ఓటరు నేర్పిన గుణపాఠం (కొత్త పలుకు) – ఆర్కే
తెలుగు ప్రజలకు సంబంధించిన రెండు రాష్ట్రాలూ అభివృద్ధి చెందాలంటే ఉభయ ప్రాంతాల ముఖ్యమంత్రుల మధ్య సమన్వయం అవసరం. ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు నాయుడు ఆ దిశగా కృషిచేసి తమ ప్రాంతాల ప్రజల మన్ననలు చూరగొంటారని ఆశిద్దాం!
ఈ (2014) సార్వత్రిక ఎన్నికలలో పాల్గొన్న ఓటరు మహాశయులకు సలాం! అధికారం అప్పగించేది సేవ చేయడానికేగానీ షేవ్ చేయడానికి కాదని ఈ ఎన్నికల్లో ఓటర్లు రాజకీయ పార్టీలకు మరోమారు గుర్తు చేశారు. మీకింత పెడతాం.. మేం ఇంత తింటామంటే కుదరదని కుండబద్దలు కొట్టి మరీ తీర్పు ఇచ్చారు. కేంద్రంలో అధికారం చలాయించిన కాంగ్రెస్ పార్టీకి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్పారు. ఇక తెలుగువారి విషయానికి వస్తే, ముఖ్యంగా సీమాంధ్ర ఓటర్లను అభినందించకుండా ఉండలేం. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎదురైన అతిపెద్ద ముప్పును ఓటర్లు తమ విజ్ఞతతో తప్పించారు. రాజశేఖర్ రెడ్డి వదిలివెళ్లిన కీర్తి వలయం మాయలో పడిన ఓటర్లు చివరకు విజ్ఞత ప్రదర్శించారు. సీమాంధ్రలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థ అపహాస్యం పాలయ్యేది. అవినీతికి ప్రజామోదం లభించినట్టయ్యేది. చంద్రబాబు నాయుడుపై ఉన్న కోపంతోనో, ఆయన విధానాలు నచ్చకో ఒక వర్గం జగన్ పంచన చేరింది. మేధావులుగా చలామణి అవుతున్నవారు కూడా ఆయనను సమర్థిస్తూ వచ్చారు. జగన్ ముఖ్యమంత్రి కాకూడదా? అంటే అవ్వొచ్చు. అయితే ఆయనపై ఉన్న కేసుల సంగతి ఏమిటి? దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో క్విడ్‌ప్రోకో విధానాన్ని ప్రవేశపెట్టి తెల్లవారేసరికి ఒక మాయా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన జగన్ అవినీతిపరుడు కాదని ఆయనను సమర్థించే వాళ్లు కూడా అనలేరు. అవినీతికి సంబంధించిన కేసులలో పీకలలోతు కూరుకుపోయి బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనుకోవడమే వింత! అలాంటి కోరికతో ఉన్న వ్యక్తిని సమర్థించడం కూడా అనైతికమే అవుతుంది. అయినా ఈ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా జగన్ కూడా ఒక నాయకుడిగా మన ముందుకు వచ్చారు. ఆయన అధికారంలోకి రావడం ఖాయమన్న అభిప్రాయాన్ని ఆయన మద్దతుదారులు విస్తృతంగా వ్యాపింపచేశారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలను కొంతమంది మౌన ప్రేక్షకులుగా వీక్షించగా, కొంతమంది మాత్రం వ్యతిరేకించారు. ప్రజలు దారి తప్పితే వారిలో చైతన్యం తీసుకురావలసిన మీడియా సంస్థలలో కొన్ని జగన్‌కు వంతపాడటం ఆశ్చర్యం కలిగించకమానదు. గ్రామీణ భారతం గురించి అవగాహన లోపించిన జాతీయస్థాయి జర్నలిస్టులు కూడా జగన్‌ను ఒక శక్తిగా కీర్తించడం రోత పుట్టించింది. ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించిన చర్చలలో పాల్గొన్న కొంతమంది మేధావులు, సీమాంధ్రలో జగన్ బలం ఇంకా ఎక్కువ ఉంటుందని వాదించారు. ప్రజల నాడితో సంబంధం లేకుండా కేవలం ఇంగ్లీషు మాత్రమే వచ్చిన వాళ్లు కొంతమంది ఈ దేశంలో మేధావులుగా చలామణికావడం కూడా దురదృష్టమే! మీ మేధావుల అభిప్రాయంతో మాకేమి పని అన్నట్టుగా సీమాంధ్ర ఓటర్లు మాత్రం తెలివైన తీర్పు ఇచ్చారు. తెలంగాణ సమాజానికి, సీమాంధ్ర సమాజానికి తేడా ఉంది. తెలంగాణ ప్రజలు కుడుమిస్తే పండుగ అన్నట్టుగా భావిస్తారు. సీమాంధ్ర ప్రజలు అలా కాదు. తమ ముందున్న భోజనం గురించి కాకుండా రేపు చేయబోయే భోజనం గురించి ఆలోచిస్తారు. ఈ కారణంగానే రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర ప్రజల వైఖరిలో మార్పు వచ్చింది. రాజధాని కూడా లేకుండా ఉన్నపళంగా తమను గెంటేసిన కాంగ్రెస్ పార్టీపై కక్ష తీర్చుకోవడంతోపాటు తమ భవిష్యత్‌కు భరోసా కల్పించగలరన్న నమ్మకంతో జగన్‌ను కాదని చంద్రబాబుకు పట్టంకట్టారు. కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబుకు ‘ఆంధ్రజ్యోతి’ సంస్థల తరపున అభినందనలు. అదే సమయంలో ఒక మీడియా సంస్థగా కొన్ని జాగ్రత్తలు చెప్పవలసిన బాధ్యత కూడా మాపై ఉంది. చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ పట్ల ప్రజలు ఎంతో ఆశగా ఉన్నారు. ఈ హామీని త్వరగా నెరవేర్చవలసిన బాధ్యత ఆయనపై ఉంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైతే ప్రజల ముందు దోషిగా నిలబడవలసి వస్తుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నిర్మాణం విషయంలో ప్రజలు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలను వమ్ముచేయకుండా తన అనుభవాన్ని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్‌కు రూపురేఖలు ఇవ్వవలసిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. ఒకరకంగా చెప్పాలంటే చంద్రబాబు ధరించబోయేది ముళ్ల కిరీటమే!
ఇక తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కాబోతున్న కేసీఆర్‌కు మా అభినందనలు. కేసీఆర్‌పై గురుతర బాధ్యత ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ సమస్యలన్నీ తీరిపోతాయని తెలంగాణ ప్రజలు గంపెడాశతో ఉన్నారు. దానికితోడు ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన హామీలు ఉండనే ఉన్నాయి. తెలంగాణ అనేది రెడీమెడ్ రాష్ట్రం కనుక కొత్తగా నిర్మించవలసింది ఏమీలేదు. హైదరాబాద్ మహానగరానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకుంటే చాలు. రాజకీయ వ్యూహరచనలో కేసీఆర్ తనకు తానే సాటి! మాటల మరాఠీ కనుక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ను కాదని, తెలంగాణ ప్రజలు తనను మాత్రమే ఆదరించేలా ఒప్పించగలిగారు. కేంద్రంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా అడ్డుకోవాలంటే టీఆర్ఎస్‌కు చెందిన అభ్యర్థులనే ఎంపీలుగా గెలిపించి పంపాలన్న ఆయన పిలుపునకు తెలంగాణ సమాజం కూడా స్పందించింది. ఆ కారణంగానే శాసనసభలో బొటాబొటి మెజారిటీని సమకూర్చిన ప్రజలు, ఎంపీల విషయానికి వస్తే ఏకంగా 11 మందిని గెలిపించారు.
