‘ముళ్ళపూడి’ వరం నేను

సున్నితంగా, నాజూకుగా చురకలేసే హాస్యానికి కేరాఫ్ అడ్రస్ స్వర్గీయ ముళ్ళపూడి వెంకటరమణ. కథా రచయితగా, స్క్రిప్ట్ రైటర్‌గా, సినీ నిర్మాతగా ‘కోతి కొమ్మచ్చి’ ఆడి, ఆడించి… నవ్వించి, ఏడ్పించి.. బోలెడన్ని కళాఖండాలను మనకు అప్పగించి ఈ లోకం నుంచి తప్పుకున్నారాయన. తండ్రి బాటలోనే సినీ ప్రయాణం సాగిస్తూ ‘విశాఖ ఎక్స్‌ప్రెస్’, ‘నా అల్లుడు’ తదితర చిత్రాల దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు ఆయన కుమారుడు వర ముళ్ళపూడి. బాపు-రమణల బంధం, తండ్రితో తన అనుబంధం గురించి వర ముళ్ళపూడి చెబుతున్న విశేషాలే ఈ వారం ‘నాన్న-నేను’.
మా అమ్మానాన్నలకు నేను, చెల్లెలు అనురాధ ఇద్దరమే. తను పెళ్లిచేసుకుని భర్త కార్తీక్, కుమార్తె తేజస్వినితో కాలిఫోర్నియాలో ఉంటోంది. నేను పుట్టింది విజయవాడలో అయినా నాన్న మద్రాసులో స్థిరపడడంతో నా చదువంతా అక్కడే సాగింది. నాన్నకి మామూలుగా కోపం రాదు. వస్తే మాత్రం ఇంటిపైకప్పు దడదడలాడాల్సిందే! గట్టిగా అరిచేసేవారు. ఇంతా చేస్తే ఆ కోపం రెండు నిమిషాలే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ మామూలే. నా జీవితంలో నాన్న చేత తిట్లు తిన్నది ఒక్కసారే.
అది కూడా ఒక అబద్ధం చెప్పినందుకు. మార్కులు తక్కువ వచ్చాయని నాన్నకు నా ముఖం చూపెట్టలేక స్కూల్లో ప్రోగ్రెస్ కార్డు ఇవ్వలేదని అబద్ధం చెప్పాను. ఆ విషయం నాన్నకు తెలిసింది. చడామడా తిట్టేశారు. ఆ రోజంతా నాతో మాట్లాడలేదు. తెల్లారాక కోపం తగ్గింది కాని ఆ రాత్రంతా ఆయన ఎంత బాధపడి ఉంటారోనని నాకు మాత్రం నిద్రపట్టలేదు. మార్కులు సరిగ్గా రాలేదన్న బాధ కన్నా అబద్ధం చెప్పి నాన్న మనసును నొప్పించానన్న దిగులే ఆ రాత్రంతా నన్ను వేధించింది.
ఆ తర్వాత ఎప్పుడూ నాన్నకు అబద్ధం చెప్పలేదు. నాన్న మనసును కష్టపెట్టలేదు. నాన్న తిట్టినందుకు ఏడుపు రాలేదు కాని ఆ తర్వాత పొగిడినపుడు మాత్రం ఏడుపు తన్నుకుంటూ వచ్చేసింది. అవి నేను కాలిఫోర్నియాలో కమర్షియల్ పైలట్‌గా ట్రెయినింగ్ తీసుకుంటున్న రోజులు. ట్రెయినింగ్‌లో నాకు అందరికన్నా ఎక్కువ గ్రేడ్లు వచ్చాయి. నన్ను మెచ్చుకుంటూ ఉత్తరం రాశారు నాన్న.
ఆ ఉత్తరం చదువుకుని చాలా రోజులు సంతోషం పట్టలేక ఏడ్చాను. అదే నాన్న నాకు రాసిన మొదటి ఉత్తరం…చివరి ఉత్తరం కూడా. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే నాన్న కన్నీళ్లు పెట్టుకోవడం రెండు సార్లు చూశాను. నాన్నకు ఎంతో ఇష్టమైన సంగీత దర్శకులు కె.వి. మహదేవన్‌గారికి కుడిభుజంగా ఉండే పుహలేందిగారు పోయినప్పుడు నాన్నను నేనే అక్కడకు తీసుకెళ్లాను.
