నా దారి తీరు -78 మారిన పుస్తకాలు

నా దారి తీరు -78

మారిన పుస్తకాలు

పదవ తరగతి సిలబస్ మారి కొత్తపుస్తకాలు వచ్చాయి .నేను చెప్పే ఫిజిక్స్ లో చాలా చాప్టర్లు మేము డిగ్రీ లో కూడా చదవనివి .ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మాకు కొత్త .ఏదో మెండలీఫ్ ఆవర్తన పట్టిక మాత్రమే చదివాం .ఇవి చెప్పాలంటే చాలా నేర్చుకోవాలి .లేక పొతే చాలా కష్టం .అందుకని ప్రభుత్వం రీ ఒరిఎంటేషన్ క్లాసులను ఉపాధ్యాయులకు అన్ని సబ్జెక్ట్ లోలోను ఇచ్చే ఏర్పాటు చేసింది  .కాలేజీ లెక్చరర్ ల సేవలను ఉపయోగించి మాకు నేర్పారు. జిల్లా విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిక మీద నిర్వహించింది .మాకు గుడివాడ టౌన్ హై స్కూల్ లో శిక్షణా తరగతులు నిర్వహించారు .

నేను ఫిజిక్స్ మెయిన్ వాడినే అయినా ఈ సబ్జెక్ట్ అంతా కొరక రానికోయ్యగా ఉండేది .కొన్ని చాప్టర్లు మరీ అయోమయం గా ఉండేవి .అప్పటికే మా పెద్దబ్బాయి శాస్త్రి, రెండోవాడు శర్మ లు డిగ్రీలు పూర్తీ చేసిఉన్నారు .వాళ్ళను అడిగి తెలుసుకొనే ప్రయత్నం చేశా .వాళ్ళు ‘’నాన్నా !నీకు మేము చెప్పగలమా ?ఈ చాప్టర్లున్న మేము చదివిన ఇంగ్లీష్ టెక్స్ట్ పుస్తకాలిస్తాం చదివి నువ్వే నేర్చుకో .’’అని కాడిపారేశారు .సరే అని వాళ్ళు నాకు ఇచ్చిన పుస్తకాలు ,లైబ్రరీలో పుస్తకాలు ఇంగ్లీష్ లో ఉన్నవి చాలా శ్రద్ధగా ప్రతి విషయాన్ని చదివి జీర్ణం చేసుకొన్నాను .ఆ టాపిక్స్ లో ఏ రకమైన అనుమానాలున్నా చదివి నివృత్తి చేసుకొని సబ్జెక్ట్ ను కరతలామలకం చేసుకొన్నాను .ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ చాలా లావుగా చాలా పాఠాలతో ఉండేది .ప్రభుత్వానికి అందులో కొన్ని పాఠాలు విద్యార్ధుల స్థాయికి మిన్చిఉన్నాయని వాటిని సిలబస్ నుంచి తొలగించాలని కూడా మాలో కొందరం నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి డి .యి .ఒ. ద్వారా మేమోరాండాలు ఇచ్చాము .బహుశా ఆంద్ర రాష్ట్రం లో కృష్ణా జిల్లా గిల్డ్ ఇలాంటి వాటికి చాలా మార్గ దర్శకం గా ఉండేది .వారూ పునశ్చరణ తరగతులను నిర్వహించారు .అందులో మేమూ భాగస్వాములమయ్యాము .ఫిజిక్స్ లో కెమిస్ట్రీలో నేను బోధించటానికి అన్నిరకాల అవకాశాలను సిద్ధం చేసుకొన్నాను .కనుక ఈ సబ్జెక్ట్ లలో నాకు అదనపు శిక్షణ అవసరం లేదు అని పించింది .