ఈ సందర్భంగా కేసీఆర్‌కు ఒక సూచన! ఉద్యమ నాయకుడిగా ఇంతకాలం ఆయన ఏమిచేసినా, ఏమి మాట్లాడినా సెంటిమెంట్ నీడలో చెల్లిపోయింది. ఇకపై ఈ వెసులుబాటు ఉండదు. ఇప్పుడు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి. ప్రతి మాటను ప్రతి చర్యను నిశితంగా గమనించేవాళ్లు ఉంటారు. తెలంగాణలోని అయిదు జిల్లాలను దాదాపుగా స్వీప్ చేసిన కేసీఆర్‌కు దక్షిణ తెలంగాణలో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలు ఆయనను ఆదరించలేదు. నగరంలో సీమాంధ్రుల సంఖ్య గణనీయంగా ఉండటం ఇందుకు కారణం కావచ్చు. మున్ముందు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది కనుక ముఖ్యమంత్రిగా ఆయన హుందాగా వ్యవహరించగలిగితే హైదరాబాద్‌లో కూడా ఆదరణ లభిస్తుంది. సరిగ్గా అయిదు సంవత్సరాల క్రితం ఇదే కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. ఓటమి అనే అవమానాన్ని తట్టుకోలేక అప్పట్లో కేసీఆర్ కంటతడి పెట్టారు. అదే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల దృష్టిలో హీరో! ఇకపై సీమాంధ్రలో చంద్రబాబు పనితీరుతో తెలంగాణలో కేసీఆర్ పనితీరును పోల్చుకుంటూ ఉంటారు. ఈ కారణంగా ఇద్దరూ పోటీపడి పని చేయవలసి ఉంటుంది. చంద్రబాబుపై కేసీఆర్‌కు కోపం ఉండవచ్చు. ఆ కారణంగానే సీమాంధ్రలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. కేసీఆర్ జోస్యాలు తరచుగా తప్పుతూ ఉంటాయి. గత ఎన్నికల సందర్భంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని అంచనావేసి ఫలితాల వెల్లడికి ముందే ఆ పార్టీకి స్నేహహస్తం చాచారు. ఇప్పుడు కూడా ఆయన అంచనాలు తప్పాయి. కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇవ్వబోమని, తృతీయఫ్రంట్ లేదా కాంగ్రెస్‌తో జతకడతామని చెప్పి పప్పులో కాలేశారు. ఈ తప్పొప్పుల సంగతి అలా ఉంచితే, తెలుగు ప్రజలకు సంబంధించిన రెండు రాష్ట్రాలూ అభివృద్ధి చెందాలంటే ఉభయ ప్రాంతాల ముఖ్యమంత్రుల మధ్య సమన్వయం అవసరం. ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు నాయుడు ఆ దిశగా కృషిచేసి తమ ప్రాంతాల ప్రజల మన్ననలు చూరగొంటారని ఆశిద్దాం!
ఊ ప్రకృతి చెప్పే పాఠం..
