పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -10-ఆంగ్ల నాటక పితామహుడు –విలియం షేక్స్ పియర్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -10-

ఆంగ్ల నాటక పితామహుడు –విలియం షేక్స్ పియర్

బైబిల్ తప్ప ఇంకే పుస్తకమూ షేక్స్ పియర్  రచనలంత ప్రాచుర్యం పొందలేదు, ఆయన కవితలను ఉదహరించ లేదు అదీ ఆ మహా కవి గొప్పతనం. కాని ఆయన జీవితం లో’’ఇంకా తెరవాల్సిన పేజీలు’’  ఎన్నో ఉండటం ఆశ్చర్యమే .’’డిస్జేక్తా మెంబ్రా ‘’లోని అనేక ముఖ్య భాగాలు కనిపించలేదు .ఆయన రాత ప్రతులలో ఏ ఒక్కటీ లభ్యం కాక పోవటమూ మరీ విడ్డూరం .ఏ రచనకూ ముందు మాటలూ అలభ్యమే .అప్పటికే ఉత్తర ప్రత్యుత్తరాలు ఊపు అందుకొన్న కాలం అయినా ఏఉత్తరమూ   కనిపించక పోవటం బాధ గానే ఉంటుంది .ఆయన సంతకం ఉన్న కాగితాలు ఒక అరడజను మాత్రమె దొరికాయి .అంతకు మించి ఆయన దస్తూరి గురించిన దాఖలాలు లేనే లేవు .కొన్ని రికార్డులలో ఆస్తికి సంబంధిన లావాదేవీల కాగితాలు ఉన్నాయి .ఆయన్ను పొగుడుతూ రాసిన ప్రముఖుల లేఖలూ కనీ పించవు .ఆయన సజీవం గా ఉన్న కాలం లో ఏ స్మ్రుతి చిహ్నమూ లేక పోయింది .

ఆయన చని పోయిన వందేళ్ళకు కాని ఆయన పై జీవిత చరిత్ర రాలేదు .నికొలాస్ రొ అనే రేస్తోరేషన్ రచయిత రాసిందే మొదటి జీవిత చరిత్ర .అప్పుడేఅంటే 1709లో   ఆయన సమగ్ర నాటకాలు ముద్రించారు .షేక్ గురించి పాత తరం నటుడు థామస్ బెటర్ టన్ చెప్పిన వ్యక్తిగత విషయాలు తెలిశాయి .జాన్ ఆబ్రే మొదలగు వాళ్ళు  చూపించిన రాత ప్రతులు నమ్మదగినవి గాలేవు .వీటిమీదే ఆధార పది తరువాతి వారు రాశారు .ఆయన సానేట్లు నాటకాల లో జీవిత చరిత్ర ఉందేమో నని వెతికారు .కాని ఇవేవీ ఆయన సమగ్ర జీవితాన్ని ఆవిష్కరించ లేక పోయాయి .ఇందులోనిజం  పావు వీసం , కధనాలు ముప్పాతిక వీసం గా ఉన్నాయి .అంతా ఊహా గానమే .కల్పిత కదా సరిత్సాగారమే .

కస్టపడి ప్రయత్నిస్తే ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవటం కష్టమేమీ కాదు .షేక్ గారి తాత రిచార్డ్ షేక్స్ పియర్ స్నిత్తర్ ఫీల్డ్ లో స్తిర పడ్డాడు .ఇది ‘’స్ట్రా ఫర్డ్ ఆన్ యావన్’’ దగ్గరే .తాత అదృష్ట వంతుడే .ఆయన కొడుకు జాన్  రాబర్ట్ ఆర్డెన్ కూతురు మేరీ లాండ్ ను పెళ్ళాడాడు. కొడుకు కోసం మంచి ఇల్లు ఏర్పాటు చేశాడు .మేరీ తండ్రి ఆమెకు ఆస్తిలో పెద్ద భాగమే ఇచ్చాడు .మామ  గారి మరణం తర్వాత జాన్ రెండుఇళ్ళు కొని వ్యాపారాన్ని పట్నం లో  పెంచుకొన్నాడు .సంఘం లో మంచి పేరు ఉన్నందున స్త్రాట్ ఫర్డ్ కార్పోరేషన్ కు మెంబర్ అయ్యాడు .కొద్దికాలానికే జాన్- బీరు ,బ్రెడ్ ల నాణ్యతను పరిశీలించే ఆఫీసర్ అయ్యాడు .చిన్న చిన్న జరిమానాలు విధించే అధికారమూ లభించింది .నెమ్మదిగా కో  ట్రెజరరగా  ,ఆల్దర్మన్ గా ,మేయర్ కు సమానమైన పదవులను అందుకొన్నాడు .

జాన్ మేరీలకు ఎనిమిది మంది సంతానం .మొదటిపిల్లాడు జాన్ పుట్టి కొన్ని నెలలకే చనిపోయాడు .తర్వాత మార్గరెట్ పుట్టి పసికందు గానే మరణించింది .మూడో సంతానమే మన విలియం షేక్స్ పియర్ .అందమైన గ్లాసు డోర్లున్నహెన్రి వీధి లోని    ఇంటిలో పుట్టాడు .ఇప్పుడది జాతీయ మ్యూజియం అయింది ..చర్చి రికార్డు ప్రకారం 26-4-1564లో బాప్టైజ్ అయ్యాడు .అంటే అంతకు మూడు రోజులకు ముందు 23 వ తేదీన జన్మించినట్లు లెక్క .ఇతని తర్వాత  ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు మగ పిల్లలూ పుట్టారు  .

