తనకు ఏ రిగ్రేట్సూ లేవని చెప్పిన ”జ”(ల)గడపాటి

నాకే రిగ్రెట్స్ లేవు…ఇంకో రకంగా సేవ చేస్తా

తెలుగు రాష్ట్రం విడిపోకూడదని చివరిక్షణం వరకూ అవిశ్రాంతగా పోరాడిన వ్యక్తి విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. సమైక్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన ఇప్పటికీ రాష్ట్రవిభజన విషయం ప్రస్తావనకు వస్తే కన్నీటి పర్యంతం అవుతారు. ఆంధ్రప్రదేశ్ విడిపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని శపథం చేసిన రాజగోపాల్ చెప్పిన మాటకు కట్టుబడి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం వ్యాపారాలు, సినిమాలూ చూస్తూ, పిల్లలతో గడుపుతూ కుటుంబాన్ని చూసుకుంటున్న ఆయనతో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ప్రోగ్రామ్‌లో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ జరిపిన సంభాషణ ఇది.

నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు
ఆర్కే: ఇంత స్థిరాభిప్రాయాలు ఉన్న మీరు…విభజన విషయంలో ఆరోజు ఎందుకలా ఏడ్చేశారు?
రాజగోపాల్: నేనెప్పుడూ ఎమోషనల్‌గానే ఉంటాను. కానీ బయటపడను. నాకు 17 తారీఖునే విభజన ఆపలేమని బీజేపీ వాళ్లు చెప్పారు. రామ్‌లీలా మైదానంలో మీటింగ్ జరుగుతోంది. నేను మాట్లాడటానికి లేచినప్పుడు చాలామంది నా మీద ఆశలు పెట్టుకుని కేరింతలు కొడుతున్నారు. వాళ్ల ఉత్సాహం చూసిన తర్వాత విభజన ఆపలేనని చెప్పలేను. జరగదు అని చెప్పలేను. నేను పార్లమెంట్‌లోకి వెళ్తానని చెప్పాను. కానీ నాకు నమ్మకం లేదు. అందుకే ఆ మాట అనగానే బరస్ట్ అయిపోయాను (ఈ మాట చెబుతూమళ్లీ కన్నీళ్లు పెట్టుకున్నారు).

ఆర్కే: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనడానికి ఉన్న కారణాలు ఏంటి?
రాజగోపాల్: ఒకటి అభివృద్ధి. పార్టీకి సంస్థాగత బలం ఉంది. చంద్రబాబునాయుడు స్థానిక ఎన్నికల్లో అక్కడా ఇక్కడా బాగానే నిలబడ్డాడు. స్ట్రాటజీస్ అయినప్పటికీ మోదీ, పవన్… ఇలా అన్ని అవకాశాలూ సద్వినియోగం చేసుకున్నాడు.

అది రాజకీయ సైకాలజీ
ఆర్కే: మీ శిష్యుడు జగన్‌మోహన్‌రెడ్డి పరిస్థితి ఏంటి?
రాజగోపాల్: రాజశేఖర్‌రెడ్డి కుటుంబం నాకు చాలా సన్నిహితం. అప్పుడెప్పుడో జగన్‌కు వ్యాపార మెళకువలు చెప్పాను. జగన్ నాకు రాజకీయ ప్రత్యర్థి. రాజశేఖర్ రెడ్డి మరణాన్ని కుట్రగా భావించడం కరెక్ట్ కాదని ఆయనకు ఫోన్ చేసి మరీ చెప్పాను. కాంగ్రెస్‌తో విభేదించు కానీ, వ్యక్తిగతంగా అలా చేయడం మంచిది కాదని చెప్పాను. పర్సనల్‌గా నాకు ఎవరిమీదా ఏ ఉద్దేశం లేదు. అతని భవిష్యత్‌తో నాకేం సంబంధం లేదు.
ఆర్కే: ఎప్పుడైనా తారసపడ్డాడా?
రాజగోపాల్: ఇది 2011లో జరిగింది. ఒక రోజు ఫ్లయిట్‌లో అడిగాడు.. ‘ఏమన్నా నా మీద పడ్డావ్’ అని. నువ్వు సోనియాగాంధీని అంటావ్, నేను నిన్ను అంటాను, మీ వాళ్లు నన్ను అంటారు. అదంతే. రాజకీయ సైకాలజీ అని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ నిన్నెప్పటికీ మంత్రిని చేయదు. నా దగ్గరైతే ఏ మంత్రి పదవైనా తీసుకో అని నన్ను పార్టీలోకి ఆహ్వానించాడు. నా మనస్తత్వానికి జాతీయపార్టీలైతేనే సూట్ అవుతాయి అని చెప్పాను.

