ఇందర్ మల్హోత్రా మనో వేదన -చరిత్రలో నెహ్రు

చరిత్రలో నెహ్రూ – ఇందర్‌ మల్హోత్రా
జవహర్‌లాల్‌ నెహ్రూని అభిమానించని వారు వుంటారా? ఉంటారని గత కొన్ని దశాబ్దాలుగా చోటుచేసుకొంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. నెహ్రూ వ్యక్తిత్వం, విధానాలపై అడ్డూ, అదుపూ లేని విమర్శలు ఇప్పుడు పరాకాష్ఠ నందుకొంటున్నాయి. యావజ్జీవితమూ దేశ సేవకు అంకితం చేసిన ఆ మహోన్నతుడితో పోల్చదగిన వారు అరుదు. జీవితకాలంలో ఆబాలగోపాలంచే ఎంతగా ప్రేమాదరాలు పొందారో అంతగా ఇప్పుడు ఆయన అపనిందలు ఎదుర్కొంటున్నారు. స్వతంత్ర భారత ప్రథమ ప్రధానిని అప్రతిష్ఠ పాలుచేసే ప్రచారోద్యమ ఉధృతి పెరుగుతుందేగానీ తగ్గడం లేదు. నిజమే, నెహ్రూ గుణనిధి కాదు. సామాన్యులు, అసామాన్యులు అందరివలే ఆయనా తప్పులు చేసారు. కొన్నిసార్లు మహా ఘోరమైన తప్పులు చేశారు. ముఖ్యంగా చైనా విషయంలో చాలా పొరపడ్డారు. నెహ్రూ చేసిన తప్పులను తీవ్రంగా విమర్శించాల్సిందే.
అయితే స్వతంత్ర భారతదేశంలో అపమార్గం పట్టిన, అపసవ్యంగా జరిగిన ప్రతిదానికీ నెహ్రూను బాధ్యుడినిచేస్తూ ఆయన స్మృతిని కించపరచడానికి ఎడతెగని ప్రయత్నం చేయడం గర్హనీయం కాదా? అంగీకార యోగ్యంకాని ఈ దూషణోద్యమం వెనుక రెండు ప్రధాన శక్తులున్నాయి. మొదటి బృందంలోని వారు అమాయకులని చెప్పాలి. వీరిలో అత్యధికులు నెహ్రూ మరణాంతరం జన్మించిన వారు. స్వేచ్ఛావిపణిని, ప్రపంచీకరణను విశ్వసించేవారు. వలసపాలన నుంచి విముక్తమైన మరుక్షణంనుంచీ స్వేచ్ఛా వాణిజ్య విధానాలను అనుసరించనందుకు నెహ్రూను తప్పుపట్టే వీరికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన దేశం ఎలా ఉండేదన్న విషయమై అవగాహన లేనివారు. రాజకీయంగా, ఆర్థికంగా, మరెన్నో విధాల భారత్‌ను అభ్యుదయ పథంలోకి నడిపించడంలో నెహ్రూ కృషి గురించి తెలియని తరమిది.
నెహ్రూని విమర్శించే రెండో బృందం వారు మొదటి వారికంటే మరింత ద్వేషపూరితంగా, పెడరసంగా వ్యవహరించ డంలో సుప్రసిద్ధులు. కరడు గట్టిన హిందూత్వ వాదులు ఈ బృందంలో అత్యధికంగా ఉన్నారు. నెహ్రూ లౌకికవాద సంస్కృతిని రూపుమాపడానికి వీరు ఎంతగా కష్టపడినప్పటికీ సఫలంకాలేకపోతున్నారు. ఈ వైఫల్యం వీరిని మరింతగా నెహ్రూ ద్వేషులుగా చేస్తోంది. భారతీయ జనతా పార్టీ సొంతంగా, స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రావడంతో హిందూత్వ తీవ్రవాదులు మరింతగా చెలరేగిపోతున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మతసామరస్యాన్ని దెబ్బతీసి ప్రజల మధ్య చీలికలు సృష్టించే ప్రకటనలు నిర్భయంగా చేస్తున్నారు. వారిని నిలువరించేవారు ఎవరూ కన్పించడం లేదు.

