సంక్షోభంలో భాషా వికాసం

రాష్ట్ర విభజన తరువాత సాంస్కృతిక రంగం, భాషా వికాసం వంటివి ఏ రూపం సంతరించుకోబోతున్నాయన్నది అటు తెలంగాణలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ చర్చనీయాంశంగా మారింది.
తెలుగుతనానికి ప్రతిరూపంగా ఉండాల్సిన మన ప్రభుత్వ సాంస్కృతిక శాఖ మరో వారం రోజులలో పెనుమార్పులు సంతరించుకోబోతోంది. జూన్ 2 నుంచి 2 రాష్ట్రాలుగా అవతరించనున్న అరవై ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త సాంస్కృతిక శాఖ మొగ్గ తొడగబోతోంది. ఇప్పటి దాకా కొనసాగిన భాషా, సాంస్కృతిక శాఖ మరో ఆరు నెలల కాలంలో ఎలా రూపుదిద్దుకోబోతోందనే చర్చ ప్రారంభమైంది. పలు ప్రాంతాల్లో కళాకారులు తమకు తోచిన రీతిలో సదస్సులు, చర్చలు కొనసాగిస్తున్నారు. 1981లో సాంస్కృతిక శాఖ ఏర్పడిన తరువాత 33 ఏళ్ల కాలంలో ఇది రూపు మార్చుకోవడం ఇదే మొదటిసారి. ఇప్పటి దాకా సజావుగా సరైన కార్యక్రమాలేవీ జరగలేదు. సరైన విధివిధానాలే రూపుదిద్దుకోలేదు. ప్రస్తుతం రమారమి 265 మంది సిబ్బంది, వారికి బాధ్యతలు నిర్దేశించే ఒక సంచాలకుడు దాదాపుగా 70 కోట్ల రూపాయల కేటాయింపులతో ఈ శాఖలో వ్యవహరాలు జరుగుతున్నాయి. అయితే, ఈ కార్యక్రమాలు మదింపు మాత్రం ఇంతవరకూ జరగలేదు.
తెలుగు కళా రంగంలో ముఖ్యమైన అధ్యాయాలు, ఘట్టాలు కాగితాల కట్టల్లో చిందరవందర అయిపోతున్నాయి. తెలుగువారికి మాత్రమే చెందిన సంస్కృతీ సంప్రదాయాలను భద్రపరచటం వంటివి ప్రభుత్వం తమ బాధ్యతగా భావించడం సాంస్కృతిక శాఖ చరిత్రలోనే లేదు. కొద్ది మంది కళాకారులు మాత్రమే దీని వల్ల ప్రయోజనం పొందారు. ప్రభుత్వ నిర్వహణలోని ప్రాంగణాలు, నిర్వహణాధికారులు, అతి కొద్ది మంది కళాకారులు ఉత్తుత్తి సంబరాలతో 60 ఏళ్లు కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేశాయి. చాలామంది ముఖ్యమంత్రులు, సాంస్కృతిక రంగం పట్ల కనీస అవగాహన, మమకారం లేని వారు కొందరి ఇచ్చకాలను, అవినీతి మాయలను గొప్పవిగా భ్రమింపచేస్తూ ప్రభుత్వపరమైన మోసాన్ని పరంపరగా కొనసాగించారు.
తెలియని సంస్కృతి
మన ప్రభుత్వ రాజముద్రికలో ఉన్న విశేషాల నుంచి పలు అంశాలపై అవగాహన, మమకారం పెంచకుండానే, కనీస ప్రయత్నాలు లేకుండానే ఆరు దశాబ్దాలు గడిచిపోయాయి. మన సంస్కృతికి కీలకమైన ప్రతీకగా శాతవాహనుల పాలనను ప్రస్తుతించే పూర్ణకుంభం తెలుగు సచివాలయం ముందు అనామకంగా ఎవరి పట్టింపూ లేకుండా ఉంది. మా తెలుగుతల్లికి మల్లె పూదండ అనే తెలుగుజాతి గీతం ఇక మీదట ఒక రాష్ట్రానికే పరిమితం అయిపోయింది. తెలుగుజాతి జీవనాడిగా ఒక శాస్త్రీయ నృత్య సంప్రదాయంలో సుశిక్షితులైన 25,000 మంది కళాకారులతో ప్రపంచ వేదికలు, రికార్డులు నెలకొల్పిన కూచిపూడి నాట్యం కూడా అధికారికంగా కుంచించుకుపోబోతోంది.
