నాద స్వరానికి ప్రాణ ప్రతిష్ఠ

మంగళ వాయిద్యరంగంలో సరికొత్త తరం విద్వాంసులు మన సాంస్కృతిక రంగంలో కొత్త అధ్యాయాలు సృష్టిస్తున్నారు. తెలుగు గడ్డ మీదే కాదు, అమెరికా ఆలయాలలో సైతం రసవత్తర స్వరార్చనతో దేవతలతో పాటు భక్తజనులను పరవశింపచేస్తూ ఆశీస్సులు అందుకుంటున్నారు. తెలుగుగడ్డపై నాదస్వర విన్యాసాలలో సరికొత్త రికార్డులు సృష్టించిన తరిగోపుల నారాయణ మనుమలు చిరుప్రాయంలోనే హేమా హేమీలైన విద్వాంసులు సాధించలేని రసరమ్య చరిత్రను నమోదు చేస్తున్నారు. ప్రతిష్టాత్మక వేదికలపై వారి నాదస్వర కచేరీలు ఇప్పటికే ప్రపంచ రికార్డులు సృషి ్టంచాయి. తాతయ్య శిక్షణతో నిత్య సాధనతో ఆ స్వరప్రపంచ సిసింద్రీలు మన సాంస్కృతిక రంగ పెద్దల మన్ననలతో చిరు సెలబ్రిటీలుగా మారిపోయారు. మన ప్రభుత్వం నిర్వహించే సంగీత నృత్య కళాశాలలు సాధించలేని ఆశయ లక్ష్యాన్ని హైదరాబాదు చిక్కడపల్లి ప్రాంతంలోని డోలు తాతయ్య సాధించాడు.
వేలాది ఏళ్ళ నుంచి మన నాగరికతలో మమేకమైన మంగళ వాయిద్యాలు, నాదస్వర కచ్చేరీలు అత్యాధునిక నాగరికతలో చిత్ర విచిత్ర విన్యాసాలను సంతరించుకున్నాయి. శుభకార్యాలు, విందు వినోదాల్లో సంకల్పం నుంచి సంపూర్ణం దాకా సుస్వరాల నేప«థ్యంలో నాదస్వరాలు, మంగళవాయిద్యాలు ఒక భాగం అయిపోయాయి. అయిదుగురితో కూడిన బృందంతో శుభకార్యాల సమయంలో ప్రతి ఇంటా వాద్యకారులు ప్రాధాన్యం సంపాదించుకున్నారు. డోలు, సన్నాయి, తాళంతో పాటు శ్రుతి పెట్టెతో మేళ తాళాలు తెలియని వారు ఉండరు. అయితే, యాభై అరవై ఏళ్ల ముందునాటి పద్ధతులు సమూలంగా మారిపోయాయి. గొప్పగొప్ప విద్వాంసులు మహా మహా అద్భుతాలు సృష్టించిన రాగాలు, లయ విన్యాసాలు మరుగైపోయి అరుదైపోయాయి.
దక్షిణ భారతంలోని ఆలయాల్లో నాదస్వరం తో నే తలుపులు తెరుచుకునే సంప్రదాయంలోని మెలకువలు, ఆచారాలు ఇతరులకు మార్గదర్శకాలయ్యాయి. ఉత్తర భారతంలో విస్తరించిన హిందుస్తానీ సంగీతంలో షెహనాయ్‌తో దేవుడికి మేలుకొలుపు చెప్పటం ఆనవాయితీ. 1200 ఏళ్ల మన ఆలయాల చరిత్రలో నాదస్వర సుప్రభాతం తెల్లారకట్ట వీనుల విందు చేయటం తో పాటు మనసుకు ఉల్లాసం, ఉత్తేజం కలిగించటం ఆగమశాస్త్రంలో విధివిధానం అయింది. తూర్పు వెలుగులు విప్పారుతుంటే, భూపాలరాగంతో స్వరాలు వెల్లువెత్తిస్తుంటే ఆ పరిసరాలన్నీ మంగళప్రదంగా మారుతాయని వేలాది ఏళ్లుగా ఓ నమ్మకం ఉంది. శ్రీరాగం నేపథ్యంలో హారతి, ఉత్సవాలు, మూలవిరాట్టుల ఊరేగింపులలో నాటరాగం ఆలపించటం ప్రత్యేకంగా మల్హరితో రాగమాలికలతో డోలు వాయిద్య విన్యాసాలు చేయడం ఆలయాల సంప్రదాయం అయింది.