ముఖ్యమంత్రి పదవిపై వల్లమాలిన మమకారం పెంచుకుని ఈ ఎన్నికలలో భంగపడిన జగన్మోహన్ రెడ్డి విషయానికి వద్దాం. నేను గతంలోనే పేర్కొన్నట్టు ఆయన ఇటు డబ్బు అటు అధికారాన్ని కోరుకోవడం తప్పు. ఈ రెండింటిలో ఏదో ఒకదానిని మాత్రమే ప్రకృతి అనుమతిస్తుంది. ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా వెళితే ఏమి జరగాలో అదే జరిగింది. తండ్రి అధికారాన్ని ఉపయోగించుకుని అడ్డగోలుగా సంపాదించుకున్న జగన్ అక్కడితో సంతృప్తిచెంది ఉండాల్సింది. అలా జరిగి ఉంటే, బహుశా ఆయనపై అవినీతి కేసులు కూడా ఉండేవి కావు. రాజశేఖర్ రెడ్డి మృతిచెందిన వెంటనే ముఖ్యమంత్రి కావాలని జగన్ కలలు కన్నారు. శాసనసభ్యుల మద్దతు లభించినప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం కనికరించలేదు. దాంతో ఆయన కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసి, సొంత పార్టీ పెట్టుకున్నారు. అలా కాకుండా కొంత సంయమనం పాటించి కాంగ్రెస్‌లోనే కొనసాగి ఉంటే రోశయ్య తర్వాత జగన్మోహన్ రెడ్డినే కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రిని చేసి ఉండేది. ముఖ్యమంత్రి పదవి కోసం రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రెండున్నర దశాబ్దాలు వేచి ఉన్నారు. మధ్యలో ఒక దశలో కాంగ్రెస్‌ను వదిలిపెట్టాలన్న ఆలోచనకు వచ్చినప్పటికీ ఆయన ఆ సాహసం చేయలేకపోయారు. అదే ఆయనకు కలిసి వచ్చింది. రాజకీయాలలో ఓర్పు, సంయమనం అవసరం. చంద్రబాబు విషయమే తీసుకుందాం! 2004లో ఓడిపోయిన తర్వాత ఆయన కొంతకాలమైనా మౌనంగా ఉండకుండా ఎప్పుడెప్పుడు అధికారంలోకి రావాలా అని ఆయన ఆశపడుతున్నారని ప్రజలు భావించేలా వ్యవహరించారు. దీంతో 2009లో కూడా ఆయనకు అధికారం దక్కలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. ఆయా సందర్భాలలో భూదేవికి ఉన్నంత ఓపికను ప్రదర్శిస్తూ చంద్రబాబు పార్టీని నిలబెట్టుకున్నారు. పది సంవత్సరాలపాటు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. ఈ కాలంలో ఎన్నో అవమానాలను సహించారు. ఈ లక్షణాలే ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేశాయి. ఉమ్మడి రాష్ట్రానికి దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన ఘనత ఆయన ఖాతాలో చేరింది.ఇప్పుడు కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబును చూసి జగన్ నేర్చుకోవలసింది ఎంతో ఉంది. అయితే ఆయనకు ఇవేమీ పట్టవు. ముఖ్యమంత్రి కావడానికే తాను జన్మించానని ఆయన నమ్ముతారు. తనను ముఖ్యమంత్రిని చేయవలసిన బాధ్యత దేవుడిపై ఉందనుకుంటారు. అందుకే జగన్ తరచుగా ‘దేవుడున్నాడు’ అని అంటూ ఉంటారు. ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా ఉన్న జగన్ కోరికను తీర్చడం దేవుడికి కూడా సాధ్యంకాలేదు. ప్రజాస్వామ్య సూత్రాలను ఏ మాత్రం వంటపట్టించుకోని జగన్మోహన్ రెడ్డి వంటివాళ్లు రాజకీయాలలో రాణించడం కష్టం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున ఎన్నికైన శాసనసభ్యులలో ఎంతమంది ఆయనతో మిగులుతారో తెలియదు. ఎందుకంటే ఆ పార్టీలో చేరిన వారంతా ఎన్నికలలో గెలవాలన్న ఆశతోనే