నాగావళి ‘ఛాయ’ – బి. సూర్యసాగర్
September 21, 2013
దాదాపు నాలుగు దశాబ్దాలుగా విప్లవ సాహితీ సాంస్కృతికోద్యమంలో రాజీలేని నిబద్దతా నిమగ్నతలతో అద్భుతమైన కవిత్వం సృజించాడు ఛాయరాజ్. ‘కేన్సర్’ బాధితుడై 65 ఏళ్ల వయసులో ఈ నెల 20న ఉదయం శ్రీకాకుళం పట్టణంలో ఆయన తుదిశ్వాస వదిలారు. గొప్ప కవిగానే కాకుండా ఉత్తమ ఉపాధ్యాయునిగా, దక్షతగల ప్రధానోపాధ్యాయునిగా, విప్లవ మేధావిగా, ఉపాధ్యాయ ఉద్యమ, విప్లవ సాహిత్యోద్యమ క్రియాశీల కార్యకర్తగా, నాయకుడుగా, స్నేహశీలిగా, ప్రేమ మూర్తిగా ఆయన ఆదర్శప్రాయమైన జీవితం గడిపారు. దశాబ్దకాలంగా జనసాహితి సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు.
ఆయన మరణానికి ముందు రోజునే ఆయన రచనలు ‘శ్రీకాకుళం’ (ఉద్యమ కథాకావ్యం) రెండవ ముద్రణ, కళింగ యుద్ధంపై రచించిన ‘కారువాకి’ నవల శ్రీకాకుళం పట్టణంలో ఆవిష్కరించారు. జనసాహితి ప్రచురణగా ఛాయరాజ్ రచనల సమగ్ర సంపుటి ముద్రణలో ఉంది. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ గడిపిన గత ఆరు మాసాలుగా మాత్రమే ఆయన కలం కదలలేదు. ప్రజా ఉద్యమాల్లో పాల్గొనలేక పోతున్నందుకు వేదన చెందేవారు. తీవ్ర అనారోగ్యాలను, శరీర రుగ్మతలను మనోబలంతో జయించిన వ్యక్తులు మనకు తెలుసు. తను కూడా తిరిగి కోలుకుంటానని ప్రజా ఉద్యమాల్లో పాల్గొనే సంతోషాన్ని పొందుతాననీ, ఉద్యమ కవిత్వాన్ని రాస్తూనే వుంటాననీ పలకరించ వచ్చిన వాళ్ళతో ఎంతో నిశ్చయంగా చెప్పేవారు. అది నెరవేరక పోవడం పెద్ద విషాదం.
దాదాపు ఐదు వందల పేజీల కవిత్వాన్ని, మూడు, నాలుగు వందల పేజీల వచనాన్ని (ఒక నవల, ఒక కథా సంపుటి, సాహిత్య వ్యాసాలు) ఆయన రచించారు. 1960, 70లలో సాగిన శ్రీకాకుళ గిరిజన రైతాంగ విప్లవ పోరాటాన్ని ‘శ్రీకాకుళం’ (ఉద్యమ కథాకావ్యం) పేరుతో అపురూపంగా కావ్యీకరించారు. అర్ధవలస, అర్ధ భూస్వామ్య భారత దోపిడీ సామాజికార్థిక రాజకీయ వ్యవస్థను రద్దు పరచే నూతన ప్రజాతంత్ర విప్లవోద్యమ విజయం మాత్రమే పీడిత ప్రజానీకానికి విముక్తిని కలిగిస్తుందన్నదే మార్క్సిస్టు-లెనినిస్టు అవగాహన. ఈ అవగాహనతో సాగిన తొలి దశ శ్రీకాకుళ పోరాట ప్రజాపంథా మార్గం శాస్త్రీయమైనదిగా భావించి ఛాయరాజ్ కావ్యీకరించారు. క్లిష్టమైన ఆ కర్తవ్యాన్ని ఆయన వాస్తవికంగా, అనన్య కవితా శక్తితో సాధించారు.
