ఆఖరి చూపుల ఆత్మబంధువు -శ్రీ బాషా

ఆఖరి చూపుల ఆత్మబంధువు

శ్మశానానికి వెళ్లిన విక్రమార్కునిలాగే భుజం మీద శవాన్ని వేసుకుని కథ చెప్పడం మొదలుపెడతాడు చాంద్‌బాషా. ఒక్కో మృతదేహానిది ఒక్కో కథ. అవన్నీ తెలంగాణలో పుట్టి అరబ్బుదేశపు ఎడారుల్లో ముగిసిన కన్నీటి కథలు. దిక్కులేని దేశాల్లో అనాధలుగా పడున్న మృతదేహాలను.. వాళ్ల కుటుంబీకులకు అప్పగించేందుకు పెద్ద పోరాటమే చేస్తున్నాడీ బాషా. ఆ విధంగా – ఇప్పటి వరకు ఖతార్‌, దుబాయ్‌, బహ్రెయిన్‌ దేశాలలో చనిపోయిన మూడొందలకు పైగా మృతదేహాలను తీసుకొచ్చేందుకు చొరవ చూపాడు..

‘‘ఎడారి దేశంలో పడున్న మృతదేహాలను తెప్పించడానికి పడేకష్టాలు అన్నీ ఒక ఎత్తు. హైదరాబాద్‌లోని విమానాశ్రయానికి శవాలు వస్తే.. అక్కడి నుండి తెలంగాణలోని సొంతూర్లకు తీసుకెళ్లేందుకు అంబులెన్సులకు కూడా పైసలు లేనోల్లే ఎక్కువమంది ఉన్నరు. చనిపోయిన మనిషికోసం పోరాటం చేయాల. ఆ మనిషిని ఊరికి తీసుకెళ్లలేని పేదరికం మీద మరొక పోరాటం చెయ్యాల. ఏమి దౌర్భాగ్యం ఇది! మా బతుకులు ఎన్నడు బాగుపడేను’’
అద్దె కారులో సిటీ మొత్తం గిర్రున తిరుగుతున్న చాంద్‌బాషా సెక్రటేరియట్‌ దగ్గర నిలిపాడు. ఆయనతోపాటు కారులో నుంచి పీక్కుపోయిన దిగులు ముఖాలతో కొందరు పల్లెటూరోళ్లు మెల్లగా దిగారు. వాళ్లలో ఒకపెద్దాయన చేతిలో నలిగిపోయిన కాగితాల కట్ట కనిపించింది. ‘‘ఈయన పేరు మల్కప్ప. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కుదురుమల్ల సొంతూరు. ఈ పెద్దాయన కొడుకు రాములు పదహారేళ్ల కిందట బతుకుదెరువు కోసమని సౌదీకి వెళ్లిపోయాడు. పోయినోడు పోయినట్లే కనిపించకుండా పోవడంతో.. ఈయన తిరగని ఆఫీసు లేదు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ పిటీషన్లు ఇచ్చిండు. తన కొడుకు బతికున్నాడా? లేడా? ఏమయ్యాడు? అని ఏడ్వని దినం లేదు. ఆయన గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు’’ అని మల్కప్ప గురించి చెప్పుకొచ్చాడు చాంద్‌బాషా. ఆ గుంపులోనే ఉన్న ఇంకో కుర్రాడ్ని చూపిస్తూ ‘‘ ఈ అబ్బాయిది తూర్పుగోదావరి జిల్లా కూనవరం. ఏడాది కిందట వీళ్ల అమ్మ ఖతార్‌ దేశానికి వెళ్లింది. అక్కడే చనిపోయింది. మృతదేహం తెప్పించడానికి నా వద్దకు వస్తే – ఏపీ ఎన్‌ఆర్‌ఐ సెల్‌కు తీసుకెళ్లి విజ్ఞాపన పత్రం ఇచ్చొస్తున్నాను..’’ అని చెప్పాడు బాషా. అతని పక్కనే మౌనంగా నిల్చున్న శ్రీశైలం అనే మరో యువకుడు భుజానికి తగిలించుకున్న గుడ్డసంచిని తెరిచి.. ‘‘మాది నిజామాబాద్‌ జిల్లా క్యాసంపల్లి. మా ఇంట్లో నా తమ్ముడు భాస్కర్‌ ఒక్కడే డిగ్రీ చదివిండు. మా అప్పులన్నీ తీర్చేస్తానని ఖతార్‌ వెళ్లాడు. అక్కడ ఒంటెలకాపరిగా చేసేటోడు. ఎడారి ఎండలకు నీళ్లు లేక, తిండి సరిగా తినక.. వెనక్కి వచ్చేందుకు డబ్బుల్లేక.. ఒకటి కాదు. నానా తిప్పలు పడుతున్నట్లు ఫోన్‌లో చెప్పేటోడు. ఒక రోజున హఠాత్తుగా ఎంబసీ ఆఫీసు నుంచి ఉత్తరం వచ్చింది. ‘భాస్కర్‌ చనిపోయాడు. మీ ఊరికి శవాన్ని పంపాలంటే ఒకటిన్నర లక్షలు పంపండి’ అనుంది అందులో. ఇప్పటికి ఏడాది గడిచిపోయింది. తమ్ముడు చేసిన అరవైవేల అప్పుతీర్చుకోలేకే కష్టాలు పడుతున్నాం. ఇప్పుడు వాడి మృతదేహాన్ని ఎలా తెప్పించుకోను..’’ అంటున్న శ్రీశైలం కళ్లలో నీళ్లు మెదిలాయి. అతను కూడా బాషా సాయం కోసం వచ్చాడు.
