బతుకుబాటలో కొండగుర్తులు
September 12, 2013
భాషా శాస్త్రంలో తులనాత్మక, చారిత్రక, వర్ణనాత్మక- మొదలైన శాఖలనేకం ఉంటాయి. వీటన్నింటిలోను విశేష కృషి చేసిన భాషా శాస్త్రవేత్తలు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో భద్రిరాజు కృష్ణమూర్తి ఒకరు. తెలుగులో ఆయన స్వరూపనిర్దేశం చేసిన మాండలిక వృత్తి పద కోశాల నిర్మాణం ఒక వినూత్న ప్రయత్నం. భారతీయ భాషల్లో ఇలాంటి ప్రయత్నం జరగటం అదే తొలిసారి. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన భద్రిరాజు రాసిన ఆత్మకథ ‘బతుకుబాటలో కొండ గుర్తులు’ నుంచి కొన్ని భాగాలు…
నా అమెరికా ప్రయాణం బారిష్టర్ పార్వతీశం లండన్ ప్రయాణాన్ని గుర్తుచేసేట్టు జరిగింది. నేనెప్పుడూ విమానం ఎక్కలేదు. అది మొదటి వింత. మదరాసు నుంచి బొంబాయికి రైల్లో వెళ్లాను. అక్కడ ఒక రాత్రి గడిపి మర్నాడు విమానాశ్రయానికి వెళ్లి కరాచీ వె ళ్లే డకోటా విమానం ఎక్కాను. ఆ రోజుల్లో వెయ్యి మైళ్లలోపు నగరాలకు డకోటా విమానాలే వెళ్తుండేవి. ఇరవై ప్రయాణికుల లోపే ఉంటారు. మేం ఎక్కిన విమానంలో శవపేటికలో పాకిస్తానుకు ఒక శవాన్ని తరలిస్తున్నారు. సీట్ల మధ్య జాగాలో ఆ శవపేటికను నిలువునా నేలమీద పెట్టారు. విమానంలో ఎక్కిన చాలామంది ‘ఫారిన్ వెళ్తుంటే ఇదేమి అశుభసూచకంరా బాబూ’ అని నాలానే లోపల అనుకొని ఉంటారు. అంతా అదోలా మొహం పెట్టుకొన్నారు. సముద్రం మీద డకోటా వెళ్తున్నప్పుడు బాగా ఊగుతూ భయపెట్టింది. దేవుళ్లందరినీ తలుచుకుంటూ, మా నాన్నని స్మరించుకుంటూ వెళ్లాను. కరాచీ సాయంత్రం 5 గంటలకు చేరాము. ఆ తరువాత ఎక్కవలసిన విమానం మర్నాడు ఉదయం వస్తుందని మమ్మల్ని ఆ రాత్రికి విమానాశ్రయం గదులలో ఉంచారు. అప్పుడు విదేశ ప్రయాణానికి వాడే ఒకే ఒక పెద్ద విమానాన్ని సూపర్ కాన్‌స్టలేషన్ అనేవారు.
సుమారు యాభైమంది పట్టవచ్చు. ఈ విమానం వేగం గంటకు 300 మైళ్లు కావచ్చు. ఎయిర్ ఫ్రాన్సుకు చెందిన ఆ విమానాన్ని కరాచీలో ఉదయం 10 గంటలకు ఎక్కితే సాయంత్రం 6 గంటలకు పారిస్ పట్టణం చేరాం. అంటే 13 గంటల ప్రయాణం (8+5 కాలమానం తేడా) అన్నమాట. దోవలో మూడు చోట్ల ఆగినట్లు గుర్తు. అమెరికా వెళ్లే విమానం అప్పటికే వెళ్లిపోవటం వల్ల, మర్నాడు సాయంత్రం నాలుగు గంటలకు రమ్మని చెబుతూ పారిస్‌లో ఆ రాత్రి ఒక హోటల్లో ఉండటానికి, భోజనాదికాలకు ఒక వోచర్ ఇచ్చారు. టాక్సీ ఖర్చుగూడా ఇచ్చి సూట్‌కేసుతో వెళ్లి మర్నాడు టైముకు రమ్మన్నారు. కారులో నుంచి పారిస్ పట్టణం చూసుకుంటూ రాత్రి ఏడుగంటలకు హోటల్ చేరి స్నానాదికాలు చేశాను.