ఆర్కే: చాలా కూల్‌గా ఉన్నట్టున్నారు? రాజకీయాల నుంచి విరమించుకున్నందుకా?
రాజగోపాల్: ఇంకేముంది. టెన్షన్స్ ఏం లేవు. ప్రశాంతంగా పక్కన ఉండి గమనిస్తూ ఉన్నాను.

ఆర్కే: అంతేనా? 16వ తారీఖు టెన్షన్ ఏం లేదా?
రాజగోపాల్: టెన్షన్ ఏముంటుంది? ఎవరొచ్చినా ఒకటే నాకు. ఎందుకంటే నేను రాజకీయాల్లో లేను. అన్ని పార్టీలకూ దూరంగా ఉన్నాను. కాకపోతే సరైన ప్రభుత్వాలు రావాలి. మంచి పాలకులు రావాలనే ఆకాంక్ష మాత్రం ఉంది.

ఆర్కే: చిన్నవయసులోనే రాజకీయాల్లోంచి విరమించుకోవాలనే తొందరపాటు నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు?
రాజగోపాల్: 22 ఏళ్లు…విద్యార్థిగా ఎదిగాను. 17 ఏళ్లు వ్యాపారం చూసుకున్నాను. 11 ఏళ్లు రాజకీయరంగంలో ఉన్నాను. జీవితం అన్నాక అన్ని రంగాలను చూడాలి కదా. 16న ఫలితాల తర్వాత ఏం చేద్దామనేది చూద్దాం. విద్యార్థిగా ఉన్నప్పుడు సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో రెండుసార్లు ప్రెసిడెంట్‌గా చేశాను. రాజకీయాల్లోకి ప్యాషన్‌తోనే వచ్చాను. పబ్లిక్ లైఫ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను కావాలనే సమైక్య ఉద్యమం లేవనెత్తుతున్నానని, రాష్ట్రం విడిపోతే ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నానని కొంతమంది అన్నారు. అప్పుడే చెప్పాను. రాష్ట్రం విడిపోతే నేను రాజకీయాల్లో ఉండను అని. ఆ మాటకు కట్టుబడే రాజకీయాల నుంచి తప్పుకున్నా.

ఆర్కే: రాజకీయాల్లో ఎమోషన్స్ పనికిరావు కదా?
రాజగోపాల్: అవును. చాలామంది చెబుతున్నారు. ఈ మధ్య ఉండవల్లి అరుణ్‌కుమార్‌గారు కూడా చెప్పారు. ఇంజనీరింగ్ కావాలంటే బీటెక్ చదువుకోవాలి, డాక్టర్ కావాలంటే మెడిసిన్ చదువుకోవాలి. లాయర్ కావాలంటే బీఎల్ చదువుకోవాలి. అలాగే పొలిటీషియన్ అవ్వాలంటే నీ భవిష్యత్ గురించి ఆలోచించుకోవాలి అని! ప్రజలు భావోద్వేగాలకు లోనుకావచ్చు కానీ, నాయకులు కాకూడదని చెప్పారు.

ఆర్కే: మీది తొందరపాటు నిర్ణయం అని ఎప్పుడైనా అనిపిస్తుందా?
రాజగోపాల్: తొందరపాటేం లేదు. నిర్ణయం నిర్ణయమే. తెలుగు ప్రజలు విడిపోతారనేది నేను కలలో కూడా ఊహించని పరిణామం. కానీ ఓ మాట అన్నాక తప్పదు కదా. ప్రజల్లో ఉండటానికి ఎంపీ, ఎమ్మెల్యే పదవులు అవసరం లేదు. అవి లేకుండా కూడా ప్రజల్లో ఉండవచ్చు.

