స్వరబద్ధమైన సంగీతంలోని నాద సౌందర్యమే శ్రావ్యత. నాద శ్రావ్యతకు పాములు కూడా తలలు ఆడిస్తాయని చెబుతారు పెద్దలు. అట్లా, చెవుల్లో అమృతపు చుక్కలు పడ్డట్టుగా గానం చేయగలిగిన గాయని పులిపాక సుశీల. తన తీయని గానంతో కొన్ని తరాల తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సుమధుర గాయనీమణి. 60 ఏళ్లుగా పాడుతున్నా, వన్నె తగ్గని సుస్వరలయ విన్యాసం సుశీల. నేడు ఆమె 80వ పుట్టినరోజు.
సుశీల జన్మదినోత్సవం తెలుగు సినిమాసంగీత ప్రియులకు పండుగ రోజు. అది.. చెన్నైలోని ఆళ్వారుపేటలో ఒక ప్రశాంతమైన వీధి. ఆ మూలనున్న విశాలమైన ఇంట్లో పి.సుశీల సాదరంగా ఆహ్వానించారు. తన అంతరంగాన్ని ఆవిష్కరించారు..
‘‘మాది విజయనగరం. నా తల్లిదండ్రులే నాకు తొలి సంగీత గురువులు. మా నాన్నగారు పులిపాక ముకుందరావు న్యాయవాది, కళాప్రియులు. అమ్మ శేషావతారం కూడా సంగీతాభిమాని. అప్పట్లో విజయనగరం వచ్చిన కళాకారులు ఎవరైనా మా ఇంట ఆతిథ్యం స్వీకరించవలసిందే! ఇక నాన్న స్వయంగా వీణ విద్వాంసుడు కూడా. అలా నాన్న నాకు వీణ పాఠాలు కూడా నేర్పించారు. ఆ తరువాత మురారి అనే గురువు వద్ద నేను సంగీతంలో శిక్షణ పొందాను. చాలా చిన్నతనంలో సినిమాలలో పాడడంతో ఈ ప్రయాణం ఇలా కొనసాగింది. 1951లో చెన్నై ఆకాశవాణిలో రేడియో అన్నయ్య, అక్కయ్య నిర్వహించే బాలానందంలో నేను సభ్యురాలిని. ఆ సమయంలో ఒక చిన్న పిల్లల సినిమాలో పాడడానికి నిర్మాతల కోరికపై రేడియో కేంద్రం నుంచీ ఐదుగురిని పంపించారు. అందులో సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు నన్ను ఎంపిక చేశారు. అట్లా సినిమాలకు పాడడం మొదలైంది. ప్రకాష్ స్టూడియోలో ‘లావొక్కింతయు లేదు’ అన్న పోతన పద్యం పాడాను. ఎవీఎం వారి ‘భక్తప్రహ్లాద’ సినిమాలో పాడే సమయంలో నటి రోజారమణి కూడా రోజూ వచ్చి పాట ఎలా పాడుతున్నామో చూసేది. భావం ఎలా పలకాలో, ఎలా నటించాలో నేర్చుకునేది. తనకప్పటికి ఆరేళ్ళుంటాయ్ అంతే.
మరోలా నాన్న ఆలోచన…
నేను సినిమా గాయని కావడం నాన్నకు ఇష్టం లేదు. శాస్ర్తీయ సంగీత కళాకారిణిగా నన్ను చూడాలన్నది ఆయన కోరిక. అందుకే నన్ను స్వయంగా వెంటబెట్టుకుని డీకే పట్టమ్మాళ్ ఇంటికి కూడా తీసుకెళ్లారు. ఆవిడతో నేను సినిమాలకు పాడుతున్నట్లు ఫిర్యాదు చేశారు. అందుకు పట్టమ్మాళ్ బదులిస్తూ, మంచి స్వరం పాడనీయండి అన్నారు. సంగీత ప్రపంచంలో అప్పటికే పేరు పొందిన డీకే పట్టమ్మాళ్, ఎంఎస్ సుబ్బులక్ష్మి వంటివారు ఉన్నందున ఆ దేవుడు నన్ను సినిమా ప్రపంచంవైపు పంపించి ఉంటాడనుకుంటాను. సినిమాల్లోకి రాక ముందే మంగళంపల్లి బాల మురళీకృష్ణ గారికి కూడా నా పాట వినిపించారు నాన్న. ఆయన కూడా సినిమాల్లో పాడడం మంచిదేనన్నారు. చివరికి ఆయనతో కలిసి పాటలు కూడా పాడాను. ఇదంతా నా పూర్వజన్మసుకృతం. ఇలా జరుగుతూ ఉండగా, ఏవీఎం వారి సరస్వతి స్టోర్ మేనేజర్ ద్వారా ఏవీఎం స్టూడియోలో కాంట్రాక్ట్ లభించింది. 