సాహిత్యాకాశంలో సగం’ స్త్రీల సాహిత్య అధ్యయనానికి దిక్సూచి – రాచపాళం చంద్రశేఖరరెడ్డి

 

సాహిత్య విమర్శకులు రచయితల కన్నా రెండాకులు ఎక్కువ చదువుకోవాలి అన్న కుటుంబరావు అభిప్రాయానికి, మంచి విమర్శకులు మంచి పాఠకులు కావాలి అన్న వల్లంపాటి అభిప్రాయానికి సరైన ఉదాహరణ కాత్యాయని. భారతీయ సామాజిక వ్యవస్థ స్వరూప స్వభావాలు, దాని చరిత్ర, దాని పరిణామాలు, వాటిని నిర్ణయిస్తున్న గతితార్కిక సూత్రాలు బాగా తెలిసినవారు కాత్యాయని. ప్రజాదృక్పథం గల సాహిత్య విమర్శకులకు ఉండవలసిన సైద్ధాంతిక పునాది, నిబద్ధత పుష్కలంగా ఉన్న విమర్శకులు కాత్యాయని. అందువల్లనే ఆమె విమర్శలో సాధికారత, విశ్వసనీయత తొణికిసలాడుతుంటాయి.

వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలో మహిళల సంఖ్య పరిమితమే. ఎనిమిదిన్నర శతాబ్దాల ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్రలో వీళ్ళు వేళ్ళ మీద లెక్కబెట్టదగినంత మందే. ఆధునిక సాహిత్యంలోనే మేలు. నూటాయాభై ఏళ్ళ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శలో కూడా మహిళల భాగస్వామ్యం అంతంత మాత్రమే. ఉన్నవాళ్ళలో కూడా ఆధునిక దృక్పథం కలిగి, సమాజ పరివర్తన లక్ష్యంగా విమర్శ చేసేవాళ్ళు చాలా పరిమితం. సంప్రదాయబలం ఉన్నవాళ్ళు, స్పష్టమైన దృక్పథం లేనివాళ్ళు ఎక్కువ మంది. ఆచార్య కాత్యాయనీ విద్మహే ఆధునిక చింతన గలిగిన మహిళా సాహిత్య విమర్శకులలో అగ్రగామి. ఆమె నాలుగు దశాబ్దాలుగా సాహిత్య విమర్శ రాస్తున్నారు. అనేక విమర్శ గ్రంథాలు ప్రచురించారు. వీటిలో ‘సాహిత్యాకాశంలో సగం’ ఒకటి. ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ 2012 ఏడాదికిగాను పురస్కారం ప్రకటించింది. ఈ పుస్తకం 2010లో అచ్చయింది. ఇరవై ఎనిమిది వ్యాసాలు గల ఈ పుస్తకం స్త్రీల సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి దిక్సూచిగా పనిచేస్తుంది.

పుస్తకంలోని ఆరు వ్యాసాలు స్త్రీల సాహిత్యానికి సంబంధించిన సిద్ధాంత నేపథ్యాన్ని, స్త్రీల సాహిత్యాన్ని గుంపుగా అధ్యయనం చేయటాన్ని తెలియజేస్తాయి. తక్కినవి పది వ్యాసాలు స్త్రీల కవిత్వాన్ని, పన్నెండు వ్యాసాలు స్త్రీల కథల్ని విశ్లేషించాయి. కాత్యాయని ప్రధానంగా కల్పనా సాహిత్య విమర్శకులయినా స్త్రీల కవిత్వాన్ని కూడా విశ్లేషించారు. స్త్రీలను ‘ఆకాశంలో సగం’ అని వర్ణించింది చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మావో. ఆ వర్ణన ఆధారంగా ఓల్గా ‘ఆకాశంలో సగం’ అనే నవల రాయగా, కాత్యాయని ‘సాహిత్యాకాశంలో సగం’ అనే విమర్శ గ్రంథం రాశారు.