గుడివాడలో ఇంగ్లీష్ ,ఫిజిక్స్ కేమిస్ట్రి ,లెక్కలు ,నేచురల్ సైన్స్ ,సోషల్ లలో క్లాసులు జరిగాయి ,అప్పుడు  వీటికి ఇన్చార్జిగా గుడివాడ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీ సుబ్బారావు గారు ఉండేవారు .నేనూ ,తమిరిస సైన్స్ మేష్టారు మల్లికార్జున రావు గారు ఆయన్నుకలిసి మాకు ఫిజికల్ సైన్స్ లో శిక్షణ అవసరం లేదని లెక్కలలో శిక్షణ పొందటానికి అనుమతినివ్వమని కోరాం .లెక్కల మీద మా కున్న శ్రద్ధకు ఆయన ముచ్చటపడి ఒ.కే .అన్నారు .మేము గణితం క్లాసుల్లో కూర్చుని ఆ సబ్జెక్ట్ లో మెలకువలన్నీ తెలుసుకొన్నాం .ఇలా ఈ శిక్షణ  మా ఇద్దరికీ బాగా ఉపయోగ పడింది .మిగిలిన వారు వారి వారి సబ్జెక్ట్స్ లో శిక్షణ పొందారు .ఈ ట్రేయింగ్ ఉపాధ్యాయులకు సబ్జెక్ట్ లలో ఎక్స్పర్ట్ లు అవటానికి బాగా దోహదపడ్డాయి .ఇది వారికి వరం అయింది .ఉయ్యూరులో ఇంటి దగ్గర నా దగ్గరే ట్యూషన్ చదవాలి అనుకొనే వారికి బాగా ఉపయోగపడింది .అప్పుడు నా దగ్గర చదివిన వాళ్ళలో ఊర సుబ్బారావు కొడుకు మోహనరావు కొడుకు ,కళాయి మాట్లు పెట్టె సాయిబు కొడుకు ,మొదలైన వారుండేవారు వీరికి మార్కులు బాగా రావటం కోసం ఇంటర్ లెక్కలూ నేర్పెవాడిని లెక్కలంటే అంత ఉత్సాహం నాకు .వాళ్ళే స్కూల్ ఫస్ట్ మార్కులు సాధించారు .

ఇంగ్లీష్ పుస్తకమూ మారటం వలన మేము ఇంగ్లీష్ కూడా బోధిస్తున్నాం కనుక అందులోను శిక్షణ పొందాం .అశోకుడి కలింగ యుద్ధం మీద లెసన్ ఉంది .రాసిన వారేవరోకాని అందులో అశోకుని సైన్యం నడకను చాలా గొప్పగా రాశాడు .ఒక రిదం అందులో ఉంది .అది పట్టుకొన్నాను .అలా చదువుతూ ఉంటె అసలు గుర్రాలు కదను తొక్కుతున్నట్లు సైన్యం పద విన్యాసం చేస్తున్నట్లు ఉండి యుద్ధ దృశ్యాన్ని ఆవిష్కరింప జేసేవాడిని .నేను చదవటమే కాదు బాగా చదవ గల పిల్లలతో కూడా చదివించే వాడిని .దీనితో ఒక రకమైన ఉత్సాహం వచ్చేది క్లాసులో .నాకు తెలిసినంత వరకు ఇలా ఈ లెసన్ లో ఈ రిథం ను అనే నాడిని పట్టుకొన్న వాడిని నేనొక్కడినే అనిపించింది.ఎవరితో మాట్లాడినా ఈ విషయం వారికీ చెప్పే వాడిని ‘’అంత సీనుందా ‘’అనేవారు వాళ్ళు .పామర్రులో నేను చెప్పే టెన్త్ క్లాస్ సెక్షన్ లో సరస్వతి అనే ఒక అమ్మాయి ఉండేది .ఆ అమ్మాయి నేను ఎలా చదివితే అలా చదివేది .ఆమె ఒక రిటైర్డ్ మాస్టారి మనవ రాలు అనిజ్ఞాపకం .అలాంటి పిల్లలకు విద్య చెప్పటం భలే  ఆనందం గా సంతృప్తిగా ఉండేది .ఆ పిల్ల కూడా నేను ఒక పేరా చదివి ఎక్స్ ప్లైన్ చేసి అందులోని సారాంశాన్ని ఇంగ్లీష్ లో చెప్పితే వెంటనే చెప్పగలిగేది నాకు బహుముచ్చటగా అనిపించేది ..మగ పిల్లల్లో అంత స్పార్క్ ఉన్న వారు ఉన్న జ్ఞాపకం లేదు .ఆమె తాతగారు అప్పుడప్పుడు కనిపించి నా బోధనా తీరును మెచ్చుకొనేవారు .సహృదయుల మెప్పు కంటే సంతృప్తి ఏముంటుంది ?నిజం గా అవి మధురమైన అనుభవాలు జీవితం లో .