1953 నుంచీ 57 వరకూ నెలకు రూ. 500 వేతనంపై ఏవీఎంలో పాడాను. అంతకు ముందే ‘వద్దంటే డబ్బు’ తదితర చిత్రాల్లో చాలా వాటిలో పాడినా, ఏవీఎం వారి సినిమాలతో నా గొంతు అందరికీ తెలిసింది. గుర్తింపు వచ్చింది. తరువాత వరుసగా జెమినీ, వాహిని, గోల్డెన్, వాసు, విక్రమ్, శారద, ప్రకాష్, అన్నపూర్ణ సంస్థల్లో పాడడం జరిగింది. తమిళం-తెలుగులో నిర్మించిన ‘కన్నతల్లి’ సినిమాలో ఏఎం రాజాతో కలిసి ‘ఎందుకు పిలిచావెందుకు’ అనే మొదటి యుగళగీతం పాడాను. అప్పటికి ఘంటసాల గారిని చూడలేదు. ఆయన మా ప్రాంతం వారేనని, ఆయనతో కలిసిపాడేటపుడే తెలిసింది. విజయనగరంలో మీ ఇంటికి వచ్చేవాడిని, మీ ఇంట్లో ఉన్న రేడియోలో పాటలు వినడం కోసం చాలామార్లు మీ ఇంటికి వచ్చానని ఆ తరువాత ఘంటసాల గుర్తు చేసుకునేవారు. ఆయనతో కలిసి కొన్ని వందల పాటలు పాడగలగడం అదృష్టం.
నేను ఇంత గొప్ప గాయనిగా నిలదొక్కుకోవడానికి నా తల్లి శిక్షణే కారణం. జన్మతః వచ్చిన నా గాత్రానికి సినీరంగం నగిషీలు చెక్కింది. పెండ్యాల నాగేశ్వరరావు హస్తవాసి నన్ను ఈ స్దాయికి చేర్చింది. 60 సంవత్సరాలుగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, సింహళ భాషాల్లో పాటలు పాడుతున్నా. నా సంగీత దర్శకులు ఆశించిన మేరకు పాడి వారిని ఒప్పించడం నా భాగ్యం.
పాతనీరు పోయి కొత్త నీరొస్తుంది
మాకు ఎవరితోనూ పోటీలేదు. సినిమా ప్రపంచం ఒక సముద్రం లాంటిది. అలలు వస్తూపోతూ ఉన్నట్లే, కళాకారులు కూడా, ఎవరూ ఎవరికీ పోటీ కాదు. నా స్వరం వేరు. ఎస్.జానకి స్వరం వేరు. మేం పాడిన పాటలు వేరు. నా తరువాత 1957 ప్రాంతంలో జానకి సినిమాల్లోకి వచ్చారు. ఎవరి పాట వారిదే. పాతనీరు పోతూ ఉంటుంది, కొత్తనీరు వస్తూ ఉంటుంది. ఆ కాలంలో జిక్కీ, లీల, ఎంఎల్ వసంతకుమారి వంటి ఎందరో గొప్పగాయనీమణులు ఉండేవారు. అందరికీ వారి పాటలు వారికి ఉండేవి. పోటీ అనడం నాకు ఇష్టం లేదు.
పెద్దగా చదువుకోలేదు…
తెలుగులో సహా ఇతర భాషల్లో పాడాలని ఉంటుంది. కానీ అవకాశాలు రావాలి కదా. నాకు సంగీతం తప్ప ఏ ఇతర భాషా రాదు. పెద్దగా చదువుకోలేదు. కనీసం విద్వాన్ పూర్తి చేద్దామని అడయారులోని కాలేజీలో చేరా. ఆరు మాసాలకే ఆ ముచ్చటా ముగిసిపోయింది. ఒకసారి ఓపి నయ్యర్ సారథ్యంలో ‘నయాదౌడ్’ హిందీ సినిమా తమిళ్ డబ్బింగ్ కోసం ముంబయి వెళ్లా. అక్కడ నా గొంతు విన్న మరో దర్శకుడు నన్ను హిందీలో పాడమన్నారు. కాంట్రాక్ట్ సంతకం చేయమన్నారు. కానీ భాష రాదు, అప్పటికే తెలుగు, తమిళ, కన్నడ భాషలలో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఎందుకు సాహసం చేయడం అని కుదరదని చెప్పేశాను. అప్పటికే అక్కడ గొప్పవారు చాలా మంది ఉండేవారు. వారి మధ్యలో నిలదొక్కుకోవడం కోసం పోరాటం ఎందుకు అనుకున్నాను.
