మహర్షి స్థానానికి జ్ఞాన పీఠానికి ఎదిగిన రావూరి భరద్వాజ

మహర్షి  స్థానానికి  జ్ఞాన పీఠానికి ఎదిగిన రావూరి భరద్వాజ

‘’అవును నేను ఆకలి చంపుకోవటానికి ,టీ నీళ్ళు తాగటానికి డబ్బులకోసం అడిగిన వాడికల్లా వాడేది అడిగితే అది రాసి పారేశాను .ఆకలి నన్ను ఆ పని చేయించింది .’’అని చిత్ర గుప్త లాంటి పత్రికలకు సెక్స్ కధలు రాసినప్పుడు బాధపడ్డాడు ..తెనాలిలో  తమళుడు ప్రముఖ తెలగు  నవలా రచయిత అయిన’’శారద ‘’గా పిలువబడిన నటరాజన్ తో ,ప్రసిద్ధ హిందీ రచయితా రాహుల్ సాన్క్రుత్యాయన్ ను తెలుగు వారికి పరిచయం చేసిన ఆలూరి భుజంగ రావు ,పత్రికా సంపాదకుడు ధని కొండ హనుమంత రావు లతో నిద్ర లేని రాత్రులను, తిండి లేని  పగళ్ళను ఎన్నో గడిపి వారందరి ప్రేమను, ఆప్యాయతల్ని,కుటుంబ బాంధవ్యాలను పంచుకొన్నాడు .దేవుడే లడని వారి తో బాటు చాలా కాలం భావించి ఆ దిశ లోనే ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి ,చివరికి తనకు అత్యంత ఆప్తురాలు తన కష్టాలలో  కన్నీళ్ళలో కలేమిలో, కలిమిలో భాగస్వామి అయిన అర్ధాంగి కాంతమ్మ గారు మరణించటం తో జీవిత గమ్యాన్ని మార్చుకొని ఆమె లో దైవాన్ని దర్శించి అప్పటి  నుంచి ‘’ఈశ్వరుడే అన్నిటా ఉన్నాడు .ఆయన వల్లే సర్వం నడుస్తోంది ‘’అన్న ఎరుక కలిగి మహర్షిలా గడ్డం పెంచుకొని ఆయన్ను చూస్తేనే ఒక ఆధునిక భరద్వాజ మహర్షి లా దర్శనమిస్తు మహర్షి స్థానానికి ఎదిగి ఇప్పుడు అత్యున్నత జ్ఞాన పీఠం పై ఆసీను డవుతున్న వాడు ,ఎదిగిన మనిషి ఎరుక కలిగిన మనీషి ,మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణ రావూరి భరద్వాజ ..మళ్ళీ పాతికేళ్ళ తర్వాతా జ్ఞాన పీఠం తెలుగు వారి తలుపు తట్టి ప్రవేశించింది .అందునా వచన రచనకు రావటం మరీ ఆనందం .ప్రతిభను ఇంతకాలనికైనా గుర్తించిన ప్రభుతకు అభినందనలు .ఎందరో తమిళ, కన్నడ రచయితలు యిట్టె కొట్టేసే జ్ఞాన పీఠం ఎందరికో ఆదర్శం గా నిలిచే తెలుగు వారికి ఆలస్యం గా రావటం బాధాకరమే .ఇంకా రావాల్సిన ప్రతిభా సంపన్ను లెందరో మనకున్నారు వీరికి త్వరలో దక్కాలని ఆశిద్దాం 

 

 

.