శుభకార్యాలో మేళతాళాలు
ఆలయ సేవలలో కమ్మకమ్మగా ఆనందభైరవి, నీలాంబరి రాగాలలో మంద్రంగా లాలిపాటల వరుసలో పవళింపు సేవలు నిర్వహించటం అనూచానంగా కొనసాగుతూనే ఉంది. గంగానదీ తీరంలో షెహనాయ్‌తో కాశీ విశ్వేశ్వరస్వామికి స్వరార్చన చేసిన బిస్మిల్లా ఖాన్ భారతరత్న గా మన జాతి మన్ననలు అందుకొన్న తీరుతెన్నుల్ని అవలోకిస్తే మన ఆలయ విద్వాంసుల ప్రతిభాపాటవాలు మనకు పులకింతలతో పాటు కాసింత గర్వం కూడా పెంచుతాయి. ఇప్పటి తమిళనాడులో వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న వందల ఆలయాలలో క్రమంగా అలవడిన నాదస్వరంలో ఈ తరం గమనికలోనికి రాని అంశాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆలయంలో స్వరాల కొలుపులతో మాత్రమే కాక మాడ వీధులలో ఊరేగింపులు, హారతుల సమయంలో నాదస్వరం కీలకమైంది. నాయీబ్రాహ్మణ కులం, ముస్లింలలో ప్రత్యేక తెగ గా గుర్తింపు ఉన్నవారు తరతరాలుగా దేవతల స్వరార్చనలో బతుకుదారిని ఎంచుకున్నారు. వైణిక బాణి, నాదస్వర బాణీలుగా స్వర ప్రపంచంలో పరిగణించే పద్ధతుల్లో మన కళ్ల ముందే మనకు తెలియనివి చాలా చాలా ఉన్నాయి. సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్‌లాంటి అగ్రశ్రేణి గాయకుడు తనకు గాత్ర శుద్ధికి, పద్ధతికి ఉద్దీపన తెచ్చిపెట్టింది తమ పల్లెలోని నాదస్వరమే అనేవారు. పైడిస్వామి వంటి నాయీబ్రాహ్మణుడి నేతృత్వంలో జరిగిన నాదస్వర బృంద కచ్చేరీతోనే తనకు గానంలో సంగతులు అబ్బాయని ప్రసిద్ధ విద్వాంసుడు ఎం.ఎస్. బాలసుబ్రమణ్య శర్మ చెప్పుకునేవారు….
ఇంటింటా ఎలాంటి వేడుక జరుపుకున్నా ఆ సందర్భంలో మంగళ వాద్యాలను ఏర్పాటు చేయటం తాత ముత్తాతల తరాలనుంచి ఆనవాయితీ అయింది. శుభాలతో పాటుఅశుభాలు జరిగినప్పుడు బాజాలు జాతరలు గ్రామదేవతల పూజలలో వేరువేరు పద్ధతులు అలవాట్లు అయిపోయాయి. గృహాలలో శుభప్రదంగా భావించే చిన్నా పెద్దా పండుగలలో మేళం తప్పనిసరి అయిపోయింది. ఆకుపచ్చని మామిడి తోరణాల మధ్య సన్నాయి మేళం, భజంత్రీలు లేకుండా ఉండని సంప్రదాయం మనలో మమేకం అయింది. ఖరహరప్రియ, కళ్యాణి రాగాలతో ఉల్లాసాన్ని పొంగులెత్తించటం అందరి అనుభవాలలోనిదే. మన వాగ్గేయకారులు ఆయా సందర్భాలు, సన్నివేశాలకు అనువుగా చేసిన రచనలు వాయిద్యాలతో అనుభూతిలోకి తేవటం మన మనసుల్లో మెదులుతాయి. మునిరామయ్య, దాలిపర్తి పిచ్చాహరి, దోమాడ చిట్టబ్బాయి,షేక్ చిన పీరు సాహెబ్, అన్నవరపు బసవయ్య వంటివారు నాదస్వర రంగంలో రసవత్తర స్వర విన్యాసాలు సృష్టించారు. ఈ తరంలో తరిగిపోయిన విద్వాంసుల పరంపరలో 78 ఏళ్ల తరిగోపుల నారాయణ సంప్రదాయ నిష్ఠతో పలు విజయాలు సాధించారు.