అమెరికా కేంద్ర ప్రభుత్వం 1960లో నేషనల్ డిఫెన్స్ ఎడ్యుకేషనల్ యాక్ట్‌ను పాస్ చేసింది. అమెరికా దేశ అభ్యున్నతికి, దేశ సంరక్షణకు ప్రపంచంలోని ప్రధానమైన ఇతర భాషలు కూడా నేర్చుకున్న అమెరికన్ విద్యావంతులు ఉండాలనేది దాని లక్ష్యం. వివిధ రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో భాషాసంస్కృతి కేంద్రాలు ఏర్పాటు చేయటానికి కావలసిన ధనసహాయం నూటికి నూరుపాళ్లు కేంద్ర ప్రభుత్వమే చేసేది. 1959లో రష్యా దేశం అంతరిక్షంలోకి స్పుత్నిక్‌ను పంపించింది. అప్పటిదాకా అమెరికాలో అంతరిక్ష పరిశోధన ఏమీ జరగలేదు. తనకంటే ముందు రష్యా ఆ పని చేయటం అమెరికాకు అంతర్జాతీయంగా ఒక కుదుపు అయింది. రష్యాలో ప్రపంచభాషలు అన్నీ నేర్చుకున్నవారు ఉన్నారని, వారి విద్యావిధానం అమెరికన్ విద్యావిధానం కంటే విలక్షణమైనదని, విశిష్టమైనదనే ఊహ అమెరికాలో ఏర్పడ్డది. అప్పటికే రష్యావాళ్లు భారతదేశంలో ఉన్న ప్రధానభాషలన్నిటికీ వ్యాకరణాలు రాశారు. అలానే ఇతర ప్రపంచ భాషల వ్యాకరణాలూ తయారైనాయి. అన్ని ప్రధాన ప్రపంచ భాషలు మాట్లాడగలిగినవారు రష్యాలో ఉన్నారని, ఆ లోటు పూర్తి చేయటానికి విద్యావిధానంలో చాలా మార్పులు తేవాలని అమెరికావారు భావించారు.
ఈ ఉద్దేశంతో నేషనల్ డిఫెన్స్ యాక్ట్‌ను అమలుచేయటం మొదలుపెట్టారు. చాలా రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో దక్షిణాసియా భాషాశిక్షణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దీనివల్ల దక్కన్ కాలేజి ప్రోగ్రామ్ కింద భారత భాషల్లో పరిశోధన చేసి తిరిగివెళ్లినవాళ్లు వివిధ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పదవులు పొందగలిగారు. జెరాల్డ్ కెలీ విస్కాన్సిన్ యూనివర్సిటీ భాషాకేంద్రంలో తెలుగు, హిందీ అధ్యాపకుడు. విలియం బ్రైట్ లాస్ ఏంజలెస్‌లో ఉన్న సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో కన్నడ భాషాధ్యాపకుడు. గోర్డన్ ఫెయిర్ బాంక్స్ కార్నెల్‌లోనూ, జాన్ గంపర్జ్ కాలిఫోర్నియా, బర్కిలీలోనూ, సౌత్‌వర్త్ అనే ఆయన కొలంబియాలోనూ, రాబర్ట్‌కింగ్ అనే ఆయన టెక్సాస్ (ఆస్టిన్)లోనూ భాషాశాస్త్రశాఖల్లో అధ్యాపక పదవులు సంపాదించి భారత భాషా బోధనను ప్రోత్సహించారు. నేను చాలా విశ్వవిద్యాలయాలలో ఆహ్వానం పొందడానికి కారణం ఇదే.
బతుకుబాటలో కొండగుర్తులు
భద్రిరాజు కృష్ణమూర్తి ఆత్మకథ
పేజీలు : 214, ధర : రూ. 100
ప్రచురణ : ఎమెస్కో
ప్రతులకు: అన్ని పుస్తక కేంద్రాలు

