నా దారి తీరు -73
చెరుకు రైతు గా నాఅనుభవం
షుగర్ ఫాక్టరీ కింద చెరుకు వేయాలి అంటే ముందుగా సంబంధించిన చెరుకు మేస్త్రీ కి తెలియజేయాలి. వాళ్ళు అనుమతించిన తర్వాతనే పనులు మొదలెట్టాలి .మంచి విత్తనాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసి చెబుతారు .దాన్నే ఉపయోగించాలి లేక పోతే రైతుకస్టాలు దేవుడికే ఎరుక .పర్మిట్ త్వరగా ఇవ్వరు సీజన్ చివర లో తోలాల్సి వస్తుంది .పైరు ఎంత బాగా పండినా సమయానికి నరికి ఫాక్టరికి తొలకపోతే దిగుబడి బాగా తగ్గి పోయి రైతుకు తగిన ప్రతి ఫలం రాదు. సబ్సిడీ ఇచ్చే విషయం లో కూడా తేడా ఉంటుంది .ఈ బాధలు పడలేక వాళ్ళు ఎంపిక చేసిన చెరుకు విత్తనాన్నే నాటుతారు రైతులు .ఉయ్యూరు అడుసుమిల్లి వారి కాలేజి కి వెనకాల చెరుకు పరిశోధనా సంస్థకు చెందినా క్షేత్రం ఉంది అక్కడ నాణ్యమైనచెరుకు విత్తనం అన్ని జాగ్రత్తలూ తీసుకొని పెంచుతారు .రేటు కూడా సరసం గా ఉంటుంది .మొదట్లో 07రకాన్ని ఎంపిక చేసి వేయించేది ఫాక్టరీ .గడ సన్నం గా ఉన్నా ఎత్తు బాగా పెరిగి విరిగి పోకుండాదృఢం గా ఉండి మంచి రసం ఇచ్చేది. రైతులకు ఈ విత్తనం కొంగు బంగారమే అయింది. చెరుకు వేసేవారేక్కువయ్యారు .ఏరియా పెరిగింది .అందుకని చెరుకు సాగు తగ్గించండి అని ఫాక్టరీ వాళ్ళు గోల చేశారు .ఖర్చులూ పెరిగి పోయి చెరుకు నరికే వాళ్ళు దొరక్క రైతులు చాలా ఇబ్బంది పడే వారు .లోకల్ గా నరికే వారు షెడ్యూల్ కులాల వాళ్ళే తప్ప మిగిలిన వారెవరూ ఆ పని చేసే వారు కాదు .ఒక వేళవాళ్ళు వచ్చినా ఎక్కువ రేటు అడిగే వారు .అందుకని కూలీల కోసం నల్ల గొండ జిల్లాకు వెళ్లి అక్కడి వారిని తక్కువ రేటు కు మాట్లాడుకొని ముందే అడ్వాన్సుఅద్వామ్సు లిచ్చి వారోచ్చిన తర్వాత ఉండటానికి గుడిసెలు వేయించిఅప్పుడు కొట్టించేవారు .ఒక్కో సారి వాళ్ళు రాక పోతే ఒకటి ఎందు సార్లు వాళ్ళ కోసం తిరిగి పిలిపించుకు రావాల్సి వచ్చేది .అక్కడా పంటలు బాగా పండే కాలం వస్తే డోరీ వారే కాదు .ఈ పనులన్నీ ఉయ్యూరులో చిన్నబ్బాయి కాటూరు లో అయితే సీతారామయ్య చూసేవాళ్ళు. నేనెక్కడికీ కదిలే వాడిని కాదు డబ్బు మాత్రం పెట్టు బడి పెట్టి పంపేవాడిని .వాళ్ళను మాట్లాడటం తీసుకురావటం వాళ్ళే చూసేవారు ఏర్పాట్లు కూడా వాళ్ళే బాద్య త గా చూశారు .
ఒకటి రెండు సార్లు నల్లగొండ కూలీలు ఎగ కొట్టారు .మా బాధ దేవుడికే ఎరుక .సమయం లో చెరుకు కొట్టక ఫాక్టరికి తొలక పోతే నెత్తిన చేతులే .అందుకని ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది .పుల్లేరు కాలువ జనవరి తర్వాత బిగిస్తారు .నీరు ఫాక్టరీ కే వదులుతారు .మరి రైతులకు కావాలంటే కాలువ మీద గుమాస్తా కో కళాసే దుర్గా రావు కో డబ్బు ముట్ట చెప్పితే రాత్రి ఎవరికీ తెలియ కుండా నీళ్ళు వదుల్తారు .ఇదంతా దొంగ చాటు వ్యవహారం .దీన్ని అందరూ పాటించేవాళ్ళు .బోరు ఉన్నవాళ్ళకు ఈ ఇబ్బంది ఉండదు .లేని వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గరా నీరు కొనుక్కోవాలి. అంటే ఎకరం తడిపితే రెండు వందలో మూడు వందలో బోరు యజమానికి ఇవ్వాలి .అదీ లెక్క .అలానే నేనూ తీస్సుకోనేవాడిని, ఇచ్చేవాడిని కూడా .