ఎల్లలు దాటిన విన్యాసాలు
తాత ముత్తాతల నాదస్వర వారసత్వంలోని అసలు సిసలు సారాన్ని సారస్వాన్ని అందిపుచ్చుకున్న పెద్దాయన నారాయణ తన మనుమలతో సాధిస్తున్న రికార్డులు గత వైభవంలో వన్నెల్ని గుర్తుకు తెస్తున్నాయి. పలువురు పెద్దల మెప్పుతో పాటు అమెరికాలోని ఆలయాలలో పాత తరం కచ్చేరీలపై శ్రద్ధాసక్తులు పెరిగేలా చేయగలుగుతున్నారు. వందల సంఖ్యలో మన ఆలయాలు విరివిగా పెరిగినా, అక్కడ నాదస్వర విద్వాంసుల సేవలను వినియోగించుకోకపోగా, రికార్డులు, సీడీలను ఉపయోగించి స్వరార్చనను సరిపెడుతున్న తీరుతెన్నులు కొద్దిగా బాధ కలిగిస్తాయి. వారు ఈ పరిస్థితిని మార్చి కొత్తతరంలో ప్రావీణ్యం పెంచుతున్నారు. ఆయన మనుమలు ఇద్దరు, ఒక మనుమరాలు చిరుత ప్రాయంలోనే అసాధారణ ప్రతిభ తో దిన దిన ప్రవర్ధమానం అయ్యేలా చేయగలిగారు. మన దేశంతో పాటు దేశ విదేశాల్లో ఆ బుల్లి విద్వాంసుల త్రయం సాధిస్తున్న విజయాల గురించి తాతయ్య వివరించారు.
కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మిడుతూరు పల్లె నుంచి రాజధాని నగరానికి వచ్చి మా కులవృత్తి విద్యలో ప్రామాణికమైన పద్ధ్దతులు పెంచటానికి చేతనయిన వన్నీ చేశాను. మా వాళ్ల తో గత వైభవం లోని గౌరవ ఆదరాలు పెంచుకోవటంపై కావాల్సిన శిక్షణ సాధనలకు అవకాశాలు పెంపొదిస్తున్నాం. 1981 నుంచి నేను చేసినవన్నీ గమనించండి. ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. నా ఆలోచనల్ని పంచుకుంటూ మెచ్చుకున్న సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ నడుం బిగిస్తే మన రాష్ట్రంలోని4,200 మంది నాదస్వర కళాకారులు, 1,082సన్నాయిలు, 321 క్లారినెట్‌లు, 1331 డోలులు శృతి, తాళంతో ఒకే వేదికపై ప్రదర ్శన ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే మా ఇంటి బుడతలు ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చారు.హైదరాబాదులో పుట్టిపెరిగిన 6 ఏళ్ల చిన్నారి మణిదీప్ తాతయ్యగా నా నుంచి నేర్చుకున్న డోలు విన్యాసాలు చిత్రవిచిత్ర జతులు గమకాలతో పాత తరం పెద్దల నాద విద్వత్తు తో పెద్దల నుంచి మెప్పు పొందాడు.
