తన ‘కథే’ మిటంటున్న ఉత్తరాంధ్ర – బమ్మిడి జగదీశ్వరరావు
‘ప్రాంతీయ అస్తిత్వం’ కేంద్రంగా చూసినప్పుడు ఉత్తరాంధ్రలో ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాల స్పృహ లేదనే చెప్పాలి. అయితే ‘ప్రత్యేక తెలంగాణ’ పోరాటాలు ఈ పది పన్నెండేళ్ళుగా ఉధృతమవుతూ రావడం ఉత్తరాంధ్రకూ ఉత్తరాంధ్ర కథకులకూ ప్రేరణగా మారింది. దాంతో అస్తిత్వ స్పృహ యిప్పుడిప్పుడే మొదలై ఆ దిశగా కథా రచన ‘ప్రాంతీయ అస్తిత్వం’లోకి ప్రవేశించింది… పాయలుగా మొదలై ప్రతి అస్తిత్వంలోకి ప్రవహించిన అస్తిత్వవాదాలు తమకు తామే పరిపూర్ణము కామని కూడా గమనించాలి. అలాగే వివిధ అస్తిత్వవాద ఉద్యమాల్ని ఆరోగ్యకరంగా భావించి ఆహ్వానించాల్సిన విముక్తి ప్రధాన ఉద్యమాలు వాటి ఉనికిని గుర్తించడంలో తమ ఉనికికే ప్రమాదం వస్తుందని స్తబ్ధంగా వుండడం వల్ల వాటి ప్రాధాన్యత ప్రధానంగా సాహిత్యంలో లోపించిందని చెప్పక తప్పదు.
ఆంధ్ర రాష్ట్రమనగానే తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర… యివే, యివి మాత్రమే. ఈ మూడు ప్రాంతాల ‘త్రివేణి సంగమం’గానే తెలుగునేల ప్రచారమయ్యింది. ప్రదర్శితమయ్యింది. అటు రాజకీయ ప్రతినిధులూ వారు నడిపే ప్రభుత్వాలూ అవి వేసే కమిటీలూ – యిటు మీడియా ప్రతినిధులూ వారు నడిపే మేధావులూ అవి చూపే లెక్కలూ – యింకా చెప్పాలంటే సామాజిక శాస్త్రవేత్తల లెక్కలూ అన్నీ కలిపి- మూడు ప్రాంతాల ముచ్చటైన తెలుగువాళ్ళు! అంతే. ఉత్తరాంధ్ర వొక ఉష్ కాకి!
ఆంధ్రాలో ‘కోస్తా – ఆంధ్ర’ ఉన్నప్పుడు ‘ఉత్తరాంధ్ర’ ఎందుకు ఉండదు? ఉంటే కోస్తాంధ్రలో భాగంగానే ఎందుకుంది?
సామాజిక దర్పణంగా చూడాల్సిన సాహిత్యం ఒక్కటే విడిగా ఉత్తరాంధ్రని ఎన్నడూ చూస్తోంది. ప్రత్యేకతని గుర్తిస్తోంది. నిజానికి కోస్తాంధ్ర ఉత్తరాంధ్రల మధ్య నైసర్గిక స్వరూప స్వభావాల్లోనే కాదు, సామాజికం గా సాంస్కృతికంగా ఆర్థికంగా ఏ పోలికా లేదు. తెలంగాణకు రాయలసీమకు కోస్తాంధ్రకు మధ్య ఎంత వైవిధ్యముందో ఉత్తరాంధ్రకూ మిగతా ప్రాంతాల నడుమ అంతే వైవిధ్యముంది. ఈ వైవిధ్యాన్ని గుర్తించకుండా కోస్తాంధ్రతో కలిపి చూడడం.. కలిపి మాట్లాడ్డం ఒక విషాదం!
ఆంధ్రా పెత్తనం వద్దని ఆత్మగౌరవమంటూ తెలంగాణ వేరుపడింది. రాయలసీమ వెనుకబాటుతనంతో తమది ప్రత్యేక ప్రాంతమంది. ఎటోచ్చీ కోస్తాంధ్ర నీడన చీకట్లో అస్తిత్వమే అగుపించకుండా నిలబడింది ఉత్తరాంధ్ర!
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మూడు ప్రాంతాలు వెనుకబాటుకు వెనుకనే ఉన్నాయనేది నిర్వివాదాంశం. శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధారతో పాటు మహేంద్ర తనయ, చంపావతి, బహుదా, కుంబికోటగడ్డ, సువర్ణముఖి, వేగావతి, గోముఖం వొకటి కాదు రెండు కాదు తొమ్మిది నదులు పారాడుతున్నాయి. విజయనగరం జిల్లాలో నాగావళి, సువర్ణముఖి, వేగావతి, చంపావతి, గోస్తాని, కందివలసగెడ్డ పారుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలో శారద, తడవ, వరాహ నదులే కాక మేఘాద్రి గెడ్డ, గంబీరగెడ్డ, నరవ జలాశయాలూ వున్నాయి. నీటి వనరులే కాక అటు అంతులేని అటవీ ప్రాంతం.. యిటు అద్భుతమైన సముద్ర తీరం. తూర్పు కనుమల మధ్య సారవంతమైన నేల. ఆ నేలన వరి, చోడి, జొన్న, గంటి చెరకు, గోగు, నువ్వు, వేరుశనగ.. పండని పంట లేదు. యింకా ఉద్దాన తీర ప్రాంతాన కొబ్బరి.. మెట్టు ప్రాంతాల జీడిమామిడి.. మత్స్య పరిశ్రమ.. ఔషధ మొక్కలు మొదలు ఖనిజ సంపద వరకూ- ‘ఉత్తరాంధ్రకు తాళం కురసా? మేళం కురసా? యేటి కురసంతే..?’-
‘జబ్బడు కొప్పు.. జడేస్తే జారిపోయింది!’
-యేటీ తిత్తవ? యేటి కతేటి? -అనంటే కథలు కథలుగా కథకులు చెప్పినా- చెప్పిన / రాసిన దానికంటే.. చెప్పవలసింది/రాయవలసిందే ఎక్కువగా వుంది. గతించిన కాలాన్ని అటుంచితే, ఈ పుష్కర కాలంలో- కాలం కాని కాలంలో- ఉత్తరాంధ్ర కథ పాలకులు పట్టించుకోలేదు సరే, కథకులూ పట్టించుకోవలసినంత పట్టించుకోలేదు. ఉత్తరాంధ్ర కూడా అన్ని ప్రాంతాలలాగే పట్టుకు దొరక్కుండా పెనుమార్పులకు గురవుతూ వస్తోంది. సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణలకు వాటి ప్రభావాలకూ లోనవుతూ వస్తోంది.
‘ప్రాంతీయ అస్తిత్వం’ కేంద్రంగా చూసినప్పుడు ఉత్తరాంధ్రలో ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాల స్పృహ లేదనే చెప్పాలి. అయితే ‘ప్రత్యేక తెలంగాణ’ పోరాటాలు ఈ పది పన్నెండేళ్ళుగా ఉధృతమవుతూ రావడం ఉత్తరాంధ్రకూ ఉత్తరాంధ్ర కథకులకూ ప్రేరణగా మారింది. దాంతో అస్తిత్వ స్పృహ యిప్పుడిప్పుడే మొదలై ఆ దిశగా కథా రచన ‘ప్రాంతీయ అస్తిత్వం’లోకి ప్రవేశించింది.
ప్రాంతీయ అస్తిత్వంలో భాగమైన స్థానిక పోరాటాలు వ్యవస్థల వైఫల్యాల్ని, వ్యవస్థల నిరంకుశత్వాన్ని ఎదిరించి ఉత్తరాంధ్ర పోరాట వారసత్వాన్ని మరోమారు నిరూపించుకున్నాయి. థర్మల్ పవర్ ప్లాంట్ల వ్యతిరేక ఉద్యమాల్లో ‘సోంపేట’ ముందుండి దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ నేపథ్యంలో వచ్చిన అట్టాడ అప్పలనాయ్డు ‘సందిగ్ధాకాశం’ ‘వికృతి’ కథల్ని చెప్పుకోవాలి. పిట్టమీద పిల్లిమీద పెట్టి రాసినా ఎంతో కళాత్మకంగా ఈ కథల్ని వర్తమాన చరిత్రలో భాగం చేసారు. నిజానికి సోంపేట మహోద్యమంగాని- దాన్ని ఆనుకొని ఉన్న ‘కాకరాపల్లి’ ఉద్యమంగాని ఆ మాటకొస్తే ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్న ఉత్తరాంధ్రలోని పదహారు థర్మల్ పవర్ ప్లాంటులుగాని- కొవ్వాడ మత్స్యలేశం దగ్గర నెలకొల్పనున్న అణువిద్యుత్ కేంద్రంగాని- ఇంకా చెప్పాలంటే ఇచ్ఛాపురం నుండి తడ వరకు డబ్బైయ్యారు థర్మల్ పవర్ ప్లాంట్లు.. ఎంత విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తాయోగాని- అంతకు మించిన విద్యుత్‌శక్తి యిక్కడి ప్రజల్లో కనిపిస్తోంది. ఈ శక్తిని అందిపుచ్చుకోవడంలో- కథని చెయ్యడంలో- ఉత్తరాంధ్ర కథకులు వెనుకబడిపోయారు.
ప్రపంచవ్యాపితంగా వినాశనాల్ని చవిచూసిన దేశాలు విసర్జించిన పద్ధతుల్ని తెచ్చి మహాప్రసాదం అంటున్నాయి మనదేశాలు. సౌరశక్తి, వాయుశక్తి, బయోమాస్ లాంటి పునరుత్పాదక ప్రత్యామ్నాయ వనరులపై లేని శ్రద్ధ.. అత్యంత ప్రమాదకర పరిశ్రమలు నెలకొల్పడంలో ప్రభుత్వాల ఉద్దేశమేమిటో- వ్యతిరేకించే ప్రజల్ని వేధించి వెక్కిరించి తమ ముందస్తు నిర్ణయాన్ని ‘ప్రజాభిప్రాయ సేకరణ’ ప్రహసనంలో ప్రజామోదం పొందడమేమిటో- అది ఎవరి అభివృద్ధో- అభివృద్ధికి అణచివేతలేమిటో- మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండని మొరపెట్టుకోవాల్సి రావడమేమిటో- వృత్తులు పోవడమేమిటో- ప్రకృతి ప్రళయాన్ని మిం చిన విపత్కర పెనువిపత్తు యేమిటో- కోస్తా కారిడార్ల పేరుతోనో సెజ్‌ల పేరుతోనో పరిశ్రమల పేరుతోనో నోటిముందున్న కూడునే కాదు, కాలి కింద నున్న నేలను సయితం లాగేసుకోవడమేమిటో- విశాఖ మన్యంలోని బాక్సైట్ తవ్వకాలను జిందాల్ కంపెనీకి కట్టబెట్టడమేమిటో- కన్నెధార కొండమీద గ్రానైట్ వ్యాపారం గ్రాండుగా చేసుకొమ్మని మంత్రిగారి పుత్రరత్నానికి ప్రభుత్వం పాలేరులా పనిచేయడమేమిటో- ఆదివాసుల ఆరాట పోరాటమేమిటో- మైదానవాసుల మొరేమిటో- ప్రజలంటే నిర్వాసితులుగా వలస కూలీలుగా పుట్టిన గడ్డ మీద కాందిశీకులు కావడమేమిటో- ‘కథ’ యింకా చెప్పనే లేదు! అత్యంత వేగంగా మార్చేస్తున్న తలరాతల్ని ఎవరు ఎందుకు లిఖిస్తున్నారో పసిగట్టి పంచనామా జరిపి ప్రభుత్వమ్మీద కథల ఛార్జిషీట్ తెరవాల్సిన కథకులు తెరవనే లేదు!
కొత్త కథకులు రావడం లేదు. వచ్చినా గతాన్ని చెప్పడంలో తప్పితే వర్తమానాన్ని చెప్పడంలో ముందుకడుగేయలేకపోతున్నారు. అవగాహనా లేదు. అధ్యయనమూ లేదు. అస్తిత్వం ఏకరూపంగా కాక బహురూపాలుగా బహుముఖాలుగా వుండడము కూడా వొక కారణం. బహురూపాలుగా బహు ముఖాలుగా విస్తరించిన అస్తిత్వాల నడుమన వైరుధ్యం వుంది. అది శత్రుపూరిత వైరుధ్యంగా మొదలై మిత్రపూరిత వైరుధ్యంగా మారడాన్ని గమనించాలి. పాయలుగా మొదలై ప్రతి అస్తిత్వంలోకి ప్రవహించిన అస్తిత్వవాదాలు తమకు తామే పరిపూర్ణము కామని కూడా గమనించాలి. అలాగే వివిధ అస్తిత్వవాద ఉద్యమాల్ని ఆరోగ్యకరంగా భావించి ఆహ్వానించాల్సిన విముక్తి ప్రధాన ఉద్యమాలు వాటి ఉనికిని గుర్తించడంలో తమ ఉనికికే ప్రమాదం వస్తుందని స్తబ్ధంగా వుండడం వల్ల వాటి ప్రాధాన్యత ప్రధానంగా సాహిత్యంలో లోపించిందని చెప్పక తప్పదు. రాజ్య నిర్బంధమూ మార్కెట్ మాయాజాలమూ వైయక్తిక నిబద్ధతల సడలింపూ ప్రయోజనమూ.. వీటి కారణంగా ఉవ్వెత్తున లేచిన ఉద్యమాలు ఒడిదుడుకులకు లోనవడంతో ఆయా ప్రేరణలతో నడిచిన సాహిత్య సంస్థల కార్యక్షేత్రం విస్తరించకపోగా- అప్పటివరకూ రచయితలకు అందిస్తూ వచ్చిన పునాది అంశాలను కొత్తతరం అందుకొనే అవకాశం లేకపోయింది.
సిద్ధాంతాలను పనిముట్లుగా కాక పరమావధిగా భావించడమూ- అలా అని ప్రచారం జరగడమూ అసలు ఓ దృక్పథాన్ని రచయితలకు ఏర్పరచే వీలు పోయి ఎంతో నష్టం జరిగింది. జరుగుతూ వుంది. రాజకీయార్థంలో చూడకుండా రాజ్యం స్వభావాన్ని అర్థం చేసుకోలేం. రాజ్య స్వభావాన్ని అర్థం చేసుకోకుండా రాజ్యంలోని ప్రజల జీవనాన్నీ అర్థం చేసుకోలేం. కార్యకారణ సంబంధం బోధపడదు. సామాజిక సందర్భాలుగా కాక కేవలం ఘటనలుగా మాత్రమే చూసిన కథకులు నడుస్తున్న చరిత్రను కథనం చెయ్యడంలో సహజంగానే కన్నూ పెన్నూ పెట్టలేకపోయారు. సుదీర్ఘకాలంగా విశ్వాసముంచిన పాత కథకులు తమ కల నెరవేరకపోవడంతో నైరాశ్యానికి లోనయి అడపా దడపా కథల్ని రాస్తూ సరిపెట్టుకుంటున్నారేమోననిపిస్తూ వుంది.
సరే, రచయితల వెనుకబాటునుంచి మళ్లీ ఉత్తరాంధ్ర వెనుకబాటులోకి వచ్చి చూస్తే- ఎన్నో కథాంశాలు తమని కథలుగా మలచమని డిమాండ్ చేస్తూ ఎదురొస్తాయి.
‘ఉద్దానం’గా పిలవబడుతున్న ఉద్యానవనంలో ఈ పదేళ్ళకాలంలో పన్నెండువేలమంది మృత్యువాత పడ్డారు, కిడ్నీ వ్యాధుల వల్ల. ఏడెనిమిదేళ్ళుగా ఈ వ్యాధి రోజురోజుకూ విజృంభిస్తూ వస్తోంది. ఇవాల్టికీ ప్రతిపల్లెనుండీ ప్రతిరోజూ మూడు నాలుగు శవాలన్నా కనీసంగా లేస్తున్నాయి. ప్రతి ఊరూ వొక వల్లకాడే! వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (గిఏౖ) వారి దృష్టి కూడా పడిందిగాని మన గుడ్డి ప్రభుత్వాలకు చూపు ఆనలేదు. ప్రతిపక్షాల నోట ఒక్కమాట పలుకలేదు. చీమ చిటుక్కుమంటే చాలు కన్ను తిప్పే మీడియా కన్ను తెరవనేలేదు. చావుల నది నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. ఈ విషయమై ఉత్తరాంధ్ర కథ కూడా చప్పుడు చెయ్యలేదు. ‘కంబస్థం’ అనే కథలో కేవలం సమస్యను ప్రస్తావించిన బల్లెడ నారాయణమూర్తిదే ‘దగ్ధం’ అనే ఇంకో కథ తప్పితే మరొక్క కథ రాలేదు. ఎవరి కథలను వాళ్లే రాస్తున్న రాసుకోవలసిన కాలమిది. అగ్నికుల క్షత్రియులు (పల్లీలు), బలిజ-శెట్టి బలిజ (చేపల్ని వేటాడేవాళ్ళూ-అమ్మేవాళ్ళూ), శ్రీశైన (సెగడీలు) ఇంకా సాంప్రదాయక మత్స్యకారులు కండ్ర, తీర కులస్థులు (వీళ్లను ప్రభుత్వం యింకా ఓసీల్లోనే వుంచింది) సోంపేట బీల భూముల్ని ప్రభుత్వం నుండి లీజుకు తీసుకున్నది వీరే.. వీరిలో 18 ఉపకులాలు, అలాగే కమ్మరి, కుమ్మరి, దేవాంగులు.. యిలా యెందరో రెక్కాడితేగాని డొక్కాడని వాళ్ళే. కిడ్నీవ్యాధులు వొకవేపు.. థర్మల్ పవర్‌ప్లాంట్ల పిడుగులు వొకవైపు.. వైద్యం అందకపోయినా ఇంటింటికీ (పవర్‌ప్లాంటులను కాదన్నందుకు) కేసులు.. కోర్టే ఎక్కే గుమ్మం దిగే గుమ్మం.. మా కథల్ని ఎవరు రాస్తారని ఉద్దానం యింకా చూస్తూనే వుంది.
‘చుండూరు’ తెలిసిన వాళ్లకి- ‘కారంచేడు’ను ఎరిగినవాళ్లకి ఇక్కడున్న ‘లక్ష్మింపేట’ను కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. అగ్రకులాలు కాదు, వెనుకబడ్డ కులాలదాడిలో దళితులు ప్రాణాలు విడవడం వొక వార్తయ్యిందే తప్ప ‘కథ’ కాలేదు. నడుస్తున్న చరిత్రను సాహిత్యంలో యింకా భాగం చెయ్యవలసే వుంది. దళితవాదం సరే, కనీసం దళిత స్పృహతో దళిత అస్తిత్వాన్ని ఒక్కటంటే వొక్కటి ఒక్క అక్షరం కూడా రాలేదు. అంటరానితనం కథా రచనలోనూ కొనసాగుతున్నదా అనిపిస్తుంది. సంఘీభావం ప్రకటించిన కథకులు యింకా ఇక్కడి తడి ఆరని నెత్తురుకి కథారూపం యివ్వాల్సే వుంది.
విజయనగరం జిల్లా తోటపల్లి నిర్వాసితుల స్థితిగతులను అక్షరబద్దం చేస్తూ గంటేడ గౌరునాయుడు ‘మాయ’ కథను రాస్తే, గంగవరం పోర్టు నిర్వాసితులను గురించి రాయని కథ మిగిలే వుంది. గిరిజన ప్రాంతాల్లోని సాంస్కృతిక జీవనం.. ఆ జీవితంలోనికి ప్రవేశించిన ఆధునిక పోకడలు.. వారసత్వంగా కొనసాగుతున్న దోపిడీ కొత్తతరంలో వస్తున్న చైతన్యం.. సాంప్రదాయక వారసత్వాన్ని పాతరేసే మతమార్పిడి గురించి ఈ కాలంలో అదే ప్రాంతానికి చెందిన మల్లిపురం జగదీష్ తొలి గిరిజన కథకుడిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు, అయితే గిరిజన అస్తిత్వాన్ని వారి వనరుల మీద వేరేవారి పెత్తనాన్ని కట్టబెట్టే ప్రభుత్వాన్ని తనవైపునుంచి చెప్పాల్సేవుంది.
ఢిల్లీలో ‘నిర్భయ’ ఆకర్షించినంతగా తమ యిళ్లలో తాము అత్యాచారాలకు గురైన 22 మంది గిరిజన మహిళల్ని ప్రభుత్వాలూ ప్రజలే కాదు, కథకులూ మర్చిపోయారు. భర్తలతో వెలియై ప్రభుత్వాధి నేతలతో వెక్కిరించబడ్డ వాళ్ల కథావస్తువు యింకా వేచిచూస్తూనే వుంది.
గిట్టుబాటు లేని జీడిపిక్క వ్యాపారస్తులకు లాభాలు తెచ్చి ప్రజలకు కాలుష్యపు పొగ చిమ్మినా దాని మసి యింకా కథకు అంటలేదు. 66గురు అమ్మవార్లు అక్కచెల్లెళ్లంతా అనాధలయినారు. ఇప్పుడు ఒక్క పూరీజగన్నాధస్వామికే కాదు ఏ దేవుడికీ కాళ్లూచేతులూ లేవు. అంతా అనాధలే. సాయి నామం వొక్కటే దీపం. ఆ చీకటి వెలుగుల కథలూ గుడిగోపురాల్లోనే దాక్కున్నాయి.
మండలానికో మాండలికం. యాస బాసల శ్రీకాకుళం వెక్కిరింతకు దగ్గరగా వున్నా- సాహిత్యంలో యెంతో దూరం ప్రయాణించింది. ఉత్తరాంధ్రలో వున్న పలుకూ పదనూ ఆభరణాలుగా ధరించిన జానపద వారసత్వం కథలు కొంతమేర అక్షరీకరించబడ్డాయి. ప్రతి జీవన సందర్భంలో వున్న పాట తొంగి చూస్తోంది. కనుమరుగవుతున్న పదాల్ని పదకోశాలుగా జియస్ చలం లాంటివాళ్లు భద్రపరుస్తూ వున్నారు- అదీ ‘కథ’ కేంద్రంగా.
శరవేగంగా విస్తరిస్తున్న విశాఖ మహానగర జీవితం సాధికారికంగా సాహిత్యీకరించబడలేదు. అయితే మధ్యతరగతి జీవుల.. ముఖ్యంగా స్త్రీల వేపునుండి మల్లీశ్వరి లాంటివాళ్లు రాయడమే కాదు, ఉత్తరాంధ్ర అది కూడా శ్రీకాకుళ యాసబాసల్ని ఒడిసి పట్టుకుని రాయడం ఓ శుభపరిణామం.
మరోవేపు తీరం పొడవునా వందలాదిగా ఫార్మా సుటికల్ కంపెనీలు ఇప్పటికే వెలిశాయి. ఇకముందు వెలియనున్నాయి. పచ్చటి పంటభూములే కాదు గుక్కెడు మంచినీళ్లు తాగే వీలులేని విషకాలుష్యం విస్తరిస్తూవుంది. ఉపాధి దొరికినా, ఉద్యోగం కొన్నాళ్లే, కాటేసినన్నాళ్లే. తలక్రిందులవుతున్న వాళ్ల కతలూ వెతలూ కడివెలకొద్దీ అలాగే వున్నాయి. వలసలు కొనసాగుతూనే వున్నాయి. అన్నవస్త్రాలు కావలసినచోట అణ్వాస్త్రాల తయారీకేంద్రాలు ఏర్పాటవుతున్నాయి.
ఉత్తరాంధ్ర రూపుమారుతోంది.. ఇక్కడి నాయకులు వాళ్ల అస్తిత్వం నిలుపుకోవడం కోసమైనా ఈ ప్రాంత ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. వాళ్ల వ్యాపారాల మత్తుల్లో వాళ్లు జోగుతున్నారు. జీవన్మరణ పోరాటాలు చేస్తున్న జనం తోవతప్పిపోయారు. తమ బతుకు బాగుకోసం కొట్లాడడం మాని.. తమ బతుకు భద్రతకోసం కొట్లాడడం మాని.. సమైక్య నినాదం అందుకున్నారు- ‘పొల్లు’ ఉద్యమంలో తాము ‘గట్టిగింజ’గా వున్నా ఫలితం లేదని మర్చిపోతున్నారు. అరవైఏళ్లుగా తెలంగాణ అసమానత పోవాలనే ఆత్మగౌరవంతో పోరాడుతుంటే- అదే అసమానతకూ నిర్లక్ష్యానికీ నిరాదరణకూ లోనవుతున్న ఉత్తరాంధ్ర ప్రజలు తమ ప్రత్యేక అస్తిత్వం కోసం పోరాడేరోజు వొకరోజు వస్తుంది..
అంతవరకూ యిక్కడి కథకులు చెయ్యాల్సింది చాలానే వుంది!
-బమ్మిడి జగదీశ్వరరావు