ఈ విమర్శగ్రంథంలోని వ్యాసాలు 1984-2010 మధ్య రెండున్నర దశాబ్దాలలో సదస్సుల కోసం రాసినవి కొన్ని, పత్రికల కోసం రాసినవి ఇంకొన్ని, పుస్తకాలకు రాసిన ముందుమాటలు మరికొన్ని. ఈ వ్యాసాలు స్త్రీవాదం తెలుగులో ప్రారంభమౌతున్న దశలో మొదలై అది స్థిరమైన సిద్ధాంతంగా రూపొంది సామాజిక ఆమోదం పొందే దాకా రాశారు కాత్యాయని. సామాజిక పరిణామ క్రమానికి ప్రాతినిధ్యం వహించే ఈ వ్యాస సంపుటి స్త్రీల సాహిత్య అధ్యయనానికి ఒక దిక్సూచి, ఒక కరదీపిక.

సాహిత్య విమర్శకులు రచయితల కన్నా రెండాకులు ఎక్కువ చదువుకోవాలి అన్న కుటుంబరావు అభిప్రాయానికి, మంచి విమర్శకులు మంచి పాఠకులు కావాలి అన్న వల్లంపాటి అభిప్రాయానికి సరైన ఉదాహరణ కాత్యాయని. భారతీయ సామాజిక వ్యవస్థ స్వరూప స్వభావాలు, దాని చరిత్ర, దాని పరిణామాలు, వాటిని నిర్ణయిస్తున్న గతితార్కిక సూత్రాలు బాగా తెలిసినవారు కాత్యాయని. ప్రజాదృక్పథం గల సాహిత్య విమర్శకులకు ఉండవలసిన సైద్ధాంతిక పునాది, నిబద్ధత పుష్కలంగా ఉన్న విమర్శకులు కాత్యాయని. అందువల్లనే ఆమె విమర్శలో సాధికారత, విశ్వసనీయత తొణికిసలాడుతుంటాయి. సామాజిక పరిణామాలు, సాహిత్య పరిణామాలు వీటి మధ్య గల అవినాభావ సంబంధం బాగా తెలిసినవారు గనక ఆమె ప్రతి వాక్యాన్నీ ఆ దృష్టితోనే రాస్తారు. ఆమెకు సమాజం పట్ల, సాహిత్యం పట్ల విమర్శనాత్మక దృష్టితో కూడిన మక్కువ ఉంది గనక ఆమె విమర్శలో అనుకూలగుణం (పాజిటివ్‌నెస్) నిగూఢంగా ఉంటుంది. సాహి త్య విమర్శకులకు నిబద్ధత ఉంటే మిన్ను విరిగి కిందపడిపోతుందని భయపడేవారికి కాత్యాయని విమర్శ బుద్ధి చెబుతుంది. ధైర్యాన్నిస్తుంది. నిబద్ధులైనవారి విమర్శ ఎంత ఆరోగ్యకరంగా ఉంటుందో ఈ పుస్తకం రుజువు చేసింది. సాహిత్యాధ్యయనానికి సామాజిక శాస్త్రాలను ఎలా వినియోగం చేసుకోవాలో ఈ పుస్తకం తెలియజేస్తుంది. సామాజికశాస్త్రాల వెలుగులో సాహిత్యాన్ని పరామర్శించడం ‘సాహిత్యేతర’ విషయంగా భావించడంలోని అసంబద్ధత ఈ పుస్తకం చదివితే అర్థమవుతుంది.