ఆర్కే: అఫ్‌కోర్స్..ఉండవచ్చు. కానీ, తొందరపాటు నిర్ణయాలు, భావోద్వేగంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుందో గోనె ప్రకాశరావు ఉదంతం లాంటి గతానుభవాలున్నాయి కదా?
రాజగోపాల్: నేనలా తీసుకోమని చెప్పను. కానీ తీసుకొన్న నిర్ణయానికి కట్టుబడి ఉండటమనేది నాకుంది. నాకెక్కడా రిగ్రెట్స్ లేవు. నేను వెంటనే ఎటాచ్ అవగలను, డిటాచ్ కూడా అవగలను. సరే నా రాజకీయ జీవితం అయిపోయింది. చేయాల్సిన ప్రయత్నం చేశాను. కానీ సక్సెస్ అవలేదు. వేరే ఫీల్డులోకి వెళ్దాం…ప్రజలకు ఇంకో రకంగా సేవ చేద్దామనే ఆలోచనతో ఉన్నాను.
ఆర్కే: రాంగోపాల్ వర్మ మంచి ఫ్రెండ్ కదా. ఆయనతో తీయొచ్చు కదా?

రాజగోపాల్: చూద్దాం…రిజల్ట్ వచ్చిన తరువాత. ఈసారి భావోద్వేగాలకు లోను కాకుండా ఆలోచనతో చేద్దామని.
ఆర్కే: రాజకీయాల్లోకి రావడం గురించి పునరాలోచనైతే లేదు?
రాజగోపాల్: లేదు. ఇంతకుముందు కూడా ఎవరో అడిగారు. నాకు జన్మను, మరణాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నాకు పునర్జన్మల మీద నమ్మకం లేదు. సో…అందుకని మళ్లీ ఎప్పుడొస్తావ్ అనే దానిమీద నేనేమీ చెప్పలేను. కాంగ్రెస్‌వాదిగానే రాజకీయాల్లోకి వచ్చాను. కాంగ్రెస్‌వాదిగానే తొలిగిపోయాను. వాస్తవంగా అయితే నేను 60 ఏళ్లకు రిటైర్ అవుదామనుకున్నాను. పదేళ్లు ముందే తీసుకోవాల్సి వచ్చింది. నేను చేసిన పనిని చాలామంది ఎమోషనల్ డెసిషన్ అన్నారు. నా మనసుకు నచ్చింది. చేశాను. ప్రశాంతంగా ఉన్నాను.

ఆర్కే: పెప్పర్‌స్ప్రే ఇప్పటికీ జేబులోనే పెట్టుకుంటున్నారా?
రాజగోపాల్: ఇక అవసరం లేదండి. దాంతో రాజకీయంగా బలమైన వాదన వినిపించాను. నేను గన్‌మెన్‌లను తీసుకోలేదు. గన్నులు, కత్తులు లేవు. ఒంటరిగా వెళ్తుంటాను కదా… పెప్పర్‌స్ప్రే ఉపయోగపడుతుంది ఎవరో చెప్పారు. అందుకే జేబులో పెట్టుకునేవాణ్ణి. కానీ దాన్ని పార్లమెంట్‌లో ఉపయోగించాల్సి వచ్చింది. అది సరైన నిర్ణయమని నేనట్లేదు. పార్లమెంట్ దేవాలయం లాంటిది. అయినా తప్పలేదు. అసలు ఆ రోజు నా మీద ఎవరూ దాడిచేయలేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన వేణుగోపాల్‌రెడ్డి మీద దాడి జరుగుతుంటే వాళ్లను చెదరగొట్టడానికి పెప్పర్ స్ప్రే వాడాను.

ఆర్కే: మిమ్మల్ని కూడా కొట్టారా?
రాజగోపాల్: నాకు పెద్దగా తెలియలేదు. ఆ తరువాత నేను 545 మంది ఎంపీలకు లేఖ రాశాను. ‘నేను చేసిన పనిని సమర్ధించుకోను. నా ఉద్దేశం, నా వాదన , నా సిద్ధాంతం సరైనదనే చాలామంది అనుకుంటున్నారు. కాంగ్రెస్ పనితీరును అందరూ ఎండగడుతున్నారు. నేను ఆ విధంగా ఎందుకు చేయాల్సివచ్చిందనేది చాలామందికి అర్థమైంది’ అని. మరుసటి రోజు నేను స్పీకర్‌ను కలిసినప్పుడు విభజన తీరు, జరిగిన పరిణామాల పట్ల ఆవిడ విచారం వ్యక్తం చేశారు. పెప్పర్‌స్ప్రే ఇన్సిడెంట్ తరువాత వాళ్లమ్మాయి నాతో మాట్లాడాలని అనుకుంటోందని చెప్పి ఇంటికి ఆహ్వానించింది. చాలామంది కలిశారు. అర్థం చేసుకున్నారు. ఆంధ్ర, రాయలసీమలో చాలా మెచ్చుకున్నారు. ‘ఇంత ఫాలోయింగ్ వచ్చిన తరువాత రాజకీయాల్లోంచి ఎందుకు తప్పుకుంటున్నారని’ కూడా చాలామంది అడిగారు. ఈ భావోద్వేగాల మీద రాజకీయ పునాదులు నిర్మించుకోవటం నాకిష్టం లేదు. ఎందుకంటే నేనే ఎంతోమందిని తప్పు పట్టాను. నేనూ అదే చేయడం ఇష్టం లేదని చెప్పాను.