పాడనన్నా పాడించారు…
1980ల తరువాత సినిమాలో వేగం పెరిగింది. ‘గుగ్గు..గుగ్గు గుడెసుంది…’ వంటి పాటలు పాడనన్నా, నాచేత పాడించారు. అవి మరో తరం ప్రేక్షకులకు నన్ను దగ్గర చేశాయి. సంగీత దర్శకులు చక్రవర్తినన్ను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేశారు. ఎందరో మహానుభావులు పెండ్యాల, ఘంటసాల, అశ్వథామ, గోపాలం, రాఘవులు.. ఇలా చాలా మంది ఉన్నారు. అందరూ నన్ను ఆదరించి ప్రోత్సహించారు. అప్పట్లో దర్శకులు కె.విశ్వనాథ్ మేం పాడే పాటలను రికార్డు చేసేవారు, అలాగే కె.రాఘవేంద్రరావు ప్రకాష్ స్టూడియోలో లాగులతో తిరగడం చూశాను. వారు ఆ తరువాత గొప్ప దర్శకులుగా మారడం అందరికీ తెలుసు. అలాగే విజయనిర్మల. తను దగ్గరుండి ఏం కావాలో పాడించుకుంటారు. ‘సింహాసనం’ సినిమా హిందీలోనూ నన్నే పాడమన్నారు. సరే చూద్దాం! అనుకున్నా, చివరికి నాచేతే పాడించారు. కిషోర్‌కుమార్‌తో కలిసి పాడాను. పరభాషలో పాడుతున్నపుడు పాటలో లీనమై పాడడానికి కృషి చేస్తాను. అందువల్ల ఉచ్చారణ దోషాలు లేకుండా పాడగలుగుతాను. ఒక విషయం చెబుతా, బీఎన్ రెడ్డిగారి ‘బంగారుపాప’ చిత్రం కోసం ఓ ఏడుపు పాట పాడాను, వాహినీ స్టూడియోలో పాట రికార్డింగు తరువాత రెడ్డిగారు ఏడుస్తూ బయటికి వస్తున్నారు. నేను నవ్వుతూ ఉన్నాను. నన్ను చూసి, ‘ఏమ్మా, అక్కడ ఏడుస్తూ పాడావ్.. ఇక్కడ నవ్వుతున్నావ్’ అన్నారు. అలా పాటల్లో లీనమై పాడేవారం. కేవీరెడ్డిగారు కూడా అంతే మన తెలుగు అమ్మాయి అన్న భావనతో ‘దొంగరాముడు’లో పాడించారు. అక్కినేని నాగేశ్వరరావు ‘సుశీల మా ఇంట్లో మనిషే’ అనేవారు. అవన్నీ మరచిపోలేని మధురజ్ఞాపకాలు.
రెండుతరాలకు పాడుతున్నా..
నటి జయచిత్ర తల్లి అమ్మాజీ నటించిన సినిమాలో ఆమెకు పాడాను. అలాగే జయచిత్రకు కూడా పాడాను. ఎస్పీ బాలుతో, ఆయన కుమారుడు చరణ్‌తో కలిసి పాడాను, జె.ఏసుదాసుతో, ఆయన కుమారునితో కలిసి పాడాను. ఇలా రెండు తరాల వారితో కలిసి పనిచేయడం అదృష్టమే కదా! ఇంతకాలంగా నా పాటను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ‘ఆంధ్రజ్యోతి’కీ నా ధన్యవాదాలు.