వీళ్లందరూ కలిసి రెండు రాషా్ట్రల ఎన్‌ఆర్‌ఐ సెల్‌లకు వెళ్లి.. అయినవాళ్ల మృతదేహాలను తెప్పించమంటూ విజ్ఞప్తి చేసి ఊరికి వెళ్లిపోయారు. బతుకుపోరాటంలో ఎడారి దేశం వెళ్లి.. చనిపోయిన సంబంధీకులకు చాంద్‌బాషానే దిక్కు అవుతున్నాడిప్పుడు. జగిత్యాల నుంచి వారంలో రెండుమూడు రోజులు హైదరాబాద్‌కు వచ్చే బాషాకు నిత్యం ఇదే పని. ఏదో ఒక ఊరి నుంచి ఫోన్‌ వస్తుంది. ‘‘అన్నా.. మా అన్న సచ్చిపోయిండు. సంవత్సరమైన శవం రాలె. మీరే ఏదన్నా చెయ్యాల’’ అని అడుగుతారు. ఆ ఫోన్లు మాట్లాడాక నా ప్రాణం నిలవదు అంటాడు బాషా.
దుబాయ్‌ రేడియో ప్రోత్సాహం..
జగిత్యాలకు చెందిన చాంద్‌బాషా అందరిలాగే ఉపాధి కోసం పాతికేళ్ల కిందట బహ్రెయిన్‌ వెళ్లాడు. సౌదీ, దుబాయ్‌లలోను కొన్నాళ్లు పనిచేశాడు. పెద్దగా చదువులేకపోయినా అరబ్బుదేశాల మంచీచెడు తెలిసినోడు. ‘‘దుబాయ్‌లో ఉన్నప్పుడు కారు డ్రైవర్‌గా పనిచేసేవాడ్ని. దూరాభారం వెళుతున్నప్పుడు కారులో ఎఫ్‌ఎం రేడియో వినడం నాకు అలవాటు. దుబాయ్‌లో ‘మీ రంజని’ అనే తెలుగు ఎఫ్‌ఎం రేడియో బాగా పాపులర్‌. ముఖ్యంగా తెలంగాణ నుంచి వచ్చిన పేదల కష్టాలు కడగండ్లు వినిపించేటోళ్లు. సాయంత్రం ఆరు గంటలకు ‘మనసులోమాట’ ప్రోగ్రాం వచ్చేది. అందులో ఎవరి కథ వారు చెప్పుకోవచ్చు. ఒక రోజున నేను కూడా – అంతదూరం నుంచీ అయినవాళ్లందర్నీ వదులుకుని ఎడారి దేశం ఎందుకొచ్చిందీ శ్రోతలకు చెప్పాను. తెలంగాణ ప్రజలు గల్ఫ్‌ దేశాలలో పడే బాధలు ఎలాగుంటాయి? ఇంటి దగ్గర కుటుంబాలు ఎలా విచ్ఛిన్నం అయిపోతున్నాయి? వంటివన్నీ చెప్పాను. ఆవిధంగా రేడియోకు తరచూ నేను ఫోన్లు చేయడం, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వారి దృష్టికి తీసుకెళ్లడం చేసేవాడ్ని. అలా రేడియో నిర్వాహకులకు తలలో నాలుకనయ్యాను. ఆ ఆసక్తితోనే – దుబాయ్‌లో జరిగే సంఘటనలను సేకరించి జగిత్యాలలోని ఆంధ్రజ్యోతికి ఫ్యాక్స్‌ ద్వారా వార్తల్ని పంపించేవాడ్ని. ఒకరకంగా గల్ఫ్‌దేశాలకు వెళ్లిన వాళ్లకు – టీవీలు, రేడియోలు, పత్రికల వాళ్లకు మధ్యన సమాచార వారధిగా పనిచేశాను..’’ అని పేర్కొన్నాడు బాషా.
ఒకసారి – దుబాయ్‌లో వీసాలు లేని తెలుగోళ్లను సొంతదేశం వెళ్లమని కఠినమైన ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. అయితే విమాన టికెట్లకు ఎవరివద్ద డబ్బులు లేవు. ‘‘అప్పట్లో వాళ్లు పడిన అవస్తలు చెప్పేవి కావు. ఆ విషయాన్ని ‘మీ రంజని’ రేడియోలో చర్చనీయాంశం అయ్యేలా చేసినవాళ్లలో నేను ఒకడ్ని. రేడియోలో లైవ్‌ పెట్టినప్పుడు కొందరు తెలుగు ప్రజాప్రతినిధులను కదిపాను. అప్పుడు వైఎస్‌ ప్రభుత్వం ఉండేది. కాంగ్రెస్‌ నేతలు విమాన టికెట్లు కొనిస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదు. కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకుని టికెట్లు అందించి.. సొంతూర్లకు పంపింది..’’ అంటున్న ఆయన.. ఆవిధంగా గల్ఫ్‌ ప్రవాసుల మనసు చూరగొన్నాడు.
