సాహితీ గంధం గంగాధరం
1974లో అరసం మహాసభలు ఒంగోల్లో జరిగినప్పుడు చిరసం నుంచి మధురాంతకం రాజారాం,
కలువకొలను సదానంద, ఎస్.మునిసుందరం లాంటి ప్రముఖ సాహితీ మూర్తులతోను, కవి మిత్రులు
విజయకుమార్ (సౌభాగ్య), కేఎస్వీల తోను గంగాధరం శిష్యుణ్నిగా ఆయన వెంట వెళ్లడం అదో మరపురాని అనుభూతి! 1975 జనవరిలో అనుకుంటా కడపలో ఆ జిల్లా రచయితల సంఘం ఏర్పాటు చేసిన మూడు రోజుల సాహితీ సమావేశాల్లో పాల్గొన్నారు గంగాధరం. ఆధునిక కవిత్వం గురించిన సదస్సుకి ఆయనే అధ్యక్షత వహించారు.
ఇవాళ మన వాడుకలో లేకపోవడం వల్ల రంగు రుచి వాసన కోల్పోయిన మాటల్లో త్రికరణశుద్ధి ఒకటి. మంచినే అనుకోవడం, అనుకున్నదే చెప్పడం, చెప్పినట్టే చెయ్యడం ఇదీ త్రికరణశుద్ధి! అయితే లోపల ఏదో అనుకోవడం, ఆ అనుకున్నది లోపలే దాచుకోవడం, ఆ ఆలోచనకి, ఈ మాటలకి ఏమాత్రం సంబంధం లేనట్టుగా తమ ప్రయోజనం మాత్రమే పరమావధిగా ఎంత అన్యాయమయినా, అక్రమమయినా ఎవరికీ వెరవక తెగించి చేసెయ్యడం- డిప్లమసీ! ఇవాళ చిన్నా పెద్దా తేడా లేకుండా ఏ పదవిలో ఉన్నవాళ్లకయినా అవశ్యం వుండవలసిన క్వాలిటీ ఇదే! ఇప్పటి మన వ్యవస్థలో ఈ బహువేషధారణ సామర్థ్యం ఎవరిలో ఎంత ఎక్కువగా వుంటే ఈ సమాజంలో వాళ్లకి అంతగా గుర్తింపు, రాణింపు! ఇదీ నేటి కాలగతి-ప్రవాహం! అయితే సమాజ హితాన్ని కోరి ఏటికి ఎదురీదగలిగిన ధైర్యస్థైర్యాలున్నవాళ్లు కళాకారులు. ముఖ్యంగా కవులు! కానీ పైకి అభ్యుదయం, సమానత్వం అంటూనే లోలోపల జాతి మూలాల్లో అభ్యుదయ వ్యాధులుగా అల్లుకుపోతున్న మేధావులు, సంకుచిత స్వభావులు కవులు కావడం అనివార్యమైన, అపాయకరమైన పరిణామం! ఇలాంటి స్వార్థపూరితమైన ఈ సమాజంలో, ఈ సన్నివేశంలో దాదాపు నాలుగు దశాబ్దాల కాలాన్నిదాటి వెనక్కి వెళితే అక్కడ ఆశావహమైన మా విద్యార్థి జీవితంలో అమాయకమైన మా అక్షర ప్రపంచంలో అప్పుడప్పుడే ఉదయించిన ఓ కాంతి పుంజం ఇప్పటికీ వెలుగులు చిమ్ముతూ గోచరిస్తుంది. అసలైన అభ్యుదయ కర్మానుష్ఠానం కోసం అవతరించిన ఆ తేజఃప్రసారం నూతలపాటి గంగాధరం! తన వ్యక్తిత్వమే కవిత్వమైన ఆ అభ్యుదయ కవిని, రవిని ఆవాహనం చేసుకున్న అనుభూతిని మనసారా ఒక్కసారిఅందుకుందామన్న ఆశతో ఒక్కసారిగా ధ్యానముద్రలోకి వెళితే –
