కవిత్వంలో ఆత్మకధ రాసుకొన్న మేరీ జాన్ తొత్తం
మేరీ జాన్ తొత్తం కేరళకు చెందిన కవయిత్రి .మధ్య కేరళలో ఇతికార గ్రామం లో తోత్తాహిల్ కుటుంబం లో 1901లో జన్మించింది .కుటుంబం లో పెద్దమ్మాయి .చిన్నప్పటి నుండే కవిత్వం రాయటం ప్రారంభించింది .మొదటి కవితా సంపుటి ‘’గీతా వళి’’ని 1927లో ప్రచురించింది .ప్రేమలో విఫలమై విరక్తికలిగి సన్యాసిని గా మారింది .ఆ కాలం లో సెయింట్ థామస్ దేశమంతా పర్యటించి క్రిస్టియన్ మత ప్రచారం బాగా చేసి ,మత మార్పుకు ఎక్కువ తోడ్పడ్డాడు .సిరియాలోని క్రిస్టియన్ చర్చి కేరళలో ఒక బ్రాంచి ని ఏర్పాటు చేసింది .కేధాలిక్ మతనికి చెందిన మేరీ జాన్ వెంటనే అవకాశాన్ని ఉపయోగించు కొని చేరింది .ఒక్క కేరళలోనే కాదు ఆ సమయం లో దేశం లో చాలాచోట్ల మత మార్పిడులు జరిగి ఎకువ మంది క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారు .మేరీ తానూ ప్రపంచాన్ని రోసి అవివాహితగా ఉండిపోయి సన్యాసినిగా మారిపోతానని చేసిన నిర్ణయం ఆ నాడు పెద్ద సంచలనమే కల్గించింది .ప్రజలందరూ కధలూ గాధలుగా ఆ విషయాన్ని చెప్పుకొన్నారు .
మేరీ జాన్ ఇప్పుడు ‘’సిస్టర్ మేరీ బెగీనా’’గా మారింది .తన కవితా ధారను మాత్రం ఆపకుండా నిరంతరం ప్రవహింప జేస్తూనే ఉంది .1929లో ‘’కవితారామం ‘’ను ,1934లో ‘’ఈశ ప్రసాదం ;;(జీసెస్ బ్లెస్సింగ్స్ ),1936 లో ‘’ఆత్మ వింతే సంగీతం’’ (ఆత్మ సంగీతం )1968లో ‘’అంతి నక్షత్రం ‘’(ట్విలైట్ స్టార్ )రాసి ముద్రించింది .అసలైన ఆమె మాగ్నం ఓపస్ రచన 1970లో ‘’మార్ తోమా విజయం ‘’(ది విక్టరి ఆఫ్ సెయింట్ ధామస్).దాదాపు ఆమె కవిత్వం అంతా రొమాంటిక్ గానే ఉంటుంది .కవితారామం ఇరవై ప్రచురణలు పొందటం దానికున్న ఆదరణ తెలియ జేస్తుంది .ప్రకృతిని వాస్తవ స్వరూపం గా భావించి ఆరాధించింది .ఆమె కవిత్వం లో ఆత్మ ప్రయాణం కనిపిస్తుంది .ఎనభై నాలుగేళ్ళు జీవించి సిస్టర్ మేరీ బెగీనా1985లో మరణించింది .
మేరీ రాసిన కవితలకు డాక్టర్ వారియర్ అనే సంగీతజ్ఞుడు ,-మోహన ,హిందోళ ,తోడి ,మధ్యమావతి అనే నాలుగు రాగాలలో వరుసలు కూర్చాడు .1928లో తన ఆత్మకధ గా ‘’లోకేం యాత్ర ‘’(ఫేర్వెల్ టు ది వరల్డ్ )రాసిన కవితలు కేరళలో చదువురాని వారు కూడా విని బట్టీ పట్టి అనుభూతి పొందుతారు .ఇందులో ఆమె జీవన గమనం ,కస్టాల కడలిలో ధైర్యం తో ఎదురీది అనుకొన్నది సాధించే ప్రయత్నం అంతా ఉంటుంది .అందుకే అది వారికి ఒక పారాయణ గ్రంధమే అయింది .తన స్నేహితులను ,బంధువులను ,ప్రకృతిని ,గత జీవితానిన్ని ,చుట్టూ ఉన్న భౌతిక వాతావరణానికి,’’నన్’’అంటే సన్యాసినిగా మారటానికి ముందున్న సమస్తానికి ఇది వీడ్కోలు గీతం .తానూ ఎమీమి కోల్పోతున్నానో ప్రతిదానినీ నెమరేసుకొని’’ టాటా బై బై ‘’చెప్పే కవితలివి .తాను వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచం పొందే వెలితికి ప్రాధాన్యం ఇవ్వలేదు .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-11-14-ఉయ్యూరు