దోస్తు మరణంతో మొదలు..
ఈ తిరుగుళ్ల వల్ల.. దుబాయ్‌లో ఉద్యోగం పోవడంతో జగిత్యాలకు వచ్చిన చాంద్‌బాషా.. మిత్రుడు నర్సయ్య ఇంటికి వెళ్లాడు. ‘‘నర్సయ్య ఎలా ఉన్నాడు? గల్ఫ్‌లో ఉండేవాడు. తిరిగొచ్చాడా?’’ అని అడిగాడు కుటుంబసభ్యులను. ‘‘ఎక్కడి నర్సయ్య అయ్యా! సచ్చిపోయి ఏడాది పొద్దయ్యింది. ఈనాటికీ శవం రాలే. ఎవర్ని కలవాలో యేడ చెప్పాల్లో కూడా మాకు తెల్వదు’’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు వారు. ‘‘అప్పటి నుంచే మృతదేహాలను తెప్పించే పోరాటం మొదలయ్యింది. నర్సయ్య తమ్ముడిని వెంటబెట్టుకుని.. హైదరాబాద్‌ వెళ్లి ఎంబసీకి ఫోన్లు, ఫ్యాక్స్‌లతోపాటు ఎన్‌ఆర్‌ఐ సెల్‌కు సమాచారం పంపించాను. ఆ తర్వాత ఇరవై తొమ్మిది రోజులకు మృతదేహం వచ్చింది. నేను దీన్ని ఒక పనిగా భావించలేదు. ఒక దోస్తుకు కష్టం వచ్చిందని స్పందించాను అంతే! అయితే ఆ స్పందించే గుణమే నన్ను అటువైపు లాక్కుపోతుందని అనుకోలేదు..’’ అన్నాడు. ఆ తర్వాత కొడిమెల, నమిలికొండలకు చెందిన ఇద్దరు దుబాయ్‌ వెళ్లి చనిపోయారు. సంవత్సరం నుంచి శవాలు ఆస్పత్రి మార్చురీలోనే పడున్నాయి. విషయం బాషాకు తెలిసింది. కుటుంబ సభ్యులను వెంట తీసుకుని.. వెంటనే పత్రికలకు సమాచారం ఇవ్వడం, విజ్ఞప్తి పత్రాలను అధికారులకు పంపించడం, ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకురావడం వరకు అన్ని పనులు చేశాడు. ‘‘ఎడారి దేశంలో పడున్న మృతదేహాలను తెప్పించడానికి పడేకష్టాలు అన్నీ ఒక ఎత్తు. హైదరాబాద్‌లోని విమానాశ్రయానికి శవాలు వస్తే.. అక్కడి నుండి తెలంగాణలోని సొంతూర్లకు తీసుకెళ్లేందుకు అంబులెన్సులకు కూడా పైసలు లేనోల్లే ఎక్కువమంది ఉన్నరు. చనిపోయిన మనిషికోసం పోరాటం చేయాల. ఆ మనిషిని ఊరికి తీసుకెళ్లలేని పేదరికం మీద మరొక పోరాటం చెయ్యాల. ఏమి దౌర్భాగ్యం ఇది! మా బతుకులు ఎన్నడు బాగుపడేను’’ అని చెబుతున్నప్పుడు బాషా కళ్లు చెమర్చాయి. కొన్నిసార్లు విమానాశ్రయం నుంచి తీసుకెళ్లేందుకు పైసలు పెట్టుకోలేని వాళ్లకు.. దాతలు, ప్రభుత్వ సహాయంతో తనే ముందుండి కార్యం పూర్తయ్యే వరకు అండగా నిలుస్తున్నాడు ఇతను. 2008 నుంచి బాధితులకు మృతదేహాలు అప్పగించే పనిని భుజానికెత్తుకున్న బాషా.. ఇప్పటి వరకు 365 మృతదేహాలను తెప్పించేందుకు కృషి చేశాడు. ‘‘నాకు ఫోన్లు చేసేటోళ్లు అందరు పేదోళ్లే. అది తెలంగాణ కావొచ్చు. ఆంధ్ర కావొచ్చు. పేదోళ్ల బతుకులు ఎక్కడైనా ఒకటే! అరబ్బు దేశాలలో చనిపోయిన.. తూర్పుగోదావరి, కడప జిల్లాలకు చెందిన వాళ్ల మృతదేహాలను కూడా.. వాళ్ల ఊళ్లకు తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి’’ అంటున్న చాంద్‌బాషా.. మరణించిన వాళ్ల మృతదేహాలను అయిన వాళ్లకి అప్పగించి వాళ్ల కన్నీళ్లు తుడిచేటోడు!!
నవ్య డెస్క్‌

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.