| వందేళ్ల కవికి వందనాలు – ముకుంద రామారావు
|
|
నికొనార్ పారా కవితలు నిర్మొహమాటంగా మాటాడతాయి. ఖచ్చితమైన అభివ్యక్తి వాటిల్లో కనిపిస్తుంది. భౌతిక శాస్త్రపు గణిత సిద్ధాంతాల్ని పోలి ఉంటాయి. తన చుట్టూ ఉండే వాటినే కవిత్వం చేశారు పారా. సాధారణ భాష నుంచి, స్వీయపోరాటాలు, అనుభవాలు, తననితాను ప్రశ్నించుకునే తాత్వికత వరకూ పారా కవిత్వం కొనసాగుతుంది. అయినా ఆయన కవిత్వమంతా ఏదో వెదుకులాట!
ప్రసిద్ధుల శతాబ్ది ఉత్సవాలు ఇటీవల విరివిగానే జరుగుతున్నాయి. మనకు తెలిసిన ఈ ఉత్సవాలు అన్నీ మరణానంత రం జరిగేవే. శతాబ్ది ఉత్సవాన్ని, జీవించి ఉండగానే చూసుకునే అదృష్టవంతులు అరుదుగానే ఉన్నా, అసలే లేకపోలేదు. అలాంటి అరుదైన వారే ఈ ఏడాది శతాబ్ది ఉత్సవాల్ని జరుపుకుంటున్న- అనేక ప్రశంసలు, విమర్శలకు నోచుకున్న, లాటిన్ అమెరికా చిలీ దేశపు ప్రముఖ కవి నికొనార్ పారా (1914-). ఇటీవలే సెప్టెంబరు5కు, నూరేళ్లు పూర్తిచేసుకున్న సజీవ కవి పారా. పారా లాటిన్ అమెరికా సమకాలికుల్లో నోబెల్ బహుమతి గ్రహీతలు – చిలీ దేశానికే చెందిన కవయిత్రి గబ్రియేలా మిస్ర్టాల్ (1889-1957), పాబ్లో నెరూడా (1904-1973) మెక్సికోకి చెందిన ఒక్టా వియో పాస్ (1914-1998) లాంటి వారున్నారు. కాకతాళీయంగా పాస్ శతాబ్ది ఉత్సవాలు కూడా ఈ ఏడాదే జరుపుకుంటున్నారు. పారా సైతం నోబెల్ బహుమతికోసం అర్హుడుగా రెండుసార్లు పరిశీలనలో ఉన్నారు. అకవిత్వం అన్న ప్రక్రియకు పారా సృష్టికర్త. సాంప్రదాయక కవిత్వ పద్ధతుల్ని శైలుల్ని తిరస్కరించే కవిత్వం. సరళమైన ప్రత్యక్ష భాషతో, విలక్షణం తరచుగా విడ్డూరమైన సాధారణ అనుదిన ప్రపంచ సమస్యల్ని ప్రస్తావిస్తూ, పరిహాసంగా సాగే కవిత్వం. కవిని ఒక ప్రవక్తలా భావించి, కవిత్వానికి ఏదో మహాత్మ్యం ఉందన్న నమ్మకాన్ని తిరస్కరించడానికి మొదలెట్టిన ఒక ప్రక్రియ. వ్యావహారిక భాషని, ఒక్కోమారు అమర్యాదకర భాషని, ప్రాచీన పద్ధతుల్ని తేలికచేస్తూ, చమత్కారంగా రాసే ప్రక్రియ. రోజువారీ అనుభవాల్ని, భాషని, వస్తువుగా తీసుకోవడం ఇందులో కనిపిస్తుంది. శుద్ధ అలంకారప్రాయమైన కవిత్వం నుంచి రోజువారీ అభివ్యక్తిలోకి మార్చడం, గూఢార్ధాలు లేకుండా చేయడం, అలా సాహిత్య సంప్రదాయాల్ని ఎదిరిస్తూ తన స్వీయ స్వరాన్ని తెలుసుకోవ డం, కవిత్వ సంప్రదాయాల్ని ప్రశ్నించమని పాఠకుడ్ని ప్రోత్సహించడం, ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశ్యం. పారా ఈ కవిత్వ ప్రక్రియ మొదలెట్టకముందు, యుక్తవయస్సులోను అంతకుముందు కూడా, పూర్తిగా అధివాస్తవికతావాది. 