ‘’.అనే విమర్శ గ్రంధం .ఈ గ్రంధమే తిరుపతి కవులకు వాద ప్రతివాదాలలో ‘’కరదీపిక ‘’గా నిలిచింది అని అంటారు .ఎనభై ఏళ్ళ సంపూర్ణ సార్ధక జీవితం గడిపి పళ్ళేపూర్ణ ప్రజ్ఞాచార్యుల వారు 1977లో   ‘’పూర్ణ ప్రజ్న’’లోకి చేరుకొన్నారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-12-14-ఉయ్యూరు

 

 

 

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బడుగు మేధావుల వౌనమేల?

బడుగు మేధావుల వౌనమేల?

  • – టంకశాల అశోక్ (సెల్ : 9848191767)
  • 07/12/2014
TAGS:

భారతదేశంలో దళితులు, అమెరికాలో నల్లవారి అణచివేతలకు మధ్య తేడా లేదు. వారి సంక్షేమం కోసమని ఒకవైపు రెండుచోట్లా చట్టాలుంటాయి. కొన్ని చర్యలు తీసుకుంటా రు. అదే సమయంలో మరొకవైపు విస్తృతమైన రీతిలో అణచివేతలు సాగుతుంటాయి. ఆర్థికంగా, సామాజికంగా ఆధిపత్యంగలవారు ఈ పనిచేస్తుంటే, అందుకు పరోక్షమైన, ప్రత్యక్షమైన విధాలుగా అధికార వ్యవస్థల సహకారం కూడా ఉంటుం ది. ఇది అందరికీ తెలిసిన సాధారణ సత్యం. న్యాయం గా, నిష్పాక్షికంగా ఆలోచించేవారు ఈ పరిస్థితులనూ గుర్తించి అవి రెండుచోట్ల కూడా మారాలంటారు. కాని కొందరు బడుగు మేధావుల విషయంలో అట్లా జరగటం లేదు. వారు భారతదేశంలోని చెడును మాత్రం గుర్తించి ఖండిస్తూ, అమెరికాలో నల్లవారికి అంతా స్వర్గ్ధామమేనని వాదిస్తుంటారు. అందుకే ఈ వ్యాసం రాయవలసి వస్తున్నది.
అమెరికాలో నల్లవారిని ప్రస్తుతం రెండు హత్యలు కుదిపివేస్తున్నాయి. ఫెర్గ్యూసన్ పట్టణంలో మైఖేల్ బ్రౌన్ అనే 18 సంవత్సరాల నల్లజాతి యువకుడిని ఆగస్టులో డారెన్ విల్సన్ అనే తెల్లజాతి పోలీస్ కాల్చి చంపాడు. తర్వాత ఇటీవల తామీర్ రైస్ అనే 12 సంవత్సరాల నల్లజాతి బాలుడిని క్లేవ్‌లాండ్‌లో మరొక తెల్లజాతి పోలీస్ కాల్చివేసి ప్రాణాలు తీసాడు. ఈ రెండు ఘటనలను పురస్కరించుకుని మొత్తం అమెరికాలో నల్లజాతి అంతా ఆందోళనలు సాగిస్తున్నది. కాని, నేను గమనించినంతవరకు, ఇక్కడి బడుగు మేధావులు, రచయితలు ఎవరూ దానిపై స్పందించటం లేదు. అమెరికాలో నల్లవారికి ఎటువంటి సమస్యలు లేక స్వర్గం వంటి పరిస్థితులు ఉన్నాయనే తమ వాదనలను వారిపుడు ఇంకా సమర్ధించుకోవటమో, ఖండించుకోవటమో చేయాలి. కాదంటే, ఇతరత్రా అంతా గొప్పగానే ఉందని, ఈ రెండు ఘటనలు మినహాయింపుగా జరిగిన పొరపాట్లని రుజువుచేయాలి. మైఖేల్ బ్రౌన్, తామీర్ రైస్ ఇద్దరూ నిరాయుధులే. ఫెర్గ్యూసన్‌లో సాధారణమైన సమస్య ఏదో తలెత్తగా దానిని నియంత్రించేందుకు వెళ్లిన పోలీసు అందుకు ఇతర పద్ధతులేవీ అనుసరించకుండా నేరుగా గన్‌తో కాల్పులు జరిపాడు. రైస్ అనే బాలుని విషయంలో అంతకన్నా దారుణంగా జరిగింది. అతను ఒక పార్క్ దగ్గర బొమ్మ తుపాకీకి అటు ఇటు తిప్పుతూ ఆడుకుంటున్నాడు. శే్వతజాతీయుడొకరు పోలీసులకు ఎమర్జెన్సీ ఫోన్ చేసాడు. పోలీసులు తమ వాహనంలో వచ్చి దిగీ దిగగానే ఆ పిల్లవాడిని కాల్చారు. ఇది నిజం కాదని వాదించారు గాని, తర్వాత వెలుగులోకి వచ్చిన ఫొటోలు వారు వాహనంలోంచి దిగటానికి కాల్పులు జరపటానికి మధ్య కేవలం కొన్ని క్షణాల వ్యవధి ఉన్నట్లు తేల్చి చెప్పా యి.
నల్లవారికి స్వర్గమైన అమెరికాలో ఇదెట్లా సాధ్యమైంది? ఇది చాలదన్నట్లు మరొకటి జరిగింది. 18 ఏళ్ల బ్రౌన్‌ను కాల్చిన పోలీసును ప్రాసిక్యూట్ చేయాలన్న డిమాండ్ నల్లవారినుంచి, ఇతర ప్రజాస్వామిక వర్గాలనుంచి వచ్చింది. బ్రౌన్ నిరాయుధుడైనప్పటికీ తనపైకి దూసుకువచ్చాడని, తనవద్దగల తుపాకీని లాక్కుని తననే కాల్చగలడన్న భయం కలిగిందని, అందువల్ల తన ప్రాణరక్షణకోసం కాల్చానని పోలీసు వాదించాడు. దానితో అక్కడి గ్రాండ్ జ్యూరీవారు ఆయనను ప్రాసిక్యూట్ చేయనక్కరలేదని తీర్పు చెప్పారు. బాలుని విషయమై ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది. అమెరికాలో ఇటువంటివి అరుదుగా జరిగితే పట్టించుకోనక్కరలేదు. కాని ఇవి ఒక పద్ధతి ప్రకారం, వ్యవస్థీకృత రూపంలో, తరచు జరిగినా దానిని స్వర్గసీమ అనవచ్చునా? స్వర్గసీమగా అభివర్ణించే మన మేధావులు, రచయితలు కొందరికి అక్కడ జరుగుతున్న వాస్తవాలు ఏమిటో నిజంగానే తెలియదా?
నల్లవారికి ఇటువంటి అనుభవాలు అరుదుకాదని సర్వసాధారణంగా తెలిసిన విషయమే. ఉదాహరణకు ‘మాల్కం ఎక్స్‌గ్రాస్‌రూట్స్ మూవ్‌మెంట్’, న్యూయార్క్ సివిల్ లిబర్టీస్ యూనియన్ నివేదికలతోపాటు, సాక్షాత్తూ శే్వత జాతీయులే నిర్వహించే ‘యుఎస్‌ఎ టుడే’ పత్రిక రిపోర్టులను గమనిస్తే, నల్లవారి అణచివేత ఎంత ఉద్దేశపూర్వకంగా, ఎంత వ్యవస్థీకృతంగా సాగుతున్నదో గ్రహించవచ్చు.
పోలీసులు, సెక్యూరిటీ గార్డులు, విజిలేంట్స్ అని తమనుతాము పిలుచుకునే గ్రూపులవారు 2012లో ‘‘కనీసం’’ 313 మంది నల్లవారిని కాల్చి చంపారు. కాని వాస్తవ సంఖ్య ఇంతకన్న చాలా ఎక్కువగా ఉంటుంది. అమెరికాలో శాంతి భద్రతల సంస్థలు మొత్తం పదిహేడు వేలున్నాయి. (17,000). వాటిలో సుమారు 750 మాత్రమే ఈ తరహా ఘటనల వివరాలను డేటాబేస్‌కు అందజేస్తాయి. దానినిబట్టి వాస్తవమైన సంఖ్యలు వేలల్లో ఉంటాయనాలి. అమెరికా జనాభాలో నల్లవారి సంఖ్య సుమారు 13 శాతం. అటువంటి స్థితిలో కేవలం వారిని కాల్చి చంపటమే వేల సంఖ్యల్లో ఉంటే అదెంత గొప్ప స్వర్గమో మన మేధావులు మాత్రమే వివరించగలరు.
పోలీస్ సంస్థలు, ఇతర భద్రతా సంస్థలు ఈ స్థాయిలో కాల్పులకు పాల్పడుతున్నాయంటే, దాని వెనుక అణచివేతలు ఎంత తీవ్రంగా, ఎంత విస్తృతంగా ఉంటాయో ఊహించటం కూడా కష్టమే. నల్లవారి జనాభా 13శాతం కాగా, ఖైదీలలో వారు సుమారు 40 శాతం ఉంటారు. ఒకే విధమైన నేరాలకు నల్లవారిని, తెల్లవారిని అరెస్టుచేయటం నుంచి మొదలుకొని జైళ్లలోకి పంపడం వరకు అడుగడుగునా వివక్షతే. తెల్లవారికి కనీస శిక్షలైతే నల్లవారికి గరిష్ఠ శిక్షలని పై సంస్థలు రూపొందించినట్టు నివేదికలు చెప్తున్నాయి. న్యూయార్క్ సివిల్ లిబర్టీస్ యూనియన్ అధ్యయనం ప్రకారం, అరెస్టయే నల్లవారిలో సుమారు 90 శాతం మంది అమాయకులు. కాల్పులకు గురై చనిపోయిన వ్యక్తులలో 44 శాతం మంది నిరాయుధులు. 27 శాతం సాయుధులైనట్లు పోలీసులు ఆరోపించి అందుకు ఆధారాలు చూపలేకపోయారు. దానిని కలిపితే నిరాయుధుల సంఖ్య 71 శాతం. అయినప్పటికీ పోలీసులు తమవద్ద ఆయుధాలు ఉండి కూడా, తాము ‘‘ప్రాణభయంతో’’ కాల్చామని వాదించారు. అట్లా వాదించినవారు 47 శాతం ఉన్నట్టు పైన పేర్కొన్న నివేదికలు వెల్లడించాయి. యుఎస్‌ఎ టుడే పత్రిక కథనం ప్రకారం, పోలీసులు కాల్చి చంపుతున్న నల్లవారిలో 18 శాతం మంది 21 సంవత్సరాల లోపు వయసువారు. ఇందుకు భిన్నంగా తెల్లవారి సంఖ్య 8.7 శాతం.
ఈ విధమైన నిర్బంధాలు, జైళ్లు, కాల్చివేతలకు మూలాలు నల్లవారిని బానిసలుగా మార్చి ఉపయోగించుకున్న అమెరికన్ పెట్టుబడిదారీ చరిత్రలో ఉన్నాయని, బానిసత్వం రద్దయిన అనంతరం ఏడు దశాబ్దాల కాలంలోనూ వారి పట్ల వివక్షలు ప్రత్యక్ష, పరోక్ష రూపాలలో కొనసాగుతూనే ఉన్నాయని పై నివేదికలు చెప్తున్నాయి. నల్లవారిలో హింసా ధోరణులు ఎక్కువని, వారు ప్రమాదకారులని అసలు పోలీస్ రిక్రూట్‌మెంట్, శిక్షణ, విధానాల రూపకల్పన సమయాలలోనే తెల్లవారికి అభిప్రాయం కలిగింపజేస్తారు. ఇక సమాజంలో జాతి వివక్షాధోరణులు ఉండనే ఉన్నాయి. ఇటువంటి నేపథ్యం వల్లనే తెల్ల పోలీసులు నిర్భయమైన రీతిలో అతిగా వ్యవహరించి తామీ రైస్ వంటి పిల్లలను కూడా కాల్చి చంపుతున్నారు. అక్కడి నిపుణులు దీనిని నల్లవారికి, తెల్లవారికి మధ్య ‘‘నిరంతర యుద్ధం’’, ‘‘ప్రచ్ఛన్న యుద్ధం’’ వంటిదని అభివర్ణిస్తున్నారు.
దీనంతటి మధ్య నల్లవారికి అమెరికన్ స్వర్గం ఎక్కడున్నదనేది ప్రశ్న. నల్లవారు సాగించిన అనేకానేక ఉద్యమాలు, పోరాటాల అనంతరం బానిస వ్యవస్థ రద్దుకావటంతోపాటు వారికోసం అక్కడి ప్రభుత్వాలు వివిధ అవకాశాలు కల్పించాయి. అది జరగనట్లయితే అసంతృప్తి ఇంకా తీవ్రమై ఆ వ్యవస్థకు విపత్కరమైన పరిస్థితులు ఎదురై ఉండేవి. నల్లవాడైన ఒబామా దేశాధ్యక్షుడైనంత మాత్రాన వారికి మారింది ఏమీ కన్పించదు. మరి దీనంతటి మధ్య, మన బడుగు మేధావులు కొందరంటున్న అమెరికన్ స్వర్గమెక్కడ? ఈ తాజా ఘటనలు రెండు అక్కడి నల్లవారిని ఊపివేస్తున్న సందర్భంలో వారిందుకు వివరణ ఇవ్వాలి.
అసలు విషయమంటే ఈ తరహా మేధావులకు ఆర్థిక సంస్కరణలు, అమెరికా మెరుపులు కలిసి కళ్లు మిరుమిట్లు గొలిపించాయి. తమ వ్యక్తిగత కెరీరిజానికి అందులో అవకాశాలు కన్పించాయి. దానితో వాస్తవాలను, విచక్షణను బుద్ధిపూర్వకంగా విస్మరించారు. ఇండియాలో గాని, అమెరికాలోగాని ఈ వర్గాలకోసం జరుగుతున్నదేమిటి, వారి పట్ల గల అణచివేత ఏమిటి అన్న ప్రశ్నలను నిక్కచ్చిగా చూసి బేరీజువేయటానికి బదులు సమతులనాన్ని, సంయమనాన్ని కూడా కోల్పోయారు. అందుకే ఇండియా సంపూర్ణ నరకం వలె, అమెరికా సంపూర్ణ స్వర్గం వలె కనిపిస్తున్నాయి. రెండూ తప్పేనని, వాస్తవం ఆమధ్య ఎక్కడో ఉంటుందని మరిచిపోయారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బడుగు మేధావుల వౌనమేల?

బడుగు మేధావుల వౌనమేల?

  • – టంకశాల అశోక్ (సెల్ : 9848191767)
  • 07/12/2014
TAGS:

భారతదేశంలో దళితులు, అమెరికాలో నల్లవారి అణచివేతలకు మధ్య తేడా లేదు. వారి సంక్షేమం కోసమని ఒకవైపు రెండుచోట్లా చట్టాలుంటాయి. కొన్ని చర్యలు తీసుకుంటా రు. అదే సమయంలో మరొకవైపు విస్తృతమైన రీతిలో అణచివేతలు సాగుతుంటాయి. ఆర్థికంగా, సామాజికంగా ఆధిపత్యంగలవారు ఈ పనిచేస్తుంటే, అందుకు పరోక్షమైన, ప్రత్యక్షమైన విధాలుగా అధికార వ్యవస్థల సహకారం కూడా ఉంటుం ది. ఇది అందరికీ తెలిసిన సాధారణ సత్యం. న్యాయం గా, నిష్పాక్షికంగా ఆలోచించేవారు ఈ పరిస్థితులనూ గుర్తించి అవి రెండుచోట్ల కూడా మారాలంటారు. కాని కొందరు బడుగు మేధావుల విషయంలో అట్లా జరగటం లేదు. వారు భారతదేశంలోని చెడును మాత్రం గుర్తించి ఖండిస్తూ, అమెరికాలో నల్లవారికి అంతా స్వర్గ్ధామమేనని వాదిస్తుంటారు. అందుకే ఈ వ్యాసం రాయవలసి వస్తున్నది.
అమెరికాలో నల్లవారిని ప్రస్తుతం రెండు హత్యలు కుదిపివేస్తున్నాయి. ఫెర్గ్యూసన్ పట్టణంలో మైఖేల్ బ్రౌన్ అనే 18 సంవత్సరాల నల్లజాతి యువకుడిని ఆగస్టులో డారెన్ విల్సన్ అనే తెల్లజాతి పోలీస్ కాల్చి చంపాడు. తర్వాత ఇటీవల తామీర్ రైస్ అనే 12 సంవత్సరాల నల్లజాతి బాలుడిని క్లేవ్‌లాండ్‌లో మరొక తెల్లజాతి పోలీస్ కాల్చివేసి ప్రాణాలు తీసాడు. ఈ రెండు ఘటనలను పురస్కరించుకుని మొత్తం అమెరికాలో నల్లజాతి అంతా ఆందోళనలు సాగిస్తున్నది. కాని, నేను గమనించినంతవరకు, ఇక్కడి బడుగు మేధావులు, రచయితలు ఎవరూ దానిపై స్పందించటం లేదు. అమెరికాలో నల్లవారికి ఎటువంటి సమస్యలు లేక స్వర్గం వంటి పరిస్థితులు ఉన్నాయనే తమ వాదనలను వారిపుడు ఇంకా సమర్ధించుకోవటమో, ఖండించుకోవటమో చేయాలి. కాదంటే, ఇతరత్రా అంతా గొప్పగానే ఉందని, ఈ రెండు ఘటనలు మినహాయింపుగా జరిగిన పొరపాట్లని రుజువుచేయాలి. మైఖేల్ బ్రౌన్, తామీర్ రైస్ ఇద్దరూ నిరాయుధులే. ఫెర్గ్యూసన్‌లో సాధారణమైన సమస్య ఏదో తలెత్తగా దానిని నియంత్రించేందుకు వెళ్లిన పోలీసు అందుకు ఇతర పద్ధతులేవీ అనుసరించకుండా నేరుగా గన్‌తో కాల్పులు జరిపాడు. రైస్ అనే బాలుని విషయంలో అంతకన్నా దారుణంగా జరిగింది. అతను ఒక పార్క్ దగ్గర బొమ్మ తుపాకీకి అటు ఇటు తిప్పుతూ ఆడుకుంటున్నాడు. శే్వతజాతీయుడొకరు పోలీసులకు ఎమర్జెన్సీ ఫోన్ చేసాడు. పోలీసులు తమ వాహనంలో వచ్చి దిగీ దిగగానే ఆ పిల్లవాడిని కాల్చారు. ఇది నిజం కాదని వాదించారు గాని, తర్వాత వెలుగులోకి వచ్చిన ఫొటోలు వారు వాహనంలోంచి దిగటానికి కాల్పులు జరపటానికి మధ్య కేవలం కొన్ని క్షణాల వ్యవధి ఉన్నట్లు తేల్చి చెప్పా యి.
నల్లవారికి స్వర్గమైన అమెరికాలో ఇదెట్లా సాధ్యమైంది? ఇది చాలదన్నట్లు మరొకటి జరిగింది. 18 ఏళ్ల బ్రౌన్‌ను కాల్చిన పోలీసును ప్రాసిక్యూట్ చేయాలన్న డిమాండ్ నల్లవారినుంచి, ఇతర ప్రజాస్వామిక వర్గాలనుంచి వచ్చింది. బ్రౌన్ నిరాయుధుడైనప్పటికీ తనపైకి దూసుకువచ్చాడని, తనవద్దగల తుపాకీని లాక్కుని తననే కాల్చగలడన్న భయం కలిగిందని, అందువల్ల తన ప్రాణరక్షణకోసం కాల్చానని పోలీసు వాదించాడు. దానితో అక్కడి గ్రాండ్ జ్యూరీవారు ఆయనను ప్రాసిక్యూట్ చేయనక్కరలేదని తీర్పు చెప్పారు. బాలుని విషయమై ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది. అమెరికాలో ఇటువంటివి అరుదుగా జరిగితే పట్టించుకోనక్కరలేదు. కాని ఇవి ఒక పద్ధతి ప్రకారం, వ్యవస్థీకృత రూపంలో, తరచు జరిగినా దానిని స్వర్గసీమ అనవచ్చునా? స్వర్గసీమగా అభివర్ణించే మన మేధావులు, రచయితలు కొందరికి అక్కడ జరుగుతున్న వాస్తవాలు ఏమిటో నిజంగానే తెలియదా?
నల్లవారికి ఇటువంటి అనుభవాలు అరుదుకాదని సర్వసాధారణంగా తెలిసిన విషయమే. ఉదాహరణకు ‘మాల్కం ఎక్స్‌గ్రాస్‌రూట్స్ మూవ్‌మెంట్’, న్యూయార్క్ సివిల్ లిబర్టీస్ యూనియన్ నివేదికలతోపాటు, సాక్షాత్తూ శే్వత జాతీయులే నిర్వహించే ‘యుఎస్‌ఎ టుడే’ పత్రిక రిపోర్టులను గమనిస్తే, నల్లవారి అణచివేత ఎంత ఉద్దేశపూర్వకంగా, ఎంత వ్యవస్థీకృతంగా సాగుతున్నదో గ్రహించవచ్చు.
పోలీసులు, సెక్యూరిటీ గార్డులు, విజిలేంట్స్ అని తమనుతాము పిలుచుకునే గ్రూపులవారు 2012లో ‘‘కనీసం’’ 313 మంది నల్లవారిని కాల్చి చంపారు. కాని వాస్తవ సంఖ్య ఇంతకన్న చాలా ఎక్కువగా ఉంటుంది. అమెరికాలో శాంతి భద్రతల సంస్థలు మొత్తం పదిహేడు వేలున్నాయి. (17,000). వాటిలో సుమారు 750 మాత్రమే ఈ తరహా ఘటనల వివరాలను డేటాబేస్‌కు అందజేస్తాయి. దానినిబట్టి వాస్తవమైన సంఖ్యలు వేలల్లో ఉంటాయనాలి. అమెరికా జనాభాలో నల్లవారి సంఖ్య సుమారు 13 శాతం. అటువంటి స్థితిలో కేవలం వారిని కాల్చి చంపటమే వేల సంఖ్యల్లో ఉంటే అదెంత గొప్ప స్వర్గమో మన మేధావులు మాత్రమే వివరించగలరు.
పోలీస్ సంస్థలు, ఇతర భద్రతా సంస్థలు ఈ స్థాయిలో కాల్పులకు పాల్పడుతున్నాయంటే, దాని వెనుక అణచివేతలు ఎంత తీవ్రంగా, ఎంత విస్తృతంగా ఉంటాయో ఊహించటం కూడా కష్టమే. నల్లవారి జనాభా 13శాతం కాగా, ఖైదీలలో వారు సుమారు 40 శాతం ఉంటారు. ఒకే విధమైన నేరాలకు నల్లవారిని, తెల్లవారిని అరెస్టుచేయటం నుంచి మొదలుకొని జైళ్లలోకి పంపడం వరకు అడుగడుగునా వివక్షతే. తెల్లవారికి కనీస శిక్షలైతే నల్లవారికి గరిష్ఠ శిక్షలని పై సంస్థలు రూపొందించినట్టు నివేదికలు చెప్తున్నాయి. న్యూయార్క్ సివిల్ లిబర్టీస్ యూనియన్ అధ్యయనం ప్రకారం, అరెస్టయే నల్లవారిలో సుమారు 90 శాతం మంది అమాయకులు. కాల్పులకు గురై చనిపోయిన వ్యక్తులలో 44 శాతం మంది నిరాయుధులు. 27 శాతం సాయుధులైనట్లు పోలీసులు ఆరోపించి అందుకు ఆధారాలు చూపలేకపోయారు. దానిని కలిపితే నిరాయుధుల సంఖ్య 71 శాతం. అయినప్పటికీ పోలీసులు తమవద్ద ఆయుధాలు ఉండి కూడా, తాము ‘‘ప్రాణభయంతో’’ కాల్చామని వాదించారు. అట్లా వాదించినవారు 47 శాతం ఉన్నట్టు పైన పేర్కొన్న నివేదికలు వెల్లడించాయి. యుఎస్‌ఎ టుడే పత్రిక కథనం ప్రకారం, పోలీసులు కాల్చి చంపుతున్న నల్లవారిలో 18 శాతం మంది 21 సంవత్సరాల లోపు వయసువారు. ఇందుకు భిన్నంగా తెల్లవారి సంఖ్య 8.7 శాతం.
ఈ విధమైన నిర్బంధాలు, జైళ్లు, కాల్చివేతలకు మూలాలు నల్లవారిని బానిసలుగా మార్చి ఉపయోగించుకున్న అమెరికన్ పెట్టుబడిదారీ చరిత్రలో ఉన్నాయని, బానిసత్వం రద్దయిన అనంతరం ఏడు దశాబ్దాల కాలంలోనూ వారి పట్ల వివక్షలు ప్రత్యక్ష, పరోక్ష రూపాలలో కొనసాగుతూనే ఉన్నాయని పై నివేదికలు చెప్తున్నాయి. నల్లవారిలో హింసా ధోరణులు ఎక్కువని, వారు ప్రమాదకారులని అసలు పోలీస్ రిక్రూట్‌మెంట్, శిక్షణ, విధానాల రూపకల్పన సమయాలలోనే తెల్లవారికి అభిప్రాయం కలిగింపజేస్తారు. ఇక సమాజంలో జాతి వివక్షాధోరణులు ఉండనే ఉన్నాయి. ఇటువంటి నేపథ్యం వల్లనే తెల్ల పోలీసులు నిర్భయమైన రీతిలో అతిగా వ్యవహరించి తామీ రైస్ వంటి పిల్లలను కూడా కాల్చి చంపుతున్నారు. అక్కడి నిపుణులు దీనిని నల్లవారికి, తెల్లవారికి మధ్య ‘‘నిరంతర యుద్ధం’’, ‘‘ప్రచ్ఛన్న యుద్ధం’’ వంటిదని అభివర్ణిస్తున్నారు.
దీనంతటి మధ్య నల్లవారికి అమెరికన్ స్వర్గం ఎక్కడున్నదనేది ప్రశ్న. నల్లవారు సాగించిన అనేకానేక ఉద్యమాలు, పోరాటాల అనంతరం బానిస వ్యవస్థ రద్దుకావటంతోపాటు వారికోసం అక్కడి ప్రభుత్వాలు వివిధ అవకాశాలు కల్పించాయి. అది జరగనట్లయితే అసంతృప్తి ఇంకా తీవ్రమై ఆ వ్యవస్థకు విపత్కరమైన పరిస్థితులు ఎదురై ఉండేవి. నల్లవాడైన ఒబామా దేశాధ్యక్షుడైనంత మాత్రాన వారికి మారింది ఏమీ కన్పించదు. మరి దీనంతటి మధ్య, మన బడుగు మేధావులు కొందరంటున్న అమెరికన్ స్వర్గమెక్కడ? ఈ తాజా ఘటనలు రెండు అక్కడి నల్లవారిని ఊపివేస్తున్న సందర్భంలో వారిందుకు వివరణ ఇవ్వాలి.
అసలు విషయమంటే ఈ తరహా మేధావులకు ఆర్థిక సంస్కరణలు, అమెరికా మెరుపులు కలిసి కళ్లు మిరుమిట్లు గొలిపించాయి. తమ వ్యక్తిగత కెరీరిజానికి అందులో అవకాశాలు కన్పించాయి. దానితో వాస్తవాలను, విచక్షణను బుద్ధిపూర్వకంగా విస్మరించారు. ఇండియాలో గాని, అమెరికాలోగాని ఈ వర్గాలకోసం జరుగుతున్నదేమిటి, వారి పట్ల గల అణచివేత ఏమిటి అన్న ప్రశ్నలను నిక్కచ్చిగా చూసి బేరీజువేయటానికి బదులు సమతులనాన్ని, సంయమనాన్ని కూడా కోల్పోయారు. అందుకే ఇండియా సంపూర్ణ నరకం వలె, అమెరికా సంపూర్ణ స్వర్గం వలె కనిపిస్తున్నాయి. రెండూ తప్పేనని, వాస్తవం ఆమధ్య ఎక్కడో ఉంటుందని మరిచిపోయారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాన పట్టిన గంధం