               భరద్వాజ అంటే మానవత్వం .దాన్ని అన్ని కోణాల్లోనూ దర్శించిన మహనీయుడు ఆయన .ఈ నాడు పత్రిక కు ఆయన ‘’జీవన సమరం ‘’శీర్షిక తో50 మంది వృత్తుల వారిని ప్రత్యేకం గా ఇంటర్వ్యు చేసి వారి జీవితాలలోని చీకటి వెలుగులకు అక్షర రూపం కల్పించి ,పాఠకులకు పరిచయం చేసిన తీరు’’నభూతో’’ అని పించింది. చెప్పే విషయం లో నవ్యత ఆయన ప్రత్యేకత .తాళాలు బాగు చేసే వాడు, గొడుగులు రిపేర్ చేసే వాడు ,చెప్పులు కుట్టేవాడు ఒకరేమిటి శ్రీ శ్రీ అన్నట్లు ‘’సమస్తవ్రుత్తులు ‘’వారిని మన ముందు నిల బెట్టి’’ఇదీ వారి జీవితం .ఏం సాయం చేయాలో చేసి ఆదుకోండి ‘’అని ప్రభుత్వాలకు ప్రజలకు చెప్పాడు అవి చదువుతుంటే కడుపు తరుక్కు పోతుంది ఒక వీడియో కెమెరా తీసుకొని మనల్ని తన వెంట తీసుకొని వెడుతూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ గుండె చప్పుళ్ళను విని పిస్తూ కన్నీరు కార్పిస్తూ వారి దౌర్భాగ్యానికి ఏమీ చేయ లేని నిస్సహాయతను కళ్ళ ముందు కనపరచారు భరద్వాజ .ఇదొక సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది .నా ఉద్దేశ్యం లో అదొక్కటి చాలు భరద్వాజకు ఏ అవార్డు అయినా రావటానికి .

                               భరద్వాజ చేయని వృత్తి లేదు దేన్నీ చీదరించుకో లేదు .అవి తనకు అన్నం పెట్టాయనే కృతజ్ఞతా భావం ఆయన మాటల్లో, మనసులో ,రాతలో ప్రతి అంగుళం లోను కన్పిస్తుంది .అందరితో కలిసి పోయి పని చేశాడు .ఎవర్నీ దూరం చేసుకో లేదు అదీ భరద్వాజ వ్యక్తిత్వం .అవతలి వాడిలో స్నేహాన్ని, ఆప్యాయతను, ప్రేమను మాత్రమె దర్శించాడు ఇది చాలు ఆయన అంత ఎత్తుకు ఎదగ టానికి .మంచిని దర్శించాడు చెడుకు దూరమయ్యాడు .అందర్నీ అక్కున చేర్చుకొన్నాడు .గొర్రెలు కాశాడు ,ఇంటింటికీ పేపర్ వేశాడు ,ప్రెస్ లో అక్షరాలూ కూర్చాడు .అనేక వృత్తుల లో పని చేసి పొట్ట పోషించుకొన్నాడు భార్యకింత తిండి పెట్టాడు .జర్నలిస్ట్ గా ఆకాశ వాణి లో పని చేయటం తో అతని అక్షర అర్చన సార్ధక మైంది .సమాజం లోని అన్ని వర్గాల వ్రుత్తుల వారి జీవితాలను లోతుగా అధ్యయనం చేశాడు కనుకే అతను రాసింది అంతా వాసి గా మారింది గుర్తింపు ను తెచ్చింది మహా రచయిత గా మన్ననా వచ్చింది .అన్ని తనకు జీవిత పాఠాలు నేర్పాయి అని నిజాయితీగా చెప్పాడు .

