నన్నయ్య నుండి నంది మల్లయ్య వరకు నినదించిన నవ్య ధోరణులు —1
ఎన్ని విమర్శలు వ్యాప్తి లో ఉన్నా ,ఇంకా నన్నయ్యే మనకు ఆది కవి అంటున్నాం .గాసట బీసట గా ఉన్న తెలుగును సంస్కరించి ,,ఒక మధ్యే మార్గం లో నడిపించి ,భారతాన్ద్రీకరణం చేశాడు .అనుసృజనకు మార్గాన్ని చూపించిన మొట్ట మొదటి వాడు అయాడు .భారతాన్ని పునర్నిర్మిచాడు .వివిధ కోణాల్లో మహా భారతాన్ని దర్శించాడు నన్నయ భట్టారకుడు .వ్యాస భారతం తెలుగు దేశాన సుప్రతిష్ఠితం ఆయె ఉంది .దేవాలయాలలో పురాణ ప్రవచనం జరుగుతూనే ఉంది .తెలుగు వారికి భారత కధలు కొత్తవి కూడా కావు .అయితే తన కధా కదన నైపుణ్యం తో ,నవ్యత తెచ్చాడు నన్నయ .పాత కధే ,కాని కొత్తగా వింటున్న అను భూతి కల్గించాడు .వ్యాస కధ కు సమగ్రత కల్గించాడు .మనిషి ప్రవ్రుత్తి లో మార్పు తెప్పించటా నికి ,దోహద పడ్డాడు .’’ప్రసన్న కధా కలితార్ధ యుక్తి ,అక్షర రమ్యత ,నానా రుచిరార్ధ సూక్తి నిదిత్వం ,’’తన రచన లో ఉంటుందని తెలిపి అలానే పరిపుష్టి కల్గించాడు .అందుకే ‘’రుషి వంటి నన్నయ –జన వాల్మీకి ‘’అన్నాడు విశ్వనాధ .ఔచిత్యం ఆయన రచన లో ప్రధానాంశం .ఆయన వాక్యం ‘’హితం ,మితం ,సత్యం ‘’.సంభాషణల్లో ‘’కాకువు ‘’ను చక్కగా ప్రవేశ పెట్టి ,తెలుగుదనం అద్దాడు .ఏదైనా కొత్త విషయాన్ని చెప్పటానికి కొత్త ఛందస్సును వాడాడు .సందర్భోచితం గా సంస్కృతం ,తెలుగు పదాలను ప్రయోగించాడు .జాన పద బాణీలకు దగ్గర గా ఉండే విశేష వృత్తా లైన లయగ్రాహి ,తరళం ,మత్త కోకిల పద్యాలను అత్యంత ప్రతిభావంతం గా వీనులకు విందుగా ప్రయోగించాడు .ఇలా నన్నయ నవ్యత కు నాంది పలికాడు .అవసరం అని పించిన చోట వచనమూ రాసి చంపువు గా మలిచాడు . .కవిత్రయం లో మొదటి వాడు నన్నయ్య .
కవిత్రయ ద్వితీయుడు ,అద్వితీయుడు తిక్కన .’’ఉత్తర రామాయణం ‘’ను రాసి లోకం లో దాన్ని ‘’నిర్వచనోత్తర రామాయణం ‘’గా ప్రసిద్ధి చెందించాడు .ఇందులో అన్నీ పద్యాలే .వచనాలు లేక పోవటం కొత్త దానమే .ఈ కావ్యం లో పద్యాల వైవిధ్యం బాగా చూపాడు .వచనం లేకుండా రాయటం ,ఆనాటికి ఒక గొప్ప లక్షణమే .దాన్నే ‘’ప్రౌ డత ’’అన్నారు .భారతం లో మాత్రం చంపూ పద్ధతి పాటించాడు .అయినా పాత వాసన పోనీక ‘’మౌసల పర్వం ‘’ను వచనం లేకుండా ,నిర్వచనం గా రాశాడు .నన్నయ టో మొగ్గ తొడిగిన నాటకీయత ,తిక్కన లో పుష్పమై వికసించి గుబాళిం చింది .సంభాషణా శైలి లో భారతాన్ని జనరంజనం చేశాడు తిక్క యజ్వ. తెలుగుపద్య రచనా శిల్పం తిక్కన తో పరి పుష్టమైంది .’’ప్రౌడి పాటించు శిల్పమునన్ బారగుడ ‘’అని చెప్పుకొన్న సోమయాజి అపార శిల్ప పారంగాతుదయాడు .’’హరిహరాద్వైత భావన ‘’కు దారి చూపించాడు .అదో ఉపాసనా మార్గం గా భావించాడు ..’’ఆయన ఉభయ కవి మిత్రుడే కాదు ,ఉభయ తత్వ మిత్రుడు ‘’అన్న కోవెల సంపత్కుమారాచార్యుల వారి మాట అక్షర సత్యం .ఈ భావన తిక్కనా చార్యుని సృష్టే .అందుకే ఎర్రన ‘’తను కావించిన సృష్టి తక్కోరుల చేతం గాదు నాన్ ‘’అని కీర్తించాడు .నన్నయ తన భారతాన్ని రాజ రాజ నరేంద్ర మహా రాజుకు అంకితం ఇస్తే ,తిక్కన ‘’హరిహరాద్వైత మూర్తి ‘’కి నైవేద్యం గా సమర్పించాడు .అంకిత విషయం లో కొత్తదారీ చూపాడు తిక్కనా మాత్యుడు .
కవిత్రయం లో చివరి వాడు ఎర్రన .హరివంశం ,భారత అరణ్య పర్వ పూరణ ,నృసింహ పురాణం రాశాడు .తన రచనలను నరాన్కిత మూ చేశాడు .నరసిమ్హాన్కిథమూ చేసి పై ఇద్దరి మార్గాలను అనుసరించాడు .’’హరి వంశం ‘’భారతానికి ఖిల పర్వం .అందుకే ముందు దీన్ని రాసి ,తర్వాతభారతం పూర్తీ చేశాడు .ఎర్రనకు నన్నయ ,తిక్కనలు ‘’అబ్జాసన కల్పులు ‘’అనే భక్తీ భావం ఉంది .సాక్షాత్తు సృష్టి కర్త లైన నన్నయ ,తిక్కన ల కవితా ముద్ర ను తన పై వేసుకొని ‘’ప్రబంధ పరమేశ్వరుడు ‘’అయాడు .ఈ పరమేశ్వర పదం ఎర్రన కవితా శ్రేష్టతను తెలియ జేసేది మాత్రమే .ఎర్రన తో క్కిన కొత్త మార్గం ‘’సూక్తి వైచిత్రి ‘’అని కవి సార్వ భౌముడైన శ్రీ నాధుడే కీర్తించాడు .ఎర్రన శైలి వర్ణనాత్మకం ..నృసింహ పురాణం అంతా వర్ణనా మయమే .అందుకే దాన్ని ‘’ప్రబంధం ‘’అన్నాడు ఆయన .అదే తర్వాత వారికి మార్గ దర్శకం అయింది .భావుకులైన వారు మెచ్చే కవిత్వం అది . ‘’సర్వమార్గేచ్చా విదాత్రువు ‘’అని కవి సామ్రాట్ విశ్వనాధ ఎర్రనకు కీర్తి కిరీటం పెట్టాడు .ఇతి హాస ,పురాణ ,ప్రబంధ రచనా విధానాలకు దారి చూపించిన ‘’జ్ఞాత శిల్పి ‘’ఎర్రన .ఇప్పటి దాకా వచ్చిన కవిత్వాన్ని’’మార్గ కవిత్వం’’ అన్నారు
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ — 18-5-12. –కాంప్—అమెరికా
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com


మీకు కృతజ్ఞతలతో ! మీ ప్రతి post mail రూపేణా మా ముంగిటకే వస్తున్నది, చాలా వరకు ఎప్పటివి అప్పుడే చూసేస్తుంటాను, కాని కొంచెం లోతైన అమ్శాలున్నవి జాగ్రత్తగా భద్ర పరుస్తుంటాను,
అవకాసం చూసుకుని అన్నీ చూసి తగు విధమైన comment చేసెదను మాకు useful stuff ని సవివరంగా చక్కగా అందిస్తున్నండులకు కృతజ్ఞతలతో ….
శివ
?!
||సాయినాథ పాహి ||
LikeLike
మీ స్పాదన నను ఉత్తేజితం చేస్తోంది ప్రతి సారీ -ఉపయోగపడుతున్నందుకు సంతోషంగా ఉంది –దుర్గాప్రసాద్
LikeLike