చేరారు. వారికి జగన్మోహన్ రెడ్డిపై ప్రేమ ఉండికాదు. వర్తమాన రాజకీయాలలో ప్రేమాభిమానాలకు తావులేదు. తెలుగుదేశంలో ఉండి ఇప్పుడు టీఆర్ఎస్ తరఫున శాసనసభ్యులుగా, ఎంపీలుగా ఎన్నికైన పలువురు వ్యక్తులకు పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉండేవారు. అయినా వారు కృతజ్ఞత చూపించలేదు. గెలుపు అవకాశం వెతుక్కుంటూ టీఆర్ఎస్‌లో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ విషయంలో కూడా ఇలాగే జరగవచ్చు. తనను తాను జయలలితతో సరిపోల్చుకోవడం జగన్‌కు ఉన్న మరో అలవాటు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జయలలితలా వ్యవహరిస్తానని ఆయన పలు సందర్భాలలో ప్రస్తావించేవారు. నిరంకుశ పోకడలను తమిళ ప్రజలు భరించగలరు కానీ తెలుగు ప్రజలు భరించలేరు. మొత్తంమీద ముఖ్యమంత్రి కావాలన్న జగన్ కోరికను సీమాంధ్ర ప్రజలు తీర్చలేదు. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు. మామూలుగా అయితే ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలను ఒప్పించి మెప్పించి 2019లో ముఖ్యమంత్రి పదవి దక్కించుకునే అవకాశం ఉండేది. ఆయనపై ఉన్న అవినీతి కేసులు న్యాయస్థానం విచారణలో ఉన్నందున జగన్ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా ఇప్పుడు మారింది. పరస్పరం సహకరించుకోలేని స్థాయిలో శత్రుత్వం ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు మన ముందు నిలిచారు. ఈ కారణంగా జగన్‌కు మళ్లీ కష్టాలు మొదలయ్యాయని చెప్పవచ్చు.
ఈ పరిస్థితి వస్తుందని గమనించేకాబోలు విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఇంతకాలం సోనియాగాంధీ వేధించారు- ఇప్పుడు చంద్రబాబు వంతు వస్తుందేమో అని జగన్ వ్యాఖ్యానించారు. తనను ఇతరులు వేధిస్తారని చెప్పుకొనే ఆయన తాను చేసిన నేరాలను మాత్రం గుర్తుకు తెచ్చుకోవడం లేదు. ప్రజల సానుభూతిపై ఆధారపడి రాజకీయాలు చేయడం అలవాటుకావడం వల్ల కాబోలు, ఆయన వాస్తవ ప్రపంచంలోకి రాలేకపోతున్నారు. కొంతకాలం పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వల్ల ప్రజలలో ఏర్పడిన సానుభూతిని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించారు. జగన్ జైలుకు వెళ్లిన తర్వాత జరిగిన ఉపఎన్నికలలో ఆ అంశంతోపాటు రాజశేఖర్ రెడ్డిని సోనియాగాంధీనే చంపించిందని తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల ప్రచారం చేసి ఆ ఎన్నికలలో లబ్ధిపొందారు. సానుభూతి పవనాలు ఎంతోకాలం నిలవలేవు. అందుకే ఈ ఎన్నికలలో తల్లి, చెల్లితో పాటు జగన్మోహన్ రెడ్డి ఎండల్లో పడి 13 జిల్లాలను చుట్టివచ్చినా నాలుగు జిల్లాలలో మాత్రమే విజయం చవిచూశారు. దివంగత రాజశేఖర్ రెడ్డి భార్య అని కూడా చూడకుండా విశాఖపట్నం ప్రజలు విజయలక్ష్మిని ఓడించారు. నిజానికి ఆమె అంత శిక్షకు అర్హురాలు కాదు. రాజశేఖర్ రెడ్డి ఉన్నంతవరకు బయట ముఖం చూపని ఆమె, కుమారుడి కోసం రాజకీయాలలోకి వచ్చారు. స్వతహాగా మంచిమనిషి అయిన విజయలక్ష్మికి రాజకీయాలు సరిపడవు కూడా! అయినా విశాఖ ప్రజలు ఆమెను ఓడించడానికి కారణాలు లేకపోలేదు. ప్రశాంత జీవనానికి