ఆర్కే: పదకొండేళ్ల పొలిటికల్ కెరీర్ ఒక బ్లాక్‌స్పాట్‌తో రిటైర్ అయినట్టుగా బాధ అనిపించట్లేదా?
రాజగోపాల్: బ్లాక్‌స్పాట్ అనలేను కానీ, ఒక ప్రాంతానికి బాగా నచ్చిన విషయం ఇది. నా బాధ ఏంటంటే.. నేనే రెండు సార్లు ప్రయివేట్ బిల్లు పెట్టించాను. పార్లమెంట్‌లో ఎవరూ గొడవలు చేయకూడదు, ఏదైనా ఉంటే చర్చించుకోవాలి అని. నేను చట్టపరంగానే వెళ్దామనుకున్నా. కానీ, ప్రభుత్వమే చట్టవ్యతిరేకంగా చేస్తున్నప్పుడు నా సిద్ధాంతాలను పక్కన పెట్టాను.

ఆర్కే: ఇందాక అన్నారు కాలేజ్‌డేస్‌లో ఉన్నప్పుడు గొడవలు చేశాను కానీ, మళ్లీ ఎప్పుడూ చేయలేదని. కాలేజ్‌డేస్‌లో చైన్ బ్యాచేనా మీది?
రాజగోపాల్: ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు తప్పదు కదా. నాకై నేనెప్పుడూ వాడలేదు కానీ, నా సపోర్టర్స్ వాడారు. కొట్లాటలో నేను ప్లానింగ్ చేసేవాణ్ణి. ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు రంగంలోకి దిగ తప్పలేదు. కాలేజ్ డేస్‌లో ధర్నాలు చేశాను. వన్ ఇయర్ సస్పెండ్ అయ్యాను. కొట్లాటలు, కాంప్రమైజ్‌లు అన్నీ అయ్యాయి. నేను అకౌంట్లు సెటిల్ చేసినోళ్లు కూడా ఆ తరువాత ఫ్రెండ్స్ అయ్యారు. మా ప్రిన్సిపాల్ చెప్పాడు ఒకరోజు ‘నీ తెలివినంతా సరైన మార్గంలో వెళ్లడానికి ఉపయోగించుకో’ అని. అప్పటి నుంచి సరైన దారిలోనే వెళ్లాను. అందుకే బిజినెస్‌లో షైన్ అయ్యాను. రాజకీయాల్లో షైన్ అయ్యాను.

ఆర్కే: తిరిగే కాలు, తిట్టే నోరు ఊరుకోదంటారు కదా. అందుకేనా మీరు కూడా రాజకీయాల చుట్టూనే పరిభ్రమిస్తున్నారు?
రాజగోపాల్: కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే ఎన్నికల వరకు ఆయనకు నైతికంగా సపోర్ట్ చేస్తానని ముందే చెప్పాను. అలాగే చేశాను. ఎందుకంటే ఆయనొక అంశం కోసం పదవిని కూడా లెక్క చేయకుండా పోరాడాడు. గెలుపైనా ఓటమైనా ఆయనకు మద్దతు ఇవ్వాలనుకున్నా.

ఆర్కే: అందరూ ఆయనను రెచ్చగొట్టి పార్టీ పెట్టించారు. ఆ తరువాత ఒక్కొక్కరూ జారుకున్నారు. ఒక్కడ్ని చేశారు.
రాజగోపాల్: ఆయన పక్షాన నిలబడినవారందరికీ ప్లాట్‌ఫామ్ చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మెల్లగా ఒక్కొక్కరూ తప్పుకున్నారు. కానీ, ఆయన మాత్రం వేదిక చూపించి తన బాధ్యత నిర్వర్తించాడు. చాలామంది పార్టీ పెట్టమన్నారు కానీ ఆ తరువాత జారుకున్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి చాలా బాధపడ్డాడు.

ఆర్కే: సర్వేలు చేయించారు కదా…ఏంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి?
రాజగోపాల్: ఎన్నికలకు మూడు నాలుగు రోజులు ముందే చెప్పాను. ఎందుకంటే నా పేరు మీద రకరకాల ఎస్సెమ్మెస్‌లు వస్తున్నాయి. అందుకే నేనే ప్రెస్‌మీట్ పెట్టి చెప్పాను. నేనెప్పటికీ సర్వేల ఆధారంగానే మాట్లాడతాను. రిపోర్టులు నా దగ్గర ఉన్నాయి. నేను ఎవరి మీదో ప్రేమతోనో, ద్వేషంతోనో మాట్లాడను. కొత్త ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ సొంతంగా అ«ధికారంలోకి వస్తాయి.

ఆర్కే: మీ రాజకీయ అనుభవంతోటి, ఎనలిటికల్ పవర్‌తోటి చెప్పండి. జగన్‌కు రాజకీయ భవిష్యత్ ఉంటుందా?
రాజగోపాల్:ఒకరి భవిష్యత్ గురించి మాట్లాడటం ధర్మం కాదు. జనం.. ఇష్టమైతే నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారు. తేడావస్తే కాళ్ల కింద విసిరేస్తారు. ఎన్టీయార్, చిరంజీవిలాంటి వాళ్లే ఓడిపోయారు. మొన్న షీలాదీక్షిత్ ఓడిపోయింది. అందుకని ప్రజలు నెత్తిమీద పెట్టుకుంటారా? కాళ్ల కింద తొక్కేస్తారా? అనేది మన వ్యవహార శైలిని బట్టి ఉంటుంది.

ఆర్కే: విశాఖపట్నంలో విజయమ్మ పరిస్థితి ఏంటి?
రాజగోపాల్: ఇక్కడో విషయం చెప్పాలి. నామినేషన్‌కు పదిహేను రోజుల ముందు ఫ్లయిట్‌లో బ్రదర్ అనిల్ కలిశాడు. మాటల సందర్భంలో షర్మిల ప్రస్తావన వచ్చింది. మల్కాజ్‌గిరి, వైజాగ్.. ఈ రెండూ కాకుండా మరెక్కడైనా పోటీకి నిలబెట్టమని చెప్పాను. ఏం జరిగిందో కానీ ఆమైతే పోటీలో లేదు. కానీ విశాఖపట్నంలో పోటాపోటీ నడుస్తోంది. విజయమ్మ ఓడిపోవడం చాలామంది జీర్ణించుకోరు. అర్బన్ ఏరియాలో పోటీచేయడం కంటే అనకాపల్లి, విజయనగరం అయితే బాగుండు.

ఆర్కే: రాజశేఖర్‌రెడ్డి, జగన్.. ఈ ఇద్దరిలో మౌలికంగా మీరు గమనించిన తేడా ఏమిటి?
రాజగోపాల్: రాజశేఖర్‌రెడ్డి నమ్మినవాళ్ల కోసం నిలబడతాడు. అడ్డొస్తే మటుకు ఎవరినైనా సరే అంతు చూస్తాడు. మధ్యలో నాకూ అయనకు కూడా తేడా వచ్చింది. కానీ తరువాత ఓ రోజు నాకు ఆయనే ఫోన్ చేసి మాట్లాడాడు. మునుపటిలా ఉందామని చెప్పాడు. ప్రత్యర్థి అయినా గౌరవించి మాట్లాడే వ్యక్తి. వ్యక్తిత్వానికి, పూర్వ సంబంధాలకు విలువిచ్చే మనిషి. జగన్‌కు వ్యాపారపరంగా మెళకువలు చెప్పాను తప్ప ఎక్కువగా మాట్లాడలేదు.

ఆర్కే: సరే…ఇక్కడితో ఆ విషయం వదిలేద్దాం. మోదీ ప్రైమ్ మినిస్టర్ కావడం ఖాయమా? మీ అంచనా ప్రకారం…
రాజగోపాల్: ఎన్‌డీఏకు పూర్తి మెజారిటీ వస్తుంది. దాదాపు 300 దాకా వస్తుంది. బీజేపీకి 220- 240 రావచ్చు.

ఆర్కే: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ-టీడీపీ కూటమికి ఎంత రావచ్చు?
రాజగోపాల్: కూటమి వాళ్లే నెంబర్‌వన్ ఉంటారు. నెంబర్ గురించి చెప్పలేను. ఇంకొంచెం క్లారిటీ రావాల్సి ఉంది.

ఆర్కే: తెలంగాణ విషయానికొస్తే… 60ప్లస్ వస్తాయని చెప్పారు. మరి కేసీఆర్‌కు కంగ్రాట్స్ చెప్పారా?
రాజగోపాల్: నేనెవరికీ చెప్పలేదు. చంద్రబాబునాయుడుకు చెప్పలేదు. కేసీఆర్‌కూ చెప్పలేదు.

ఆర్కే: …అంటే ఇంతకుముందు మిమ్మల్ని ఐ లవ్ యూ అన్నాడు కదా?
రాజగోపాల్: ఆ రోజు మీరే మాట్లాడించారు. 2010లో దాదాపు రెండు గంటలు. ఆయన ఐ లవ్ యు అన్నారు, ఒకే ఒక్కడు అన్నారు, హీరో అన్నారు. అప్పుడు చాలామంది కేసీఆర్‌ను తప్పుపట్టారు. తెలంగాణ వద్దన్నోడు హీరో అయితే కావాలన్నవారు జీరోనా? అని. అయినా ఆయనెక్కడా చలించలేదు. ఆయనదో సిద్దాంతం. రాజకీయాల నుంచి విరమించుకుంటున్నా అని చెప్పినప్పుడు టీవీలో చూసి కేటీఆర్ నాకు ఫోన్ చేశాడు. ‘సిద్ధాంతం కోసం పోరాడారు మీరు. వ్యక్తిగతంగా కాదు. నేను పర్సనల్‌గా రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు రాజకీయాల్లో ఉండాలి’ అన్నాడు.

ఆర్కే: మీ ఎస్సెస్‌మెంట్ ఇచ్చిన తరువాత కేటీఆర్ ఫోన్ చేయలేదా?
రాజగోపాల్: లేదు. కానీ, కొంతమంది టీఆర్ఎస్ వాళ్లు చేశారు.

ఆర్కే: మీ పోరాటం అంతా హైదరాబాద్‌లోని ఆస్తులు కాపాడుకోవడానికే అన్నారు? అసలు హైదరాబాద్‌లో మీకు ఎన్ని ఆస్తులున్నాయి?
రాజగోపాల్: ఇక్కడ ల్యాంకోహిల్స్. ఇల్లు ఉన్నాయి. విజయవాడలో స్థలాలున్నాయి. పదిహేను రాష్ట్రాల్లో మా కంపెనీలున్నాయి. తెలంగాణ వస్తే 16 రాష్ట్రాలు అవుతాయి ఏముంటుంది తేడా? అసలు విభజనకు ఒప్పుకోమని మా తమ్ముడు ఒత్తిడి చేశాడు. వ్యాపారపరంగా బాగుంటుందని చెప్పాడు. కానీ నేను ఒప్పుకోలేదు. వ్యాపారస్తులకు ఎన్ని రాష్ట్రాలయితే అంత మేలు. నేను ఆస్తులు కాపాడుకోవడానికే ఉద్యమం చేస్తున్నాను అన్నప్పుడు ‘కేసీఆర్‌కు నా మొత్తం ఆస్తులు రాసిస్తా. తెలంగాణ అడగకుండా ఉంటాడా?’ అని అడిగాను. తరువాత మళ్లీ ఆ మాట అనలేదాయన.

ఆర్కే: ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో మీ పాత్ర ఎట్లా ఉండబోతోంది?
రాజగోపాల్: అది వచ్చే ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం. మంచి అనుభవం ఉన్న పాలకుడు రాబోతున్నాడనే అంచనా ఉంది. తెలుగువాళ్ల మధ్య విభేదం వచ్చింది. ఈ గాయం మానాలి. ఎన్టీయార్ 30 ఏళ్ల క్రితమే చెప్పారు.. ఆంధ్రప్రదేశ్ పేరు ‘తెలుగునాడు’గా మార్చాలని. ఆ పేరే పెట్టి ఉంటే ఈ ఆంధ్ర, తెలంగాణ అనే ఫీలింగ్ వచ్చి ఉండేది కాదు. అందుకే ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్‌ను ‘తెలుగునాడు’గా మారిస్తే బాగుంటుంది. ఆంధ్ర, తెలంగాణ అనే ఫీలింగ్ ఎంతో కొంత పోయి అందరం తెలుగువాళ్లమనే భావన ఉంటుంది.