సాన పట్టిన గంధం

  • – దాసోజు లలిత 8790516894
  • 01/12/2014
TAGS:

ప్రపంచ దేశాల్లారా కండ్లు మూసుకున్నారా
నోరు సూదితో కుట్టేసుకున్నట్లు
సామ్రాజ్యాల అగ్రదేశాల ఆధిపత్యాల
స్వీయ మానసిక దాడిలో చితికిపోతున్నారా
తెగిపడుతున్న గాజా దేశాలెనె్నన్నో..

పేలల్లా ఎగిరిపడుతుంటే
పెయ్యి వెయ్యి తునకలైన అవిటితనాలు
దాపురిస్తుంటే దాక్కున్నారెక్కడ?
కచ్చగట్టి శవాల గుట్టల్ని నిర్మిస్తుంటే
పంచేంద్రియాలు మూసుకున్నారెందుకు

పేకమేడల్లా శ్వాసలు కూలిపోతున్నా
ఆసరాకోసం తడుముకుంటున్నా
కంటి రెప్పల్లేని కళ్ళలా
దిగులు పెట్టుకుంటుండ్రు వాళ్ళు
క్షణకాలం చలించని
మతి తప్పని నిఘా పెట్టాల్సిన వాళ్ళు
నిద్దుర నటిస్తున్నారు

దేశాల్లారా కాసింత ఉనికైనా చూపండి
కురుస్తున్న నిప్పుల వానలో
జడిపిస్తున్న నిస్సహాయ స్థితి!
కరుగని కరుడుగట్టిన దేశాల్లారా
నోటిలో ముప్ఫై రెండు పళ్ళమధ్య
మీ నాలుక ఏమైంది

మేం మిమ్ముల్ని చూసి జాలిపడుతున్నాం
వీధి రణాలపై మారు మాట్లాడక
ప్రపంచ బ్యాంకు రుణం కోసమేనా
ఓ అంతర్జాతీయ వాదమా
అలీనమా! మూడో ప్రపంచమా!

నేత్రాలనీ, హృదయాలనీ
ఏ జమ్మికొమ్మపై దాచారు
నిరంతరం ఒరిగే అమాయకుల
పేలిన గాయాలకు మాలామూ లేదా

రేపు నీకూ ఇదే గతి పడితే
నేను మాత్రం
అక్షరాల్ని సానబట్టి తీసిన గంధాన్ని
మీకోసం భద్రంగా దాస్తాను
కళ్ళు మూసుకున్నా మీ గుండెల్ని మాత్రం
తెరిచేట్లు చేస్తా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పాలకులకు పట్టని గురజాడ

పాలకులకు పట్టని గురజాడ

  • – రామతీర్థ, 9849200385
  • 01/12/2014
TAGS:

ఆధునిక తెలుగు సాహిత్యానికి ఆది కారకుడు గురజాడ. ప్రపంచమంతా ఎప్పటికైనా ఆధునిక భాషవైపు మొగ్గు చూపక తప్పదన్న చారిత్రకమైన వాస్తవాన్ని ఎరిగినవాడు. తన జీవితకాలమంతా ఒక పూనికతో సర్వతోముఖ ఆధునికత పక్షాన నిలిచిన వ్యక్తిత్వం ఆయనది. అలాంటి గురజాడ మన మధ్య లేని నూరేళ్ళూ, ఆయన ఆలోచనల ప్రాముఖ్యతను గుర్తించామా? ఈ శతాబ్ది కాలాన్ని కొంత స్వతంత్రం లేకా, తర్వాత స్వతంత్రంలోనూ మనం అశ్రద్ధ, అవిధేయత, అసమర్థతల మధ్యే ప్రధానంగా గడిపామన్నది ఒక కటువైన వాస్తవం. కొన్ని పరిశోధనలూ, కొంత విశే్లషణాత్మక విమర్శ వెలువడినా, దాని కోసం నిష్ణాతులు పనిచేసినా, ఇంకా జరగాల్సింది చాలా ఉన్నదన్నది పచ్చి నిజం. ఎవరో కథలు రాసిన వారిని చూపెట్టి, ఇంకేవో ఘనతలు ఒక రంగంలో సాధించిన వారిని చూపెట్టి, గురజాడను పక్కన పెట్టడం సాధ్యమయ్యే పనికాదు. ప్రస్తుతం ఆయన పరిస్థితి రెడ్డి పోయె… నాయుడొచ్చె చందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఇప్పటికైనా గురజాడను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. గురజాడ తర్వాత వందేళ్ళకు పుట్టిన కాళోజీ, జయశంకర్ వంటి ధీమంతులకు తెలంగాణ ప్రభుత్వం విశేషించి ఉత్సవాలు జరుపుతుండగా, గురజాడను గత ప్రభుత్వాలు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం శోచనీయం.
1903లో తన తెలుగు కథలకు ఏడేళ్ళు ముందే గురజాడ ఆంగ్లంలో ఒక కథ రాశారు. అది ‘స్టూపింగ్ టు రైజ్’. (గురజాడ ఈ పేరు పెట్టడంలో ‘స్టూపింగ్ టు కాంకర్’ పేరిట 1773లో ఆలివర్ గోల్డ్‌స్మిత్ రాసిన నాటకం గమనానికి వస్తుంది). అప్పటికి ఆంగ్లంలో కథలు రాసిన భారతీయ రచయితలు కొద్దిమందే ఉండొచ్చు. లేదా తొలి తరం భారతీయ ఆంగ్లకథా వికాసకర్తలు అయిన ఆర్.కె.నారాయణ్, రాజారావు, ముల్క్‌రాజ్ ఆనంద్‌ల కన్నా ముందున్నాడనడంలో సందేహం లేదు. ఈ గణాంకాలు ఏవి వెలికితీద్దామన్నా మన వద్ద ఆ కథ మూలం లేదు. దానిని పారేసుకున్న అశ్రద్ధ మనది. అనువాదం చేసిన అవసరాల సూర్యారావు గారు దానిని జాగ్రత్త చేయలేకపోయారు. విశాలాంధ్ర వారి మధ్య, స్టేట్ ఆర్కైవ్స్ శాఖ వారికి చేరేలోపు ఆ కథ ఎక్కడో గల్లంతు అయిపోయింది. పాత కవులవి దొరకలేదు అంటే ఓ అర్థం వుంది. కానీ నూరేళ్ళలోపే జరిగిన ఒక ప్రామాణిక రచనను ఆధారాలు లేకుండా పారేసుకున్న మన అశ్రద్ధ, మరే ఇతర భాషా సమాజానికి ఉంటుందని అనుకోలేం. కన్యాశుల్కం తొలి ముద్రణ ప్రతి సైతం అంతే. ఆరుద్ర దానిగురించి రాయగా రాయగా ఆ పూనికతో బండి గోపాలరెడ్డి (బంగోరె) దానిని మద్రాసులోని ప్రభుత్వ ప్రాచ్యలిఖిత ప్రతుల భాండాగారంలో కూచుని ఆనాడు జిరాక్స్ వెసులుబాటు లేనందువల్ల నకలు రాసుకున్నాడు. దీంతో ఆ రచన అక్కడ వుందన్న సమాచారం మనకు అప్పుడు తెలిసింది. ఒక వెలోరియమ్ ఎడిషన్ కూడా తీసుకురావాల్సిన అవసరాన్ని బంగోరె ప్రస్తావించాడు. ఆ కన్యాశుల్కం ప్రతి జీర్ణావస్థలో వుంటే, దానిని డిజిటల్ కాపీ చేసి భద్రపరిచే జాగ్రత్తలు ఇటీవలే మొజాయిక్ సాహిత్య సంస్థ తీసుకుంది. గురజాడ 150వ జయంతి సందర్భంగా ఉత్తరాంధ్రలో, విజయవాడలో దానిని 2012లో బహిరంగ ప్రదర్శనకు పెట్టింది. తొమ్మిది గంటల కన్యాశుల్కం నాటకాన్ని ఎవరికి తోచిన కత్తిరింపులతో వారు ప్రదర్శించడం తప్పితే – ఈ నాటకం గురించి ఒక సమ్యక్ అవగాహన, దృష్టి ఈ నూరేళ్ళలో మనం ఏర్పరచుకోలేదు. చక్కని టెలిఫిల్మ్స్‌లా తీయతగ్గ చిత్రపరిశ్రమ మనకున్నా, గురజాడ రెండు కథలు అలాగే ఉన్నాయి. కన్యాశుల్కం సినిమాని 1955లో నిర్మించిన నిర్మాతలు తమకేదో దివ్యమైన హక్కులున్నట్టుగా నాటక ముగింపును మార్చివేశారు. ఇదే పని ఇంకే ప్రపంచ నాటకానికి, సాహిత్య రూపానికి ఆ దేశంలో జరిగితే అక్కడి ప్రజానీకం సహిస్తారా అన్నది సందేహమే. తక్కువ సమయంలో ప్రదర్శితమయ్యే సంపూర్ణ నాటకం గురించి మనకు అసలు ఏ ఆలోచనలూ లేకపోవడమే ఒక శిఖరాయన జడత్వం. యువతరం ఈ దిశలో ఆలోచన చేస్తున్న ఒకే ఒక్క ఆశాకిరణం – ప్రముఖ రచయిత కుమారుడైన అట్టాడ సృజన్ గురజాడ వారి ‘దిద్దుబాటు’ కథను ‘కమిలి’ పేరిట ఒక లఘుచిత్రంగా రూపొందించి ప్రదర్శనలిచ్చాడు. గురజాడ గేయ కథానికలైన పూర్ణమ్మ, కన్యక, లవణరాజు కల, డామస్ పీతియస్ – ఏదీ కూడా మన నాటకాలవాళ్లకీ, రూపకాలవాళ్లకీ, రేడియోవాళ్లకీ, టెలివిజన్ వాళ్లకీ, సినిమావాళ్లకీ, రాష్ట్ర చలనచిత్ర మండళ్ళ దృష్టిలో పడలేదు. ఏవో స్కూల్ వార్షికోత్సవాల్లో పిల్లలు ప్రదర్శనలు ఇచ్చుకోవడం తప్ప, మన సాంస్కృతిక సమాజం వీటి గురించి పెద్దగా చేసిందేమీ లేదు. గురజాడ రాసిన నీలగిరి పాటలు చక్కని సంగీత ప్రదర్శనగా రూపొందించడానికి ఎంతో పనికొస్తాయి. వాటిని పాడే గాయకుడూ కనిపించడు, సంగీత దర్శకుల మాట సరేసరి. షేక్‌స్పియర్, టాల్‌స్టాయ్, గోర్కీ, టాగోర్, శరత్, వల్లథోల్, సుబ్రహ్మణ్య భారతి, ఫకీర్ మోహన్ సేనాపతి వంటి వారి పట్ల ఆయా భాషా సమాజాల స్పందన, మన తెలుగువారి కన్నా మెరుగ్గానే ఉందని చెప్పొచ్చు. అనువాదాల విషయానికొస్తే – అమ్మకానికి అమ్మాయిలు (గర్ల్స్ ఫర్ సేల్) పేరిట వేల్చేరు నారాయణరావు చేసినది అనువాదం కాదు, అపరాధం. ఇంకో జాతిలో అయితే మూల రచనలో ఆయన తీసుకున్న స్వాతంత్య్రానికి, అనువాదకుడు, ప్రచురణకర్తలపై చట్టపరమైన చర్యలు మొదలై వుండేవి. గురజాడ వ్యక్తిత్వం గిరీశంలో ఉందని భావించేవారి సంఖ్య ఎంత ఉన్నా, వాల్మీకి రావణుడిలో ఉన్నాడంటే ఎంత నొచ్చుకుంటామో అటువంటిదే ఈ వదరుబోతుతనం కూడా.
గురజాడ జ్ఞాపకాలను పదిలపరుచుకోవడంలోనూ పాలకులూ, మనం చూపిన, చూపుతున్న అశ్రద్ధ అంతా ఇంతా కాదు. తాను నివసిస్తున్న ఇల్లు తనకు ఎలా వచ్చిందో తన లేఖల్లో వివరంగా రాశారు. పెద్ద దావా సెటిల్ చేయడంతో తన సేవలకు పారితోషికంగా ఇస్తామన్న సొమ్ములో రెండువేలో, పదిహేను వందలో చెల్లుబాటు చేసుకుని ఖాళీ జాగా కూడా ఇస్తే ఇల్లు కట్టుకుంటానని కూడా గురజాడ రాసిన లేఖల్లో వుంది. ఇప్పుడుంటున్న ఇల్లు ఇరుకుగా వుందని, కొత్త ఇంటికోసం నూయి తవ్వించి, ఇంటి నిర్మాణ సామగ్రి కుప్పలు వేసి, కాపలావాడిని పెట్టిన వైనాలన్నీ ఆయన డైరీలో స్పష్టంగా ఉంది. గత ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోకపోవడం వల్ల, గురజాడ కుటుంబ సభ్యుల ఆర్థిక సమస్యల వల్ల ఆయన కట్టుకున్న ఇల్లు ప్రైవేటు వ్యక్తుల పరమై నేలమట్టమై పోయింది. గురజాడ మరణించేవరకూ నివసించిన ఇల్లు ఒకప్పటి గుర్రపుశాల. దానినే కొన్ని దశాబ్దాల కింద అప్పటి ప్రభుత్వం ఒక చిన్న స్మారక మందిరంగా మార్చింది. చెక్క సున్నంతో కట్టిన పాతకాలపు హెరిటేజ్ కట్టడం అది. పక్కనే పెద్దఎత్తున లోతుగా పునాదులు వేసి, వ్యాపారపరమైన నిర్మాణాలు జరిపితే, అది కూలిపోవడం ఖాయం. దీన్ని అడ్డుకునే ఆలోచన ఏదీ ప్రభుత్వం వద్దకానీ, విజయనగరం స్థానిక అధికారుల వద్దకానీ ఉన్నట్టుగా లేవు. అది కూలిపోయిన వార్త కూడా ఈ శతవర్ధంతి వత్సరంలో వింటామేమో. ఇదీ మన సమర్థత!
గతంలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టుండి మేల్కొని, గురజాడ 150 జయంతి సందర్భంలో ఆయన పేరిట ఐదుకోట్ల నిధి ప్రకటించింది. అందులో, ఆ ఏడాది హడావిడికి ఒక ముప్ఫయి లక్షల కన్నా ఖర్చు అయిన దాఖలాలు లేవు. ఇప్పటి కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోను గౌరవించడమో, ఆ నిధిని ఇంకా పెంచడమో చేస్తే తెలుగు జాతికి సాంస్కృతిక ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది. అమ్ముడైపోయిన గురజాడ స్వంత ఇంటి స్థలాన్ని పక్కనే ప్రస్తుతం ఉన్న చిన్న మెమోరియల్‌ను కలిపి ఒక సముచిత స్మృతి కేంద్రంగా విజయనగరంలో నిర్మిస్తే తెలుగు జాతి సంతోషపడుతుందనడంలో సందేహం లేదు. ప్రతి జిల్లా ముఖ్య కేంద్రంలో గురజాడ కళామందిరాలు ఏర్పాటుచేయడం, నాటక సమాజాలకు ఒక సెంట్రల్ హాల్, సాహిత్య సంఘాల సభలకు చిన్న సమావేశ మందిరాలు, ఆధునిక వసతులు కలిగిన గ్రంథాలయం సమకూర్చడం తెలుగు జాతి ఖ్యాతికి దోహదపడే చర్య. కొత్త రాష్ట్రంలో, గురజాడ శతవర్ధంతి వత్సరంలో ‘దృశ్య మాధ్యమాల్లో గురజాడ సాహిత్యం’ అనే దానిపై దృష్టి పెట్టి, కార్యాచరణ రూపొందించి అమలు చేయడం ఎంతైనా అవసరం. ఇప్పుడైనా ఇది మొదలుపెడితే, గురజాడ మనకు దూరమైన ఈ రెండో శతాబ్దిలో, కనీసం, ఒక బాధ్యతాయుతమైన జాతిగా తలెత్తుకు నిలబడగలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రామేశ్వర స్వామి ధర్శనంసకల శుభప్రదం

రామేశ్వర స్వామి ధర్శనంసకల శుభప్రదం

  • – చివుకుల రామమోహన్
  • 27/10/2014
TAGS:

హిందువులందరికి భారతదేశములోని నలు దిశలా వెలసియున్న అనేక పుణ్యతీర్థాలను అనవరతం దర్శించి, విశేష పూజలు చేయుట, విశేషించి పర్వపు రోజులలో క్షేత్ర దర్శనం పుణ్యప్రదమని, ముక్తిదాయకమని భక్తజనుల నమ్మిక. అందుకు తగినటులనే ఈ పుణ్యక్షేత్రము నదీ పరీవాహక ప్రాంతములలోనే ఎక్కువగా కొలువు తీరుట కూడా పుణ్యనదీ తీర్థ స్నానాదుల కొరకేయని నిశ్చయంగా చెప్పవచ్చు.
కృష్ణానదీ తీరాన వెలసియున్న ప్రసిద్ధమైన ‘‘టేకుపల్లి’’ శ్రీ రామేశ్వరస్వామి క్షేత్ర ప్రాముఖ్యత ఇంతింత అని చెప్పరానిది. ఆదిశంకరులు భారతదేశాన్ని మూడు పర్యాయాలు పర్యటించి నాలుగు పీఠాలను ఏర్పాటుచేశారు. అంతేగాకుండా ఆలయాల పునరుద్ధరణా కార్యక్రమం కూడా విరివిగాజరిగింది.
‘టేకుపల్లి’ (కృష్ణాజిల్లా)లోని శ్రీ రామేశ్వరస్వామి దేవాలయం కూడా కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోని వెలసింది. దీనిని అగస్త్యముని ప్రతిష్ఠించారు. శతాబ్దాలుగా ఆరాధన జరుగుతున్న ఒక విశిష్ఠ క్షేత్రరాజము ఈ టేకుపల్లి శ్రీ రామేశ్వరస్వామి దేవాలయం. గత శతాబ్దంలో 1930 సంవత్సరంలో యడివల్లి రంగమ్మ కళ్ళేపల్లి గ్రామంలోవున్న తన 4 ఎకరాల సారవంతమైన మాగాణి భూమిని గుడి నిత్య పూజాది కార్యక్రమాలు జరుపు నిమిత్తం దానంగా అందజేశారు. అదే రీతిలో అద్దేపల్లి కుటుంబ సభ్యులు 56 సెంట్ల మాగాణ స్థలాన్ని ఆలయ ఖర్చులకు గాను అందజేశారు. అనంతరం విష్ణ్భుట్ల అన్నపూర్ణమ్మ ధ్వజస్థంభ నిర్మాణం చేయగా, ఐ.డి.బి.ఐ రిటైర్డ్ డైరెక్టరు పిల్లుట్ల నరసింహం 2010 దేవాలయానికి పునఃప్రతిష్ట చేశారు. ఈ మధ్యకాలంలో టేకుపల్లి శ్రీ రామేశ్వరస్వామిని దర్శించటానికి విశేష సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేస్తున్నారు.
క్షేత్ర దేవతలు
శ్రీ రామేశ్వరస్వామి దేవాలయంలో శ్రీ బాలాపార్వతి అమ్మవారు, శ్రీ వీరభద్రస్వామి, శ్రీ ఆంజనేయస్వామి వార్లు విచ్చేసి ఉన్నారు. ఆలయ దైనందిన కార్యక్రమం మరియు నిత్య పూజాది కార్యక్రమములు మరింత పటిష్టంగా నిర్వహించుటకు యడవల్లి కుటుంబ సభ్యులు ఈ ఆలయాన్ని శ్రీ కంచి కామకోటి పీఠమునకు 19.06.2014 దత్తతగా ఇవ్వటం జరిగింది. తదాదిగా ఈ దేవాలయంలోని అన్ని కార్యక్రమాలు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్రసరస్వతి స్వామివారు, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతిస్వామివార్ల అనుగ్రహముతో జరుపుతున్నారు.
ఈ దేవాలయం శ్రీ వల్లీ దేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి నెలకొనియున్న మోపిదేవి గ్రామానికి 6 కిలోమీటర్ల దూరములోను అలాగే కృష్ణానదీ సముద్ర సంగమమైన పెదకళ్ళేపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ దుర్గానాగేశ్వరస్వామి దేవస్థానమునకు 5 కిలోమీటర్ల దూరములో వున్నది. ఈ మూడు దేవాలయములు 11కిలోమీటర్లలో మధ్యస్తంగా వుండటం ఒక విశేషం.
టేకుపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ రామేశ్వరస్వామి దర్శించగోరు భక్తజనులు, విజయవాడ, మచిలీపట్నం, రేపల్లె పట్టణాల నుండి వస్తే చల్లపల్లి గ్రామంలో గాని లేదా మోపిదేవి గ్రామాన గాని బస్సుదిగి ఆటోరిక్షాలో సౌకర్యవంతంగా చేరవచ్చు. మరొక ముఖ్య విశేషం ప్రపంచప్రఖ్యాతమైన కూచిపూడి నాట్యానికి ప్రసిద్ధమైన కూచిపూడి గ్రామం ఇచ్చటకు 25 కిలోమీటర్లదూరములోనే వున్నది.
విశేష పూజలు
ప్రతి సంవత్సరం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి విజయదశమి వరకు శ్రీ బాలాపార్వతి అమ్మవారి శరన్నవరాత్రి ఘనంగా నిర్వహిస్తారు. దైనందినంగా శ్రీ రామేశ్వరస్వామివారికి మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం మరియూ అమ్మవారికి లక్ష్మి అష్టోత్తర, దుర్గస్తోత్ర, బాలసహస్ర నామార్చన. శ్రీ ఆంజనేయస్వామివారికి, వీరభద్రస్వామి వార్లకు అర్చన, ధూపదీప నైవేద్యములు నిత్యం జరుగుతుంటాయ. సాయంత్రం వేళ బాల పార్వతిదేవికి లలితాసహస్ర నామవళి పఠిస్తారు. క్షేత్రదర్శనం ఉపాసనాపరంగానే గాక, భక్తితత్పరతతో క్షేత్ర దేవతామూర్తులను కొలచినవారికి సకల శుభాలు జరుగుతాయని ఇక్కడి ప్రజల నమ్మిక. సర్వరోగ నివారణార్థం, సకలాభివృద్ధికి శ్రీ రామేశ్వరస్వామి క్షేత్ర దర్శనం అత్యంత శుభప్రదం.
ఇక్కడ ఆవిర్భవించిన ఈ స్వయంభూః శ్రీ రామేశ్వరస్వామి క్షేత్ర దర్శనం సకల శుభప్రదం మోక్షదాయకం. కనుక భ క్తజనులందరూ స్వామివారిని, అమ్మవారిని దర్శించి వారి అనుగ్రహ పాత్రులవ్వాలని ఆశిద్దాం.

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాటక సాహిత్యంపై విజ్ఞాన సర్వస్వం..

నాటక సాహిత్యంపై విజ్ఞాన సర్వస్వం..

  • -ద్వా.నా.శాస్ర్తీ
  • 06/12/2014
TAGS:

తెలుగు పద్య
నాటకములు-అనుశీలన (సిద్ధాంత గ్రంథం)
-డా.దేవరపల్లి ప్రభుదాస్
వెల: రు.350
ప్రతులకు రచయిత,
ఫోన్ నం. 9440448948

పద్య నాటక స్వరూప స్వభావాలు, పద్యనాటకాల వర్గీకరణ, విశే్లషణ, ప్రదర్శనా విధానం, ప్రేక్షకుల స్ఫూర్తి, పద్యనాటక ప్రముఖ నటులు-సమాజాలు…అనే విధంగా నాలుగు అధ్యాయాలుగా వింగడించబడింది. చివరలో అనుబంధం ఉంది గానీ అది వ్యక్తిగతం తప్ప పాఠకుడికి లాభించేది కాదు. నాట్యకళ ఆవిర్భావం, రాజుల నాట్య గాన ప్రసక్తి, యక్షగానాలు, ఆరుబయలు రంగస్థలం వంటి వాటిని పూర్వ రంగంగా వివరించారు. అయితే తొలిగా సుగ్రీవ విజయం పేర్కొనాలి. (ఇది రాసిన కవి కందుకూరి రుద్రయ్య అన్నారు-రుద్రకవి గదా!) పద్య నాటకాల ప్రారంభ దశను విశే్లషిస్తూ మంచి సమాచారమిచ్చారు. ప్రభుదాస్ పరిశోధన, విశే్లషణలు ఎంత లోతుగా ఉన్నాయో ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. పురాణం సూరి శాస్ర్తీ గారిచ్చిన నాటక రచనల వర్గీకరణ జాబితాను పట్టుకుని మనకి అందించారు. తెలుగులో మొత్తం 1410 పద్యనాటకాలు రచించబడ్డాయని తెలిపి వాటిని పేర్కొనడంవల్ల పరిశోధన మరింత ప్రామాణికమయింది. నాటక సమాజాలు ప్రారంభంలో ఎన్ని ఉన్నాయో తెలిపే పట్టిక నేటి పరిశోధకులకి ఉపయుక్తంగా ఉంటుంది.

తెలుగులో నాటక వాజ్ఞ్మయం అనగానే డా. ప.ఎస్.ఆర్. అప్పారావు గుర్తుకురావాల్సిందే. వీరి ‘తెలుగు నాటక వికాసము’ అనే ప్రామాణిక గ్రంథం నేటికీ గొప్ప ఆకర గ్రంథమే. ఆ తర్వాత చాలా పుస్తకాలు వెలువడ్డాయి. దేవరపల్లి ప్రభుదాస్ తెలుగు విశ్వవిద్యాలయంలో పద్య నాటకాలపై ప్రత్యేకంగా పరిశోధన చేసారు. ఆ సిద్ధాంత గ్రంథాన్ని అందుబాటులోకి తేవడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. పరిశోధక విద్యార్థులకి, నాటక రంగం వారికి మార్గదర్శకంగా ఉంటుంది.
పద్య నాటక స్వరూప స్వభావాలు, పద్యనాటకాల వర్గీకరణ, విశే్లషణ, ప్రదర్శనా విధానం, ప్రేక్షకుల స్ఫూర్తి, పద్యనాటక ప్రముఖ నటులు-సమాజాలు… అనే విధంగా నాలుగు అధ్యాయాలుగా వింగడించబడింది. చివరలో అనుబంధం ఉంది గానీ అది వ్యక్తిగతం తప్ప పాఠకుడికి లాభించేది కాదు. నాట్యకళ ఆవిర్భావం, రాజుల నాట్య గాన ప్రసక్తి, యక్షగానాలు, ఆరుబయలు రంగస్థలం వంటి వాటిని పూర్వ రంగంగా వివరించారు. అయితే తొలిగా సుగ్రీవ విజయం పేర్కొనాలి. (ఇది రాసిన కవి కందుకూరి రుద్రయ్య అన్నారు-రుద్రకవి గదా!) పద్య నాటకాల ప్రారంభ దశను విశే్లషిస్తూ మంచి సమాచారమిచ్చారు. ప్రభుదాస్ పరిశోధన, విశే్లషణలు ఎంత లోతుగా ఉన్నాయో ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. పురాణం సూరి శాస్ర్తీ గారిచ్చిన నాటక రచనల వర్గీకరణ జాబితాను పట్టుకుని మనకి అందించారు. తెలుగులో మొత్తం 1410 పద్యనాటకాలు రచించబడ్డాయని తెలిపి వాటిని పేర్కొనడంవల్ల పరిశోధన మరింత ప్రామాణికమయింది. నాటక సమాజాలు ప్రారంభంలో ఎన్ని ఉన్నాయో తెలిపే పట్టిక నేటి పరిశోధకులకి ఉపయుక్తంగా ఉంటుంది. సురభి సమాజంలోని పనారస గోవిందరావు కృషిని కళ్లకి కట్టించారు. ప్రభుదాస్ సూక్ష్మ పరిశీలన చేసారనడానికి విశాఖపట్నంలోని సంగీత మానినీ సమాజం గురించి పేర్కొనడమే నిదర్శనం. మారేపల్లి రామచంద్రశాస్ర్తీగారు(కవిగారు) 1902లోనే దీనిని స్థాపించి వేశ్యలలో మార్పు తీసుకు వచ్చి వారిచేత పాత్రలు వేయించిన సంఘ సంస్కర్త.అందరూ మరిచిపోయిన కవిగారి గురించి సేకరించి రాయడం పరిశోధనకి వనె్న చేకూర్చింది. ఒకే వస్తువు గల నాటకాన్ని ఎవరెవరు రాసారో విశేష సమాచారం ఇచ్చారు.
పద్య నాటకాలకే పౌరాణిక నాటకాలని పేరు. ఇతి హాసాలలో పురాణాలలో గల ఇతి వృత్తాలు పద్య నాటకాలకి మూలాలు. అయితే నాటక రచయితలు తమ కల్పనలు జోడించి ప్రేక్షకుల మెప్పుకోసం, ప్రదర్శనా సౌలభ్యం కోసం రాసేవారు. నాటకాల వర్గీకరణ కూడా రచయిత శ్రమ ఫలితమే! ‘సుప్రసిద్ధ పద్యనాటకాల విశే్లషణ’లో పేర్కొన్న ఏడు నాటకాలూ సుప్రసిద్ధమే కానీ- ‘రక్తబలి’ వీటిలాగ సుప్రసిద్ధమని తెలియదు. ఈ నాటికల ఇతివృత్తం, అంకాల సారాంశం ఇస్తూ విశే్లషించారు. ‘కురుక్షేత్ర’ నాటకంలో కృష్ణుడు కర్ణునితో నువ్విటు వచ్చేస్తే ద్రౌపది నిన్ను ఆరవ భర్తగా స్వీకరిస్తుందనే పద్యం ఉదహరించారు. అయితే అమూలకమని చెప్పడం సమంజసం. సత్య హరిశ్చంద్ర నాటక విశే్లషణలో ‘కాటిసీను’లో జాషువా పద్యాలు పాడతారని చాలామందికి తెలీదు. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రాసిన పద్యాలు కావివి ఈ సంగతి సమాజం వారు చెప్పకపోవడం అన్యాయం. ప్రభుదాస్ చెప్పిన కొత్త అంశం ఏమిటంటే జాషువా పద్యాలు కాటిసీనులో చేర్చి పాడడం అనేది బండారు రామారావుగారితో ప్రారంభమైందనడం! జాషువా పద్యాల వల్లనే ఆ సీను కరుణ రస ప్లావితం అవుతోంది. తాండ్ర సుబ్రహ్మణ్యం రాసిన ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ (ఇది కూడా కల్పితమంటారు), విద్వాన్ కణ్వశ్రీ రాసిన ‘బాలనాగమ్మ’, శ్రీపాద కృష్ణమూర్తి శాస్ర్తీ గారి ‘బొబ్బిలి యుద్ధం’, కాళ్లకూరి నారాయణరావుగారి ‘చింతామణి’ నాటకాలను విశే్లషించారు. ‘చింతామణి’ నాటకంలో ప్రదర్శించే వారి నోటినుంచి వచ్చే మితిమీరిన అసభ్య పదాలు తక్కువే. ఇది సంఘ సంస్కరణ నాటకం. కాళ్లకూరి వారు రాసిన మూడు నాటకాలు సంస్కరణాత్మకమైనవే. అసలు ఆయన జీవితమే సంస్కరణ దిశగా సాగింది. చివరగా ‘ఆంధ్ర భీమ’ గుంటుపల్లి ఇన్నయ్య రాసిన క్రైస్తవ తొలి నాటకం ‘రక్తబలి’ గురించి వివరించారు.
మూడో అధ్యాయంలోని ప్రదర్శనా పద్ధతులు అనే అంశం మొదటి అధ్యాయంలోనే రావాల్సి ఉంది. ఇందులో ‘పద్యం చదవడమా? పాడడమా?’ అని వివరించారు కానీ టూకీగా ఉంది. పద్యం రాగభరితమైతే రాగం బాగుందనిపిస్తుంది కానీ పద్యం బాగుందనిపించదని చెప్తారు. కానీ రాగం లేకుండా చదివితే వచనానికి పద్యానికి తేడా ఏముంది? ప్రభుదాస్ చెప్పినట్టు ‘వన్స్‌మోర్’ల కోసం, ఆధిక్యతను ప్రదర్శించడం కోసం రాగాలుతియ్యడం అలవాటైపోయింది. కాబట్టి భావయుక్తంగా, తగిన రాగంలో శ్రుతిపక్వంగా పాడడం సముచితం. ఇంకా పద్యానికి వాద్య సహకారాలు, సంగీతం పాత్ర, రసాభాస, నంది నాటకోత్సవాలు వంటి వాటిని కూడా వివరించారు. నాటకాల విమర్శ మరింత అవసరమనిపిస్తుంది. ఆయా నటుల ప్రత్యేకతల్ని ప్రదర్శనలోగల లోపాలు, చమత్కారాలను కూడా చేరిస్తే బాగుండేది. ఏమైనా పద్యనాటకాలపై ఈ గ్రంథం ప్రామాణికం. మినీ విజ్ఞాన సర్వస్వం!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఓ తెలుగు సైనికుడి భాషా బాణాలు

ఓ తెలుగు సైనికుడి భాషా బాణాలు

  • -సన్నిధానం నరసింహశర్మ
  • 06/12/2014
TAGS:

తెలుగు భాషంటే అలుసా?
-డా.తూమాటి సంజీవరావు,
134 పుటలు,
వెల: రూ.100/-
ప్రతులకు: శ్రీమతి టి.హైమవతి,
35/16, సెకండ్ ఫ్లోర్,
15వ వీధి, అశోక్‌నగర్,
చెన్నై- 600 083.

తమిళనాడు దొరతనం తెలుగు వాచకాల్ని అచ్చువేసిన ఓ సందర్భంలో- వాటిలోని తప్పుల్ని సరిదిద్దవలసిందేనని చెన్నయ్‌లోని ఓ బడిపంతులు న్యాయస్థానానికి వెళ్ళారు; నెగ్గారు. అంతేకాదు ప్రాచీన భాషగా తెలుగు గుర్తింపును వ్యతిరేకించిన కుట్రదారులకి వ్యతిరేకంగా తనంతట తానే ప్రతికక్షిగా ధైర్యంగా నిలబడ్డారు. ఆయనే డా.తూమాటి సంజీవరావు- ఈ ‘తెలుగంటే అలుసా?’ అనే పొత్తానికి రచయిత, సంస్కృతం, ఆంధ్ర భాషల్లో పదప్రయోగ రహస్యాలు, వ్యాకరణాంశాలూ తెలిసిన పండితుడు.
ఉపోద్ఘాత ఉపసంహారాలతో కలసి 27 శీర్షికలుగా సాగిన చిన్న చిన్న వ్యాసాలు- తెలుగు భాషాక్షరాలు, పదాలు, వ్యవహారాలు, మార్పులు, చేర్పులు, పత్రికలవారుప్రయోగించే పదప్రయోగాలపై తమ భావాలు వంటివెన్నింటికో వివరణాత్మక, విమర్శనాత్మక విశేషాలు, విశే్లషణలూ నిండి వున్నాయి. ఇందులో కొన్ని ఇతరులు ఇదివరకే తడిమినవీ వున్నాయి, తాముగా క్రొత్తగా చెప్పేవీ వున్నాయి. విద్యార్థి జనానికే కాక పెద్దవారూ తెలుసుకోవలసినవీ వున్నాయి.
2014 మార్చి బెంగుళూరు పత్రిక ‘తెలుగుతేజం’లో ఇచ్చిన అరవై ఆరు పదాల అపశబ్ద సుశబ్ద పట్టికని ఇవ్వడం ప్రయోజనకరం. పదాల ఒప్పుతప్పుల నిగ్గుతేల్చి చెప్పాలనేది ఒక సామాజికాంశం. అయితే నిజాయితీ అభినందనీయమే అయినా కొన్ని సందర్బాలలో దూకుడుతనం అంత అక్కరలేదనిపిస్తుంది. రామోజీ ఫౌండేషన్‌వారు అత్యుత్సాహంతో తెలుగు భాషకు ఈనాడు, ఈటీవీ ద్వారా చేస్తున్న సేవలు-చాలవని తెలుగువెలుగు మాసపత్రికను ప్రారంభించారు. కాని భాషపై సరియైన అవగాహన లేనివారి ద్వారా వెలుగును ప్రసాదిస్తామంటే అది ఎంతవరకు సాధ్యమవుతుంది’’అన్నారు. (పుట.43). ఇక్కడ ‘అత్యుత్సాహంతో’ అని అనవలసిన అవసరం లేదేమోననిపించింది. మళ్ళీ ఆ పేరాలోనే ముందు వాక్యం ‘కొందరికిగల ఉత్సాహాన్ని ప్రోత్సహించవలసింది’ అని కూడా రచయితే అన్నారు.
గురుభ్యోన్నమః అనకూడదు; గురుభ్యోనమః అనాలని, ‘అథమ’ ప్రయోగం మానుకోవాలని ఇలా కొన్ని చెప్పడం గ్రహించడానికి మంచిదే. అయితే వాడుక భాషలో ప్రజలు కొన్నిటి మార్చడం కొన్నిటికి అర్థాలు కాలార్థాలు చేయడం పరిపాటే. సుస్వాగతం వాడడం మంచిది ఎందుకు కాదో వేత్తలు చెబుతారు. స్వాగతం చెప్పేదానికి బలకరంగా చెప్పినట్లుగా భావించుకుని సుస్వాగతాన్ని ప్రజలు వాడడాన్ని స్వాగతించవలసిందే.
‘‘ఇంటర్‌లో సున్నాల పాపం విద్యార్థులదా? అధ్యాపకులదా?’’ అనే వ్యాసం రచయిత సమస్యాధ్యయన శక్తికి దర్పణం పట్టింది. పాఠశాలల్లో భాషాబోధన విషయంలో ఈయన సూచనలు ఆలోచనాత్మకాలు (పుట 57) తిరుపతిలో 2012లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగిన సందర్భంలో ‘ఆహూతులకు స్వాగతం’ బానర్ని అర్థవంతంగా విమర్శించారు. అయితే ఒక్కొక్కప్పుడు చెప్పేదానికి సాగతీతతో చెప్పినట్లనిపించింది.
‘్భష కాలానుగుణంగా మారుతుంది. మారటం దాని సహజ లక్షణం. మారుతుంటేనే అది జీవభాష/ జీవద్భాష అవుతుంది. ఆ మార్పులో కృతకత్వం కంటె సహజత్వం ఉండాలి. అటువంటిదే సమాజంలో అంగీకారమవుతుంది’’(పుట 66) అన్నారు. అందువల్లనే కొన్నిటిని సర్దుబాట్లతో చూడాలి.
బ్లాక్‌బోర్డు అంటే నల్లబల్ల సరిపోతుంది. బ్లాక్‌మనీ అంటే ‘నల్లడబ్బు’ ఎలా సరిపోయింది. అది పత్రికలవారు వాడేది అంటారీయన. ఇక్కడ నలుపు భావించుకోవలసింది. పదుగురాడుమాట పాడియై ధర జెల్లింది, నల్లడబ్బు ప్రజాస్థీరీకరణ అయింది. ‘నల్లబజారు’నూ వాడుతున్నాం గదా! అయితే శబ్దమూలాలను వాటి ఆనుపానులను గ్రహించడం మంచిదే. ‘వాల్‌పోస్టరును కుడ్యపత్రిక అని తర్జుమా చేసి వ్రాశారు. తరువాత గోడపత్రిక అని వ్రాస్తున్నారు. గోడ దేశ్యపదం, పత్రిక తత్సమం ఈ రెండింటినీ ఎలా కలిపారో ఆ కలిపినవారికే ఎరుక’ (పుట 67) అన్నారు. భాష ప్రవాహశీలం, కాలానుగుణం అని ఒకప్రక్క ఒప్పుకొంటున్నప్పుడు ఈపాటి మిశ్ర సమాస పదాలను ముఖ్యంగా పాతుకుపోయిన వాటిని ఆహ్వానించకపోతే ఎలా?
సంజీవరావు ఆలోచనలు ఆలోచించవలసినది. అధ్యయనం అభినందించదగినది. భాషకు సంబంధించిన సామాజిక సమరం ప్రస్తుతించవలసింది అని ఎవరికైనా అనిపిస్తుంది ఈ పుస్తకం చదివితే.
ఓసారి ఏదో సందర్భంలో ఎవరో చెళ్లపిళ్లవారితో ‘దీనికి వ్యాకరణం’ ఒప్పుకుంటుందా? అంటే శ్రవణ వ్యాకరణం ఒప్పుకుంటే చాలన్నారట.
తూమాటి సంజీవరావు సంస్కృత శబ్దాల విషయంలో ఎక్కువ చెప్పారు. తెలుగు మాటల విషయంలో కూడా వారు రచనలు కొన్నిచేస్తే అవీ ఉపయోగకరంగా ఉంటాయి. తెలుగు భాష అంటే అలుసుగా చూడకుండా ఉండడానికి ఇటువంటి పుస్తకాలు అవసరం

