కమ్యూనిస్టులు కళ్ళు తెరుస్తారా? – ప్రొఫెసర్‌ కె.ఆర్‌. చౌదరి

కమ్యూనిస్టులు కళ్ళు తెరుస్తారా? – ప్రొఫెసర్‌ కె.ఆర్‌. చౌదరి

మాలాంటి వారికి నేడు వామపక్ష పార్టీలు ఉన్న స్థితిని చూస్తే ఎంతో బాధ కలుగుతుంది. అనేక ఆకర్షణీయ పథకాలతో ప్రజల్ని మభ్యపెట్టడానికి, పక్కదారి పట్టించడానికి పాలకవర్గ పార్టీలు పోటీలు పడి చేస్తున్న రాజకీయ జూద క్రీడ నుంచి ప్రజల్ని కాపాడవలసిన వామపక్ష పార్టీలు ఎవరికి వారే యమునా తీరుగా ఉండటం బాధాకరం. నిన్నగాక మొన్న జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కమ్యూనిస్టులు అడ్రస్‌ లేకుండా పోయిన తరువాతనైనా తాము ప్రజలకు ఎంతో దూరంగా జరిగిపోయామనే విషయాన్ని ఇప్పటికైనా గుర్తిస్తారా?
ముఖ్యంగా సీపీఐ, సీపీఎం పార్టీలు పార్లమెంటరీ ఎన్నికల ఊబిలో కూరుకుపోయి పాలకవర్గ పార్టీలతో పొత్తుల కోసం ఎగబాకిన ఫలితంగా తమ కాళ్ళ కింద మట్టి జారిపోయిందన్న నగ్నసత్యాన్ని గుర్తిస్తారా! ఈనాడు పాలకవర్గ పార్టీలలో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్నది మీమీద అసంతృప్తితో చేరినవారే కీ లక బాధ్యతలు నిర్వహిస్తున్నారన్న విషయం మీకు తెలియందికాదు. 2000 సంవత్సరంలో ప్రపంచ బ్యాంక్‌ సీఈఓనని చెప్పుకున్న చంద్రబాబు విద్యుత్‌ ఛార్జీలను భారీగా పెంచినదానికై ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహావేశాలను ఆర్గనైజ్‌ చేయటానికి తొమ్మిది వామపక్ష పార్టీలు ఒక తాటిమీదికి వచ్చి బషీర్‌బాగ్‌ కాల్పులను ఎదుర్కొనే స్థాయికి ఉద్యమాన్ని నిలబెట్టాయి. ఈ ఐక్య కార్యాచరణను నిరంతరం ప్రజాసమస్యలపై కొనసాగించి ఉద్యమాన్ని మరోస్థాయికి తీసుకెళ్ళాల్సిన వామపక్ష పార్టీలు ముఖ్యంగా సీపీఐ, సీపీఎం పార్టీలు 2004, 2009 ఎన్నికల సీజన్లలో సీట్ల కోసం పాలకవర్గ పార్టీలతో పొత్తుల రాజకీయంలో పడిపోయి ఐక్యకార్యచరణ ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో పొత్తులు బెడిసికొట్టి ఉన్నసీట్లు కూడా గల్లంతై పోవడటంతో తిరిగి ఐక్య కార్యాచరణ ఎజెండాకి రావలసి వచ్చింది. ఈ విధంగా రావటానికి తమశ్రేణుల నుంచి వత్తిడేకాక వివిధ రంగాల వామపక్ష మేధావుల వత్తిడి కూడా కారణంగా ఉంది. మొత్తంగా చూస్తే దేన్ని దేనికి లోబరచి ఉం చాలో రాజకీయ స్పష్టత లేనంత కాలం ప్రజా ఉద్యమాలు ఈ దుస్థితిని ఎదుర్కొనక తప్పదేమో! అలానే సమిష్టి నిర్ణయాలతో ఐక్యకార్యాచరణ ఉద్యమాన్ని నిరంతరంగా, బలీయంగా నడిపించటంలో పెద్దన్న, ఆధిపత్య వైఖరులు ఆటంకంగా నిలిచాయన్న వాస్తవాన్ని మిత్రులు మరచిపోకూడదు. సమిష్టి నిర్ణయాలు ఎల్లవేళలా సజీవ ఉద్యమానికి ప్రతీకలుగా నిలుస్తాయి కదా!