డోలుపై తాళం వాయించటంలో ఆ సిసింద్రీ ప్రతిభ గవర్నర్‌తో సహా ఎందరో పెద్దల్ని ఆకట్టుకుంది. పద్యాలు రాయటంలో ఛందస్సులా లయ వాయిద్యంలో తాళం అత్యంత కీలకమైంది. అదే ప్రాణంలాంటిది. 35 తాళాల ప్రస్తారక్రమం, దానికి దీటుగా 108 తాళాలు వాటికి ముందు పంచగతుల గమనం, దక్షిణ మార్గం, అతిచిత్ర మార్గం వంటి విన్యాసాలు అలవోకగా చేయగలిగాడు. అంతకన్నా రెండేళ్లు పెద్ద అయిన మనుమరాలు, మనుమడు అమెరికాలో అంతకు మించిన నాదస్వర సత్తాతో మహామహుల ఆశీర్వచనాలు అందుకుంటున్నారు. నేను ఆ దేశంలో 6 నెలలు, ఇక్కడ చిక్కడపల్లిలో, ఆ తరువాత మా స్వగ్రామంలో ఆసక్తి కలిగినవారందరికి ఇందలో శిక్షణ ఇస్తున్నా.
అమెరికాలోని దేవాలయాలలో నాదస్వరం కోసం స్థిరంగా ఎవరూ లేరని గమనించాను. అక్కడి ఆలయాల్లో మేళం కోసం శ్రీలంక, తమిళనాడులకు చెందిన కొద్ది మంది వాయిద్య ప్రవీణులు దూరప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఆయా కార్యక్రమాలు సజావుగా జరిగేలా చేస్తున్నారు. తరాల మార్పిడి వల్ల మారిపోయిన నాదస్వరంలో తేడాలు, పట్టింపు లేకుండా కొనసాగిపోతున్నాయి. నా కుమారుడు సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగిగా బోస్టన్ ప్రాంతంలో స్థిరపడి, మా కులవృత్తిలో చిన్ననాటి సాధన వట్టిపోకుండా ఆయా ఆలయాల్లో అవకాశం బట్టి నాదస్వరంలో కచ్చేరీలు చేస్తున్నాడు. ఒక మనుమరాలుకి పేరు కూడా రాగశ్రీ అని పెట్టుకున్నాం. ఆ పిల్ల మా నాదస్వర వారసత్వంతో పాటు గాత్రంలో కూడా మంచి పట్టు సాధించింది. మా ముగ్గురు మనుమలు కలిసి అమెరికాలో వీలయినన్ని ప్రాంతాలలో కచ్చేరీలు చేసేలా కొందరు పెద్దలు కలిసి సన్నాహాలు చేస్తున్నారు. 78 ఏళ్ల వయసు పైబడటం తో నాకు తెలిసిన విద్య, మెలకువలు తరువాతి తరానికి అందించాలన్న తపన పెరిగింది.
డోలు వాయిద్యం, గ్రహ, గతి బేధం, చాపు తాళ సమ్మేళనం వంటి వాటి పై సీడీలు రూపొందించాను. అరుదైన సింహనందిని, గోపుచ్ఛయతి, సమతాళం, మిశ్రగమనం, దివ్యసంకీర్ణ గతి, త్రిపుటతాళంలో భిన్నగతులు, డోలు త్రయం, డోలు పంచకం, సప్తకం, తాళ వాద్య కచ్చేరీ, స్వరలయ విన్యాస తరంగిణి, దశ డోలు వాయిద్యం లతో సప్తతాళాల జతి వంటివి సీడీల రూపంలో వెలువరించాను. ఇవి కేవలం వినికిడికి మాత్రమే కాక శబ్ద రహస్యాలు వాటి సొంపులు విన్యాసాలు అవగతం చేసుకోవటానికి కూడా ప్రయోజనకరం. ఇంకా శివతాండవంలో, డమరుక యతిలో మా డోలుతో పాటు పద్మశ్రీ ఎల్లా వారి మృదంగంతో కూడా చేశాం. 12 నిమిషాల 24 సెకండ్లలో 35 తాళాలు వాయించి గిన్నిస్ నమోదుతో రికార్డుతో తెలుగు నాదస్వర కేతనం ప్రపంచం అంతా చూసేలా చేశాను. అందరి ఆదరాభిమానాలతో ఇంట గెలిచి రచ్చ గెలవటం అన్నట్టుగా అమెరికాలో మా చిన్నారులతో కలిపి కచ్చేరీ చేసి జేజేలు పంచుకునేలా చేస్తా.
జూ జి.ఎల్.ఎన్. మూర్తి