1966 ప్రాంతాల్లో మేం చిత్తూరుజిల్లా నిండ్ర జిల్లా పరిషత్ హైస్కూల్లో పదవ తరగతిలో వున్నప్పుడొచ్చారు మాకు గంగాధరం- సీనియర్ తెలుగు పండిట్‌గా! రావడంతోటే ముందుగా మా అందరినీ ఆకట్టుకుంది ఆయన నిలువెత్తు గంభీర విగ్రహం! ఆపైన ఆయన పాఠ ప్రవచన విధానం! తర్వాత తర్వాత తన సాహితీ సంబంధమైన సంస్కారం! అంతవరకు తెలుగుని ఏదో ఒక పాఠ్యాంశంగా మాత్రమే చదువుతున్న మేము అప్పట్నుంచి అదో కవితాంశంగా ఓ ప్రత్యేకమైన శ్రద్ధతో అధ్యయనం చెయ్యడం మొదలెట్టాం. వ్యాకరణం, ఛందస్సు, అలంకారాలు కేవలం మార్కుల కోసం సాగే వ్యవహారంలా కాక మాకందరికీ అభిరుచి పాత్రమైన అంశాలుగా మారిపోయాయి. పైగా వారిమల్లే తెలుగు విద్వాన్ పట్టభద్రులమైతే తెలుగు పంతుళ్లుగా బ్రతుకు తెరువూ ఏర్పడుతుందన్న బలమైన ఆశ కూడా అప్పట్లోనే మాకు కలిగివుండాలి. కాబట్టే నేనూ, మరో ముగ్గురు మిత్రులూ పనిగట్టుకుని తిరుపతి వెళ్లి ఓరియంటల్ కాలేజీలో చేరాం! ఆయన అప్పట్లో అలా మాకు తెలుగు పండిట్‌గా రావడం వల్లే ఇవాళ మేం మీముందు ఇలా నిలబడగలుగుతున్నాం- అని ఇప్పటికీ సభల్లో చెప్పుకుంటూనే వున్నాం! శిష్యుల్ని అంతగా ప్రభావితుల్ని చెయ్యగలిగిన ఆకర్షణీయమైన వ్యక్తిత్వం గంగాధరంగారిది!
మరి గురువుగారి వూరు నాగలాపురం దగ్గర రామగిరి! మా వూరికీ, రామగిరికీ మధ్య దూరం ఆరుమైళ్లు! శనివారం సాయంత్రం నేనూ, మా వూళ్లోని మరో మిత్రుడూ నాథముని (అతనూ ఇప్పుడు లేకపోవడం అదో విషాదం) కలిసి సైకిళ్లమీద రామగిరికి బయలుదేరేవాళ్లం. అక్కడ ఆ వూళ్లో రామయ్య, రామ్మూర్తి, హరనాథ్ మొత్తం ఐదుగురు మిత్రులం. గురువుగారి వెంట పక్కనున్న అరుణా నదికి ఉదయం, సాయంకాలం మా వాహ్యాళి. ఆ గట్లు, చెట్లనీడలు తాత్కాలికంగా మా తరగతి గదులు. ఆ సమయమంతా గురువుగారి సాహితీ ప్రబోధాలు. ఇక ఆ తరువాత వారి ఇంటికి తిరిగివెళితే ఎండవేళ మండువాలో మకాం. రాత్రి డాబా మీద చందమామని చూస్తూ లైటు వెలుతుర్లో, వెన్నెల్లో కవిత్వ పఠనం. నేర్చుకుంటున్న ఛందస్సులో మా ప్రారంభ ప్రయోగాలు. గురువుగారి సలహాలు, సూచనలు!
ఆ తరువాత హైస్కూలు చదువు ముగిసి, తిరుపతికి వెళ్లి చదువుకునే ఆర్థిక స్తోమత లేక రేండేళ్లు ఖాళీగా వుండి మళ్లీ అప్పటిదాకా కలలుగన్న ఆ కాలేజీ చదువు కొనసాగించడం! అలా రెండేళ్ల తరువాత కూడా ఎల్లాగయినా సరే కష్టపడి విద్వాన్ చదవాలి అని ఆ కోర్సుని పూర్తిచెయ్యడం, కేవలం గంగాధరం గారి స్ఫూర్తివల్ల! వారి మల్లే కవిగా, రచయితగా పత్రికల్లో మన పేరూ చూసుకోవాలన్న తపన వల్ల!
