మరింత పలుచగా రాస్తే బాగుండుననుకుంటాను (ఆఫ్ ది రికార్డ్) అనుకొన్న రచయిత్రి ఓల్గా

-మనదేశంలోనిదంతా పాశ్చాత్య స్త్రీవాదమే అనడం సరికాదు. మార్క్సిజాన్ని పాశ్చాత్య దేశాల్నించి దిగుమతి అయిందని ఎవరూ అనగా నేను వినలేదు.

-పురాణ పాత్రల్ని సబ్‌వర్డ్ చేసి రాయడం అనేది బ్రాహ్మణిజాన్ని సపోర్టు చేయడం కాదు. సవాల్ చేయడమే.

-బొట్టు మత చిహ్నం అనుకోకపోవటం వల్ల కూడా దాన్ని వదులు కోవాలని సీరియస్‌గా మేమెప్పుడూ ఆలోచించలేదు. అలవాటుగా కొనసాగుతూ వచ్చింది.

-లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు చాలామందే ఉంటున్నారు. కాని చైతన్యం లేకపోవడం, స్పష్టత లేకపోవడం వల్ల కొంత గందరగోళానికి లోనవుతున్నారు. అలాంటి వారిని చూసి మిగతావారు భయపడి ముందుకు రావడం లేదు. ప్రేమ తప్ప మిగతా విషయాలు డామినేట్ చేయని పరిస్థితి సమాజంలో ఉంటే, అలాగే ప్రేమ లేనప్పుడు కూడా ఆ బంధాన్ని పట్టుకు వేలాడాలి అనే మనస్తత్వం పోతే గాని ఇలాంటివి సాధ్యం కావు.

-స్త్రీవాదం ఎన్నో వివాదాల్ని తెలుగు సాహిత్యంలోకి మోసుకొచ్చింది. స్త్రీవాదం మూలస్తంభాల్లో ఒకరు ఓల్గా. వారు స్త్రీవాదం తీసుకుంటున్న వివిధ మలుపుల్లో కవిగా, కథకులుగా, నవలా కారులుగా, యాక్టివిస్టుగా ఎన్నో పాత్రలు విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. వారి అంతరంగంలోని కొన్ని పార్శ్వాలు…

మీరు సాహిత్యకారులు కాకపోయి ఉంటే ఏమయ్యేవారు?
– నేను ఎప్పుడూ ఏదో కావాలి అనుకోలేదు. చిన్నప్పటి నుంచి సాహిత్యం చదివే అలవాటుంది. నాన్న మాత్రం నన్ను డాక్టర్‌ను చేయాలనుకున్నారు. అప్పట్లో లెఫ్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లు దాదాపుగా తమ పిల్లల్ని డాక్టర్లను చేయాలని చూసేవారు. ఎంబిబిఎస్‌లో నాకు సీటు కూడా వచ్చింది. నాకు ఇష్టం లేదని చెప్పి లిటరేచర్‌లో చేరాను.
ఒకవేళ రచయితను కాకపోతే ఆక్టివిస్ట్‌గా జీవించేదాన్ని. సాహిత్యంతో సంబంధం లేకుండా మాత్రం ఉండేదాన్ని కాదు.

 మీరు కవిత్వం, కథలు, నవలలు రాశారు. మిమ్మల్ని మీరు ఎలా ఐడింటిఫై చేసుకోవడం ఇష్టపడతారు?
– పాటలు, డాన్స్ బ్యాలేలు, సినిమా స్క్రిప్ట్‌లు, టెలివిజన్ సీరియళ్లు కూడా రాశాను. అనువాదాలు చేశాను. అయితే ఒక ప్రక్రియ ద్వారానే కాకుండా రచయిత్రి అనడాన్నే ఇష్టపడతాను.

ఇన్ని ప్రక్రియలు నిర్వహించడం వల్ల మీ రచనలన్నీ పలుచనయ్యాయనే విమర్శ ఉంది?
– పలుచనైనాయని నేను అనుకోను. నా రచనల్లో సాంద్రత ఎక్కువ. అనవసరమైన పదాలు, వర్ణనలు ఉండవు. కాబట్టి పలుచన అనే ప్రశ్నే లేదు. ‘వర్ణనలు చేయరేమిటి? ఇంకా వివరంగా రాయొచ్చు కదా! మీ రచనలు చదివాక చాలా ప్రశ్నలు వస్తాయి. వాటి సమాధానాలు కూడా రాయొచ్చు కదా’ -అని చాలామంది పాఠకులు అడిగారు. ‘నేనలా రాయలేను. అది నా బలహీనత అనుకుంటాను’ అన్నాను. నిజానికి ఇంకాస్త పలుచగా రాస్తే బాగుండునని కూడా అనుకుంటుంటాను. చదివించే గుణం ఉండటమే నాకు ముఖ్యం.

మీ కథలు, నవలల్లో సహజత్వం కన్నా సిద్ధాంతం పాలు ఎక్కువనే విమర్శ ఉంది..
– సిద్ధాంతం, జీవితం వేరు వేరుగా ఉంటాయనేదే పొరపాటు అభిప్రాయం. జీవితం లేనిదే సిద్ధాంతం లేదు. సిద్ధాంతీకరించనిదే జీవిత వాస్తవికత అర్థం కాదు. నేను సమాజంలో ఉన్న పాత్రలనే తీసుకుంటాను. ఆ పాత్రలను నేను చెప్పదలుచుకున్న విషయానికి తగ్గట్టుగా నడిపిస్తాను. అందులోంచి పాఠకులకు విషయాన్ని సులువుగా అర్థమయ్యేలా చేస్తాను. పాఠకులు నా రచనలు కష్టపడకుండా చదవాలి. చదివాక చాలా కష్టపడాలి. తీవ్రంగా ఆలోచించాలి. సంఘర్షణ పడాలి. సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అది నా లక్ష్యం.

 స్త్రీవాద సాహిత్య-సామాజిక ఉద్యమకారిణిగా ఆయా కార్యక్రమాల సందర్భంలో మీ కవిసమయం, కథా సమయం నష్టపోతున్నట్లు ఎప్పడైనా బాధపడ్డారా?
– బాధపడ్డమా! కార్యకర్తగా సమాజంలోకి వెళ్లి పని చేస్తున్నప్పుడు నాకు చాలా జీవితాలు పరిచయమవుతాయి. అర్థమవుతాయి. అలాంటి అనుభవాలు లేకుండా ఊరికే ఊహించి రాస్తే రచనల్లోకి జీవిత వాస్తవికత ఎలా వస్తుంది. పట్టణాలు, గ్రామాల్లోకి వెళ్లి చూసి రాసే రచనల్లో జీవితం లేదని ఎవరైనా అంటే వారికి ఆ జీవితం గురించి తెలియదనుకోవాలి. కార్యకర్తగా పనిచేయకపోతే నేను రాయలేను. అది నాకు ముడిసరుకుని అందిస్తుంది.

 మీ సొంత జీవితంలోని వివాదాస్పద విషయాలేమైనా మీ రచనల్లోకి తీసుకొచ్చారా?
– నా రచనలన్నీ వివాదాస్పదమే. అందులో సొంతమూ ఉంటుంది. కానిదీ ఉంటుంది.

మీకు నచ్చని, మెచ్చని రచనలు?
– యండమూరి రచనలు ఎంత ప్రయత్నించినా చదవలేకపోయాను. ఆ ధోరణి నాకు నచ్చదు.

వ్యక్తిగతంగా, సాహిత్యపరంగా అక్కినేని కుటుంబరావు మీకెలా ‘తోడు’పడ్డారు?
– ఇద్దరం చాలా పనులు కలిసి చేస్తుంటాం. కుటుంబరావు కూడా ఫెమినిస్ట్ కావడం వల్ల నాకు వ్యక్తిగత, సాహిత్య జీవితంలో కూడా ఖాళీ అనేది లేదు. నిండుగా హాయిగా ఉంది. మేమిద్దరం కలిసి చేస్తున్న పనులే ఎక్కువ.

అక్కినేని కుటుంబరావు రచనలకు మీరే మొదటి శ్రోత కదా!
– ఒకరి రచనల్ని ఒకరం చాలా ఆతృతగా చదివేసుకుంటాం మేము. చర్చించుకుంటాం. చిన్న చిన్న సలహాలు ఇచ్చుకుంటామే తప్ప పెద్దగా మార్పులు ఉండవు. అక్కినేని కుటుంబరావు నా అభిమాన రచయితల్లో ఒకరు కూడా.