కాత్యాయని మార్క్సీయ స్త్రీవాద సాహిత్య విమర్శకులు. సమాజాన్ని, కళలనూ అర్థం చేసుకోవడానికి మార్క్సిజం అందించిన రాజకీయార్థికశాస్త్రం, చారిత్రక దృష్టి కాత్యాయని సైద్ధాంతిక నేపథ్యం. దీనికి స్త్రీవాదాన్ని సమన్వయించుకొని ఆమె విమర్శ రాస్తున్నారు. స్త్రీవాద సాహిత్యానికి నేపథ్యం చెప్పేటప్పుడు అంతర్జాతీయ మహిళా దశాబ్దంతోపాటు శ్రీకాకుళ గిరిజన విప్లవోద్యమాన్ని, ఉత్తర తెలంగాణ ప్రాంత ఉద్యమాన్ని సమన్వయించుకోవడమే ఆమె మార్క్సీయ స్త్రీవాద దృక్పథానికి మూలం. ఉత్పత్తి సంబంధాల గురించిన భావనల అభివృద్ధిని రాజకీయార్థిక శాస్త్రంగా గుర్తించి, స్త్రీల సాహిత్యాన్ని ఆ శాస్త్రం వెలుగులో అధ్యయనం చేయడానికి అవసరమైన నేపథ్యాన్ని వివరించిన తొలి వ్యాసం, ఆధునిక తెలుగు సాహిత్యంలో జండర్ స్పృహ ప్రతిఫలనాలను విశ్లేషించిన రెండవ వ్యాసం ఈ పుస్తకానికి పునాదిరాళ్ళు. వాటిలో సిద్ధాంతం, పద్ధతి-అనే వాటి వివరణ మౌలికంగా ఉంది. ‘మహిళలు-సాహిత్యం’, ‘స్వాతంత్య్రానికి పూర్వం స్త్రీల కవిత్వం’ అనే రెండు వ్యాసాలలో వెయ్యేళ్ల తెలుగు సాహిత్య చరిత్రలో మహిళల పాత్రను చారిత్రకంగా వివేచించారు కాత్యాయని. ప్రాచీన కాలంలో తమకు పరిచయం లేని సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశించిన కొందరు కవయిత్రులు తమకు పాండిత్యం లేదని, తాము గొప్పగా రాయలేమని ఆధిపత్యంలో ఉన్న పురుష కవులకు విన్నవించుకోవడాన్ని కాత్యా యని సాంఘిక దృష్టితో గుర్తించి వ్యాఖ్యానించడం కొత్తగా ఉంది.

మార్క్సిస్టు విమర్శకు చారిత్రక దృష్టి ప్రధానం. విమర్శకు తీసుకున్న సాహిత్యాన్ని అది రాయబడిన కాలం నేపథ్యంలో అధ్యయనం చేయడం మార్క్సీయ విధానం. చారిత్రక పరిణామ క్రమంలో రచయితను, రచనను అంచనా కట్టడం ఈ పద్ధతి. చిల్లర భవానీదేవి ‘వర్ణనిశి’ కవితల్ని 1996-2000 మధ్య రాసినవంటూ ఆ కవితలు ఆ కాలానికి ఎలా ప్రాతినిధ్యం వహిస్తున్నాయో వివరించారు కాత్యాయని. కాలానికి అతీతంగా ఏ రచనా జరగదు అనే సూత్రం ఈ పరిశీలనలో దాగి ఉంది. శ్రీశ్రీ ఈ (20వ) శతాబ్దం నాది అన్నారు. 1970-80 దశాబ్దాన్ని విరసం దశాబ్దం అన్నారు విమర్శకులు. కత్తి పద్మారావు ‘ఈ యుగం మాది’ అంటున్నారు.

కాత్యాయని చాలా వ్యాసాలలో 1985-95 దశాబ్దాన్ని స్త్రీవాద సాహిత్య దశాబ్దంగా గుర్తించారు, నిర్వచించారు. ఇందులో తెలుగు సాహిత్య చరిత్ర నిర్మాణంలో మహిళల కృషిని గుర్తించే ఆసక్తి కనిపిస్తుంది. ఒక రచయిత్రి మొత్తం సాహిత్యాన్ని విశ్లేషించేటప్పుడు రచయిత్రిగా ఆమె పరిణామాన్ని చారిత్రక క్రమంలో పరామర్శించడం కాత్యాయని విమర్శ పద్ధతి. రంగనాయకమ్మ మీద రాసిన పెద్ద వ్యాసం ఈ దృష్టితో గొప్ప పరిశోధన పత్రం. రంగనాయకమ్మ ఎన్ని కథలు రాశారు, ఏ దశలో ఏయే కథలు వచ్చాయి. ఆయా దశలలో ఆమె దృక్పథం ఎలా పరిణామం పొందింది- వంటి అధ్యయన పద్ధతి తెలుగు సాహిత్య విమర్శలో చారిత్రక విలువల్ని పెంచింది.
సాహిత్యాధ్యయనంలో కాత్యాయని సాధారణంగా పాజిటివ్ విషయాలనే ఎక్కువగా ప్రస్తావిస్తారు. రచయిత్రుల పరిమితులను, వాళ్లలోని వ్యతిరేకాంశాలను సూచనప్రాయంగా చెబుతారు తప్ప, వాళ్లతో యుద్ధానికి దిగరు. ఈమెది సాధ్యమయినంత వరకు కలుపుకొనిపోయే పద్ధతి.

సాహిత్య విమర్శలో రచయిత ప్రాధాన్య దృష్టి, విమర్శక ప్రాధాన్య దృష్టి అని రెండు దృష్టులుంటాయి. మొదటి దృష్టి గలవారు రచయితను ఎక్కువగా ముందుకు నెడతారు. రెండవ దృష్టి గలవారు తమ పాండిత్యాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తారు. కాత్యాయనిది మొదటి రకం దృష్టి. అందుకే ఆమె విమర్శలో ఉటంకింపులు పరిమితంగా ఉంటాయి.

స్త్రీల సాహిత్య విమర్శకులుగా కాత్యాయని నిర్వహిస్తున్న పాత్రను నిర్వచించాలంటే ‘ఖాళీల పూరణ’ అని చెప్పవచ్చు. ఒక భాషా సాహిత్య చరిత్ర నిర్మాణంలో స్త్రీలు పురుషులు పాల్గొన్నా, పురుషాధిపత్య సమాజంలో చరిత్ర రచన పురుష ప్రధానంగా జరుగుతుంది. స్త్రీల కృషి గుర్తింపు పొందదు, విస్మరింపబడుతుంది. స్త్రీలు చైతన్యవంతులైనప్పుడు ఆ ఖాళీలను పూరిస్తారు. కాత్యాయని చేస్తున్న పని అదే. ‘విప్లవోద్యమ కథలో తెలంగాణ రచయిత్రులు’ అనే వ్యాసం ఇలాంటిదే. ‘సాహిత్య చరిత్రలోని ఈ ఖాళీలను పూరించి సమగ్రం చేయటం ఇప్పటి అవసరం’ అని కాత్యాయని గుర్తించారు. విప్లవోద్యమ కథమీద ఇంతకుముందే రుక్మిణి, కాత్యాయని, రాచపాళెం మొదలైనవాళ్లు రాశారు. వాటిలో ఈ కథయిత్రుల ప్రసక్తి లేదు. కాత్యాయని ఆ ఖాళీని ఇప్పుడు పూరించారు.
రచయిత్రులను సంఘటిత పరచడానికి ‘మనలో మనం’ అనే వేదిక ఏర్పడిన తర్వాత, దళిత బహుజన రచయిత్రులు స్త్రీలంతా ఒక్కటి కాదంటూ, తమదైన ‘మట్టిపూలు’ వేదికను స్థాపించుకున్నారు. ‘మనలో మనం’ వేదిక బాధ్యులుగా ఉంటూనే, కాత్యాయని, ‘మట్టిపూలు’ రచయిత్రుల కృషిని గౌరవించారు. చరిత్ర రచనలో ప్రజాస్వామిక లక్షణ మిదే. ‘తెలుగు కథ-స్త్రీవాదం’ అనే వ్యాసం ఇందుకుదాహరణ.