1930 చివర్లో, పారా ప్రసిద్ధ అమెరికన్ కవి వాల్ట్ విట్మన్ కవిత్వం ఇష్టపడ్డా, ఆ తరువాత వారి కవిత్వమూ నచ్చక, అధివాస్తవికతావాదం వైపు మొగ్గారు. కాఫ్కాని చదువుకున్నారు. వీరిని ఎక్కువ ప్రభావితం చేసి, 1940 చివర్లో వారి అకవిత్వ ప్రక్రియకు దోహదం చేసినవారిలో ముఖ్యులు- జాన్‌డోన్నె (1572-1631), డబ్ల్యూహెచ్ ఆడెన్ (1907-1973), సెసిల్ డే లెవిస్ (1904-1972), స్టీఫెన్ స్పెండెర్ (1909-1995), సెజార్ వల్లెజో (1892-1938), మరీ ముఖ్యంగా టి.ఎస్. ఎలియట్ (1888-1965). ఈ ప్రక్రియకు రావడానికి ఆయనకు అనేక సంవత్సరాలు పట్టింది. కవిత్వానికి జీవితానికి మధ్య ఎంతో దూరం ఉందని, 1930లో వారి వైజ్ఞానిక సాపేక్ష నేపథ్యంతో తెలుసుకున్నారు. సాధారణ జీవితం మీద ఆధారపడ్డ సామాన్య జనుల సర్వసాధారణ సమస్యల్ని ప్రతిబింబించే స్థానిక భాషా కవిత్వం అవసరం అని తేల్చుకున్నాక ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఆరంభంలో పారా కవిత్వ అవగాహన నెరూడా అపరిశుద్ధ కవిత్వం వైపే ఉండింది. అది సాధారణ అనుభవాన్ని ముతక భాషతో మానవజాతిని కలపడంలా వీరికి ఆ తరువాత అనిపించింది. మరీ అలంకారపూరిత నెరూడా పద్ధతిని, కవిత్వ భాషని కాదని- పక్షులు పాడనీ, మనుషులు మాటాడనీ అన్న పద్ధతిలో తన కవిత్వాన్ని మళ్లించుకున్నారు. దానికి మూడు లక్ష్యాలు వీరు నిర్దేశించుకున్నారు. 1. రూపకాలనుండి కవిత్వాన్ని తప్పించి పాఠకుడితో ప్రత్యక్ష వర్తమానం జరపడం 2. కవిత్వ భాష, ప్రజల జీవితాన్ని ప్రతిబింబించే సాధనం కావడం 3. నిర్దిష్టమైన సామాజిక వాస్తవికతని ప్రతిబింబించే కవిత్వ భాషని స్థానీకరించడం. గత వ్యామోహంతో బాటు ప్రపంచంలోని అరాజకత్వం మానవస్థితుల పట్ల ఏవగింపు, పారా కవిత్వంలో కనిపించే సాధారణ విషయాలు. వీరి అకవిత్వ ప్రక్రియలో, కవిత్వంలోని కాల్పనికతకు బదులు ప్రపంచంలోని వాస్తవికతని వాడుకున్నారు. సామాజిక రాజకీయ హింసను నిష్కపటంగా ఎదిరించే మనస్తత్వం. ఏ ఒక్క భావజాలానికీ లొంగలేదు. సాంస్కృతిక ప్రపంచం, మానవ పరిస్థితుల పట్ల వీరి స్థిరమైన ప్రతిక్రియ ఎప్పుడూ చమత్కారం, వ్యంగ్య పూరితం. పారా గణిత శాస్ర్తాన్ని, భౌతిక శాస్ర్తాన్ని చదువుకున్నారు. 1952 నుంచి 1991లో పదవీవిరమణ వరకూ సైద్ధాంతిక భౌతిక శాస్ర్తాన్ని చిలీ విశ్వవిద్యాలయంలో బోధించారు. మార్క్సిస్ట్ పక్షపాతిగా పారాని అనేకులు విమర్శిస్తారు. పారా కవితలు వ్యక్తిగతంగా నిర్మొహమాటంగా ఎవరి ప్రమేయం లేకుండా మాటాడతాయి. ఏ విధమైన వ్యాఖ్యానం అవసరం లేకుండా ఆయన అనుభవపు ఖచ్చితమైన అభివ్యక్తి వాటిల్లో కనిపిస్తుంది. భౌతిక శాస్త్రపు గణిత సిద్ధాంతాల్ని పారా కవితలు పోలి ఉంటాయి- పదాల వాడుకలో పొదుపు, రూపకాలు లేకుండా, అలంకారిక భాష లేకుండా. అవి నెరూడా ప్రతీకాత్మక వ్యక్తి ప్రధాన వాదానికి వ్యతిరేకంగా వాడుకున్నట్టుంటాయి. తన పిల్లల