ఆ ఘాటు తెనాలిదే!
September 22, 2013
శారద డైలాగులు చెప్పిందంటే సినిమా హాలు దద్దరిల్లిపోయేది. మీసాలు మెలేసే విలన్లకు సైతం ముచ్చెమటలు పట్టించేదామె. అక్రమాలు, అన్యాయాలు జరిగినప్పుడు.. ఇదేమి న్యాయం? అని నిలదీసిందంటే చాలు.. ఎదుటివాడు నీళ్లు నమలాల్సిందే! అంత కఠోరమైన పాత్రలే కాదు వెన్నముద్దలా కరిగిపోయే ఆత్మీయ పాత్రల్నీ పోషించింది శారద. ఆ పౌరుషం, ఆ ధైర్యం, ఆ లాలిత్యం… ఎక్కడి నుంచి వచ్చాయి? అదంతా నటనే కావొచ్చు. కానీ ఆ నటనకు ఎక్కడో పునాది పడే ఉండాలి. ఆ మూలాలు ఎక్కడో ఉండే ఉండాలి. అవన్నీ తను పుట్టిన తెనాలిలోనే ఉన్నాయంటూ గర్వంగా చెబుతోంది మూడుసార్లు ఊర్వశి అవార్డు గెలుచుకున్న నటి శారద. సొంతూర్లోని.. నాన్నగారి అమ్మమ్మ ఆదిలక్ష్మి మొండితనం, పక్కింటి మాణిక్యమ్మ ప్రేమతనం, ప్రధానోపాధ్యాయురాలు సుభద్రమ్మ స్ఫూర్తి… ఎలా మరిచిపోతాను చెప్పండి.. అంటూ మొదలుపెట్టారు..
మా ఊరు ఆంధ్రా ప్యారిస్‌గా పిలవబడే తెనాలి. కాంచనమాల, కళావాచస్పతి కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు వంటి మహానటుల పుట్టిల్లు అది. కొత్తపేట, పాత బ్రాహ్మణ వీధిలోని కాంచనమాల ఇంటి సమీపంలోనే మా ఇల్లు వుండేది. మాది వ్యవసాయ కుటుంబం. అమ్మ సత్యవతీ దేవి, నాన్న వెంకటేశ్వర్లు. ‘మేమిద్దరం-మాకిద్దరు’ తరహాలో అమ్మనాన్నలకు నేను, నా తమ్ముడు ఉండేవాళ్లం. మేముండే వీధిలో మొత్తం బ్రాహ్మణులే ఉండేవారు. నిత్యం ఏదో ఒక వ్రతం, హోమం, పూజలు సాగుతుండేవి. సంస్కృతీ సంప్రదాయాలకు పెట్టింది పేరు అన్నట్లు ఉండేది ఆ వీధి వాతావరణం. అందుకే చదువు, నృత్యం, సంగీతం అన్నీ బ్రాహ్మణ గురువుల దగ్గరే నేర్చుకున్నాను నేను. మా వీధిలో బ్రాహ్మణుల తర్వాత వైద్యులు, న్యాయవాదులు ఎక్కువగా ఉండేవారు. ఇంట్లో అయితే నన్నందరూ ‘పాపా’ అని ముద్దుగా పిలవడం ఇప్పటికీ గుర్తుంది. అప్పట్లో తెనాలిలోని కొత్తపేటలో పదో, పదిహేనో ఇళ్లు వుండేవి.
ఆ గురువులంటే ఇప్పటికీ భయమే..