సాహిత్యం కాకుండా మీకు ఇంకా ఏమిష్టం?
– సంగీతం వినడం ఇష్టం. నాటకాలు వేయడం కూడా.

పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అయ్యిందనే విమర్శ స్త్రీవాదంపై వినబడుతూంటుంది..
– దిగుమతి అవడానికి స్త్రీవాదం సరుకు కాదు. మానవ అనుభవాలు ప్రపంచమంతా ప్రవహిస్తూ ఉంటాయి. మానవ అనుభవాల్ని జీవిత వాస్తవాల్ని విశ్లేషించే ఒక వాదం స్త్రీవాదం. దానికి దేశాలు, ఎల్లలు లాంటివి ఆపాదించడం నాకు నచ్చదు. ఎక్కడి నుంచయినా మనం జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు. అదలా ఉంచి మనదేశంలో స్త్రీవాదం అనేది అభివృద్ధి చెందుతూ ఉంది. దాని చరిత్ర ఇంకా రాయవలసే ఉంది. దాన్ని గురించి జరగాల్సినంత చర్చ జరగలేదు. అందుకని మనదేశంలోనిదంతా పాశ్చాత్య స్త్రీవాదమే అనడం సరికాదు.
మార్క్సిజాన్ని పాశ్చాత్య దేశాల్నించి దిగుమతి అయిందని ఎవరూ అనగా నేను వినలేదు. పీడితులకు, శ్రామికులకు సంబంధించిన సిద్ధాంతం మార్క్సిజం. అలాగే అణచివేతకు గురవుతున్న స్త్రీలకు సంబంధించిన విశ్లేషణా పద్ధతి స్త్రీవాదం.

పితృస్వామ్యానికి మూలమైన బ్రాహ్మణిజాన్ని ప్రత్యక్షంగా ఢీకొనే ప్రయత్నం పెద్దగా స్త్రీవాదం చేయలేదనే విమర్శ ఉంది…
– పితృస్వామ్యాన్ని సవాల్ చేయడమంటే బ్రాహ్మణిజాన్ని సవాల్ చేయడమే. పితృస్వామ్య మూలాలు మనుధర్మ శాస్త్రాల్లోనే ఉంటాయి. వాటన్నింటినీ సవాల్ చేయకుండా స్త్రీవాదం ముందుకు వెళ్లలేదు. బ్రాహ్మణిజం అనేది ఒక కులంగా కాకుండా అదొక యిజంగా అందరిలోనూ ఉంటుందనే గ్రహింపు ఉండాలి. బ్రాహ్మణిజం అనేది ఆధిపత్య ధోరణి. అన్ని కులాలు బ్రాహ్మణిజంలోకి జారిపోయే ప్రమాదం ఉంటుంది. అది నిరంతరం ఉంటుంది. దాన్ని సవాల్ చేయకుండా ఏ సమూహానికీ ప్రగతి వైపు నడవడం సాధ్యం కాదు.

బ్రాహ్మణిజాన్ని మోస్తున్న పురాణ పాత్రలను తీసుకుని రచనలు చేస్తున్నారని, తద్వారా పురాణాలకు ప్రామాణికతను చేకూరుస్తున్నారని, అందువల్ల బ్రాహ్మణిజానికి మేలు చేస్తున్నారనే విమర్శలూ మీ మీద ఉన్నాయి…
– పురాణ పాత్రల్ని సబ్‌వర్డ్ చేసి రాయడం అనేది బ్రాహ్మణిజాన్ని సపోర్టు చేయడం కాదు. సవాల్ చేయడమే. దాన్ని అర్థం చేసుకోలేనివాళ్లే ఇలాంటి విమర్శలు చేస్తారు.