నాన్న ఏడవడం చూసి ఏమైపోతారోనని నాకే భయం వేసింది. రెండోది నాన్న కళ్లలో ఆనందబాష్పాలు. ‘కోతి కొమ్మచ్చి’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగింది. బాపు-రమణలకి సన్మానం జరిగినప్పుడు ఆడిటోరియం మొత్తం లేచి నిలుచుని చప్పట్లు కొట్టినప్పుడు నాన్న కళ్లలో నీళ్లు కనిపించాయి.

భోజనాల సందడి
నాన్నకు, బాపుగారికి మధ్య ఉన్న స్నేహబంధం గురించి కొత్తగా చెప్పడానికి ఏముంటుంది? అయినా అది చెప్పకపోతే నాన్న గురించి సమగ్రంగా చెప్పనట్లే అవుతుంది. బాపుగారిని నేను ‘మామ’ అని పిలుస్తాను. నాన్నకీ, మామకీ సినిమా ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్‌లు ఎవరూ లేరు. ఇద్దరికీ ఏ బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఒకళ్లకి ఒకళ్లు బ్యాక్‌గ్రౌండ్ అయ్యారు. మా ఇంట్లో పదిమంది ఉండేవాళ్లం. పైన మామ ఇంట్లో ఐదుగురు. మొత్తం 15 మంది. ఇల్లంతా గోలగోలగా ఉండేది. నాన్న భోజనప్రియులు.
తినటమే కాదు…తినిపించడంలో కూడా బోలెడంత ఆనందం పొందేవారు. చిన్న వంక దొరికితే చాలు మా ఆస్థాన వంటవాళ్లని పిలిపించి భోజనాలు పెట్టించేసేవారు. పక్కనే నిలుచుని అన్నీ చూసుకునేవారు. షూటింగుల్లో కూడా అంతే. ఒకసారి ఒక తమాషా సంఘటన జరిగింది.
1986-89 మధ్య రాష్ట్రప్రభుత్వం కోసం స్కూలు పాఠాలు ఆడియో-విజువల్ చేస్తున్నప్పుడు రాజమండ్రిలో షూటింగ్ పెట్టారు. యూనిట్ అందరినీ రైల్లో ఫస్ట్ క్లాస్‌లో రాజమండ్రి తీసుకెళ్లారు. భోజనాల వేళ వడ్డనలు జరుగుతున్నాయి.
ఒక లైట్‌మ్యాన్ కడుపు నిండా భోంచేసి చేతులు కడుక్కుంటూ అక్కడే ఉన్న శ్రీరమణగారితో, “సార్ వడ్డించడానికి కొంచెం కుర్రాళ్లని పెట్టుకోవచ్చుగా… ఆ పెద్దాయనను చూడండి. ఎలా అవస్థపడుతున్నారో” అన్నాడు. శ్రీరమణగారు అశ్చర్యంగా వెనక్కు తిరిగి చూసి ఉలిక్కిపడ్డారు. ఎవరా ఆ పెద్దాయన అని చూస్తే తలకు తువ్వాలు చుట్టుకుని లుంగీ పైకి ఎగ్గట్టుకుని అన్నం వడ్డిస్తున్న నాన్న కనిపించారు. “భలేవాడివయ్యా బాబు! ఆయన ఎవరనుకున్నావు?ఆయనే నిర్మాత” అనేసరికి ఆ లైట్‌మ్యాన్ వెయ్యివోల్టుల కరెంట్ షాక్ కొట్టినట్లు కొయ్యబారిపోయాడు!
ఎవరా నాలుగో మనిషి?