                  భరద్వాజ ఎప్పుడో 35 ఏళ్ళ క్రితం రాసిన ‘’పాకుడు రాళ్ళు ‘’నవలకు ఇప్పుడు గుర్తింపు నిచ్చి పురస్కారం అందించటం ఎంత లేటుగా ప్రతిభను గుర్తిస్తారో తెలిపే ఉదాహరణ.మాత్రమె .ఆయన సాహితీవ్యాసంగం తక్కువేమీ కాదు .సుమారు  500 ఆణిముత్యాల్లాంటి కధలు రాశాడు .19 నవలలూ వెలువరించాడు .చిన్న పిల్లలకోసం నవలికలు రాశాడు తాను రాసిన వ్యాసాలను మూడు సంపుటాలుగా తెచ్చాడు .ఆ నాడే డిటెక్టివ్ నవలలూ ,శృంగార నవలలూ రాసిన చదివించే గుణాన్ని పెంచాడు .విజ్ఞాన శాస్త్రం లో తన ప్రతిభకు పాండిత్యాన్ని జోడించి 33వ్యాసాలను జనరంజకం గా రాశాడు .నాటకాలలోను తన ప్రావీణ్యాన్ని చూపి ఎనిమిది నాటకాలు రాశాడు భరద్వాజ .భరద్వాజ ఒక విశ్వ విద్యాలయం అని పించాడు విశ్వాన్ని ,అందులో ఉన్న ప్రతి రేణువును చదివాడు, అవగతం చేసుకొన్నాడు ఆ విజ్ఞాన సంపదను చదువరుల పరం చేసిన జ్ఞాన దాత అని పించుకొన్నాడు .అయన వచనం ప్రవాహ శీలత కలిగి ఉంటుంది ఎక్కడా క్లిష్టత ,అయోమయం కనీ పించవు అందుకే చలం తర్వాతా అంత ‘’రీడబిలిటీ ‘’ఉన్న రచయిత అని పించుకొన్నాడు భరద్వాజ . ఆయన రచనలు అనేక భారతీయ భాషల్లోకి ,ఆంగ్లం లోకి అనువదింప బడి గౌరవం పొందాయి . .

                         భార్య కాంతమ్మ గారి పై ఆయన ‘’ఎలిజీ లు ‘’రాశారు .అవీ మహా ప్రాచుర్యం పొందాయి .విశ్వనాధ వరలక్ష్మీ త్రిశతి తర్వాతా అంతటి ప్రాచుర్యం పొందిన ‘’స్మృతి కావ్యాలు అవి వీటిపై మా ఉయ్యూరు అమ్మాయి యనమండ్ర పేరయ్య గారి కుమార్తె అన్నపూర్ణా విశాలాక్షి (హైదరా బాద్ ) రిసెర్చ్ చేసి పుస్తకం రాసింది టి.వి.లో మాట్లాడింది. అయితే ఆమె, భర్త ఇద్దరు 1987 లో కేదార్నాద్ బదరీనాద్ యాత్రలో బస్ లోయలో పడి దుర్మరణం చెందటం విషాద సంఘటన . భరద్వాజ సాహిత్యం పై పుంఖాను పుంఖం గా పరిశోధనలు జరిగాయి .‘’భరద్వాజ భార్య కాంతమ్మ గారిని  అసలు మరచి పోనే లేదు ఆయన శ్వాస ఆమె గా భావించి జీవిస్తున్నాడు ఇదీ భారతీయ ఆధ్యాత్మిక భావానికి తురీయం ,పరాకాష్ట .దాన్ని సాధించాడు రుషి లాంటి జీవితం సాగిస్తున్నాడు .ఆయన మూర్తి దర్శనం ఒక దివ్యాను భూతి నిస్తుంది .సౌమ్యం గా మాట్లాడటం రాయటం భరద్వాజకు సహజాతాలు .’’శ్రీ మతి కాంతమ్మా భరద్వాజ ట్రస్ట్‘’నేర్పరచి తనకు వచ్చిన పారితోషి కాలన్నిటిని దానికి జమ చేస్తూ ప్రతి ఏడాది పేద విద్యార్ధులకు 5000రూపాయలు నగదు పురస్కారం అందిస్తూ సార్ధకం చేస్తున్న వాడు భరద్వాజ .

                 చదివింది ఏడవతరగతే .నేర్చింది అనంతం రాసింది బంగారం .మన పశ్చిమ కృష్ణా జిల్లాలో‘’మొగులూరు ‘’గ్రామంలో1927 లో జూలై 1 న  భరద్వాజ మల్లికాంబ ,కోటయ్య దంపతులకు జన్మించాడు ప్రాధమిక విద్య గుంటూరు జిల్లా తాడికొండలో .చిన్నతనం లోనే తలి దండ్రుల మీద మొదటి పద్యాన్ని ఛందస్సు నేర్చి చెప్పాడు .బడికి వెళ్ళాలంటే మంచి బట్టలు వేసుకు రావాలని ఆంక్ష పెడితే బడి మానేసి ప్రపంచాన్ని చదవటం మొదలెట్టాడు .ఏడు పాసై ఎనిమిది లో చేరేటప్పుడు జరిగిన సంఘటన ఇది. రాత్రిళ్ళు గుడిలో పడుకొని గ్రంధాలయం నుండి తెచ్చుకొన్న పుస్తకాలు చదివాడు .తర్వాతా తెనాలి నెల్లూరు ,మద్రాస్ లలో అనేక చిన్న చిన్న పనులు చేశాడు .

