‘భూదానోద్యమం’ కోసం, ‘సర్వోదయ’ సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాడిన ఆధ్యాత్మిక జీవి ఆచార్య వినోబా భావే. రవాణా కోసం ధనం ఖర్చుకాకూడదనే నియమంతో ఆయన జీవితమంతా కాలినడకనే సాగిపోయాడు.
దేశమంతా తిరుగుతూ, దాతల నుంచి సేకరించి లక్షలాది ఎకరాలు పేదప్రజలకు అందేలా చేశాడు. ‘‘నడిచే సాధువు’ గా పిలవబడే వినోబా తన ప్రతి సామాజిక కార్యక్రమాన్ని ఆఽధ్యాత్మిక కార్యక్రమంగా, ఒక యజ్ఞంగా విశ్లేషించేవారు. రేపు అంటే నవంబర్ 15న జరిగే ఆచార్య వినోబా 32వ వర్థంతి
సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం…
‘‘నీ పిలుపు విని ఏ ఒక్కరూ నీతో రాకపోతే
నువ్వొక్కడివే నడువు.. నువ్వొక్కడివే నడువు’’
అన్న టాగూరు గీతానికి ఒకానొక నిలువెత్తు ప్రతిరూపం వినోబా భావే.
‘‘ ప్రేమ, ఉదాత్త భావాలతో హృదయం విశాలం కావడానికి అనంతమైన ఆకాశం కింద కాలినడకన పయనం సాగించడానికి మించిన మార్గమేముంది? మనిషి నిద్రిస్తున్నప్పుడు అతని మొత్తం శరీరం నేలను తాకుతూ ఉండిపోతుంది. మనిషి కూర్చున్నప్పుడు శరీరంలోని కొంత భాగమే నేలను తాకుతుంది. నిలుచున్నప్పుడు రెండు అరిపాదాలు మాత్రమే నేలను తాకుతాయి. అయితే మనిషి నడుస్తున్నప్పుడు మాత్రం ఏదో ఒక పాదమే నేలను తాకుతుంది. నేలతో తన అనుబంధం ఎంత తక్కువగా ఉంటే, పరమాత్మతో అతని అనుబంధం అంత ఎక్కువగా ఉంటుంది. నిజానికి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం కన్నా నడక ఎన్నో రెట్లు ఉత్కృష్ఠమైనది’’ అంటాడు వినోబా.
ఎన్నో ఏళ్లు తపస్సు చేసి, జ్ఞానసిద్ధి పొందిన గౌతమ బుద్దుడు ఆ త ర్వాత కాలమంతా వేల మైళ్లు నడిచే వెళ్లాడు.
అరణ్యాలూ, నదులూ దాటుతూ, ఽధర్మబోధ చేస్తూ ఒక చోటునుంచి మరో చోటికి జీవితమంతా అలా సాగిపోయాడు.
జగ ద్గురు శంకరాచార్య కూడా తాను బతికున్న ఆ మూడుదశాబ్దాల కాలమంతా దేశమంతా కాలినడకనే తన జీవనయానాన్ని కొనసాగించాడు. నిజానికి సాధువుల్లో అఽత్యధికులు మానవాళి హృదయాల్లో చైతన్యదీప్తుల్ని వెలిగిస్తూ అలా సాగిపోయినవారే. అలా నిరంతరం కాలినడకన సాగిపోయినవారిలో అత్యంత ప్రముఖుడు వినోబా భావే. కేవలం 13 ఏళ్లలో 70 వేల కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లిన ఆధ్యాత్మిక చైతన్య మూర్తి ఆయన.