అలా తిరుపతిలో వున్న నాలుగేళ్లలోను మధ్యమధ్య వారి నుంచి వుత్తరాలు! చిత్తూరు జిల్లా రచయితల సంఘం విశేషాలు, సమావేశాలు! అప్పుడే ఆయన మాటమీద అందులో సభ్యత్వం. తృతీయ వార్షికోత్సవ మహాసభల్లో తొలిసారిగా నేను కవిసమ్మేళనంలో పాల్గొనడం. అప్పుడు అధ్యక్షత వహించిన తిరుమల రామచంద్ర ‘చీకటి కళ్లు’ అన్న నా వచన కవితని ప్రత్యేకించి మెచ్చుకుంటే ఎంత సంబరపడ్డారో గురువుగారు! అలాగే నేను కాలేజీ విద్యార్థిగా వున ్నరోజుల్లోనే ఓ దినపత్రిక ఆదివారం అనుబంధంలో నా సాహిత్య వ్యాసం అచ్చయితే ఆ రోజున్నే ఓ సాహితీ సమావేశం కోసం తిరుపతికొచ్చారు గంగాధరం. అప్పట్లో కలుసుకోలేక వెంటనే వూరెళ్లిపోయారు. తరువాత ఓ రోజు వుత్తరం రాశారు. ‘నీ వ్యాసం మొదట చూసింది నేను. ఆ రోజే నీకు అభినందనలు తెలుపుదామనుకున్నాను. మళ్లీ నువ్వు కనిపించలేదు. ఉత్తరం రాద్దామనుకున్నాను. తీరిక లేకపోయింది. నీ ఉత్తరం చూశాను. బదులు రాయడానికి ఇప్పటికి తీరికైంది. సెలవులు వచ్చాయి కదా, క్షణం ఒక చోట తీరిగ్గా కూర్చోవడానికి వీల్లేకపోతోంది. నీ వ్యాసం పత్రికలో చూచినప్పుడు నేనెంత సంతోషించానో చెప్పలేను. నా మొదటి రచన అచ్చయినప్పుడు కూడా నేనంత సంతోషించలేదు.”
అంతేకాదు, అప్పట్లో నా కవితలు అచ్చయితే వాటిని క్లాసుల్లో పిల్లలకి చదివి వినిపించి “వీడు… నా శిష్యుడు” అని చెప్పి మురిసిపోయేవారట గురువుగారు! లోకంలో పుత్రోత్సాహం పొందే తండ్రులుంటారు. కాని ఛాత్రోత్సాహం పొందిన నిజమైన గురువు గంగాధ రం!
తరువాత 1974లో అరసం మహాసభలు ఒంగోల్లో జరిగినప్పుడు చిరసం నుంచి మధురాంతకం రాజారాం, కలువకొలను సదానంద, ఎస్.మునిసుందరం లాంటి ప్రముఖ సాహితీ మూర్తులతోను, కవి మిత్రులు విజయకుమార్ (సౌభాగ్య), కేఎస్వీల తోను గంగాధరం శిష్యుణ్నిగా ఆయన వెంట వెళ్లడం అదో మరపురాని అనుభూతి! ఇంకా అలాంటివే మరికొన్ని సంఘటనలు! అలాగే 1975 జనవరిలో అనుకుంటా కడపలో ఆ జిల్లా రచయితల సంఘం ఏర్పాటు చేసిన మూడు రోజుల సాహితీ సమావేశాల్లో పాల్గొన్నారు గంగాధరం. ఆధునిక కవిత్వం గురించిన సదస్సుకి ఆయనే అధ్యక్షత వహించారు. అప్పుడు పక్కనే ప్రొద్దుటూర్లో పండిట్స్ ట్రెయినింగ్‌లో వుంటూ మిత్రులతో కలిసి వచ్చాన్నేను ఆ సమావేశాలకి. అదే చివరిచూపు! ఆ సమావేశాలు పూర్తయి ఆయన రామగిరికి వెళ్లింతర్వాత సరిగా మే నెలలో నేనక్కడ ట్రెయినింగ్‌లో వుండగానే జరిగింది ఆ దుర్ఘటన! అంతటి షాక్‌లోను వెంటనే నన్ను గుర్తుతెచ్చుకుని మిత్రుడెవరో వుత్తరం రాస్తే తెలిసి తట్టుకోలేక, నమ్మీ నమ్మక, పరీక్షల్ని పట్టించుకోక పరుగెత్తుకొచ్చాను రామగిరికి! వచ్చేసరికి ఏముంది? వారి శోకగృహం అది నిజమని నమ్మమంది. అరుణా నది బావురుమంది. చేలగట్లు మౌనం వహించాయి. ఆ రాత్రి చంద్రుడు వెలవెలపోయాడు. మనస్సులో అతి భయంకరమైన, విషాదభరితమైన నిశ్శబ్దం మాత్రం అలుముకుంది.