నాన్నగారి అమ్మమ్మ బాగా ధనవంతురాలు. మా కుటుంబం ఆమెతోనే వుండేది. అయితే మా హయాం వచ్చేటప్పటికి అన్నీ పోయాయి. నాన్న నగల వ్యాపారంతో పాటు మరికొన్ని రకాల వ్యాపారాలు చేస్తుండేవారు. చిన్నప్పుడు నేను బాగా బలహీనంగా వుండేదాన్ని. ఒకసారి కాళ్లకు అనారోగ్యం చేయడంతో ఎక్సర్‌సైజ్‌లు చేయాలని వైద్యులు సూచించారు. దాంతో నన్ను నృత్యశిక్షణకు పంపింది అమ్మ. లంకా సూర్యనారాయణగారు నా నృత్య గురువు. ఆయన ముక్కోపి. చదువు నేర్పే గురువు కోదండంగారు. ఆయనా అంతే! క్రమశిక్షణ తప్పితే సహించేవారే కాదు. బాగా చదవని వారిని తాడుకు వేలాడదీస్తుంటే భయపడి చచ్చేవారందరూ. ఆడపిల్లల్ని మాత్రం పెద్దగా శిక్షించేవారు కాదనుకోండి. అయితే స్కూలు ముగిశాక కూడా సాయంత్రం మళ్లీ క్లాసుకు రమ్మనేవారాయన. దాంతో ఆ తరగతులు ఎగ్గొట్టడానికి నేను చేయని ప్రయత్నం లేదు.
సరిగమలు నా వల్ల కాలేదు..
అమ్మ పాటలు బాగా పాడేది. ఆమెకు సంగీతంలో ప్రావీణ్యముంది. దాంతో నన్ను సంగీత శిక్షణకు కూడా పంపింది. నా సంగీత గురువు రామ్మూర్తిగారు. అప్పట్లో ఆయన తమిళనాడు నుంచి వచ్చి తెనాలిలో స్థిరపడ్డారు. సంవత్సరం పాటు ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నా ఫలితం లేదు. కనీసం సరిగమలు కూడా రాలేదు. దాంతో ఆయన ఒక రోజు – ‘అమ్మ తల్లీ! నీకు సంగీతం నేర్పడం నా వల్ల్ల కాదు. ఇక వెళ్లండి’ అంటూ చేతులెత్తేశారు. అయితే ఆయన గురించి ఇక్కడో విషయం చెప్పుకోవడం ధర్మం. నేను మంచి నటిని అవుతానని మొదట గుర్తించింది మాత్రం ఆయనే! నటనారంగం వైపు వెళితే ఫలితం ఉంటుందని సూచించారాయన. అప్పటికి నా వయసు 11 ఏళ్లు. నాన్న బర్మా వెళ్లడానికని మద్రాసు వెళ్లడంతో మా కుటుంబమంతా ఆయనతోపాటే మద్రాసు వచ్చింది. ఆ సమయంలో అనుకోకుండా ‘కన్యాశుల్కం’ సినిమాలో నటించే అవకాశం దొరికింది. బొమ్మలపెళ్లి సీనులో పెళ్లికొడుకు తల్లిగా నటించింది నేనే. ఆ విషయం చాలామందికి తెలియదు. ఎన్‌టీఆర్ గారి సరసన కనిపిస్తాను. ఇప్పటికీ ఆ సినిమా చూస్తే నవ్వొస్తుంటుంది. తరువాత మళ్లీ తెనాలి వెళ్లిపోయాం. పదమూడవ ఏట నాటకాల్లోకి ప్రవేశించాను. అప్పట్లో నాటకాల్లో ఆడవేషాలను మగవారే వేసేవాళ్లు కాబట్టి ఆడవేషాలకు నేను ఓకే అనడంతో అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి.
ఎన్ని ఆంక్షలు పెట్టేదో!
అమ్మా-నాన్న వ్యాపార నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లిపోయినప్పుడు మా అమ్మమ్మే నన్ను పెంచింది. ఆమె పేరు బండి కనకమ్మ. నాన్నగారి అమ్మమ్మ పేరు జొన్నాది ఆదిలక్ష్మి.
