పద్మ అవార్డులకు అనర్హులను ఎంపిక చేయడం జరుగుతోంది. ఫలితంగా ప్రతి ఏటా వీటిని తిరస్కరించే వారి సంఖ్య పెరుగుతోంది.
ప్రతిష్ఠాత్మకమైన పద్మ పురస్కారాలు కళ తప్పుతున్నాయి. భారతదేశ కీర్తిప్రతిష్టలు, వైభవం, ఉత్తేజాలను గుర్తు చేసే ఈ పురస్కారాలు ప్రస్తుతం వెలా తెలా పోతున్నాయి. విద్య, శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, సాహిత్యం, కళలు, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, పౌరసేవల రంగాల్లో విశిష్టమైన ప్రతిభావంతులకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలను ప్రదానం చేస్తుంది. వీటిని మూడు స్థాయిల్లో నెలకొల్పారు. అన్నిటికన్నా మిన్నగా పద్మవిభూషణ్, ఆ తరువాతి స్థానంలో పద్మభూషణ్, ఆ తరువాత పద్మశ్రీలను రాష్ట్రపతి ప్రకటించడం, గణతంత్ర దినోత్సవం రోజున ప్రదానం చేయడం ఆనవాయితీ అయింది. 1954లో ప్రప్రథమ పురస్కారాల ప్రదానం జరిగింది. 6 పద్మ విభూషణ్‌లు, 23 పద్మభూషణ్‌లు, 18 పద్మశ్రీలతో నాటి మేటి ప్రతిభావంతులను వివిధ రంగాల నుంచి ఎంపిక చేయడం జరిగింది.
నాటి నుంచి 2013 దాకా ప్రదానం చేసిన పురస్కారాలలో పలుమార్లు విమర్శలు, తిరస్కరణలు ఎదురయ్యాయి. అవార్డుల ప్రదానం తీరుతెన్నులు మారాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతూనే ఉన్నాయి. ఈ ఏడాది దాకా 290 మంది పద్మవిభూషణ్‌లు, 1126 మంది పద్మభూషణ్‌లు, 2678 మంది పద్మశ్రీలు వివిధ రంగాల నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వినతులు ప్రతిపాదనల ప్రాతిపదికగా ఎంపిక అయ్యారు. ఎప్పటికప్పుడు వాటిలో పొరపాట్లు, అనర్హులను అందలం ఎక్కిస్తున్నారన్న విమర్శలు, నిరసనలు ఎదురవుతూనే ఉన్నాయి. మొదటి ఏడాది ఎంపికలో వైవిధ్యానికి, అసలు సిసలు ప్రతిభకు పట్టం కట్టాలన్న ప్రభుత్వ యోచన క్రమంగా రాజకీయపు పలుకుబడితో ప్రభావితమవుతున్నాయని తేటతెల్లం అయింది. విజ్ఞులతో పాటు పురస్కారాల ప్రదానానికి ఆమోదం తెలపాల్సిన రాష్ట్రపతి కూడా హెచ్చరించి సవరింపులు చేయించిన సందర్భాలు ఉన్నాయి. మన ప్రప్రథమ రాష్ట్రపతి స్వయంగా ఒక ఆస్పత్రి నర్సుకు పద్మ ప్రదానం చేయమని పట్టుపట్టటం విపరీత విమర్శలకు నెలవు అయింది. మరో రాష్ట్రపతి హయాంలో ఆ భవనంలో అలంకరణలు మెరుగులు దిద్దిన మహిళకు పద్మ ప్రదానం అయింది.
కళ తప్పుతున్న కళలు
బిరుదులకు, పురస్కారాలకు తేడా తెలియని తీరులో ప్రభుత్వపరంగా ప్రదానం చేస్తున్న పద్మలు హుం దాగా గౌరవప్రదమైన స్థాయిని నిలుపుకోవటంలో తేలిపోతున్నాయి. నిబంధనలు తెలియనివారు, పాటించనివారు పెరిగిపోతున్నారు. కొందరి వివరాలు, పద్మలు తెచ్చుకున్న పద్ధతులు తెలుసుకున్న సమాజం ముక్కుమీద వేలు వేసుకుంటున్న సందర్భాలు అనేకం. ఆయా రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించి నిక్కచ్చిగా నిర్ణయించటంలో చాలా లోపాలు, లొసుగులు ఉంటున్నాయని పలుమార్లు తేటతెల్లం అయినా అందుకు తగ్గ దిద్దుబాటు చర్యలు మాత్రం లేకుండా పోతున్నాయి.
