
ఖమ్మం పట్టణానికి 20 కి.మీ. దూరంలో ఉన్న కూసుమంచిలో ఉన్న శివాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. తనకు అనేక విజయాలను కట్టబెట్టిన సదాశివుడి పట్ల కృతజ్ఞతాపూర్వకంగా వెయ్యి శివాలయాల నిర్మాణం చేపట్టాడట కాకతీయ ప్రభువైన గణపతిదేవుడు. అందులో భాగంగానే క్రీస్తుశకం 1162 ప్రాంతంలో కూసుమంచిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆయన కాలంలో ‘రామలింగేశ్వరస్వామి’గా పూజలందుకున్న శివుడు కాలం గడుస్తున్నకొద్దీ గణపేశ్వరస్వామిగా ప్రసిద్ధిచెందాడు.
నక్షత్రాకార ఆలయం
ఈ దేవాలయ శిల్ప నిర్మాణ చాతుర్యాన్ని చూస్తే కళ్లు మిరుమిట్లుగొలుపుతాయి. ఉత్తర, దక్షిణ, తూర్పు ద్వారాలను పెద్దపెద్ద రాతి మెట్లతో నిర్మించి, మధ్య పన్నెండు అడుగుల వృత్తాకార వైశాల్యంలో కళ్యాణమండపాన్ని నిర్మించారు. రెండు రాతి వరుసలతో గోడలుంటాయి. వీటిపై శిల్పుల నైపుణ్యాన్ని, గణపతిదేవుడి ప్రాశస్త్యాన్ని తెలియజెప్పేలా నగిషీలు చెక్కి ఉన్నాయి. లోపలి గోడ తర్వాత 15 అడుగుల పొడవు ఐదడుగుల వెడల్పు గల రాతి దిమ్మెలు పేర్చి గర్భాలయం, ముఖమంటపం నిర్మించారు. గర్భాలయంలోని శివలింగం 12 అడుగుల ఎత్తు, 6.3 కైవారంతో ఏకశిలా రూపంగా నిర్మించారు. దీనికింద మూడు అడుగుల విస్తీర్ణంతో పానవట్టం నిర్మించారు. పైకప్పును చక్రం ఆకారంలో నిర్మించారు. బయట నుంచి చూస్తే ఈ దేవాలయం లింగాకారంగా, నక్షత్రాకారంగా కన్పిస్తుంది.
సూర్యస్పర్శ
ఒకప్పుడు చరిత్రలో ఎంతో వైభవంగా పూజలందుకున్న ఈ దేవాలయం కాలక్రమంలో ఆదరణను కోల్పోయింది. 2001 వరకు నిర్జీవంగా కంపచెట్ల మధ్య ఉన్న దీన్ని అధికారులు, గ్రామస్థులు కలిసి బాగుచేశారు. తర్వాత దేవాదాయ శాఖ ఈ శివాలయాన్ని పర్యాటక ప్రాంతంగా గుర్తించడంతో అభివృద్ధి చెందింది. ఇక్కడి ప్రత్యేకత ఏమంటే – ప్రతి నిత్యం సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు శివలింగంపై ప్రసరిస్తాయి. ఈ ఆలయాన్ని దర్శించడం పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తుంటారు.
– భువనగిరి లక్ష్మీనరసింహారావు

