30 మందికి అమ్మానాన్న ఈ టీచర్
September 05, 2013
టీచర్లంటే – బడిలో పాఠం చెబుతారు. ఇంటికి హోమ్‌వర్క్ ఇస్తారు.
కాని పుస్తకాల్లోని పాఠాలే కాకుండా బతుకు పాఠాలనూ నేర్పిస్తే?
హోమ్‌వర్క్ ఒక్కటే కాకుండా, చిన్న బుర్రలకింత ఆలోచన ఇస్తే?
అనాథ ఆడపిల్లల జీవితాల్లో కాస్తంత వెలుగు నింపితే?
అటువంటి వ్యక్తిని ఏమంటాం? కొల్లా వెంకటేశ్వర్లు అంటాం.
ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన ఆయన మామూలు తెలుగు టీచరే.
కానీ జీతం తీసుకుని ఇంటికి పోయే బాపతు కాదు.
తాను రిటైరయిపోయినా, ‘విద్యార్థులకు జీవితాన్నివ్వడం ఎలాగ’ అని ఆలోచించి అమలుచేస్తున్న మనిషి.
ప్రకాశం జిల్లా జాగర్లమూడి గ్రామంలో ఎయిడెడ్ పాఠశాలలో తెలుగు టీచర్‌గా 1974లో చేరారు వెంకటే శ్వర్లు. ఆ బడి 1936లో ఒక పశువుల కొట్టంలో మొదలైంది. ముప్పయ్యేళ్లకు ఓ పెంకుటింట్లోకి మారి హైస్కూలుగా ఎదిగింది. చుట్టుపక్కల ఐదు గ్రామాల విద్యార్థులు అక్కడ చదువుకునేవారు. అయినా వ ర్షం వస్తే బడి సెలవు ఇవ్వాల్సిన పరిస్థితి. కొన్నాళ్లు చూసి విసుగొచ్చిన వెంకటేశ్వర్లు దాని రూపురేఖలు మార్చాలని నడుంబిగించారు. స్థానికులు, రాజకీయ నాయకులు, పూర్వ విద్యార్థులు – అందరినీ సంప్రదించి, మూడేళ్లలో నిధులు సేకరించి పాతిక లక్షల రూపాయల వ్యయంతో 2003కల్లా తమ బడికి మంచి భవనాన్ని సమకూర్చారు.
ప్రమాదంలో తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయిన ధనలక్ష్మి ప్రస్తుతం చిలకలూరిపేటలో పాలిటెక్నిక్ చదువుతోంది. అనాథ కనుక ఎనిమిదో క్లాసుతో ఆగిపోవల్సిన మోహనదుర్గ ప్రస్తుతం ఇంజనీరింగ్‌లో చేరడానికి సిద్ధంగా ఉంది. వైష్ణవి, సింధుజ, నాగమ్మ, సుధారాణి, అలేఖ్య, చరిష్మా, రామాంజమ్మ వాళ్లందరు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నారు. జయశ్రీ, సృజన వంటివారు డిగ్రీ, మరికొందరు ఇంటర్.. ఇలా దాదాపు ముప్ఫైమంది అమ్మాయిలు కోరుకున్న కోర్సులు చదువుకుంటున్నారంటే అదంతా వెంకటేశ్వర్లు నడుపుతున్న ‘స్పందన ఎడ్యుకేషనల్ సొసైటీ’ చలవే. వీళ్లలో దాదాపు అందరూ అనాథలే. మామూలుగానైతే పేదరికం నీడన మగ్గిపోవల్సినవారే. ‘చదువు వల్ల సమాజంలో గౌరవం లభిస్తుంది. ఏ పని చెయ్యాలన్నా పునాది, ఆయుధమూ, ఆసరా అన్నీ చదువే’ ఆలోచనతో వారికి తల్లి-తండ్రి- గురువు అన్నీ తానై సాకుతున్నారు వెంకటేశ్వర్లు.