ఇక మా మేనత్త పుట్టా సుశీలమ్మ మంచి ధైర్యవంతురాలు. వారంతా మహా గడసరులు. మా అమ్మేమో సాదు స్వభావి. బహుశా నేను సినిమాల్లో మొండి స్వభావం కలిగిన పాత్రలు, సౌమ్యమైన పాత్రలు పండించడానికి వారందరే కారణం అనిపిస్తుంది. వాళ్లందరి ప్రభావం నా మీద ఎంతో ఉంది. నాటకాల సమయంలో అమ్మమ్మ ఎన్ని ఆంక్షలంటే అన్ని ఆంక్షలు పెట్టేది. ఇప్పుడవన్నీ తల్చుకుంటే నవ్వొస్తుంది. ఒప్పందంలో “ఆదివారం మాత్రమే నాటకాల రిహార్సల్స్ ఉండాలి. హీరో అనేవాడు మా అమ్మాయికి దూరంగా నిలబడే డైలాగులు చెప్పాలి..” అని కండీషన్లు పెట్టేవారామె. ఎవర్నీ నన్ను ముట్టుకోనిచ్చేది కాదు. ఆమె కండీషన్లన్నింటికీ ఒప్పుకోక తప్పేది కాదు వాళ్లకు. ఆమె వాలకం చూసి నాటక నిర్వాహకులే జడుసుకునేవారు.
మహా మొండి ఆదెమ్మ
మా నాన్నగారి అమ్మమ్మ జొన్నాది ఆదిలక్ష్మి గురించి ఎంత చెప్పినా తక్కువే! ఆమె ఎంత మొండిదంటే -చూపు సరిగా లేకపోయినా సరే, ఇరవై ఏళ్లపాటు అందర్నీ గడగడలాడించింది. ఆమెకు భర్తతో విభేదాలు ఉండేవి. అప్పుడు రేపల్లెలో కోర్టు వుండేది. అందులో జడ్జీలు ఆంగ్లేయులు. కేసుకు సంబంధించి వాదోపవాదాలన్నీ విన్న తర్వాత.. ఆఖరికి ఆమె భర్తదే తప్పు అని తేల్చారు జడ్జీలు. వారే స్వయంగా తీర్పు ఇవ్వకుండా “ఆదిలక్ష్మి గారూ! మీ భర్తకు ఏం శిక్ష వేద్దాం” అని ఆమెను అడిగారట. “మా ఆయనకు, అతనికి వత్తాసు పలుకుతూ సాక్ష్యం చెప్పిన వారికి.. రేపల్లె నుంచి తెనాలి వరకు చిప్ప పట్టుకుని అడుక్కుంటూ నడిచొచ్చేలా తీర్పివ్వండి సారూ” అని కోరిందట ఆదిలక్ష్మి. దాంతో సాక్షులు వచ్చి ఆమె కాళ్లపై పడ్డారట. ఆ రోజుల్లో మా ఇంటికి దొంగల బెడద తీవ్రంగా వుండేది. అప్పుడప్పుడు మేమంతా బయటి ఊరుకు వెళ్లాల్సి వచ్చినా ఆమె ఒక్కతే ఇంట్లో వుండేది. దేనికీ జంకే రకం కాదు.
నాటకాల బిజీలో పడిపోవడం వల్ల.. నా చదువు దెబ్బతింది. 14వ ఏటనే మద్రాస్‌కి వచ్చేశాను. రాజారావు అనే నిర్మాత సినిమాలో వేషం వుందంటే ఇక్కడికొచ్చాం. కానీ నాన్న వద్దన్నారు. ‘ఇంత అల్లరి పిల్ల సినిమాల్లో ఏం నటిస్తుంది’ అని ఆయన సందేహం. అయితే అమ్మ ఆయనకు సర్దిచెప్పి ఎలాగో ఒప్పించగలిగింది. సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్లిన నాకు.. ‘రక్త కన్నీరు’ నాటకంలో నాగభూషణం సరసన హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. ఉదయమంతా రిహార్సల్స్, సాయంత్రం నాటక ప్రదర్శన. చిన్నపిల్లను కావడంతో నిద్ర ముంచుకొచ్చేది. ఎప్పుడెప్పుడు నాటకం ఆయిపోతుందా అని లోలోపల మధనపడేదాన్ని. అటువంటి ఇబ్బందులున్నా అవన్నీ మరపురాని రోజులు.
