మరుగున పడిన మతాలు –మతా చార్యులు -4
చార్వాక మతం
చార్వీ అనే ఆచార్యుని బట్టి ఆ మతానికి చార్వాక మతం అనే పేరొచ్చింది .ఈయన బృహస్పతి శిష్యుడు అని అంటారు .’’బ్రతకి న్నన్ని నాళ్ళు హాయిగా ఉండండి‘’అని అందమైన అంటే’’ చారు ‘’ మాటలతో ‘’వాక్ ‘’తో చెప్పారు కనుక ‘’చార్వాకం ‘’అయింది .’’తిను తిను ‘’అనేదే వీరి ఉద్బోధ అందుకే ఆపేరు .తిను అంటే అనుభవించు అని అర్ధం గా భావించాలి .చర్వ్ అనే సంస్కృత ధాతువుకు ‘’తినటం ‘’అని అర్ధం .ఉంది కనుక ఆ పేరు సార్ధక మైనదని ‘’గుణ రత్నుడు’’ అనే ఆయన ఊహించి చెప్పాడు .
కౌటిల్యుడు అర్ధ శాస్త్రం లో దీనిని, లోకాయతన మతం మొదలైన వాటిని కలిపి ‘’అన్వీక్షికి ‘’అని పిలిచాడు .వాల్మీక రామాయణం లో అన్వీక్షక ప్రసంగం ఉంది .అన్వీక్షకులు తెలివి లేని వారని వారిది బాల బుద్ధి అని అనవసరం గా వాగుతారని చెప్ప బడింది .ద్రుపద మహారాజు ఒక బ్రాహ్మణుని ద్వారా బృహస్పతి రాసిన వాటిని చెప్పించు కొన్నాడని అప్పుడు ద్రౌపది ఆమె సోదరులు కూడా దాన్ని విన్నారని మహా భారతం లో ఉంది .బౌద్ధ గ్రంధాలు వినయ పిటిక ,అన్గుత్తర నికాయ లలో కొంత మంది బ్రాహ్మణులు చార్వాక లోకాయతాన్ని నేర్చుకొన్నట్లు కనపడుతుంది ..మను స్మ్రుతి దీని అనుయాయులను హైతుకులు పాషండులని ,బిడాల ప్రతికులని తీవ్రం గా దుయ్య బట్టింది .వారు శిక్షార్హులనీ తేల్చింది .వీరు పరలోకాలను యజ్ఞాలను నిరాకరించటమే ముఖ్య కారణం .వీరితో బాటు నాస్తికులు కూడా లోకాయతులే అని ‘’మేధా తిది ‘’చెప్పాడు .’’దత్తము ,హుతము ‘’పరలోకానివే అని నాస్తిక వాదం .
వీరికి ఉన్న తర్క ప్రావీణ్యాన్ని శుక్ర నీతి శాస్త్రం ప్రశంసించింది హేతువాదానికే ప్రాధాన్యత నిచ్చి వైదిక విధులను బహిష్కరించటం వల్ల వీరికి ఆదరణ లభించక క్రమం గా ఈ చార్వాకం కను మరుగైంది .భగవంతుని పై ద్వేషం ,శృతి స్మృతులను నిరాకరించటం నిరాదరించటం ,వీటిని చదివే వారిని శిక్షించటం వల్ల చార్వాకం ప్రజల నుండి దూరమైంది .
స్యాద్ వాదము
స్యాద్ వాదం జైనం లో భాగమే .ప్రతి వస్తువులో అనేక ధర్మాలుంటాయి అన్నిటిని ‘’అర్హతులు ‘’మాత్రమె తెలుసుకో గలరు .సాధారణ జ్ఞానం ఉన్న వారు అందులో కొన్ని మాత్రమె గ్రహించ గలరు .ఇలా పాక్షికం గా ఏక దేశ నిష్టం గా వస్తు ధర్మాలను తెలుసుకోవటాన్ని ‘’నయం ‘’అంటారు .ఉన్నదాన్ని దేని నైనా అది ఉంది అని గ్రహించటం నయమే .కాని వేరే ద్రుష్టి తో వేరే విధం గా చూస్తె అది నిషేధింప బడుతుంది .అప్పుడే దాన్ని లేదు అన వచ్చు .కనుక దేనినైనా ‘’ఇది ఉన్నదికావచ్చు‘’అని తెలుసుకోవటమే (సత్ స్యాత్ )జ్ఞానం .ప్రతి వస్తువు గురించి అంశ మాత్ర జ్ఞానం అంటే ఆ వస్తువు యొక్క ఏదో విశేషాన్ని నిరూపించటమే నయ వాదం .తీర్ధన్కురులు సర్వజ్ఞులు పూర్ణ పురుషులు కనుక వారి జ్ఞానం పూర్ణం .
ఉన్న వస్తువు గురించి ‘’ఉన్నది ‘’అని చెప్ప రాదు .ఎందు కంటే వర్త మాన కాలం లో ప్రస్తుత పరిస్తుతులలో అ వస్తువు ఉంది .అంటే అన్ని దేశ ,కాల పరిస్తితులలో అది ఉండదు కదా .అందుకని దాన్ని ‘’ఉన్నది కావచ్చు ‘’(స్యాత్ ఆస్తి )అని చెప్పటమే సమంజసం .
ప్రస్తుతం ఉన్న ఒక వస్తువు గూర్చి ‘’ఉన్నది కావచ్చు ‘’అంటే ‘’ఈ వేళ ఒక విశేష సమయం లో ,ఒక విశేష రూపం లో ఆ వస్తువు ఉంది (స్యాత్ ఆస్తి )అనీ ,లేనిది కావచ్చు అని (స్యాత్ నాస్తి )అంటే వేరొక చోట వేరొక రూపం లో ఆ వస్తువు లేదు అని అర్ధం కూడా .ఈ రెండిటి ని కలిపితే ‘’వస్తువు ఉన్నదీ ,లేనిదీ కావచ్చు ‘’.అనే నిర్ణయానికి వస్తాం .దాని నిజ స్తితి అవ వ్యక్తం. ఉన్నది ఆవ వ్యక్తం కావచ్చు ,ఉన్నది లేనిది కూడా కావచ్చు ఆవ వ్యక్తం కావచ్చు .ఇలా ఏ వస్తువు గురించి అయినా ఏడు విధాలుగా పాక్షిక ,వైకల్పిక జ్ఞానాలు అంటే నయాలు ఉంటాయి .వీటినే ‘’సప్త భంగీ నయం ‘’అని అంటారు .ఏతా వాతా దేన్నీ గురించి అయినా ఇదమిద్ధం గా ప్రతిపాదించటానికి వీలే లేదు .అందుకని ‘’కావచ్చు ‘’(స్యాత్ )అని మాత్రమె చెప్పగలం .ఈ వాదాన్నే స్యాత్ వాదం ‘’అంటారు
సంజయుడు మొదట్లో పరలోకం దేవతు కర్మం ఫలం వంటి వాటి విషయం లో ‘’ఉన్నది –లేదు కూడా ‘’అని కానీ ,’లేదు –ఉన్నది కూడా ‘’అనీ నాలుగు విధాలుగా ఏవిదం గా నైనా చెప్పగలమని ‘ఏ’కాంత వాదం ‘’అనే దాన్ని లేవ దీశాడు .దేన్నీ గూర్చి అయినా ఒక విధం గా (ఏకాంతం )గా ,చెప్పలేం .దీని తర్వాత నే మహా వీరుడు ‘’ఆత్మ ఉన్నది ‘’,ఆత్మ లేనిది ‘’,ఆత్మ ఆవ వ్యక్తం ‘’,కావచ్చు .అని మూడు విధాలుగా చెప్పటానికి వీలుంది అని చెప్పాడు .ఇదే ‘’త్రిభంగీ నయనం‘’దీని తర్వాత వచ్చిందే సప్త భంగి నయనం .అన్ని నయనాలను అంగీకరించటం చేత వస్తువుల సమగ్ర జ్ఞానం తెలుస్తుంది పాక్షిక బుద్ధి పోతుంది .తర్వాత పరి పూర్ణ జ్ఞానం లభిస్తుంది అర్హతులవుతారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-9-13-ఉయ్యూరు