ఆర్కే: మీ జీవితంలో అత్యంత బాధాకరమైన సన్నివేశం రాష్ట్ర విభజనేనా? ఇంకేదైనా ఉందా?
రాజగోపాల్: జనవరి 6న మా నాన్నగారు చనిపోయారు. ఆ సమయంలో గజల్ శ్రీనివాస్ అడిగాడు. ‘మీ కళ్లల్లో నీళ్లు రాలేదు. నాన్నంటే ప్రేమ తక్కువా?’ అని. ఆయనకు చెప్పాను…నాన్నతో అనుబంధం చాలా ఎక్కువ నాకు. కానీ ఆయన చనిపోతారని ముందే ఎక్స్‌పెక్ట్ చేశాను అని. కానీ రాష్ట్ర విభజనను నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. రాజశేఖర్ రెడ్డి చనిపోయినరోజు, రాష్ట్ర విభజన తప్పదని తెలిసిన రోజు కన్నీళ్లు వచ్చేశాయి.

ఆర్కే: మీ పిల్లలేం చేస్తున్నారు?
రాజగోపాల్: ముగ్గురు అబ్బాయిలు. అందరూ చదువుకుంటున్నారు.

ఆర్కే: పిల్లలు ఒక దశకు రాకముందే మీరు రిటైర్ అయిపోయారే!
రాజగోపాల్: అదేం లేదు. ఇంకో పదేళ్లు అయితే ఎలాగూ రిటైర్ అయ్యేవాణ్ణే. కానీ పిల్లలు మాత్రం చాలా హ్యాపీ. వాళ్లతో చాలా టైమ్ స్పెండ్ చేస్తున్నా. సినిమాలకు వెళ్తున్నా.

ఆర్కే: సినిమాలు బాగా చూస్తారట కదా…
రాజగోపాల్: అంతకుముందు బాగా చూసేవాణ్ణి. రాజకీయాల్లోకి వచ్చాక తగ్గింది. కానీ, ఇప్పుడు మళ్లీ చూస్తున్నా.

ఆర్కే: సో…కొత్త రాష్ట్ర నిర్మాణంలో మీ సలహాలు, సూచనలు ఇస్తూ కాలక్షేపం చేస్తానంటారు?
రాజగోపాల్: అంతేనండీ… ఏదో పోతుందనే భయం నాకు లేదు. మా నాన్నగారు లారీ నడిపి పైకొచ్చారు. మా చిన్నాన్న క్లీనర్. మా పెదనాన్న మేనేజర్..అందరూ ఒకే లారీకి. అట్లాంటిది 100 లారీలు కొన్నారు. ఎవరో మోసం చేస్తే అన్నీ పోయాయి. మళ్లీ జీరో నుంచి మొదలు పెట్టారు. అందుకే నేను అన్నీ పోగొట్టుకున్నా బాంబే సిటీకో, ఇంకేదో సిటీకో వెళ్లి టాక్సీ డ్రైవర్‌గా బతికేయగలను. నేను బాగా డ్రైవ్ చేస్తాను.

ఆర్కే: కిక్ ఉండాలంటారు…
రాజగోపాల్: కిక్ అంటే గుర్తొచ్చింది. 2009లో ఎన్నికలప్పుడు కౌంటింగ్‌కు ముందురోజు నేను మా పెద్దోడితో ‘కిక్’ సినిమాకు వెళ్లాను. రెండు గంటలు ఫోన్ స్విచ్చాఫ్. రాత్రి 10 గంటలకు ఇంటికొచ్చి ఆన్ చేసిన వెంటనే రాజశేఖర్‌రెడ్డిగారి నుంచి ఫోన్. ఎక్కడకు పోయావ్ అంటే ‘కిక్ సినిమాకు వెళ్లా’నని చెప్పాను. మాకు కిక్కా కక్కా తెలియక చస్తుంటే సినిమాకు వెళ్లావా? అని ఆశ్చర్యపోయాడు.

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.