అపరాధ భావన లేదు..బాధే ఉందిఅంటున్న నటి షకీలా

 

చాలా మందికి షకీలా ఒక శృంగార దేవత. ఆమెది ఒక్క సీను ఉన్నా చాలు సినిమా హిట్. ఒకప్పుడు హీరోయిన్ల కన్నా ఆమెకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేవారు. అలాంటి షకీలా గతమేమిటి? చిన్నప్పుడు సూళ్లూరుపేట దగ్గర కోటలో పెరిగిన ఆమె మలయాళం సినీ పరిశ్రమకు ఎలా వెళ్లింది? కోట్ల మంది పురుషుల కలలరాణి అయిన షకీలా జీవితంలో ఎప్పుడైనా సుఖపడిందా?- ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానంగా- షకీలా తన ఆత్మకథ రాసుకుంది. ‘నాలో అపరాధ భావన లేదు.. బాధే ఉంది’ అనే ట్యాగ్‌లైన్‌తో మలయాళంలో విడుదలయిన ఈ ఆత్మకథలోని కొన్ని భాగాలకు అనువాదమిది..

‘నేను ఆత్మకథను ఎందుకు రాయాలి? నా నుంచి ఎవరైనా నేర్చుకొనేది ఏదైనా ఉందా? నేను మదర్ థెరిస్సాను కాను. నేను పూర్తిగా ఒక కృత్రిమమైన జీవితాన్ని గడిపాను. నేను నటించిన చిత్రాలు కూడా కృత్రిమమైనవే. అలాంటప్పుడు నేను ఆత్మకథను ఎందుకు రాయాలి? మొదట్లో నాకు ఇలాంటి ఆలోచనలు ఉండేవి. అందుకే ఎవరైనా వచ్చి ఆత్మకథ రాయమంటే నేను ఒప్పుకొనే దాన్ని కాదు. నిరాకరించాను. కానీ ఆ తర్వాత నా మనసు మార్చుకున్నాను. నేను అందరిలాంటి ఆడపిల్లనే. సామాన్యంగా బతకాలనుకున్నాను. ప్రేమించాలనుకున్నాను. ఇతరుల చేత ప్రేమించబడాలనుకున్నాను. ఇవేమీ సాధ్యం కాలేదు. నా గురించి ఎవరికీ ఏమీ తెలియదు. నేను ఎలాంటి కష్టాలు పడ్డానో ఎవరికీ తెలియదు. నా పేరు శృంగార రసానికి ప్రతీకగా ఎందుకు మారిందో ఎవరికీ తెలియదు. షకీలాలు ఎలా పుడతారో, ఎలా రూపుదిద్దుకుంటారో అందరికీ తెలియాలనే ఇప్పుడీ ఆత్మకథ రాశాను.

శరీరాన్ని మాత్రమే
మలయాళీ కుర్రకారు శృంగార కలలకు నేను ప్రతిరూపమని ఒక సారి ఓ జర్నలిస్టు నాతో అన్నాడు. ఎవరికైనా ఆకలిగా ఉంటే వారికి అన్నం పెట్టాల్సిందే. అది తప్ప వేరే ఏదీ సంతోసాన్నివ్వదు. నా సినిమా నా శరీరాన్ని శృంగారభరితంగా చూపట్టడం తప్ప ఇంకేమీ చేయదు. నాలోని స్త్రీని, నాలోని నటిని ఎవరూ చూడరు. ఒక దశలో- సినిమా హీరోయిన్ల కన్నా నేను ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొనేదాన్ని. ఒక లొకేషన్ నుంచి మరొక లొకేషన్‌కు విమానాల్లో తిరిగేదాన్ని. పగలనకా రాత్రనకా సినిమా షూటింగ్‌లలో పాల్గొనేదాన్ని. కొన్ని సార్లు- రోజుకు రెండు, మూడు గంటల నిద్ర కూడా దొరికేది కాదు. చాలాసార్లు బెడ్‌రూం సన్నివేశాల్లో నటిస్తూనే వళ్లు తెలియకుండా నిద్రపోయేదాన్ని. అలాంటి సన్నివేశాలను చూసి ప్రేక్షకులు నేను భావ ప్రాప్తి పొందుతున్నానని భావించేవారు. చాలా మంది దృష్టిలో నేను కామోద్దీపన కలిగించే ఒక శరీరాన్ని మాత్రమే. నాలో ఉన్న నటిని వెలికితీయటానికి ఎవ్వరూ ప్రయత్నించలేదు.

అమ్మే నాకు శాపం!
మా అమ్మకు సంబంధించి నాకు ఎటువంటి మంచి జ్ఞాపకాలు లేవు. ఆమె నన్ను ఎప్పుడూ ప్రేమగా చూడలేదు. ఆప్యాయంగా పలకరించలేదు. నా జీవితాన్ని నాశనం చేసింది మా అమ్మే. బహుశా మా అమ్మకు చిన్నప్పటి నుంచి నేనంటే ప్రేమ లేదు. అస్తమాను తిడుతూ ఉండేది. శాపనార్థాలు పెట్టేది. ఇలా నాకు పదహారేళ్లు వచ్చాయి. ఎప్పుడూ నన్ను తిట్టే అమ్మ ఒక రోజు నన్ను పొగిడింది. ఆ తర్వాత- నన్ను ఒక వ్యక్తి వచ్చి బయటకు తీసుకువెడతాడని చెప్పింది. అతను నన్ను ఒక డబ్బున్న వ్యక్తి దగ్గరకు తీసుకువెళ్తాడనీ.. అతనితో ‘మంచి’గా ఉంటే- మొత్తం కుటుంబ ఆర్థిక సమస్యలు తీరిపోతాయనీ చెప్పింది. అతను చెప్పినట్లు చేయాలని మరీమరీ చెప్పింది. నేను షాక్ తిన్నా. ఆమె మాటల వెనకున్న అర్థమేమిటో నాకు బోధపడింది.

కానీ నాకు వేరే ప్రత్యామ్నాయం లేదు. అమ్మ చెప్పినట్లే ఒక వ్యక్తి వచ్చి హోటల్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ రూమ్‌లో ధనవంతుడని మా అమ్మ చెప్పిన వ్యక్తి ఉన్నాడు. అతనిని చూసి నేను బాధతో, భయంతో గడ్డకట్టుకుపోయా. ఆయన నన్ను రేప్ చేశాడు. ఇది ప్రారంభం మాత్రమే. ఆ తర్వాత అలాంటి ధనవంతులనేకమంది దగ్గరకు నేను వెళ్లాల్సి వచ్చింది. నాకు బాధ కలిగేది. అప్పుడప్పుడు కొంత తృప్తి కూడా కలిగేది. నేను నా కన్యాత్వాన్ని ఎప్పుడు కోల్పోయానో నాకే తెలియదు.

ఆల్కహాల్ తీసుకొనేటప్పుడు- పురుషుల కన్నా మహిళల కంపెనీనే నేను ఎక్కువగా కోరుకుంటాను. తాగిన తర్వాత పురుషులు తమ కామాన్ని వెల్లడిస్తారు. వారితో కలిసి తాగుతున్నానంటే వారి కోరికలు తీర్చటానికి నేను సిద్ధంగా ఉన్నాననుకుంటారు. అలాంటి వాళ్లను చూస్తే జాలేస్తుంది. వారి జీవితంలో భావ దారిద్య్రం ఎక్కువ. వారికి జీవితంలో సెక్స్ తప్ప వేరే భావన ఏదీ లేదా అనిపిస్తుంది. మహిళలతో అయితే ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. వారిని కౌగిలించుకోవచ్చు. పట్టుకొని డ్యాన్స్ చేయచ్చు. వారు నా నుండి వేరే ఏం ఆశించరు కదా! ఈ పనులు పురుషులతో చేయలేను… సినిమాలో బెడ్‌రూం సీనుల్లో నటించేటప్పుడు- శృంగార భావనలు కలుగుతాయా అనే ప్రశ్నను చాలా మంది అడుగుతూ ఉంటారు. షూటింగ్ జరిగేటప్పుడు మొత్తం యూనిట్ అంతా ఉంటుంది. అందరూ చూస్తున్నప్పుడు సెక్స్ ప్రేరణలు ఎలా కలుగుతాయి? మహిళలకు సంబంధించినంత వరకూ శృంగారమనేది శరీరానికి సంబంధించినది మాత్రమే కాదు. మానసిక అనుబంధం లేకపోతే సెక్స్‌ను ఆనందించలేరు. నేను చిత్రాల్లో చేసేది కేవలం నటన మాత్రమే. నటిస్తున్నప్పుడు నాకెప్పుడూ సెక్స్ కోరికలు కలగలేదు.

దివాళాకోరు అక్క!
ఈ పుస్తకాన్ని మా పెద్దక్క నూర్జహాన్ చదవాలని నేను కోరుకుంటున్నా. ఆమే నేను దివాళా తీయటానికి ప్రధాన కారణం. ఒకప్పుడు దక్షిణ భారతదేశ చలనచిత్ర రంగంలో ఎక్కువ పారితోషికం తీసుకొన్న నటీమణిని నేనే. అయినా నా సంపాదనంతా మా అక్క దొంగిలించింది. ఆమే నా డబ్బు వ్యవహారాలన్నీ చూసేది. నేను తనని పూర్తిగా నమ్మాను. నా చిన్నప్పటి నుంచి తను నాతోనే ఉంది. ఎప్పుడూ తను అలా ప్రవర్తిస్తుందని నేను ఊహించలేదు. ఒక దశలో నేను ఈ సినిమాలతో విసిగిపోయాను. ఒక లొకేషన్ నుంచి మరొక లొకేషన్‌కు విమానాల్లో తిరగటం- కంటి మీద కునుకు లేకుండా షూటింగ్‌లు చేయటం నాకు విసుగనిపించాయి. నేను ఒక బ్రేక్ తీసుకుందామనుకున్నా. పెళ్లి చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదామనుకుంటున్నానని మా అమ్మతోను, నూర్జహాన్‌తోను చెప్పాను. వాళ్లిద్దరూ షాక్ తిన్నారు. నేనేదో పెద్ద నేరం చేస్తున్నట్లు చూశారు. నూర్జహాన్ అలాంటి తెలివితక్కువ నిర్ణయాలు తీసుకోవద్దని నచ్చచెప్పటం మొదలుపెట్టింది. వారు కేవలం నా డబ్బునే ప్రేమించారని, నా భవిష్యత్తు మీద వారికి ఎటువంటి ఆలోచన లేదని తేలింది. నాకు చాలా కోపం వచ్చింది. నేను సంపాదించిన డబ్బంతా ఇచ్చేయమన్నా. డబ్బంతా ఇంటికే ఖర్చు పెట్టేసానంది నూర్జహాన్. నాకు షాక్ తగిలినంత పనైంది.
(ఓపెన్ సౌజన్యంతో)

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.