అలానే వామపక్ష పార్టీల ఐక్యత వేరు, ఐక్యకార్యాచరణ వేరు అన్న విషయంలో స్పష్టత ఉండాలి. ఇప్పుడు ఐక్య కార్యచరణ కొనసాగిస్తున్న వామపక్ష, విప్లవశక్తుల ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల మధ్య తీవ్రమైన సిద్ధాంత, రాజకీయ విభేదాలు ఉన్న ఫలితంగా ఏర్పడటం అసాధ్యం. అంతేకాక ఎందుకు సిద్ధాంత, రాజకీయ విభేదాలు ఉన్న ఫలితంగా ఒకే పార్టీగా ఏర్పడటం అసాధ్యం. కావున పార్టీల ఐక్యత విషయం పక్కనబెట్టి ప్రజా సమస్యలపై ఐక్యకార్యాచరణను పటిష్టంగా కొనసాగించటం ఎలా అన్న అంశంపై అందరూ దృష్టి పెట్టి ఒక నిర్దిష్టమైన అవగాహనకు రావటం అవసరం. వీరి ఐక్యతా సమస్య ఎట్లా ఉన్నా ఎంఎల్‌ పార్టీలైనా ఐక్యత అవుతాయన్న ఆశ ఉండేది.
ఎందుకనంటే ఎంఎల్‌ పార్టీలన్నీ ఆఖరికి మావోయిస్టు పార్టీ కూడా వ్యవసాయ విప్లవం ఇరుసుగా ఉండే జనతా ప్రజాస్వామిక విప్తవ లక్ష్యసాధనే ప్రధానమని ప్రకటించాయి. అయితే మావోయిస్టు పార్టీ ఎత్తుగడల రీత్యా సాయుధ పోరాట పంథా ప్రకటించి తనకు తాను దూరం పెంచుకుంది. కాబట్టి మిగతా ఎంఎల్‌ పార్టీలైనా ఒకే విప్లవ పార్టీగా ఏర్పడతాయన్న ఆశ మాలో ఉంది. అయితే ఇటీవల పరిణామాలు చూస్తుంటే ఎంఎల్‌ పార్టీల్లో చీలికలు సంభవించటం బాధాకరంగా ఉంది. ఈ పరిణామాలన్నీ విప్లవ శక్తులు బలహీనపడటానికే తోడ్పడతాయి కదా. ఈ ముఖ్యమైన అంశం విప్లవ పార్టీలకు తెలియదని అనుకోలేము కదా! అంతేకాదు చీలిపోయిన తరువాత ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ‘విమర్శ’లు చూస్తుంటే విప్లవ పార్టీ లు ఇంత చౌకబారు విమర్శలు చేసుకుంటాయా అనిపిస్తోంది.
గత ఆచరణల నుంచి బయటపడటానికి బదులు మరింతగా అవే విధానాలలో కూరుకుపోవటం బాధాకరం. ఈ విషయాన్ని పక్కన పెడితే ఎంఎల్‌ పార్టీలు ఐక్యతా క్రమాన్ని పూర్తిచేసుకోవటానికి ప్రజా సమస్యలపై ఐక్య కార్యచరణ చాలా అవసరం కదా! ఈ అవసరాన్ని గుర్తించి ఐక్యకార్యచరణ ప్రయత్నాలు చేశాయి. కానీ దాన్ని ఏ కారణాల చేత కొనసాగించలేకపోయాయో అర్థంకాని స్థితి! దీన్ని కొనసాగించలేకపోవటానికి ఏ యిజాలు ఆడ్డపడుతున్నాయో పరిశీలించుకోవటం అవసరం కదా! విప్లవ పార్టీల మధ్య ఐక్య కార్యాచరణ ఒక క్రమంలో పార్టీ ఐక్యతకు తోడ్పడిన అనుభవాలు కూడా ఉన్నాయి కదా. ఈ పరిస్థితులు ప్రజా వ్యతిరేక విధానాలను అమలుపరిచే పాలకవర్గ పార్టీలకు ఎదరులేకుండా పోతుంది కదా. ఇప్పటికే కమ్యూనిజానికి కాలం చెల్లిందని పథకం ప్రకారం దాడి చేస్తున్న పాలకవర్గాలు మరింతగా పెట్రేగిపోవటానికి చేతులారా అవకాశం ఇవ్వటమే కదా. మరోవైపు అస్తిత్వ వాద