కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి?

కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి?

ప్రతివాళ్లు ఇళ్లలో కార్తీకపౌర్ణమి దీపం పెట్టుకుంటారు. అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తిదీపాలు కూడా పెడతారు. దానికి రెండు కారణాలు. ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజూ ఉండకూడదు. శాస్త్రంలో ఏమిటంటే యథార్థంగా మీరు ఇల్లు కట్టి ఎక్కడికైనా తాళం వేసి వెళ్లిపోతున్నారనుకోండి.
ఇంటి బ్రహ్మగారు ఉంటారు. ఆయన్ని పిలిచి అయ్యా! మేము కాశీ పట్టణానికి వెళుతున్నాం. రావటానికి 20 రోజులు పడుతుంది. ఈ ఇరవై రోజులు మీరు కాస్త మా పూజా మందిరంలో దీపం వెలిగించి స్వామికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి అని చెప్పి వెళ్లాలి. ఆయన రోజూ దీపం పెట్టి వెళతారు. ఇంట దీపం వెలగలేదు అంటే పరమ అమంగళకరమైన గృహం అని గుర్తు. అలా నీ ఇండ్లన్నవి ఎన్ని ఉన్నాయో అన్ని చోట్ల దీపం వెలగాలి. స్వగృహే అని నీవు ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవో అక్కడన్ని చోట్లా 365 రోజులూ దీపాలు వెలుగుతూ ఉండాలి. అలా దీపం వెలగకపోతే ఆ దోషం మీకే వస్తుంది. మళ్లీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన అద్భుతమైన తిథి కార్తీకపౌర్ణమి. అందుకే కార్తీకపౌర్ణమి నాడు 365 వత్తులు గుత్తిదీపం అని ఆవునేతిలో ముంచి వెలిగించేస్తుంటారు. పదిరోజులో, పదిహేనురోజులో, ఇది తెలియకముందెప్పుడో తప్పు చేసిన రోజులెన్నెన్ని ఉన్నాయో ఒక ఏడాదంతా నేను దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో, అదంతా పోవాలని 365 వత్తులు వెలిగించి వచ్చేస్తారు.

దీపాలు వెలిగించుకోవాలి. ఇంటి యజమాని వెలిగించాలి. మా ఆవిడ వెలిగిస్తుంది. నేను టీవీ చూస్తాననకూడదు. యజమాని పంచె కట్టుకుని వెళ్లి దీపాలయంలో దీపం పెట్టాలి. యజమాని ఇంట్లో దీపం పెడితే సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి. ధర్మపత్నీ సమేతస్య అని సంకల్పం ఉందిగాని ఆవిడ వెలిగించి ధర్మపతీ సమేతస్య అని సంకల్పం లేదు. నువ్వు పెట్టాలి దీపం. పురుషుడు యజమాని ఇంటికి. కాబట్టి యజమాని ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్న వాడవుతాడు. కాబట్టి ఎంతెంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం. దేవాలయ ప్రాంగణాలైతే కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట్లో అయితే తిథిని ప్రమాణం తీసుకోవాలి. ఇంట కార్తీకదీపం పెడితే కార్తీకపౌర్ణమి తిథి ప్రధానం. దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రంనాడు జ్యోతిని వెలిగిస్తారు. అరుణాచలంలో ఆ కృత్తికా దీపోత్సవం చూడటానికి కొన్ని లక్షలమంది వస్తారు. ఆ రోజున అసలు గిరిప్రదక్షిణ చేయటానికి అవకాశమే ఉండదిక. మొత్తం జనంతో నిండిపొతుంది. వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు. చూసి నమస్కారం చేస్తారు. భగవాన్‌ రమణులంతటి వారు కూడా అసురసంధ్యవేళ అయ్యేటప్పటికి వచ్చేసి ఆ చెక్క సోఫాలో పడుకుని అరుణాచలం కొండమీద వెలిగే దీపం కోసం ఎదురుచూస్తుండేవారు. ఆయనే పెద్ద జ్యోతిస్వరూపుడు. అయినా సరే ఆ జ్యోతిని చూడటానికి ఆయన అక్కడకు వచ్చి నిలబడి ఆ జ్యోతిని చూసి నమస్కరిస్తుండేవారు. భారతదేశం మొత్తం మీద కృత్తికా దీపోత్సవం అంటే, అంత ప్రసిద్ధి. అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి, అక్కడ కొండమీద వెలిగించే దీపానికి అంత ప్రఖ్యాతి.
అందుకే కార్తీకపౌర్ణమినాడు వెలిగించే దీపం కేవలం మన కొరకే కాకుండా, మనం చేసే దుష్కృతులను పోగొట్టి మన పాపములను పోగొట్టి అంతర తిమిరాన్ని పోగొట్టి బాహ్యములోని తిమిరాన్ని పోగొట్టి లోకోపకారం చేసి సమస్త జీవులనుద్ధరించడానికి పెట్టిన దీపం. కాబట్టి అశ్వయుజమాసం చివర వచ్చిన తిథినాడు వెలిగించిన దీపంతో మొదలుపెట్టి కార్తీకపౌర్ణమి నాటి దీపానికి అంత గొప్పతనమిచ్చారు. ఈ దీపాలు వెళ్లిపోవాలి. దీపాలు వెళ్లిపోవటమంటే? నీటిలోకి తీసుకెళ్లి దీపాల్ని అరటిదొప్పలలో పెట్టి విడిచిపెడతారు. విడిచిపెడితే, నీటిని ఆధారం చేసుకుని ఆ దీపం వెళ్లిపోతూ ఉంటుంది. దీపం విడిచిపెట్టానండీ అంటారు. ఈ దీపం వెళ్లి ఎక్కడో ఇంకో దీపాన్ని కలుసుకుంటుంది. అలా వెడుతూ వెడుతూ అది నిధనమైపోతుంది ఆ నీటిలోనే.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.