అవార్డులు తీసుకోవటం తన బాల హీనత అంటున్న కవి శివా రెడ్డి

 

ఆఫ్ ది రికార్డ్
కవులు ‘హీరో’లు కాకపోవచ్చు… కానీ వారిలో హీరోయిజానికి మించినదేదో ఉంటుంది.. సాహిత్యకారుడు ‘సెలబ్రిటీ’ స్టేటస్ పొందకపోవచ్చు.. కానీ వారిలో సెలబ్రిటీల్లో కనిపించని చరిష్మా ఏదో ఉంటుంది.. ఏ ఉత్ప్రేరకం వాళ్లని అలా తయారు చేస్తుందో ‘ఆఫ్ ద రికార్డ్’ మనకు తెలుపుతుంది.. ‘వివిధ’ పాఠకుల కోసం మొదటగా కె.శివారెడ్డితో ముఖాముఖి..

బాల్యంలో మీరేం కావాలని అనుకునేవారు? కవి కాకపోతే ఏమయ్యేవారు?
– కవిని కాకపోతే గొప్ప పాటగాన్ని అయ్యేవాన్ని. 11 ఏళ్లప్పుడే గాత్రం నేర్చుకోడానికి వెళ్లాను. ‘సభానంతర సభ’ల్లో నా పాటను అజంతా, మో, దేవిప్రియ, సిధారెడ్డి, స్మైల్, కొత్తపల్లి తదితరులు ఎంజాయ్ చేసేవాళ్లు.
నేను నిజానికి కథతో మొదలయ్యాను. డిగ్రీ సెకండియర్‌లో కాలేజ్ మ్యాగజైన్‌లో నాదొక కథ అచ్చయింది. సెకండియర్‌లో 24 పద్యాలు రాశాను. లలిత గీతాలు 200 దాకా రాసి ఉంటాను. తర్వాత వచన కవిత్వంలో పడ్డాను. కవిత్వం కోసమే హైదరాబాద్ వచ్చాను.

18 సంకలనాలు వేశారు కదా.. సంకలనాల్లో చేర్చని కవిత్వం ఇంకా ఎంత ఉంటుంది?
– పత్రికల్లో అచ్చయిన నాలుగు సంపుటాలంత కవిత్వాన్ని సంపుటాల్లో చేర్చలేదు. నాలుగైదు సంపుటాలంత కవిత్వం అచ్చుకు పంపనిది కూడా మిగిలిపోయింది. అదంతా భద్రంగా ఉంది. నాకు దేన్నీ పడేసే అలవాటు లేదు. చిన్న కవి పంపిన పుస్తకమైనా పడేయను. అలాగే నాకొచ్చిన ఉత్తరాలు కూడా భద్రంగా ఉన్నాయి.

మీరు చాలా విరివిగా కవిత్వం రాస్తున్నారు. అందువల్ల కవిత్వం పలుచబడడానికి, పునరుక్తికి అవకాశం ఉండదా?
– విస్తృతంగా రాయడం అనేది బహుశా ఆ కవి స్వభావానికి సంబంధించింది. అయితే విరివిగా రాసే కవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే పైన చెప్పిన అంశాలు పరిహరించబడతాయి. విస్తృతంగా చదవడం వల్ల వస్తు వైవిధ్యం వల్ల క్రమక్రమంగా ఆంతరిక లోకాల్ని ఆవిష్కరించుకునే క్రమంలో ఉండటం వల్ల నన్ను నేను రీడిస్కవర్ చేసుకుంటూ పోవడం వల్ల వచ్చిన రీఇన్‌వెన్షన్ నన్ను రక్షించింది. ఒకవేళ ఒకే వస్తువు ఈ ఐదు దశాబ్దాల కాలంలో నా కవిత్వంలో దర్శనమిస్తే ఆయా నిర్దిష్ట స్థల కాలాల నుంచి దాన్ని బహుముఖంగా లోతుగా అందుకోవడం వల్ల మొనాటనీ కనిపించదు.

