సాటి మనిషి సేవలతోనే జీవితానికి సార్థకత

సాటి మనిషి సేవలతోనే జీవితానికి సార్థకత

మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన ఊట్ల అప్పారావు డబుల్ ఎంఏ చదివి, తన ప్రతిభతో 1964లో ఐపిఎస్ అధికారిగా ఎంపికయ్యారు. అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపటంతోపాటు నేరస్థులను అణచివేసి శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడ్డారు. రాష్ట్రంలో అవినీతి నిరోధకశాఖ అదనపు డైరెక్టరుగా, పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ విభాగం ఐజీగా, ఇంటలిజెన్స్ విభాగం ఐజీగా, నగర పోలీసు కమిషనర్‌గా,ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టరుగా 36 సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ చేశాక, ప్రజాసేవే పరమావధిగా భావించి తన పూర్తి కాలాన్ని స్వచ్ఛంద సేవలకు వెచ్చిస్తున్న అప్పారావు చెబుతున్న కబుర్లు ఈ వారం ‘సెకండ్ ఇన్నింగ్స్’.

అవార్డులెన్నో…
ఇండియన్ పోలీసు అధికారిగా 36 సంవత్సరాలు పనిచేసి డీజీపీ కేడరులో పదవీ విరమణ చేసిన వి. అప్పారావు విధి నిర్వహణలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా పలు అవార్డులు లభించాయి. ఆయన సర్వీసులో చేసిన సేవలకు గాను నాలుగు మే డే అవార్డులు, అయిదు పోలీసు మెడల్స్, 22 ప్రశంసాపత్రాలు వచ్చాయి. 1982, 1988వ సంవత్సరాల్లో పోలీసు ఉన్నతాధికారిగా చేసిన అత్యున్నతమైన పనితీరుకు గుర్తింపుగా రెండు ప్రెసిడెంట్ మెడల్స్ వచ్చాయి. నలుగురు ముఖ్యమంత్రులు టి. అంజయ్య, ఎన్.టి. రామారావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిల నుంచి వి. అప్పారావు మెడల్స్ అందుకున్నారు.

