ఒకే రోజు రెండు సభలు స్వర్గీయ రావూరి భరద్వాజ పై అవగాహన సభ

ఒకే రోజు రెండు సభలు

స్వర్గీయ రావూరి భరద్వాజ పై అవగాహన సభ

ఉయ్యూరు లో అమర వాణి హైస్కూల్ లో సరసభారతి జ్ఞాన పీఠపురస్కార గ్రహీత స్వర్గీయ రావూరి భరద్వాజ గారి పై విద్యార్ధులకు అవగాహన సభ నిర్వహించింది అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ సభాధ్యక్షత వహించగా ప్రముఖ కవి విమర్శకు రాలు విజయ వాడకు చెందిన తెలుగు ఉపాధ్యాయురాలు  శ్రీమతి మందరపు హైమవతి గారు ముఖ్య అతిధిగా పాల్గొని కీలక ఉపన్యాసం చేశారు .విజయ వాడకే చెందిన కవి రచయిత, వ్యవసాయ అధికారి శ్రీ కే.ఆంజనేయ కుమార్ సహ వక్త గా ప్రసంగించారు .అమరావాణి ప్రిన్సిపాల్ శ్రీ పి.వి.నాగ రాజు సభా నిర్వహణ చేశారు .

శ్రీ దుర్గా ప్రసాద్ అధ్యక్షోపన్యాసం చేస్తూ ‘’సామాన్యులను అర్ధం చేసుకొన్న అసమాన్యుడు ,మనుష్యులను తెలుసు కొన్న మనీషి భరద్వాజ ‘’ అని స్వర్గీయ  దాశరధి  కీర్తిం చాడని చెప్పారు .ఈశాతాబ్దపు గొప్ప రచయిత ,రష్యా ప్రముఖ రచయిత చెకోవ్ తో సరి సమాన మైనవారు అన్నారు .’’రాతా కూతా కన్నా చేత ముఖ్యం ‘’అని రావూరి భావించారని ,అక్షరం లోను ,ఆచరణ లోను ఆయన’’ ఆజాను బాహువు’’ అని కీర్తించారు .’’సమస్త వృత్తుల వారిని మన ముందు నిల బెట్టి –ఇదీ వారి జీవితం – ఏం సాయం చేయాలో చేసి ఆదుకోండి ‘’అని ‘’జీవన సమరం’’ ద్వారా సమాజానికి తెలియ బరచారని శ్రీ శ్రీ అన్న మాట ను గుర్తు చేశారు .గొర్రెల కాపరి, పేపర్ బాయ్ గా ,కాఫీ హోటల్ సర్వర్ గా, ప్రెస్ కార్మికుడిగా ,జర్న లిస్టు గా ,ఆకాశ వాణి ప్రోగ్రాం నిర్వాహకుడి గా ,ఆయన చేయని వ్రుత్తి అంటూ లేదు .డిటెక్టివ్ నవలలూ రాశారు శృంగార కధలూ గిలికారు .ఇవన్నీ పొట్ట పోసుకోవ టానికే రాశానని నిర్భయం గా చెప్పిన నిజాయితీ గల రచయిత భరద్వాజ .’’భరద్వాజ ఒక విశ్వ విద్యాలయం’’ .ఆయన ఏది రాసినా విపరీతం గా చదివింప జేస్తుంది అంటే ‘’రీడబిలిటి ‘’ఉన్న మహా రచయిత .అనేక భాషల్లోకి ఆయన రచనలు తర్జుమా అయ్యాయి .అనేక సంస్థలు ఆయన్ను గౌరవించి, సన్మానించాయి .సన్మానాలు పొందటమే కాదు అయన పేర స్వర్గీయ భార్య కాంతమ్మ గారి పేర ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి ఏడాది అయిదు వేల రూపాయలను పేద విద్యార్ధులకు అంద జేసిన మహా మాన వోత్తముడు ‘’అని చెప్పారు .

శ్రీమతి మందరపు హైమవతి తమ ప్రసంగం లో భరద్వాజ  అట్టడుగు స్థాయి నుంచి వచ్చారని ,సాహిత్యం లో అత్యుత్తమ స్థాయికి ఎదిగారని ఇలా ఎవరూ లేరని చెప్పారు .కృష్ణా జిల్లా పరిటాల దగ్గర మొగులూరు గ్రామం లో1927లో భరద్వాజ జన్మించారని తండ్రి కోటయ్య అని దరిద్రం తోనే ఆయన జీవితం గడిచిందని  .గుంటరు జిల్లా తాడికొండ లో బాల్యం గడిపారని ఏడవ తరగతి తో విద్య ఆగి పోయిందని ఎనిమిది లో చేరటానికి కట్టాల్సిన జీతం మూడు రూపాయలు లేక చదువు ఆగి పోయిందని  .పగలల్లాదొరికిన పని చేయటం ,రాత్రిళ్ళు లైబ్రరీ లో కూర్చుని సాహిత్యాన్ని చదవట చేసి, అందరి కంటే ఉన్నత విద్యా వంతుడయ్యారని ,‘’’గ్రందాలయమే ఆయన గురువు’’ అని రవీంద్ర నాధ టాగూర్ లా అయన గడ్డం తో కని పిస్తారని ఇద్దరూ స్వయం కృషి తోనే విద్యా వంతులయ్యారని గుర్తు చేశారు .తెనాలిలో దుర్భర దారిద్ర్యం తో గడిపారన్నారు .కొడవటి గంటి కుటుంబ రావు ,త్రిపుర నేని గోపీచంద్ ,దని కొండ హనుమంత రావు ,తమిళుడైనా తెలుగు లో గొప్ప నవలలు’’శారద ‘’ పేరు తో రాసిన నటరాజన్ ,ఆలూరి భుజంగ రావు ల తో మంచి స్నేహం చేసి జీవితాన్ని తీర్చి దిద్దు కొన్నారు .తెనాలి నుండి మద్రాస్ చేరి సినిమా పత్రికలలో ఉద్యోగం చేశారు .అక్కడి నుండి హైదరాబాద్ ఆకాశ వాణి లో ప్రోగ్రాం నిర్మాత గా పని చేశారు .ఇప్పుడే జీవితం కొంత స్థిర పడింది .అక్కడి నుండి అంతా అభివృద్దే .

కృష్ణా పత్రిక లో ‘’పాకుడు రాళ్ళు ‘’కద గా రాస్తే దాన్ని నవల గా పెంచమని ఎడిటర్ కోరితే ‘’మాయ జలతారు ‘’పేరుతో సీరియల్ గా ప్రారంభిస్తే శ్రీ శిలా వీర్రాజు గారు ‘’పాకుడు రాళ్ళు ‘’అని మార్చారు. అది అద్భుత విజయం సాధించింది 1965 లో ముద్రణ పొంది గొప్ప పేరు తెచ్చింది .యాభై రెండు వివిధ వృత్తులు చేసే  వారిని ఇంటర్వ్యు చేసి వారిళ్ళకు వెళ్లి పరిస్తితులను పరిశీలించి వారిపై ఈనాడు లో సీరియల్ గా ‘జీవన సమరం ‘’పేర రాశారు .దీనికి కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం లభించింది .కమ్మరి, కుమ్మరి, చెప్పులు కుట్టేవాళ్ళు ,తాళాలు బాగు చేసే వాళ్ళు,గొడుగులు బాగు చేసేవాళ్ళు దర్జీ పని చేసే వారు వీరందరినీ కధానాయకులుగా చేసి రాసిన ఆ పుస్తకం గొప్ప సంచలనమే సృష్టించింది .భరద్వాజ రాసినవి 37 సంపుటాలుగా వచ్చాయని అందులో పది హేడు నవలలు ,బాలల కోసం ఆరు నవలికలు ,అయిదు కదా సంపుటాలు ,మూడు వ్యాస సంపుటాలు ,ఎనిమిది నాటికలు ఉన్నాయన్నారు . భార్య కాంతం జ్ఞాప కార్ధం ‘’స్మృతి సాహిత్యం ‘’రాశారని అవి ఎంతో ఆర్ద్రత ను కలిగిస్తుందని అన్నారు .ఆనేక పి.హెచ్ డి.లు పొందారని .రాష్ట్ర కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డులు ,గొపే చంద్ అవార్డు ,రాజ్య లక్ష్మి ఫౌండేషన్ అవార్డు ,లోక నాయక అవార్డ్ పొందిన ధన్య జీవి అని చెప్పారు .1952 లో ‘’చిత్ర గ్రహం ‘’నవలిక సైన్స్ ఫిక్షన్ గా రాశారు .అప్పటికి చంద్రుని పై ఆర్మస్త్రాంగ్ కాలు పెట్టనే లేదు .దారిలో ‘’శుసూన్ ‘’అనే గ్రహం పై మనిషి అడుగు పెట్టి నట్లు రాశారు. హెచ్ జి.వవెల్స్ రాసిన  సైన్స్ ఫిక్షన్ లా ఇది ఉండి ఆశ్చర్య పరుస్తుంది .అక్కడికి చేరిన వాడు ‘’దారుణం గా నరుక్కు చచ్చే భూమండలాన్ని చూసి సిగ్గు పడుతున్నాను ‘’అని అతని తో అని పిస్తారు భరద్వాజ .ఎనభై ఆరేళ్ళు జీవించి18-9-2013 ణ భరద్వాజ మరనిన్చారన్నారు ఆయన రచనలు చదివి జ్ఞానాన్ని సంపాదించండి ‘’అంటూ ముగించారు హైమవతి గారు .విద్యార్ధినీ విద్యార్ధులు అత్యంత క్రమ శిక్షణ తో మెలగి నందుకు శ్రద్ధగా విన్నందుకువారిని  ఎంతో అభినందించారు .విద్యార్ధుల స్థాయికి దిగి వచ్చి ఆమె ప్రసంగించిన తీరు పరమ అద్భుతం గా ఉందని అందరూ మెచ్చారు

శ్రీ ఆంజ నేయ కుమార్ తమ ప్రసంగం లో భారద్వాజ ను చూస్తె టాగూర్ గుర్తుకు వస్తారని ,అతి నిరుపేద ఇంతటి ఉన్నత స్తితి కి రావటం విశేషమని ఆయన లా అందరూ ఉన్నత స్తితికి రావాలని ,తాను వ్యవసాయాదికారి గా ఉన్నా సాహిత్యం పై మక్కువ కలగటానికి భరద్వాజ వంటి వారే స్పూర్తి అని  ఇక్కడ ఈ పాఠశాల విద్యార్ధులను చూస్తె ముచ్చటగా ఉందని మెచ్చు కొన్నారు .

శ్రీ దుర్గా ప్రసాద్ ముగింపు ప్రసంగం  చేస్తూ ‘’నా ఊహలకే అందని కవి భరద్వాజ ‘’అని విశ్వనాధ కీర్తిన్చారని ,ఇంగ్లాండ్ రచయిత చార్లెస్ డికెన్స్ లాగా మనుషుల మనస్తత్వాలను క్షున్నం గా పరిశీలించి రచనలు చేశారాని ఒక డాక్యు మెంటరి సినిమా చూస్తున్న అనుభూతి కలిగిస్తార న్నారు .తను అనుభవించిన పేదరికం దరిద్రం అవమానం ,ఆకలి ఎవరూ అనుభవించ కూడదని ,ఇవి లేని సమాజం కావాలని కోరుకున్న మనసున్న రచయిత అన్నారు .ఉన్నది ఉన్నట్లు రాశారని చెప్పారు .’’నిజాన్ని నిజాయితీగా చెప్పాలి ‘’అనే వారని గుర్తు చేశారు .పట్టుదల స్వయం కృషి ,అధ్యయనం ఉంటె బడి చదువు జ్ఞానం కన్నా ఎక్కువ పరిజ్ఞానం కలుగుతుందని భరద్వాజ రుజువు చేశారని చెప్పారు .అన్ని రచనలను చదివి ఆకళింపు చేసుకొన్నారని వ్యక్తీ గత జ్ఞానానికి అనుభవ జ్ఞానాన్ని కలిపితే పరిణతి వస్తుందని భరద్వాజ నిరూపించారన్నారు   .తనకు జ్ఞాన భిక్ష పెట్టిన వారిని ,అన్నం పెట్టి ఆదుకున్న వారినీ జీవితాన్తం గుర్తుంచుకొని క్రుతజ్ఞతలు చెప్పటం భారద్వాజ కే చెల్లిందని, అపకారికి కూడా ఉపకారం చేసి తప్పు తెలుసు కోనేట్లు చేశారని అన్నారు .నియమ బద్ధ జీవితం సాదా సీదా జీవనం ఆయనది అని ,ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న మనీషి అని అన్నారు

‘’భరద్వాజ జీవితం ‘’పై వ్యాస రచన ,’’రచనల లో మానవీయ దృక్పధం’’ పై వక్త్రుత్వ పోటీలను ఈ పాఠ శాల విద్యార్ధులకు నిర్వహించి ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించిన వారికి సరసభారతి తరఫున  భారద్వ్వాజ రాసిన ‘’కాదంబరి నవల ,సి నారాయణ రెడ్డి రాసిన ‘’విశ్వం భర’’ ,’’మన చరిత్ర’’ అనే  విలువైన పుస్తకాలను విద్యార్ధులకు హైమవతి, ఆంజనేయ కుమార్ గార్ల చేతుల మీదుగా అందజేశారు .అలాగే రమ్య భారతి సంపాదకులు శ్రీ చల పాక ప్రకాష్ ఇచ్చిన శతకాలను నానీలను విద్యార్ధులకూ ,పాఠ శాల గ్రంధాలయానికి దుర్గా ప్రసాద్ ప్రిన్సిపాల్ నాగ రాజుకు అంద జేశారు.ప్రిన్సిపాల్ ‘’ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తమ స్కూలు లో నిర్వహించినందుకు విద్యార్ధులకు భరద్వాజ పై అవగాహన కలిగించి నందుకు వారికి ఆయన జీవితం రచనపై పోటీలు నిర్వ హించి,బహుమతులు అందజేసిన సరసభారతికి ,ఇక్కడికి వచ్చి మంచి ఉపన్యాసాలతో విద్యార్ధుల హృదయాలకు విషయాలను చేరువయ్యేలా చేసిన హైమవతి, ఆంజనేయ కుమార్ గారలను అభినందించారు .సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి వందన సమర్పణ చేస్తూ ,ఇలాంటి వినూత్నమైన కార్య క్రామాలను సరసభారతి నిర్వహించటం గొప్ప ప్రేరణ అని ,విచ్చేసిన అతిధులకు ఆతిధ్యం ఇచ్చిన నాగ రాజు గారికి ఉత్సాహం గా పాల్గొన్న విద్యార్ధినీ విద్యార్దులకు క్రుతజ్ఞతలు తెలియ జేశారు .అతిధులకు సరసభారతి  ముద్రించిన  సిద్ధ యోగి పుంగవులు శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం పుస్తకాలతో బాటు నగదు పారి తోషికాన్నిదుర్గా ప్రసాద్  అంద జేశారు .ఈ సభలో మాజీ  లెక్చరర్ లు శ్రీ ప్రసాద్ ,శ్రీ నారాయణ మూర్తి ,మాజీ హెడ్ మాస్టర్ శ్రీ భావాన్ని శంకర రావు ,సరసభారతి టెక్నీషియన్ శ్రీ వి బి.జి రావు ,రామ గుండం మాజీ ఉద్యోగి శ్రీ బలరాం గార్లు పాల్గొని సభకు నిండుతనాన్ని వన్నెను తెచ్చారు

సభ అనంతరం  ప్రిన్సిపాల్ అతిధులకు కమ్మని విందు భోజనం ఏర్పాటు చేశారు.

పమిడి ముక్కాల హైస్కూల్  లో ‘’మాతృభాషా దినోత్సవం ‘’

రెండు రోజుల క్రితం పమిడి ముక్కాల హైస్కూల్ తరఫున తెలుగు పండితులు శ్రీ బలే ఉమామహేశ్వరరావు మరొకరు వచ్చి ఇరవై రెండవ తేదీ న తమ స్కూల్ లో జరిగే మాతృభాషా దినోత్సవానికి ముఖ్య అతిధి గా వచ్చి తెలుగు భాష గొప్ప తనాన్ని గురించి ప్రసంగించ మని కోరారు .అలానే అన్నాను .అమరావాణి లో సభ అయిన తర్వాత మధ్యాహ్నం మూడింటికి పమిడి ముక్కాల హైస్కూల్ కు వెళ్లి ‘’ తెలుగు భాష ‘’గొప్పతనాన్ని విద్యార్ధులకు వివారించాను .మాత్రు భాషా దినోత్సవమైన ఇరవై ఒక్కటి న ప్రారంభించారు . ఇంట్లో తెలుగు మాట్లాడాలని పద్యాలు శతకాలు నేర్వాలని లేక పోతే తెలుగు భాష అంత రించి పోతుందని ,నాలువు వేల అయిదు వందల ఏళ్ళ చరిత్ర కల తెలుగుభాష అందమైన అజంత భాష అని ,అందరూ మెచ్చిన భాష అని ,దాన్ని మాట్లాడుకొంటూ కాపాడమని కోరాను.దీనికి తలి దండ్రులు ఉపాధ్యాయులు సమాజం బాధ్యత తీసుకోవాలని హితవు చెప్పాను  .ప్రదానోపాధ్యాయురాలు శ్రీమతి రమా దేవి అధ్యక్షత వహించగా ఏం. ఇ .వొ .తోలి ప్రసంగం చేశారు .భాషా భి వృద్ధికి కృషి చేస్తున్నందుకు నాకు స్కూల్ తరఫున శాలువా కప్పి గౌరవించారు .తెలుగు మేష్టారు ఉమామహేశ్వర రావు ఇద్దరు వంతల తో శ్రావ్యం గా బుర్రకధ చెబుతూ తెలుగు భాష గొప్ప తనాన్ని ఆవిష్కరించి అలరించారు. హెడ్ మిస్త్రేస్ రమా దేవి ప్రముఖ విమర్శకులు స్వర్గీయ టి ఎల్ కాంతా రావు గారి భార్య కమల కుమారి గారితో బెజవాడ అమరవాణి హైస్కూల్ లో పని చేసినట్లు చెప్పారు .

ఇలా రెండు సభలలోఒకే రోజు  పాల్గొన్నందుకు ఆనందం గా ఉంది .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -22-2-14-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.