చెరుకు విత్తనం ఫాక్టరీ వాళ్ళు సప్లై చేయలేక పోతే మంచి విత్తనం వేసిన రైతుల దగ్గరే కోన మనే వారు .సెంటు విత్తనం ఇంత అని కొనుక్కో వాలి .ఆరు ఏడు నెలల విత్తనం లేత గా ఉండి నాట గానే మొలిచి బతుకు తుంది. నెలలు దాటితే అంత బాగా మోలిచేదీ కాదు దిగుబడి ఇచ్చేది కాదు .కొందరు రైతులు డబ్బు ముందు ఇస్తే తప్ప కొట్టనివ్వరు .కొందరు తెలిసిన వాళ్ళు అయితే కొలతలు అయిన తర్వాత ఇవ్వమని చెప్పేవారు .సాధారణం గా యాక మూరు లో చిన ఒగిరాలలో ,గారిక పర్రు లో కాలవ అవతల అవల్లభనేని వీర భద్ర రావు గారి చేలో ,లేక పోతే ఇప్పుడున్న ఆరి టి సి బస్ డిపో అంత వ్యవసాయ క్షేత్రమే అక్కడ కే సి పి డాక్టర్ నాగేశ్వర రావు గారు చెరుకు విత్తనం పెంచే వారు అక్కడో దొరికేది .ఒత్తుగా విత్తనం ఉంటె కొనే రైతుకు బాగా ఉంటుంది .పలచగా ఉంటె నష్టం .అది చూసి కొనాలి ఎకరానికి అయిదారు సెంటుల విత్తనం తొక్కే వారు .బాగా ఉంటె నాలుగు సెంట్లు చాలు .
చెరుకు విత్తనం 02అని కొత్తగా వచ్చింది ఇది చాలా లావుగా ఒత్తుగా పెరిగేది ఎకరానికి నలభై టన్నుల దిగు బడి నిచ్చేది .రైతుకు గొప్ప వరం గా అయింది. అందరూ అదే వేసేవారు .పిచ్చ డబ్బులోచ్చాయి .రైతులకు సబ్సిడీ బాగా ఇచ్చేవారు .బండీ కి రెండున్నర టన్నులు కట్టి తోలేవారు రెండెడ్ల బండి మీద. దీనికీ టన్నుకు ఇంత అని తోలిన వాళ్ళకివ్వాలి .యెంత తోలిందీ ఫాక్టరీ లో చెరుకు మేస్త్రీలు వారి కింద గుమాస్తాలు జాగ్రత్త గా టికెట్లు ఆప్పగించేవారు బండీని ఫాక్టరీ లోని ట్రక్ లో పడేస్తే చెరుకు రైల్ పట్టాల మీద వాగన్లు నడిచి లోపలి వెడతాయి .వీటిని ట్రాక్టర్ తో తోయిస్తారు .అక్కడ కాటా ఉంటుంది .ఏ ట్రక్ ఎంత బరువు ఉంటుందో ముందే దాని నంబర్ బట్టి లెక్క ఉంటుంది .చెరుకు తో సహా బరువు చూసి దాన్ని తీసేసి నికర బరువు ను మన పేరున్న టికెట్ మీద ఎలెక్ట్రానిక్ పద్ధతిలో నోట్ చేస్తారు ఎన్ని టన్నుల ఎన్ని క్విన్తాల్లు న్నది దాని మీద ప్రింట్ అవుతుంది. మొదట్లో ఇదంతా చేతితోనే చేసేవారు ఇప్పుడంతా మెషీన్ మీదే జరుగు తోంది .వంద క్వింటాళ్ళుఒక టన్ను .మన పేర ఉన్న టికెట్లను ట్రక్కు లు నడిచే ట్రక్ దగ్గర పందిరిలో ఉన్న గుమాస్తాలు తీస్సుకొని జాగ్రత్త చేసి తోలిన రైతు పేరు వెనక రాసి మనకు అడిగినప్పుడు ఇస్తారు .దీని వాళ్ళ ఎవరు యెంత తోలారో ,ఎన్ని బండ్లు తోలారో తెలుస్తుంది .ట్రాక్ మీద చెరుకు వేయగానే అందులో ‘’వాటర్ షూట్ ‘’లు ఉన్నాయేమో నని ఏరే వారుంటారు అది లేకుండానే రైతులు పొలం లోనే చెక్ చేసుకొని పంపుతారు అనుమానం వస్తే చాలా సార్లు తనిఖీ చేసి ఇబ్బంది పాలు చేస్తారు .ట్రాక్ మీద చెరుకు పడగానే కొందరు వచ్చి చెరుకు ఆకుతో కట్టిన కట్టలను ఎత్తి కట్టలు కొడవలితో కోస్తారు దీన్ని దవ్వ అంటారు .ఇది పశువులకు మంచి మేత .మా పాలేళ్ళు గొడ్లను ఫాక్టరీ దగ్గరకే తోలుకొని వెళ్లి దవ్వ ఏరి మేపెవారు వచ్చేటప్పుడు ఒక దవ్వ మోపు తెచ్చేవారు ఆరునెలలు ఇది పశుగ్రాసం .