మాది గుంటూరు జిల్లా బాపట్ల మండలం నర్సాయపాలెం గ్రామం. నా పాఠశాల, కళాశాల విద్య పూర్తయ్యాక విశాఖపట్టణంలోని ఆంధ్రాయూనివర్శిటీలో పోస్టుగ్రాడ్యుయేషన్ చేశాను. అనంతరం ఢిల్లీ యూనివర్శిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డబుల్ ఎంఏ చదివాను. 1964వ సంవత్సరంలో ఇండియన్ పోలీసు సర్వీసు అధికారిగా ఎంపికయ్యాను. శిక్షణ అనంతరం ఒరిస్సా కేడర్ ఐపిఎస్ అధికారిగా విధుల్లో చేరాను. ఒరిస్సాలోని గంజాం, కటక్ జిల్లాల ఎస్పీగా 12 ఏళ్ల పాటు సమర్థంగా పనిచేసి, సొంత రాష్ట్రం కేడర్‌కు మారాను.
ప్రజాసేవంటే ఇష్టం
ఐపిఎస్ అధికారిగా వివిధ హోదాల్లో 36 ఏళ్లపాటు సేవలందించాను. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా రెండుసార్లు పనిచేసినపుడు నేరస్థులు, రౌడీలు, వ్యభిచార ముఠాల ఆగడాలకు తెరవేశాను. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి చర్యలు తీసుకొని శాంతిభద్రతలను పరిరక్షించాను. విదేశాల్లో శిక్షణ తీసుకొని కేసుల విచారణలో ఆధునిక పద్ధతులను అవలంభించాను. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టరుగా నాలుగేళ్లపాటు పనిచేసి, ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాను.
కఠినంగా వ్యవహరించా
1983వ సంవత్సరంలో రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ అధికారిగా దాడులు చేసి 60 మంది అక్రమార్కుల ఆట కట్టించాను. సబ్ రిజిస్ట్రార్ నుంచి ఐఎఎస్ అధికారుల దాకా అవినీతికి పాల్పడుతున్న పెద్ద చేపలను పట్టుకున్నాను. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అక్రమాల బాగోతాన్ని అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు దృష్టికి తీసుకువెళ్లి ఆయన సలహాతో సాక్షాత్త్తూ మంత్రి లంచం తీసుకుం టుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని, డిస్మిస్ చేయించాను. పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ విభాగం కమిషనర్‌గా పనిచేసినప్పుడు రాష్ట్రంలో రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం సజావుగా అమలు అయ్యేలా చూశాను. రాష్ట్రం నుంచి ఒక్క బియ్యం గింజ కూడా సరిహద్దులు దాటకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నాను. బ్లాక్‌మార్కెటీర్లు, కల్తీ సిమెంటు తయారీదారుల ఆటకట్టించాను. నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వలపై దాడులు చేసి, 84 మంది బ్లాక్‌మార్కెటీర్లపై పీడీ కేసులు పెట్టాను. 2000 సంవత్సరంలో డీజీపీ కేడరు అధికారిగా పదవీ విరమణ చేశాను. అనంతరం ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించాను. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగుల ఎంపికను ప్రతిభ ఆధారంగా, పారదర్శకంగా చేపట్టి అభ్యర్థుల మన్ననలు పొందాను. నా కుమారుడు అమెరికాలో ఇంజనీరుగా పనిచేసి తిరిగి వచ్చి ఫార్మస్యూటికల్ కంపెనీ నిర్వహించుకుంటున్నారు. నా కుమార్తె మల్టీస్పెషలిస్టు డాక్టరుగా అమెరికాలో వైద్యసేవలందిస్తున్నారు. నా ఇద్దరు పిల్లలు వారి వారి వ్యాపకాల్లో మునిగిపోయారు. దీంతో నేను నా భార్య శ్రీదేవి కలిసి నాకొచ్చే ఆదాయాన్ని ప్రజాసేవకే వెచ్చిస్తున్నాం. బోన్సాయ్ మొక్కల పెంపకం అంటే నాతోపాటు నా శ్రీమతికి ఎంతో ఇష్టం. ప్రతి రోజూ ఉదయాన్నే రెండు గంటలపాటు మొక్కలకు నీరు పోసి, వాటి ఆలనాపాలనలో నిమగ్నమవుతుంటాను. అనంతరం నా సమయాన్ని నా స్వగ్రామంతోపాటు పేదల సేవలకే వెచ్చిస్తున్నాను.
అతిధి గృహాల నిర్మాణం
తిరుమలలో వేంకటేశ్వరస్వామి సన్నిధిలో భక్తుల కోసం ప్రత్యేకంగా 2000 సంవత్సరంలో ఓ అతిథి గృహాన్ని నిర్మించాను. అనంతరం 2011లో తిరుమలలోని పద్మావతినగర్‌లో మా బావగారితో కలిసి 1.12 కోట్ల రూపాయల విరాళంతో మరో అతి«థి గృహాన్ని నిర్మించి తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించాను. పదవీ విరమణ తర్వాత హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కార్మికులను తీసుకు వెళ్లి, తిరుమలలో నాలుగు నెలల పాటు ఉండి, భక్తుల కోసం అతి«థి గృహాన్ని నిర్మించాను. విరాళంగా అందించిన అతిథి గృహం ద్వారా స్వామివారికి ప్రతిరోజు 23,500 రూపాయల ఆదాయం వస్తోంది.
ఇల్లు విరాళం
మా స్వగ్రామమైన నర్సాయపాలెంలో అర ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఇంటిని 24 లక్షల రూపాయలతో మరమ్మతులు చేయించి, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి విరాళంగా అందిస్తున్నాను. మూడు నెలలు గ్రామంలోనే ఉండి పాత ఇంటికి దగ్గరుండి ఆస్పత్రికి అనువుగా పనులు చేయించాను. గ్రామంలోని ప్రజలకు ఉచితంగా వైద్యసేవలందించేలా పీహెచ్‌సీతోపాటు డాక్టరు, వైద్య సిబ్బంది నివాసముండేలా క్వార్టర్‌లు నిర్మించాను. మా బావగారైన కన్నెగంటి పాపారావు గారి ప్రోద్బలంతో ఇంటిని ఆసుపత్రికి విరాళంగా అందించి, దానికి ఊట్ల కన్నెగంటి హాస్పిటల్‌గా పేరు పెట్టాను. గతంలో మా తాత పేరుతో గ్రామంలో ఉన్నత పాఠశాల భవనం కట్టించాను.
మరుగుదొడ్ల నిర్మాణం
గ్రామంలో ఎస్సీ,ఎస్టీలు, బీసీలు, నిరుపేదలు ఎక్కువగా నివాసముంటున్నారు. వారికి ఇళ్లల్లో కనీసం మరుగుదొడ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని మా మేనకోడలైన పోస్టుమాస్టర్ జనరల్‌గా పనిచేస్తున్న కె. సంధ్యారాణి గ్రహించి గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి నా వంతు విరాళం అందించాను. కాకతీయ సిమెంటు కంపెనీ, చార్మినార్ సిమెంటు రేకుల తయారీ యజమానులతో మాట్లాడి గ్రామంలోని బలహీనవర్గాలకు మరుగుదొడ్ల నిర్మాణానికి సగం ధరకే సిమెంటు, రేకులు ఇప్పించాను. మా విరాళానికి తోడు ప్రభుత్వం కొన్ని నిధులు ఇవ్వటంతో గ్రామంలో 440 మరుగుదొడ్లను నిర్మించాం. మా నర్సాయపాలెం గ్రామానికి చెందిన 250 కుటుంబాల వారు హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. ప్రతి ఏటా రెండు సార్లు వారందరూ సమావేశమై, గ్రామాభివృద్ధికి సేవలు చేస్తున్నాం. స్వగ్రామానికి చేసిన సేవలు నాకెంతో సంతృప్తినిచ్చాయి. సాటి మనుషులకు సేవలు చేయడంతోనే జీవితానికి సార్ధకత ఏర్పడుతుందని భావిస్తున్నాను.
యాచకులకు అన్నదానం
అన్నార్తుల ఆకలి తీర్చడమే ఆశయంగా పెట్టుకొని ప్రతి గురువారం పంజగుట్టలోని సాయిబాబా ఆలయం వద్ద 110 మంది యాచకులకు భోజనం పెడుతున్నాను. ఈ కార్యక్రమాన్ని గత 15 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగిస్తున్నాను. దీని కోసం ప్రత్యేకంగా ఇద్దరు పనిమనుషులను పెట్టి, ఇంట్లోనే భోజనం తయారు చేయించి పంపిస్తున్నాను. దీంతోపాటు నా మనవడు పుట్టిన రోజైన సోమవారం నాడు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి, రామాలయం, ఫిలిం నగర్‌లోని దేవాలయాల వద్ద ఉన్న 50 మంది యాచకులకు ఉదయాన్నే అల్పాహారాన్ని అందిస్తున్నాను. ఇలా ప్రతి సోమవారం టిఫిన్ ప్యాకెట్లు పంపిణీ చేయిస్తుంటాను. నిరుపేదలు, యాచకుల ఆకలి తీర్చడంలోనే నాకు ఎనలేని సంతృప్తి లభిస్తోంది. బోన్సాయ్ మొక్కలను హాబీగా పెంచటం, స్వగ్రామాభివృద్ధికి బాటలు వేయడం, పేదల ఆకలి తీర్చడంతోపాటు తిరుమలలో భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించటంలోనే తనకెంతో ఆనందం లభిస్తుందని అప్పారావు తన సెకండ్ ఇన్నింగ్స్ కబుర్లు ముగించారు. 74 ఏళ్ల వయసులోనూ ప్రజల సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాలుపంచుకుంటున్న మాజీ ఐపిఎస్ అధికారి అప్పారావును అభినందించాల్సిందే.
n సలీం

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.