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విచ్చిన పూరేకుల జీవన సౌందర్య నాదం

విచ్చిన పూరేకుల జీవన సౌందర్య నాదం

  • -మల్లెల నరసింహమూర్తి
  • 06/12/2014
TAGS:

పూలండోయ్ పూలు కవిత్వ సంకలనం చదివిన ప్రతి రసహృదయుడూ ఒక రంగుల ప్రపంచం లాంటి ప్రసిద్ధ చిత్రకారుని ‘ఆర్ట్‌గ్యాలరీ’లోకి వెళ్లి వర్ణనకు భాష చాలని ఒక అద్భుత ‘వర్ణానుభూతిని’ పొంది తన్మయత్వంతో వెలుపలికి వస్తాడనటంలో సత్యసౌందర్య పూర్వకమైన సాహిత్య ప్రమాణమున్నది. బహుశ మనం సాధారణంగా అలవాటుపడ్డ Verbal expression కవి ప్రసాదమూర్తి “heightened emotions’ ని అంధుకోవడానికి, అభివ్యక్తం చెయ్యడానికి చాలా సిమితమైన మార్గంగా అగుపిస్తుంది. అతని కళాత్మక అనుభూతి పూలతోటల్లోకి సీతాకోక చిలుకలై ఎగిరిపోవాల్సిందే.
సుప్రసిద్ధ సాహితీవేత్త సోమసుందర్‌గారు ప్రసాదమూర్తి కవిత్వంలో ప్రసాద గుణం స్పష్టంగా కనిపిస్తుంది అని, విశిష్ట కవి అని అభినందించారు. ప్రసాదమూర్తి సహజంగానే సౌజన్యమూర్తి, భావుకుడు, సౌందర్యోపాసకుడు, ప్రకృతి ఆరాధకుడు, సాత్వికుడు, సదాసంచారి, సత్యానే్వషి, సంఘమిత్రుడు, ఉలిపట్టని కవిశిల్పి.
‘పూలండోయ్ పూలు’ కవిత్వాన్ని ‘చిత్రచిత్రాలు’గా రంగురంగులుగా, నది పాయలు పాయలుగా చదువుతూ, అనుభూతి చెందుతూ ఉంటున్నప్పుడు ఒక అనిర్వచనీయమైన తాదాత్మ్యంలోకి వెళదాం. చైనా దేశపు తాత్త్విక పరిభాషలో ‘తావోయిజం’ పదజాలంలో అక్షరీకరించాలంటే అదొక “Transcendental consciousness’.
‘పూలండోయ్ పూలు’ కవిత ఇటీవల తెలుగు కవిత్వంలో వచ్చిన “the most melodious, magical, mesmerising and enchanting poem గా సహృధయుల్ని సమ్మోహపరిచింది. తన్నుతాను గానం చేసుకుంటూ, సరసుల హృదయ సరస్సుల్లోనే, హంసలా భావతరంగ మాలికలపై డోలలూగుతున్నది.
ఈ కవితలో ఈ చరణాలు.. ప్రసాదమూర్తి విలక్షణమైన ఊహాశక్తికి అద్దం పడుతున్నాయి.
‘‘మనుషులంతా పువ్వులైపోయినట్టు..,
పువ్వులు మనుషుల్ని మూటలుగట్టి
మంచికీ, మానవత్వానికీ మధ్య,
ఆదానప్రదానాలు చేస్తున్నట్టు..,
పై చరణాల్లోంచి ఒక సారాంశాన్ని పిండుకోవడానికి వీలుంది. కవిత్వ కళ ఆత్మకళగా, హృదయ కళగా విమర్శ పరిభాషలో ప్రస్తావించబడుతూ వుంటుంది. అది మనిషిని తన అంతస్సీమలలో గూడుకట్టుకున్న చీకటి నుంచి తేజస్సుదిశగా ప్రస్థానం సాగింపచేసే కళాత్మక సాధనం. మనిషిలోని negative impulses, క్రూరత్వం, ధ్వేషం, అసూయల్ని సమూలంగా ‘ప్రక్షాళన’ చేసి, వాటి స్థానంలో నిష్కళంక ప్రేమ, అవ్యాజమైన కరుణ, మైత్రి వంటి positive emotionsని ప్రతిష్టించే సంస్కారోన్నత ప్రక్రియ. దీనినే (catharisis (purgation) కెథారిసిస్ అని ప్రసిద్ధ గ్రీకు సాహిత్య తత్త్వవేత్త అరిస్టాటిల్ విశే్లషించాడు.
ప్రసాదమూర్తిపై కవితలోనే ‘పరమార్థం’ అనే మాటలో టాల్‌స్టాయ్ భావన “poetic justice’ ద్వారా నీతిబద్ధత, ధర్మాచరణ, మానవతాదీప్తి స్ఫూర్తిని ప్రతిష్టించగలడు అన్న భావన అంతర్గతంగా ప్రవహిస్తున్నది.
ఈ కవితలో మరొక విలక్షణత కనిపిస్తుంది. బాహ్య ప్రపంచాన్ని మనిషి తనకు సంబంధించి కేవల పదార్థంగా కాకుండా దాన్ని తనలో పెనవేసుకున్న మానవీయ సంబంధాల్లోంచే చూస్తాడు. కనుక సాహిత్యం ఎప్పుడైనా మానవ సంబంధాలకు అతీతంగా బాహ్యప్రపంచాన్ని దర్శించలేదు. తత్త్వానేషణకు ప్రయత్నించదు. సాహిత్యంలో హృదయపరమైన, నిర్మలమైన, నిసర్గమైన ఊహలకు ఉన్నతమైన స్థానం కలదు. అదే కళాత్మక స్థానం. ఈ ప్రక్రియలోనే బాహ్యప్రకృతి మానవీకరణ చెందింది. ప్రాచీన సాహిత్యంలో నదులు జవనాశ్వాలుగా, పరుగెత్తే గోవులుగా పోల్చబడ్డాయి. కవుల సృజనల్లో నదులు, సముద్రాలు మానవీకరణ చెందాయి.
ఇక్కడ ప్రసాదమూర్తి ‘పూలండోయ్ పూలు’ కవితలో విలక్షణంగా, మనుషులంతా పువ్వులైనట్లుగా భావించాడు. మానవులు వాళ్లకంటే ఉదాత్తమైన, ప్రేమ పాత్రమైన సుమనోహరమైన, సుకుమారమైన పువ్వులుగా రూపాంతరం చెందారు. అంటే మనుషులు పుష్పీకరణ చెందారు అనవచ్చునేమో. ప్రసాదమూర్తి భావన ప్రకారం మానవత్వం కన్నా పూలతనం (పుష్పతనం) (Flowerliness) మరింత ఉదాత్తమైనది. మానవ సహజం తనకుతాను ఒంటరితనంతో కుంచించుకుపోకుండా సామూహికత్వాన్ని పొందాలి. తద్వారా మానవ సంబంధాలు బలపడతాయి. అదే మానవప్రగతి. మనిషిని మరొక మనిషికి మరింత సమీపానువర్తిగా చేయటంలో దోహదపడటమే సాహిత్యంయొక్క అంతిమ లక్ష్యం. మానవ జీవితాన్ని మరింత సంస్కారవంతంచేసి, ఉత్తమంగా ఉన్నతీకరించడం సాహిత్యంయొక్క ఉదాత్తమైన బాధ్యత. ఈ సామాజిక సత్యం తెలిసినవాడు సాహిత్య సూత్రం కమ్యూనిజం, హ్యూమనిజం ద్వారా అధ్యయనం చేసినవాడు కనుకే ప్రసాదమూర్తి.
కవి ప్రసాదమూర్తి ‘పూలండోయ్ పూలు’ కావ్యంలో ఎన్నో కవితలు, అమ్మ పుట్టినరోజు, వాన, వాన, వాన, చిలకల రైలు డబ్బా, చెల్లి అమెరికా యాత్ర, పురాప్రియురాలు మొ… అన్నీ ఈ కవిచిత్రకారుని కవిత్వ చిత్రశాల (పొయెట్రీ ఆర్ట్‌గ్యాలరీ)లో కళాఖండాలు. మాలాంటి కరువుసీమలో వజ్రకరూరు వజ్రాల్లాంటి వడ్లగింజలు, సన్నబియ్యపు గింజల లాంటి వాన చినుకులు, కవి చిత్రకారుడు (Poet Painter) ప్రసాదమూర్తిగారి “Rare collection of poetry paintings”.
ఫ్రసాదమూర్తి కవిత్వ నిర్మాణ పద్ధతి ఒక చిత్రకారుడు దృశ్యాన్ని కళ్లద్వారా మనసులోకి ఒంపుకునే ధ్యాన మార్గం. శిల్పిశిల్పాన్ని మలిచే ముందు సంభావించిన శిల్పానికి అనుగుణమైన శిలను ఉలితో హస్తస్పర్శతో పరిశీలించే నిపుణత్వం. నైశిత్యం.
అందుకే చివరగా ప్రసిద్ధ చిత్రకారుడు పి.మోహన్ ప్రపంచ ప్రఖ్యాత ఇటాలియన్ చిత్రకారుడు డావిన్సీ, మొనాలిసా చిత్ర రచననుచేసే రసాత్మక సౌందర్య సమయ వర్ణన ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
‘‘డావిన్సీ నవ్వుతూ కుంచెను, రంగుల పలకను అందుకున్నాడు. ఈజిల్‌పై అప్పటికే కొంత ఆవిష్కృతమైన మోనాలిసా వర్ణచిత్రాన్ని నిశితంగా చూశాడు. కుంచెను లేత గోధుమ, రోజా రంగులను కొద్దిగా అద్దుకుని పలకపైనే వాటిని కలిపాడు. మోనాలిసా ముఖంపై ఆవరించిన వెంటాడే నవ్వును, వెలుగునీడలను కళ్లలోకి ఆవాహన చేసుకున్నాడు. తూలికాచాలనం మొదలైంది. అందులోంచి సౌందర్యోపాసనానాదం మంద్రంగా విస్తరిస్తోంది. మోనాలిసా మనోదేహాలు అతని కుంచెలో రంగుల స్నానంచేసి తడితడిగా చిత్రంలోకి ఒదిగిపోతున్నాయి.’’
ఈ వర్ణనతో పొయెట్ పెయింటర్, అనే్వషి, సంచారజీవి ప్రసాదమూర్తిగారిని నిండు గుండెతో అభినందిస్తూ. మనసున మల్లెల మాలలూగుతూ ఉండగా, అతని కవిత్వపు కర్పూర వెనె్నలలో కరిగిపోతా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వెయ్యి వారాలు లేజాయేంగే