సగటున 1000కి పైచిలుకుగా వస్తున్న ప్రతిపాదనలను రాష్ట్రపతికి పంపటానికి హోంశాఖ రూపొందించటానికి నియమించే కమిటి ఒక్క పూటలో అన్నీ ఎలా పరిశీలించగలుగుతోందని అగర్వాల్ అనే ఆయన ప్రశ్నలతో సమాచార హక్కు వ్యాజ్యం నడిపితే ప్రభుత్వం నుంచి సరైన వివరణ లభించలేదు. ఢిల్లీలో పెద్దల ప్రమేయం, సిఫారసుల లేఖలు తీసుకున్నవారు పొందినవి, ఆ పైరవీలు తతంగాలు తెలియనివారు ఎన్నటికీ పొందలేనివి అడపాదడపా అన్ని రాష్ట్రాలలో, ప్రాంతాలలో చర్చకు వస్తూనే ఉన్నా ప్రమాణాలు పెంచటంలో శ్రద్ధ పెట్టేవారు మాత్రం లేకుండా పోయారు. మన దేశ అత్యున్నత న్యాయస్థానం 30 పేజీలతో పలు సూచనలతో తీర్పు ఇచ్చినా పద్మలు అనర్హులకు అలవోకగా అందుతూనే ఉన్నాయి. అసలు అవార్డులకు ఎవరిని ఎలా ఎంపిక చేస్తారన్న దానిపై స్పష్టత, పరిమితులపై కచ్చితమైన మార్గదర్శకాలు లేకుండానే జరిగిపోతున్నాయి. ఒక కేంద్ర మంత్రికి కంటి శుక్లాలు ఆపరేషన్ చేసిన ఢిల్లీ వైద్యురాలు, ప్రధానమంత్రికి వైద్యం చేసిన వారు, ప్రధాని కవితలను గానం చేసిన యువగాయని, అవినీతిపరుడుగా గుర్తింపు పొందిన వ్యక్తి దేశ అత్యున్నత పురస్కారాలను రాష్ట్రపతి నుంచి అందుకున్నారు. ప్రభుత్వాలను నడిపే రాజకీయ పార్టీలు ఒకరిని ఒకరు ఎద్దేవా చేసుకుంటూ చెప్పిన మాటలు మన చట్టసభల రికార్డులలో నమోదయ్యాయి. 2007లో రాష్ట్రపతి హోదాలో కలాం తిప్పిపంపిన పైల్‌లో లొసుగులు అభ్యంతరాలు మన దేశ ప్రతిష్టకు చెరగని మచ్చగా ఉన్నా సవరింపుపై చర్యలు లేకుండానే అన్నీ జరిగిపోయాయి.
కమిటీపై అనుమానాలు
మామూలుగా హోం శాఖ వారు నియమించిన కమిటీ రూపొందిన జాబితాకు ముగ్గురి పేర్లు అదనంగా జోడించటం మొత్తంగా ఆ జాబితాలోని 12కి వ్యతిరేకంగా నిఘా విభాగాల నివేదిక ఉండటం మన పురస్కారాల వ్యవస్థకు ఒక మరకగా వెల్లడి అయింది. 1996లో అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ కూడా కమిటి సిఫారసులను తిరస్కరిస్తే రహస్య ఫైల్‌గా బయటకు తెలియకుండా దాటవేశారు. కొందరు సరైన సమాచారం కోసం పట్టువదలకుండా ప్రయత్నిస్తే ఫైళ్లలో కాగితాలు తీసేసి తారుమారు చేసి గందరగోళం చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఒక సందర్భంలో ఏడాదికి 50కి మించి పద్మ పురస్కారాలు వద్దనుకున్న ప్రభుత్వం ఆ తరువాతి రోజుల్లో ఆనవాయితీ పరిమితిని 100 దాటించింది. ఆ తరువాత 120కి దాటవద్దని ఉత్తుత్తి ఆంక్షలు కాగితాలపై మాత్రమే ఉండేలా చేసింది. 1969లోనే ఆచార్య జె.బి. కృపలాని వంటి పెద్దాయన సంధించిన ప్రశ్నలు, విమర్శలు గుర్తుకు తెచ్చుకుంటే ఇప్పటి దిగజారుడు పద్ధతులు, అప్రతిష్ట అర్థం అవుతాయి.
