పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -8
సిడ్ని ,డేనియల్, డ్రేటన్ త్రయం
ఎలిజ బెత్ శకానికి పూర్తిగా తగిన కవులు గా ఫిలిప్ సిడ్ని ,వాల్టర్ రాలీ కవులను భావిస్తారు .కాని సిడ్ని రాలీకి భిన్నుడు .రాలీ జీవితం అంతా అపజయాల పరంపర అయితే సిడ్నీ ది విజయ పరంపర .మోసపూరిత శత్రువుల మధ్య రాలీ గడిపితే అభిమానులు ,పలుకు బడి గల వారు ,ఆరాధకుల మధ్య సిడ్నీ జీవితం గడిపాడు .దీనికి సిడ్నీ ఉన్నత కులం లో పుట్టటం కారణంకూడా .
సర్ ఫిలిప్ సిడ్ని –మనసున్న రాజ కవి
సర్ ఫిలిప్ సిడ్ని 1554లో ఐర్లాండ్ లార్డ్ డిప్యూటీ ‘’,లోచేస్టర్ ఎరల్ ‘’కు సోదరి అయిన లేడి సిడ్నీ దంపతులకు జన్మించాడు .తండ్రి కి ‘’కెంట్’’ లో ఉన్న విలాస వంతమైన పల్లె వాతావరణం లో భోగాల మధ్య సిడ్నీ చిన్నతనం ప్రాధమిక విద్య గడిచింది .తర్వాత కేంబ్రిడ్జ్, ఆక్స్ ఫర్డ్ లలో చదివి ,పద్దేనిమిదేళ్ళకే ‘’గ్రాండ్ టూర్ ‘’పేరిట అనేక ప్రదేశాలు తిరిగి ప్రింటర్లను కలిశాడు హ్యూమనిస్ట్ అయిన ‘’లాంగిడ్ .’’తో విద్య నేర్చాడు అతనితో యూరప్ అంతా పర్య టించాడు .ఇంగ్లాండ్ కు తిరిగొచ్చి రాజ దర్బార్ లో చేరాడు. అతని మేజస్టే ,ఆకారం, పద్ధతులకు అంతా ఆకర్షితులైనారు .అతనికి చదువు చెప్పిన మేస్టర్లు కూడా అతనిలో ఏదో ప్రత్యెక ఆకర్షణ శక్తి ఉందనే వారు .కేనిల్ వర్త్ లో అతని మేనమామ ఎరల్ ఆఫ్ లీచేస్టర్ ఎలిజ బెత్ రాణి కి గొప్ప సన్మానం చేశాడు .అక్కడ సిడ్ని లార్డ్ ఎస్సెక్స్ కూతురు పెనెలోప్ దివారేక్స్ ను చూసి మనసు పారేసుకొని ‘’ప్యార్ మే పడిపోయా మై’అనుకొన్నాడు .ఆ ఆకర్షణ లో 108సానెట్ లను ‘’ఆస్ట్రోఫెల్ అండ్ స్టెల్లా ‘’పేరిట రాసి సానెట్ ప్రవాహానికి పదహారు పదిహేడు శతాబబ్దాలకు ప్రేరణ కలిగించాడు .పెనెలోప్ సిడ్ని ప్రేమను అంగీకరించిందో లేదో తెలీదు .కాని ఆమెకు వేరొకరితో పెళ్లి అయింది .ఇరవై వ ఏట సిడ్నీ పెళ్లి సర్ ఫ్రాన్సిస్ వాల్సిన్ఘాన్ కూతురు తో జరిగింది .
సంపద ,కీర్తి కోసం సిడ్నీ ప్రయత్నించాల్సిన అవసరమే రాలేదు కీర్తి ,కనకాలు అతని వెంట పడ్డాయి .పార్ల మెంట్ లో కూర్చున్నాడు .ఎలిజబెత్ సిడ్నీ ని ‘’నైట్ ‘’ను చేసింది .ముప్ఫై వ ఏట ‘’ఫ్లాషింగ్’’ కు గవర్నర్ అయ్యాడు .వంశం, హోదా ,తెలివి తేటలు అన్నీ అతనికి కలిసొచ్చాయి .’’జుట్ ఫెన్ ‘’యుద్ధం లో గాయపడ్డాడు .గ్లాసుతో మంచి నీళ్ళు తాగటానికి నోటి దగ్గర పెట్టుకొంటుండగా ,యుద్ధం లో పూర్తిగా గాయ పడి చావుకు దగ్గరలో ఉన్న ఒక సైనికుడు తనవంక ఆశగా చూడటం గమనించాడు ..అతనిలో మానవత్వం వికశించింది .మంచి నీళ్ళు తాగటానికి ఇష్టపడక ‘’నీ అవసరం నా అవసరం కంటే ముఖ్యం ‘’అని చెప్పి ఆ నీళ్ళు ఆ సైనికుడికి ఇచ్చేశాడు .జీవితాన్ని చరితార్ధం చేసుకొని చిరస్మరణీయం గా కొన్ని రోజుల తర్వాత గాయాల బాధ తో సిడ్ని 7-10-1586.నమరణించాడు .
సిడ్నీ లో హద్దులు దాటని ఆవేశం ,కవితా శైలి ఉన్నాయి .మంచి మనిషిగా పేరు .’’ఆస్ట్రోఫెల్ అండ్ స్టెల్లా ‘’లో నలభై ఏడవ సానెట్ ప్రేమికురాలు నిర్దాక్షిణ్యం గా పెట్టిన క్షోభను వర్ణించాడు .ఇది హామ్లెట్ లో ఒకానొక ‘’ఆత్మ గత భాషణం ‘’అంటే ‘’సాలి లోక్వి’’గా కనీ పిస్తుంది .అతని సమకాలీన కవుల కంటే భిన్నం గా లాభా పేక్ష కాకుండా ఆనందానికే సిడ్నీ కవిత్వం రాశాడు .ఆతను చని పోయిన చాలా కాలానికి కాని పూర్తీ గా కవితలు ప్రచురింప బడలేదు . సిడ్ని ‘’mingling blank verse and rhyme ,attempting to vary orthodox rhymes with experimental measures ,playing with intricate and internal rhyme schemes –were not appreciated until much later ,and it is only recently that the unfading freshness of his lyrics has been rated high as his sonnets .అని అతని కవితా ప్రతిభను వచన కవిత్వాన్ని తీర్చిదిద్దిన విధా విధానాన్ని ప్రశంసించారు .సిడ్నీ కవిత్వం చాలా సంక్షిప్తం గా ,మసక బారకుండా,స్వచ్చం గా ఉంటుంది .
సిడ్నీ లో.ఇతరకవుల కంటే భిన్నం గా ఉండే మరో విశేషం ఉంది .’’యాన్ అపాలజీ ఫర్ పోయిట్రీ’’అనే గ్రంధాన్ని రాశాడు .అందులో వేదాంతి, చరిత్రకారుడు కంటే కవి గొప్ప వాడని అన్నాడు .వేదాంతి కని పించని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు .చరిత్రకారుడు నిజమైన విషయాలను గూర్చి మాత్రమె పట్టించుకొంటాడు .కాని కవి విశ్వ భావన తో ఆలోచిస్తాడు. కవి ఆనందాన్ని ఇవ్వటమే కాదు బోధిస్తాడు కూడా .’’the poet cometh to you with words set in delightful proportion and with a tale which holdeth children from play and old men from the chimney corner ‘’అని కవి శక్తిని అంచనా వేశాడు .శైలి గురించి చెబుతూ ‘’’’fool ‘’said my Muse to me ‘’look in thy heart and write ‘’అని తన అంతరంగం చెప్పిందని మనందరికీ చెప్పాడు .మనసు పెట్టి రాస్తే అన్నీ అందులోనే వస్తాయి అని చెప్పాడన్న మాట .
సామ్యుల్ డేనియల్
1562-1619కాలం వాడు స్సామ్యుల్ డేనియల్ కవి .సానెట్ లలో మాంచి నైపుణ్యం చూపాడు .ఆతను రాసిన ‘’సివిల్ వార్ ‘’కవితలు అందర్నీ ఆకర్షించాయి .ఇవి ఎనిమిది పుస్తకాల సీరియల్ 1595లో అచ్చయ్యాయి .పధ్నాలు గేళ్ళ తర్వాతా మరో నాలుగు వచ్చాయి .ఈయన కవిత్వం లో చరిత్ర నీతి,కవిత్వ విధానం మొదలైనవి ఉంటాయి .చదవటానికి ఆకర్షణ గా లేక పోవటం పెద్ద లోపం .
మైకేల్ డ్రేటన్—ఊహా ప్రేమ లేఖల కవి
డ్రేటన్ 1563లో పుట్టి 1631లో డేనియల్ కంటే ఒక ఏడాది తరువాత చని పోయాడు .రాసిన ‘’పోలియోల్బిన్ ‘’లో ఇంగ్లాండ్ భౌతిక అందాలను ఆర బోశాడు .వేలకొద్దీ పన్నెండు అక్షర సముదాయాల ‘’ద్విపదలు (కప్లేట్స్)ఉత్సాహం గా ,వైవిధ్య భరితం గా చారిత్రిక కధనాత్మకం గా ,నాటికలుగా ,గ్రామీణ కవితలుగా లెజెండ్స్ గా ,వ్యంగ్యంగా, మత ధ్యాన పరం గా ఉంటాయి .’’ఇంగ్లాండ్స్ హీరోయికల్ ఎపిజిల్స్ ‘’లో ప్రముఖ రాజుల, లార్డ్ ల వారి ప్రేయసుల మధ్య జరిగినట్లు ఊహించి రాసిన ప్రేమ లేఖలు విపరీతం గా పేరొందాయి .ఒకే దశాబ్దం లో పన్నెండు సార్లు ఇవి పునర్ముద్రణ పొందాయి అంటే వాటి ప్రాచుర్యం యెంత గొప్పగా ఉందొ తెలుస్తోంది . అలాగే అతని ‘’ది బాటిల్ ఆఫ్ అగినో కోర్ట్’’లో వీరోచిత యుద్ధం చేసిన ఒక గుర్రం కద కదను తోక్కిస్తాడు. కవిత్వాన్ని శక్తి వంత మైన మాటలు బాణాల్లా దూసుకొస్తాయి .చరిత్రను వీరోచిత పోరాటాన్ని కళ్ళకు కట్టించాడు .
డ్రేటన్ దీర్ఘ కవితల జోలికి వెల్ల కుండా చిన్న వాటినే మోజుగా చదువుతున్నారిప్పటి కొత్త తరం వాళ్ళు .’’since there is no help ,come let us kiss and part ‘’అన్న సానెట్ ను ‘’one of the greatest emotional out bursts over captured in the confines of a sonnet ‘’అని పొగిడారు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -9-5-14-ఉయ్యూరు

