మరుగున పడిన మతాలు –మతా చార్యులు -12
పరా భౌతిక శాస్త్రం
పరా లేక అతీత భౌతిక శాస్త్రాన్ని ‘’మెటా ఫిజిక్స్ ‘’అంటారు ..ఈ శాస్త్రం అన్ని శాస్త్రాలకు మూలం అని చాలా మంది అభిప్రాయం .చేత బడులు చేసే వారు మొదలైన వారి వల్ల ఈ మధ్య అది అధిక్షేపానికి గురైంది .
ఒక పుస్తకానికి అతి భౌతిక శాస్త్రం అనే పేరు ముందేప్పుడో పెట్టారట .గ్రీకులో పుస్తక ప్రియుడు ‘’ఆండ్రోనికస్ ‘’అరిస్టాటిల్ రచనలన్ని సంపుటీకరణం చేశాడు .జ్ఞానం ,ప్రాధమిక దర్శనం ,ఈశ్వర మీమాంసల గురించి అరిస్టాటిల్ రాసిన 14 ప్రకరణాలను ,భౌతిక శాస్త్రానికి సంబంధించిన ఎనిమిది ప్రకరణాల నుండి వేరు చేసి వాటికి ‘’అతి భౌతిక శాస్త్రం ‘’అంటే భౌతిక శాస్త్రం తరువాతది అనే అర్ధం లో పేరు పెట్టాడు .ఇది లాటిన్ భాషలో ‘’మెటా ఫిజికా ‘’గా అనువాదం పొందింది అరిస్టాటిల్ చర్చించిన విశిష్ట విషయాలే కాకుండా వాటి లాంటి మరికొన్ని సమస్యల కు కూడా ఈ పేరునే వాడారు .మెటా అంటే పరా అని అతీతమని అర్ధం అరిస్టాటిల్ తరవాత ఎన్నో వందల ఏళ్ళకు ఈ పదం అతి భౌతికం అనే పేరు మీదనే చలామణి అయింది .
అరిస్టాటిల్ ఆండ్రోనికస్
అరిస్టాటిల్ వివేకం గురించి సామాన్య భావాలద్వారా పరిష్కరించాడు .ప్రత్యెక కళల, శాస్త్రాల ప్రత్యక్ష పరిచయం లోక రీత్యా సరి పోయిందే అయినప్పటికీ వస్తువు యొక్క స్తితికి కారణం తెలుసుకొని దృష్టాంత పూర్వకం గానే కాకుండా ,వాటి సూత్రాల చేత కూడా ఇతరులకు తెలియ జేసే వారు విజ్ఞాన వంతులు అని పించుకొంటారు .వస్తువుల మధ్య ఉన్న పరస్పర సంబంధాలను తెలుసుకొనే వాడు మహా జ్ఞాని . ప్రాధమికం గా జ్ఞానమే వివేకం .రోజు వారీ జీవితానికి దూరం గ ఉన్న వాటిని గురించిన జ్ఞానం చాలా అవసరం దాన్ని పొందటం దుర్లభం కూడా మిగిలిన వన్నీ దీనిపై ఆధార పడి ఉన్నందున ఇది ప్రాధమికం అని పించుకొంటుంది .అందుకే దీనికి ‘’ప్రాధమిక దర్శనం ‘’అనే పేరు కూడా వచ్చింది .
ఏ శాస్త్రం అయినా ఏదో ఒక సత్తా ను గురించి పరిశీలన చేస్తుంది గణిత సూత్రాల ఆధారం గా వస్తు పరిమాణం వైశాల్యం ఆకారం తెలుసుకో వచ్చు భౌతిక శాస్త్రం సజీవ నిర్జీవుల చలనాలను తెలుసుకోవచ్చు కనుక ప్రాధమిక సూత్రాలను పరిశీలించేదే ప్రాధమిక దర్శనం అవుతుంది .ఏ శాస్త్ర జ్ఞానానికి అయినా దానికి ఇతర జ్ఞాన క్షేత్రాలతో ఉన్న సంబంధాలను తెలుసుకోవాలి అనుకొనే వారికి ఈ సమస్యలు ప్రధానం అవుతాయి .అవి భౌతిక శాస్త్ర పరిధి దాటి ఉంటాయి కనుక ఇంతవరకు ప్రకృతికి అవతల ఉన్న సత్తా ను గురించి ప్రశ్నలు ఉత్పన్నం కాలేదు .ప్రాధమిక దర్శనానికి విశిష్ట విషయాల గూర్చి చర్చించాల్సిన అవసరం లేదు .
ఇతర శాస్త్రాల చర్చలకు విషయం కాని ఒక వస్తువును అరిస్టాటిల్ గుర్తించాడు .ఈశ్వరుడు నిత్యుడు ,పరిమాణాలకు అందని వాడుకనుక ఈశ్వర భావం ప్రక్రుతి శాస్త్రాల పరిధి లోకి రాదన్నాడు .అన్నిటికి ఈశ్వరుడే మూల కారణం కనుక ఆయనే మొదటి కారణం ,మొదటి తత్త్వం కూడా అవుతాడు . కనుక ఒక రకం గా మెటా ఫిజిక్స్ అనే ప్రాధమిక శాస్త్రమ్ ‘’ఈశ్వర శాస్త్రం ‘’అని కూడా పిలువ బడుతోంది .ఇదే నిత్య సత్య విషయాన్ని గురించి ఆలోచించేది .ఈశ్వరుడు కాని శుద్ధ సత్యం కాని లేక పోతే భౌతిక శాస్త్రమే ప్రాధమిక దర్శనం యొక్క ఇతర వ్యాపారాలను స్వీకరిస్తుందని మేధావి అరిస్టాటిల్ చెప్పాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11-9-13 ఉయ్యూరు