 మీ ‘ప్రయోగం’ కథ ఎంతో చర్చ రేకెత్తించింది. కాని ‘ప్రయోగా’నికి అబ్బాయిల కన్నా అమ్మాయిలు ధైర్యం చేయడం లేదు కదా…
– సమాజంలో అలాంటి అమ్మాయిల సంఖ్య తక్కువగానే ఉంటుం ది. అలాంటి జీవితం అందరూ ఎంచుకోలేరు. అందుకు చాలా ధైర్యం కావాలి. తమపై తమకు నమ్మకం ఉండాలి. తనకు తాను పూర్తి బాధ్యత వహించాలి. తన జీవితాన్ని గురించిన నిర్ణయాలు తనే తీసుకోవాలి. అందుకు ఎంతో చైతన్యం కావాలి. లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు చాలామందే ఉంటున్నారు. కాని చైతన్యం లేకపోవడం, స్పష్టత లేకపోవడం వల్ల కొంత గందరగోళానికి లోనవుతున్నారు. అలాంటి వారిని చూసి మిగతావారు భయపడి ముందుకు రావడం లేదు. ప్రేమ తప్ప మిగతా విషయాలు డామినేట్ చేయని పరిస్థితి సమాజంలో ఉంటే, అలాగే ప్రేమ లేనప్పుడు కూడా ఆ బంధాన్ని పట్టుకు వేలాడాలి అనే మనస్తత్వం పోతే గాని ఇలాంటివి సాధ్యం కావు. వివాహంలో కొన్ని భద్రతలు ఉంటాయని అనుకుంటారు. కాని క్లిష్ట పరిస్థితి వస్తే అవేవీ పనికిరావు. భద్రత బంధంలో కాక స్వేచ్ఛలో ఉంటుంది అని స్త్రీ-పురుషులు అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి ‘ప్రయోగా’లకు ఆస్కారం ఉంటుంది. ప్రేమ ఉంటే వివాహం అవసరం లేదనే చైతన్యం, ఇద్దరికీ ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని, పిల్లలు, మిగతా విషయాల్లో ఇద్దరూ బాధ్యత తీసుకోవాలనే స్పృహ ఉంటే ఇది సాధ్యం. ఇంకో రిలేషన్‌షిప్ దొరకదు కాబట్టి నచ్చని రిలేషన్‌లో కూడా ఆత్మాభిమానం చంపుకొని అడ్జస్ట్ కావడం వల్ల స్త్రీ పురుషులిద్దరూ చాలా కోల్పోతారు.

మీ ‘రాజకీయ కథల్లో’ జడ గురించి, ముక్కుపుడక లాంటి ప్రతీకల గురించి కథలు రాశారు. మరి ఇవన్నీ స్త్రీవాదులు కూడా పాటిస్తున్నారు. బొట్టు పెట్టడంపై స్త్రీవాదులపై విమర్శ కూడా ఉంది..
– మనం దేనికి చెందుతామో దానిలోంచి ఒక్కసారిగా పూర్తిగా విముక్తం అయిపోతాము అనుకోలేము. ఒకోసారి సంకేతాలు అలా మిగిలిపోతాయి. వాటి సారాంశాన్ని మోయకుండా సంకేతాన్ని మాత్రమే కొనసాగించే పీరియడ్ ఒకటి ఉంటుంది. అది ఒక దశ. కొన్ని సంకేతాలకు మతపరమైన ఉనికి పోయి కాస్టూమ్‌లో భాగమైపోతాయి. బొట్టు మత చిహ్నం అనుకోకపోవటం వల్ల కూడా దాన్ని వదులుకోవాలని సీరియస్‌గా మేమెప్పుడూ ఆలోచించలేదు. అలవాటుగా కొనసాగుతూ వచ్చింది. ఒకప్పటి సారాంశాన్ని వదిలేసిన సంకేతాలు ఒట్టి సంకేతాలుగానే మిగిలిపోతాయి. వాటిని గురించి మాత్రమే పట్టించుకొని సారాంశంలో ఈ మనిషి ఏమిటని చూడకపోతే మనుషుల మధ్య సామరస్యం లోపిస్తుంది.
నాకు తెలిసీ చాలామంది స్త్రీవాదులు బొట్టుని అలవాటైన ఒక అలంకరణగా చూస్తున్నారు. బొట్టు పెట్టుకోవటం పెట్టుకోకపోవటం వల్ల వివక్ష చూపిస్తే అది తప్పవుతుంది.