కాత్యాయని స్థూల స్థాయి విమర్శలో ఎంత సిద్ధహస్తులో, సూక్ష్మస్థాయి విమర్శలో కూడా అంతే సిద్ధహస్తులు. ఒక రచయిత్రి మొత్తం సాహిత్యాన్ని అధ్యయనం చేసినట్లే, ఒక రచయిత్రి రాసిన అనేక రచనల్లో ఒకదానిని అధ్యయనం చేస్తారు. ‘రంగనాయకమ్మ – కథలు, కథన రీతులు’ మొదటిరకం కాగా, ‘పెళ్లానికి ప్రేమలేఖ కథా విశ్లేషణ’, ‘విమల వంటిల్లు’ వ్యాసాలు రెండవ రకంవి. ఒక ఉద్యమ నేపథ్యంలో సాహిత్యాధ్యయనానికి ‘విప్లవోద్యమ కథ- తెలంగాణ రచయిత్రులు’ నమూనా వ్యాసం కాగా, ఒకవాదం నేపథ్యంలో సాహిత్యాధ్యయనానికి ‘తెలుగు కథ-స్త్రీ వాదం’ నమూనా వ్యాసం. కాత్యాయని సాహిత్య విమర్శలో అనేక రకాల పరిధులు ఉంటాయి. ఇవి భావి విమర్శకులకు దారి చూపిస్తాయి. సాహిత్యాన్ని ఎన్ని కోణాలలో, ఎన్ని పరిధులలో అధ్యయనం చేయవచ్చో నేర్పిస్తాయి.
సాహిత్య చరిత్రలో ఆద్యతను (తొలితనం) గుర్తించడం తెలుగువారికి తొలి నుంచీ ఆసక్తి.

ఆదికవి, తొలి ప్రబంధం, తొలి కథా కావ్యం, తొలి శతకం, తొలి స్త్రీవాద కవిత- ఇలా తెలుగు విమర్శకులు అనేక ఆద్యతలను గుర్తించారు. కాత్యాయని కూడా కొన్నిటిని గుర్తించారు. విప్లవ కథలు రాసిన తొలి మహిళ రత్నమాల అని, ప్రజాయుద్ధ రాజకీయాల మీద మహిళ రాసిన తొలి కథ లక్ష్మీ రాసిన ‘గమ్యం చేరే దాకా’ అని తెలిపారు. అలాగే మనకెంత గుంపుదృష్టి ఉన్నా, ప్రతి రచయితకూ ఒక ప్రత్యేకతను చూపడానికి ఆసక్తి చూపుతాం. కాత్యాయని రుక్మిణి కథల మీద వ్యాసం రాస్తూ, పట్టణ మధ్య తరగతి దగ్గర ఉన్న స్త్రీవాద కథను ఆమె వ్యవసాయ గ్రామీణ పేద, మధ్య తరగతి స్త్రీల దగ్గరికి విస్తరింపజేశారన్నారు. అలాగే స్త్రీల కథను స్త్రీవాద కథగా పరిణమింపజేయడంలో అబ్బూరి ఛాయాదేవి, రంగనాయకమ్మ, పి.సత్యవతి కృషి ఉందన్నారు. స్త్రీల కథ తాత్వికార్థంలో స్త్రీవాద కథగా రూపాంతరం చెందడం సావిత్రి కథ ‘ఇదో వర్గం’తో పూర్తయిందన్నారు.

మార్క్సీయ స్త్రీవాదం అనే ఒకే ఒక్క కొలమానంతో విమర్శ రాస్తున్నా కాత్యాయని విమర్శలో మొనాటనీకి స్థానం లేకపోవడం విశేషం. ఆవేశానికి ఆమె విమర్శలో చోటు లేదు. ముద్రలు, నిందలు ఉండవు. నెమ్మదిగా ప్రవహించే నదిలా సాగుతుంది ఆమె విమర్శ. అందమైన పఠనీయమైన వచనం, పటిష్టమైన వ్యాస నిర్మాణం పాఠకున్ని ఆకర్షిస్తాయి. ఆమె విమర్శ వీరంగంగా గాక, విమర్శగా ఉండడానికి విమర్శకుల ప్రాథమిక ధర్మమైన సంయమనం కాత్యాయనిలో పుష్కలంగా ఉండడమే కారణం. ఉత్తమ సాహిత్య విమర్శకు ఫలితం ఉత్తమ సాహిత్యాన్ని పాఠకులతో చదివించడమే అయితే, ఈ పనిని కాత్యాయని విమర్శ శక్తివంతంగా నిర్వహిస్తుంది. ‘సాహిత్యాకాశంలో సగం’కు, సాధారణ దృష్టితో, సాహిత్య అకాడమీ పురస్కారం రావడం కొండ గుర్తే కాని, అసలైన గుర్తింపు స్త్రీ పురుష సమాన సమాజం ఏర్పడినప్పుడే.
– రాచపాళం చంద్రశేఖరరెడ్డి
9440222117

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.