వెయ్యి వారాలు లేజాయేంగే

  • 07/12/2014
  • — ఆదిత్య

* ఊరూరా ప్రభంజనమే.. ఓ తీర్థానికో, ఓ పుణ్యక్షేత్రానికో వెళ్తున్నట్లు కుటుంబాలకు కుటుంబాలు ఎడ్లబండ్లు కట్టుకుని మరీ ఆ సినిమా చూసేందుకు తరలి వెళ్లేవారట! ఎన్టీఆర్, అంజలీదేవి ఎక్కడ కనిపించినా వారిని ‘సీతారాములు’గానే భావించి మంగళహారతులు పట్టేవారు.. ‘తెలుగింటి సీత’ అంజలీదేవి ఎదురైతే చాలు- ‘ఎన్ని కష్టాలు పడ్డావు తల్లీ..’ అని కన్నీళ్లు పెట్టుకునేవారట! 1963లో తెలుగునాట ‘లవకుశ’ విడుదలైనపుడు ఎక్కడ చూసినా ఇలాంటి ముచ్చట్లే.. *** * మొట్టమొదటి ‘సంపూర్ణ తెలుగు టాకీ’గా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ‘భక్తప్రహ్లాద’ సినిమా 1932లో మద్రాసులోని ‘నేషనల్ పిక్చర్ ప్యాలెస్’లో విడుదలైంది.. ‘ప్రేక్షకులచే హాలు క్రిక్కిరిసి పోవుచున్నది.. గనుక ముందుగా స్థలము కొరకై జాగ్రత్త పడుడు.. ఈ 100% సంపూర్ణ తెలుగు టాకీ చూచు యవకాశము పోగొట్టు కొనకుడు..’ అంటూ అప్పట్లో ఇచ్చిన ప్రకటనలు- సినిమాల పట్ల జనాలకు ఎంత మోజుందో చెప్పకనే చెబుతాయి… *** * భారతీయ చలనచిత్ర పితామహుడు దాదా ఫాల్కే మొదటి ప్రపంచ యుద్ధం చివరి దశలో తన రెండో చిత్రం ‘లంకాదహన్’ (1917) ఎన్నో వ్యయప్రయాసల నడుమ పూర్తి చేశారు.. ఆ సినిమా విడుదలైనపుడు టిక్కెట్లకు అంచనాలకు మించి డిమాండ్.. కౌంటర్ల వద్ద అదుపుచేయలేనంతగా జన సందోహం.. మామూలు ప్రదర్శన వేళలతో ఇక లాభం లేదని భావించి బొంబాయిలోని ‘వెస్ట్‌ఎండ్’ థియేటర్ యాజమాన్యం ఉదయం నుంచి సాయంత్రం చీకటిపడే వరకూ వరుసగా ఆటలు ప్రదర్శించినా తగ్గని ప్రేక్షక జనం.. దూరప్రాంతాల నుంచీ జనం తండోపతండాలుగా రావడంతో థియేటర్ పరిసర ప్రాంతాల్లో ఎటుచూసినా ఎడ్లబండ్లే.. ఇదే ‘లంకాదహన్’ను చూసేందుకు పూణెలోని ‘ఆర్యన్’ థియేటర్‌లోకి జనం తలుపులు బద్దలు కొట్టుకుని లోనికి చొచ్చుకుపోయినంత సాహసం చేశారట! మద్రాసులో ఈ సినిమా ప్రదర్శించినపుడు భారీగా వచ్చిన వసూళ్లను ఎడ్లబండిపై పెట్టుకుని పోలీసుల కాపలాతో తరలించారట! *** ఒక సినిమా నూరు రోజులు ఆడితేనే గొప్ప వేడుక చేసుకుంటారు అభిమానులు… అదే సినిమా ఏళ్లు, దశాబ్దాలు పూర్తి చేసుకుంటే యావత్ భారతీయ సినీ ప్రేక్షకులకూ అరుదైన సంబరమే… ఒక సినిమా తొలిసారి చూసిన అనుభూతే- ఇరవయ్యోసారి చూసినా కలిగిందంటే, ముప్ఫయి ఆరోసారి ఇంకాస్త కొత్తగా అనిపించిందంటే, ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందంటే- నిస్సందేహంగా ఆ సినిమాను ‘క్లాసిక్’ అనక తప్పదు. అచ్చంగా అలాంటి సినిమా- ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’. చాలా చిత్రాలు సాదాసీదాగా ఉంటూ కాలగర్భంలో కలిసిపోతాయి. కొన్ని మాత్రమే జన హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని, రాబోయే సినిమాలకు దిశానిర్దేశం చేస్తాయి. ఎన్ని వేల సినిమాలు వచ్చినా తమ ప్రత్యేకతను పదిలంగా నిలబెట్టుకుంటాయి. 1995 అక్టోబర్ 20న దేశ వ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించిన ‘దిల్‌వాలే..’ను ఇప్పటికీ ముంబైలోని ‘మరాఠా మందిర్’ థియేటర్‌లో నిరాటంకంగా ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఈ నెల 12వ తేదీ నాటికి అక్షరాలా ‘వెయ్యి వారాల’ ప్రదర్శన పూర్తికాబోతోంది.. అందుకే ఈ శతాబ్దపు అద్భుత చలన చిత్రంగా ఇది కొత్త చరిత్ర సృష్టించింది. 19 ఏళ్ల క్రితం ఈ సినిమా విడుదలైనపుడు ఇంతటి సంచలనాత్మక విజయం సాధిస్తుందని, వెయ్యి వారాల సుదీర్ఘ ప్రదర్శనతో ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోతుందని దర్శక,నిర్మాతలు ఊహించి ఉండరు! ఎన్నిసార్లు చూసినా… టీవీ ముందు కూర్చుని చేతిలో రిమోట్ కదులుతూంటే- అనుకోకుండా ఏదో ఒక చానల్‌లో ‘దిల్‌వాలే..’ తగులుతుంది… ఎప్పుడో చూసిన సినిమా అయినా మనం దృష్టి మరల్చుకోలేం.. సరదాగా కొద్దిసేపు చూసి మరో చానల్‌కు వెళ్లామనుకుంటాం.. అయితే- ఆ సంగతే మరచిపోతాం… సన్నివేశాలు మారుతుంటాయి.. సమయం గడిచిపోతుంటుంది.. ఆ సినిమాలో మమేకమైపోతాం.. ‘శుభం’ కార్డు పడేవరకూ అప్రయత్నంగానే సినిమా చూసి ఆస్వాదిస్తాం.. ప్రతిసారీ ఇదే విధమైన అనుభూతి.. ఎనే్నళ్లు గడిచినా ఇలాంటి అనుభవమే.. ఇదీ- ‘దిల్‌వాలే..’ ఘనత! ‘యశ్‌రాజ్ ఫిలింస్’ నిర్మాణంలో ఆదిత్య చోప్రా దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, కాజోల్ ప్రధాన పాత్రల్లో నటించగా నిర్మించిన ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ ప్రేమకథా చిత్రాల్లో కలికితురాయిగా నిలిచింది. టీనేజీ ప్రేమకథలను వెండితెరపై ఎంత అద్భుతంగా, రసరమ్యంగా ఆవిష్కరించవచ్చో నిరూపించిన ఈ సినిమా ఇప్పటి తరానికి ‘మార్గదర్శి’గా నిలిచింది. కొన్ని పాత్రలు కొందరి కోసమే పుట్టాయని అనిపిస్తుంది. ఆ పాత్రల్లో మరొకరిని ఊహించలేం. ఈ సినిమాని వేరే నటీనటులతో మళ్లీ నిర్మించినా ‘రీ ప్లేస్‌మెంట్’ ముమ్మాటికీ అసాధ్యం. ఇంత గొప్పగా నటీనటులు, సాంకేతిక నిపుణులు మెప్పించినందునే ఈ సినిమా భారతీయ చలనచిత్ర సీమలో అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. అచ్చమైన ప్రేమకథ… ‘దిల్‌వాలే..’లో ప్రేమజంట రాజ్ (షారుఖ్), సిమ్రన్ (కాజోల్)లను చూస్తున్నంత సేపూ మన ఇంటి పక్కనే- మనకు తెలిసిన ఓ అమ్మాయి, అబ్బాయిని చూసిన అనుభూతిని పొందుతాం. అచ్చమైన ప్రేమకథతో కుటుంబ నేపథ్య చిత్రాలకు ఇది ప్రేరణగా నిలిచింది. సరదా ఇతివృత్తం, గిలిగింతలు పెట్టే ప్రేమ సన్నివేశాలు, హాయిగా సాగే కామెడీ, హృదయాలను బరువెక్కించే దృశ్యాలే లేని కథనం, మళ్లీ మళ్లీ వినాలనిపించే మధురమైన పాటలు, కమ్మటి నేపథ్య సంగీతం, అలరించే విదేశీ లొకేషన్లు… ఇవన్నీ సమపాళ్లలో సమకూరి ప్రేక్షకుల్ని మెప్పించాయి, మత్తెక్కించాయి, మైమరపించాయి.. విమర్శకుల ప్రశంసలనూ అందుకున్నాయి.. ఎన్ని వసంతాలు గడిచినా ఈ సినిమాను నిత్యనూతనంగా నిలబెట్టాయి.. తరాలు మారినా తరగని వినోదం అందించాయి.. టీనేజీ యువత ప్రేమకు సంబంధించిన కథే అయినప్పటికీ- వైవిధ్య భరితంగా కథనం సాగిన తీరు ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక, కథ గురించి చెప్పాలంటే- సెలవుల్లో విదేశీ పర్యటనకు వెళ్లిన యువజంట రాజ్, సిమ్రన్ అక్కడ అనుకోని రీతిలో కొన్ని సంఘటనలను ఎదుర్కొంటారు. ఆ నేపథ్యంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి అది ప్రేమగా చిగురిస్తుంది. సిమ్రన్ తల్లిదండ్రులను మెప్పించి, ఒప్పించి చివరికి ఆమెకు మూడుముళ్లు వేసి హీరో విజయం సాధిస్తాడు. తండ్రి చూసిన వరుడికి బదులు రాజ్‌నే ఆమె పెళ్లి చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది. సంప్రదాయ బద్ధమైన రెండు కుటుంబాలకు చెందిన పెద్దల మనసులను గెలిచి, ఎన్ని అవాంతరాలు ఎదురైనా చివరికి హీరో,హీరోయిన్లు తమ ప్రేమను సాకారం చేసుకుంటారు. విదేశాల్లో ఉంటున్న భారతీయ కుటుంబ నేపథ్యాన్ని బాలీవుడ్‌కు పరిచయం చేసిన సినిమాగా ‘దిల్‌వాలే..’ చిరస్థాయిగా నిలిచిపోయింది. ప్రేమ సన్నివేశాలే కాదు, అమెరికా, స్విట్జర్లాండ్, భారత్‌లో అద్భుత ప్రకృతి దృశ్యాలు ఇందులో కనువిందు చేస్తాయి. 1995 అక్టోబర్ 20న ఈ సినిమా విడుదలైనపుడు ప్రపంచ వ్యాప్తంగా సినీ విశే్లషకులు సమీక్షలు చేసి నటీనటులను, దర్శక నిర్మాతలను పొగడ్తలతో ముంచెత్తారు. బాలీవుడ్‌లో అత్యధిక స్థాయి వసూళ్లను సొంతం చేసుకున్న రెండో చిత్రంగా ‘దిల్‌వాలే..’ నిలిచింది. (సల్మాన్ ఖాన్ నటించగా 1990లో విడుదలైన ‘హమ్ ఆప్‌కే హై కౌన్’ అత్యధిక వసూళ్లతో మొదటి స్థానంలో ఉంది.) ప్రపంచంలోనే వంద కోట్ల రూపాయలు వసూలు చేసిన రెండో సినిమాగా రికార్డు సృష్టించింది. పది ‘్ఫల్మ్‌ఫేర్’ అవార్డులతో పాటు ‘ఉత్తమ వినోదాత్మక చిత్రం’గా జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. వందేళ్ల కాలంలో అభిమాన సినిమా… భారత్‌లో సినీ పరిశ్రమ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయన సందర్భంగా బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత ఆన్‌లైన్ సంస్థ ‘సనోనా’ నిర్వహించిన సర్వేలో అధికశాతం మంది తమ అభిమాన చిత్రంగా ‘దిల్‌వాలే..’ వైపు మొగ్గు చూపారు. ‘రొమాంటిక్ కామెడీ’గా ఇంతగా అలరించిన భారతీయ సినిమా మరొకటి లేదని ఆన్‌లైన్ సర్వేలో తేలింది. ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సామాజిక వెబ్‌సైట్లలోనూ ఈ సినిమా అగ్రభాగాన నిలిచింది. బాలీవుడ్ సినీ నిర్మాతల్లో దిగ్గజమైన యాశ్ చోప్రా కుమారుడైన ఆదిత్య చోప్రా ఈ సినిమాకు కథను రూపొందించి దర్శకత్వం వహించారు. షారుఖ్, కాజోల్ నటనతో పాటు జ తిన్-లలిత్ అందించిన స్వరాలు ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. విదేశాల్లో చిత్రీకరించినప్పటికీ అప్పట్లో కేవలం నలభై మిలియన్ల రూపాయల ఖర్చుతో దీన్ని నిర్మించారు. బాలీవుడ్‌లో ‘ఆల్ టైమ్ క్లాసిక్’లుగా నిలిచిన మొదటి పది సినిమాల్లో ఇది ప్రథమ స్థానంలో నిలిచింది. రాజ్‌కపూర్ నిర్మించిన ‘ఆవారా’ (1951), మెహబూబ్ ఖాన్ రూపొందించిన ‘మదర్ ఇండియా’ (1957), రమేష్ షిప్పీ సృష్టించిన ‘షోలే’ (1975) సినిమాలను వెనక్కి నెట్టేసిన ఘనత ‘దిల్‌వాలే…’కే దక్కింది. షారుఖ్‌కు అనుకోని ఛాన్స్… ‘రాజ్’గా మెప్పించిన షారుఖ్ ఖాన్‌కు ఈ సినిమాలో అనుకోని రీతిలో హీరో పాత్ర లభించింది. మొదట హీరో పాత్రకు సైఫ్ అలీఖాన్‌ను ఎంపిక చేయాలని ద ర్శక, నిర్మాతలు భావించారు. ఆ తర్వాత ఊహించని విధంగా షారుఖ్‌ను ఎన్నుకున్నారు. తన 30వ జన్మదినం ముందు విడుదలైన ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధిస్తుందని కలలో కూడా ఊహించలేదని, తన నట జీవితంలో మైలురాయిలా నిలుస్తుందని అనుకోలేదని షారుఖ్ ఇప్పటికీ చెబుతుంటాడు. ఇందులో ఆయన హాస్య సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకుల కళ్ల ముందు కదలాడుతుంటాయి. నట దిగ్గజం రాజ్ కపూర్‌కు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇందులో హీరో పేరును ‘రాజ్’గా దర్శకుడు ఆదిత్య చోప్రా ఖరారు చేశారు. ప్రఖ్యాత నటుడు అనుపమ్ ఖేర్ భార్య కిరణ్ ఖేర్ ఈ సినిమాకు పేరును సూచించారు. అనుపమ్ ఈ సినిమాలో షారుఖ్ తండ్రిగా నటించారు. ఇలాంటి మరెన్నో ప్రత్యేకతలు ‘దిల్‌వాలే..’కు ఉన్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతుంటాయి. టీవీ నటి మందిరా బేడీ ఈ సినిమాతో తొలిసారిగా బాలీవుడ్‌లో రంగప్రవేశం చేశారు. ఇందులో ఆమె షారుఖ్‌ను ప్రేమిస్తుంది. అయితే, షారుఖ్ మాత్రం కాజోల్ వెంటపడతాడు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ షారుఖ్ స్నేహితుడిగా నటించారు. ఈ సినిమా పాటల కోసం సుదీర్ఘ కాలంపాటు కసరత్తు జరిగింది. గీత రచయిత ఆనంద్ బక్షీ, సంగీత దర్శకులు జతిన్-లలిత్‌లను విసిగించి మరీ పాటలన్నీ అద్భుతంగా వ చ్చేలా దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ సినిమా తర్వాత షారుఖ్‌కు భారత్‌లోనే కాదు విదేశాల్లో సైతం అభిమానుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. బాలీవుడ్‌కు సంబంధించి ఉత్తమ ‘వెండితెర జంట’గా షారుఖ్-కాజోల్ ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఈ ఇద్దరిలాగే ప్రేమలో విజయం సాధించాలన్న తపన ఎంతోమంది యువతీ యువకుల్లో మొదలైంది. టీనేజీ ప్రేమికులంతా తమను షారుఖ్, కాజోల్‌తో పోల్చుకోవడం ఈ సినిమాతో ప్రారంభమైంది. ఎన్ని అవాంతరాలు, వైరుధ్యాలు ఉన్నా ప్రేమకు అవి అడ్డుగోడలు కావని, ప్రేమదే అంతిమ విజయం అని భావించే యువత సంఖ్య పెరిగింది. దశాబ్దాలు గడిచినా ‘రాజ్,సిమ్రన్’ పాత్రలు నిజమైన ప్రేమకు ప్రతీకలుగా నిలిచిపోయాయి. కొత్త ట్రైలర్ విడుదల… ఈ నెల 12 నాటికి వెయ్యి వారాల ప్రదర్శన పూర్తవుతున్న సందర్భంగా ‘దిల్‌వాలే..’ కోసం సరికొత్త ట్రైలర్‌ను విడుదల చేయడం విశేషం. ప్రపంచ చరిత్రలోనే సుదీర్ఘ కాలం పాటు ఆడుతున్న సినిమాగా అద్భుత రికార్డును సృష్టించిన సందర్భాన్ని పురస్కరించుకుని ట్రైలర్‌ను విడుదల చేసినట్లు ‘యశ్‌రాజ్ ఫిలింస్’ సంస్థ ప్రకటించింది. * ‘మరాఠా మందిర్’ మాయాజాలం.. ముంబైలోని ‘మరాఠా మందిర్’లో 1995 అక్టోబర్ 20 నుంచి నిరాటంకంగా నడుస్తున్న ‘దిల్‌వాలే…’ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదే ముంబైలోని మినర్వా థియేటర్‌లో అమితాబ్, ధర్మేంద్ర నటించిన ‘షోలే’ (1975 నుంచి 1980 వరకూ) అయిదేళ్ల పాటు నడిచింది. ఆ రికార్డును ‘దిల్‌వాలే..’ ఏనాడో అధిగమించడంతో ‘మరాఠా మందిర్’ దేశ వ్యాప్తంగా చిరపరిచితమైంది. చాలాకాలం రోజుకు నాలుగు ఆటలుగా నడిచినా, కొన్నాళ్లుగా ఉదయం ఆటకే దీన్ని పరిమితం చేశారు. ఇప్పటికీ ప్రతి రోజూ సగటున 50 శాతం వరకూ సీట్లు నిండిపోతాయని, వారాంతాల్లో, సెలవుదినాల్లో మాత్రం ‘హౌస్ ఫుల్’ అవుతుందని ‘మరాఠా మందిర్’ యాజమాన్యం చెబుతోంది. షారుఖ్, కాజోల్‌తో పాటు బాలీవుడ్ నటీనటులెందరో ఈ థియేటర్‌కు వస్తుంటారు. 100 వారాలు, 500 వారాలు, 700 వారాలు గడిచిన సందర్భంగా థియేటర్ వద్ద అభిమానులు సంబరాలు జరిపారు. కూలీలు, గృహిణులు, మధ్య తరగతి వారు, గృహిణులు, విద్యార్థులు … ఇలా అన్ని వర్గాలకు చెందిన వారూ ఇప్పటికీ థియేటర్ వద్ద ‘క్యూ’ కడుతుంటారు. ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా తమకు కొత్తగానే ఉంటుందని వారు చెబుతుంటారు. ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో పోర్టర్లు (కూలీలు) ఖాళీ దొరికినపుడల్లా దీన్ని చూస్తుంటారు. ఈ సినిమాను 80-90 సార్లు చూసినవారు కూడా తమకు తెలుసునని థియేటర్ సిబ్బంది చెబుతుంటారు. రైల్వే స్టేషన్‌కు, బస్ స్టేషన్‌కు, మంచి రెస్టారెంట్లకు సమీపంలో ఉన్నందున మరాఠా థియేటర్‌కు వచ్చే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ థియేటర్‌లో ఏసీ, సౌండ్ సిస్టమ్, సీటింగ్ తమకు నచ్చుతాయని ప్రేక్షకులు ఎగబడుతుంటారు. టిక్కెట్ ధరలు కూడా అందుబాటులో ఉండడంతో ఈ థియేటర్‌లో సినిమా చూసేందుకు పేద, మధ్య తరగతి ప్రేక్షకులు ఆసక్తి చూపుతుంటారు. ఇదే థియేటర్‌లో 1953లో విడుదలైన ‘మొఘల్-ఇ- అజామ్’ నాలుగేళ్లు నడిచిందని పాతతరం వారు గుర్తు చేస్తుంటారు. షాగిర్డ్, జానీ మేరా నామ్, ఇత్త్ఫోక్, ఖిలాడీ, కర్మ, ధరమ్ కాంటా, మిస్టర్ ఇండియా, కూలీ నెంబర్ 1, సర్ఫ్‌రోష్, గదర్- ఏక్ ప్రేమ్ కథ వంటి సూపర్ హిట్ సినిమాలు కూడా ఇదే థియేటర్‌లో ప్రదర్శించారు. లాభాలు లేకున్నా.. కొన్నాళ్లు కలెక్షన్ల కనక వర్షం కురిసినా, ఇటీవలి కాలంలో లాభనష్టాలతో సంబంధం లేకుండా ఈ సినిమాను ప్రదర్శిస్తున్నామని ‘మరాఠా మందిర్’ మేనేజర్ మనోజ్ దేశాయ్ చెబుతున్నారు. సినిమా ప్రదర్శనకు సంబంధించి నెలకోసారైనా యశ్‌రాజ్ ఫిలింస్ ప్రతినిధులతో తాము సమావేశమవుతుంటామని ఆయన తెలిపారు. వెయ్యి వారాలు పూర్తవుతున్న సందర్భంగా భారీ ఎత్తున వేడుకలు జరిపే విషయమై ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదని ఆయన అంటున్నారు. హీరో, హీరోయిన్లు షారుఖ్, కాజోల్‌తో పాటు దర్శక, నిర్మాతలతో చర్చించి వేడుకలను నిర్వహించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని దేశాయ్ చెప్పారు. వెయ్యి వారాల అనంతరం ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేస్తారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. అవకాశం ఉన్నంత వరకూ ఈ సినిమాను ప్రదర్శించాలని దర్శకుడు ఆదిత్య చోప్రా, తాను కలిసి నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ప్రతి రోజూ ఉదయం 11-30 గంటలకు ఒక ఆట మాత్రమే ప్రదర్శిస్తున్నామని, మిగతా మూడు షోలు వేరే సినిమాలు నడుస్తాయని ఆయన చెప్పారు. ‘ఆట’ల్లో మేటి.. ఈ చిత్రాలు.. బాలీవుడ్‌లో ఎక్కువ ఆటలు ప్రదర్శించిన పది అగ్రశ్రేణి సినిమాల్లో ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ‘టాప్ టెన్’ జాబితా ఇలా ఉంది.. 1. దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే (1995) – ఇప్పటికీ ఆడుతోంది. నటీనటులు: షారుఖ్ ఖాన్, కాజోల్, అమ్రిష్ పురి, అనుపమ్ ఖేర్ దర్శకుడు: ఆదిత్య చోప్రా 2. షోలే (1975) – 286 వారాలు (5 ఏళ్లు) నటీనటులు: అమితాబ్, ధర్మేంద్ర, హేమమాలిని, సంజీవ్ కుమార్ దర్శకత్వం: రమేష్ షిప్పీ 3. మొఘల్-ఇ-అజామ్ (1960) – 150 వారాలు ( 3 ఏళ్లు) నటీనటులు: పృథ్వీరాజ్ కపూర్, మధుబాల తదితరులు దర్శకత్వం: కె.ఆసిఫ్ 4. కిస్మత్ (1943)- 150 వారాలు – ( 3 ఏళ్లు) నటీనటులు: అశోక్‌కుమార్, ముంతాజ్, షాన్‌వాజ్ దర్శకత్వం: జ్ఞాన్ ముఖర్జీ 5. బర్సాత్ (1949)- 100 వారాలు నటీనటులు: రాజ్ కపూర్, నర్గీస్, ప్రేమ్‌నాథ్ దర్శకత్వం: రాజ్ కపూర్ 6. మైనే ప్యార్ కియా (1989)- 50 వారాలు నటీనటులు: సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ దర్శకత్వం: సూరజ్ ఆర్ బర్జాత్యా 7. కహోనా ప్యార్ హై (2000) 50 వారాలు నటీనటులు: హృతిక్ రోషన్, అమీషా పాటిల్ దర్శకత్వం: రాకేష్ రోషన్ 8. హమ్ ఆప్‌కే హై కౌన్ ( 1994)- 50 వారాలు నటీనటులు: సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ దర్శకత్వం: సూరజ్ ఆర్ బర్జాత్యా 9. మహాబతీన్ (2000)- 50 వారాలు నటీనటులు: అమితాబ్, షారుఖ్ ఖాన్, ఉదయ్ చోప్రా దర్శకత్వం: ఆదిత్య చోప్రా 10. రాజా హిందుస్థానీ (1996)- 50 వారాలు నటీనటులు: అమీర్ ఖాన్, కరిష్మా కపూర్ దర్శకత్వం: ధర్మేష్ దర్శన్ విసుగన్నదే లేదు.. ‘దిల్‌వాలే..’ సినిమాను ఇన్నాళ్లుగా ప్రదర్శిస్తున్నా తన పనికి సంబంధించి విసుగన్నదే లేదని ‘మరాఠా మందిర్’లో ప్రధాన ప్రొజెక్టర్ ఆపరేటర్ జగ్జీవన్ మారు అంటున్నారు. నలభై ఏళ్లుగా ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నానని, దాదాపు 19 ఏళ్లుగా ‘దిల్‌వాలే..’కు రీళ్లు మార్చే పనిలో ఉన్నా ఏనాడూ విసుగు పుట్టలేదని ఆయన అంటున్నారు. ఇప్పటికీ ఆయనే స్వయంగా రీళ్లను ఎక్కించే పని చేస్తుంటారు. తక్కువ మొత్తంలో టిక్కెట్ ధరలు, సంతృప్తికరమైన సీటింగ్ వంటి కారణాలతో తమ థియేటర్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తోందని ఆయన అంటున్నారు. ముంబై నగరాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకులు చాలామంది ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతుంటారని ఆయన తెలిపారు.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పక్కింటి మీనాక్షమ్మ – కథ

పక్కింటి మీనాక్షమ్మ – కథ

  • 07/12/2014
TAGS:

ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక రిలాక్స్‌గా సోఫాలో కూర్చుని ‘ఒసేవ్! ఆండాళ్లూ! కాఫీ పట్రా’ అంటూ కేకపెట్టాడు సదాశివం. ‘ఆ! వస్తున్నానండీ..’ అంటూ స్టౌ దగ్గర కాఫీ కలుపుతూ అక్కడే నిలబడి ‘పక్కింటి మీనాక్షమ్మను చూశారా? వాళ్లాయన కొనిచ్చే నగలు నట్రా చూశారా? మీరూ ఉన్నా రు, ఎందుకు? ఓ ముద్దూలేదు, ముచ్చటా లేదు. ఊ.. ఊ..’ అంటూ ఏడుపు రాగంతో శోకగీతమాలపిస్తోంది.
‘ఇదిగో తెస్తానన్నది కాఫీ. ఇంకా తేలేదేమిటి? ఆ పాట ఎక్కడో రేడియోలో విన్నట్లుందే! టీవీలొచ్చాక రేడియో లెక్కడున్నాయి. అయినా మనింట్లో రేడియో లేదాయె!’ అంటూ సోఫాలో నుంచి లేచి వంటింట్లోకి వెళ్లి చూశాడు సదాశివం.
ఆండాళ్ మళ్లీ అదే పాట రిపీట్ చేస్తోంది. భర్తని చూడగానే చీర కొంగు నోటికి అడ్డంగా పెట్టుకుంది. శోకగీతం వాయిస్ మరికాస్త పెంచింది.
‘నువ్వా.. ఆ పాట పాడేది. ఎక్కడో రేడియోలో నుంచి వినిపిస్తోందనుకున్నాను. నేను నీ ముద్దూ ముచ్చట తీర్చటం లేదా? ఉదయం ఆఫీసుకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చాక నువ్వడిగినన్ని ముద్దులిస్తున్నానుగా! ఇంకా ఎందుకేడుస్తావు?’ కాస్తంత కటువుగానే కోప్పడ్డాడు.
‘ఓయబ్బో! మహా ఇచ్చారులే ముద్దులట! ముద్దులు!! ఊరికే ఇచ్చేవి, ఎన్నయినా ఇస్తారు’ మెటికలు విరిచింది ఆండాళ్లు.
‘మరైతే నీకేం కావాలంటావు? రేపటి నుంచి అవీ మానేస్తాను. ఏం కావాలో చెప్పు’ అని గద్దించాడు.
‘మన పెళ్లయినప్పటి నుంచి ఒక నగ కొన్నారా? చేతికి గాజులు చేయించారా? నడుముకి ఒడ్డాణం చేయించి పెట్టారా? మా పుట్టింటి వాళ్ళు పెట్టిన మెళ్లో ఈ తాడు తప్ప, మరేమైనా ఉన్నాయా? ఆ మీనాక్షిని చూడండి! మెడ నిండా ఎనె్నన్ని నగలు దిగేసుకుంటుందో..! రోజుకో పట్టుచీర కడుతుంది. ఇంటి నిండా ఖరీదైన సామానులున్నాయి. రోజూ నాకు చూపించి తెగ మురిసిపోతుంది’ పక్కింటావిడ చిట్టా విప్పింది ఆండాళ్.
‘ఓహో! అదా అసలు సంగతి. వాళ్లాయన అందరి దగ్గరా లంచాలు తీసుకొని రెండు చేతులా సంపాదిస్తాడు’ చిరాగ్గా అరిచాడు సదాశివం.
‘మీరూ ఆ పని చేయచ్చుగా! ఇందులో తప్పేముంది?’
‘లంచం తీసుకోవటం మహా నేరం. పట్టుబడితే ఇంతే సంగతులు. కటకటాలు లెక్కబెడుతూ కూర్చోవాలి. ఆ సంగతి నీకు తెలీదా?’ గద్దించాడు.
‘ఓ! మాగొప్పగా చెప్పొచ్చారులెండి. తెలివితేటలుంటే సరి. మీనాక్షి వాళ్లాయన చేయటం లేదా? నగలు చేయించటం చేతగాకపోతేసరి. కబుర్లకేం బాగానే చెప్తారు. పోనీలెండి! నా ఖర్మ ఇంతేననుకొని సరిపెట్టుకొంటాను. చేతగాని మొగుణ్ణి చేసుకుంటే ఏం లాభం?’ అంటూ ముక్కు చీదింది.
‘నేనేమైపోయినా ఫరవాలేదు. నీక్కావలసింది నగలే కదా! అలాగే చేయిస్తానులే’ అన్నాడు కోపంలోనూ కొంత శాంతించి. వారం రోజుల్లో మీనాక్షి వాళ్ల ఇంటి మీద ఏసిబి దాడులు జరిగాయి. ఇల్లంతా సోదాలు చేసి మీనాక్షి ఒంటి మీద నగలే కాకుండా అంతకుముందున్న పాత నగలు కూడా లెక్కలు చూపించి పట్టుకెళ్లిపోయారు. మీనాక్షి వాళ్ళాయన్ని పోలీసులొచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లారు. మీనాక్షి ఏడుస్తూ చెప్పింది విషయమంతా ఆండాళ్‌కి.
‘పాపం! ఎంతపని జరిగిపోయింది. మీనాక్షిని చూస్తుంటే జాలేస్తోంది. ఖరీదైన వస్తువులన్నీ పట్టుకుపోయారు. నా అంత గొప్పవాళ్లు లేరని మీనాక్షి ఎగిరెగిరి పడింది. అంతాపోయాక ఇంట్లోంచి బయటికి రాలేక లోపలే కుమిలిపోతోంది. తప్పుచేస్తే శిక్ష పడాల్సిందే మరి. మా వారికి ఆ గతి పట్టకూడదు. పాపిష్టిదాన్ని. నగల కోసం ఆయన్ని లంచం తీసుకోమని పోరాను. నా భర్త నాకు క్షేమంగా ఉంటే చాలు’ అనుకుంటూ సమాధానపడింది ఆండాళ్లు.
సదాశివం ఇంట్లోకి వస్తూనే ‘ఆండాళ్ళూ..! చూశావా? నీ కోసం ఏంతెచ్చానో! త్వరగా రా!..’ అంటూ కేకలేశాడు.
అందమైన బాక్స్‌లో నుంచి ఎరుపు, తెలుపు రాళ్ల నెక్లెస్, పెద్ద హారం! బయటికి తీసి ఇవిగో నువ్వడిగినవి తెచ్చాను. రేపటి నుంచి అలక మానేయాలి సుమా! వంటింట్లో గినె్నలు విసిరికొట్టడం, నన్ను దూరం పెట్టటం మానుకోవాలి’ అంటూ నెక్లెస్ తీసి మెడలో వేయబోయాడు సదాశివం.
‘ఏమండీ! ఆ నగలు నాకొద్దండీ. మిమ్మల్ని జైలుకి పంపడం నాకిష్టం లేదండీ. ఆ మీనాక్షి గతి ఏమైందో తలుచుకుంటేనే బాధగా ఉంది. లంచం తీసుకుని కొన్న ఆ నగలు నాకొద్దండీ. బుద్ధితక్కువై అడిగాను. ముందా నగలు ఎక్కడకొన్నారో అదే షాపులో ఇచ్చి రండి’ ఏడుపు లంకించుకుంది ఆండాళ్లు.
‘ఇప్పటికైనా తెలిసిందా? తోటివాళ్లు తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటానన్నదిట నీలాంటావిడ! పక్కింటి వాళ్లతో, ఎదురింటి వాళ్లతో మనల్ని పోల్చుకోకూడదు. నాగురించి నీకా భయం అక్కర్లేదులే! ఇది లంచం డబ్బుతో కొన్నది కాదు. మంచి బంగారం అసలే కాదు. ఒన్ గ్రాము గోల్డ్ నగలు. అచ్చం బంగారం లాగానే ఉన్నాయి. పెట్టుకో! భయమేమీ లేదు!! కావాలంటే ఇలాంటివి ఎన్నయినా కొనిపెడతాను’ అంటూ భార్య మెడలో నెక్లెస్ అలంకరించాడు సదాశివం. అద్దంలో చూసుకుని ‘చాలా బాగుందండీ. బంగారం లాగానే ఉంది కదండీ! మీరు ప్రేమతో నిజాయితీగా ఇచ్చిన గిల్ట్ నగలైనా చాలు. మీరెంత మంచివారు’ అంటూ భర్త ఎదపై వాలిపోయింది. మీనాక్షి తన భర్తతో కలిసి నాటకమాడిన సంగతి పాపం ఆండాళ్‌కి తెలియదు. అందుకు సంతోషించి ముసిముసిగా నవ్వుకున్నాడు సదాశివం.