           భరద్వాజ పాత్రికేయ జీఎవితం ‘’జమీన్ రైతు ‘’తో ప్రారంభమైంది దానికి 1946 లో పని చేశాడు రెండేళ్ళ తర్వాత ‘’దీన బంధు ‘’పత్రిక కు ఇంచార్జి గా వ్యవహరించాడు  జ్యోతి, సమీక్ష ,యువ చిత్రసీమ ,సినిమా పత్రికలలో పని చేసి మంచి పేరు తనకు పత్రికలకు సంపాదించాడు ..1957 లో ఆలిండియా రేడియో కు జూనియర్ స్క్రిప్ట్ రైటర్ గా ఉద్యోగించాడు ఇప్పటి నుంచి జీవితం లో కొంత స్తిర పడ్డాడు అంతకు ముందు దాకా ఒక్కపూటే తిని అర్ధాకలి తో ఎన్నో ఏళ్ళు గడిపాడు .

                1983 లో భరద్వాజ కు కేంద్ర సాహిత్య అకాడెమి ,పురస్కారం ., రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారాలు లభించాయి .ఆంద్ర విశ్వవిద్యాలయం ‘’కళాప్ర పూర్ణ ‘’బిరుదు నిచ్చి సత్కరిస్తే బోయి భీమన్న అవార్డు ,భారతీయ భాషా పరిషద్ అవార్డులు వరించాయి .వ్యక్తీ గత ,సాహిత్య జీవితాలను ఎంతో నిబద్ధత తో సాగించిన గొప్ప రచయిత భరద్వాజ .జ్ఞానపీఠ పురస్కారం తో మళ్ళీ’’తెలుగు వచన సాహిత్యం’’ నిజం గానే జ్ఞాన పీఠం పై జ్ఞాన జ్యోతిస్సులను వెలువరిస్తోంది మానవీయతకు పట్టం కట్టిన మహోన్నత  సంస్కారి, మానవీయ విలువలకు నిలువుటద్దం రావూరి భరద్వాజ  ఇప్పుడు మన ముందున్న ఆధునిక భరద్వాజ  మహర్షియే . 86 ఏళ్ళవయసులో   వసంత వేళ వరించిన అభి నందన చందనమే ఇది ..

                మీ –గబ్బట దుర్గా ప్రసాద్ –18-4-13 ఉయ్యూరు 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

4 Responses to మహర్షి స్థానానికి జ్ఞాన పీఠానికి ఎదిగిన రావూరి భరద్వాజ

  1. TVS SASTRY's avatar TVS SASTRY says:

    ‘మట్టిమనిషికి’ మహా సత్కారం ఇది. సామాన్యుడిగా జీవితం ప్రారంభించి అసమాన్యుడిగా ఎదిగిన శ్రీ రావూరి వారి జీవితం ఒక తెరిచిన పుస్తకం. పురస్కారాన్ని అందుకున్న శ్రీ రావూరి వారికి,వారిని గురించిన సమాచారాన్ని అందించిన మీకు అభినందనలు. వ్యాఖ్యలను మీరు చూస్తున్నట్లుగా లేదు!అన్నట్లు మీ మెయిల్ Id

    ని తెలియచేయగలరు.

    భవదీయుడు,

    టీవీయస్.శాస్త్రి

    Like

    • gdurgaprasad's avatar gdurgaprasad says:

      *మీ వ్యాఖ్యలు చూస్తున్నాను అయితే మా బావ మరదిటి వి.యెస్ .బి శాస్త్రి
      రాస్తున్నాడే మో నని పట్టించుకోలేదు సంతోషం స్పందిస్తూందండి దుర్గా ప్రసాద్ *

      Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.