‘’తెగిన జ్ఞాపకాలలో’’ సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు –3
మారుటి తల్లులు
సంజీవ దేవ్ తల్లి చని పోయిన మూడేళ్ళకు తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకొన్నాడు .ఆమె ఒక ఏడాదే కాపరం చేసి చని పోయింది .తృతీయం చేసుకొన్నాడు తండ్రి .’’తండ్రి పెళ్లి, కొడుకు చూడ కూడదు ‘’అనే నియమం ఉన్నందున కొడుకును తన పెళ్ళికి తండ్రి తీసుకు వెల్ల లేదు దీని పై ‘’తండ్రి వివాహం కొడుకు చూడ టం వింత కదూ .అసలు తండ్రి వివాహ సమయం లో కొడుకు అనే జీవి ఉండడు కదా “’అని వ్యాఖ్యానిస్తాడు .
పన్నెండవ ఏట నే స్త్రీ పురుషుల సంబంధాల గురించి ,ఆకర్షణ గురించి మంచి అవగాహనే ఉంది ఈ కుర్రాడికి .’’మగ వాళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకొంటుంటే ఆడ వాళ్ళు ఎందుకు చేసుకో కూడదు?’’అనే ధర్మ సందేహమూ కలిగింది ఆ లేత వయసులోనే ..’’కొట్లో బాబు ‘’ ను అడిగి సందేహ నివృత్తి చేసుకొన్నాడు .’’వయసుకు మించిన ఆలోచనలు వస్తున్నాయి ‘’అని కోట్లో.బాబు అన్నాడు కూడా .
ప్రయాణం లో ప్రణయాంకురం
ఒకసారి కోనాయ పాలెం నుంచి తుమ్మ పూడి వస్తున్నాడు సంజీవ్ .బస్సు లో ఒకామె పక్కన కూర్చున్నాడు .’’అందని అందం ఏదో అంది నట్లు ‘’అని పించింది .ఆమె మాటలలలో ఇతన్ని తన వూరు వచ్చి తన దగ్గరుండి చదువు కొమ్మంది .ఏం చెప్పాలో తెలియక నవ్వాడు .ఆమెను ఏ వూరు అని అడగ లేక పోయాడు .అయితే వెళ్ళటానికి ఇష్టమే ..ఆమె నవ్వు లో ఒక ఆకర్షణ ,ఆత్మీయత గోచరించాయి .ఆమె బెజవాడ లో బస్ దిగి వెళ్ళిన తర్వాత ‘’హృదయం లో శూన్యత ‘’కనీ పించింది .ఆమె చిరునవ్వు ,మాటల మాధుర్యం మానస మందిరం లో పదే పదే ప్రత్యక్షమయ్యేవి .
‘’ గుండు ‘’స్త్రీలు
ఒక సారి మద్రాస్ వెళ్తుంటే గూడూరు లో తిరుపతి నుండి వచ్చిన జనం కలిశారు .ఆడా మగా అన్నీ ‘’ గుండులే .’.స్త్రీల బోడి తల చూడటానికి బాగాలేవు సంజీవ్ కు .‘’ఏడు కొండల వాడు కనీసం స్త్రీల జుట్టు అయినా స్వీకరించా కుండా ఉంటె ,స్త్రీ సమాజానికి ,తద్వారా పురుష సమాజానికీ ఎంత మేలు చేసే వాడు ?’’అను కొన్నాడు ఈ గుండ్లకు కనీసం రెండేళ్ళ దాకా మల్లె ,మందార పుష్పాల అనుభవం ఉండదని ‘’పుష్ప విలాపం’’గా బాధ ప్రకటించాడు సౌందర్యా రాధకుడైన రచయిత సంజీవ దేవ్ .’’అయినా ఏడు కొండల వానికి ఏం కోపం వస్తుందో’’ అని లోలోపలే సర్దుకొన్నాడు
అనీబి సెంట్
మద్రాస్ లో అడయార్ దివ్య జ్ఞాన సమావేశాలకు సంజీవ దేవ్ వెళ్ళాడు .అనిబిసెంట్ అమ్మ ను చూసి తన్మయం చెందాడు .ఆమె వాగ్జ్హరి విన్నాడు .ఉపన్యాసం అర్ధం కాకపోయినా ‘’ప్రభావోత్పాదకం ‘’గా ఉందని పించింది .సాధారణం గా స్త్రీలు పమిటలు వేస్తారు కాని బిసెంట్ మాత్రం ‘’జలతారు అంచుల ఉత్తరీయాన్ని మడతలతో మెడకు రెండు వైపులా కిందికి వేలాడేసింది ‘’అని ఆశ్చర్య పోయాడు .కాని ఆమె ఉపన్య సిస్తుంటే ‘’అగ్ని కణాలు కురుస్తున్నట్లున్నాయి ‘’అని భావించాడు .మంచి ఉపన్యాసం అంటే ఎలా ఉంటుందో ఎలా ఉండాలో ,దాని ప్రభావం ప్రజల పై ఎలా పడుతుందో గ్రహించాడు .
పెంపుడు తల్లి రాజ్య లక్షమ్మ
గమ్యం ,లక్ష్యం లేని జీవితం గడుపుతున్నాడు దేవ్ తుమ్మ పూడిలో .వేళ కింత తిండి తినటం తిరగటం .ఇదీ కార్యక్రమం -ఇదే కార్యక్రమం .ఈ రక మైన జీవితం పెంపుడు తల్లి రాజ్య లక్షమ్మ గారికి వ్యర్ధం అని పించింది .ఒక సారి కళ్ళు యెర్ర జేసి ‘’పెత్తనాలయ్యాయా ?’’ అని కసిరింది మనసుకు కష్టం గా ఉన్నా ఏమీ అనే వాడు కాదు .ఏదైనా అనడ మా అనక పోవటమా అనే సందేహం లో కొట్టు మిట్టాడాడు .అందుకని ఇంటికి రావటం తగ్గించేశాడు . తను వ్యర్ధం గా జీవించటం లేదనియే విధం గా చెప్పాలో తెలియక కుమిలి పోయే వాడు .అందుకని ఆమె తో’’ కట్టే కొట్టే ‘’లాగా అతి తక్కువ గా మాట్లాడే వాడు ..ఎలా చెప్పి యేమని మెప్పించగలడు ఆమెను ?అయనా ఆమె ఊరుకొనేది కాదు .ఈ విధం గా ‘’మౌన రాగమే ‘’సకల రోగ నివారిణి గా తెల్సుకొన్నాడు
బుడబుక్కల చిన్నది
తుమ్మ పూడి లో బుడ బుక్కల వాళ్ళు చేరారు .గుడారాలలో ఉంటున్నారు .మగాళ్ళు వేటాడి తెచ్చిన ఉడుము లను ,ఉడ త లను కాల్చి ఆడ వాళ్ళు కూర చేసే వారు .ఒక వర్షం రోజున గుడారాల దగ్గర కూర్చున్నాడు .ఉడుములు కాల్చిన ఆకమురు కంపు భరించ లేక పోయాడు .అందులో నాగోజి అనే అతని పదమూడేళ్ళ కూతురు కూడా ఉంది .ఆ పిల్ల రంగు రూపం మాట ,నడక ఎంతో అందంగా ఉన్నాయని పించింది .అయితే’’ ఆ సుందర వదన’’ కాల్చిన ఉడుములు తింటుంటే సంజీవ్ కు కంపర మెత్తుకోచ్చింది .’’‘’అని ఆమె సౌందర్యం అంతా కురూపం గా మారి ఆయింది ‘’అని అనుకోని బాధ పడ్డాడు .అది మొదలు ఆ పిల్ల కనీ పిస్తే భయ పడే వాడు .ఆహారపు అలవాటు కూడా సౌందర్యం లో భాగమే కదా .అందుకని అంత బాధ ఆ బుద్ధి జీవికి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-8-13-ఉయ్యూరు

