కాంగ్రెస్ కనుమరుగైపోతోందా?

కాంగ్రెస్ కనుమరుగైపోతోందా?

 

కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాలంటున్న బి.జె.పి కల లు నిజమవుతాయా? లోక్‌సభతోపాటు ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బి.జె.పి కలలు నిజమవుతాయనే ఈ సంకేతాలిస్తున్నాయి. పదహారవ లోక్‌సభ ఎన్నికల్లో బాగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర, హర్యానా శాసన సభలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఆశనిపాతం వంటివి. కాంగ్రెస్ పార్టీ మహారాష్టల్రో గత పదిహేనేళులగా, హర్యానాలో గత పదేళ్లుగా నుండి అధికారంలో కొనసాగింది. రెండు రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్‌ను ఛీత్కరించటంతో ఆ పార్టీకి ప్రతిపక్ష నాయకత్వం హోదా కూడా లభించటం లేదు.
మహారాష్ట్ర, హర్యానా ఓటమితో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రాధాన్యత కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్ ప్రస్తుతం తొమ్మిది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా ఇది చెప్పుకునేందుకు పనికి వస్తుంది తప్ప రాజకీయంగా ఎందుకూ పనికి రాదు. దక్షిణాదిలోని కర్నాటక ఒక్కటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రం. మిగతా ఎనిమిది రాష్ట్రాలు చిన్నవి, అతి చిన్నవి. కాంగ్రెస్ దక్షిణాదిలో కర్నాటక, కేరళలో అధికారంలో ఉంటే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర నిర్వహించే హిందీ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయి దశాబ్దాలవుతోంది. కాంగ్రెస్ పార్టీ హిమాలయ పర్వత ప్రాంతాల పార్టీగా రూపాంతరం చెందిందంటే ఆశ్చర్యపోకూడదు.హిమాచల్ ప్రదేశ్,ఉత్తరాఖండ్, అస్సాం, మిజోరం,మేఘాలయ,మణిపూర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉన్నది. కర్నాటక మినహా కాంగ్రెస్ అధికారంలో ఉన్న మరే ఇతర రాష్ట్రం కూడా జాతీయ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించలేవు.
దీనికి భిన్నంగా కేంద్రంలో స్వశక్తితో అధికారంలోకి వచ్చిన బి.జె.పి మధ్య ప్రదేశ్, చత్తీస్‌గడ్, గోవా,గుజరాత్, రాజస్తాన్‌లో అధికారం చెలాయిస్తోంది. ఇప్పుడు తాజా గా హర్యానాలో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటే మహారాష్టల్రో శివసేనతో కలిసి అధికారంలోకి రాబోతోంది. దీనికితోడు బి.జె.పి మిత్రపక్షాలైన తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే అకాలీదళ్ పంజాబ్‌లో ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. బి.జె.పి దాని మిత్రపక్షాలు జాతీయ రాజకీయాలకు అత్యంత ముఖ్యమైన తొమ్మిది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. దేశంలోని మిగతా పదకొండు రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, త్రిపుర, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, సిక్కిం, ఒడిశా,నాగాలాండ్, జార్ఖండ్, జమ్ముకాశ్మీర్, బీహార్‌లలో ప్రాంతీయ పార్టీలు అధికారాన్ని చెలాయిస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తర ప్రదేశ్‌లో ప్రస్తుతానికి సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్నా 2016 ప్రారంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కేవసం చేసుకునేందుకు బి.జె.పి సిద్ధమవుతోంది.
