అర్ధ రూపాయకు తాళి బొట్టు అందజేస్తున్న వరద రాజ గ్రామ కుటుంబం

తాళి ‘కట్టు’ శుభవేళ
భూలోకమంత పీట – ఆకాశమంత పందిరి వేసి పెళ్లి చేసినా..
ఏ నలుగుర్నో పిలిచి నాలుగు అక్షింతలు వేసుకున్నా పెళ్లి పెళ్లే!
అయితే, ఉన్నోళ్లయినా లేనోళ్లయినా పుస్తెలతాడు లేనిదే పెళ్లి చేసుకోలేరు. మెడలో మూడుముళ్లు వేస్తేనే మాంగల్య బంధం. అంత పవిత్రమైన పుస్తెల తాళ్లకు ఒక ఊరు పెట్టింది పేరు. నిత్యకళ్యాణం పచ్చతోరణంలా వారి పుస్తెలతాళ్లతో ఇప్పటి వరకు లక్షల పెళ్లిళ్లు అయ్యాయి. తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుప్పూర్‌ జిల్లాల సరిహద్దులో ఉండే ఆ పుస్తెలపల్లె పేరు వరదరాజపురం.. 

కాపురం పచ్చగా ఉంటే అదే పదివేలు..

‘‘లాభాపేక్ష లేని పవిత్రకార్యం మాది. ఒక్కో పసుపుతాడుకు కేవలం యాభైపైసలు మాత్రమే తీసుకుంటాం. కాని అది చాలామంది చేతులు మారడం వల్ల ధర పెరుగుతోంది. తిరుపతికి కూడా ఇక్కడి నుంచే సరఫరా చేస్తుంటాము. ఎంతోమంది తెలుగువాళ్లు, దక్షిణ భారతీయులు ఫోన్ల ద్వారా ఆర్డరు చేసి తెప్పించుకుంటుంటారు. మాకు బతుకుతెరువు చూపిస్త్తున్న పసుపుతాళ్ల ఉత్పత్తినే జీవితంగా చేసుకోవడం అదృష్టం. మా ఊళ్లో తయారైన పసుపుతాళ్లు ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది మహిళల మెడల్లో మంగళసూత్రాలై మెరుస్తున్నాయి. కాపురాలు పచ్చగా ఉన్నాయి. ఇంతకంటే మాకు కావాల్సిన ఆనందం ఏముంది?
– వరదరాజపురం నేతకార్మికులు

‘తాళికట్టు శుభవేళ.. మెడలో కళ్యాణమాల’ – వరదరాజపురంలోకి కాలు పెట్టగానే ఇలాంటి పెళ్లి పాటలే గుర్తుకొస్తాయి. వివాహవేడుక కళ్లముందు మెదులుతుంది. ఊళ్లో ఎక్కడ చూసినా పసుపు పరిమళం. పుస్తెలతాళ్ల వరుసలు కనువిందు చేస్తాయి. పుస్తెలతాళ్లకు పెట్టింది పేరైన వరదరాజపురం శ్రమ వెనక ఎంతో చరిత్ర ఉంది. చుట్టుపక్కల పల్లెలకు ఆ ఊరు పేరు చెబితే తెలీదు, తాళికయిర్‌ (పుస్తెలతాడు) అంటేనే టక్కున గుర్తుపడతారు. పుస్తెలతాళ్లను తయారుచేయడమే గ్రామస్థుల ప్రధానవృత్తి. యాభైఏళ్ల కిందట ఊళ్లో మగ్గాలు ఉండేవి. ఎక్కువ మంది నేతనే నమ్ముకుని బతికేవారు. మారుతున్న కాలం కొద్దీ వృత్తిలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. ఎన్ని వసా్త్రలు నేసినా పూటగడవడానికే సరిపోయేది. నెలాఖరికి అప్పులే మిగిలేవి. వృత్తిని వదల్లేక, ఊరు విడిచి మరో ప్రాంతానికి వెళ్లలేక అవస్తలు పడేవారు. చేతిలో పని ఉండీ ఎందుకీ తిప్పలు అని మధనపడిన ఒక పెద్దాయన మదిలో తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. ‘ఎలాగూ నేత పని చేస్తున్నాము కాబట్టి.. ఇందులోనే డిమాండ్‌ కలిగిన పని చేస్తే ఎలా ఉంటుంది?’ అనుకున్నాడు. ఆయన ఆలోచన – పుస్తెలతాళ్లను తయారుచేయడం. ఆ పని మొదలైంది. రంగుల అద్దకంలో ఇప్పుడున్నంత సాంకేతికత ఆ రోజుల్లో లేదు. మిలమిల మెరిసే రంగులు అందుబాటులో ఉండేవికావు. నూలుదారాలకు కేవలం పసుపుపూసి పుస్తెలతాళ్లను తయారుచేసేవారు. మొదట్లో ఆ పెద్దాయన ఏ శుభముహూర్తాన ఈ శుభకార్యం మొదలుపెట్టాడో కాని – కొన్నాళ్లకే పుస్తెలతాళ్ల వ్యాపారానికి శ్రీకారం చుట్టుకుంది. ఏ ఊళ్లో పెళ్లిళ్లు జరిగినా వరదరాజపురం వెళ్లి పుస్తెలతాళ్లు కొనుక్కోనిదే భజంత్రీలు మోగేవి కావు. అక్షింతలు రాలేవి కావు..! ఊహించనివిధంగా – కొమ్మ కొమ్మకో సన్నాయిలా.. పుస్తెలపల్లె పేరు కోటి రాగాలై.. మార్మోగిపోయింది. ‘‘మన సంప్రదాయాల్లో, జీవనవిధానాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ ప్రభావం పెళ్లిళ్ల మీద పడింది. వేడుకల్లో ఎన్ని మార్పులొచ్చినా మంగళసూత్రం విలువ కించిత్తు తగ్గలేదు. ముత్తయిదువులకు అదొక పవిత్రమైన ఆభరణం. అందుకనే మేము పుస్తెలతాడును ఒట్టి నూలుదారంగా భావించలేదు. వాటి తయారీని ఎంతో నిష్టగా చేస్తాము..’’ అంటున్నారు కార్తికేయన్‌, గోమతి.
దేవుడ్ని మొక్కుతాం..

