సంజీవదేవ్‌ని ఎందుకు చదవాలంటే – బి. లలితానంద ప్రసాద్

‘ఆయన బుద్ధి జ్యోతిర్మయం; ఆయన హృదయం రసమయం; ఆయన చేతలు చైతన్యమయం; ఆయన అనుభూతి ఆనందమయం; ఆయన సమీక్షలు సమత్వమయం; ఆయన శైలి సౌందర్యమయం; ఆయన వీటన్నింటిమయం; ఆయన వాస్తవంలో కల్పన చూడగలడు; ఆయన కల్పనలో వాస్తవం చూడగలడు; ఆయన వ్యష్టిలో సమిష్టి వ్యష్టినీ అనుభూతి చెందగలడు. ఆయన రచనలు కాంతి కిరణాలు; ఆయన పథం కాంతి పథం’ – బహుముఖ మేధావి ఆనందకుమారస్వామి గురించి సంజీవదేవ్ అన్న మాటలివి. నిజానికి సంజీవదేవ్ గురించి వర్ణించటానికి ఇంతకన్నా మంచి మాటలు దొరకటం కష్టం. ఆయనకూ ఇవి అచ్చుగుద్దినట్లు సరిపోతాయి. సంజీవదేవ్‌లో మనకు ఆనందకుమారస్వామి, జిడ్డు కృష్ణమూర్తి లాంటివారు గోచరిస్తారు.
ఇప్పుడు ప్రతిదీ ప్రయోజనం దృష్టితో చూడటం పరిపాటి. ఈ దృష్ట్యానైనా సంజీవదేవ్‌ని తప్పక అధ్యయనం చేయాలి. తద్వారా వారికి తెలియకుండానే వారిలో వచ్చు మార్పులు గమనించవచ్చు. అవి వారి వారి జీవితాల్ని వారి చుట్టూ ఉన్న వారి జీవితాల్ని సరిదిద్దుకోవడానికీ, ఉన్నతీకరించుకొనుటకు ఉపయోగించవచ్చు. ఆ ప్రభావం అంతటిది. అందు కు కారణాలనేకం. పైన పేర్కొన్నవాటితో పాటు ఇంకా అనేకం ఉన్నవి.
సంజీవదేవ్ తీసుకునే అంశాలు ప్రత్యేకమైనవి. వాటిని చెప్పేవారు లేక అభివ్యక్తి వినూత్నం. వివరణాత్మకం. విశ్లేషణాత్మకం. సంపూర్ణం. సమగ్రం. సర్వ పార్శ్వాల, కోణాల సంలీన వీక్షణం. కొండొకచో సంశ్లేషణం. సర్వసాధారణాల్లో అసాధారణాల్ని చూపుతారు. అసాధారణాల్లో సాధారణాల్ని తెల్పుతారు. వెరసి పాఠకుని కొత్త లోకాలకు కొంగొత్త ప్రపంచాలకు తోడ్కొని పోతారు తనతోపాటు. ఈ ప్రక్రియలో అద్వితీయ సమన్వయం పాటిస్తారు. అనన్య సామాన్య సంయమనం ప్రదర్శిస్తారు. అసమాన తర్కాన్నీ జోడిస్తారు. ఎక్కడా ఎలాంటి ఉద్వేగాలకు తావుండదు. నిజమైన జ్ఞానిగా సమదర్శనం విశ్వరూపం గావిస్తారు. ఓ రుషితుల్యునిగా భాసిల్లుతారు. జ్ఞానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు.
విశ్వవ్యాపిత సమస్త రంగాల సర్వకాలుష్యాలకు సమన్వయ రాహిత్యమే అసలు కారణం. సంజీవదేవ్‌ని చూడటం, వినటం, మాట్లాడటం, చదవటం లాంటివన్నీ ఎవరికైనా జీవితాంతమూ గుర్తుండే మధురానుభవాలు. వాటి తాలూకు తీపి అనుభూతులు వారిని ఎన్నటికీ వీడవు. వాడవు. సంజీవదేవ్ శతజయంతి సంవత్సర సందర్భంలో ఆయన రచనలను చదవటమే మిగిలిన మార్గం. వారి రచనలు ఎక్కువమందికి చేరాలి. వాటిపై చర్చలు జరగాలి. తద్వారా ప్రస్తుతం సర్వత్రా నెలకొన్న సంక్షుభిత వేగవంత సమాజంలో ఆయా అంశాల పట్ల సదవగాహన కలుగుతుంది. అది అన్నింటా సంయమనానికి దారితీస్తుంది. పరస్పర నిరంతర వైరుధ్యాల్ని సమన్వయపరుస్తుంది. సద్వివేచనకు పురికొల్పుతుంది. భావోద్వేగాల నియంత్రణకు బాటలు పరరుస్తుంది. ప్రతిదాన్లో పరిణత దిశగా పయనింపజేస్తుంది.