తియ్యదనం, మృదుత్వం కలబోస్తే…
తెలుగు కొమ్మల్లో పుట్టి తెలుగుపాటకు పరమోత్కృష్ట స్థాయి తెచ్చిన కోయిలమ్మ సుశీల. ఈ గానకోయిల పాటల్ని వెతకడ మంటే… వసంతంలో వొగలు పోయే వేలాది పువ్వుల్ని కోయటమే. జలధిలోని ముత్యపుచిప్పల్ని ఏరుకోవటమే. అయినా జాబిలమ్మ పోసే వెన్నెల లాలలో ఎంతసేపు ఉంటే మనకి సేదతీరుతుందీ? సుశీలమ్మ పాటలూ అంతే! ఒకటి విన్నాక మరొకటి వినాలనే తలంపు కలుగుతుంది. ఆ తర్వాత పల్లవీ మాధుర్యం నుంచి చరణాల్లోకి లాగిన్ కావాల్సిందే. సుశీల పాటలప్రవాహం వెంబడి చిన్నపిల్లల్లా ఆడుకుని గెంతులేయాల్సిందే. చిన్నతనంలో ఆకాశవాణి పాటలపోటీల్లో పాల్గొని పదిహేడవ యేట చిత్రరంగంలోకి వచ్చిన సుశీల అతి తక్కువ కాలంలో పాపులర్ అయ్యింది. సున్నితమైన, సౌకుమార్యమయిన ఆమె గొంతుకు వీరాభిమానులు పుట్టుకొచ్చారు. సోలో పాటల్లో అలతి అలతి పదాల్ని ఎంత హాయిగా పలుకుతుందో యుగళగీతాల్నీ, హుషారెత్తించే పాటల్నీ భావయుక్తమైన ఆలాపనల్ని, భక్తిరసాలని అంతే అద్భుతంగా పాడటంలో సుశీల దిట్ట. 1969లో తొలిసారి భారతప్రభుత్వం జాతీయ ఉత్తమ సింగర్ అవార్డులు ప్రవేశపెడితే ఉత్తమగాయని అవార్డు సుశీలకే దక్కింది,. ఉత్తరాదికి లతాజీ ఎలాగో దక్షిణాదికి సుశీలమ్మ అలాంటి వారు. తెలుగుసినీ ఆమనిలో ఎన్నికొత్త గొంతుకలు వచ్చినా సుశీలమ్మ గాత్రానికి తిరుగులేదనేది నగ్నసత్యం. పాడమని నన్నడగవలెనా అంటూనే ‘ఆకులో ఆకునై..’ అంటూ ప్రకృతిలో విహరింప చేసిన ఆ గానం ‘నిన్నటిదాకా శిలనైనా’ అంటూ మరో లోకంలోకి తీసుకెళుతుంది. ‘పాడవోయి భారతీయుడా..’, ‘గాంధీ పుట్టినదేశమా’ అంటూ సుశీల గాత్రం దేశభక్తిని నింపుతుంది. ‘ముత్యమంతా చాయ’ అంటూ వేకువజామును తీసుకొస్తుంది. ‘స్వాతిముత్యం’ చిత్రంలో ‘లాలీ లాలీ’ అంటూ నిద్రపుచ్చుతుంది. అదీ సుశీలపాటకున్న మహత్యం. ‘గోదారిగట్టుంది’, ‘మొక్కజొన్నతోటలో’, ‘పాండవులు పాండవులు తుమ్మెదా’, ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ అంటూ హుషారెక్కిస్తాయి సుశీల పాటలు. ‘ఇది మల్లెల వేళయనీ’ అంటూ హాయిగొలిపే ఆ స్వరం ‘వ్రేపల్లియ యద ఝల్లున పొంగిన రవళి’ అంటూ భావుకత్వాన్ని పొంగిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సుశీల పాటలు అనంతం. దక్షిణాది భాషలతో పాటు హిందీ, ఒరియా, బెంగాళీ, తుళు, సింహళ భాషల్లో దాదాపు 50 వేల గీతాలు ఆలపించిన సుశీలకు అవార్డులు, రివార్డులకు కొదవలేదు. భారత ప్రభుత్వం 2008లో పద్మభూషణ్‌తో సత్కరించింది. సుశీల ‘జీవనతరంగాలు’ చిత్రంలో ‘పుట్టినరోజు పండుగే అందరికీ… మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికో’ అని ఆలపించారామె. ఇలా.. భారతీయశ్రోతల్ని, సంగీతప్రియుల్ని మైమరపించిన గానసరస్వతి సుశీల.
మాకు ఎవరితోనూ పోటీలేదు. సినిమా ప్రపంచం ఒక సముద్రం లాంటిది. అలలు వస్తూపోతూ ఉన్నట్లే, కళాకారులు కూడా, ఎవరూ ఎవరికీ పోటీ కాదు. నా స్వరం వేరు. ఎస్.జానకి స్వరం వేరు. మేం పాడిన పాటలు వేరు. నా తరువాత 1957 ప్రాంతంలో జానకి సినిమాల్లోకి వచ్చారు. ఎవరి పాట వారిదే. పాతనీరు పోతూ ఉంటుంది, కొత్తనీరు వస్తూ ఉంటుంది. ఆ కాలంలో జిక్కీ, లీల, ఎంఎల్ వసంతకుమారి వంటి ఎందరో గొప్పగాయనీమణులు ఉండేవారు. అందరికీ వారి పాటలు వారికి ఉండేవి. పోటీ అనడం నాకు ఇష్టం లేదు.
మన్నవ గంగాధరప్రసాద్, చెన్నై
ఫోటోలు: కర్రి శ్రీనివాస్