టెన్త్ పరీక్షలలో మధ్యాహ్నం క్లాసులు

ఇంగ్లీష్ కు న్యాయం చేయాలని టెన్త్ సప్ప్లి మెంటరి పబ్లిక్ పరీక్షలకు ఇన్విజిలేటర్ గా డ్యూటీ చేసే నేను, అది అవగానే టెన్త్ ఇంగ్లీష్ ను విద్యార్ధులకు బోధించేవాడిని .ఒక సారి గుడివాడ డిప్యూటీ ఇన్స్పెక్టర్ శ్రీ సుబ్బారావు గారు పరీక్షల ఇన్స్పెక్షన్ కు వచ్చి ,పిల్లలను చూసి వాళ్ళు ఎందుకు వచ్చారని అడిగితె తమకు ఇంగ్లీష్ క్లాస్ లను నేను బోధిస్తున్నట్లు వాళ్ళు తెలియ జేశారట .మధ్యాహ్నం పరీక్షవగానే అయన హెడ్ మాస్టారి సమక్షం లో అందరిని సమావేశ పరిచి ఇంగ్లీష్ బోధన లో నేను చేస్తున్న కృషిని అందరికి తెలియ జేసి నన్ను ప్రత్యేకం గా అందరి సమక్షం లో అభినందించారు .ఇది నేను మర్చిపోలేని విషయం .సుబ్బారావు గారు చాలా సహృదయులు. విధి నిర్వహణ లో నిర్దుష్టం గా ఉండేవారు .ఎలాంటి అవినీతినీ సహించేవారు కాదు .ఆయన సమర్ధత వలన వారు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారిగా కూడా పని చేసి చాలా ఆదర్శ ప్రాయం గా విద్యాశాఖను తీర్చి దిద్దారు .పామర్రు సంఘటన ను అందరికి ప్రతి చోటా తెలియ జేసిన సంస్కారం వారిది .నాకు  ఫోన్ ద్వారావారితో  మాట్లాడే చనువు ఇచ్చిన పెద్ద మనసు వారిది .జనవరి ఫస్ట్ , ఉపాధ్యాయ దినోత్సవానికి పరస్పరం అభినందనలు తెలియ జేసుకొనే వారం .జిల్లా కు అలాంటి వారి సేవలు లభించటం అదృష్టం .అలాంటి సిన్సియర్ ఆఫీసర్ దగ్గర పని చేసే భాగ్యం నా లాంటి వాళ్లకు కలగటం మరీ అదృష్టం .ఆయన దాదాపు పదేళ్ళ క్రితం చనిపోయారు .మంచి మనసు, చేష్టలు ఉన్న దొడ్డ మనిషి శ్రీ సుబ్బారావు గారు .అన్నిటా నంబర్ వాన్ గా ఉండాలనే తలంపు వారిది .అలానే చేసి నిల బెట్టేవారు .డి. యి .ఒ  .గా పని చేసినకాలం లో ఏదైనా అభివృద్ధికి, సైన్స్ ఫెయిర్ నిర్వహణకు ,సలహాలు నన్ను అడిగి తీసుకొని చర్చించి అందులో పనికి వచ్చిన వాటిని అమలు జరిపిన విద్యాభి వృద్ధి అధికారి సుబ్బా రావు గారు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-11-14-ఉయ్యూరు

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.