బ్రాహ్మణాల కదా కమా మీషు -6
ఉపాఖ్యానాల్లో కధలు -2
’కాల కంజుల యాగం
తైత్తిరీయ బ్రాహ్మణం లో ఉపాఖ్యానాలు చాలాఉన్నా ‘’కాల కంజుల యాగం ‘’గురించి మంచి విషయం కని పిస్తుంది .కాల కన్జులు అనే రాక్షసులు స్వర్గాన్ని పొందటానికి ఇటుకలను (ఇస్టకలు )పేర్చి యాగం చేస్తున్నారు .వీరి రాకతో స్వర్గం నాశనమవుతుందని ఇంద్రుడు మారు వేషం లో వెళ్లి వారిలో ఒకడుగా ఉండి ‘’చిత్ర’’అనే పేరుగల ఇటుకను ఉంచాడు .యాగం పూర్తయింది స్వర్గానికి ఆ ఇటుకల మీదుగా కాల కంజ రాక్షసులు నడిచి వెడుతున్నారు .ఇంద్రుడు తాను పేర్చిన’’ చిత్రేస్టక ‘’ను తీసేశాడు .చితి కూలి పోవటం తో రాక్షసులు నేల మీద పడిపోయి సాలీడు మొదలైన క్రిమి కీటకాలై పోయారు .అందుకే సాలీళ్ళు పూర్తిగా నేల మీద ఉండక ,ఆకాశం లో ఎగరలేక మధ్యలో గూళ్ళు నిర్మించుకొని ఉంటాయి .ఈ ఉపాఖ్యానం లో ధర్మ రక్షణ ,ఆత్మ రక్షణ రెండూ కానీ పిస్తాయి .శత్రువును మాయోపాయం తో జయించ వచ్చుననే సందేశం ఉంది .కనుక చిత్రా నక్షత్రం లో ‘’ఇష్టకాచాయనం ‘’చేసే వాడి శత్రువులు నశిస్తారనే అంతరార్ధం ఇందులో ఉంది .
బ్రహ్మ కైనా పుట్టు రిమ్మ తెగులు
సురాసురులకు ఒకప్పుడు ఘోర సంగ్రామమే జరిగింది .సురులు తాము అసురుల చేతిలో ఓడిపోతామేమో నన్న భయం తో సమస్త వస్తు సామగ్రిని,ధనాన్ని ‘’అగ్ని షోములు ‘’(అగ్ని సోముడు )ల వద్ద దాచి యుద్ధానికి తరలి వెళ్ళారు .ఈ ధనాన్ని చూసి కళ్ళు కుట్టి ఆ ఇద్దరూ ఆ దనం తో జీవితాంతం హాయిగా బతక వచ్చునని, దేవతలు జయించలేరని నమ్మకం తో దేవతలు తమ దగ్గర దాచిన దాన్ని అంతా తీసుకొని ఉదాయిన్చేశారు . .దేవతలే యుద్ధం లో రాక్షసులని జయించారు .అగ్నిని వెతికి పట్టుకొని కొంత ప్రతిఫలం ముట్ట చెప్పి సామ దాన ఉపాయాలతో తమ సంపదను రాబట్టుకొన్నారు .అలాగే సోముడిని కూడా పట్టుకొని కొట్టి ,దండోపాయం తో ధనాన్ని స్వాధీనం చేసుకొన్నారు .తర్వాతాఆ ధనమే ఇంద్రుడు వాయువు మొదలైన గ్రహాలుగా మారటం వలన యాగం లో యజమానుడు ఈ గ్రహాలను తప్పని సరిగా ఉంచి యాగం చేయాలని తైత్తిరీయం చెబుతోంది .
సృష్టికి ఆది
సృష్టిని గూర్చి ఉన్న ఉపాఖ్యానం లో ఈ జగత్తు లో మొదట అరణ్యాలు ,పర్వతాలు ఉండేవికావు .అంతా జలమయమే .ప్రజాపతికి సృష్టి చేయాలని సంకల్పం రాగానే ఆ జలం పై ఆయనకు ‘’పద్మ లత’’కనిపించింది .వెంటనే వరాహ రూపం దాల్చి ఆ లతకు దగ్గర నీటిలో మునిగి మట్టిని పైకి తెచ్చి భూమిని ,మిగిలిన సృస్తినీ పూర్తీ చేశాడు .
అనుభ విన్చిందే మనది
ప్రజాపతి ప్రజా సృష్టి చేయాలనే కోరిక తో తపస్సు చేశాడు .ఆయనకు బంగారం కనీ పించింది .అది తన కోర్కె తీరుస్తుందని భావించి అగ్నిలో హోమం చేశాడు .జరగలేదు .మళ్ళీ చేశాడు లాభం లేదు .తర్వాత ఆ బంగారాన్ని తన కడుపులో ఉన వైశ్వానరాగ్నికకి ఆహుతిగా మింగేశాడు .వెంటనే ఆయనకు ప్రజోత్పాదన శక్తి వచ్చేసింది .అందుకే లోకం లో ‘’దాచి పెట్టిన దానికంటే ఉపయొగిన్చిన్దెఉత్తమమైన్ది ‘’ అనే సామెత దీనివల్లనే వచ్చింది .సువర్ణ భస్మం సంతాన ప్రాప్తి కల్గిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది .
అంతం లేని వేదాలు
వేదాలు అనంతాలు అని చెప్పే ఉపాఖ్యానం కూడా తైత్తిరీయ బ్రాహ్మణం లో ఉంది .భరద్వాజ మహర్షి తన జీవిత కాలమంతా తపస్సులోనే గడిపి ,ఇంకా చాలా నేర్వాల్సింది ఉందని గ్రహించాడు .ఇంద్రుడిని ప్రార్ధించి మరొక జీవితకాలాన్ని వరం గా పొంది మళ్ళీ నేర్వటం మొదలు పెట్టినా ఇంకా నేర్వాల్సిన వేదాలు మిగిలే ఉన్నాయి .మరోజీవితకాలమూ చాల లేదు .300సంవత్సరాలు వేదాధ్యయనం చేసి అలసిపోయి వృద్ధుడై పోయి పడిఉన్న మహర్షి దగ్గరకు ఇంద్రుడు వచ్చి మూడు పెద్ద పర్వతాలను చూపించి అవే వేదాలని చెప్పి ఆ మూడింటిలో నుంచి మూడు గుప్పెళ్ళ ధూళి తీసి ఇచ్చి అంతటి తో సంతృప్తి పడమన్నాడు .అందులోని ఒక్కొక్క రేణువు ఒక్కొక్క వేదం శాఖ అని ఎరుక కలిగించాడు అందుకే ‘’అనంతావై వేదాః ‘’అన్నారు .
మోదుగ చెట్టు పుట్టుక
భూమి పైన మూడవ లోకం లో ఉండే సోమాన్ని గాయత్రీ దేవి బలాత్కారం గా తీసుకొని వెళ్ళింది .అప్పుడు సోమాన్ని రక్షించే వారికి ఆమెకు యుద్ధం జరిగింది .ఆ యుద్ధం లో సోమలతః కు చెందిన యొక ఆకు ఒకటి నేల మీద పడింది .దాని నుండి పలాశ లేక మోదుగ చెట్టు పుట్టింది .అలాగే దర్భ ,మర్రి ,మెది జమ్మి ,వికంకత మొదలైన వృక్షాల పుట్టుక కూడా తైత్తిరీయ బ్రాహ్మణం లో ఉంది .
దీని తర్వాతా శత పద బ్రాహ్మనం లో ఉన్న ఉపాఖ్యానలలోని కధలను తెలుసుకొందాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-14-ఉయ్యూరు