నాకు ఊహతెలిసి నా జీవితంలో జరిగిన మొట్టమొదటి ప్రియ వియోగం అది. నాకే కాదు, మా ఇంటిల్లిపాదికీ! అదివరకోమారు మా వూళ్లో మా ఇంటిని వెదుక్కుంటూ వచ్చారు గురువుగారు. ఆ శిష్యవాత్సల్యానికి కరిగిపోయేరు అప్పట్లో మా అమ్మానాన్న, మా పెదనాన్న! ఆ అనుబంధంతోనో, ఏమో! వారిని పలకరించడానికన్నట్టు వారు వెళ్లిన ఆరు నెలలకి మా పెదనాన్న, మరో ఆరు నెలలకి మా నాన్న ‘మన గంగాధరం అయ్యోరు’ అనుకుంటూ ఆయన దగ్గరికే వెళ్లిపోయారు. నాకు లోకం తెలియని వయసులో వెంటవెంటనే ముమ్మారు వినిపించిన మృత్యుఘోష. అదే మొదటి డిప్రెషన్ నా జీవితంలో ! – విధి చవిచూపింది! తరువాతి రోజుల్లో స్నేహం పేరుతో సన్నిహితులు మిగిల్చిన చేదు అనుభవాల్ని అలావుంచితే, నా జీవననౌక అలా విద్వాన్ తీరం వేపు సజావుగా సాగడానికి చుక్కాని, తెడ్డూ తెరచాపల్లా తోడ్పడ్డ ఆ మహానుభావులు మువ్వురూ నా ఉద్యోగ జీవితం ప్రథమాంక ప్రారంభానికే లేరు. ఇప్పుడు విశ్రాంత జీవితం కొనసాగిస్తున్న ఈ దశలోను గురువుగారి జ్ఞాపకాల బరువుని మోస్తూ సజీవ స్మృతి చిహ్నాలుగా మిగిలినవాళ్లం నేనూ, నా మిత్రులు నలుగురూ వున్నాం!
గంగాధరంగారి పెళ్లి సందర్భంలో కవిమిత్రులందించిన ‘తలంబ్రాలు’ అన్న కవితా గుచ్ఛంలో
నీలిమేఘము వంటివాడా!
నేస్తుడా!
నింగిలో తారాడువాడా! – అన్న సదానందగారి సంబోధనల్లోని ఉపమ అతిశయోక్తులు తనపట్ల స్వభావోక్తిగా-
గంగాధరుని వివాహము
సంగతి విని పొంగిపోతి; సరస కవిత్వో
త్తుంగ తరంగాంచిత యగు
అంగన గొనునట్టి సుకవి కగుత శుభంబుల్
అన్న దాశరథి సంభావనకి సాక్షాత్ అక్షరరూపంగా వెలిగిన ఆ ఆదర్శామృతమూర్తిని మళ్లీ మనం చూడగలమా
ఈ చర్మ చక్షువులతో-మనశ్చక్షువులతో తప్ప!
మనసు ప్రమిదచేసి మంచిని వెలిగించి
నాడు వెలుగజేయువాడె నరుడు!- హైస్కూలు వీడ్కోలు సభలో మమ్మల్ని సాగనంపుతూ గంగాధరం పలికిన ప్రబోధం అది! అక్షరాలకీ, ఆచరణకీ మధ్య దూరం తగ్గించిన నిజమైన అభ్యుదయ కవి, కర్మిష్ఠి ఆయన.
సామాజిక వర్గ స్పృహ మరీ బలీయంగా వున్న గ్రామీణ వాతావరణంలో ఆ వర్గ విభేదాల్ని విస్మరించి తన విద్యార్థులందరికీ తమ ఇంట సమంగా ఆతిథ్యం ఇప్పించిన అభ్యుదయ భాస్కరుడు. మొదట తాను వెలిగాడు. తరువాత తనవారిని వెలిగించాడు. మొత్తం సాహితీ ప్రపంచానికే వెలుగులు పంచాడు. ఇప్పుడు ఆ వెలుగు దివ్వెలే ఆయనకి అక్షర నీరాజనం సమర్పిస్తున్నాయి. తిరుపతి పట్టణం కేంద్రంగా ‘గంగాధరం సాహితీ కుటుంబం’ పేరిట ఆయన మిత్రులు కొందరు కవిత, కథ, నవల, విమర్శ వీటిలో ఒక్కో ఏడు ఒక్కో ప్రక్రియలో ప్రతి ఏటా ఎన్నికైన అత్యుత్తమ గ్రంథకర్తకి అత్యున్నత పురస్కారం అందించి గౌరవిస్తున్నారు. చిరంజీవి ఐన కవి పేరిట సాటి కవిని ఏటా సత్కరించే సత్సంప్రదాయాన్ని ఇప్పటికీ సజావుగా కొనసాగిస్తున్నారు.
– డాక్టర్ కాసల నాగభూషణం
09444452344