పైగా నాకు వస్తు నియమం లేదు. పొలిటికల్ కమిట్‌మెంట్ ఉంటుం ది. నిరంతర అన్వేషణ ఉండాలి వస్తువు విషయంలో. ప్రజా రాజకీయ నిబద్ధత నాకు చాలా విషయాలు బోధిస్తుంది. వస్తువు, ప్రయోగం విషయంలో వీటన్నిటికీ సంబంధించి ఎప్పటికప్పుడు నన్ను నేను అప్ టు డేట్ చేసుకోవడం చాలా మెలకువగా ఉండడం వల్ల కూడా పైన చెప్పినవి తప్పినవి.

మీ అంత విరివిగా కవిత్వం రాయడం అవసరమంటారా? ఇట్లా ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా?
– అవసరమే. ఒక బాడీ ఆఫ్ లిటరేచర్ ఉంటే తప్ప ఒక యాభై ఏండ్ల కాలంలో వచ్చిన మార్పుల్ని రికార్డు చేయడం సాధ్యం కాదు. నేను 20 పుస్తకాలే అచ్చేశాను. నెరూడ 50 కవితా సంపుటాలేశాడు. గ్రీకు కవి రిట్‌సాస్ 60 వేశాడు. ఎక్కువ రాసినా పల్చబడకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందే. మనకు మాత్రం ఎక్కువ రాసినవాళ్లు లేరా! సినారె, సోసు, కుందుర్తి..
ఇంగ్లీషు కవిత్వం చదివేవారు ఆ భావాలను కాపీ కొడతారనే విమర్శ ఉంది? కొన్ని కవితలు చదివినప్పుడు ఇన్స్‌పైర్ కూడా అవుతాం కదా..
– ప్రపంచ వ్యాప్తంగా కవులందరూ ఒక రకంగా నన్ను ఇన్‌స్పైర్ చేశారు. ఈ మధ్య ఒక అఫ్ఘానిస్తానీ కవిత చదివి నేనొక కవిత రాశా. ఇక్కడి సందర్భాన్ని కవిత చేశా. ఆ విషయాన్ని ఉటంకించా. ఎక్కడ ఏ కవి నుంచి ప్రేరణ పొందినా ఎప్పుడూ దాయలేదు. ఇతర కవుల కవిత్వం రక్తనిష్ఠం కావాలి తప్ప అనుకరణ కాకూడదు.

కవిత్వం ఆవేశాత్మకం, వచనం ఆలోచనాత్మకం అంటారు. నిజమేనా?
– మనలో తప్పుడు అభిప్రాయాలు రుజువు చేయబడకుండా స్థిరపడ్డాయి. దాంట్లో ఇదొకటి. ఏం లేదు, కవిత్వంలో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వచనంలో కాస్త తక్కువుంటుంది. అంతే తప్ప రెండు ప్రక్రియలు ఆలోచనాత్మకాలే. ఏ ప్రక్రియ చేసే పని ఆ ప్రక్రియ చేస్తుంది. పోటీ పెట్టడం అవివేకం. దేని అనుభవం దానిదే.
కవిత్వం మాత్రమే రాశారు. కథ ప్రయత్నించకపోవడానికి కారణం? రెండు ప్రక్రియల మీద దృష్టి పెడితే దెబ్బ తింటామనా?
– కవిత్వమ్ నాకు మహాంబోధి. అందులోనే మునిగిపోయాను. అందుకే ఇతర ప్రక్రియల జోలికి వెళ్లలేదు. ముందుమాటలు తప్ప. రాయకూడదనేం కాదు. కవిత్వానికే పరిమితమయ్యా.