అలవాటుపడిన విశాఖవాసులు తమ ప్రాంతంలో కడప సంస్కృతి వ్యాపించడం ఇష్టంలేక ఆమెను ఓడించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కడప జిల్లాకు చెందిన పలువురు విశాఖలోని హోటళ్లలో దిగి హడావుడి చేసేవారు. ఇదంతా చూసిన విశాఖ ఓటర్లు ఆమె గెలిస్తే తమ ప్రశాంత జీవనానికి భంగం కలుగుతుందని భావించి ఉంటారు. సీమాంధ్రకు విశాఖను రాజధాని చేయడానికి కూడా అక్కడి ప్రజలలో అత్యధికులు అంగీకరించడం లేదు. తమ నగరం రాజధాని అయితే ప్రశాంతత కొరవడుతుందని భయపడటమే కారణం. అలాంటి విశాఖపట్నం నుంచి ఎంపీగా తల్లిని పోటీపెట్టడం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యూహాత్మక తప్పిదం. జరిగేది జరగక మానదు అన్నట్టుగా ఏమి జరగాలో అదే జరిగింది. జగన్మోహన్‌రెడ్డి విషయంలో కూడా భవిష్యత్తులో ఏమి జరగాలో అదే జరుగుతుంది. అందుకు ఆయన కూడా మానసికంగా సిద్ధపడినట్టు కనిపిస్తున్నది. ఇక సిద్ధపడవలసింది ఆయనను అభిమానించే వారే!
ఊ చేతికి చిల్లు…
ఇటు రాష్ట్రంలోనూ, అటు దేశంలోనూ చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ విషయానికి వద్దాం! దేశచరిత్రలో తొలిసారిగా కాంగ్రెసేతర రాజకీయపక్షం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సొంతంగా సమకూర్చుకోవడం ఇదే మొదటిసారి! ఇందుకు కాబోయే ప్రధాని నరేంద్రమోదీ ఎంత కారణమో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె పుత్రరత్నం రాహుల్‌గాంధీ కూడా అంతే కారణం. ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా అధికారం ఉందికదా అని ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే ఏమి జరగాలో అదే జరిగింది. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి ఏర్పడటానికి స్వయంకృతాపరాధమే కారణం. దత్తపుత్రుడు, అద్దెపుత్రుడిని నమ్ముకుని రాష్ట్ర విభజనకు పూనుకోవడం ద్వారా రాజకీయంగా లబ్ధిపొందాలనుకుని ఉభయ ప్రాంతాలలో చావుదెబ్బ తిన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు కనీసం ఆ ప్రాంతంలో కూడా విజయాలు సాధించలేకపోయారు. దేశవ్యాప్తంగా కాంగ్రె స్‌పై ఉన్న వ్యతిరేకత ఇక్కడ కూడా పనిచేసి ఉండవచ్చు. అయితే రాష్ట్రాన్ని విభజించే ముందు తీసుకోవలసిన కనీస జాగ్రత్తలు తీసుకుని ఉంటే పరిస్థితి కొంతవరకైనా మెరుగ్గా ఉండేది. లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా హడావుడిగా రాష్ట్రాన్ని విభజించడంతో ఏ ప్రాంతం వారిని కూడా మెప్పించలేకపోయారు. తెలంగాణ వస్తే ముఖ్యమంత్రి అవుదామని కలలు కన్నవారు పార్టీ విజయావకాశాల గురించి ఆలోచించలేదు. ఫలితంగా పలువురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఓడిపోయారు. సీమాంధ్రలో అయితే ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. పలు స్థానాలలో డిపాజిట్లు కూడా పోయాయి. గత ఎన్నికలలో 33 ఎంపీ స్థానాలను గెల్చుకున్న కాంగ్రెస్ ఇప్పుడు రెండు స్థానాలకే పరిమితమైంది. తెలంగాణ కోసం పోరాటం చేయకుండా చివరి నిమిషంలో తెరమీదకు వచ్చి చొక్కాలు చించుకున్న కాంగ్రెస్ ప్రముఖులందరిని ప్రజలు ఓడించారు. తెలంగాణ గురించి ఆర్భాటంగా ప్రకటనలు చేయని జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి వంటి వారిని మాత్రం ప్రజలు గెలిపించుకున్నారు. కేసీఆర్ ఎత్తుగడలకు విరుగుడు చర్యలను తీసుకోవలసిన నాయకత్వమే తెలంగాణ కాంగ్రెస్‌కు లేకుండా పోయింది. సమర్థత ఉన్నవారిని పక్కనపెట్టారు. ఏదిఏమైనా కాంగ్రెస్ పార్టీకి పడవలసిన శిక్షపడింది. ఇప్పుడు తెలంగాణలో మూడు రాజకీయ శక్తులు వేళ్లూనుకున్నాయి. ఉత్తర తెలంగాణలో కేసీఆర్ ఆధిపత్యం ప్రదర్శించగా, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ తన ఉనికి చాటుకుంది. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలో తెలుగుదేశం-బీజేపీ బలంగా నిలబడ్డాయి. ఈ కూటమి మధ్య బంధం మరింత బలపడితే భవిష్యత్తులో టీఆర్ఎస్ లేదా కాంగ్రె స్‌లలో ఏదో ఒకదానికి ముప్పు తెస్తుంది.
రాజకీయాలలో గెలుపోటములు సహజంగానీ రాజకీయాల నుంచి అవమానకరంగా నిష్క్రమించవలసిరావడం మాత్రం ఎవరికైనా బాధాకరమే! మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి ఇదే అనుభవం ఎదురైంది. వీర సమైక్యవాదిగా ముద్ర వేయించుకున్న ఆయన మితిమీరిన విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీని వదిలి సొంత పార్టీ పెట్టుకుని ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోలేక అవమానాన్ని మూటగట్టుకున్నారు. తమ శక్తిని అతిగా ఊహించుకున్న వారి విషయంలో ఇలాగే జరుగుతుంది. కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీ పెట్టాలని ప్రోత్సహించిన వారు సైతం కిరణ్‌కుమార్ రెడ్డి వైఖరితో విసిగిపోయి మిడిల్‌డ్రాప్ అయ్యారు. లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌కుమార్ వంటి వారు ఇందుకు ఉదాహరణ. ప్రత్యర్థులైన చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి సీమాంధ్రను సుడిగాలిలా చుడుతూ ఉంటే, కిరణ్ మాత్రం ఒళ్లు అలవకుండా రోజుకు రెండు సభలలో అదికూడా కొద్ది రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటికొచ్చి పడుకున్నారు. సీన్ కట్ చేస్తే కిరణ్ సొంత పార్టీ ఎందుకు పెట్టుకున్నారో ఇప్పుడు అర్థంకాని పరిస్థితి. బహుశా ఆయనకు కూడా తెలియకపోవచ్చు. మొత్తంమీద ఆయనకు చిన్నవయసులోనే రాజకీయ వైరాగ్యం ప్రాప్తించింది. ఉట్టికెగరలేని అమ్మ స్వర్గానికి ఎగరడానికి ప్రయత్నించడం అంటే ఏమిటో కిరణ్‌కుమార్ రెడ్డి ఉదంతం చూసి తెలుసుకోవచ్చు. ఈ ఎన్నికలలో గుణపాఠం నేర్చుకోవలసిన వ్యక్తి మరొకరున్నారు. ఆయనే లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్. ప్రస్తుత పరిస్థితులలో రాజకీయాలు చేయడానికి తనవంటి వారు పనికిరారన్న వాస్తవాన్ని ఆయన ఎంత తొందరగా గుర్తిస్తే ఆయనకు అంత మంచిది. సమాజంలో మార్పు తీసుకురావడానికి రాజకీయ పార్టీలే పెట్టనవసరం లేదు. లోక్‌సత్తా ఒక సంస్థగా ఉన్నప్పుడు ఆయన ఎంతోకొంత చేయగలిగారు. లోక్‌సత్తా సంస్థని రాజకీయ పార్టీగా మార్చిన తర్వాత ఆయనతో పాటు సంస్థ కూడా నష్టపోయింది. ఇప్పటికైనా జయప్రకాశ్ నారాయణ్ పార్టీని రద్దుచేసి లోక్‌సత్తాను మళ్లీ సంస్థగా తీర్చిదిద్దడం శ్రేయస్కరం.
