1
ఏదో అర్థంకానితనమో
గాఢాంధకారమో గంధకధూమంలా
నన్నావహించినందున
ఊపిరి సలపడం లేదు…
పేరు తెలియని మొండిరోగమేదో
మొదలును తొలిచే చీడపురుగులా
పీడించుకు తింటున్నది
నన్నూ లేదా ఈ దేశాన్ని…
దేశపు భ్రమణ మతిభ్రమణాల గురించి
ఇదమిత్థంగా చెప్పలేనుగానీ
నా ఆరోగ్యం మాత్రం రోజురోజుకీ
విషమిస్తుందనడానికి
వేగంగా కొట్టుకుంటున్న నాడి,
జ్వరప్రేలాపనలే ప్రమాణాలు…
నాలో లోపల జరిగిన
ఏ రసాయనిక చర్య వల్ల నా మనస్థితి
వికలమైందో తెలియదు కానీ
అతని పేరు వింటే చాలు…
అసభ్యకరమైన బూతుపదం విన్నట్టు
వికారంతో కడుపు దేవుకుపోతోంది
పిల్లంగోవిని కసిదీరా
కాలేసి తొక్కినట్టు
నా గొంతుక బిగుసుకుని
మాటల కోసం ఒకటే కొట్టుకలాట…
అతని పేరు చెవినబడిందో
వినికిడిజ్ఞానమో వినికిడి అజ్ఞానమో
తెలీని వింత స్థితి నన్నావహిస్తోంది…
అతని ముఖపటం కనిపించినా,
మాట వినిపించినా…
నా కళ్లు స్పృహ తప్పుతున్నాయి
నా ముందు ఎవరైనా అతని జపం చేస్తే
వాళ్లు నాకు అపరిచితులైనా సరే
అమాంతం మెడ పిసికి
చంపేయాలనిపిస్తోంది…
మరణశిక్షలకి పరమ వ్యతిరేకిని గనుక
పొరబాటునో గ్రహపాటునో
ఆ పాపం నేనెక్కడ చేస్తానో అన్న భయంతో
రక్తపోటు బాగా పెరిగిపోయింది
మీ మేలుకోరి చెబుతున్నా…
ఎందుకైనా మంచిది
అతని కతలు చెప్పేవారు
నాకు ఎంత దూరంగా ఉంటే
వారి వంటికి అంత మంచిది…
2
నా మతి స్థిరం తప్పిందో
అస్థిరమతిగా దేశమే మారిందో
తేల్చుకోలేకే కదా ఇంత గొడవ…?
బ్లాక్‌బోర్డ్ మీద రాసిన అక్షరాలను
తడి డస్టర్‌తో తుడిపేసినట్టు
అతని పేరుని, ఊరుని బరబరా
చెరిపేశాను చాలాసార్లు…!
అయినా ఏం ప్రయోజనం?
పిదపకాలం తరుముకొచ్చినట్టు
నా కన్నుగప్పి ఎవరో ఒకరు
రాస్తూనే వున్నారు అదే పేరుని పదేపదే
ఇంతకీ అతనెవరూ…
అతని రూపురేఖా విలాసాలేమిటి
అన్న వైనవైనాల ప్రశ్నాపత్నాన్ని
నా చేతపెట్టినా,
నిజమే చెప్పాలని దండించినా
నేను చెప్పగలిగే ముక్క ఒక్కటే…
నిన్ను నన్ను పోలిన
మామూలు మనిషిలాగే ఉంటాడు
కానీ,
ఆ నరుడి చేతిలో ఉన్న తడిగుడ్డే
మనకొక బండ గురుతు!
రక్తపుటేరులా చిక్కగా చక్కగా
పరుచుకుంటుంది అతని నీడ..!!
అయినా తెలీక అడుగుతాను
అతని ఏలుబడిలో
సమిధలైనవారి విషాదగాధలు
ఆత్మల మాదిరిగానే ఎవరికీ
కనిపించకుండా గాలిలో గాలిలా
సంచరిస్తున్నాయా…?
నడివీధిన నిండు గర్భిణి
కడుపు చీల్చడాన్ని చూసి
ఆనందించడానికి అదేమైనా వినోదాత్మక
సాంఘిక చలనచిత్రమా..?
కంటిరెప్పలాంటి నెలవంకపై
ఎవరు పెట్టినవి అన్నన్ని కత్తిగాట్లు..?
మువ్వన్నెల జెండాలో ఆకుపచ్చ ని
కబళించడానికి ఆ సర్పం కాటువేయలేదా..?
సువార్తాహరుల కంట తొణికిన
రక్తకన్నీరు ఇంకా తడితడిగా లేదూ..?
పచ్చిగాయాన్ని కూడా
గాజుగుడ్డతో కట్టుకట్టి అందంగా
చూపించడం నాకు చేతరాదు…
వనాన్ని తెగనరికిన గండ్రగొడ్డలిని
వనమాలి తన కడుపున దాచుకోలేడు
3
పచ్చకామెర్ల రోగికి లోకమంతా
పచ్చనే అని నాపై నింద వేసినాసరే
ఒకటి మాత్రం నిజం
అతనొస్తాడని మురిసిపోతున్న
ఓనా అభాగ్యదేశమా..
అసహాయ దేహమా..
నీకొచ్చిన రోగం ముందు నా రోగం
చాలా చిన్నదిగా అనిపిస్తోంది
నీకు తెలీటం లేదు కానీ
నీలో తెల్లరక్తకణాలు శరవేగంగా
చచ్చిపోతున్నాయి…
రక్తసిక్తమైన ముఖాన్ని
అద్దంలో చూసుకుంటే
ఏ ప్రతిబింబం కనిపిస్తుందో
అదే ఇకపై నీ భవిష్యత్తు చిత్రపటం!
నన్ను నిరంతరం
తికమకపెడుతున్న దొకటే..!
అతనితో చేయి కలిపిన వారికి
ఎర్రగా అంటిన ఆ మరక పేరేమిటి..?
అతని చూపుడు వేలు, మాట
సరళసుందరంగానే ఉండొచ్చుగాక..
అతను వల్లిస్తున్నది వేదమే అయినా
ఆ నోరు మాత్రం దెయ్యం
అతను చూపించే త్రీడీ వర్ణచిత్రాల
మాయామోహంలో కొట్టుకుపోతే
అడుగులు ముందుకు
పడుతున్నట్టే ఉంటాయి కానీ
వెను దిరిగి ఉన్న మీ పాదాలు
అదాట్టుగా ఎప్పటికైనా
మిమ్మల్ని భయపెట్టక మానవు
అవునన్నా కాదన్నా ఇకపై
ఈ దేశంలో రెండే వర్గాలు
అతని తోకని పట్టుకు వేలాడే శాఖ ఒకటైతే
అతని పొడ గిట్టని రేక మరొకటి…
అతనే గనుక ఈ దేశానికి రాజైతే
అవుతుందా మరి నా అస్తిత్వం పరాధీన..!
అతన్ని తమ భుజాలపై భక్తిగా
మోసేవారికి కాకపోదునా పరమ విరోధిని.!
ఎందుచేతనంటే
వాడు రాసేది రామకోటి అయితే
నా పాళి దిద్దుకుంటున్నది రావణకోటి…
-ఒమ్మి రమేష్‌బాబు
98487 99092