నడక ఒక ఆధ్యాత్మిక యానం
రవాణా కోసం కానీ ఖర్చు చేయకూడదని చెప్పే ‘కాంచన ముక్తి’ అనే సూత్రాన్ని అనుసరించి జీవితమంతా తన భూదానోద్యమ యానాన్ని ఆయన కాలినడకనే సాగించాడు. అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఢిల్లీలో జరిగే తొలి ప్లానింగ్ కమీషన్ సదస్సుకు రావలసిందిగా వినోబాను ఆహ్వానించినప్పుడు వార్థా సమీపంలోని తన పౌనార్ ఆశ్రమానికి 1350 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీకి ఆయన కాలినడకనే వెళ్లాడు. ఊరూరూ తిరుగుతూ, ప్రజల కష్టనష్టాలు తెలుసుకోవడానికి ప్రజల పేదరికాన్ని, వారి ఆకలి మంటల్ని తెలుసుకోవడానికి, వారితో ఒక ఆత్మీయబంధాన్ని నిలబెట్టుకోవడానికి, కాలినడకన వెళ్లడానికి మించిన మార్గమేముంది? అనేవారు ఆయన. అసలైన ఆధ్యాత్మికత ముందుగా పేదరికాన్ని, ఆకలి మంటల్ని తీర్చే విధంగా సాగిపోతుందంటాడు వినోబా. అందులో భాగంగానే పేదరైతులకు వ్యవసాయ భూములను అందేలా చూసే ప్రయత్నంలో పడ్డాడు.
భూమి… మనిషి మరో ఆత్మ
తెలంగాణలోని పోచంపెల్లి గ్రామ హరిజనుల కోసం భూమి సేకరించడంతో మొదలైన భూదానోద్యమం క్రమక్రమంగా జాతీయ స్థాయి ఉద్యమంగా మారింది. ఎంతో మంది దాతలు కొన్ని లక్షల ఎకరాల్ని వినోబాకు అందచేశారు. ఆ సందర్భంలో ‘‘ మానవాళికి భూమి ప్రాణంతో సమానం. అది వారి ఆత్మకు ప్రతిరూపం. అలాంటి భూమిని దానం చేయడం అంటే అది ఆత్మత్యాగమే అవుతుంది. అది ఆధ్యాత్మిక పరిణతితోనే సాధ్యమవుతుంది. అయితే పేదవారికి భూమిని అందచేసే క్రమంలో ఎక్కడా హింసకు తావు ఉండకూడదు. ఈ అణుబాంబుల యుగంలో మానవాళి ముందున్నవి రెండే రెండు మార్గాలు. అవి యుద్దం, అహింస. నిజానికి ప్రేమ, అహింస ఈ రెండే ప్రపంచ యుద్దాన్ని నివారించగలవు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరిపూర్ణంగా పుణికి పుచ్చుకున్న వాళ్లు అహింసావాదులే అవుతారు. ఒకే ఒక్క పరమాత్మ
సర్వవ్యాప్తమై ఉన్న సత్యాన్ని గుర్తించిన తర్వాత ఎవరు ఎవరిని హింసిస్తారు? అది సాధ్యం కాదు. అందుకే అహింసా సిద్ధాంతమే ఆధారంగా సాగిపోయేవాళ్లు ఆధ్యాత్మిక వాదులే అవుతారు.’’ అంటాడు
ఒక ప్రయోగశాల
మహారాష్ట్రలోని పౌనర్‌లో నెలకొల్పిన తన ఆశ్రమాన్ని ఆయన ఆధ్యాత్మిక ప్రయోగశాల అనేవారు వినోబా. అయితే ఇందులో జరిగే ప్రయోగాలన్నీ సామాజిక సంక్షేమ లక్ష్యంగా ఉండాలని చెబుతుండే వారు. భూదానోద్యమంలో భాగంగా కాలినడకన వేలాది మైళ్ల దూరం నడిచి అలిసిపోయిన వినోబా తన మరణం దాకా తన ఆశ్రమంలోనే ఉండిపోయారు. చివరి దశలో స్వేచ్ఛా మరణం అంటే సమాధి కోసం ఆయన ఆహార పానీయాలు సైతం మానివేశారు. ఎక్కువ గంటలు నిద్రలోనే ఉండిపోయేవారు. ఆ సందర్భంగా ఆయన ‘‘నిద్ర మరణానికి ముందు రిహార్సల్ లాంటిది. అందుకే ప్రతి నిద్రకు ముందు మరణానికి సిద్ధమవుతున్నట్లే ఉండాలి’’ అన్నారు వినోబా బావే. ఆత్మబోధ, సమాజ సేవ ఈ రెండింటి సమిశ్రంగా ఆయన రూపొందించిన సర్వోదయ సిద్ధాంతం సమస్త మానవాళిలో గొప్ప ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. కటిక చీకట్లు కమ్ముకున్న వేళ సమాజానికి నిజంగా అదో అద్భుతమైన దివిటీలా తోడ్పడుతుంది.