శారద కాదు సరస్వతీదేవి..
నా అసలు పేరు సరస్వతీ దేవి. మా నాన్న మొదటి భార్య పేరది. ఆమె19వ ఏటనే చనిపోవడంతో ఆమెపై వున్న మమకారంతో నాన్న నాకా పేరు పెట్టారట. అయితే నేను సినిమాల్లోకి వచ్చేటప్పటికే చాలామంది సరస్వతులు వుండడంతో.. ఫ్రూట్ సుబ్బారావు అనే బ్రాహ్మణయ్య, నాన్నగారు కలిసి నా పేరును ‘శారద’గా మార్చారు. శారద అన్నా, సరస్వతి అన్నా ఒకటే అర్థం కదా! నేను మద్రాసుకు వచ్చాక ఎల్‌వీ ప్రసాద్ కార్యాలయంలో నటన నేర్చుకునేదాన్ని. అప్పుడే అక్కినేని నాగేశ్వరరావుగారి ‘ఇద్దరు మిత్రులు’ సినిమాలో చెల్లి వేషం ఇచ్చారు. ఆ పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. షూటింగ్ సమయంలోనే అక్కినేనిగారి వద్ద నటనలో మెళకువలు నేర్చుకున్నాను. అందుకే నాకు నటనలో ఓనమాలు నేర్పింది ఎల్‌వీ ప్రసాద్‌గారయితే, అఆలు నేర్పింది అక్కినేనిగారని చెబుతాను. మొత్తమ్మీద ఎన్‌టీఆర్‌గారి సినిమాతో రంగప్రవేశం, ఏఎన్ఆర్‌గారి చిత్రంతో ప్రముఖ పాత్రపోషణ జరిగాయి.
జానకి మంచి ఫ్రెండ్
చిన్నప్పుడు నేను బయటి నుంచి ఇంట్లోకి రాగానే నా నెత్తిపై చేయి వేసి చూసేవారు మా నాన్నగారు. తల వేడిగా వుందనుకోండి. నేను ఎండలో చెడ తిరిగానని అర్థం. వెంటనే నాలుగు పీకేవారాయన. అందుకే నాన్నను చూస్తేనే భయమేసేది. ఆ భయం ఇప్పటికీ నాలో ఉండిపోయింది.
బాల్య స్నేహమనేది ఆనందకరమైన అనుభూతి. చిన్నతనంలోనే మద్రాసు వచ్చేసినా సరే, చిన్ననాటి స్నేహితులెంతో మంది వున్నారు నాకు మా ఊర్లో. డాక్టర్ కృష్ణకుమారి అని ఇప్పుడు హైదరాబాద్‌లో వుంటోంది. ఆమె అంటే నాకు ఎంతో అభిమానం. భీష్మ సుజాత కూడా ‘పాపా.. పాపా’ అంటూ నా వెంట పడేది. ఓసారి నేను ఊటీలో షూటింగ్‌లో ఉన్నాను.