మన రాష్ట్రంలో తొలి రోజుల్లో విద్యాశాఖలో ఆ తరువాత సమాచార పౌర సంబంధాల శాఖలో అంతర్భాగంగా ప్రభుత్వ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. 1981 జూలై నుంచి ఇప్పటి సాంస్కృతిక శాఖ ఉనికిలోకి వచ్చింది. ఆ శాఖ ఏర్పాటయినా సాహిత్యం, కళలకు సంబంధించి అకాడమీలు కూడా కొనసాగుతూ ఉండేవి. ఆయా అకాడమీలకు అధ్యక్షులు, సిబ్బంది ఉండేవారు. అన్ని కళలకు ఆలవాలంగా కేంద్ర ప్రాంగణంగా రవీంద్ర భారతి పెద్ద ప్రయత్నాలు లేకుండానే రూపుదిద్దుకొంది.
ప్రామాణికమైన కళారంగ విశ్లేషకుడిగా రచయితగా ప్రసిద్ధి చెందిన పి.ఎస్.ఆర్. అప్పారావు తొట్టతొలి సంచాలకుడిగా సాంస్కృతిక శాఖ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. ఆయన తరువాత కన్యాశుల్కం నాటకం, శంకరాభరణం సినిమాల ద్వారా లబ్ధప్రతిష్టుడైన జె.వి. సోమయాజులు సంచాకుడిగా బాధ్యతలు నిర్వహించారు. సంస్కృతి, కళలపై నిజమైన మక్కువ కలిగినవారు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా దాన్ని తమ వ్యక్తిగత ప్రయోజనానికి అనువుగా మలుచుకోగలిగిన సమర్థ అవినీతిపరులు సంచాలకుడి బాధ్యతలను, పనితీరును పలు విధాలుగా మలుపులు తిప్పారు. పలు ప్రభుత్వ శాఖలను ఏక కాలంలో నిర్వహించిన రికార్డుతో పాటు శిల్పారామం వంటి సాంస్కృతిక కేంద్రాలు నెలకొనటానికి కారకుడైన అధికారి జి. కిషన్‌రావు. ఇక కె.వి.రమణ వంటి ఐ.ఏ.ఎస్ అధికారులు పలు చర్యలతో సాంస్కృతిక రంగానికి పేరు ప్రతిష్ఠలు సంపాదించిపెట్టారు.
ఈ శాఖకు ఇంతవరకూ 32మంది సంచాలకులుగా వ్యవహరించారు. ఈ శాఖలో ఐ.ఎ.ఎస్ సీనియర్ అధికారులతో పాటు తెలుగు సంస్కృతి పట్ల ఏమాత్రం గౌరవాభిమానాలు లేని వారు కూడా ఆ స్థానంలో అధికారం చలాయించి అప్పటి దాకా సక్రమంగాఉన్నవాటిని కూడా భ్రష్టుపట్టించారు. ప్రస్తుతం సంచాలకుడిగా కొనసాగుతున్న కవితా ప్రసాద్ 5 ఏళ్ళుగా ఆ శాఖలో పలు చ క్కని కార్యక్రమాలకు సమన్వయకర్తగా వ్యవహరించారు. గతంలో ఎన్నడూ లేని అట్టహాసాలు 100 కోట్ల పైచిలుకు నిధుల వ్యయం ఆయన హయాంలో జరిగాయి. జీవ వైవిధ్య సదస్సు, ప్రపంచ మహాసభలు, పలు ఉత్సవాలు రవీంద్రభారతి ప్రాంగణంలో నిర్వహించిన శతరూప వంటి కార్యక్రమానికి 80 లక్షల పైచిలుకు ఖర్చుతో వర్ధమాన కళాకారులకు గతంలో లేని నగదు పారితోషికంతో ప్రోత్సహించారు.