శక్తులు మార్క్స్‌ చాలడు అంబేడ్కర్‌ కావాలంటూ సంఘటిత ఉద్యమాలను బలహీనపరచే విధంగా చాప కింద నీరులా కదలాడుతున్నాయి. పాయలు పాయలుగా ప్రవాహాలు (ఉద్యమాలు) సాగింనంతకాలం పాలకవర్గ పార్టీ ప్రయాణం నల్లేరుపై బండిలా సాగుతుంది కదా! వామపక్ష, కమ్యూనిస్టు శక్తులు బలహీనంగా ఉండబట్టే ఈ ప్రవాహాల ఉధృతి పెరిగిందనేది కూడా గమనించాల్సిన విషయం. వామపక్ష, కమ్యూనిస్టు శక్తులు మరింతగా బలహీనపడటానికి ముఖ్యకారణం ఉద్యమంలో కలసి వచ్చే విస్తృతం చేసే, బలీయం చేసే, ఒక దశలో నాయకత్వం వహించే ప్రజాస్వామిక శక్తులను నానాటికి దూరం చేసుకోవటం ముఖ్యకారణం కాదా! ఆఖరికి వామపక్ష మేధావులను కూడా దూరం చేసుకోవటం మరింత బాధాకరం. విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, పౌరహక్కుల రంగాలు నిర్వహించే సభలు, సదస్సులలో సామాజిక అవగాహనతో మాట్లాడే మేధావులను వెతుక్కోవలసి రావటం విచాకరం కాదా! ఇది వాస్తవం కాదా!
ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న, ప్రజలకు చెందాల్సిన ప్రకృతి వనరులను ప్రత్యేక ఆర్థిక మండళ్ళ పేరుతో పార్లమెంటు సాక్షిగా చట్టాలు చేసి బహుళజాతి విదేశీ సంస్థలకు కట్టబెడుతూ ఉంటే, గతంలో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను ఏకంగా చట్టాలు చేసి హరించి వేస్తుంటే, సమస్త రంగాలను విదేశీ పెట్టుబడులతో ముంచేస్తూ ఉంటే, భవిష్యత్తులో ప్రజల జీవితాలు ఎంత ఘోరంగా మారబోతున్నాయో తలచుకుంటే వళ్ళు గగుర్పొడుస్తుంది. అన్ని వైపుల నుంచి చుట్టుముడుతున్న సంక్షోభం నుంచి విశాల ప్రజానీకం హక్కులను కాపాడాలంటే, దేశభక్తియుత, సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రజా ఉద్యమ నిర్మాణానికి వామపక్ష, కమ్యూనిస్టు శక్తులు నడుం కట్టాలి. ఈ ఉద్యమంలో ఇంతకాలం దూరం చేసుకున్న వామపక్ష మేధావులను, ప్రజాస్వామిక,, లౌకికశక్తులను ఉద్యమ శక్తులుగా నిలబెట్టి నిరంతర ప్రజా ఉద్యమాన్ని నిర్మించే లక్ష్యానికి పూనుకోవటం ఎన్నటికంటే నేడు ఎంతో అవసరం. సమస్త రంగాల ప్రజలు ఉద్యమ బాటలో అడుగుపెట్టి వడివడిగా అడు గులు వేసినప్పుడే అది ప్రజా ఉద్యమంగా రూపుదాలుస్తుంది. లాంగ్‌ మార్చ్‌ విజయవంతం కావాలంటే ఈ ఉద్యమ దశలు అన్నీ దాటి తీరాలి కదా! నేడు తరుముకొస్తున్న సామాజిక పరిణామాల నేపథ్యంలోనైనా వామపక్ష, కమ్యూనిస్టు శక్తులకు జ్ఞానోదయం కావాలని కోరుకోవటం అత్యాశ మాత్రం కాదు.
– ప్రొఫెసర్‌ కె.ఆర్‌. చౌదరి
వ్యవసాయరంగ శాస్త్రవేత్త
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.