అప్పుడు అనుకోకుండా కల్యాణి అనే స్నేహితురాలు కలిసింది. ఎంత సంతోషమేసిందో చెప్పలేను. ఎప్పుడో ఊర్లోని చెట్టుపుట్టల వెంట తిరిగిన మేము అలా షూటింగ్‌లో కలుసుకోవడం అద్భుతం అనిపించింది. మా ఊరి స్నేహితులతోపాటు గాయని ఎస్.జానకి కూడా నాకు మంచి స్నేహితురాలు. 53 ఏళ్లుగా మా స్నేహం అలాగే ఉంది. నాకంటే ఆమె ఏడేళ్లు పెద్దది. జానకి ఎంతోమందికి పాటలు పాడింది. అలాంటి ఆమె నేను పాటలు పాడుతుంటే ఆమె నృత్యం చేసేది. సరదాకే అనుకోండి. జానకి బయటకు చాలా సౌమ్యురాలు కానీ లోపల మాత్రం అల్లరిపిల్ల. జానకి భర్త రాంప్రసాద్‌కు కూడా నేనంటే అమితమైన అభిమానం. పాటలు పాడడానికి పనికి రానని గెంటి వేయించుకున్న నేను.. ప్రముఖ గాయని నృత్యానికి పాట పాడడమేంటి? ఆ అనుభూతే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. స్నేహితుల గురించి చెబుతున్నాను కాబట్టి.. రావి కొండలరావు గారి సతీమణి రాధాకుమారినీ తల్చుకోవాలి. ఆమె కూడా నాకు మంచి ఫ్రెండ్.
వాళ్లు లేని తెనాలి..
ఇంటి చుట్టుపక్కల గోడలెక్కడం, చెట్లెక్కడంలో మనది అందె వేసిన చేయి. చెట్లెక్కి దానిమ్మ పండ్లు, నారింజ పండ్లు కోసి స్నేహితులందరికీపంచేదాన్ని. మా ఇంటి దగ్గర మాణిక్యమ్మ అనే ఆవిడ వుండేవారు. ఆమెకు నేనంటే ఎంతో ఇష్టం. నా స్నేహితులందరినీ దొంగలనేది. నన్ను మాత్రం ఏమీ అనేది కాదు. నేను మంచిదాన్నని ఆమె నమ్మకం. కానీ అసలు దొంగను నేనేనన్న విషయం ఆమెకు తెలీదు. మధ్యాహ్నం ఆమె పెరట్లో వున్న నారింజ చెట్టు పండ్లన్నీ కోసేదాన్ని. నేను చెట్టెక్కి కాయలు కోస్తుంటే పిల్లలంతా కిందుండి ఏరుకునేవారు. సాయంత్రం అయ్యేసరికి చెట్టంతా బోసిపోయేది. దాన్ని చూసి.. మాణిక్యమ్మ గగ్గోలు పెట్టేది. అలాంటి మాణిక్యమ్మ.. నేను సినిమాల్లోకి వచ్చిన తరువాత కేవలం నా కోసమే మద్రాసుకు వస్తుండేవారు. ఆమె అంత దూరం రావడానికి కారణం? మా ఊరే. అదే ఇద్దరినీ కలిపింది. నేను షూటింగ్‌లలో బిజీగా ఉండిపోయి, ఇంటికి రాకపోయినా మూడునాలుగు రోజులపాటు అక్కడే ఎదురుచూసేవారామె. నేను ఎప్పుడు ఇంటికొస్తే అప్పుడు వచ్చిఎంతోకొంత డబ్బులు చేతిలోపెట్టి వెళ్లేవారు. నేను బాగానే సంపాదిస్తున్నానని ఆమెకు తెలుసు. అయినా అభిమానంతో ఇచ్చేది. అలాంటి మాణిక్యమ్మ చనిపోయినప్పుడు నేనెంతో బాధపడ్డాను.
అదే వేదిక మీద..
నేను తెనాలిలో ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు మా స్కూల్లోనే చదివి ఐఏఎస్ అధికారి అయిన ఓ మహిళను సన్మానించారు ఒకసారి. విద్యార్థినులంతా ఆమెను చూసి నేర్చుకోవాలని, ఆమెలా అందరూ ఉన్నతస్థానానికి ఎదగాలని హెడ్‌మిస్ట్రెస్ సుభద్రమ్మ చెప్పుకొచ్చారు. అప్పుడే తీర్మానించుకున్నాను నేను. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే, వాటిని అధిగమించి.. విజయం సాధించి.. ఇలాంటి సన్మానం పొందాలని. ఆ స్కూలు నుంచి సరస్వతీదేవిగా బయటపడిన నేను.. కొన్నేళ్ల తర్వాత జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుని శారదగా అదే వేదిక మీద సత్కారం పొందాను. సన్మానం రోజున వేదికపై కూర్చోగానే కన్నీరు ఆగలేదు. నాలో ఈ స్ఫూర్తిని రగిలించిన సుభద్రమ్మగారు లేరప్పటికి. నాతో కలిసి చదువుకున్నస్నేహితులెవ్వరూ కూడా లేరప్పటికి. మాణిక్యమ్మ, సుభద్రమ్మలు లేని తెనాలిని ఎలా ఊహించుకోగలను? మీరే చెప్పండి.