2012 లో జరిగిన 4వ ప్రపంచ మహాసభల తరువాత ప్రభుత్వం 2013 ఏడాదిని భాష సాంస్కృతిక శాఖ సంవత్సరంగా ప్రకటించింది. అన్ని జిల్లాలో కలెక్టర్లకు వినిమయ అధికారం కట్టబెడుతూ 45 కోట్ల రూపాయల పైచిలుకు ఖర్చు చేసింది. అయినా పలు జిల్లాల్లో లెక్కలు పూర్తి కాని గందరగోళంలోనే రాష్ట్ర విభజన జరిగిపోతోంది. తెలుగు మహాసభల నిర్వహణలో నిధులు ఉదారంగా రావటంతో పందేరం కూడా మరింత ఉదారంగా జరిగింది. వాటికి బాధ్యులు ఎవరు అన్న మీమాంస కొనసాగుతుంది.
సాంస్కృతిక విభజన
విభజనకు సంబంధించిన 9వ షెడ్యూల్‌లో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ రెండు పాయలు గా వేరు దారుల్లో సాగేలా సంసిద్ధం అయిపోయింది. 52 -48 నిష్పత్తిలో పంపకాలకు ప్రతిపాదనలు ఖరారు అయిపోయాయి. జూన్ నెలాఖరు దాకా తాత్కాలిక ఏర్పాట్లు ఆ తరువాత ఆయా రాష్ట్ర ఏలికల ఆలోచనలకు తగిన రీతిలో తలపెట్టినవన్నీ సజావుగా జరిగేలా నిర్దేశన మార్గం రెడీ అయింది. మొదటి 4 మాసాలకు అవసరమైన నిధుల కేటాయింపు కూడా జరిగిపోయింది. రెండు రాష్ట్రాలకు చెరి 17 కోట్ల రూపాయలు అందివచ్చే ఏర్పాటు జరిగింది. జూన్ 3 నాటికి రెండు రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక శాఖల కార్యాలయాలకు సంబంధించి భవనాలు, అందుకు కావల్సిన వనరుల కేటాయింపు ఖరారు అయినా అందుకు భాధ్యతలు వహించాల్సిన సంచాలకుల ఎంపిక నియామకం దశ మాత్రం కనీస సన్నాహాలకు నోచుకోలేదు.
ప్రస్తుత సంచాలకుడి నియామకం తెలంగాణకు చెందినవాడైనా డిప్యుటేషన్ కావటంతో సందిగ్ధత కొనసాగుతోంది. ఆంధ్ర ప్రాంత శాఖకు సంచాలకుడి నియామకం కూడా జరగాల్సి ఉంది.కాగా ఈ శాఖకు సంబంధించి సంపూర్ణ అవగాహన, కళారంగం పట్ల అభినివేశం కలవారిని మాత్రమే నియమించాలన్న మార్గదర్శక సూత్రం ఖరారు అయింది. అందుకు తగ్గ వెతుకులాటకు ఎక్కడా ప్రయత్నం ప్రారంభం కాలేదు. భాష, పురావస్తు ప్రదర్శనశాలలు, అందుకు సంబంధించిన శాఖ, శిల్పకళ, పౌర గ్రంథాలయాలు, ప్రాచ్యలిఖిత ప్రతుల భాండాగారం, అన్ని కళలకు చెందిన అకాడమీలు, ప్రాచీన భాష హోదా వంటివి కూడా ఈ శాఖలో ఉండేలా చేయాలన్న నిర్ణయం పరిశీలనలో ఉంది. ప్రతిష్టాత్మకమైన రవీంద్రభారతి ,తెలుగు లలితకళా తోరణంలు పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి చెందుతాయి. ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విభజన కూడా పూర్తయిపోయింది.హైదరాబాదులోని 3 కళాశాలలతో పాటు వరంగల్, నిజామాబాద్, మంధనిలలో గల కళాశాలలు తెలంగాణకు చెందుతాయి. దాదాపుగా అన్ని కళాశాలలో బోధన సిబ్బందికి చెందిన ఖాళీలు చాలా ఉన్నాయి. అందుకు అవసరమైన నియామకాలకు చేపట్టిన చర్యలు తొలిదశలోనే పెండింగ్‌లో ఉన్నాయి.