మూడొందల ఇళ్లున్న పల్లెటూరు వరదరాజపురం. ఇందులో సగంమంది పుస్తెలతాళ్ల తయారీ మీదే బతుకుతున్నారిప్పుడు. ఊరంతా కలిసికట్టుగా మాట్లాడుకున్నట్లు – ఒకటే నిష్ట, ఒకటే క్రమశిక్షణతో పని మొదలవుతుంది. ‘‘జీవితంలో వివాహాన్ని ఎంతో శుభకరంగా భావిస్తుంది మన సమాజం. అలాంటి పెద్ద కార్యానికి తాళి కేంద్రబిందువు అవుతుంది. దాన్ని తయారుచేయడంలోను మేమొక పద్ధతిని ఎంచుకున్నాం. ఉదయాన్నే ఆరుగంటలకు నిద్రలేస్తాం. స్నానపానాదులు ముగించుకుని మా ఇలవేల్పును భక్తిశ్రద్ధలతో పూజిస్తాం. ‘దేవుడా! ఈ రోజు మేము తయారుచేసే పసుపుతాళ్లను కట్టుకున్న ఏ ఇల్లాలి మెడలోను అది తెగిపోకూడదు. ఆశీర్వదించు!!’ అని వేడుకుని పనికి శ్రీకారం చుడతాము’’ అంటారు నేత నిపుణులు. తాళి దారాన్ని బందారం అంటారు. ‘‘దానికి ఉపయోగించే దారాన్ని కాటన్‌మిల్లుల నుంచి సేకరిస్తాం. మిల్లుల్లో సైజింగ్‌లోని వేస్ట్‌ మెటీరియల్‌ చౌకధరకు దొరుకుతుంది. అయితే దీనికి పసుపురంగును అద్దడంలోనే ఉంది రహస్యమంతా. నూలును బాగా ఉడకబెట్టాక రంగును పూస్తాం. ఆ తర్వాత ఎండకు ఆరబెడితే సరిపోతుంది’’ అన్నారు గ్రామస్తులు.
నలుమూలలకు..
ఇలా తయారైన పసుపుతాళ్లు దక్షిణ భారతదేశానికంతటికీ సరఫరా అవుతున్నాయి. హిందువులు ఉపయోగించే తాళికి పసుపురంగు వాడతారు. అయితే ఇందులో ఒక్కో రాష్ట్రం ఒక్కో రంగుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తయారీదారులు చెబుతున్నారు. ‘‘తెలుగురాషా్ట్రల వారు నిమ్మకాయ పసుపు రంగు తాళ్లనే తీసుకుంటారు. తమిళనాడులోని మేల్‌మరువత్తూరు అమ్మవారి భక్తులు అయితే ముదురు పసుపు రంగుకు ప్రాధాన్యం ఇస్తారు. మొత్తంగా చూస్తే – ఎక్కువమంది కోరుకునేది మామిడి పసుపు. అందుకే మేము మూడు రకాల బందారాలను తయారు చేస్తున్నాం..’’ అని చెప్పారు తయారీదారులు. పసుపుతాళ్లకు కూడా ఒక్కో సీజన్‌లో ఒక్కో డిమాండ్‌ ఉంటుంది. ‘‘తైపూసం ఉత్సవాలప్పుడు మలేషియాకు సైతం ఎగుమతి అవుతాయి. ఆషాఢమాసం వస్తే కావేరీ నదీ తీరంలో మహిళలు తాళిని విప్పి మళ్లీ కొత్తదారం కట్టుకుంటారు. అయ్యప్ప స్వామి మాలధారణ సమయంలో – గుడికి వెళ్లి ఇంటికి వచ్చేప్పుడు మహిళలకు ఈ దారం తీసుకెళ్లాలనే ఆనవాయితీ ఉంది. ఇలాంటి సందర్భాల్లో మంచి డిమాండ్‌ ఉంటుంది’’ అని వివరించారు నేతపనివాళ్లు. ఆఖర్న ఊర్లోని ఒక ముసలాయన ‘‘పదికాలాల పాటు పెళ్లిళ్లు పచ్చగా ఉన్నంత కాలం.. మా పుస్తెలపల్లెకు ఢోకా లేదు’’ అన్నాడు.
– పూనూరి ప్రవీణ్‌, చెన్నై
ఫోటోలు: కర్రి శ్రీనివాస్‌

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.