అత్యంత జుగుప్సాకరంగా జరిగిన ఈ ఎన్నికలలో ప్రధాన రాజకీయ పార్టీలు డబ్బు, మద్యం పంచగా, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు వినోదం పంచాయి. రాష్ట్రంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తొలిసారిగా విడివిడిగా పోటీచేశాయి. వామపక్షాల ఐక్యత అనేది నేతి బీరకాయలో నెయ్యి చందం వంటిదని అందరికీ తెలిసిందే! కడుపులో కత్తులు పెట్టుకుని పైకి చిరునవ్వులు చిందిస్తూ ఐక్యత గురించి మాట్లాడగలిగేది వామపక్ష నాయకులే! తమకు ఒక కన్నుపోయినా పర్వాలేదు. సోదర కమ్యూనిస్టు పార్టీకి రెండు కళ్లూ పోవాలని సీపీఐ – సీపీఎం భావిస్తుంటాయి. ఖమ్మం లోక్‌సభ, మంగళగిరి అసెంబ్లీ స్థానాల విషయంలో ఆ రెండు పార్టీలు ఇలాగే వ్యవహరిస్తూ ఉంటాయి. ఖమ్మం లోక్‌సభ స్థానానికి పోటీచేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణను ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో సీపీఎం అవగాహన కుదుర్చుకుంది. అవినీతి ఆరోపణల ఊబిలో కూరుకుపోయిన ఆ పార్టీతో జత కట్టడం నైతికమా? అనైతికమా? అనేది ఆ పార్టీకే తెలియాలి. ఖమ్మం జిల్లా ఓటర్లు కాంగ్రెస్-కమ్యూనిస్టుల మధ్య ఎన్నడో చీలిపోయారు. తెలుగుదేశం ఓట్లు కమ్యూనిస్టులకు, కమ్యూనిస్టుల ఓట్లు తెలుగుదేశానికి బదిలీ అవుతాయిగానీ కాంగ్రెస్- కమ్యూనిస్టుల మధ్యన ఈ వెసులుబాటు లేదు. ఇది తెలిసి కూడా ఖమ్మం లోక్‌సభ బరి నుంచి నారాయణ పోటీచేయడం తప్పు. జాతీయస్థాయిలో తాము ఉభయులం వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌తో రాష్ట్రంలో నారాయణ జతకట్టడం అవకాశవాదమని సీపీఎం విమర్శిస్తున్నది. ఎన్నికల ఫలితాలు కూడా వెలువడక ముందే కేంద్రంలో కాంగ్రెస్ సహకారంతో తృతీయఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని సిీపీఎం నాయకులే ప్రకటించారు. తాము వ్యతిరేకించే కాంగ్రెస్ సహకారంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నవారు ఎన్నికలలో ఆ పార్టీని వ్యతిరేకించడం ఎందుకో తెలియదు. పరస్పర వైషమ్యాలు, వైరుధ్యాలతో ఐక్యత ప్రదర్శించే వామపక్షాలు తమ లోపాలను సవరించుకోని పక్షంలో భవిష్యత్తులో ఆ పార్టీల ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. సీమాంధ్ర శాసనసభలో ఉభయ కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం లేకుండాపోయింది. తెలంగాణలో చెరో స్థానంలో మాత్రమే గెలిచాయి. వైషమ్యాలు వీడని పక్షంలో ఖమ్మం, నల్లగొండ జిల్లాలలో సైతం ఆ పార్టీలు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది!