కాంగ్రెస్ పార్టీ ఉత్తరాధిలోని ఏ ఒక్క రాష్ట్రంలో కూడా అధికారంలో లేకపోవటం గమనార్హం. కాంగ్రెస్‌కు ఇప్పుడు నాయకత్వం అనేది లేకుండాపోతోంది. సోనియా గాంధీ దేశానికి సమర్థ ప్రభుత్వాలను అందజేయటంలో ఘోరంగా విఫలమయ్యారు. డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను అడ్డం పెట్టుకుని అధికారం చెలాయించారు తప్ప ప్రజల ప్రయోజనాల గురించి పట్టించుకోలేదు. కాంగ్రెస్‌తోపాటు మిత్రపక్షాలకు చెందిన మంత్రులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నా ఆమె అదుపు చేయలేదు. కామన్‌వెల్త్ క్రీడల నిర్వహణ యు.పి.ఏ సంకీర్ణ ప్రభుత్వం అసమర్థత, అవినీతికి అద్దం పట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఉపనాయకత్వం బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీకి అసలు రాజకీయాల పట్ల ఎలాంటి ఆసక్తి లేకపోవటం పార్టీకి తీరని నష్టం కలిగించింది. రాహుల్ గాంధీకి రాజకీయ నాయకత్వ లక్షణాలు లేకపోయినా అతన్ని బలవంతంగా కేంద్ర బిందువు చేయటం వలన కాంగ్రెస్‌కు ఎనలేని నష్టం వాటిల్లింది. ఆయన కు రాజకీయ పరిజ్ఞానం లేకపోవటం, అధికారం పట్ల సరైన అవగాహన రాకపోవటంతో కాంగ్రెస్ పునాదులు కదిలిపోయాయని చెప్పకతప్పదు.
ఇందులో రాహుల్ గాంధీ తప్పేమీ లేదు. సోనియా గాంధీకి మాదిరిగానే రాహుల్ గాంధీకి కూడా రాజకీయాలలోకి రావటం ఎంత మాత్రం ఇష్టం లేదు. తన జీవితమేదో తాను జీవించాలనుకున్నాడు. అందుకే ఆయన చాలా కాలం పాటు కాంగ్రెస్ రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. సోనియాగాంధీ రాజకీయ వారసుణ్ణి సిద్ధం చేయాలనే లక్ష్యంతో రాహుల్ గాంధీని అమేథీ నుండి లోక్‌సభకు ఎంపిక చేసి ఆ తరువాత ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. అయితే రాహుల్ గాంధీ ఏ రోజు కూడా రాజకీయాధికారం నుండి ఆనందం పొందలేదు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ రాజకీయాలలోకి రావటాన్ని సోనియా గాంధీ మొదట్లో చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించటం జగమెరిగిన సత్యం. రాజీవ్ గాంధీ హత్యానంతరం పి.వి.నరసింహారావు ప్రధానమంత్రి పదవి చేపట్టి ఐదు సంవత్సరాల పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నిర్వహించారు. సోనియా గాంధీకి రాజకీయాలలోకి రావటం ఇష్టం లేకనే నరసింహారావు ప్రధాన మంత్రి పదవి చేపట్టవలసి వచ్చింది. నరసింహారావు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల పాటు ఆయనకు సోనియా గాంధీకి మధ్య రాజకీయ రగడ కొనసాగింది. సీనియర్ నాయకుడు అర్జున్ సింగ్ లాంటి వారి మూలంగా చివరకు సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి ఆ తరువాత 2004లో కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. సోనియా గాంధీ రాజకీయ నాయకురాలిగా ఎదగలేకపోయారు. ఈ ఖాళీని భర్తీ చేసేందుకే ఆమె తన రాజకీయ వారసుడుగా రాహుల్ గాంధీని ముందుకు తెచ్చారు. కాంగ్రెస్ నాయకులకు అధికారం ముఖ్యం. తమను అధికారంలోకి తెచ్చే వారికే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద పీట వేస్తారు. రాహుల్ గాంధీ తమకు అధికారాన్ని సంపాదించిపెట్టలేడని విశ్వసిస్తున్నారు. అందుకే వారు ప్రియాంకాగాంధీ వైపు చూస్తున్నారు. ఆమె రాజకీయాల్లో రాణిస్తారనే గ్యారంటీ ఏమీ లేదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పార్టీని కాపాడే పరిస్థ్థిలో లేరు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బతికి బట్టకట్టగలుగుతుందా?

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రాజకీయం and tagged . Bookmark the permalink.

1 Response to కాంగ్రెస్ కనుమరుగైపోతోందా?

  1. ఒకప్పుడు బీజేపీకి జాతీయస్థాయిలో పరాభవం ఎదురైనది కదా? పార్లమెంట్లో మూడే సీట్లు వచ్చి!
    కాని బీజేపీ కనుమరుగైనదా?
    కాంగ్రెసుపార్టీ కనుమరుగు కావటం అనేకానేక మంది స్వప్నం. నిజమైతే సంతోషమే.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.