పిల్లలు మాటాడుకునేది, పనిపిల్ల రోసిట అవెండనో మాటాడేవి, యాదృచ్ఛికంగా తిరిగేవారి మాటలు, ఆయన రచనకు పనికొచ్చాయి. మనచుట్టూ కవిత్వం ఉందని నమ్మే పారా, తన చుట్టూ ఉండే వాటినే కవిత్వం చేయడానికి అలవాటుపడ్డారు. అమితమైన తన అసంతృప్తిని పారా, నిందాస్తుతి, వ్యంగ్యం, క్రౌర్యం ద్వారా తెలియజేస్తారు. సాధారణ భాషనుంచి, స్వీయపోరాటాలు, అనుభవాలు, సమయాన్ని, తననితాను ప్రశ్నించుకునే తాత్వికత వరకూ పారా కవిత్వం కొనసాగుతుంది. అయినా పారా కవిత్వమంతా ఏదో వెదుకులాట, పోరాటం, మనస్ఫూర్తైన అభివ్యక్తి, చివరికి ఒక ఆశగా మనకు తారసపడుతుంది. అయితే కొందరికి పారా అకవిత్వం నీతిబాహ్యంగా అనిపించింది. కారణం – స్ర్తీలు, మతం, సుగుణం, అందం పట్ల ఒక విధమైన చులకన భావం అందులో కనిపించడం. కానీ అది, పారా అకవిత్వంతో చెప్పాలనుకునేదాన్ని అపార్థం చేసుకోవడమేనని, పారా ఏదో నీతిబాహ్యమనుకున్నవి రాయాలని రాయలేదని, సాధారణ ప్రజలకు అర్థమయ్యే భాషలో వారితో మాటాడటంగా దానిని అర్థం చేసుకోవాలని విమర్శకులు అంటారు. ‘రచనలు లేవనెత్తే ప్రశ్నలకు రచయిత జవాబు చెప్పడు/ అది పాఠకుడికి కఠినంగా ఉండొచ్చు/ కానీ ఇప్పటినుంచీ అది వారు అంగీకరించక తప్పదు’ అని ‘పాఠకుడికి హెచ్చరిక’ అన్న కవితలో పారా జవాబు చెప్పుకున్నారు. 1938లో పారా ‘అనామక పాటల పుస్తకం’ కవిత్వ సంకలనం వచ్చింది. 1949లో మొదటిసారి ‘కవితలు అకవితలు’ సంకలనం వచ్చింది. 1958-1967 మధ్య కాలంలో వీరివి నాలుగు కవితా సంకలనాలొచ్చాయి. 1969లో వీరి కవిత్వ కృషిని గుర్తిస్తూ చిలీ జాతీయ సాహిత్య బహుమతి పొందారు. వీరి షేక్స్ పియర్ ‘కింగ్ లియర్’ స్పానిష్ అనువాదం అందరినీ అకట్టుకుని అమితంగా అమ్ముడుపోయింది. రష్యన్ భాష నుంచి స్పానిష్ లోకి జరిగిన అనువాదాలకు పర్యవేక్షకుడు గా ఉన్నారు. దాదాపు 20 వరకూ కవిత్వ సంకలనాలొచ్చాయి. ఆంగ్లంలో వీరి కవిత్వ అనువాదాన్ని చేసి ప్రపంచానికి వీరిని పరిచయం చేసిన వారు మిల్లర్ విలియమ్స్. తెలుగులో పారాని మొట్టమొదట పరిచయం చేసినవారు స్వర్గీయ స్మైల్. రానురాను పారా కవిత్వం రాజకీయ రంగు పులుముకోవడం మొదలయింది. ఎగతాళి చమత్కార పూరితమైన లఘు కవితలు బొమ్మలతో సహా రాయడం మొదలెట్టారు. కొన్నాళ్లకు అదే, ఊరూరు తిరిగి ప్రచారం చేసేవాడిలా బోధనల కవిత్వంగా మారింది. అది చిలీలోని మతం, విత్తం, మానవహక్కుల ఉల్లంఘన, రాజకీయాల మీద వ్యాఖ్యానాలుగా పనికొచ్చింది. మొట్టమొదటి నోబెల్ కవయిత్రి గబ్రియేలా మిస్ర్టాల్, పారాని ఎంతగానో ప్రోత్సహించింది. అయితే నెరూడాతో ఈతడి సంబంధాలు అంత గొప్పగా లేవు. తనకంటే పదేళ్లు పెద్దవాడైన నెరూడాతోను, నెరూడా కవిత్వంతోను పారా విభేదించేవారు. నెరూడా మాత్రం పారా