అందరి బంధువయా
“ప్రస్తుతానికి ముప్ఫై మందినే చదివించగలుగుతున్నాను. కనీసం వందమంది ఆడపిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చెయ్యాలన్నది నా లక్ష్యం” అంటున్నారు వెంకటేశ్వర్లు. సెలవులొచ్చినప్పుడు ఈ అమ్మాయిలంతా పర్చూరులోని స్పందన భవనంలో క లుస్తారు, కలిసిమెలిసి ఉంటారు. “కిందటేడు వరకూ అందరూ ఇక్కడే ఉండి చదువు కోసం చుట్టుపక్కలున్న చిలకలూరిపేట, గుంటూరు వంటి పట్టణాలకు ప్రతిరోజూ వెళ్లొచ్చేవారు. ప్రయాణాల్లో విలువైన కాలమంతా వృథా అయిపోతోందనిపించి ఎక్కడివాళ్లనక్కడే హాస్టళ్లలో పెట్టేశాను” అని చెప్పారు వెంకటేశ్వర్లు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని వివిధ విద్యా సంస్థల్లో ఈ అమ్మాయిలను చేర్పించారాయన. ఫీజులు కట్టేసి ఊరుకోవడం కాదు, రోజుకొక అమ్మాయి బాగోగులను కనుక్కోవడానికి ఆయా సంస్థలకు వెళ్లొస్తుంటారు. ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, వార్డెన్లను అడిగి వాళ్లు ఎలా చదువుతున్నారో, ఏయే సబ్జెక్టుల్లో వెనకబడుతున్నారో, వాళ్ల ప్రవర్తన ఎలా ఉందో ఇవన్నీ తెలుసుకుంటారు. దాన్నిబట్టి వాళ్లకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఆహారం, ఆరోగ్యం వంటి అంశాల మీద కూడా శ్రద్ధ పెడతారు. కేజీ నుంచి పీజీ దాకా పాతిక ముప్ఫైమంది అమ్మాయిలను చదివించడానికి, వారికి తిండీబట్టా చూడటానికి సంవత్సరానికి ఎంత లేదన్నా పదిలక్షల రూపాయల ఖర్చు. తన పెన్షన్ డబ్బు కాకుండా, మంచి మనసున్న పెద్దవారు చేస్తున్న ఆర్థిక సాయమూ తనకు ఆసరా అవుతోందని చెప్పారాయన.
వాళ్లకు నేను, నాకు వాళ్లు…
‘సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్…’ అనలేదా గురజాడ? ఆయన మాటలే నాకు స్ఫూర్తి అంటున్నారు వెంకటేశ్వర్లు. “నేను భాషాప్రవీణ చదువుతున్నప్పుడు నలుగురు విద్యార్థులం కలిసి ఒక గదిలో ఉండేవాళ్లం. మాలో సుబ్బారెడ్డిని వాళ్ల నాన్న చదువు మానేసి ఇంటికి వచ్చెయ్యమన్నాడు. ఆర్థికపరిస్థితి బాగులేకనే కదా చదువు మానెయ్యాల్సి వస్తోంది అని అతనెంతో ఏడిచాడు. అతని ఆవేదన చూడలేక మిగిలిన ముగ్గురం ఖర్చంతా భరించి అతన్ని చదివించాం. అది మొదలు. నాకు ఉద్యోగం వచ్చినప్పటి నుంచీ ఎవరో ఒకరిని చదివించడం అలవాటుగా పెట్టుకున్నాను’ అని చెప్పిన ఈ ఉపాధ్యాయుడు కేవలం చదువొక్కటే కాదు, వ్యక్తిత్వాన్ని ఎలా నిర్మించుకోవాలో, పుస్తకాలు ఆలోచనను ఎంత విశాలం చేస్తాయో వాళ్లకు పదేపదే చెబుతుంటారు. తన సంరక్షణలో ఉన్న అమ్మాయిలు అన్ని విధాలా ఆలోచనను విశాలం చేసుకోవాలని పరితపిస్తుంటారు ఆయన.
“ప్రస్తుత సమాజంలో ఎన్నో ఆకర్షణలు. టీవీలు, సెల్‌ఫోన్లు, సినిమాలు. దుష్ప్రభావాలేమీ పడకుండా వీళ్లందరినీ పెంచే బాధ్యతను నెత్తికెత్తుకున్నాను. నేను చేస్తున్నది ఎంత కష్టమైన పనో తెలిసి వాళ్లు కూడా అంతే బాధ్యతగా వ్యవహరిస్తున్నారు, చక్కగా చదువుకుంటున్నారు. దీనికి నా భార్యాపిల్లలు నాకు పూర్తి సహకారాన్నిస్తున్నారు. ఇంతకన్నా నాకేం కావాలి? నా జీవితం పట్ల నాకెంతో తృప్తి ఉంది” అని చెబుతున్నప్పుడాయన కళ్లలో కోటి కాంతులు కనిపిస్తాయి.
స్పందన ఎడ్యుకేషనల్ సొసైటీ : 9440266783
ం అరుణ పప్పు
ఫోటోలు : ఉమా, గుంటూరు