హామీలు గాలికి…
గతంలో 4 గురు ముఖ్యమంత్రులు ఉగాది రోజున ప్రకటిస్తామని హామీలు ఇచ్చి దశాబ్దాలు గడిపేశారు. ప్రస్తుతం దాని ప్రస్తావనే లేదు. 3 అకాడమీలకు సంబంధించి విధాన నిర్ణయం జరిగినా అమలుకు ప్రయత్నాలు ప్రారంభం కానే లేదు. అత్యుత్తమ నాటకాలు, నవలలకు ప్రభుత్వం తరఫున పోటీలు నిర్వహించి లక్ష రూపాయల బహుమతులు, ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలన్న నిర్ణయానికి స్పందన బాగున్నా తదుపరి చర్యలకు చురుకుదనం కొరవడింది. రమారమి 150 నాటకాలు 50 నవలలు పోటీలకు సమాయత్తం కాగా, అందుకు తగిన న్యాయ నిర్ణయం ఇంతవరకూ జరగలేదు. మరో వైపు నాటక నంది పోటీలు నిర్వహించే బాధ్యత రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అబివృద్ధి సంస్థ నుంచి సాంస్కృతిక శాఖకు మార్పిడి అయినా గత ఏడాది పోటీలు వరంగల్ లో నిర్వహించాలన్న విధాన నిర్ణయం సమాచార పౌర సంబంధాల కమీషనర్ వద్ద నానుతోంది.
ఏప్రిల్ 16 న తెలుగు రంగస్థల దినోత్సవం నిర్వహించే ఆనవాయితీ ఈ ఏడాది ఉత్తుత్తి మంత్రం అయింది. ఇలా ఉండగా, తెలుగు సాంస్కృతిక వికాసంపై ఇరు ప్రాంతాలలో చర్చలు, సదస్సులు జరుగుతున్నాయి. ఏలూరులో కళారత్న కె.వి.వి. సత్యనారాయణ, పలు నంది అవార్డుల విజేత ఖాజావలీ, కూచిపూడి గురువు పసుమర్తి కేశవ ప్రసాద్ అ నిర్వహణలో కొత్త రాష్ట్రంలో సాంస్కృతిక విధానంపై చర్చాగోష్టి నిర్వహించారు. హైదరాబాదులో ఎల్లా వెంకటేశ్వరావు నేతృత్వంలో పలువురు కళాకారులు ప్రతిపాదనలు చేశారు. కేంద్ర రాష్ట్ర పురస్కార గ్రహీతలు, పలువురు విద్వాంసులు కళారంగం వికాసం కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో చేపట్టాల్సిన విధివిధానాలను నూతన ప్రభుత్వాలకు సమర్పించనున్నారు. తెలంగాణకు చెందిన కళాకారుల పక్షాన కరీంనగర్‌లో కృపాదానం, వరంగల్ ప్రాంతీయులు పి. శేఖర్ బాబు, వనం లక్ష్మీకాంతరావు, మిర్యాలగూడెంలో తడకమళ్ల రామచంద్రరావు వంటివారు ప్రభుత్వానికి కొత్త ఆలోచనలు అందచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఞ జి.ఎల్.ఎన్. మూర్తి