తర్వాతా ఈ విత్తనానికి ‘’రెడ్ రాట్’’అనే యెర్ర కుళ్ళు తెగులు వచ్చేది దీన్ని పోగొట్టటానికి క్రిమి సంహారక మందులు వాడాల్సి వచ్చేది .వీటిని రైతులకు సబ్సిడీ మీద ఇచ్చేది ఫాక్టరీ .చెరుకు వేయాలంటే ఫాక్టరీ వాళ్లకు ఎగ్రిమెంట్ రాయాలి అవన్నీ పూర్తీ అయిన తర్వాతా ఎరువులు ఉచితం గా ఇస్తారు .ఎకరానికి కొంత దాబ్బు నగదు రూపం గా ఇచ్చేవారు .తర్వాత విధానం మారి ఎరువులు మాత్రమె ఇప్పుడు ఇస్తున్నారు .తర్వాతా అనేక రకాలైన విత్తనాలోచ్చాయి .06 ఆండీ రైతులకు బానే లాభాలు ఇచ్చింది .నీటి సప్ప్లై లేక పోవటం కరెంట్ సప్ప్లై సరిగ్గా లేక పోవటం ,వర్షాలు సకాలం లో కురవక పోవటం కూలీల సమస్య ఫాక్టరీవాళ్ళ దురుసుతనం ,మేస్త్రీలకు డబ్బు ఇస్తే తప్ప పర్మిట్లు ఇవ్వక పోవటం తో చెరుకు వేసే వాళ్ళే తగ్గి పోయారు .దిగు బడీ తగ్గి మానేస్తున్నారు .మా ఉయ్యూరు పొలం లో మూడేళ్ళ కు రెండేళ్ళు చెరుకు సాగు చేసే వాళ్ళం .అదే మా కుటుంబం ఆర్ధికం గా నిల బడటానికి కారణం అయింది .పెళ్ళిళ్ళు పేరంటాలు అన్నీ చెరుకు సాగు వల్లనే సాధ్యం అయ్యాయి. ఇది తిరుగు లేని నిజం .నేను రిటైర్ అయ్యేటప్పుడూ చెరుకు సాగు ఉంది .జీతం పూర్తిగా రాదు పెన్షన్ మీదే గడపాలి కనుక ఇది ఉపయోగ పడుతుందని అలా చేశాను .రెండేళ్ళు నిల దొక్కు కోవటానికి బాగా ఉపయోగ పడించి .చెరుకు మా ఇంటికి కల్ప వల్లి అయింది ఎంత చెప్పినా తనివి తీరని బంధం అది .
సశేషం
మీ – గబ్బిట దుర్గా ప్రసాద్ -3-2-14-ఉయ్యూరు


మాస్టారు,
చెరకు రైతుగా మీ అనుభవాలు పంచుకొన్నందుకు మీకు ధన్యవాదములు. మీరన్నట్టు చెరకు సాగు ఆ ప్రాంతంలో ఇప్పుడు తగ్గినది. మా అమ్మమ్మ గారి వూరు కలవపాములలొ కూడ ఇప్పుడు ఎక్కువగా వరి వేస్తున్నారని విన్నాను. మా చిన్నప్పుడు సంక్రాంతి పండుగకి వూరు వస్తే బళ్ళ మీద కెసిపి కి తీసుకొని వేళ్ళే చెరుకు గడలని లాగి తినడం సరదాగా వుండేది.
LikeLike