దేశ అత్యున్నత న్యాయస్థానం వారు ఈ వ్యవహారాలన్నిటినీ సాకల్యంగా పరిశీలించి మార్గదర్శకాలు సూచించినా అసలు సారంలో పట్టింపు అంతంత మాత్రమే అయింది. లెటర్‌హెడ్‌లు, ఆహ్వాన పత్రాలు, కరపత్రాలు, పోస్టర్‌లు, పుస్తకాల వంటివాటిపై తమ పురస్కారాలను చాటుకోకూడదని వారించి చాలా ఏళ్లు అయింది. తమ పేర్లకు ముందు వెనుకల్లో పద్మలు చాటుకోవద్దని కచ్చితమైన నిబంధనలు మొదటి నుండీ ఉన్నాయి. 1977-80లలో 92-98 మధ్యలో పురస్కార ప్రదానంలో అంతరాయం, ఒడిదుడుకులు పలు లోపాలను చెప్పకనే చెబుతాయి. పలువురు పలు సందర్బాలలో తమకు ప్రకటించిన పురస్కారాలను ప్రకటించినప్పుడు నిర్వికారంగా పట్టింపులేకుండా వ్యవహరించారు. మరికొందరు తీవ్ర నిరసనలతో తిరస్కరించారు. గతంలో ఎం.జి. రామచంద్రన్ తనకు ప్రకటించిన పద్మశ్రీని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, కేంద్ర మంత్రి అబ్దుల్ కలామ్ ఆజాద్ ఆ పురస్కారాలను తిరస్కరించిన వారిలో ముందున్నారు.
చరిత్ర రంగంలో కొత్త పుంతలు తెలియచెప్పిన ప్రొఫెసర్ రోమిల్లా థాపర్ 1992లోనూ, ఆ తరువాత 2005లోనూ పద్మ భూషణ్ ప్రకటించినా స్వీకరించటానికి విముఖత వ్యక్తం చేశారు. “విద్యాసంస్థలు, మా రంగంలోని వారు ఇస్తే మాత్రమే నన్ను ప్రశంసించటంలో అర్థం, యోగ్యత ఉంటాయి. నా కృషి పరిశోధనల ప్రమాణాలు తెలియని వారు ఏంచేసినా అర్థరహితంగా పరిగణిస్తాను” అని ఆయన తన అయిష్టతను వ్యక్తం చేశారు. 2003లో పద్మభూషణ్‌ను దత్తోపంత్ టేంగ్డే తిరస్కరిస్తూ తన గురువులకు, అందరికీ ప్రయోజనకరమైన ప్రవర్తన మార్గాన్ని చూపించిన పెద్దలను గుర్తించకుండా తనకు ఇవ్వజూపటం సమంజసం కాదని స్పష్టం చేశారు. సితార్ విద్వాంసుడు విలాయత్ ఖాన్ తన స్థాయిని నిర ్ణయించిన కమిటీ విజ్ఞతపై నిరసనతో రెండుసార్లు నిరాకరించారు. ఈశాన్య రాష్ట్రాలలో అశాంతి, హింస పెచ్చరిల్లిపోతుంటే తమ సూచనలు, పరిష్కార మార్గాలు పట్టించుకోని ప్రభుత్వంపై నిరసనతో తనకు ఏమీ వద్దని తిరస్కరించారు. పాత్రికేయుడు నిఖిల్ చక్రవర్తి ప్రభుత్వ మెచ్చుకోళ్లు యోగ్యత ప్రశంసలు తన వృత్తి విలువలు, ధర్మానికి తగవు అని దూరం పెట్టారు. బ్లూ స్టార్ ఆపరేషన్‌తో తన వారిని ఊచకోత కోసినవారి పురస్కారం తనకు వద్దని కుష్వంత్ సింగ్ రెండుసార్లు పద్మవిభూషణ్ ను తిరస్కరించారు. తనకన్నా ముందు అపాత్రులు, అథమస్థాయి వారికి పురస్కారాలిచ్చి ఆ తరువాత తనలాంటి వాళ్లకు ఇవ్వటం గౌరవప్రదం కాదని కళాకారిణి సితార దేవి నిరాకరించారు. మరెందరో కూడా అసమ్మతి వ్యక్తం చేస్తూ ప్రభుత్వ అవార్డుల దరిదాపుల్లోకి కూడా రామని అన్నారు.

