సరస భారతి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం -1
ఉగాది కవి సమ్మేళనం వివాహం –దాంపత్యం ఫొటోస్
అంశం –‘’వివాహం –దాంపత్యం ‘’
1- ముక్త పద గ్రస్తం -శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –
రెండు మనసుల కలయికే వివాహం
వివాహం జీవితం లో ముఖ్య భాగం
భాగ స్వామి తో కలిసి నడిస్తేనే స్వర్గం
స్వర్గం అనుభవించి మళ్ళీ జారి పోరాదు
జారి పోయి నిరాశ తో భగ్నం చేసుకో రాదు
చేసుకొంటే నరకమే జీవితాంతం .
దాంపత్యం ఒక అనిర్వచనీయ నిర్వచనం
నిర్వచనాలతో నిలువదు నిండు సంసారం
సంసారం లో సరిగమల స్థానం పవిత్రం
పవిత్ర దాంపత్యమే అందరికి మార్గ దర్శనం
మార్గ దర్శమైన దాంపత్యం ఏ దేశం లో నైనా స్వాగతం
స్వాగత సత్కారాలు కోరనిదే ఆ అనుబంధం
ఆ అనుబంధం శాశ్వతమై కుటుంబానికి కావాలి ఆలంబనం
ఆలంబనం ఉన్న కుటుంబం పురోగమనానికి నాంది .
2-శ్రీమతి లక్ష్మీ సుభద్ర (విజయ వాడ)
యువతి కలలు కల్లలు కాని వేళ-చూపులు కలిసిన నిశ్చితార్ధం వేళ
జీవితం సార్ధక మవుతుందను కొన్న వేళ-ఆటంకాలు తొలగి పెళ్లి పీటల దాకా వచ్చిన వేళ
ఊహల పల్లకిలో తేలుతున్న వేళ దేవతలే పెళ్లి పెద్దలై చేసేదే వివాహం
అనురాగం నిండు నట్లు చేసేదే వివాహం –ఆత్మీయత ,ప్రేమలను కురిపించేది
అవగాహన ,ఓర్పూ ,సమ్మేళనం చేసేది వివాహం -అపురూపమై నదే వివాహం
ఉన్నదానితో సంతృప్తి పడేదీ –ఒకరికొకరు తోడూ నీడ నిచ్చేదీ
మనసును మనసుతో కలిపేదీ-పాలు నీళ్ళు గా కలిసి పోయేదీ
ఒకరి కొకరు ప్రాణం గా –పార్వతీ పరమేశ్వరుల్లా కలిపి ఉంచేదే దాంపత్యం .
3-వివాహ బంధం –శ్రీ విష్ణు భొట్ల ప్రసూన రామ కృష్ణ (విజయ వాడ )
వివాహ బంధం అంటే –ఒక్క సారి గా తెంచుకొంటే తెగే పాశం కాదు
జీవితాంతం కలిపి ఉంచేదీ తోడూ నీడ గా నిలిచి పోయేది
మూడు ముళ్ళ బంధం తో –అగ్ని సాక్షిగా వేదం మంత్రాల నడుమ
ఒక్కటిగా అయ్యేది వివాహ బంధం లోనే .
అందుకే
మన భారతీయ సంస్కృతి లో –మన ఆచార వ్యవహారాల్లో
ఎన్నో ఎన్నెన్నో మార్పులు వస్తున్నా –జీవనం సహజీవనం వంటివి చొచ్చుకు వస్తున్నా
స్తిరం గా నిలిచి పోయింది మన వివాహ వ్యవస్థ
నాటికి నేటికి ఏ నాటికీ –కుంగి పోనిది కూలి పోనిది
తరతరాలు గా మార్గ దర్శి గా నిలిచింది –మన వివాహ బంధం
అదే మన భారతీయ జీవన వ్యవస్థ .
4-శ్రీమతి మద్దాలి నిర్మల (విజయవాడ )
వివాహం దైవ నిర్ణయం –దాంపత్యం మధురాను బంధం
విడదీయ రాని అనురాగ బంధం –మారుతున్న సామాజిక భౌగోళిక స్తితుల్లో
దిగజారుతున్న విలువల నేపధ్యం లో –వివాహం దాంపత్యం విచ్చిన్నం కాకుండా
ఉండాలంటే కాస్తంత ఆలోచన అవసరమే మరి
పెళ్లి అనే నూరేళ్ళ పంట వందేళ్ళు బాగా పండాలంటే
క్షేత్ర బీజాలుంటే సరి పోదు –మమతాను రాగాల మహా వృష్టి కురవాలి
సహనం ,సహకారం అనే సహజ వనరులు కావాలి
నిరంతర క్రుషికే దక్కు తుంది సమృద్ధి ఫలసాయం
వాక్కనే వాణిని జిహ్వాగ్రం పై నిల్పాడు బ్రహ్మ
హృదయ స్థానం లో పదిలం గా ఉంచాడు విష్ణువు
అర్ధ నారీశ్వరమే ఆదర్శం గా గౌరవించాడు సాంబ శివుడు
ఒకే మాట ,ఒకే బాణం ,ఒకే బాట ఒకే భార్య గా చాటాడు శ్రీ రాముడు
కాపురమైనా కారడవి యైనా పతి వెంటే నడిచింది జానకీ సతి
మంగళ సూత్రాలకు తోడుగా ఈ బంగారు సూత్రాలను జోడిస్తే
దాంపత్యం అయి పోతుంది ఇహ లోకపు నాకం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-4-14-ఉయ్యూరు


బావుంది మాస్టారు. మీ కవి సమ్మెళనంలో కవితల ద్వారా మంచి విషయాన్ని(వివాహం – దాంపత్యం) గూర్చి తెలియజేసారు.
LikeLike
కృతజ్ఞతలు వంశీ గారూ -దుర్గా ప్రసాద్
2014-04-03 23:13 GMT+05:30 సరసభారతి ఉయ్యూరు :
>
LikeLike