‘శ్రీకాకుళం’ కావ్యంతో పాటు ఆయన రచించిన ఇతర దీర్ఘ కావ్యాలు తెలుగు కవిత్వంలో ఆయనకు విశిష్ట స్థానాన్ని కల్పించాయి. దీర్ఘ కావ్యాల రచనకు ఛాయరాజ్ ఉద్యమ చిరునామాగా సుప్రసిద్ధులయ్యారు. దర్శని, గుమ్మ, నిరీక్షణ, బుదడు, దుఖ్కేరు, రసస్పర్శ, తొలెరుక దీర్ఘ కావ్యాలు ఆయన మహత్తర కవితా శక్తికి సాక్ష్యాలు.
‘మట్టి నన్ను మవునంగా వుండనీదు’ కవితా సంపుటిలోని కవితలు గాక పుస్తకరూపంలోకి ఇంకా రావాల్సిన వందల కవితలు రాశారు. ఆయన కవితాభివ్యక్తి ప్రత్యేకమైనది. ఎన్ని వందల కవితల మధ్యనైనా ఆయన కవిత్వాన్ని గుర్తుపట్టవచ్చు. శక్తిమంతమైన భాషాప్రయోగాన్ని, శ్రీకాకుళ ప్రాంత పలుకుబడులను తనదైన రీతిలో కవితా ఊహాశక్తితో జోడించి వినూత్న కవితా ఇమేజరీని సృజించుకున్నారు ఛాయరాజ్. కవిత్వ నిర్వహణలో గొప్ప ఉపజ్ఞను ప్రదర్శించారు. దుగ్గేరు ప్రాంతంలో గ్రామీణ వ్యవసాయ కుటుంబాల శ్రమను, సంస్కృతినీ గొప్పగా గానం చేసిన కావ్యం దుఖ్కేరు. కవితామ తల్లిని రసోజ్వలంగా ఆవాహన చేసిన కావ్యం రసస్పర్శ. కవిత్వ ఆదర్శాలను, లక్ష్యాలను మహోన్నతంగా నిర్వచించిన కావ్యం ఇది. శ్రీశ్రీ కవితా! ఓ కవితా గేయానికి మహత్తర కొనసాగింపు.
బుదడు దీర్ఘ కవిత కాల్పనిక సాహిత్యంలో ఒక అద్భుత ప్రయోగం. ఒక నదీ కన్య బిడ్డడుగా పదేళ్ళ అనాథ బాలుడు, అలనాటి గిరిజన యోధుడు బిర్సా ముందా మొదలు శ్రీకాకుళం చినబాబు వరకు పదే పదే ప్రత్యక్షమవుతూ నిరంతరం విప్లవ సంకేతంగా నిలిచాడు ఈ కావ్యంలో. భూగోళ దిగంతాలను ఏకం చేస్తూ ఊగించిన విప్లవ శిశువు గుమ్మ సూర్య మండలం పుట్టుక నుంచి ప్రకృతి పరిణామాన్ని, మానవ పరిణామాన్ని, సమాజ గమనాన్ని, వర్గ పోరాటాలను, స్త్రీ పురుష సంబంధాల గతి తర్కాన్ని, తాత్వీకరించి కవిత్వీకరించారు దర్శని కావ్యంలో ఛాయరాజ్. గొప్ప తాత్విక జిజ్ఞాస, మానవత్వ విలువలు ఈ కావ్యంలో అనుభూతమవుతాయి.
కవి ఛాయరాజ్ మరణం తెలుగు సాహిత్యానికి పూరించలేని లోటు. ఆయన్ను తెలిసిన వాళ్ళకు నాగావళి లేని శ్రీకాకుళాన్ని ఊహించడం ఎంత కష్టమో ఛాయరాజ్ లేని శ్రీకాకుళాన్ని ఊహించడం అంతే కష్టం. ఆయన రాసిన గొప్ప కవిత్వంలో, ఆయన ప్రేమించిన ప్రజా పోరాటాల్లో ఆయన జీవించే వుంటారు.
– బి. సూర్యసాగర్


ఛాయారాజ్ వ్యక్తిగతంగా కూడా(ఆయన రచనల ద్వారా కూడా)నాకు తెలుసును.ఆయన మరణానికి నా సంతాపం తెలియజేస్తున్నాను.
LikeLike