తాటికోల పద్మావతి,
గుంటూరు.
మొబైల్ : 9441753376

మార్పు తెచ్చిన కాలం

చిన్ని కథ

కృష్ణలంకలో భగవతి గారింట్లో అద్దెకుండే రోజుల్లో వారి ఏకైక పుత్రరత్నం కులాంతర వివాహం చేసుకుని, ఆ పిల్లని ఇంటికి తీసుకొచ్చాడు. కొడుకుని క్షమించలేని ఆయన అరిచిఅరిచి గుండెపోటుతో పోయాడు.
‘సర్దుకుపోవడం రాలేదాయనకి’.. అంది భగవతి. కోడలిని కూతురిలా చూసుకునేది. ఆ పిల్ల కూడా నాకు అమ్మలేని లోటు అత్తగారు తీర్చారంటూ ఒకరిని ఒకరు పొగుడుకుంటూ వుండేవారు. ఆ అత్తాకోడళ్లని చూసి ముచ్చటపడ్డారు అందరూ. భవానీపురంలో ఇల్లు కొనుక్కుని వెళ్లిపోయారు. ఇరవై సంవత్సరాల తరువాత చందన బ్రదర్స్‌లో షాపింగ్ చేస్తూ.. ‘ఆ పిల్లని గుర్తుపట్టారా?’ అడిగింది మా ఆవిడ.
నాకు గుర్తురాలేదు. ‘్భగవతి గారి కోడలు’ అంది. ‘బొమ్మరిల్లు’ జెనీలియాలా వుండే పిల్ల ‘కితకితలు’ గీతాసింగ్‌లా మారిపోయింది. ముఖాన బొట్టు లేదు. అయినా మా ఆవిడ గుర్తుపట్టింది.
‘బాగున్నావా అమ్మా’ అని పలకరించి వాసు ఎక్కడ? అని అడిగింది. ‘యాక్సిడెంట్లో పోయారు’ పుల్లవిరుపుగా సమాధానం.
‘మీ అత్తగారు ఎలా వున్నారు?’ అని అడిగింది.
‘గుండ్రాయిలా వుంది.. తండ్రీకొడుకులిద్దరినీ మింగింది. నాకు బిపి, షుగర్, నన్ను కూడా..’ అంటూ ఆపేసింది.
గుడ్లప్పగించి చూస్తుండిపోయాం. మా ముందు నుంచే పరుగులాంటి నడకతో వెళ్లిపోయింది.
‘ఆ అమ్మాయి అలా మాట్లాడుతోందేమిటి?’ తేరుకుని అడిగేను.
‘కాలం చాలా మార్పుల్ని తెస్తుంది. ఒకప్పుడు దేవతలాంటి అత్తగారు ఇప్పుడు దెయ్యాంలా కనిపిస్తున్నారామెకు’ అంది మా ఆవిడ.
‘మగవాళ్లిద్దరూ పోయారు. ఇంటికి తనే మహారాణినని అనుకుంటోంది. మొన్న సుశీలగారు కనిపించి ఆ ఇంటి విషయాలు చెప్పారు. తల్లీ, పిల్లలు పెద్దావిడని నానామాటలూ అంటారట. భగవతిగారు పూజగదిలోనే ఎక్కువ కాలం గడిపేస్తున్నారట. ‘కుక్కకి వున్న విశ్వాసం ఈ మనిషికి లేదయ్యోయ్’ పాట వినిపిస్తోంది. అది ‘ఇలాంటి వాళ్లకి సరిపోతుంది’ అంది మా ఆవిడ బాధగా!

చావలి సూర్యం, కార్పొరేషన్ ఆఫీసు, విజయవాడ.

వెంటాడే పద్యం..

మూర్ఖంగా ప్రవర్తిస్తే మూడినట్లే..!

మకర ముఖాంతరస్తమగు మానికమున్ బెకలింపవచ్చు, బా
యక చలదూర్మికా నికరమైన మహోదది దాటవచ్చు, మ
స్తకమున బూవుదండవలె సర్పమునైన భరింపవచ్చు, మ
చ్ఛిక ఘటియించి మూర్ఖజన చిత్తముదెల్పన సాధ్యమేరికిన్!
మొసలి నోటిలో వున్న మాణిక్యాన్ని కష్టపడి బయటకు తీయవచ్చు. వీడకుండా వచ్చే మహోగ్రమైన అలలతో కూడిన సముద్రాన్నైనా దాటవచ్చు. కాలకూట విషాన్నిగక్కే పామునైనా మెడలో దండవలే ధరించవచ్చు. బుజ్జగించి గానీ, ఎన్ని మంచి మాటలు చెప్పినా గానీ మూర్ఖుడి మనసును లేశమాత్రమైనా మార్చలేము- అని ఈ పద్య భావము.
ఇది భర్తృహరి రాసినది. ‘సుభాషిత త్రిశతి’ పేరిట మూడు వందల శ్లోకాలను సంస్కృతంలో రాశాడు. దీన్ని తెలుగులో ఏనుగు లక్ష్మణకవి, ఎలకూచి బాలసరస్వతి, పుష్పగిరి తిమ్మన రాశారు. ఈ పద్యం ఏనుగు లక్ష్మణ కవి రాసినది. లోకంలోని నీతి రీతులను బోధిస్తూ ఎన్నో పద్యాలు రాశారు. కవి నీతిని, మానవీయ మూల్యాలను, సాంస్కృతిక విలువలను, సంఘ వ్యవస్థను తన పద్యాల్లో అపూర్వంగా ప్రబోధించారు
మానవుణ్ణి దివ్యునిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. ఈ పద్యం మానవునిలో ఉన్న అంతర్గత మూర్ఖత్వాన్ని బహిర్గతం చేస్తుంది. వీరి శతకాల్లోని పద్యాలు ఒక్కో పద్యం ఒక్కో అనర్ఘ మహారత్నంగా భాసిల్లుతుంది. మానవుడు మూర్ఖత్వం వీడి జ్ఞానాన్ని పొందాలంటారు కవి. ఈ పద్యం చదువుతున్నప్పుడు విష్ణుశర్మ, చిన్నయసూరి పంచతంత్ర కథలు గుర్తుకు వస్తాయి. ఈ పద్యానికి ఉదాహరణగా చిన్ని కథ –
ఒక విపినములో ఒక జింక, నక్క, గాడిద, ఒక ఎలుగుబంటు స్నేహం చేస్తూ కలసిమెలసి కష్టసుఖాలు పంచుకుంటూ జీవిస్తుండేవి. జింక సాధు జంతువు. తను రోజూ అడవికి వెళ్లి వేటాడి తనకు దొరికిన ఆహారాన్ని మువ్వురు స్నేహితులకూ పంచేది. గాడిద కూడా అలుపెరుగని అమాయకపు జంతువు. తను కూడా సంపాదించిన దాంట్లో స్నేహితులకి పంచేది. ఇక జిత్తులమారి నక్క తను వేటాడకుండా మాయమాటలు చెప్పి తన స్థానం కదలకుండా మిత్రులు తెచ్చిపెట్టేది భుజిస్తూ సుఖంగా జీవనం సాగించేది. ఎలుగుబంటు పైముగ్గురు మిత్రులకన్నా బలవంతుడననీ, తెలివితేటలు కలవాడననీ, అందరూ తనకే తెచ్చిపెట్టాలనీ దౌర్జన్యంతో బెదిరిస్తూ స్నేహితులు సంపాదించేది భుజిస్తూ కాలం వెళ్లబుచ్చేది.
జింక చిన్న జంతువు కావటం వల్ల ఆహార సముపార్జన కష్టతరమై శక్తిహీనురాలైంది. ఎలాగో భారంగా రోజులు గడిపేస్తోంది. ఎలాగా జీవనం అని తనలో తనే కుమిలిపోయేది జింక. చివరకు భారమంతా గార్ధవముపై పడింది. భారంగా ఆహారం సంపాదిస్తోంది మిత్రుల కోసం గాడిద. మిత్రులు తెచ్చే ఆహారం అందరికీ సరిపడటం లేదు. టక్కరి నక్కకు అసహనం ఎక్కువైపోతోంది. వారిద్దరూ అక్కడే ఆరగించి మిగిలినది తమకు తెస్తున్నారని ఎలుగుబంటుకు మిత్రుల మీద చాడీలు చెప్తోంది. సోమరిపోతు ఎలుగుబంటు నక్క తియ్యని మాయమాటలు నమ్మేది. మిత్రుల మీద దానికి ఆగ్రహం పెరిగిపోతోంది. వారిని ఎలా దెబ్బతీయాలా? అని ఆలోచిస్తోంది ఎలుగు. నక్కకి సంతోషం పెరిగింది. చివరకు కలహాలు మొదలయ్యాయి వారిలో వారికి.
ఒకరోజు జింక తన మిత్రులతో ‘మనలో మనకు వైరాలు తగవని, కలసిమెలసి ఉందామని’ హితవు చెప్పింది. నక్క, ఎలుగుబంటు మిత్రుని మాటలు పెడచెవినపెట్టి ‘నీవా మాకు నీతులు చెప్పేది? నీ మాటలు మేము వినాలా? ఛీ! ఛీ! వెళ్లిపో ఆవలకు’ అని ఛీకొట్టాయి. ఇలా అనునిత్యం ఏదో ఒక సందర్భంలో తగవులాడుకుంటూనే ఉన్నాయి. మేము గొప్పంటే మేము గొప్పనీ, నాతో పెట్టుకోవద్దనీ హెచ్చరికలు చేసుకుంటున్నాయి.
ఓరోజు ఈ రీతిగా మూర్ఖపు ఎలుగుబంటు, నక్క తగవులాడుకుంటూ రక్తాన్ని సైతం లెక్కచేయకుండా పోరాడుకుంటున్నాయి. అదే సమయంలో అటుగా సింహం వెళుతూ వాటిని చూసింది. తనకు ఆహారం దొరికిందని సంతసిస్తూ అమాంతం వచ్చి ఎలుగుబంటును దొంగదెబ్బ తీసి చంపేసింది. జిత్తులమారి నక్క తన యుక్తితో ఎలాగోలా తప్పించుకుని ప్రాణాలను కాపాడుకుంది. మూర్ఖపు ఎలుగుబంటు ఎవరు ఎన్ని చెప్పినా వినిపించుకోక తన ప్రాణాలకు తనే అపాయం తెచ్చుకుని జీవితాన్ని కోల్పోయింది చివరకు.
ఈ కథనుబట్టి ‘కలసి వుంటే కలదు సుఖం అనీ, మూర్ఖత్వాన్ని వీడి జ్ఞానాన్ని పొందాలని, చెప్పుడు మాటలు వింటే తగిన శాస్తి జరుగుతుందనీ మనకు అర్థవౌతుంది. చిన్నయ సూరి నీతికథలు, విష్ణుశర్మ కథలు బాలల వికాసానికి దోహదపడతాయి. నీతి శతకాల్లోని పద్యాలు మానవునిలోని అజ్ఞానం అనే అంధకారాన్ని పారదోలి జ్ఞానం అనే వెలుగులను ప్రసాదిస్తాయి. ఈ పద్యాలు విద్యార్థులు, యువతలో వికాసం, సంస్కార భావాలు నాటుతాయి. ఈ పద్యాలు చదివిన ప్రతీ మనిషి నిత్యం జ్ఞానమార్గాన్ని అనే్వషిస్తూ నైతికతను పాటిస్తూ సమాజంలో ఉన్న వైషమ్యాలను పారదోలి నీతివర్తనుడై మనుగడ సాగిస్తాడు. అందరూ అలానే మనుగడ సాగిస్తారని ఆశిద్దాం!

రావూరి ఇందుమతి (ఇందునాథ్),
తెలుగు పండిట్,
నరసరావుపేట, గుంటూరు జిల్లా.
మొబైల్ : 9533721776

మనోగీతికలు..

హత్య!
మనసిచ్చిన ఒక మగవాడు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అందం – కథానిక

అందం – కథానిక

  • 07/12/2014
TAGS:

‘‘యుఆర్ లుకింగ్ సో క్యూట్’’
ఎవరా అని తలతిప్పి చూసింది వర్ధనమ్మ. తనకేసే చూస్తూ కనిపించిందో అమెరికన్ లేడీ. గబుక్కున తడబడి మెల్లగా ‘‘్థంక్యూ’’ అంది. వెల్‌కం అన్నట్లుగా తల ఊపి వెళ్లిపోయింది. సెక్యూరిటీలో తీసిన గాజులు, వాచీ, గొలుసు రెస్టురూంలో మార్చుకుంటుంటే ఈ కామెంట్ విని ఆనందం అనిపించింది. ఈ దేశంలో ఇది రెండవసారి. శోక్రిమెంట్ మాల్‌లో యువర్ సారీ వెరీ బ్యూటీఫుల్ యు ఆర్ లుకింగ్ సో స్వీట్ అంటుంటే ననే్ననా అనే సందేహంతో ఉండిపోయింది. మెల్లిగా థ్యాంక్స్ అని బైటకు వచ్చింది.
ఇక్కడి వాళ్ళని చూసి తనకి ఒకే ఆలోచన. మనం లంబాడీ వనితల్ని చూసిన ఫీలింగ్ మనల్ని చూస్తే వీళ్ళకు కలుగుతుందేమో అని. ముక్కూ మొహం తెలియకపోయినా స్వచ్ఛంగా మెచ్చుకున్నది అబద్ధం అవదు కదా? ‘‘ఏమిటీ నవ్వుకుంటూ వస్తున్నావ్?’’ అన్నాడు కొడుకు ప్రసాద్. ‘‘ఏమీ లేదు. అదిగో వెడుతున్నావిడ నేను చాలా అందంగా ఉన్నాను అంది’’.
‘‘అందుకనా ఈ ఆనందం’’ అని వెక్కిరింతగా అన్నట్లనిపించి ఉడుక్కుంటూ….
‘‘కన్నవాళ్లూ, కట్టుకున్నవాళ్లూ, కనుకున్నవాళ్లూ ఎవరూ చెప్పని మాట వింటే ఆనందమేగా’’ అంది వర్ధనమ్మ. ‘‘సారీ అమ్మా! ప్రత్యేకించి చెప్పకపోయినా మా అమ్మ రాజమాతలా ఉంటుందని అందరికీ చెప్పుకుంటూ ఉంటాం’’.
‘‘సరేలేరా! దాని గురించి వాదనెందుకు. నువ్వు సరాదాగా అన్నదానికి జవాబు చెప్పాను అంతే….’’
కూర్చుని ఉంటే ఆలోచనలు గతాన్ని స్మృతిలోకి తెచ్చాయి. పెళ్ళి చూపులకి వచ్చి పిల్ల ఎలా ఉందిరా అంటే అమ్మలా ఉంది అన్నాడు. అంటే నాలానా….నేను బాగాలేనా అంటే అమ్మగా బాగుంటావు పెళ్లాం నీలా ఉంటే ఎలాగా….మరి ఆ రోజుల్లో పెళ్ళాంగా తన మార్కులెన్ని?
అందానికి నిర్వచనం ఏమిటి? బారెడు జడ ఉండి, ఏడు వంకల్ని కప్పే ఎర్రరంగు ఉంటే అందగత్తె అనే వారు. ప్రస్తుత కాలానికి అది నప్పదు. కాలానుగుణంగా పూర్వం జాకెట్టు తీరుమారినా చీరకట్టు మారలేదు. ఇప్పుడు అవి వేసుకునే వారు అనాగరికులు. అబ్బదాని సోకు జబ్బల్దాక జాకెట్టు అని కూనిరాగాలు తీసేవారు. చేతులు, బాక్‌లేని జాకెట్లకి సోకులద్దుతున్నారు. కనిపించీ కనిపించని అందాలు ఊరీ ఊరని ఊరగాయాల్లాగ మురిపిస్తాయి. అంతా బట్టబయలైతే తరవాతి మెట్టు మొహం మొత్తడమే…..అలాగని పాత రోత కాదు……కొత్త వింత కాదు.
జట్టు విరబోసుకుంటే పిశాచాలు ఆవహిస్తాయని జడ కూడా వేసుకునే ఉండాల్సి వచ్చేది. జడ ఎరుగని ఈ జనసంద్రానికి ఆవహించడానికి ఎన్ని పిశాచాలు కావాలో జడగంటలు పెట్టి పూలజడ అందాలు పండగల్లాగే టివిల్లో చూడాలేమో.
నల్లపిల్లగా పుట్టిన దీనికి పెళ్ళి ఎలా అనే అమ్మానాన్నల దిగులు, ఆనందరావు పెళ్ళికి సై అనడంతో తీరిపోయింది. అత్తగారింట్లో అందరూ తెల్లని వాళ్లే. కొత్తలో వాళ్ళకి అసంతృప్తిగా ఉండేది. కాలక్రమేణా కలిసిపోయినా ఇరుగుపొరుగు నల్లావిడ అంటే మనస్సు చివుక్కుమనేది. పిల్లలు పుట్టాక తండ్రి పోలికా అని ఎవరన్నా మనస్సు వౌనంగానే మూలిగేది. తిరిగి వచ్చిన ప్రసాద్ ‘‘ఇంకా ఆలోచిస్తున్నావా?’’ అంటూ సామాను చేతిలో తీసుకున్నాడు.
మరునాడు ఇంటికి చేరేసరికి గుమ్మంలో కూర్చుని తనని చూసి సంతోషం నిండిన కళ్ళతో ఆహ్వానించాడు. కాఫీ ఇచ్చి ‘‘స్నానం చేసిరా. అన్నాలు తిందాం’’ కొడుకు ఉన్నాడని ప్రేమని కంట్రోలు చేసుకుంటున్నాడు కానీ ఆప్యాయత, ఆరాధన మాట తీరువలోనే తెలిసిపోతోంది. భోజనం చేసి సామాన్లు విప్పబోతుంటే ‘‘తర్వాత చూద్దాం కాసేపు నడుం వాల్చు’’ అంటూ ఎసి ఆన్‌చేసి తలుపులు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు.
ఇంతమంది ఆప్యాయతని అంది పుచ్చుకున్న తరువాత అందం గురించి ఆలోచించడం అవసరమా? అత్తగారి నుంచి అందుకున్న ఆప్యాయత కోడలికి అందించలేమా….అత్తమ్మ అందరి లాంటి వారు కాదు పాత కాలం ఆప్యాయత…. మోడ్రన్ ఆలోచనలు అని కోడలు ఎవరితోనో చెబుతుంటే ఈ జన్మకి ఈ సున్నితమైన బంధాలు ఇంకా బలపడనీయి స్వామీ! అని దేముడికి మొక్కింది. పిల్ల పుట్టగానే పాపలో తన పోలికలు వెతుక్కుని తన పేరు కలిపారు.
నాలుగు రోజులు ఉండి వెనక్కి వెళుతున్న ప్రసాద్‌కి చంటిపాపని గురించి, కోడలి గురించి జాగ్రత్తలు చెబుతూ ఆడపిల్లని అత్తవారింటికి పంపే తల్లిలా కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటుంటే ‘‘ఇదే ఆప్యాయత నీకు స్వాభావిక అందం అమ్మా’’ అన్నాడు. ‘‘ఇంకా నువ్వా విషయం మర్చిపోలేదా?’’ అంది.
‘‘ఎలా మర్చిపోతాను కన్నవాళ్ళని, కట్టుకున్న వాళ్ళనే కాక కనుకున్న వాళ్ళనీ చేర్చావు కదా. మేం నీ పోలిక వచ్చింది నీ స్వభావం రావాలని మురిసిపోతుంటే మాటల్లో వ్యక్తం చెయ్యపోయినా నీకు అర్థం అవుతుంది అనుకోవడం మా పొరపాటు కదా’’ అంటే ‘‘ఒరేయ్!’’ అంటూ కొట్టబోతున్నట్లు నవ్వుతూ చెయ్యెత్తింది. వంగి నమస్కారం చేసి కారులో కూర్చున్నాడు.
వచ్చిన రోజు నుండి పది రోజులు ఫోన్‌కి విరామం లేదేమో….అందరూ ఆప్యాయంగా యోగక్షేమాలు, కొత్త పాపాయి సంగతులూ…. తనని ఎంత మిస్ అయిందీ చెబుతుంటే తాను ఆర్జించుకున్న ఆత్మీయతకు ముగ్ధురాలైంది. అప్పుడే అనిపించింది అందానికి కాలపరిమితి ఉంది. అది క్రమంగా కనుమరుగవుతుంది. జీవితం తరువాత కొన్ని ఏళ్ళయినా మిగిలే జ్ఞాపకాలు మంచి అనే చోట మనం గుర్తుకి రావడం పూర్వ జన్మసుకృతం. ప్రేమ ఉంటేనే కాని పలుకరించరు. పగ ఉంటేనే కాని తిట్టరు. మహర్షి మహేంద్రయోగి చెప్పినట్లుగా మన మాటలన్నీ కొంత శక్తిని విడుదల చేస్తాయి. చెడ్డమాటలు మాట్లాడితే చెడ్డశక్తి, మంచి మాటలు మాట్లాడితే మంచి శక్తి. చివరగా ఏది మిగులుతుందో అది మన అందం.

– గొర్తి శారద, బెంగుళూరు
ఫోన్ : 08861309977.

చిన్నకథ

మా మంచి నాన్నారు!

‘‘గోపీ ఫస్ట్ యూనిట్ పరీక్షలో నీ ర్యాంక్ ఎంత?’’ అని అడిగాడు రామారావు కొడుకు గోపీని.
‘‘నా ర్యాంక్ ఇరవైఐదు నాన్నారు’’ అన్నాడు గోపి భయం భయంగా.
‘‘ఆ ….గొప్ప ర్యాంక్ వచ్చిందిలే, వాడి క్లాసులో ఉన్న పిల్లలే ముప్పయి మంది, అందులో వీడు ఇరవైఐదవ వాడు….ఆ లెక్కన వీడి కన్నా ఇరవైనాలుగు మంది మంచి ర్యాంకర్స్ ఉన్నారన్న మాట’’ అంటూ నిష్ఠూరంగా మాట్లాడింది గోపీ వాళ్ళమ్మ సంధ్యారాణి.
‘‘అలా ఎందుకనుకుంటున్నావు, మరో ఐదుగురు కన్నా మనవాడే బెటర్ కదా…ఆ లెక్కన మనవాడూ తెలివైనవాడే’’ అని నవ్వుతూ అన్నాడు రామారావు.
‘‘అలా వాడిని నెత్తినెక్కించుకొండి….రేపు వచ్చే పరీక్షలో గుండుసున్నాలు తెచ్చుకుంటాడు’’ అంటూ చిరచిరలాడింది సంధ్యారాణి.
‘‘గోపీ….వెరీగుడ్ ఫస్ట్ యూనిట్‌లోనే మంచి ర్యాంక్ సాధించావ్…..అలా వీథిలోకి వెళ్ళి ఫ్రెండ్స్‌తో ఆడుకో’’ అని గోపీని బయటకు పంపి, ‘‘సంధ్యా…. మనమెప్పుడూ పాజిటివ్‌గానే వుండాలి, ఆలోచించాలి, మాట్లాడాలి….. ముఖ్యంగా పిల్లల దగ్గర పాజిటివ్ కామెంట్స్ చేస్తేనే మంచిది, నెగిటివ్ కామెంట్స్‌తో వాళ్ళను హర్ట్ చేస్తే వాళ్ళ బుర్రల్లో నిరాశ నిస్పృహలు పేరుకుపోయి, భవిష్యత్‌లో సెన్సిటివ్‌నెస్ పెరిగి….. లేని పోని అనర్థాలకు దారి తీయొచ్చు’’ అంటూ భార్య సంధ్యని సున్నితంగా మందలించాడు రామారావు.
‘‘ఓరేయ్! రాజూ మా నాన్నారు నాకు 25వ ర్యాంక్ వచ్చినా దెబ్బలాడ లేదురా…..పైగా వెరీగుడ్ అన్నారు….అదే నాకు ఇంకా మంచి ర్యాంక్ వస్తే నాన్నారు నన్ను ఎక్స్‌లెంట్ అంటారు’’ అన్నాడు సంతోషంగా గోపి తన ఫ్రెండ్ రాజుతో ఆడుతూ…… పాడుతూ…..
‘‘మీ నాన్నారే బెటర్‌రా….మా డాడీ నాకు థర్డ్‌ర్యాంక్ వచ్చినా నానా చీవాట్లూ పెట్టారు, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోలేదని’’ అని అన్నాడు రాజు, ఆటపాటల ఆనందం కానరాలేదు అతని ముఖంలో.
‘‘ఏమోరా…..మా నాన్నారే ది బెస్ట్ నాన్నరు రా’’ అంటూ ఎగిరి గెంతులేస్తూ నాన్నరుకి కితాబిచ్చాడు గోపి.
* * *
‘‘నాన్నా గోపి రెండవ యూనిట్ రిజల్ట్స్ వచ్చినట్లున్నాయి….నీ ర్యాంక్ ఎంత నాన్నా’’ అని అడిగాడు రామారావు కొడుకు గొపీని, ‘మీ గోపీ రిపోర్ట్ కార్డు పంపాం’ అని స్కూల్ మేనేజ్‌బెంట్ పెట్టిన మేసేజ్ చూసి
‘‘పద్దెనిమిదో ర్యాంక్ నాన్నారు….ఎక్కువ సిలబస్ కవరు చేసినా మంచి ర్యాంకే వచ్చింది కదా….నాన్నారు’’ అన్నాడు గోపి చిలిపి కళ్ళు చిటపటలాడిస్తూ….
‘‘వెరీ……వెరీ గుడ్ చూశావా! నీవెంత ఇంప్రూవ్ అవుతున్నావో…..్ఫస్ట్ యూనిట్‌లో 25వ ర్యాంక్ వస్తే, సెకండ్ యూనిట్‌లోనే 18వ ర్యాంక్ వచ్చింది….వెల్‌డన్ మై బాయ్’’ అంటూ కొడుకుని అభినందిస్తూ షేక్‌హ్యాండ్ ఇచ్చాడు రామారావు. గోపి మనసంతా హాయిగా ఉంది….మా మంచి నాన్నారు అనుకున్నాడు మనసు.
‘‘అయినా మీరు గారాబం కాస్త తగ్గిస్తే కాస్త భయంతో చదివి….ఈసారి ఇంకా మంచి ర్యాంక్ తెచ్చుకునే వాడు’’ అంది సంధ్యారాణి, తన కొడుకు టాప్ ర్యాంకర్స్‌లో ఉండాలనుకునే సగటు తల్లి మనసుతో.
‘‘నీకే ముందు ముందు తెలుస్తుందిలే,…..మనవాడి గొప్పతనం…..‘స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్’ అని ఊరికే అనలేదు పెద్దలు’’ అని అన్నాడు నవ్వుతూ రామారావు.
‘‘ఓరేయ్ రాజా ఈసారి మా నాన్నారు నన్ను ఇంకా గొప్పగా మెచ్చేసుకున్నారురా…..అదే నేను కనుక పదిలోపు ర్యాంకర్నయితే….నా సామిరంగా….నాన్నారు ఎంత మెచ్చుకుంటారో నన్ను….ఊహిస్తేనే గొప్ప థ్రిల్‌గా ఉందిరా’’ అన్నాడు గోపి రాజుతో హుషారుగా….
‘‘మా ఇంట్లో షరా మామూలేరా….ఈసారి థర్డ్‌ర్యాంక్ వచ్చిందని మమీ డాడీ ఒకటే నస, ఓ తెగ బాధపడిపోయారురా….ఎంత మంచి ర్యాంక్ వచ్చినా ఫస్ట్‌ర్యాంక్ రాకపోతే తిట్లే రా తిట్లు’’ అంటూ డల్‌గా మాట్లాడాడు రాజు.
‘‘ఏమోరా! ఈసారి మాత్రం నేను టాప్ టెన్ ర్యాంకర్స్‌లో ఉంటాను’’ అన్నాడు గోపి నిబ్బరంగా ఊపిరి పీల్చుతూ.
* * *
‘‘గోపి నీకు క్వార్టర్లీ పరీయల్లో నైన్త్ ర్యాంకట నిజమేనా!’’ అని అడిగాడు రామారావు కొడుకు గోపీని.
‘‘అవును నానారు….టాప్ టెన్ ర్యాంకర్స్‌లో ఉండాలని బాగా చదివాను….మంచి ర్యాంక్ వచ్చిందంతే….నేనూ బెటరీ కదా….’’ అని అన్నాడు గోపి అమాయకంగా ‘‘నువ్వు బెటరేటి నానా….‘‘ నువ్వే ‘ది బెస్ట్’ ’’ అన్నాడు రామారావు గోపీ భుజం తడుతూ.
సంధ్యారాణి మిడిమిడిగా చూస్తోంది తండ్రీ కొడుకుల వైపు.
‘‘అవును నా కొడుకూ బెటరే, ఇక ది బెస్ట్ అవ్వగలడు’’ అని మనసులోనే పాజిటివ్ థాట్స్‌కి బీజం వేసుకుంది.
‘‘గోపీ మా డాడీ నన్ను మెచ్చుకున్నార్రా…. థర్డ్ ర్యాంకర్‌నని…. ఇందాక మీ నాన్నారు మా డాడీతో ఏదో మాట్లాడారులే’’ అన్నాడు రాజు గోపితో ఆనందంగా.

– ఎం.వి. స్వామి, చోడవరం,
విశాఖ జిల్లా. ఫోన్ : 7893434721

పుస్తక సమీక్ష

ఉషోదయ జీవన నవ్యత నిండిన కవిత్వం శిథిల చిత్రాల జాతర

తెరచిన కిటికీలోంచి కాదు, మూసిన గుండె గవాక్షాన్ని మనసారా చూడు, ముద్దాడే కవిత్వం ఉబుకుతుంది. అక్షరాలను ఎక్కుపెట్టి సమాజంపైకి సంధించమంటాయి. ఎందరో అభాగ్యుల జీవనచిత్రాలు నీ కళ్ళ ముందు దయనీయంగా దర్శనమిస్తాయి. ఎద పర్వతం నుండి ఎగజిమ్ముతుంది అసలైన కవిత్వం అంటున్న యువకవి తేళ్ళపురి సుధీర్‌కుమార్. కొయిలకుంట్ల, కర్నూలు జిల్లా వాసి. తన పదునైన 45 కవితల కవాటంతో ప్రథమ ప్రయత్నంగా కవిగా ముందుకొచ్చి కవితాప్రియులను తన శిథిల చిత్రాల జాతరలో నడిపించారు. నవ్యతను అందించారు.
ఈ కవిది తెచ్చిపెట్టుకునే కవిత్వం కాదు, ఒకరిని అనుకరించేది అసలే కాదు, అక్షరాలకు అర్రులు చాచని ఆత్మస్థయిర్యం, పదముల పేర్పుకి పాకులాడని ప్రతిభా సంపదన, భావాలకు బానిసయై పరుగులెత్తని సహజధోరణి, చెప్పదలచుకున్నది సూటిగా, వాడి నాడి ఎరిగిన సత్తా గల కవిగా గోచరిస్తాడు. భావితరంలో రాణించగల కవిగా ఎదిగే పోకడలు దర్శనమిస్తాయి ఈతని కవితల్లో. నాకు జన్మనిచ్చింది అమ్మే అయినా, జీవితాన్నిచ్చింది, అక్షరం అంటూ, అక్షర ప్రీతిని ఆవిష్కరిస్తాడు. పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్నా, నల్ల కలువల విషాదగీత ఆర్తనాదాలు, తీవ్రవాదుల గుప్పిట్లో బందీలవుతూనే ఉన్నాయని, అక్కడ నేలరాలుతున్న వందలాది కుసుమాలు, ఇక్కడ యువతుల మెడల్లో వజ్రాల్లా మెరుస్తున్నాయంటూ ఆర్ద్రత చెంది, కళ్లు చెమ్మగిల్ల జేస్తాడీ కవి. ఓ! అబలా!! నీ శక్తి ఇంతేనా? అని ప్రశ్నిస్తూ ప్రేమోన్మాది కసాయి కత్తికి బలయ్యే మేకపిల్లలా మారుతున్న నువ్వు వాడిని హతమార్చే, సివంగిలా మారేదెప్పుడు? నీ కళ్ళలో చండ్రనిప్పులు చెరిగేదెప్పుడు? అని హెచ్చరికతో కొండంత ధైర్యాన్నందిస్తాడు, అండగా నిలుస్తాడు. సమాజంలో మార్పుని వాంఛిస్తాడు. కవి తన బాల్యాన్నిలా నెమరువేసుకుంటూ పాఠకుల బాల్యాలనూ స్మరణకు తెస్తాడు. కాగితం పడవనెక్కి పిల్ల కాల్వల వెంట పరుగులు తీసిన నా బాల్యపు ఆనవాళ్ళు విరగబూసిన మల్లెల్లా స్వచ్ఛంగా నా కళ్ళ ముందు సాక్షాత్కరించాయి. జీవన అలజడుల మధ్య నలిగి, ‘జాషువా’ కవి గురించి వెలివేసిన సమాజంలో పాడుబడ్డ మసీదే నిన్ను ప్రతిష్ఠించుకుంది. సమ సమాజం కోసం వెలుగులు పంచే కాగడాగా నిల్చేవు అంటూ అతని వ్యక్తిత్వాన్ని కవిత్వాన్ని కీర్తిస్తాడు. తెలుగు భాష మాధుర్యాలనిలా వ్యక్తీకరిస్తాడు. వీర బెబ్బులి సాహసం మన తెలుగు వీరనారుల పుట్టినిల్లు మన తెలుగు కదం తొక్కు ఒంగోలు గిత్త పౌరుషం మన తెలుగు విశ్వమంతటా వాసికెక్కిన, మువ్వ సవ్వడి కూచిపూడి మన తెలుగు చేలగట్టున పాలపిట్టల్లా ఎంకి పాటతో ఎక్కిరించే కనె్నపిల్లల జాణతనం మన తెలుగు. ‘రుధిర సందేశం’ కవితలో అక్కడ కోయిలలు విప్లవ గీతాలనే పాడతాయి నేడు సూర్యుడు అస్తమిస్తున్నాడంటే రేపు ఉదయించడానికే ఇలా కవిత్వం కదం తొక్కింది. కావ్యానందాన్నిచ్చింది. ప్రతులకు ఫోన్ నెం.9885632727కు సంప్రదించగలరు. నా మదినిండా పరుచుకున్న కవిత్వం నాలో ఉషోదయ కేతనాన్ని ఎగురవేస్తుందన్న కవి ప్రశంసనీయుడు. ఈ యువకవిని అభినందిస్తూ భవిష్యత్‌లో మరిన్ని కావ్యాలను అందించాలని ఆకాంక్షిద్దాం.

– చెళ్లపిళ్ల సన్యాసిరావు, సెల్ : 9293327394.

నిత్యసత్యాలు

ఉట్టి కొట్టే పట్లు నేర్పాలి కదా!

దాని కోసం ఇప్పుడు ఈ సంతోషాలన్నీ వదులుకోడం కష్టంరా! ఏవో నాలుగు గైడ్లు చదివేస్తే చాలదా? అన్నిట్లోనూ అన్ని విషయాలూ గట్టిగా తెలియాలా? అదేంటి? మానవీయ విలువలు! ఆ పరీక్షలోనూ గట్టెక్కి తీరాలిట! మనకీ గండాలు గడిచే మార్గాలు కొట్టిన పిండే కదా! ఏ మాత్రం చొరవ చూపించినా మూడేళ్లల్లో డిగ్రీ పట్టా చేతికి రాదా? ఇలా రోజూ వచ్చి చెప్పినవన్నీ విని చెయ్యమన్నవన్నీ చేసి తీరా ఇంత రోష్టూ పడితే అవసరమైనప్పుడు కనుచాటు చెయ్యరట! ఎలాగోలా బతికేయడానికి ఇంత అవసరమంటావా? ఆడాలి! పాడాలి! చదవాలి కూడానా? మనవల్ల కాదు బాబూ మరో మార్గం ఉంటే చెప్పు!
ఎక్కువ డబ్బు ఖర్చయినా సరే రేపటికి పనికొస్తుంది కదా అని చదువు మొదలెడితే ఈ అరకొర పరిస్థితులేంటి? పుస్తకాలే గతయితే లోకంలోకి వెళ్ళాక పనిచేయడానికి పనికొస్తామా? ఏలికలకి తీరిక లేనట్టుంది. కొత్త చదువులు చదివించండంటారు కానీ వాటికి వసతులు కల్పించాలని మర్చిపోతారు. ప్రైవేట్ చదువులు బతుకులు చితక్కొడుతున్నాయి. ఇష్టంగా కష్టపడే వాళ్ళని అరకొర సత్తువతో ఆకాశానికి ఎగరమంటే మోకాళ్ళరుగుతాయ్. కొత్తతరం కోరికలు కొడిగట్టే కొరతలు తీరిస్తే రేపటికి మేం తయారవుతాం. స్వేచ్ఛగా స్వచ్ఛంగా స్వతంత్రంగా సాగిపోతాం.
చదువా? చట్టుబండలా? రోజూ రాకపోయినా ఏమీ అనకూడదు. వింటున్నట్టు నటిస్తేచాలా? ఏడాది చివరి తెల్లకాయితాల మీద గిలికిందే లెక్కా? మేం చెప్పింది వాళ్ళకేం తెలిసిందో తెలియాలంటే వాళ్ళు నిత్యం మా కనుసన్నల్లో ఏదో ఒక రాత రాసి తీరాలి. కొంచెం కూత ద్వారా కూడా తెలియాలి. మూగజీవాల్లా కళ్లూ చెవులూ అప్పగిస్తే సరిపోదు. అడుగూబొడుగూ అంతా తీసి చదువుకుందామంటే అందుబాట్లో ఆ అవకాశం కల్పించకపోతే ఎలా? మట్టిలో మాణిక్యాలకి మెరుగు పెట్టడం మంచిదే కదా? ఎలాగోలా గోడ దాటేస్తే చాలనుకునేవాళ్ళు ఎక్కువయితే ప్రమాదం కదా! ఇష్టపడి కష్టపడేవాళ్ళే రేపటి వెలుగులు వెదజల్లుతారు. నీటిమూటల్లాంటి వాగ్దానాల మీద నడవడం కష్టం కాని కనీసం ఉట్టయనా కొట్టే పట్లు నేర్పాలి.

– కాండూరి లక్ష్మీపతి, సెల్ : 9440559398.