నాన్నకు గోదావరి అంటే ప్రాణం. ఆ పేరు చెప్తే పూనకం వచ్చేసేది. నాన్న-మామ తీసిన సినిమాల్లో ఎక్కువ అక్కడే షూటింగ్ జరుపుకున్నాయి. షూటింగ్ లొకేషన్లు చూడడానికి తరచు నాన్న, శ్రీరమణగారు, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ కెవి రావుగారు రైల్లో రాజమండ్రికి వెళ్లేవారు. మామ అప్పుడప్పుడు వీళ్లతో వెళ్లేవారు. వీళ్ల ప్రయాణమంటే మాకే హడావుడి ఎక్కువ. భోజనాలను కేరేజ్‌లో సర్దడానికి నానాహైరానా పడేవాళ్లం. ఇంట్లో ఒక పెద్ద రేకు డబ్బా ఉండేది. రైల్లో తీసికెళ్లడం కోసమే దీన్ని ప్రత్యేకంగా చేయించారనుకుంటా.
దాంట్లో నాలుగు భోజనం ప్లేట్లు, నాలుగు టిఫిన్ ప్లేట్లు, గరిటెలు, చెంచాలు, నాలుగు గిన్నెల క్యారేజ్…వీటితో పాటు కాయితాలలో చుట్టిన నాలుగు గాజు గ్లాసులు వగైరాలు ఉండేవి. నాన్న మాటల్లో అది ‘మందోబస్తు’! ఆ రోజుల్లో ఎసి కంపార్ట్‌మెంట్లు లేవు. ఫస్ట్ క్లాస్ క్యాబిన్ మాత్రమే ఉండేది. ఒక్కో క్యాబిన్‌లో నాలుగు బెర్త్‌లు. ముగ్గురే వెళ్లవలసి వచ్చినా నాలుగు టికెట్లు బుక్ చేసేవారు. ఒకసారి వీళ్లు ముగ్గురే ప్రయాణం చేస్తున్నారు.
రేకు డబ్బాలో నలుగురికి సరిపడా భోజనం ఉంది. “ముగ్గురికి అంత భోజనం ఎందుకు?” అని మేమడిగితే, “క్యాబిన్‌లో నాలుగో మనిషి ఉన్నాడనుకో…ఆయన తిండి తెచ్చుకోలేదనుకో… రాత్రి వేళ ఇబ్బంది పడతాడు కదా పాపం” అన్నారు నాన్న. చాలా రోజుల తర్వాత నేను ఒక్కడినే రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరో తెలియని ఒకాయన వచ్చి తనను తాను పరిచయం చేసుకుని ఓ తిండి లేని రాత్రి నాన్నతో భోజనం చేసిన అనుభవాన్ని గురించి చాలా గొప్పగా చెప్పాడు. అప్పుడు అర్థమైంది నాకు..నాలుగో మనిషికి నిర్వచనం.
ప్రేమ’యుద్ధాలు’!
నాన్న, మామకి ఒకళ్లంటే ఒకళ్లకు పిచ్చిప్రేమ. అలాగని వాళ్లిద్దరూ ఎప్పుడూ కలహించుకోరని కాదు. వాళ్లిద్దరూ వాదించుకోవడం, కాస్సేపు మాట్లాడుకోకపోవడం…ఆ తర్వాత మామూలైపోవడం మాకు చిన్నప్పటి నుంచి అలవాటే. అయితే ఒకసారి మాత్రం వీళ్లిద్దరూ జీవితంలో మళ్లీ కలుసుకుంటారా అన్న భయం వేసింది. హైదరాబాద్‌లో ఒక సినిమా షూటింగ్ కోసం మద్రాసు నుంచి మేమంతా వచ్చాము. స్టూడియోలో షూటింగ్. మామ డైరెక్టర్. నేను ఆయన అసిస్టెంట్. ఇంకో అసిస్టెంట్‌గా ఇప్పుడు దర్శకుడైన గాంధీ ఉన్నారు. మేమిద్దరం స్టూడియో నుంచి ఆలస్యంగా రాత్రి పదింటికి గెస్ట్ హౌస్ చేరుకున్నాము.
దూరం నుంచే పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి. గేటులో నుంచి తొంగి చూస్తే వసారాలో కుర్చీలో కూర్చుని నాన్న, మామ గట్టిగా అరుచుకుంటున్నారు. మేమిద్దరం హడలిపోయాము. ఎప్పట్లా లేవా అరుపులు. “ఇక అంతా అయిపోయింది. వీళ్లిద్దరూ విడిపోవడం ఖాయం’ అనుకుని లోపలకు వెళ్లడానికి కూడా భయమేసి అట్నుంచి అటే రోడ్డు మీదకు వెళ్లిపోయాము. అలా రాత్రి 11.30 దాకా బయటే తచ్చాడాము. ఇక ఆకలికి తట్టుకోలేక, ఏం చూడాల్సి వస్తుందో అనుకుని బిక్కుబిక్కుమంటూ గెస్ట్‌హౌస్ లోపలకు వెళ్లాము.
అక్కడంతా నిశ్శబ్దం. ఎక్కడా చడీచప్పుడూ లేదు. ఇద్దరూ నిద్రపోతున్నారు. మేమూ పడుకున్నాము. మర్నాడు పొద్దునే ఏం చూడాలో, ఏం వినాలో అని భయపడుతూ బయటకు వచ్చాము. అక్కడ కనిపించిన దృశ్యం చూసి మా ఇద్దరికీ నోట మాట రాలేదు. వాళ్లిద్దరూ కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేస్తున్నారు. మామ నాన్నకి వడ్డిస్తుంటే..’ఈ చట్నీ తిను.. బావుంది” అంటూ మామకి నాన్న తిరిగి వడ్డిస్తున్నారు. వాళ్లిద్దరూ తామిద్దరం వేర్వేరని ఎన్నడూ అనుకోలేదు. మేము కూడా నాన్న, మామని వేర్వేరుగా చూడము.
నాన్న ఎక్కడకు వెళ్లారని?
కష్టాలను చూసి బెంబేలెత్తకూడదని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని నాన్న చిన్నప్పటి నుంచి నాకు చెప్పేవారు. నేను కాలిఫోర్నియాలో గొప్ప గ్రేడ్లతో కమర్షియల్ పైలట్ లైసెన్సు తెచ్చుకుని కూడా కొన్ని కారణాల వల్ల పైలట్ కాలేని పరిస్థితి ఎదురైనప్పుడు ధైర్యం చెప్పింది నాన్నే. “ఏం పర్వాలేదు వచ్చెయ్! నీకో కొత్త జీవితం వెతుకుదాము” అంటూ ఓడిపోతున్న నన్ను మళ్లీ సరైన దారిలో పెట్టారు నాన్న. షూటింగ్‌లో ఒకసారి మామ నన్ను తిట్టినందుకు ఎవరితో మాట్లాడకుండా బాధపడుతూ కాస్సేపు దూరంగా వెళ్లి నిలబడ్డా. నాన్నే పిలిచి “నువ్వు తప్పు చేశావు. పర్యవసానాలను నువ్వు ఎదుర్కోవలసిందే..మళ్లీ ఆ తప్పు చేయకుండా చూసుకో…అంతేగాని పారిపోకు” అన్నారు.
నాన్న నూరిపోసిన ఆ ధైర్యమే అపజయాలను కూడా తట్టుకుని ముందుకు నడిపిస్తోంది. నాన్న లేరు అంటే నేను నమ్మను. ఆయన ఎప్పుడూ ఇక్కడే…మాతోనే ఉంటారని నేను భావిస్తున్నాను. అందుకే ఇంట్లో ఏదీ మార్చనివ్వలేదు. నాన్న కూర్చునే కుర్చీలు, ఆయన వాడే టేబుల్, ఆయన పూజ చేసుకునే చోటు, ఏవి ఎక్కడ ఉండేవో అవన్నీ అలాగే ఉన్నాయి..ఉంటాయి. నాన్న ఇంకా రైలు ప్రయాణంలోనే ఉన్నారనీ, ఆయనకు ఇష్టమైన గోదావరి దగ్గరకు వెళ్లారనే భావనతోనే ఉన్నాను..అలాగే ఉంటాను..నా జీవితాంతం.


BHALEGUNNAYI MEE JNAAPAKAALU MULLAPUDI VARAPUTRAA!ALAAGE SAAGUTOO KONASAAGUTOO OKA PUSTAKAM DAAKAA HUSHAARUGAA LAAGI VEYAKOODADOO!please!
LikeLike
me article bagundhandi
LikeLike