సమకాలీన సంక్లిష్ట పోటీ ప్రపంచంలో కాస్త నిలకడకు మరింత మానవతకు నవ్యనాగరికతకు, సంజీవదేవ్‌ని తప్పక చదవాలి. చదివించాలి. వారి ‘విశ్వమానవ’ తాత్వికతకు అన్ని సంకుచితాలు అంతరిస్తాయి. హద్దులు, సరిహద్దులు చెరిగిపోతాయి. ఆధునిక దైనందిన కార్యకలాపాల్లో, బేరీజుల్లో, నిర్ణయాంశాల్లో పరిగణాంశాలన్నింటికీ కరదీపికలు కాగలవు.
ఇంకా చెప్పాలంటే- ఆయన ప్రతి అక్షరం సారభూతం. వారు ఎవరి మెప్పుదలకూ, ఒప్పుదలకు ఏమీ రాయలేదు. ఎట్లా జీవించారో అట్లా రచించారు. జీవనం, రచన రెండూ సంజీవదేవ్ బింబప్రతిబింబాలు. రెండింట్లో ఏది తీసుకున్నా వారి పట్ల మన గౌరవాభిమానాలు ద్విగుణీకృతమవుతాయి. సృజనలో లబ్దప్రతిష్ఠులనేకులు ఇందుకు విరుద్ధం. ఈ ద్వైదీ రాహిత్య రస దీప్తి వారి అక్షరాల్లో అంతటా ఉద్దీప్తమై ప్రసరిస్తూనే ఉంటుంది. ఈ తేజస్సులో చదువరి పునీతుడవుతాడు. ఏకకాలంలో వారి వ్యక్తిత్వ వైశాల్యాల్ని ఆవాహన చేసుకోగలుగుతాడు.
దైనందికతను విస్మరించకనే కళాస్వాదనలో, శాస్త్రాధీనంలో మనిషి మనుగడ మరింత అర్థవంతమూ, ఆనంద దాయకమూ, ప్రయోజనకరమూ, పరిపూర్ణమవుతాయో తెలుపుతాయి సంజీవదేవ్ రచనలు. ఈ రీత్యా సంజీవదేవ్‌ని మరెందరెందరికో చేరువ చేయాలి. వయసుల, వృత్తుల, ప్రాంతాల, భాషాలకతీతం ఆయన మైత్రీ వనం. సంజీవదేవ్‌కి చిన్న వయసులో అత్యంత సుప్రసిద్ధులతో, పెద్ద వయసులో అత్యంత చిన్న వయసుల వారితోనూ సాన్నిహిత్యం ఇందుకో తార్కాణం. తెలిసిన, తెలియని వారి నడుమ శూన్యాన్ని పూరించాలి. అందుకై వారికి స్మారకాలు నిర్మించాలి. రచనలపై చర్చలు జరపాలి. వాటి ప్రాధాన్యతల్ని నూతన తరాలకీ తెలపాలి. ఇందుకు వారినీ, వారి రచనల్ని ఎరిగిన ప్రతి ఒక్కరూ పూనుకోవాలి. తద్వారా వ్యక్తి వికాసానికి దోహదపడినట్లవుతుంది. అది సామాజిక వివేచనకు దారితీస్తుంది.
సంజీవదేవ్ పలు పాక్షికాలకు అతీతంగా ఉండగలరు. ద్వంద్వాల పట్ల సమవీక్షణతో జీవించగలరు. స్థూలాల్లో సూక్ష్మాల్నీ, సూక్ష్మాల్లో స్థూలాన్ని సమదర్శనంతో సమన్వయించుకోగలరు. కరుడుకట్టే కాఠిన్యాల్ని కరిగించుకుని బుద్ధుడు ప్రవచించిన కారు ణ్యం వైపు పయనించగలరు. వీరి రచనలు, పరిచయాలు మనో నేత్రాలపై సరికొత్త వెలుగును, వెన్నెలనూ ప్రసరిస్తుంటాయి. తన పాఠకులను తనతో తీసుకుపోయి ఉన్నత, ఉత్తమస్థాయిలో నిలపగల విశిష్టులలో గరిష్ఠుడాయన. వారి ముద్ర చదువరిపై పడకుండా ఉండటం అసాధ్యం. మనం ఎంచుకునే రచన, రచయితే మనం ఏమిటో తెల్పకనే తెల్పుతుంది. ఎవరి విషయంలో ఎప్పుడైనా, ఎక్కడైనా.
సంజీవదేవ్ రసజగత్తులో అక్షర శిల్పి. అక్షర జగత్తులో అపురూప రూప శిల్పి. తన రచనలకు జీవనానికి తేడా లేని తెలియని మానవతా వాది. నిరాడంబరానికి నిలువెత్తు ప్రతీక. స్నేహగీత పల్లవి, చరణాలకు చెరగని చిరునామా.
– బి. లలితానంద ప్రసాద్
92474 99715


ఆయన ప్రతి అక్షరం సారభూతం. సారభూతం meaning cheppagalara
LikeLike