అత్యంత తెలివైనవాడని, మా స్పానిష్ భాషలోను పశ్చిమ దేశాల్లోను, గొప్ప కవి అని, బాగా చదువుకోని వారికి, కొత్త తరానికి, పారా సరికొత్త మార్గాన్ని చూపించారని ఒప్పుకున్నారు. పారా కవిత్వ వ్యూహాల్ని కొన్ని నెరూడా కూడా అనుకరించారు. పేరుబడ్డ కుటుంబం నుంచి 5 సెప్టెంబర్ 1914లో సాన్ ఫాబియన్, చిలీలో, నికొనార్ పారా జన్మించారు. సముద్రాన్ని నిరంతరం చూసేందుకు కొండకొమ్ముమీద కట్టుకున్న ఇళ్లు. అకవిత్వం అని రాసి ఉన్న ఇంటి ముందుగది తలుపు. 1940లో మొదటి వివాహం, 1951లో మరొకటి, వివాహం చేసుకోకుండా మరికొన్ని అలా చేసుకుంటూ పోతూ 1998 నుంచి దాదాపు ఒంటరిగానే ఉంటున్నారు. ‘స్వేచ్ఛ, విగ్రహంగా మారిన దేశం అమెరికా’ అని చెప్పగలిగిన కవి పారా. ‘అతి చెడ్డది వెనకుంది. జీవనం కంటే చెడ్డ అవమానం మరేదీ లేదు.’ అని తన సమాధిమీద రాయించుకోవాలనుకున్న కవి. మరణం తప్ప అన్నీ తెలుసుకోగలిగారు, దానిమీద ఎవరైనా ఎందుకు దృష్టి కేంద్రీకరించరు అని అందరన్నీ అడుగుతారు. ప్రణాళిక అన్న కవితలో వారి కవిత్వ ప్రణాళికని ఇలా చెప్పుకున్నారు – ‘మనం తిరస్కరిస్తు న్నాం/ రంగుటద్దాల కవిత్వాన్ని/ కత్తి కటార్ల కవిత్వాన్ని/ తురాయి టోపీల కవిత్వాన్ని/ దాని బదులు మేము ప్రతిపాదిస్తున్నాం/ మామూలు దృష్టి కవిత్వాన్ని/ రోమమయ ఛాతీ కవిత్వాన్ని/ టోపీలేని బోడి కవిత్వాన్ని’. ‘యువకవులు’ అన్న మరో కవితలో వారికి సలహాగా అన్నట్టు – ‘నీకు నచ్చని శైలిలో/ నీకెలాతోస్తే అలా రాయు/ ఒకే మార్గం సరైందని నమ్మిస్తూ/ వంతెనకింద చాలా రక్తం పారింది/ అనుమతులు అన్నింటికీ ఉన్నాయి కవిత్వంలో/ ఒకే ఒక్క షరతు/ తెల్ల కాగితాన్ని బాగుపరుస్తే చాలు’ అని చెప్పుకున్నారు. నికోనార్ పారా – తాను నమ్మిన సిద్ధాంతాన్ని, ప్రక్రియని, అద్భు తంగా నిర్వహించి వందేళ్లకు పైగా జీవించడం లాటిన్ అమెరికాలోని చిలీ ప్రజలకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కవులందరికీ ఆనందదాయకమైన విషయం. వారు మరో వంద సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు. కొందరికి పారా అకవిత్వ ప్రక్రియ నీతిబాహ్యంగా అనిపించింది. ‘రచనలు లేవనెత్తే ప్రశ్నలకు రచయిత జవాబు చెప్పడు. అది పాఠకుడికి కఠినంగా ఉండొచ్చు. కానీ ఇప్పటినుంచీ అది వారు అంగీకరించక తప్పదు’ అంటూ ‘పాఠకుడికి హెచ్చరిక’ అన్న కవితలో పారా జవాబిచ్చారు. – ముకుంద రామారావు 9908347273 |
వీక్షకులు
- 1,107,701 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఈ ఆలోచన ఆయనకేనా ?మనకూ రావద్దా ?వస్తే ఎంత బాగుండు ?
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,555)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు


