98 నాటౌట్

మనశ్శాంతిగా ఉండండి. అది ఉండాలంటే బ్యాంక్ అకౌంట్లో బోల్డంత డబ్బు ఉండాల్సిందే. డబ్బు లేకపోవడం వల్ల మానసికంగా కుంగిపోతాం. అంటే కోట్లకొద్దీ ఉండాలని కాదు, మీ భవిష్యత్ అవసరాలకు సరిపోయినంత ఉండాలి,
ప్రముఖ రచయిత, కాలమిస్టు కుష్వంత్ సింగ్‌కు 98 ఏళ్లంటే నమ్మడం కష్టమే. ముప్పయ్యేళ్ల యువత కంటే ఉత్సాహంగా కనిపించే తన ఆరోగ్య రహస్యాలేమిటో చెబుతున్నారిలా…
-వృద్ధాప్యాన్ని మీరెలా డీల్ చేస్తారన్నదాన్ని అనుసరించి దీర్ఘాయుష్షు ఉంటుంది. వయసు మీద పడుతున్నకొద్దీ మన శరీరం చలాకీగా కదలడం మానేస్తుంది. కానీ శరీరాంగాల్ని ఉత్సాహంగా ఉంచే మార్గాల్ని మనమే కనుక్కోవాలి. నాకు ఎనభైఐదేళ్లు దాటే వరకూ ప్రతి ఉదయం టెన్నిస్ ఆడేవాడ్ని. చలికాలమంతా లోథీ గార్డెన్స్‌లో నడిచేవాణ్ని, వేసవిలో గంట పైగా ఈత కొట్టేవాణ్ని. ఇప్పుడివన్నీ చెయ్యలేకపోతున్నా.
– దీనికి మంచి మందేంటంటే – మర్దన! బాడీ మసాజ్ మంచి ఫలితాలనిస్తుంది. నా ఉత్సాహానికి కారణం అదే.
– వయసు పెరిగే కొద్దీ తీసుకునే ఆహార పానీయాలను బాగా తగ్గించాలి. నేను ఉదయాన్నే జాంపండు రసం తాగుతా. రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది. ఉదయాన్నే ఉడికించిన గుడ్డు ఒకటి, బ్రెడ్ టోస్ట్ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటాను. కాస్త కిచిడీ, కూర లేదా పెరుగుతో మధ్యాహ్న భోజనం కానిచ్చేస్తా. మధ్యాహ్నం టీ తాగను. సాయంత్రం ఒక పెగ్గు సింగిల్ మాల్ట్ విస్కీ తీసుకుంటా. దానివల్ల నాకు ఆకలేస్తుంది. రాత్రి తిండి తినడానికి ముందు ‘ఎక్కువ తినెయ్యకురోయ్’ అని నాకు నేనే చెప్పుకుంటా. ఏదో ఒక కూరతో సరిపెడతా.
– తినేటప్పుడు ఎప్పుడూ ఒంటరిగా, మౌనంగా తినడం మంచిది. తింటున్నప్పుడు మాట్లాడుతుంటే ఆహారానికి న్యాయం చెయ్యలేరు. ఎక్కువ తినేస్తారు కూడా!
– నేను ఇప్పుడు పంజాబీ, మొగలాయి వంటకాలేమీ తినడం లేదు. దక్షిణాది వంటకాలైన ఇడ్లీ సాంబార్, లేదా కొబ్బరి పచ్చడి వంటివే తింటున్నాను.
– మలబద్దకం, అజీర్ణాలను మీ దరి చేరనివ్వకండి. ఇప్పుడున్న జీవనశైలి వల్ల ఇవి రెండూ తప్పక వచ్చే అవకాశముంది. అన్ని అనారోగ్యాలకూ మూలం కడుపే అని గ్రహిస్తే, జాగ్రత్తగా మసలుకునే వీలుంటుంది. ఎప్పటికప్పుడు కడుపును శుభ్రంగా ఉంచే ప్రయత్నాలు చేస్తుండాలి. మహాత్మాగాంధీకి ఈ రహస్యం తెలుసు. అందుకే ఆయన తరచూ ఎనీమా చేసుకునేవారు.
– జీవితాన్ని గట్టి క్రమశిక్షణతో నడపాలి. అవసరమైతే స్టాప్‌వాచ్‌ను పెట్టుకోండి, తప్పేం లేదు. అంత నియమబద్ధంగా ఉండాలి. నేను ఉదయం ఆరున్నరకల్లా బ్రేక్‌ఫాస్ట్ తింటాను, పన్నెండయ్యేసరికి మధ్యాహ్న భోజనం చేస్తాను. నా డ్రింక్ సాయంత్రం ఏడింటికి, రాత్రి భోజనం ఎనిమిదింటికి కచ్చితంగా పూర్తయిపోతాయి.
– సహనాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. అది రక్తప్రసరణ మీద, నరాల మీద గట్టి దెబ్బే తీస్తుంది.
– ఎప్పుడూ అబద్ధాలు చెప్పకండి. ‘సత్యమేవ జయతే’ అన్న మన జాతీయ నినాదాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది.
– మీ పిల్లలకో, పనివారికో, దానధర్మాలకో – విరివిగా చెయ్యండి. అది మీకు బాగా అనిపిస్తుంది. ఇవ్వడంలో సంతోషం ఉంది.
– ఎవ్వర్నీ చూసి అసూయపడకండి. ‘ఎండు రొట్టెలు తిను, చల్లటి నీళ్లు తాగు, తమ రొట్టెలను నేతితో కాల్చుకునేవారిని చూసి అసూయపడకు’ అని పంజాబీలో ఒక సామెత ఉంది.
– పాత తరం ముసలాళ్లలాగా ఎక్కువ సమయం భగవంతుడి ధ్యానంలోనో, పుణ్యక్షేత్రాల సందర్శనలోనో గడిపెయ్యకండి. అది మీలో ఓడిపోయిన భావన కలిగిస్తుంది. దానికి బదులు తోటపని, బోన్సాయ్ పెంపకం, మీ చుట్టుపక్కలుండే పేదపిల్లలకు చదువులో సాయపడటం – ఇలాంటి పనులను ఎంచుకోండి.
– నేను ఒక క్యాండిల్ వెలిగించి దానిమీద నా దృష్టిని నిలుపుతాను. ఆ సమయంలో నా బుర్రను ఏ ఆలోచనలు లేకుండా ఖాళీ చేసేస్తాను. కేవలం ‘ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి’ అని జపిస్తాను. ఇది బాగా పనిచేస్తుంది. నేను ప్రశాంతంగా ఉన్నాను.
– ఫౌజా సింగ్ వందేళ్ల వయసులో మారథాన్ రేస్‌లో పాల్గొన్నాడు. మనం అతనికి సమానం కాలేకపోవచ్చుగాని ఆరోగ్యంగా, సృజనాత్మకంగా ఎక్కువ కాలం జీవించొచ్చు కదా. నా పాఠకులంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. దీర్ఘాయుష్మాన్‌భవ.

