ఉత్తమ దేశికుడు,ఆదర్శ ప్రదానోపాధ్యాయుడు – డాక్టర్ థామస్ ఆర్నోల్డ్
రేపు గురు పూజోత్సవం ,దీనినే ఉపాధ్యాయ దినోత్సవం గా మనం జరుపు కొంటాం మన ద్వితీయ రాష్ట్ర పతి ,మహా పండితుడు ,దార్శనికుడు అయిన డాక్టర్ సర్వేపల్లి రాదా కృష్ణ పండితుని జన్మ దినమైన సెప్టెంబర్ అయిదు ను ఈ మహోత్సవం గా జరుపుకోవటం ఆంధ్రుల మైన మనకందరికీ గర్వ కారణం .అజ్ఞానం నుంచి జ్ఞానం లోకి ,చీకటి నుండి వెలుగు కు మార్గ దర్శనం చేసే వాడు గురువు అని చెప్పుకొంటాం .అలాంటి ఉత్తమ దేశికుడు రాధాకృష్ణ పండితుడు .మన దేశం లోనే కాదు ఇతర దేశాల్లోను ఇలాంటి మహాను భావులున్నారు .అందులో ముఖ్యం గా ఇంగ్లాండ్ కు చెందినా రగ్బీ స్కూల్ హెడ్ మాస్టర్ డాక్టర్ థామస్ ఆర్నోల్డ్ గురించి తెలియ జేయటమే నా ఉద్దేశ్యం .
థామస్ ఆర్నోల్డ్ 1795జూన్ 13న ఇంగ్లాండ్ లోని ‘’ఐల్ ఆఫ్ రైట్ ‘’లో కస్టమ్స్ ఆఫీసర్ అయిన విలియం ఆర్నోల్డ్ కు మార్తా డేలా ఫీల్డ్ కు జన్మించాడు .లార్డ్ వే మౌత్ గ్రామర్ స్కూల్ లో చదువుకొన్నాడు .తర్వాతా ఆక్స్ ఫర్డ్ లోని క్రైస్ట్స్ట్ చర్చ్ కాలేజి లో విద్య నేర్చాడు .అక్కడ క్లాసిక్స్ లో అద్వితీయ ప్రతిభ చూపి ,1815 లో ఒరిఎల్ కు ఫెలో గా గౌరవింప బడ్డాడు . ప్రసిద్ధ రగ్బీ స్కూల్ కు హెడ్ మాస్టర్ కాక ముందు లేలిహాం హైస్కూల్ హెడ్ మాస్టర్ గా పని చేశాడు .
![]()
1828 లో రగ్బీ స్కూల్ హెడ్ మాస్టర్ గా బాధ్యతలు స్వీకరించే ముందు అక్కడే కొంత కాలం ట్యూటర్ గా పని చేసి విశేష అనుభవం సంపాదించాడు .రగ్బీ స్కూల్ హెడ్ మాస్టర్ అయిన తర్వాతఆస్కూల్ చరిత్రనే మార్చి ఘనుడని పించుకొన్నాడు .విద్యా విధానం లో ఎన్నో సంస్కరణలు తెచ్చి ఆ స్కూల్ అభి వృద్ధికి విద్యార్ధుల భవిష్యత్తుకు స్వర్ణ సోపానాలు నిర్మించాడు ఆదర్శ ప్రదానో పాద్యాయడని పించుకొన్నాడు ఇంగ్లాండ్ లో రగ్బీ స్కూల్ ప్రతిభను మారు మ్రోగెట్లు చేశాడు .మిగిలినపబ్లిక్ స్కూళ్ళకు ఆదర్శం గా దీన్ని తీర్చి దిద్దాడు .ఆర్నోల్డ్ ప్రభావం మా టలతో వర్ణించలేనిది .క్రమ శిక్షణకు ,ఉత్తమ విద్యా బోధనకు అది కేంద్రమైంది .ఉత్తమ విద్యార్దులనే కాదు తన శీల సంపద ద్వారా ఉత్తమ ఉపాధ్యాయులను తయారు చేశాడు ఆర్నోల్డ్ .
చరిత్ర ,గణితం ఆధునిక భాషలను ప్రవేశ పెట్టినా అన్నిటికి క్లాసికల్ లాంగ్వేజేస్ నే ఆధారం చేశాడు .అదే తన అన్ని భావాలకు సిద్ధాంతాలకు మూలం అన్నాడు .భౌతిక శాస్త్రాన్ని బోధింప చేయలేదాయన. కారణం దాన్ని నేర్పిస్తే సంపూర్ణం గా నేర్పించాలి లేక పొతే వదిలేయాలని వివరణ ఇచ్చాడు .స్కూల్ లో అతి పెద్ద తరగతి అయిన ఆరవ ఫారం విద్యార్ధులకు స్కూల్ లోని అన్ని విభాగాలలోనూ పెత్తనం కల్పించాడు ఇదే ఉత్తమ పాలనా పధ్ధతి అని నిరూపించాడు ఇందులో ఆయన అనుక్షణ పర్య వేక్షణ ఉండేది ఆ విద్యార్ధులకు పరి పాలనను భావాన్ని ఇలా నేర్పాడు భవిష్యత్ లో ఉత్తమ పాలకులు కావాలంటే ఇది తప్పని సరి అని నిరూపించాడు ఆయన సమర్ధతకు ,,అజమాయిషీకి శ్రద్ధకు అందరు జేజేలు పలికారు .
ఉత్తమ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న ఆర్నోల్డ్ గురించి ఒక కధ ప్రచారం లో ఉంది ఒక సారి ఇంగ్లాండ్ రాజు స్కూల్ ను పర్య వేక్షిన్చటానికి వచ్చాడు .సాధారణం గా రాజు సుప్రీం కనుక ఉపాధ్యాయులంతా నెత్తిన టోపీ లు తీసి చేత్తో పట్టుకొని వంగి నిల బడ్డారు రాజు ముందు .కాని హెడ్ మాస్టర్ ఆర్నోల్డ్ టోపీ తీయ లేదు సరికదా వంగనూ లేదు .అందరూ ఆశ్చర్య పోయారు ఆయన పని అయి పోయిందని భయ పడ్డారు .స్టాఫ్ మీటింగ్ లో ఈ విషయాన్ని రాజు ప్రశ్నించాడు .అప్పుడు ఆర్నోల్డ్‘’నేను నా స్కూల్ కు సర్వాది కారిని.ఇక్కడ వేరేవారికి నేను తల వంచాల్సిన అవసరం లేదు .కనుక హాట్ తియ్యలేదు వంగలేదు ‘’అని నిర్భయం గా చెప్పాడు .ఆయన అమోఘ వ్యక్తిత్వానికి రాజు మెచ్చు కొన్నాడని కధలు గాధలుగా ప్రచారం లో ఉండేది .అలాంటి వెన్నెముక గల ఉపాధ్యాయులు ,ప్రధానోపాధ్యాయులు ఉంటె సమాజం లో ఇంత నికృష్ట పరిస్తితులుండవు ఇది అందరికీ ఆదర్శ ప్రాయమే ఆదరణీయమే ,అనుసర ణీయమే.అందుకే ఉపాధ్యాయ దినోత్సవ సందర్భం గా ఆర్నోల్డ్ ను మనం స్మరిన్చుకొంటు న్నాం
ఆర్నోల్డ్ గురించిన విషయాలు థామస్ హగ్స్ రాసిన నవల లోను ,డికెన్స్ రాసిన నవలలలోనూ కన్పిస్తాయి విద్యార్ధులు తమ హెడ్ మాస్టర్ ఆర్నోల్డ్ ను ఎంత ఆరాధన భావం తో గౌరవించారో ప్రేమించారో భయపడ్డారో తెలియ జేసే సంఘటనలు అందులో ఉటంకించారు .క్రైస్తవ మత బోధక ప్రవచనాల కంటే ఆర్నోల్డ్ వచనాలే తమకు ప్రేరకాలని చెప్పారు స్వర్గం కంటే తమకు తమ రగ్బీ స్కూలే మిన్న అనీ దేవుడి కంటే ఆర్నోల్డ్ యే దైవం అన్నారు అదీ ఆర్నోల్డ్ అంటే రగ్బీ స్కూల్ అంటే .ఉత్తమ ,ఉన్నత ప్రమాణాలకు ఆ హెడ్ మాస్టర్ ,ఆ స్కూల్ ప్రాతి నిధ్యం వహించారు
ఆర్నోల్డ్ ఎరాష్టియాన్ చర్చ కి సంబంధించిన వాడు .’’హై చర్చ్’’పార్టీ అంటే ఇష్టం లేదు .ఆయన ప్రతిభా పాటవాలు నిబద్ధతా బోధనా సామర్ధ్యం గమనించి ఆర్నోల్డ్ ను 1841 లో ఆక్స్ ఫర్డ్ లో మోడరన్ హిస్టరీ కి రీగస్ ప్రొఫెసర్ గా నియమించారు .1833 లోబోర్డ్ చర్చ్ ఉద్యమం వల్ల ‘’చర్చి సంస్కరణ నియమాలు‘’అమల్లోకి రావటానికి ఆర్నోల్డ్ ఎంతో కృషి చేశాడు .
ఆర్నోల్డ్ ఉత్తమ చరిత్ర కారుడు కూడా 1838-42 .మధ్య కాలం లో మూడు వాల్యూముల ‘’హిస్టరీ ఆఫ్ రోమ్’’అనే అసంపూర్ణ గ్రంధాన్ని రాశాడు అతని ‘’లెక్చర్స్ ఆన్ మోడరన్ హిస్టరీ ‘’పుస్తకం బహుళ ప్రచారం ,ప్రశస్తి పొందింది .ముఖ్యం గా ఆర్నోల్డ్ రాసిన ‘’సేర్మాన్స్ ‘’ను ఇంగ్లాండ్ లో దాదాపు అందరూ చది వారు అంటే ఆశ్చర్య పడాల్సిన విషయం ఏమీ కాదు అంత గొప్ప గా ఆ అయిదు భాగాల గ్రంధాన్ని రాశాడు వాటిని విక్తోరియామహా రాణి కూడా ఆసక్తి గా చదివి నట్లు చెబుతారు .
ఆర్నోల్డ్ కుటుంబమూ ప్రసిద్ధి కేక్కిందే .ఆయన భార్యపేరు మాఫీ పెన్ రోజ్ ఈ దంపతులకు అయిదుగురు కూతుళ్ళు అయిదుగురు కొడుకులు ..కొడుకు మాథ్యూ ఆర్నోల్డ్ గొప్ప కవి టాం ఆర్నోల్డ్ గొప్ప లిటరరీ స్కాలర్ .విలియం ఆర్నోల్డ్ గొప్ప రచయిత .పెద్ద కూతురు జెన్ మార్తా –ఎడ్వర్డ్ డేవిడ్ ఫార్ స్టర్ ను పెళ్ళాడింది .1859లోవిలియం ఆర్నోల్డ్ మరణించగా పిల్లలను ఫార్ స్టర్ దంపతులు దత్తత గా స్వీకరించి ఆర్నోల్డ్ ఇంటి పేరు మీదనే పెంచి పోషించిపెద్ద వాళ్ళను చేశారు . అందులో ఒకతను .హాగ్ ఆక్స్ ఆర్నోల్డ్ ఫార్ స్టర్ లిబరల్ యూనియనిస్ట్ ఏం .పి. . ముఖ్య మంత్రి బాల్ఫోర్ర్ కాబినెట్ లో మంత్రిగా ఉన్నాడు కూడా .చివరి వాడు ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్ నిద్ర లో నే మరణించాడు .
రగ్బీ హెడ్ మాస్టర్ థామస్ ఆర్నాల్డ్ ‘’ఫాక్స్ హౌ ‘’అనే చోట చిన్న ఎస్టేట్ కొన్నాడు శలవలను ఈ ఎస్టేట్ లోనే గడిపే వాడు .1842 జూన్ 12న నలభై ఏడు ఏళ్ళ వయసులో ఆయన కీర్తి దిగంతాలకు నానాటికి వ్యాపిస్తుండగా అకస్మాతుగా హార్ట్ ఎటాక్ తో థామస్ ఆర్నోల్డ్ మరణించాడు ఆయన పార్దివ శరీరాన్ని గౌరవ లాంచనాల తో రగ్బీ చాపెల్ లో ఖననం చేశారు ఆర్నోల్డ్ గారి చివరి కూతరు మేరీ అగస్టా ఆర్నోల్డ్ గొప్ప నవలా రచయిత .ఇంకో కూతురు జూలియా థామస్ హక్స్లీ కుమారుడు లియోనార్డ్ హక్స్లీ ని వివాహం చేసుకోంది .ఈ దంపతుల కుమారులే ప్రసిద్ధ రచయిత లైన జూలియస్ హక్స్లీ ,ఆల్డస్ హక్స్లీ లు .
గురు పూజోత్సవం నాడు థామస్ ఆర్నోల్డ్ లాంటి ఆదర్శ ప్రదానోపాధ్యాయుడిని ,మార్గ దర్శిని స్మరించటం నా ధర్మం గా భావించి మీకందరికీ తెలియ జేశాను
5-9-13-ఉపాధ్యాయ దినోత్సవ సందర్భం గా శుభా కాంక్షలు
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4–9-13 –ఉయ్యూరు


ఎంత ఘనత వహించిన కుటుంబం ! తండ్రి థామస్ ఆర్నాల్డ్, కొడుకు మాథ్యూ ఆర్నాల్డ్. ప్రసిద్ధులైన ముని మనుమలు ఆల్డస్ హక్స్లీ (Brave New World లాంటి పుస్తక రచయిత), జూలియన్ హక్స్లీ (ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు, మన దేశం ఇచ్చే కళింగ ప్రైజ్ గ్రహీత) ! ఖ్యాతి గడించటలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు.
థామస్ ఆర్నాల్డ్ గారి గురించి చదువుతుంటే 1960 లలో నేను చదువుకున్న లయోల కాలేజ్ (విజయవాడ) ప్రిన్సిపాల్ రెవరెండ్ ఫాదర్ గోర్డన్ గారు గుర్తొచ్చారు. విద్యార్ధులలో బాధ్యతాయుతం గా ఉండటం, విలువలు పాటించడం ప్రోత్సహించిన వ్యక్తి. అలాగే విద్యార్ధుల పట్ల వాత్సల్యం చూపించిన ఉపాధ్యాయుడాయన.
మీరు మంచి టపా వ్రాసారు. బాగుంది.
మీతో కలిపి ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
LikeLike