మన రాష్ట్రంలో చిత్ర చిత్తాలు
కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన పదవులతో పాటు పద్మ పురస్కారాలకు అర్హులను ఎంపిక చేసి ప్రధానమంత్రి, రాష్ట్రపతిలకు ప్రతిపాదన నివేదికను పలు సంవత్సరాలు ఖరారు చేసిన కంటిపూడి పద్మనాభయ్యతో పాటు సుపరిపాలన వేదిక కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి వంటివారు మన వాళ్ల ఎంపిక పద్ధతులు లోపభూయిష్టం, ఆశ్రితపక్ష పాతంతో జరిగిపోతున్నాయని నిశితంగా విమర్శించారు. ఈ ఏడాది పురస్కారాల కోసం తాము చేసిన ప్రయత్నాలు, కనుగొన్న వాస్తవాలు బాహాటంగా వెల్లడించారు. ఇక ముందు మన రాష్ట్ర ప్రభుత్వ పద్ధతులు, ఎంపిక ప్రమాణాలు మారాలని హితవు చెప్పారు. ప్రతిపాదనలు పంపటానికి ముందు అందరికీ తెలిసేలా సెర్చి కమిటీని నియమించటం, తమకు తాము అర్హులని భావించేవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియచెప్పడం వంటి కనీస ప్రయత్నం కూడా చేయలేదని తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలపై పట్ట్టింపు లేకుండా కొందరు ప్రభుత్వ కార్యదర్శి, విశ్వవిద్యాలయాలు, చలనచిత్ర అభివృద్ధి సంస్థ వంటివారి నుంచి పేర్లు తెప్పించి తమకు తోచిన రీతిలో ఖాయం చేసేసారని వెల్లడించారు. గడువు దాటిన తరువాత వచ్చినవి కూడా పరిగణించి కమిటి పరిశీలించి ఖరారు చేస్తే ముఖ్యమంత్రి తనకు తోచిన వారిని కూడా కలిపి ప్రతిపాదన పంపించారని రుజువులతో చెప్పారు. ఆ తరువాత ఆదనంగా మళ్లా కొందరి ఒత్తిడి మేరకు మరి కొందరివి కలిపారని కూడా వెల్లడించారు.
ఈ ఏడాది ప్రతిపాదనల్లో 40 శాతం వైద్యులే ఉండగా ఎన్నడూ సమాజంపట్ల, విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించలేదని సులువుగానే చెప్పగలవారిని ఎంపిక చేశారని లోపాలన్నీ న్యాయస్థానం ముందుంచారు. విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని రుజువులున్న వారితో పాటు మార్పులు చేర్పులు జరిగిన తీరు తీవ్ర అభ్యంతరకరం అన్నారు. మొత్తంగా జరిగిందంతా మన ప్రభుత్వానికి పురస్కారాలకు గౌరవప్రదం కాదని నిక్కచ్చిగా తేల్చి చెప్పారు. గతంలోకి వెళ్లి వివరాలన్నీ వింగడిస్తే కొందరి పైరవీలు, రాజకీయ పలుకుబడులు, ప్రలోభాలు పద్మలకు తెగులులా అలముకున్నాయని తేటతెల్లం అవుతోంది.
– జి.ఎల్.ఎన్. మూర్తి