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా గొంతు వినడానికే సినిమాలు చూసేవాళ్లున్నారు

నా గొంతు వినడానికే సినిమాలు చూసేవాళ్లున్నారు

చిన్మయి అంటే అందరూ గుర్తు పట్టకపోవచ్చు. కాని సమంతకు డబ్బింగ్‌ చెప్పే అమ్మాయి అంటే చాలు అందరూ గుర్తుపడతారు. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, గాయని అయిన చిన్మయి కథక్‌, ఒడిస్సీ నృత్యకారిణి. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీషు, జర్మన్‌ భాషలు కూడా వచ్చు ఈమెకి. ఇంత టాలెంట్‌ ఉన్న చిన్మయి శ్రీపాదతో నవ్య చేసిన ఇంటర్వ్యూ…
గాయకురాలు కావాలని చిన్నప్పట్నించీ అనుకునేవారా?
బడికెళ్లే వయసులోనే సింగర్‌ కావాలనుకునేదాన్ని. అందుకు కారణం మా అమ్మ పద్మహాసిని. తను మంచి సింగర్‌. సంగీతంలోనూ దిట్ట. అమ్మే తొలి గురువు కావటం నా అదృష్టం. చిన్నపుడే కర్నాటక, హిందుస్తానీ సంగీతం నేర్పించింది. సంగీతం నేర్చుకునే రోజుల్లో రేవతి, సురేష్‌మీనన్‌ నటించిన ఓ సినిమాకి తీసుకెళ్లింది. ఆ సినిమాలో పాటలు నాకు బాగా నచ్చాయి. ‘రంగీలా’ సినిమాలో స్వర్ణలత పాడిన ‘హాయ్‌ రామా యే క్యా హువా…’ పాట పాడాలన్న స్ఫూర్తి కలిగించింది.
పాటల పయనం ఎలా మొదలైంది? 
సన్‌టీవీ వాళ్లు నిర్వహించిన ‘సప్తస్వరంగళ్‌’ అనే పాటల రియాలిటీ షోలో గెలిచాను. అప్పుడే సింగర్‌ శ్రీనివాస్‌ నన్ను రెహ్మాన్‌ దగ్గరికి పరిచయం చేశారు. మణిరత్నంగారు తీసిన ‘కన్నథిల్‌ ముత్తమిత్తల్‌’ చిత్రంలో ‘ఒరు దైవం తంట పూవే…’ పాడాను. అదే సినిమా తెలుగులో ‘అమృత’గా విడుదలైంది. అందులో ‘ఏ దేవి వరమో నీవు’ పాట పాడాను. గాయనిగా అది నా మొదటిపాట. మంచి హిట్టయ్యింది. మొదటి పాట సక్సెస్‌ కావడంతో నా బాధ్యత పెరిగింది.
మొదటిపాటకే రెహ్మాన్‌తో కలిసి పనిచేశారు కదా ఆ అనుభవం గురించి…
రికార్డింగ్‌ థియేటర్‌కి వెళ్లాక ‘నీ స్టైల్‌లో పాడు’ అన్నారు రెహ్మాన్‌. ఎటువంటి ఒత్తిడి పడకుండా పాడాను. లిరిక్స్‌, ట్యూన్‌, పిక్చరైజేషన్‌ వల్ల నా గాత్రం ఎలివేట్‌ అయింది. రెహ్మాన్‌ తో పనిచేయటమంటే ఓ ఎడ్యుకేషన్‌. నేర్చుకోవాలనే తపన ఉండాలే గానీ అనునిత్యం కొత్త విషయాల్ని నేర్చుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే రెహ్మాన్‌తో కలిసి పనిచేయడటమంటే గుడికెళ్లి ప్రార్థన చేసినట్లు ఉంటుంది. గాయకులకి స్వేచ్ఛనిచ్చే మనస్తత్వమున్న వ్యక్తి. కొత్త గాయకుల ప్రతిభను గుర్తించి, ఏ పాట ఎవరుపాడితే నప్పుతుందని అంచనా వేయడంలో రెహ్మాన్‌ నిష్ణాతులు. ఇప్పటివరకూ నలభై పాటలు రెహ్మాన్‌ వద్ద పాడాను.
తెలుగు, తమిళ పాటల గురించి…
మొదటిపాట తర్వాత శివాజీ చిత్రంలో ‘సహానా..’ పాట పాడి తమిళంలో బిజీ అయ్యాను. తెలుగువాళ్లు ‘చిన్మయి’ ని ఇంతలా స్వాగతించటం అదృష్టం. 2002 నుండి తెలుగులో అవకాశాలు వచ్చాయి. తమిళంతో పోలిస్తే తెలుగులో లవ్‌సాంగ్స్‌ చాలా నచ్చుతాయి. బాలీవుడ్‌కి కూడా రెహ్మాన్‌గారే నన్ను పరిచయం చేశారు. ‘గురు’ తర్వాత ఐదేళ్లకి హిందీలో మంచి అవకాశం వచ్చింది. సంగీత దర్శకులు విశాల్‌-శేఖర్‌ ‘చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌’ మూవీ పనిమీద చెన్నయ్‌కి వచ్చి ‘తేరే బినా’ పాట పాడిన అమ్మాయి ఎవరని ఆరాతీసి. ఫోన్‌ నంబరు కనుక్కొని మరీ నాకు ఫోన్‌ చేశారు. ఆ సినిమాలో నేను పాడిన ‘బన్‌ కే తిత్లీ దిల్‌…’ పాట మంచి పేరు తెచ్చింది. ‘టుస్టేట్స్‌’ సినిమాకి పాడిన ‘మస్తుమగన్‌’ యువతని ఆకట్టుకుంది. ఇప్పటివరకు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మళయాళ, మరాఠీ, తుళు భాషల్లో పాటలు పాడాను.
పాటల ప్రయాణం మీకెలా అనిపిస్తోంది. ఇందులో మీ బలాలు, బలహీనతలు…
ఒక్కోసారి చాలా టఫ్‌గా, కొన్నిసార్లు గ్రేట్‌గా అనిపిస్తుంది. నాలోని బలాలు తెలీదు గాని బలహీనత మాత్రం నన్ను నేను తిట్టుకోవడం. నా పాటలు నేను పూర్తిగా వినను. ఒక్కోసారి బాగా పాడలేదని నన్ను నేనే తిట్టుకుంటాను. అలా తిట్టుకోవడమే నాకు ప్లస్‌ అని చెప్పొచ్చు. నాకు బెస్ట్‌ క్రిటిక్‌ అమ్మ. నా పాటలు విన్నవాళ్లు, స్టేజ్‌ పెర్ఫార్మెన్స్‌ చూసిన వాళ్లు అభినందిస్తే, మా అమ్మ మాత్రం ‘అది అలా పాడాలి… ఇది ఇలా పాడాలి’ అని చెప్తుంటుంది. ‘ఏంటమ్మా అలా చెప్తావు’ అనంటే ‘అందరిలా నేనూ పొగిడితే ఎలా’ అంటుంది.
గమ్మత్తుగా పలికే మీ గొంతు వెనక ఉన్న రహస్యం?
రహస్యాలేమీ లేవు. గొంతు కోసమని ప్రత్యేక శ్రద్ధ తీసుకోను. శాకాహారం ఎక్కువగా తింటాను. చాక్లెట్‌ మిల్క్‌షేక్‌, ఐస్‌క్రీమ్స్‌ అంటే మహా ఇష్టం. పాటలు పాడేవాళ్లు ఐస్‌ క్రీమ్‌లు తినకూడదంటారు. కాని ఐస్‌కీ రమ్‌ తిన్నాక గోరు వెచ్చని నీళ్లు తాగితే సరిపోతుంది.
డబ్బింగ్‌లోకి ఎలా వచ్చారు?
అనుకోకుండా జరిగింది. గౌతమ్‌మీనన్‌ రూపొందించిన చిత్రం ‘సిల్లును ఒరు కాదల్‌’లో భూమిక పాత్రకి డబ్బింగ్‌ చెప్పమన్నారు. ‘పాటలు పాడతాను కానీ నవ్వడం, ఏడవడం నా వల్ల కాద’న్నాను. కాని భూమిక పాత్రకి చిన్మయే డబ్బింగ్‌ చెప్పాలన్నారు గౌతమ్‌మీనన్‌. దానికి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ‘సూర్య సన్నాఫ్‌ క్రిష్ణన్‌’ తమిళ, తెలుగు వెర్షన్స్‌లో సమీరారెడ్డికి డబ్బింగ్‌ చెప్పించారు. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా స్టార్డమ్‌ అనేది గౌతమ్‌మీనన్‌ వల్లే వచ్చింది. ఆయన రూపొందించిన ‘వినైతాండి వరువయా’ చిత్రంలో త్రిష నటించిన ‘జెస్సీ’ పాత్రకు గొంతు ఇచ్చాను. ఆ సినిమా తెలుగు వెర్షన్‌ ‘ఏం మాయ చేశావే’లో సమంతకి డబ్బింగ్‌ చెప్పాను. హిందీలో వచ్చిన ‘ఏక్‌ దివానా థా’ సినిమాలో అమీజాక్సన్‌ నటించిన జెస్సీ పాత్రకీ డబ్బింగ్‌ చెప్పాను. ఒకేసారి తమిళ, తెలుగు చిత్రపరిశ్రమలో డబ్బింగ్‌ చెప్పటానికి కారణమైన ఏమాయ చేశావే సినిమాని చాలామంది ప్రేక్షకులు, చిత్రపరిశ్రమకు సంబంధించిన వాళ్లు నా గొంతు వినటం కోసమే చూశామని చెప్పారు. పాటలతో పాటు వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌గా గుర్తింపు దక్కింది. డబ్బింగ్‌తో మాస్‌ ప్రేక్షకులకి చిన్మయి ఎవరో తెలిసింది.
సమంతాతో స్నేహం గురించి…
‘నటిగా నాకు మంచి పేరొచ్చింది చిన్మయి గొంతు వల్లే’ అని చాలాసార్లు చెప్పింది తను. భేషజాలు లేని స్టార్‌ హీరోయిన్‌ ఆమె. మేమిద్దరం చాలా క్లోజ్‌గా ఉంటాం. సమంతా నటనకి నా గొంతు బాగా నప్పుతుంది. ఆమె నటించిన ‘బృందావనం, ఆటోనగర్‌ సూర్య, జబర్దస్త్‌’ సినిమాలకి తప్ప మిగతా అన్నింటికీ నేనే డబ్బింగ్‌ చెప్పాను.
డబ్బింగ్‌లో ఇబ్బందులైవేనా ఉంటాయా?
డబ్బింగ్‌ చెప్పడం ‘మైకుమీద సామే’. గొంతు మీద ఒత్తిడి పడుతుంది. నేను కూడా త్వరగా అలసిపోతాను. ఒక రోజు డబ్బింగ్‌ చెప్పానంటే రెండు రోజులు విశ్రాంతి తప్పనిసరి. నటీనటుల తప్పుల్ని డబ్బింగ్‌తో సరిచేస్తారనే విషయం తెలిసి ఆశ్యర్యపోయాను. డబ్బింగ్‌ చెప్పాలంటే భాషపై పట్టు ఉండాలి. నటుల హావభావాలు, సీన్‌ డిమాండ్‌, మూడ్‌ బట్టి ప్రవర్తించాలి. పాత్రకి గొంతుతో జీవం పోయడం అంత సులువేం కాదు. పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకుని రిహార్సల్స్‌ చేసుకోవాలి. మాటల్లో చిన్న పొరపాటు కూడా దొర్లకుండా చూసుకోవాలి. దర్శకుడు ‘ఓకే’ అనేవరకు ఎన్ని రీటేకులైనా చేయాలి. ఇప్పటివరకూ 70 చిత్రాలదాకా డబ్బింగ్‌ చెప్పాను. తెలుగు హీరోయిన్‌ అనుష్క చేసే వాణిజ్య ప్రకటనల కోసం నా గొంతే ఉండాలని అడిగి మరీ చెప్పించుకుంది. అది నాకు గర్వంగా అనిపించింది.
మీ ప్రేమపెళ్లి గురించి…
అందాల రాక్షసి సినిమా అప్పుడే రాహుల్‌ పరిచయమైంది. ‘మీ డబ్బింగ్‌ సూపర్‌’ అని రాహుల్‌ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు. ‘మీ యాక్టింగ్‌ బావుంద’ని నేనన్నాను. ఆ తర్వాత ట్విట్టర్‌లో కలిశాను. ఫోన్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. వాట్సప్‌ మెసేజ్‌లతో మరికాస్త దగ్గరయ్యాం. రాహుల్‌ ప్రపోజ్‌ చేశాక ఏడాదిన్నర తరువాత పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. తను స్నేహితుడిలా ఉంటాడు. వేరొకరి గురించి చెడ్డగా మాట్లాడడు. రూమర్స్‌ వినడు. రాహుల్‌ లాంటి మంచి మనసున్న భర్త దొరకటం నా అదృష్టం.’’
చిన్నప్పుడే శాస్ర్తీయనృత్యం నేర్చుకున్నాను. కథక్‌, ఒడిస్సీ నృత్యాలు చేస్తాను. నాకు తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీషు, జర్మన్‌ భాషలపై పట్టుంది. మాకు ‘బ్లూ ఎలిఫెంట్‌’ అనే ట్రాన్స్‌లేషన్‌ కంపెనీ ఉంది. ఇందులో మేము 130 భాషల్ని తర్జుమా చేస్తాం. పుస్తకాలు, సినిమాలు ఏదైనా అనువాదం చేసి పెడతాం. పుస్తకాలు చదవటం, కొత్తభాషలు నేర్చుకోవటం అంటే నాకెంతో ఇష్టం.
గజల్స్‌ అంటే చాలా ఇష్టం. వాటివల్ల రిఫ్రెష్‌ అవుతాను. నా పదిహేనో యేట నించే గజల్స్‌ పాడుతున్నాను. గులాం అలీ సాబ్‌, మెహదీ హాసన్‌ గజల్స్‌ అంటే ప్రాణం. గజల్స్‌లో తెలీని అనుభూతి, పొయెట్రీ మ్యాజిక్‌ ఉంటుంది. అంతకంటే మించి మంచి సోల్‌ ఉంటుంది.
Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అవాస్తవ చరిత్ర

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నిబద్ద న్యాయ మూర్తి జష్టి స్ కృష్ణయ్యర్-

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నైతిక విలువలకు నిలువు టద్దమ్ -ఆచార్య రంగ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రైతన్న చుట్టూ రాజకీయం

Posted in వార్తా పత్రికలో | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -76 115-ఆధునిక యుగ మహా గీర్వాణ పండితకవి –వేదాల తిరువేంగళాచార్యులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -76

115-ఆధునిక యుగ మహా గీర్వాణ పండితకవి –వేదాల తిరువేంగళాచార్యులు

వేదాల తిరు వేంగళా చార్యుల వారు గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెద్దవరం అగ్రహారం లో 1895లో జన్మించారు .వైష్ణవ కుటుంబం లోని వీరు సంస్కృత ఆంధ్రభాషలను చిన్నతనం లోనే అభ్యసించారు .ఈ రెండు భాషల్లో మహా పాండిత్యాన్ని సంపాదించారు .దర్శన ,అలంకార శాస్త్రాలను మధించారు .స్వంత గ్రామం లోనే పండితుల వద్ద ప్రాధమిక విద్య నేర్చారు .ఒంట బట్టిన గీర్వాణ తెలుగు భాషా  పాండిత్యాల  వలన సంతృప్తి చెందక  విద్యా తృష్ణ తీరక ఆచార్యుల వారు దేశ పర్యటన చేశారు .

విజయ నగరం చేరి మహా మహోపాధ్యాయ తాతా సుబ్బరాయ శాస్త్రి గారి వద్ద ను ,పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి గారి దగ్గరా న్యాయ ,వ్యాకరణ ,అలంకార శాస్త్రాధ్యయనం కూలం కషం గా నిష్టతో చేశారు .న్యాయ శాస్త్ర శిరోమణి పరీక్షకు హాజరై సర్వోత్తములుగా ఉత్తీర్ణత సాధించారు .పిఠాపురం రాజాస్థాన విద్వాంసులు శ్రీ గుది మెళ్ళవెంకట రంగా చార్య స్వామి సన్నిధిలో న్యాయ ,వేదాంత ,మీమాంస ,సాహిత్య ,వ్యాకరణ ,తంత్ర సంప్రదాయక విజ్ఞానం లో మెరుగులు దిద్దుకొని సంపూర్ణ ప్రజ్ఞా వంతులని పించు కొన్నారు .అంటే సమస్త శాస్త్రాలలో అపార ప్రజ్ఞా పాటవాలను సాధించి తమ దీమత్వాన్ని ప్రకటించారు .సమకాలీనులలో వేదాల వారి వంటి వారెవరూ లేరని చెప్పుకొనేవారు .

విశిష్టాద్వైత సిద్ధాంతం లో పరిపూర్ణులైన ఆచార్యుల వారు ద్వైత ,అద్వైత ,శుద్దాద్వైతసిద్ధాంతాలలోనూ అపూర్వ  ప్రావీణ్యం పొందారు .ఇంతటి సమ ద్రుష్టి ఉన్న వారు ఆ కాలం లో  చాలా అరుదుగా ఉండేవారు .’చతుర్మత తత్వ సారం ‘’అని వీరు రాసిన అపూర్వ గ్రంధం తెలుగు భాషా సమితి వారి బహుమతిని పొందింది .సంస్కృత   అధ్యాపకులు  గా వీరి సేవలు నిరుపానమై నిలిచాయి .మహా పండితులైన శ్రీ శ్రీనివాస శిరోమణి వంటి వారు ఆచార్యుల వారి ప్రముఖ శిష్యులై వర్దిల్లారు .

పూరీ జగన్నాధ క్షేత్ర సంస్కృత కళాశాల ,కొవ్వూరు ఆంద్ర గీర్వాణ విద్యా పీఠం,చిట్టి గూడూరు శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృత కళాశాల లలో ఆచార్యుల వారు సంస్క్రుతాధ్యాపకులుగా సేవలు అంద జేశారు .గుంటూరు ఆంద్ర క్రైస్తవ కళాశాల  వీరి ప్రతిభను గుర్తించి సంస్కృత అధ్యాపకులుగా స్వీకరించి సేవలుఅందుకొన్నది .

ఆచార్యుల వారు ఆంద్ర ధ్వన్యాలోకనం ,(లోచన సహితం )కావ్యాలం కార సూత్ర వ్రుత్తి,రస గంగాధరం (పూర్వ ,ఉత్తర ఖండాలు )వ్యక్తీ వివేకం ,(ఆంధ్రానువాదం )తెనాలి రామకృష్ణుని కవిత్వం భారతోపన్యాసాలు ,భాగవత ఉపన్యాసాలు ,రాజ్య ప్రదానం అనే నవల ,జాతక కధలు ,గోపికా వల్లభ శతకం ,చతుర్మత తత్వ సారం,కావ్య ప్రకాశిక (ఆంధ్రానువాదం )వంటి ఎన్నో గ్రంధాలు రచిం చారు .చివరి రోజులు గుంటూరులోని ఆనంద తీర్ధ అగ్రహారం లో గడిపారు .డెబ్భై ఏడవ ఏట వేదాల తిరు వేంగళా చార్యుల వారు మార్చి 1972 లో పరమ పదం చేరుకొన్నారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-12-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -75- 114-వైయాకరణి-వజ్ఝల చిన సీతారామ శాస్త్రి

గీర్వాణ  కవుల కవితా గీర్వాణం -75

114-వైయాకరణి-వజ్ఝల  చిన సీతారామ శాస్త్రి

వైయాకరణి అని పేరు పొందిన వజ్ఝల చిన సీతా రామ శాస్త్రి గారు ముఖ లింగేశ్వర శాస్త్రి ,వేంకటాంబ దంపతులకు 25-6-1878 నజన్మించారు .ఒజ్జ(ఉపాధ్యాయుడు ) అనేపేరు వజ్ఝల గా మారి ఉండచ్చు .వీరి  కుటుంబం లో గణిత శాస్త్రాధ్యయనం ,ముహూర్త నిర్ణయం ,జాతక పరిశీలన మొదటి నుంచి ఉన్నాయి .శాస్త్రిగారికి గొప్ప పాండిత్యం ఉపజ్న ,బుద్ధి సూక్ష్మత ,సూక్ష్మ పరిశీనా బుద్ధి ,భుద్ధి తీక్ష్ణత ,వివేచన ,విషయ సంగ్రహణం సహజం గా అబ్బిన గొప్ప లక్షణాలు .ఆంద్ర శబ్ద చింతామణి ,వికృతి వివేకం లను తన వ్యాకరణ పరి శోధనకు మూల గ్రంధాలుగా స్వీకరించారు .వీటిని జోడించి ‘’వైయాకరణ ,పారిజాతం’’ ,’’వ్యాకరణ సంహితా సర్వస్వం’’ అనే రెండు అపూర్వ వ్యాకరణ గ్రంధాలను రచించారు .ఆంద్ర విశ్వవిద్యాలయం లో వజ్ఝల వారు భాషా పండితులుగా నియమింప బడ్డారు .విజయ నగర సంస్కృత కళాశాల ,మద్రాస్ ,ఆంద్ర విశ్వ విద్యాలయాలలో బోధనా వృత్తిలో దశాబ్దాల పాటు పని చేసి భాషా సేవ చేశారు .చిన తాత గారు చిన వెంకట సిద్ధాంతి గారి వద్ద ముహూర్త సిద్ధాంత విభాగాలు ,లీలావతి గణితం అభ్యసించారు .మరొక చిన తాత గారి వద్ద సంస్కృత వ్యాకరణ ,ధర్మ శాస్త్రాలను నేర్చారు .నడాదూర్ అనంతాల్వార్ దగ్గర తర్క వేదాన్తాలను నేర్చుకొన్నారు .

మూల గ్రందాలలోనికొన్ని సంజ్ఞా పరిచేద సూత్ర కారికలను కలిపి ‘’వైయాకరణ పారిజాతం’’రాశారు .ఇందులో ప్రత్యేకతలు కవి సంశయ విచ్చేదనాల ననుసరించి ధ్వని శాస్త్రాన్ని వివవివరణాత్మకం గా శాఖాద్యాదులననుసరించి లిపి స్వభావాన్ని నిర్ణయించారు .ప్రాచీన శాసనాలలో ఉన్న లేఖన సంప్రదాయాలను పరి శోధించారు .పూర్వ లాక్షణికులు చేసిన రేఫా ,శకట రేఫల పరిశోధనలను సమీక్షించారు ‘’సంహితా సర్వస్వం ‘’లోచింతామణి ,వికృతి వివేకాలను బాల వ్యాకరణ ప్రణాలికా బద్ధం గా విభజన చేసి ,కల్ప తరు వ్యాఖ్యను చేర్చి మహాద్భుత బృహద్గ్రంధం గా  గా రచన చేశారు . బాల వ్యాకరణ సంజీవనీ వ్యాఖ్య దీనికి ముఖ్యమైన అను బంధం గా ఉంది .దీనిలో అనేక లక్షణ గ్రందాల పరామర్శ ఉంది .

వజ్ఝల వారి నిశిత పరిశీలనా దృష్టికి దృష్టాం తాలే –అధర్వ కారికావళిపీఠికలు ,బాల సరస్వతీయ పీఠిక,చింతామణి విషయ పరిశోధనలు .వీరి బాల వ్యాకరణ ఉద్యోతం వ్యాకరణ సంహితా సర్వస్వం అని చెప్ప వచ్చు .వీరు రాసిన ‘’ద్రావిడ భాషా పరిశీలనం ‘’భాషా పరం గా శాస్త్రి గారి పరిశోధనా తీక్ష్ణ దృష్టికి గీటు రాయి .ఇందులో ప్రతిపాదించిన సిద్ధాంత సారమే’’ద్రావిడ భాషా సామ్యాలు ‘’అనే ఉత్క్రుస్ట గ్రంధం  .వీరి నిశిత పరిశీలనా నై పుణ్యానికి  గొప్ప ఉదాహరణలే –‘’వసు చరిత్ర విమర్శ’’,,’’హరిశ్చంద్ర నలోపాఖ్యాన పీఠిక ‘’ లు .ఈ బహుముఖ ప్రజ్ఞా శాలి 29-5-1964న ఎనభై అరవ ఏట పరమపదించారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-12-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment