
కడప, ఫిబ్రవరి 28 : ప్రముఖ కవి జానమద్ది హనుమచ్ఛాస్త్రి (90) శుక్రవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కడప రిమ్స్ అసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కడపలోని సిపి బ్రౌన్ లైబ్రరీ వ్యవస్థాపక కార్యదర్శిగా సేవలందించిన హనుమచ్ఛాస్త్రి, తెలుగు సాహిత్య రంగానికి విశేష సేవలందించారు. ప్రజల సందర్శనార్థం జానమద్ది భౌతికకాయాన్ని బ్రౌన్ గ్రంథాలయం ఆవరణలో ఉంచనున్నారు. ఈ రోజు సాయంత్రం జానమద్ది భౌతికకాయానికి కడపలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జానమద్ది కథా రచనే కాకుండా వివిధ పత్రికలలో, సంచికలలో 2,500 పైగా వ్యాసాలు రాసారు. 16 గ్రంథాలు వెలువరించారు. కడపలో సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ ట్రస్టును నెలకొల్పి, దాని కార్యదర్శిగా అహర్నిశలూ కృషి చేశారు. రాష్ట్రంలోని వివిధ తెలుగు సాహిత్య సంస్థలు, కవులు, రాజకీయ నాయకులు జానమద్ది మరణానికి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా జానమద్ది హనుమచ్ఛాస్త్రి మృతికి సంతాపం తెలిపారు.