1996లో తెనాలి నియోజకవర్గానికి ఎంపీనయ్యాను. అయినా నా నియోజకవర్గం మొత్తానికి న్యాయం చేయడానికి ప్రయత్నించాను తప్ప, నేను పుట్టిన ప్రాంతమన్న స్వార్థంతో ఒక్క తెనాలి పట్టణం గురించే ఆలోచించలేదు. నా స్వస్థలం అభివృద్ధికి ఏదో ఒకటి చేయాలని వుంది ఇప్పటికీ. ఏదో ఒక రోజు ఆ సమయం వస్తుందనుకుంటున్నా.
– డాక్టర్ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా
చెన్నై ప్రతినిధి
ఫోటోలు: కర్రి శ్రీనివాస్, గుంటూరు సతీష్
అమ్మమ్మ అర్ధరూపాయి..
ఒకసారి అమ్మమ్మ ఎక్కడో యాభై పైసలు పోగొట్టుకుంది. ఎంత వెతికినా అది దొరకలేదు. అది నాకు చిక్కింది. అప్పట్లో యాభై పైసలకు విలువ వుండేది. అందుకని ఆ డబ్బును ఎక్కడ, ఎలా దాచుకోవాలోనని తెగ టెన్షన్ పడ్డాను. ఆలోచించి.. ఆలోచించి.. ఆఖరికి ఓ గొయ్యి తీసి అందులో భద్రంగా దాచిపెట్టేశా! ప్రతి రోజు వెళ్లడం, ఆ గొయ్యి మీదున్న మట్టిని తవ్వడం, డబ్బును చూసుకుని మురిసిపోవడం ఇదే పని. కొన్నాళ్లయ్యాక ఇంట్లో విషయం తెలిసి భలే నవ్వుకున్నారు.
అమ్మ, ఊరు..
నాకు ఊరన్నా, అమ్మన్నా ప్రాణం. ఊరు నాలోని నటికి బీజం వేస్తే, అమ్మ ప్రాణం పోసింది. అలాంటి అమ్మ – నేనొక సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు మరణశయ్యపై వుంది. ఆ బాధతోనే కోర్టు సన్నివేశ చిత్రీకరణలో నటించాల్సి వచ్చింది. కోర్టు సీన్ ముగిసేటప్పటికి అమ్మ చనిపోయిందనే వార్త వచ్చింది. మా వంశంలో నటులు లేరు. అందుకే నేను గొప్ప నటిని కావాలని మా అమ్మ ఎన్నో కలలుగన్నది. ఆమె మరణం ఏడాది వరకు నన్ను వెంటాడింది.
అమ్మా! మీరే రక్షించాలి!
నేను మద్రాసులో ఉన్నప్పుడు మా ఊరి నుంచి కొందరు వచ్చేవారు. ఇంటికి రాగానే “అమ్మా! సినిమాల్లో మీ డైలాగులు విన్న మా భార్యలు.. ఇళ్లలో మాకు సరిగా కూడు కూడా పెట్టడం లేదు. ప్రతిదాన్నీ ప్రశ్నిస్తున్నారు. అదేమంటే న్యాయాన్యాయాల గురించి నిలదీస్తున్నారు” అని వాపోయేవారు. నటన అనేది ప్రజల్ని ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తుందో అప్పుడు అర్థమైంది నాకు.
—