స్త్రీవాదాన్ని కొనసాగించే కొత్త తరం కవయిత్రులు, రచయిత్రు లెవరూ కనిపించడం లేదు…
– ఎందుకు లేరు. మనం చూడనిరాకరిస్తున్నాం. ఒకవేళ 90’లలో స్త్రీవాదులం అని చెప్పుకున్నట్లు ఇప్పటి రచయిత్రులు చెప్పుకోవటం లేదేమో! దళిత, బీసీ, మైనారిటీ స్త్రీలు వివక్ష గురించి చేసే రచనలు కూడా స్త్రీవాద రచనలే. వారు అనివార్యంగా పితృస్వామ్యంతో పోరాడాల్సిందే. ఏ అస్తిత్వ పోరాటాల్లోనైనా పితృస్వామ్యాన్ని సవాల్ చేయడం ఉంటుంది. కులం వరకు పట్టించుకుని పితృస్వామ్యాన్ని ముట్టుకోనివాళ్లతో ప్రమాదం ఉంది.

 దళిత, మైనారిటీ కవయిత్రులు అసలు తమది స్త్రీవాదం కాదంటున్నారు…
– పితృస్వామ్యాన్ని ప్రశ్నించే రచయితలలో స్త్రీవాదం అనివార్యంగా ఉంటుంది. తమది స్త్రీవాదం కాదని అనటానికి ఏవో కారణాలు ఉండి ఉండాలి.

 దళిత, బీసీ, మైనారిటీ సాహిత్యంపై మీ అభిప్రాయం?
– చాలా గౌరవంతోనూ కుతూహలంతోనూ, అర్ధం చేసుకోవాలనే ఆతృతతోనూ చదువుతున్నాను. నాకు తెలియని అనేక సామాజిక విషయాలు తెలుసుకున్నాను.

 స్త్రీవాద సాహిత్యం తమ లక్ష్యాన్ని పూర్తిగా చేరుకున్నదా?
– చేరుకోలేదు. అది ఇప్పట్లో చేరుకోదు కూడా. సమాజం సంక్లిష్టమవుతున్న కొద్దీ కొత్త సంకెళ్లు స్త్రీల చుట్టూ బిగుసుకుంటున్నాయి. వాటిని గుర్తించి, వాటితో పోరాడాల్సిందే. అన్ని సమస్యలు పరిష్కారమైపోయి ఇక చేయవలసిందేమీ లేదు అనే స్థితి వస్తుందని నేను అనుకోవడం లేదు. అంతేకాక కుల అణచివేత, కుల సమస్య చాలా పెద్దది, క్లిష్టమైంది. అందులోనూ మళ్లీ స్త్రీల సమస్య మరింత సంక్లిష్టమైనది. దానిని అర్థం చేయించటానికి స్త్రీవాదులు రాయవలసిన అవసరం ఎంతైనా ఉంది. చేయవలసిన పని ఎంతైనా ఉంది.

 స్త్రీవాదుల్లో గ్రూపులు ఏర్పడ్డం మీద మీ అభిప్రాయం?
– ఏ వాదాల్లోనైనా గ్రూపులు ఉండడం సహజమే. భావజాలాలను బట్టి గ్రూపులుంటున్నాయి. మాడర్నిస్టులు ఒక గ్రూపుగా, పోస్ట్ మాడర్నిస్టులు ఒక గ్రూపుగా ఇట్లా గ్రూపులు ఏర్పడడం వల్ల, ఆ గ్రూపుల మధ్య సంఘర్షణ, చర్చ ఉండడం, అందులోంచి సత్యాన్వేషణ జరగడం మంచిదే.

 ప్రస్తుతం రచయిత్రులు ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, మట్టిపూలు రచయిత్రుల వేదికలుగా విడిపోయారు కదా.. మీ స్పందన?
– విడిపోయారు అనే మాట ఎందుకు? రచయిత్రులు రెండు వేదికలను ఏర్పాటు చేసుకొని చురుగ్గా పనిచేస్తున్నారు అనుకుంటున్నాను. వారి మధ్య దృక్పథాలలో సమాజాన్ని అర్థం చేసుకునే తీరులో తేడాలున్నాయి. వాటి గురించి చర్చ జరగటం వల్ల మంచే గాని చెడు ఏముంటుంది.

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.