యోగి ఆదిత్యనాథ్‌, సాక్షి మహరాజ్‌ ఇత్యాది ద్వితీయ శ్రేణి నాయకులను అలా ఉంచండి. సాక్షాత్తు సంఘ్‌పరివార్‌ అధినేత, రాషీ్ట్రయ స్వయంసేవక్‌ సంఘ్‌ సర్‌సంఘ్‌ చాలక్‌ మోహన్‌ భగవత్‌ మహాశయుడు ఏమన్నారో చూడండి. ‘హిందుస్థాన్‌లో నివసించే ప్రతి ఒక్కరూ హిందువే’ అని ఆయన అన్నారు. హిందుస్థాన్‌లో నివసించేవారు హిందుస్థానీలని, వీరిలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, పార్శీలు మొదలైన వారు ఉన్నారనే వాస్తవాన్ని ఎవరైనా ఈ పెద్ద మనిషికి దయచేసి తెలియజేస్తారా! ఈ మత సంకుచితత్వాన్ని నిరోధించడానికి ప్రధాని మోదీ ఇంతవరకు చేసింది చాలా స్వల్పం. అయితే తన అనుయాయులు, అభిమానులు మతం ప్రాతిపదికన హింసాత్మక ఘర్షణలను ప్రారంభించడంలో సఫలమయితే అభివృద్ధి సాధన గానీ, పాలనావ్యవహారాలను సజావుగా నడపడం సాధ్యం గాదనే సత్యం మోదీకి త్వరలోనే తెలిసివస్తుందని ఆశిస్తున్నాను. అయోధ్యలో రామాలయాన్ని నిర్దిష్ట గడువులోగా నిర్మించాలనే డిమాండ్‌ను వదిలిపెట్టేలా హిందూత్వ తీవ్రవాదులకు ప్రధాని మోదీ నచ్చజెప్పగలగడం భవిష్యత్తుపై ఒక ఆశావహ, ప్రోత్సాహకర భరోసాను కల్పిస్తోంది.
ఇదే సమయంలో మనం సిగ్గు పడాల్సిన పరిణామం ఒకటి చోటు చేసుకున్నదనే వాప్తవాన్ని విస్మరించకూడదు. గత ఆదివారం నాడు మోదీ మంత్రిమండలి విస్తరణలో బీహార్‌కు చెందిన బీజేపీ నాయకుడు గిరిరాజ్‌ సింగ్‌కు కూడా చోటు లభించింది! దీనినెలా అర్థం చేసుకోవాలి? గత వేసవిలో సార్వత్రక ఎన్నికల సందర్భంగా ‘మోదీకి వ్యతిరేకంగా ఓటువేసిన వారికి భారత్‌లో స్థానం లేదు. వారిని పాకిస్థాన్‌కు పంపించి వేయాలి’ అని ప్రకటించింది ఈ గిరిరాజ్‌ సింగ్‌ మహాశయుడే కాదూ? ఆ అప్రజాస్వామిక ప్రకటనను గిరిరాజ్‌ ఇప్పటికీ ఉపసంహరించుకోలేదు. పైగా మరింత గట్టిగా పదే పదే పునరుద్ఘాటిస్తున్నారు ఆ బెదిరింపు ప్రకటనను. ఇప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్న అప్పటి బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌, గిరిరాజ్‌ సింగ్‌ ప్రకటనతో తమ పార్టీకి ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. అంతే గానీ తమ పార్టీ సభ్యుడిని ఏ విధంగానూ మందలించలేదు. చివాట్లు పెట్టకపోగా ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రిమండలిలో చోటు కల్పించారు!