షేక్ బాల్యం గురించి పెద్ద్డగా తెలీదు .చుట్టూ ఉన్న అందమైన పొలాలు చెట్లూ పచ్చగడ్డి మైదానాలు అడవులు అతన్ని బాగా ఆకర్షించాయని నాటకాల బట్టి తెలుస్తోంది .గ్రామీణ ఆట లలోపాల్గొని ఉండ వచ్చు .గిల్డ్ ఆఫ్ హోలీ క్రాస్  స్థాపించిన గ్రామర్ స్కూల్ లో చదివాడు .అక్కడ బైబిల్ ,లాటిన్ చదివి ఉంటాడు .చిన్నతనం నుంచి పుస్తకాలు బాగా చదివే వాడని ,ముఖ్యం గా ఓవిడ్ ,సేనేకా ,ప్లాటస్ రచనలంటే మహా ఇష్టం గా చదివాడని తెలిసింది . ఆ కధలే తన నాటకాలలో తీర్చి దిద్దాడు .జాన్సన్ మాత్రం’’ కొద్దిగా లాటిన్ ,లేశమాత్రం గా గ్రీకు చదివాడ’’న్నాడు .అంటే జాన్సన్ లాగా క్లాసికల్ స్కాలర్ కాదని అభిప్రాయం .

యువ దశలో పెరిగి పోయిన కుటుంబం గురించి తండ్రి ఆదుర్దా పడ్డాడు .వ్యాపారం తన్నింది .చేస్తున్న ఉద్యోగాలు వదిలేశాడు .అందుకని విలియం అంటే షేక్ స్కూలు చదువు పూర్తీ చేసి ఉండడు .ఆయన కాలం లో అందరికి యూని వర్సిటి విద్య అందుబాటులో ఉన్నా ,ఆయనకు ఆ అదృష్టం దక్క లేదు .నటుడు కావాలనే కల ఉండేదని తెలుస్తోంది .మంచి వాక్యాల నిర్మాణం తో ఉపన్యాసాలు తయారు చేసేవాడు .ఆబ్రే అనే ఆయన కధనం ప్రకారం ఒక బుచర్ కొడుకు విల్ తండ్రి వ్యాపారాలు చూశాడని ,ఒక దూడ ను చంపటం తో అతను అసామాన్య మైన స్పీచ్ ఇచ్చాడని చెప్పాడు .ఇంకా చాలా విషయాలు వచ్చాయి. కాని వీటికి ఆధారం లేదు .విలియం ఒక అటార్నీకి సహాయకుడు అయ్యాడు .సంచార నటులు స్త్రాఫర్డ్ వచ్చిన సందర్భం గా విలియం కు నాటకాలపై మోజు కలిగి ,వారి చిరస్మరణీయ నటన మనసు పై గాఢ ముద్ర వేసింది .వారిచ్చిన వినోదాన్ని మర్చి పోలేదు .విలియం కు పన్నెండు ఏళ్ళప్పుడు  ఎరాల్ ఆఫ్ లీచేస్తర్ ఎలిజ బెత్ రాణి కోసం కేనిల్ వర్త్ లో సంచార నటుల చేత నాటకాలాదించాడు  .తన కంటే తక్కువ వయసు లో లేని విద్యార్దులకోసం ఒక తాత్కాలిక స్కూల్ మాస్టర్ ఉద్యోగం చేశాడు .

పుట్టుక నుంచి 18 వ ఏడు వరకు జరిగిన సంఘటనలు మనకు తెలియదు .ఒక పెళ్లి లైసెన్స్ మాత్రం దొరికింది .పెళ్లి కూతురుఅన్నే హాతవె  వయస్సు 26.పెళ్లి కొడుకువిలియం  వయసు 18.అంటే మనకవి కంటే భార్య ఎనిమిదేళ్ళు పెద్దది .అనుభవం ఉన్న అమ్మాయి అని ఆయన ఇష్టపడ్డాడు .పెళ్లి 26-5-1583లో జరిగినట్లు కూతురు సుసన్నా తెలిపింది .చర్చి ఫాదర్ ఆమె పేరును తప్పుగా ‘’వాట్ లీ’’ అని రాశాడట . పెళ్లి అయిన ఆరునెలలకే కూతురు సుసన్నా పుట్టింది   ఇరవై ఒక్క ఏళ్ళకే ఇద్దరు మగ పిల్లలు ట్విన్స్ గా పుట్టారు .ఇంటి జీవితం గురించి దాఖలాలేవీ లేవు .కాని లండన్ లో ఒంటరిగా ఉండేవాడని రుజువైంది .అప్పుడప్పుడు మాత్రం స్వగ్రామానికి వచ్చి వెళ్ళే వాడట .లండన్ లాడ్జి లోనే దాదాపు పాతికేళ్ళు రిటైర్ మెంట్ దాకా గడిపాడు .

 

Shakespeare.jpg

 

 

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-5-14-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.