‘పునశ్చరణ లేని కళకు పురోగతి లేదు’
September 05, 2013
తెలుగు జాతీయ సంపద కూచిపూడి నాట్యం. వృక్షం ఎంత ఎత్తుకు ఎదిగినా దాని మూలాలు భూమి లోపలే ఉంటాయి. ఈ నాట్యానికి తల్లి వేరు కృష్ణాజిల్లా కూచిపూడి గ్రామంలో ఉంది. తరతరాలుగా ఆ నేలలో వేళ్లూనుకున్న కూచిపూడి 13వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి కృషితో రూపాంతరం చెందుతూ వీధి భాగోతం, యక్షగాన కళారూపం, శాస్త్రీయ నాట్య కళగా తన హోదాను పెంచుకుని అంతర్జాతీయంగా కీర్తి బావుటా ఎగరేస్తోంది. అటువంటి ఉదాత్తమైన కళా ప్రక్రియకు కాయకల్ప చికిత్స చేసి పునరుజ్జీవం నింపే బాధ్యతను అఖిల భారత కూచిపూడి నాట్య కళా మండలి తన భుజ స్కంధాలపై వేసుకుంది. ఆ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి కూచిపూడి అగ్రహారానికి చెందిన పసుమర్తి కేశవ ప్రసాద్ ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్న ముచ్చట్లు….
నిఖార్సయిన ప్రదర్శన కళగా కూచిపూడి నాట్య పరిణామ క్రమం, చారిత్రక ప్రస్థావన చెప్పండి?
కళ అనేది పండిత పామర జనరంజకంగా ఉంటేనే పది కాలాల పాటు మనగలుగుతుంది. పగటి వేషాలు అనే పేరుతో కూచిపూడి నాట్యం తరతరాలుగా ప్రజా కళగా వర్ధిల్లింది. ఇది పేటలోని కళ తప్ప కోటలోని కళ కాదు. కాల క్రమేణా పేటల్ని దాటి, కోటకు వెళ్లి అక్కడా పాగా వేసింది. పూర్వం దీన్ని కూచిపూడి భాగవతం అనేవారు. 11వ శతాబ్దంలో రాజేంద్ర కళింగుడు తాను పదవీ చ్యుతుడైనప్పుడు కూచిపూడి సందర్శించి కళా ప్రదర్శనలు తిలకించి వెళ్లాడు. 13వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి దీనికి అద్వైత సిద్ధాంతాన్ని జోడించాడు. శివ భక్తులు, విష్ణు భక్తులు అన్న బేధం లేకుండా అందరి మన్ననలూ పొందే విధంగా భామాకలాపాన్ని రూపొందించాడు ఇందులో సూత్రధారుడు శైవుడు. వైష్ణవులైన కృష్ణుడు, సత్యభామల మధ్య చిన్న అలక నేప«థ్యంలో ఈ అంశం నడుస్తుంది. 15వ శతాబ్దంలో శ్రీ కృష్ణ దేవరాయల సవతి సోదరుడు వీర నరసింహ రాయలు ఆస్థానంలో బాగా ప్రసిద్ధి చెందిన కూచిపూడి భాగవతులు అనే ప్రస్తావన కనిపిస్తుంది. ఎందుకంటే సిద్ధేంద్ర యోగి రూపొందించిన ‘భామాకలాపం’ కేళికను అప్పట్లో ఏకబిగిన మూడు రాత్రిళ్లు ప్రదర్శించేవారట.
దేశీయ సంప్రదాయంలో ప్రారంభమైన కూచిపూడి భాగవతులు పగటి వేషాలతో కళను పరిరక్షించేవారట?
ఏ ప్రదర్శిత కళకైనా ప్రేక్షకాదరణ ప్రాణప్రదం. కళను వ్యాపింపజేసే క్రమంలో కూచిపూడి భాగవతులు దేశాటన చేసేవారు. ఏ ఊరు వెళితే అక్కడి సామాజిక పరిస్థితులు ఆకళింపు చేసుకొని కళగా ప్రదర్శించి రక్తి కట్టించేవారు. దేశీయ సాహిత్యం, యక్షగాన కళారూపం, శాస్త్రీయ సంగీత, అష్టపదులు అన్నీ ఇందులో మిళితమై ఉండేవి. ఇంటింటికీ వెళ్లి కళ పట్ల ఆసక్తి రేకెత్తించేవారు. కొన్ని కుటుంబాలలో వృద్ధులు, మంచాన పడ్డవారు, కదల్లేనివారు, ఘోషా స్త్రీలు తలుపు చాటు నుంచి కళను తిలకించే అవకాశం ఆ రకంగా కలిగించేవారు. ఇలా ప్రచారం చేయడం వల్ల ప్రదర్శనకు భారీగా జనం తరలి వచ్చి కళను ఆస్వాదించేవారు.
పూర్వం కూచిపూడి భాగవతుల సామాజిక స్పృహ ఎలా ఉండేది?
సామాజిక స్పర్శతోనే కళాత్మకత మరింత రక్తికడుతుంది. ఒకసారి కడప జిల్లాలో కూచిపూడి భాగవతులు పర్యటిస్తున్న సందర్భంలో రాజభటులు సుంకం వసూలు చేసే క్రమంలో స్త్రీల పట్ల అనుచితంగా వ్యవహరించడాన్ని చూసి చలించిపోయి, దాన్నే ఇతివృత్తంగా తీసుకుని, కళా రూపంగా ప్రదర్శించారు. అది తెలిసిన వీర నరసింహ రాయలు కోపోద్రిక్తులై భాగవతులను తన ఆస్థానానికి పిలిపించి విచారించారు. ఆ కళారూపాన్ని తన ముందు ప్రదర్శించమన్నారు. అది తిలకించాక ఆరోపణ నిజం కాకపోతే శిరచ్ఛేధనమే శిక్ష అని ఆజ్ఞ వేశారు. ‘చిత్తం మహా ప్రభూ, విచారణకు మేం సిద్ధం’ అని భాగవతులు ఆ సవాలును స్వీకరించారు. వేగుల ద్వారా విచారణ పూర్తి చేసుకున్న రాజు ఆ కళలో వాస్తవం తెలుసుకుని తన పాలనలోని చీకటి కోణాలు ధైర్యంగా తన దృష్టికి తెచ్చినందుకు బహుమతులిచ్చి పంపించారు. ఆ రోజుల్లో వాళ్లు కళ కోసం ప్రాణ త్యాగానికీ వెనుకాడలేదు. ఇంతకంటే సామాజిక స్పృహ, సోషల్ టచ్ ఏముంటుంది?
కూచిపూడి నాట్యానికి శాస్త్రీయ అనుసంధానం ఎలా జరిగింది?
కూచిపూడి నాట్యానికి శాస్త్రీయ హోదా దక్కడం గురు వెంపటి చిన సత్యం కృషి ఫలితమే. ఆయన కృష్ణాజిల్లా కూచిపూడి అగ్రహారాన్ని వదిలి మద్రాసుకు మకాం మార్చారు. అక్కడ ఆయన పండితపామర జన రంజకంగా వర్ధిల్లుతున్న కూచిపూడి నాట్యానికి భరతుడి నాట్య శాస్త్రాన్ని మేళవిస్తే మరింత ప్రయోజనం ఒనగూరుతుందని తపస్సులో మునిగిపోయారు. అప్పటికి వేదాంతం రాఘవయ్య, వెంపటి పెద సత్యం వంటి వారు చెన్నపట్నంలో ఉన్నప్పటికీ, వారు సినీ పరిశ్రమ ఉపాధిలో క్షణం తీరిక లేకుండా ఉండేవారు. అయినా వారిని ఖాళీ సమయాల్లో వెతికి పట్టుకొని ఎన్నో లోతైన విషయాలు చర్చించి ఒక అభిప్రాయానికి వచ్చేవారు. అప్పటికి మద్రాసులో భరత నాట్యమే శిఖరాయమానంగా వెలిగే కళ. రుక్మిణీదేవి అరుండేల్ తన ప్రదర్శనా పటిమతో అందరి మన్ననలూ పొందేవారు. కూచిపూడి నాట్యానికి శాస్త్రీయ హోదా కల్పించే కళాత్మక ప్రయోగశాలగా వెంపటి వ్యవస్థ వేళ్లూనుకుంది. శ్రీనివాస కల్యాణం, క్షీరసాగర మథనం, చండాలిక వంటి నృత్య నాటికలెన్నో అద్భుతంగా తీర్చి దిద్ది, కూచిపూడి ఒక శాస్త్రీయ నృత్యమని వాళ్లు రుజువు చేశారు.
వెంపటికి పూర్వం కూచిపూడి వైభవానికి కృషి చేసిన పెద్దలెవరూ లేరా?
ఎందుకు లేరు? చాలా మంది పూర్వీకులు కళ కోసం తమ జీవితాలను అంకితమిచ్చారు. 19వ శతాబ్దంలో చింతా వెంకట్రామయ్య, వేదాంతం లక్ష్మీనారాయణ ఏకపాత్రాకేళి/వ్యస్త నృత్యాలు (సోలో పర్‌ఫార్మెన్సెస్) చేయడంలో బాగా ప్రసిద్ధులయ్యారు. వెంపటి వెంకట నారాయణ భామాకలాపాలకు పెట్టింది పేరు. వీళ్లే కాకుండా వెంపటి సమకాలికులు చాలామంది కళ కోసం ఎంతో పాటు పడ్డారు. కూచిపూడి నాట్య వికాసానికి వెంపటి చేస్తున్న కృషిలో చాలామందికి భాగస్వామ్యం ఉంది. ఆ రోజుల్లో వాళ్లంతా కష్టపడి, కేంద్ర సంగీత నాటక అకాడమీని ఒప్పించి, కూచిపూడి నాట్యానికి శాస్త్రీయ హోదా కల్పించడం వల్లే ఇవాళ ప్రపంచమంతటా కూచిపూడి నాట్యం దినదిన ప్రవర్ధమానం చెందుతోంది.
మిగతా శాస్త్రీయ నృత్యాలతో పోలిస్తే ఈ మధ్య, కూచిపూడి శోభ తగ్గినట్టుంది. కారణం?
జ: పద్మభూషణ్ గురు డాక్టర్ వెంపటి చిన సత్యం తర్వాత అంతటి అంకితభావంతో కూచిపూడి నాట్య ప్రదర్శనల అభివృద్ధికి కృషి చేసేవాళ్లు కొరవడ్డారు. నిజానికి వెంపటి మాస్టారి స్థాయిని పుణికిపుచ్చుకున్న కొందరు సీనియర్లు ఆ పం«థాను కొనసాగిస్తున్నారు. అయితే, మిగతా భారతీయ శాస్త్రీయ నృత్యాల మాదిరి కొత్త ప్రయోగాలు చేసి మెప్పించే సాహసానికి ఎవరూ సిద్ధపడడం లేదు. గురు స్థానంలో వెంపటి పనితీరు తెలిసిన వాళ్లెవరూ ఆ స్థానాన్ని భర్తీ చేయగల సాహసం చేయలేకపోతున్నారు. నాట్య కళాకారుల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది కానీ, నాట్య గురువుల మధ్య ఈ పోటీ కనిపించడం లేదు. ఏవో కొన్ని అంశాలు ప్రదర్శించే విద్య నేర్చుకొని, పరిణతి సాధించకుండా చాలామంది గురువులుగా చెలామణీ అవుతున్నారు. సర్టిఫికేట్లు, డిప్లమాలు గురు స్థానానికి ప్రామాణికాలు కాకూడదు.
అయితే ఈ లోటును అధిగమించడానికి మీరెలాంటి కృషి చేస్తున్నారు?
కూచిపూడి నాట్యాచార్యుల్లో ప్రదర్శనా సామర్థ్యం, ప్రయోగ శీలత పెంపొందించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లా కేంద్రాలలో పునశ్చరణ తరగతులు ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. లోగడ గురు వెంపటి చిన సత్యం హయాంలో ఈ తరహా పునశ్చరణ తరగతులు కూచిపూడిలో ఏటా నిర్వహించే ఆనవాయితీ ఉండేది. ఇప్పుడున్నంత సౌకర్యవంతంగా అప్పటి కూచిపూడి అగ్రహారం ఉండేది కాదు. రచ్చబండను వేదిక చేసుకుని పాఠాలు చెబుతుంటే చెట్ల కింద కూర్చుని మేమంతా అభ్యసించేవాళ్లం. వయసు, స్థాయి అన్నీ మరచి అందరం అందులో లీనమైపోయేవాళ్లం. ఉదయం ఎనిమిది గంటలకు పునశ్చరణ తరగతి మొదలైతే మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఏకబిగిన కొనసాగించేవారు. ఆయనకూ ఆలసట ఉండేది కాదు, మా కెవరికీ ఇబ్బందనిపించేది కాదు. ఇదంతా ఎందుకూ, దారినపోయే జనం తమ కూలి పన్లు కూడా మరచిపోయి అక్కడే నిల్చుని, నాట్యాన్ని ఆస్వాదించేవారు. కళకు ఆదరణంటే అదీ. ప్రదర్శిత కళకు అయస్కాంత శక్తి ఉంటే ఆదరణకు లోటే ఉండదు.
ఇప్పుడు ఆ స్థాయిలో ఆదరణ లేకపోవడానికి కారణం ఏమై ఉంటుందంటారు?
కళ పట్ల అంకిత భావం ఉండే నాట్యాచార్యుల సంఖ్య తగ్గింది. పోటీ తత్వంతో ప్రపంచాన్ని జయించాలనే ఆలోచన తక్కువమంది నాట్యాచార్యులలో కనిపిస్తుంది. నాలుగు అడుగులు, జతులు నేర్చుకున్న ప్రతివారూ తాము గురువులమని భావించి శిక్షణ సంస్థ నిర్వహిస్తూ తమ అభ్యాసం సంగతి విస్మరిస్తున్నారు. సర్టిఫికేట్, డిప్లమా, డిగ్రీ కోర్సు ధృవీకరణ పత్రాలేవీ సమర్థతకు ప్రామాణికాలు కావు. గురు స్థానం నిలబెట్టుకోవడానికి అన్నిటికీ మించి, నిరంతర శోధన, సాధన చాలా అవసరం. నిజానికి ప్రదర్శకుల సంఖ్యకు అనుగుణంగా నాట్యాచార్యులు లేరు.
ఎవరికి వారు గిరి గీసుకుని ఉండే నాట్యాచార్యులను సమీకరించి ఏకీకృత విద్యావిధానం ద్వారా కూచిపూడి నాట్యాన్ని వృద్ధి చేయడం సాధ్యమేనా?
అవుతుందనే ఆశావహ దృక్పథం నాలో ఉంది. కూచిపూడిలో ఉండి నేనొక్కడినే ఆ పని చేయడం సాధ్యపడదు. అందుకే అన్నమాచార్య 605వ జయంతి నాట్యోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి జిల్లాలో ఆచార్య లక్షణాలను ఒడకట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. వెంపటి మాస్టారి ఆశయ సాధనకు ఈ ప్రక్రియ తోడ్పడుతుందని భావిస్తున్నాం. జులై 12,13,14 తేదీలలో విజయవాడలో మూడు రోజుల పాటు అన్నమయ్య సంకీర్తనలపై నాట్యాచార్యుల శిక్షణ తరగతులు దిగ్విజయంగా పూర్తి చేశాం. రోజూ ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ ఏకబిగిన తరగతులు జరిగాయి. మంచి స్పందన వచ్చింది. అన్ని జిల్లాల్లో ఈ తరహా టీచర్ ఎడ్యుకేషన్ క్యాంపులు నిర్వహించనున్నాం.
నాట్యాచార్యుల పునశ్చరణ వర్క్‌షాప్ ద్వారా మీరాశించిన ఫలితాలు సాధ్యమేనా?
భేషజాలకు పోకుండా నాట్యాచార్యులంతా ఈ తరగతులకు హాజరై విషయాన్ని గ్రహిస్తే మంచిది. అయితే ఈ ప్రాజెక్టు చాలా ఖర్చుతో కూడుకున్నది. లోగడ 1983-87 ప్రాంతాల్లో చిన సత్యం మాస్టారు నిర్వహించిన శిక్షణ తరగతులకు కేంద్ర సంగీత నాటక అకాడమీ, రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాయి. అప్పటి కృష్ణాజిల్లా యంత్రాంగం కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావించింది. ముందు జిల్లాలవారీ ప్రక్రియ పూర్తయితే కూచిపూడిలో కేంద్రీకృత శిక్షణ శిబిరం నిర్వహిస్తాం.
శాస్త్రీయ నృత్యాలలో పురుషులు మైనారిటీ అయిపోతున్నారు. కారణం?
పురుషులే స్త్రీ పాత్రలు పోషించే సంప్రదాయం నుంచి కూచిపూడి శాస్త్రీయ నృత్యంగా ఎదిగింది. గత రెండు తరాల నుంచే స్త్రీలు కూచిపూడి ప్రదర్శనల్లో స్త్రీల ప్రాధాన్యం పెరిగింది. వేదాంతం సత్యనారాణ శర్మ, స్థానం నరసింహారావులకంటే గొప్పగా స్త్రీ పాత్రల్ని రక్తి కట్టించిన కళాకారులెవరున్నారు? అలాగే రంగస్థలం మీద బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి హొయలొలికిస్తే మరి తిరుగుండేది కాదు. కళ పరంగా స్త్రీ పురుషులిద్దరూ ఎవరు ఏ పాత్ర పోషించినా పాత్రోచితంగా రక్తి కట్టించారా లేదా అనే విషయాన్నే చూడాలి. స్త్రీ పాత్రలు పోషిస్తే స్త్రీ లక్షణాలొచ్చేస్తాయనే దుష్ప్రచారాలవల్ల కొందరు దూరమవుతున్నారు. నాట్యం నేర్చుకుంటే స్త్రీ సహజ లక్షణాలు అలవాటైపోతాయనుకోవడం పొరపాటు. ఎవరో కొందరు అవగాహన లేని వాళ్లు చేసే అబద్ధ ప్రచారం తప్పని రుజువు చేసిన మునుపటి తరం పెద్దల్ని చూసి నేర్చుకోవాలి. మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో పురుష నాట్య నిపుణులు అప్రతిహతంగా వెలుగుతున్నారు. వారి ప్రదర్శనలకు మ్యాట్నీలు కూడా జరుగుతున్నాయి. 2020 వరకూ వారి ప్రదర్శనలకు థియేటర్లలో టికెట్లు బుక్ అయిపోయాయంటే ఆదరణ ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి.
ఇంటర్వ్యూ: రతన్ రాజు బందిలి
విశాఖపట్నం
ఫొటోలు: వై. రామకృష్ణ