ఈ నేపథ్యంలో మనం జవహర్‌లాల్‌ నెహ్రూ 125వ జయంత్యుత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ శుభ సందర్భంలో నెహ్రూ సమున్నత వ్యక్తిత్వం (ఆయన చేసిన తప్పులతో సహా) గురించి సర్వత్రా చర్చలు జరగకుండా ఎలా ఉంటాయి? జరుగుతున్నాయి కూడా. ఈ చర్చల ద్వారా, దేశ జనాభాలో మూడింట రెండు వంతులుగా ఉన్న 35 ఏళ్ళ వయస్సు లోపు యువజనులకు ఆ ఉదాత్త చరిత్ర నిర్మాత గురించి వాస్తవాలు తెలుసుకునే అవకాశం లభిస్తోంది. ఇది మాలాంటి వారికి ఎంతైనా సంతోషకరమైన విషయం. ఇప్పటికే పత్రికలు, టీవీల్లో జరిగిన చర్చల సారాంశాన్ని క్లుప్తంగా చెబుతాను. నెహ్రూ గురించి చాలా విమర్శలు చేశారు. వాటిలో కొన్నిటిని ఒప్పుకోక తప్పదు. అయితే చాలా విషయాలపై ఏకాభిప్రాయం ఉన్నది. మనకాలంలో మహాత్మా గాంధీ తరువాత ద్వితీయ మహోన్నత భారతీయుడు జవహర్‌లాల్‌ నెహ్రూ అనే విషయమై అందరూ ఏకీభవించడం వాటిలో చాలా ముఖ్యమైనది.
స్వాతంత్ర్యోద్యమ కాలంలో మహోన్నతులైన నాయకులు ఇంకా పలువురు ఉన్నారు. వారందరూ మహాత్మాగాంధీ మార్గదర్శకత్వంలో దేశానికి సమర్థమైన నాయకత్వాన్ని సమకూర్చారు. వల్లభ్‌భాయ్‌ పటేల్‌, మౌలానా ఆజాద్‌, రాజాజీగా చిరస్మరణీయుడైన సి.రాజగోపాలాచారి తదితరులు వారిలో కొందరు. అయితే పటేల్‌ మినహా వీరిలో ఎవరూ నెహ్రూతో సమస్థాయి నేతలు కాదు. నిజానికి 1947 ఆగస్టు నుంచి 1950 డిసెంబర్‌ వరకు భారత్‌ను ‘పండిట్‌జీ’, ‘సర్దార్‌’గా ప్రజలు గౌరవించిన ఈ నాయకులిరువురూ పరిపాలించారనడం సత్యదూరం కాదు. అయితే దృక్పథం, భావజాలం, చివరకు పనిచేసే తీరుతెన్నుల్లో కూడా పరస్పరం పూర్తిగా భిన్నమైన వారు. తరచు తగాదా పడేవారు. కొన్నిసార్లు పరిపాలనకు సంబంధించిన అప్రాధాన్య అంశాలపై కూడా వారు విభేదించే వారు. అయితే దేశ సేవలో ఇరువురూ ఒకటై నిలిచేవారు. సరే, ఒక మౌలిక అంశానికి వస్తాను. మహాత్ముడు భారతదేశ విమోచకుడు. స్వతంత్ర భారతదేశ ఆధునికీకరణ కర్త నెహ్రూ. భారతదేశపు లౌకిక, సామ్యవాద ప్రజాస్వామ్య వ్యవస్థ సంస్థాపకుడు. శాస్త్ర సాంకేతికరంగాల అభివృద్ధికి పునాదులు వేసిన దార్శనికుడు నెహ్రూ. నెహ్రూ ఆర్థిక విధానాలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. అది చాలా విస్తృతమైన, ప్రత్యేకంగా చర్చించవల్సిన అంశం. అయితే ఆర్థిక రంగంలో నెహ్రూ సాధించిన విజయానికి నిదర్శనంగా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తాను. బ్రిటిష్‌ వలసపాలనలో 1857 నుంచి 1947 వరకు భారతదేశపు వార్షిక వృద్ధిరేటు 0.7 శాతం మాత్రమే. నెహ్రూ తన పదిహేడేళ్ళ పరిపాలనలో మొదటి నుంచి చివరి వరకు ఆ వృద్ధిరేటును 3 శాతానికి పెంచారు. ప్రధానమంత్రి పదవిలో నెహ్రూవారసులు మరింత అధిక వృద్ధిరేటును సాధించడంలో విఫలమైతే, అందుకు ఆయన్ని తప్పుపట్టకూడదు.
(ఆంధ్రజ్యోతికి ప్రత్యేకం)

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.