నేను సవాలుగా తీసుకున్నదేమిటంటే దేన్నయినా కవిత్వంలోనే వ్యక్తీకరించాలని. కవిత్వం చేయాలని. అది నా స్వభావానికి సంబంధించినది.
రెండు మూడు ప్రక్రియల మీద దృష్టి పెట్టడం కన్నా సమస్త శక్తుల్ని ఒక ప్రక్రియ మీదే కేంద్రీకరించడం వల్ల ఒక నాణ్యత, ఒక పరిపక్వత సాధించవచ్చు అనుకున్నా.
మరి నవల రాసే ఉద్దేశమేమీ లేదా?
– ఎప్పటికైనా ఒక బృహత్ నవల రాయాలనే ఆకాంక్ష ఉంది.

మీరు విప్లవవాదా? విప్లవం అంటే మీ దృష్టిలో?
– విరసం సభ్యున్ని కాకపోయినా నేను విప్లవ కవినే.
కుల వర్గాల్ని ఆధిపత్యాల్ని నిర్మూలించి ఒక మహోన్నతమైన సమసమాజ స్థాపన.. దానికి సాయుధ విప్లవం మార్గం అనుకుంటున్నాం ఇప్పుడు. బహుశా అది నేను నమ్ముతున్నా. సమసమాజం వచ్చింతర్వాత కూడా పోరాట అవసరం ఉంటుంది. రాజ్యాధికారం కావాలనుకునే ఏ భావజాలపు సమూహాలకైనా తప్పకుండా ఒక బలమైన రాజకీయ కార్యాచరణ గలిగిన పార్టీ అవసరం.

విరసంలో ఎందుకు చేరలేదు?
– విరసం ఏర్పడేనాటికి శివారెడ్డి నేర్చుకునే దశలోనే ఉన్నాడు. ఇప్పటికి కూడా ఉన్నాడు. అప్పుడు చేరి ఉండాల్సింది. చేరకపోయినా దానితో గాఢ అనుబంధం నాలుగు దశాబ్దాలుగా ఉండడం వల్ల నన్ను విప్లవ కవిగానే పరిగణిస్తున్నారు. విరసం శివారెడ్డిని క్లెయిమ్ చేసుకుంది. నేను కూడా విరసాన్ని ఓన్ చేసుకున్నాను. అందుకనే విరసంతో పుట్టి పెరుగుతున్నవాన్ని అని చెబుతూ ఉంటాను.

అవార్డులు తీసుకుంటున్నారు కదా!
– కాలికి గజ్జె కట్టింతర్వాత ఎవడు కన్నుగొట్టినా ఒప్పుకోవాలంటారు. అటువంటిదేదో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకోవడానికి అంగీకరించినప్పుడే జరిగింది. ఈ చిన్న చిన్న లౌల్యాలకు దూరంగా ఉండటం మంచిదే. బహుశా నాలో ఇదొక బలహీనతేమో.
అస్తిత్వ వాదాలని రికార్డెడ్‌గా మీరు ఎక్కడా సపోర్ట్ చేసినట్లు కనిపించదు?
– వ్యతిరేకించినట్లు కూడా రికార్డు లేదు. వ్యతిరేకించలేదంటే అంగీకరించినట్లే కదా. అన్ని అస్తిత్వోద్యమాల నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నా కవిత్వ విస్తృతికి అవి చాలా దోహదపడ్డాయి.
అంత పరోక్షంగా సపోర్ట్ చేయడమెందుకు? డైరెక్ట్‌గా చేయవచ్చు కదా?
– తాత్వికంగా మార్క్స్, లెనిన్, మావో ఆలోచనా విధానం నాది. అది నా గైడింగ్ ఫోర్స్, వ్యక్తిత్వానికి.. కవిత్వానికి. ఈ వెలుగులో నేనన్ని వాదాల్ని విశ్లేషించుకున్నాను. ఆయా వాదాల ప్రభావం నా కవిత్వంలో ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇవన్నీ ఈ ఆలోచనా విధానంలో ఇముడుతాయనుకుంటాను. నేను అన్నింటికీ ఆరోగ్యకరమైన దూరాన్ని పాటించాను.

మీకు నచ్చని కవులు?
– ప్రజా వ్యతిరేక కవి ఎవడైనా నాకు నచ్చడు.
నచ్చని పుస్తకాలు?
– ‘తులసీదళం’ లాంటి పుస్తకాలు.
ఈ తరం కవులు మీ నుంచి నేర్చుకోకూడని అంశాలు?
– నేర్చుకోదగిన వాటికంటే నేర్చుకోతగనివి నాలో చాలా తక్కువ. ఒకటి- క్లాసికల్ లిటరేచర్ చదువుకోవడం వల్ల, పద్య సాధన వల్ల అబ్బిన సాంస్క్రిటైజ్‌డ్ డిక్షన్‌ని పూర్తిగా వదిలించుకోలేకపోవడం. రెండు- మోతాదుకు మించి లిరికల్ ఆటిట్యూడ్ ఉండడం.
కొత్తతరం కవులు విస్తృతంగా చదవడం లేదని విమర్శ ఉంది…
– మనం అనుకున్న పద్ధతిలో వాళ్లు చదవట్లేదేమో కాని అందినంత మేరా కొత్త సాహిత్యాన్ని కొత్త కవిత్వాన్ని చదువుతూనే ఉన్నారు. కాని ఈ సంక్లిష్ట సంక్షోభ సందర్భం ఇచ్చినటువంటి ఒక గొప్ప ఖిఞఠట వాళ్లకుంది. అదే తీవ్రతతో అదే తాజాదనంతో కొనసాగుతారా లేదా అన్నది పెద్ద ప్రశ్న. వాళ్ల అంకిత భావాన్ని బట్టి కొనసాగదల్చుకున్నవారు తప్పకుండా చదువుతారు.

ఇప్పటి కవుల్లో మీరు గమనించిన అవలక్షణాలు?
– 1. మీడియాకి బలైపోవడం. 2. ఉండాల్సినంత నమ్రత, అణకువ లేకపోవడం. దీన్నే అఖూౖఔఈ ఇంటలెక్చువల్ హ్యుమిలిటి అన్నాడు.
ఒక్క సంసారానికే కిందా మీదా పడుతుంటారు.. మీరు రెండు సంసారాలు నడుపుతూ కూడా విస్తృతంగా రాస్తున్నారు. ఏమిటి రహస్యం?
– పెద్ద రహస్యమేమీ లేదు. తెలుగులో సంభాళించుకోవడం అనే మాట ఉంది. బహుశా దాన్ని ఆచరణలో పెట్టాననుకుంటా. ఒక సంయమనంతో అన్నింటినీ బాలెన్స్ చేసుకునే దృష్టి కూడా దోహదం చేసిందనుకుంటా. ఈ గొప్పదనం నాది కాదు. వాళ్లదే. వాళ్లిద్దరు గానీ పిల్లలు గానీ నాకెప్పుడూ అవరోధాలు కాలేదు. ఉత్ప్రేరకాలు అయ్యారు తప్ప. నేను కవిగా బతికుండటానికి 80 శాతం వాళ్లే కారణం. ‘ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును’ అనే రహస్యం నాకు తెలుసు.

మీరు మరో పెళ్లికి సిద్ధపడ్డానికి కారణం?
– మొదట నన్ను గాఢంగా ఆరాధించే వ్యక్తిని గమనించకపోవడం.. తర్వాత అలాంటి ఆ వ్యక్తిని వదులుకోలేక..
కవిత్వ సాధన మీలో ఏమైనా మార్పులు తెచ్చిందా?
– నా షార్ట్‌టెంపర్డ్‌నెస్ తగ్గించింది. అంటే నా వృత్తి ప్రవృత్తి ఒక రకంగా నన్ను శుద్ధి చేశాయి. దేంట్లోనూ అతి కాకుండా కాపాడాయి.
మీకు బాగా పేరు తెచ్చిన కవితల విషయంలో అసంపూర్ణతను ఏమైనా ఫీలయ్యారా?
– కవితలన్నీ అసంపూర్ణాలే. ఆ ఇన్‌కంప్లీట్‌నెస్ ఇంకో కవిత రావడానికి దోహదం చేస్తుంది.

మీరు ‘వేకువ’ అనే సాహిత్య పత్రిక నడిపారు కదా.. ఎందుకు ఆపేశారు?
– అందరికీ అదొక వేదికగా ఉండాలని ప్రారంభించాను. అయితే నా కవిత్వానికి వెచ్చించాల్సిన సమయాన్ని అది తినేయడం మొదలుపెట్టింది. నేను కవిత్వానికే అంకితం కాదలచుకున్నాను. అందుకే ‘భారతి’లో రాస్తున్న పుస్తక సమీక్షల్ని కూడా ఆపేశాను.
పేరు ప్రఖ్యాతులు పొందిన కవులకు చాలా ముఖాలు ఉంటాయంటారు. మీకు?
– ఇన్నేళ్ల సాధనా కార్యక్రమమంతా కూడా ఈ ముఖాల్ని తొలగించుకోవటంలోనే. వ్యక్తిగత వైరుధ్యాల్ని పరిష్కరించుకునే క్రమం గమనించకపోతే/తెలియకపోతే ముసుగు లవసరమౌతాయి.
మిమ్మల్ని బాధించిన సందర్భాలు, సంఘటనలు…
– దగ్గర మిత్రులనుకున్నవాళ్లు అమిత్రులవడం. అసూయ, ద్వేషాలు..
మీ సమూహంలోంచి వచ్చిన కవులు మిమ్మల్ని దాటి ముందుకెళ్ల లేదని ఒక విమర్శ..
– నా తర్వాత వచ్చిన రెండు మూడు తరాల్ని నాతో పోల్చి తూకం వేయకూడదు. బహుశా వాళ్లు క్రమ వికాసం చెందే దశలో ఉన్నారు. ఉత్తరోత్తరా వాళ్లు నన్ను అధిగమించవచ్చు. అధిగమించాలని కోరుకుంటున్నా.

మీ విషయంలో సభానంతర సభలు బాగా పండుతాయంటారు?
– సభానంతర సభలు బాగుండటానికి, హాయిగా ఉండటానికి అందరూ నగ్నంగా బైటికి రావడమే కారణం. సభానంతర సభలు ఎప్పుడూ కూడా సృజనాత్మక సన్నివేశాలే. కవిత్వం వింటం, చదవటం, డిక్టేట్ చేయడం, పాటలు పాడుకోడం.. ఇవన్నీ మనం బతికి ఉన్నామని చెబుతాయి, ఒక రకంగా.
-ఇంటర్వ్యూ : స్కైబాబ

కవిత్వంలో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వచనంలో కాస్త తక్కువుంటుంది. అంతే తప్ప రెండు ప్రక్రియలు ఆలోచనాత్మకాలే. ఏ ప్రక్రియ చేసే పని ఆ ప్రక్రియ చేస్తుంది. పోటీ పెట్టడం అవివేకం. దేని అనుభవం దానిదే.
రెండు మూడు ప్రక్రియల మీద దృష్టి పెట్టడం కన్నా సమస్త శక్తుల్ని ఒక ప్రక్రియ మీదే కేంద్రీకరించడం వల్ల ఒక నాణ్యత, ఒక పరిపక్వత సాధించవచ్చు అనుకున్నా.
అస్తిత్వ వాదాలను వ్యతిరేకించినట్లు కూడా రికార్డు లేదు. వ్యతిరేకించ లేదంటే అంగీకరించినట్లే కదా. అన్ని అస్తిత్వోద్యమాల నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నా కవిత్వ విస్తృతికి అవి చాలా దోహదపడ్డాయి.
 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.